‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -20

1
3

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

విశిష్టతలు

నా నియామకం ఒకటి రెండు విశిష్టతలతో కూడి ఉంది. నేషనల్ కాలేజీ ప్రియూనివర్సిటీ మరియు డిగ్రీ తరగతులతో కూడిన ఒక ప్రైవేటు కాలేజీ. స్నాతకోత్తర తరగతులు మా కాలేజీలో లేవు. సెంట్రల్ కాలేజీ అత్యంత పురాతన మరియు ప్రఖ్యాతిగాంచిన కాలేజీ. సైన్సు, భాషలు, ఆర్ట్స్ విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాసులు చాలా దశాబ్దాలుగా ఆ కాలేజీలో నడుస్తూ ఉన్నాయి. అక్కడి ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు ఎక్కువ అనుభవం గడించినవారు. ఇలాంటి సందర్భంలో ఒక ప్రైవేటు కాలేజీ అదీ కేవలం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాలును ఉపకులపతిగా నియమించి చరిత్రను సృష్టించినట్లు అయ్యింది. ఇలాంటి నియామకం తమకు తెలిసినట్లుగా కర్ణాటక చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో ఎక్కడా జరగలేదని నిపుణులు చెప్పేవారు. నా నియామకాన్ని ప్రజలు, కాలేజీ అధ్యాపకులు, పాలక వర్గాలు స్వాగతించారు. వారితో నాది సుమారు 25 సంవత్సరాల పరిచయం. చాలా మంది నన్ను చాలా సమీపం నుండి చూశారు. నా పనివిధానం స్థూలంగా వారికి తెలుసు. నా జీవన విధానం కూడా అంతే బాగా తెలుసు. మొదటి రెండు నెలలు చాలా స్వాగత, అభినందన సభలు ఏర్పాటు చేశారు. నేను అధికారం తీసుకున్న ఒకటి రెండు రోజుల తరువాత విక్టోరియా ఆసుపత్రి జనరల్ వార్డులోని రోగులందరికీ కొందరు విద్యార్థుల సహాయంతో నేనే నారింజ పళ్ళను పంచాను.

విశ్వవిద్యాలయం కాలేజీ అయిన సెంట్రల్ కాలేజీ, దాని వివిధ విభాగాలు నగరంలో రద్దీ ప్రాంతంలో ఉన్నాయి. పక్కనే కెంపేగౌడ రోడ్డు సినిమా హాళ్ళకు ప్రఖ్యాతి. అంతే కాకుండా అనేక వాణిజ్య సంస్థలూ ఉన్నాయి. ఏ దృష్టిలో చూసినా అక్కడ చదువుకునే వాతావరణం లేదు. అక్కడ పరిశోధన చేయడం ఒకటే, సంతలో పరిశోధన చేయడం ఒకటే. సెంట్రల్ కాలేజీ వరండాలు, ఆవరణ రాత్రిపూట బిక్షుకులకు తాత్కాలిక నివాసాలు. తెల్లవారిన తరువాత వారు వారి ‘ఉద్యోగాని’కై అక్కడి నుండి వెళ్ళేవారు. అప్పుడు మేము అక్కడ మా ఉద్యోగాన్ని మొదలు పెట్టేవాళ్ళం.

కొత్త క్యాంపస్‌కు బదిలీ

పరిపాలనా విభాగంలో కొందరు (సంఖ్య చాలా తక్కువగా ఉండవచ్చు) తమ కోటును కుర్చీకి తగిలించి పనివేళల్లో పక్కన ఉన్న సినిమాహాలుకు వెళ్ళినా తెలిసేది కాదు. హోటలుకు వెళ్ళినా తెలిసేది కాదు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని నగరానికి 15 కి.మీ.ల దూరంలో సుమారు 1000 ఎకరాల జమీనును విశ్వవిద్యాలయం కోసం ప్రభుత్వం కేటాయించింది. కొన్ని విభాగాల కట్టడాల నిర్మాణమూ మొదలయ్యింది. ఏదీ పూర్తి కాలేదు. పరిపాలనా విభాగపు నిర్మాణం ఎక్కువగా జరిగింది. ప్రతి సిండికేట్ మీటింగులోను, సెనెట్ మీటింగులలోను ఇంకా ఇతర మీటింగులలో విశ్వవిద్యాలయం తరలింపు గురించిన చర్చలు నడిచేవి. ఉపకులపతి, ఇతర అధికారులు తమ కష్టాలను చెప్పుకునేవారు. బదిలీ గురించి ఎవరూ గట్టి ప్రయత్నం చేసినట్లు కనబడలేదు. ఈ సమస్య నాకు బాగా తెలిసినదే. వచ్చిన వెంటనే ఈ అత్యంత ముఖ్యమైన సమస్యపై నా దృష్టిని నిలిపాను. అధికారులతో సంప్రదింపులు జరుపుతూ “మనకు వెయ్యి ఎకరాల అత్యంత ప్రశాంతమైన స్థలముంది. నగరంలో విశ్వవిద్యాలయం నడపడం సాధ్యమే కాదు. ఇప్పటికే ఖర్చుపెట్టి నాలుగైదు భవనాల పని మొదలయ్యింది. ఎప్పటికైనా ఒకరోజు మనం అక్కడికి వెళ్ళేతీరాలి. బదిలీ ఇప్పటికే ఆలస్యమై సమస్యలు క్లిష్టంగా మారాయి. వాయిదా వేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. పైగా అవి మొండి సమస్యలుగా మారే అవకాశముంది. అందువల్ల ఆరునూరైనా వీలైనంత త్వరగా అక్కడికి వెళ్ళడం అన్ని విధాలా మంచిది” ఈ విధంగా నా వాదాన్ని వారి ముందు ఉంచాను. అందరూ ఒప్పుకున్నారు. మొదట నా దృష్టి పరిపాలనా విభాగాన్ని బదిలీ చేయడం. అందువల్ల ఆ భవనం కాంట్రాక్టరైన శ్రీ రామిరెడ్డి గారి నెత్తి మీద కూర్చుని “ఇక ఒక నెలలో పూర్తి చేసి ఇవ్వాలి. దానికి కావలసిన డబ్బు వెంటనే ఇస్తాము” అని చెప్పాను. వారు మాతో బాగా సహకరించారు. నిర్మాణపనులు కొంచెం ఎక్కువతక్కువ పూర్తి అయ్యాయి. దానిని 1973వ సంవతరం ఫిబ్రవరి 15న ప్రారంభించడానికి రాష్ట్రపతి వి.వి.గిరిగారు ఒప్పుకున్నారు. సెలవు రోజులైన రెండవ శనివారం, ఆధివారాలలో ఫర్నీచర్‌ను, వందలాది ఫైళ్ళను పూర్తిగా రవాణా చేయాలని తీర్మానించాము. శుక్రవారం సాయంత్రం వరకు నగరంలోని ఆఫీసులో పనిచేసి మరుసటి పనిరోజైన సోమవారం ఉదయం 10.30 గంటలకు కొత్త భవనంలో పనిచేయాలని నిశ్చయించాము. అంటే ఆ బదిలీ కోసం ఒక రోజు కూడా సెలవు ఇవ్వలేదు. ఇదొక సాధన. మా సిబ్బంది ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చాలా శ్రద్ధతో అన్ని సామానులను తరలించారు. వారి జతలో నేను కూడా రాత్రి వరకు ఉన్నాను. అప్పుడు వారు “మీరు ఇంటికి వెళ్ళండి సార్. మేము చూసుకుంటాము” అన్నారు. లారీలలో తరలించిన ఫైళ్ళను అధికారులు తలపై పెట్టుకుని జాగ్రత్తగా వారి వారి గదులలో పెడుతున్నారు. ఈ తరలింపులో ఏ ఒక్క ఫైలూ పోగొట్టరాదని, ఏ ఫైలూ తారుమారు కాకూడదని మేము నిర్ణయించుకున్నాము. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో అవసరం లేని ఫైళ్ళను కావాలని సంబంధించిన వారి అనుకూలం కోసం ‘పొగొట్టుకుని పోయేలా’ చేస్తారు. దాదాపు అదే సమయంలో ఇలాంటి తరలింపు సందర్భంలో నగర కార్పోరేషన్‌కు సంబంధించిన వందలాది ఫైళ్ళు గల్లంతయ్యాయని పత్రికలలో చదివాము. బదిలీ రెండే రోజులలో చక్కగా జరిగింది. సిబ్బందిపై నాకు గౌరవం పెరిగింది. ఒక్కరోజూ సెలవు ఇవ్వకుండా జరిగిన ఈ స్థలమార్పిడి సార్వజనికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. విశ్వవిద్యాలయం దక్షత మరియు దృఢ నిశ్చయంపై నమ్మకం కలిగింది. రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరిగారు ఎప్పటిలాగే నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పి విశ్వవిద్యాలయానికి మంచి జరగాలని కోరారు. ముఖ్యమంత్రి శ్రీ దేవరాజ అరసుగారు, ఉన్నత అధికారులు, విశ్వవిద్యాలయపు అన్ని కమిటీల సభ్యులు, మిగిలిన ఆహ్వానితులు ఈ ప్రారంభోత్సవానికి వచ్చారు. విశ్వవిద్యాలయపు ఈ నూతన ఆవరణకు ‘జ్ఞానభారతి’ అని నామకరణం చేశాము. రెండు రోజుల తరువాత విశ్వవిద్యాలయం సిబ్బంది అందరికీ నా స్వంత ఖర్చుతో విందు ఇచ్చాను.

విద్యా విభాగాల తరలింపు

నగరపు ఆఫీసులో అందరూ హాయిగా పనిచేసేవారు. అన్ని సౌకర్యాలు ఉండేవి. ‘జ్ఞానభారతి’ క్యాంపస్‌లో అసౌకర్యాలే ఎక్కువ. వాహన సౌకర్యం కోసం బి.టి.ఎస్.కు చెందిన నాలుగైదు బస్సులను అద్దెకు తీసుకున్నాము. జ్ఞానభారతి బెంగళూరు – మైసూరు రహదారి నుండి ఒక కిలోమీటర్ లోపలికి ఉంది. ఆ ఒక్క కిలోమీటర్ దారి హెచ్చుతగ్గులతో కూడిన అధ్వాన్నమైన కచ్చా రోడ్డు. దుమ్ము అంటే దుమ్ము. సుమారు 20 అడుగుల దూరంలో వెళుతున్న బస్సు దట్టమైన దుమ్ముతో మునిగి వెనుకనున్న వారికి కనిపించేది కాదు. నీళ్ళకు కరువు. ఈ అన్ని సమస్యలను సిబ్బంది వర్గం సహించి విశ్వవిద్యాలయం ప్రగతి కోసం శ్రమించారు. క్రమేణా ఈ సమస్యలనన్నీ పరిష్కరించాము. ఆపైన విద్యా విభాగాల తరలింపు పైన దృష్టి సారించాము. మొదట కన్నడ, సంస్కృత, హిందీ, తెలుగు విభాగాలను తరలించాలని నిర్ణయించాము. ఈ భవనాల పని చాలా సంవత్సరాల ముందే మొదలై వివిధ స్థాయిలలో నిలిచిపోయాయి. వాటిని చూసినప్పుడు పాడుబడ్డ కొంపల్లాగా కనిపించేవి. విశ్వవిద్యాలయ భవన నిర్మాణాల పనిని ఐదారుగురు కాంట్రాక్టర్లకు కేటాయించారు. వారికంతా విశ్వవిద్యాలయంపై చాలా ఆక్షేపణలున్నాయి. వారినందరినీ పిలిపించి వారిని ఒప్పించి భవన నిర్మాణ పనులను కొనసాగించడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశాను. వారందరూ సహకరించారు. ఒకరిద్దరు తమ పనిని మొదలుపెట్టారు. మిగిలిన వారికి బదులుగా కొత్త కాంట్రాక్టర్లను నియమంచాము. పని మధ్యలో కొత్త కాంట్రాక్టర్లను నియమించడం చాలా కష్టం. అయితే ఈ పని సులభంగా అయ్యింది. ఎవరూ కోర్టుకు పోలేదు. కోర్టుకు వెళ్ళివుంటే వివాదం తెమలడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. కార్యాలయ సిబ్బందిని ఒప్పించి పరిపాలన విభాగాన్ని విజయవంతంగా తరలించాము. ఇప్పుడు విద్యా విభాగాల తరలింపు వైపు మా దృష్టి సారించాము. దీనికి అధ్యాపకుల, విద్యార్థుల సహకారం కావాలి. ఇది కష్టమైన పనే కాదు చాలా సున్నితమైన పని కూడా. వారి మనసులు గెలవాలి. అప్పుడే లుకలుకలు బయలుదేరాయి. కొంతమంది విద్యార్థినులు కొత్త క్యాంపస్‌కు రావడానికి వెనకడుగు వేశారు. ‘నాగుపాములున్న ఆ అడవిలోనికి మేము వెళ్ళం. దానికి బదులు మేము చదువు మానేస్తాం’ అని ఆలోచిస్తున్నారు. వారు అనుకున్నట్లే ఈ క్రొత్త ఆవరణలో నాగుపాములు నివాసమున్నాయి. దానిని ‘నాగరబావి’ అని పిలిచేవారు కూడా. అదే సమయంలో బొంబాయి విశ్వవిద్యాలయాన్ని కొత్త ప్రదేశానికి తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలను అధ్యాపకులు, విద్యార్థులు సహకరించకుండా సమ్మె చేశారు. దానితో ఆ తరలింపు నిలిచిపోయింది. ఈ విషయాన్ని కూడా నేను పత్రికలలో చదివాను.

పరిపాలన విభాగాన్ని తరలించడానికీ, విద్యావిభాగాలను తరలించడానికీ ఎక్కువ వ్యత్యాసముంది. నేనే ఈ భాషా విభాగాల ఎం.ఎ.తరగతులకు వెళ్ళాను. కొత్త ప్రశాంత వాతావరణానికి వెళ్ళడంవలన కలిగే ఉపయోగాలను చెప్పి, అవసరమైన వాహన సౌకర్యం మొదలైన సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చాను. విద్యార్థులు అంగీకరించారు. ఈ పనిలో ఆయా విభాగాల అధ్యాపకుల సహకారం మరువరానిది. నగరం నుండి ‘జ్ఞానభారతి’కి హాస్టల్‌ను తరలించడం ఎక్కువ కష్టమయ్యింది. నగరంలో విద్యార్థులకు కొన్ని అనుకూలాలున్నాయి. అయితే అవి విద్యాపరమైన సౌకర్యాలు కావు. హాస్టల్‌కు రాత్రిపూట వెళ్ళి విద్యార్థులను ఉద్దేశించి ‘జ్ఞానభారతి’కి వెళ్ళడం వలన విద్యాపరంగా కలిగే లాభాలను విడమరిచి విడమరిచి చెప్పాను. మొదట విద్యార్థులు లొంగలేదు. ఒకటి రెండు సార్లు హాస్టల్‌కు వెళ్ళి సంభాషణను కొనసాగించి వారి మనసు గెలిచే ప్రయత్నం చేశాను. శనివారం సాయంత్రం విద్యార్థుల సౌకర్యం కోసం జ్ఞానభారతి నుండి స్పెషల్ బస్ నడిపి, రెండు గంటల తరువాత వారందరూ అదే బస్సులో తిరిగి వచ్చేలా ఏర్పాటు చేశాను. ఈ సౌకర్యం కల్పించిన తరువాత విద్యార్థులు హాస్టల్‌ను తరలించడానికి ఒప్పుకున్నారు. ‘జ్ఞానభారతి’ హాస్టళ్ళలోనికి వచ్చిన తరువాత వారంతా సంతోషంగా ఉన్నారు. చదవడానికి మంచి వాతావరణముందని తృప్తి చెందారు. నా పదవీకాలంలో ఈ విద్యార్థి నిలయాలను 15 రోజులకు ఒకసారి సందర్శించేవాణ్ణి. చాలాసార్లు అందరు విద్యార్థులను రాత్రి 8-9 గంటల సమయంలో కలిసి వారి సాధకబాధకాలను తెలుసుకునేవాణ్ణి. “వార్డన్ కన్నా మీరే ఎక్కువసార్లు మా హాస్టల్‌కు వస్తున్నారు” అని విద్యార్థులు చెప్పేవారు.

విశ్వవిద్యాలయం నాలుగు బస్సులను కొనుగోలు చేసింది. దీనివల్ల సిబ్బంది వర్గానికీ, అధ్యాపకులకూ, విద్యార్థులకూ ఎక్కువ ఉపయోగం కలిగింది. భాషా విభాగాలు 1973వ సంవత్సరం జూలై నెలలో ‘జ్ఞానభారతి’ నుండి పనిచేయడం మొదలుపెట్టాయి. ఆ తరువాతి సంవత్సరం మిగిలిన విభాగాలను అక్కడికి తరలించాము. విశ్వవిద్యాలయాన్ని కొత్త క్యాంపస్ ‘జ్ఞానభారతి’కి తరలించడం ఒక గొప్ప పని. అంత వరకూ సంబంధించినవారు బదిలీ చేయడానికి మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు. ఈ తరలింపు ఇంకా కొన్ని సంవత్సరాలు జరగకుండా ఉండి ఉంటే విశ్వవిద్యాలయం నగరంలోనే శాశ్వతంగా పనిచేసే అవకాశాలను త్రోసిపుచ్చలేము. అలా జరిగివుంటే ఆ అమూల్యమైన వెయ్యి ఎకరాల స్థలం విశ్వవిద్యాలయం చేజారిపోయేది.

నా పరిపాలనా విధానం

నా నిర్వహణాపద్ధతి మిగిలిన చాలామంది కన్నా విభిన్నమైనది. అనధికారిక వైఖరిని అవలంబించేవాణ్ణి. అందరితోనూ కలిసిపోయి ఆత్మీయతతో మెలిగేవాణ్ణి. వారు అధికారులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. అందరితోనూ అదే వైఖరి. ఇదంతా నాకు సహజంగా వచ్చింది. బలవంతంగా తెచ్చిపెట్టుకున్నదీ కాదు, కృతకమైనదీ కాదు. నేషనల్ కాలేజీలో, ఇంకా విశ్వవిద్యాలయపు అన్ని కార్యకలాపాలలో నా ఈ ధోరణి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఎవరూ బలవంతంగా పనిచేసేవారు కాదు. కొన్ని సార్లు అనివార్య సందర్భాలలో బలవంతం చేయాల్సి వచ్చినా నాకు ఆ విధానం పట్ల ఎక్కువ నమ్మకం లేదు. అందరూ సంతోషంతో పని చేసేవారు. అధికారులలో ఆత్మీయత పెంపొందించడానికి నెలకొకసారి ఒక్కొక్కరి ఇంటిలో సహాయక కులసచివులు (Assistant Registrar), ఆ పై అధికారులకు విందు వినోదాలు ఏర్పాటు చేశాము. అలాగే కొన్ని పిక్నిక్‌లు పెట్టుకునేవాళ్ళం. నెలకొకసారి సాయంత్రం లలిత సంగీతం మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాము. అధికారులు, విద్యార్థులు ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా నన్ను కలవవచ్చు. రిజిస్ట్రారు, మరి కొంతమంది అధికారులతో ప్రతి కాలేజీకి వెళ్ళి అధ్యాపకులతో చర్చలు జరిపేవాణ్ణి. కాలేజీ సమస్యలు, అధ్యాపకుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ పద్ధతి సహాయం చేసింది. ఇలాంటి విధానాన్ని మా విశ్వవిద్యాలయంలో ఇంతకు ముందు ఆచరించలేదు. దీనివల్ల కాలేజీలు, అధ్యాపకులు విశ్వవిద్యాలయానికి చాలా దగ్గరయ్యారు.

నేను మీటింగులలో దర్పం లేకుండా నవ్వుతూ నడుచుకునేవాణ్ణి. ఎవరి ప్రతిష్ఠకు, మర్యాదకు, స్వాభిమానానికి భంగం కలిగించేవాణ్ణి కాదు. విశ్వవిద్యాలయం అధికారుల సమావేశాన్ని ఒక సాయంత్రం నడుపుతున్నాను. మధ్యలో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాము. అప్పుడు (సుమారు 20 సంవత్సరాల క్రితం) ఉపకులపతికి నెలకు 3000 రూపాయలు జీతం. అంటే ఆదివారాలు, సెలవు రోజులు కలుపుకుని రోజుకు 100 రూపాయల వేతనం. “చూడండి. ఇప్పుడు సాయంత్రం 5 గంటలు. ఈ రోజు పని ఇంకేమి ముగిసి పోతూవుంది. 100 రూపాయల పని ఈ రోజు నేను ఏమి చేశానని ఆలోచిస్తూ ఉన్నాను. కొందరికి నెలకు 100 రూపాయలు కూడా దొరకడంలేదు.” ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాను. “అలా ఆలోచించకండి సార్. అందరికీ కష్టంగా ఉంటుంది.” అని ఆ విషయాన్ని దాటవేసి మరో విషయానికి వెళ్ళారు.

ఒకరోజు మేమంతా ఇలాగే మాట్లాడుతున్నప్పుడు “మీరు నవ్వుతూ ఉంటారు. అనధికారికంగా మాట్లాడతారు. అయితే పని మటుకు జరుగుతూ ఉంటుంది. కొందరు జబర్దస్తీ చేస్తారు. అధికారం చలాయిస్తారు. అయితే పని ఏదో చేయాలని చేస్తాము. మనస్ఫూర్తిగా చేయము” అని చెప్పేవారు. నా నిర్వహణా విధానమే అనధికార పరిపాలనా విధానం. అంతెందుకు నా జీవితమే అనౌపచారికం. అయితే దాని నుండి పనియొక్క నిష్ఠకు కాని, దక్షతకు కానీ, మూల తత్వాలకు కానీ అణువంత కూడా లోపం రాలేదు.

ఉపకులపతి అధ్యాపకుడైన వైనం

నాకు మొదటి నుండీ పాఠం చెప్పాలంటే ఎక్కువ ఇష్టం. కాలేజీలో ఉన్నప్పుడు నిర్ణీత పిరియడ్లతో పాటు ఇంకా ఎక్కువ క్లాసులు తీసుకునేవాణ్ణి. ప్రిన్సిపాల్ అయిన తరువాతా అదే అలవాటు. పరిపాలనతో పాటు పాఠాలు చెబితే నాకు ఎక్కువ సంతోషమయ్యేది.

ఉపకులపతి అయిన తరువాత పాఠం చెప్పే అవకాశం తప్పిపోయింది. ఉపకులపతి అయ్యాక కూడా పాఠాలు చెప్పాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి నా కోరికను తెలియజేశాను. నాకు వారానికి ఒక బి.ఎస్.సి. మూడవ సంవత్సరం క్లాసును ఇవ్వమని అడిగాను. వారికి మొదట ఆశ్చర్యం కలిగింది. ఆపైన సంతోషంతో “తప్పకుండా తీసుకోండి సార్, ఉపకులపతి క్లాస్ తీసుకోవడం మాకూ ధైర్యాన్నిస్తుంది” అన్నారు.

ఈ నా కోరికను తెలుసుకున్న కొందరు శ్రేయోభిలాషులు “సార్, గవర్నమెంట్ కాలేజీకి మీ పాఠం చెప్పడానికి దయచేసి వెళ్ళకండి. అది అల్లరి కాలేజీ. అక్కడి విద్యార్థులను అదుపులో పెట్టడం చాలా కష్టం. మీరు పాఠం చెప్పి బయటకు వచ్చేలోపల మీ వాహనం ఏమవుతుందో చెప్పడం కష్టం. నేషనల్ కాలేజీకీ, ఆ కాలేజీకీ చాలా వ్యత్యాసముంది” అని సదుద్దేశంతోనే హెచ్చరించారు. సెంట్రల్ కాలేజీకి ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు చాలా అల్లరి కాలేజీలు అని పేరు పొందడం నిజమే. పూర్వం నేనూ ఆ కాలేజీలోనే చదువుకున్నాను. అప్పుడూ గలాటా కాలేజీ అనేదానికన్నా ఎక్కువగా, ఎక్కువ కార్యకలాపాలు నడిచే కాలేజీగా పేరు పొందింది. నేను చదివినప్పుడు ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ తరగతులు మాత్రం ఉండేవి. శ్రేయోభిలాషుల హెచ్చరిక వల్ల నేను విచలితుడిని కాలేదు. విద్యార్థులు నన్ను ఏమీ చేయరనే మొండి ధైర్యం. మొదటిరోజు ప్రిన్సిపాల్ గారు నన్ను తరగతికి సాంప్రదాయికంగా పరిచయం చేశారు. నా పాఠం మొదలయ్యింది. తరువాత నేను ఆ తరగతిలో ‘మాడ్రన్ ఫిజిక్స్’ పాఠాలు చెప్పేవాడిని. విద్యార్థులు ఎక్కువ ధ్యానం పెట్టి వినేవారు. తరగతిలో ఫుల్ అటెండెన్స్ ఉండేది. అక్కడక్కడా ప్రశ్నలు అడిగేవారు. క్లాసు ముగించి బయటకు వచ్చిన తరువాత విద్యార్థులతో నేను కలిసిపోయి కొన్ని నిమిషాలు గడిపేవాడిని. ఇది వారికి కొత్త. చాలా సంతోషంతో ఉండేవారు. సుమారు ఒక సంవత్సరం పాఠాలు చెప్పాను. నా వాహనం క్షేమంగా ఉంది. నేనూ క్షేమంగానే ఉన్నాను.

ఒక వైస్ ఛాన్స్‌లర్ కాలేజీకి వెళ్ళి పాఠం చెప్పడం ఇదే మొదటిసారి. విశ్వవిద్యాలయం పని ఎక్కువ అయినందువల్ల ఒక సంవత్సరం తరువాత పాఠం చెప్పడం కుదరలేదు. ప్రభుత్వ కాలేజీలో మీ విద్యార్థిని అని అపురూపంగా ఒకరిద్దరు నాకు ఎదురుపడినప్పుడు సంతోషంతో చెబుతూ ఉంటారు. ఉపకులపతిగా ఉన్నప్పుడు బసవనగుడి కాలేజీలోకూడా కొన్ని నెలలు వారానికో క్లాసును తీసుకునేవాణ్ణి.

ఉపకులపతి ఉద్యోగం వదిలివేసిన తరువాత నేషనల్ కాలేజీ జయనగర్, గౌరీబిదనూర్ నేషనల్ కాలేజీలలో వారానికి ఒక పిరియడ్‌ను బి.ఎస్.సి. తరగతులకు తీసుకునేవాణ్ణి. బెంగళూరు నుండి ప్రతి శనివారం ఉదయం బస్సులో గౌరీబిదనూరుకు వెళ్ళి పొద్దున క్లాస్ తీసుకునేవాణ్ణి. ఇప్పటికీ నాకు పాఠాలు చెప్పాలని ఆసక్తి ఉంది. అయితే సంస్థ పనులు విపరీతంగా ఉన్నాయి. అందువల్ల నాకు అత్యంత ప్రియమైన పాఠం చెప్పడాన్ని కోల్పోయాను.

అభివృద్ధి కార్యక్రమాలు

భవనాలు లేకుండా ఏ విభాగాలను ప్రారంభం చేయడం సాధ్యం కాదు. మిగిలిన ఏ ముఖ్యమైన పనులను చేయడం కూడా కుదరదు. అందువల్ల భవనాల నిర్మాణం పూర్తి చేసే పనికి విశ్వవిద్యాలయం ప్రాముఖ్యతను ఇచ్చింది. ఆర్ట్స్, సోషియల్ సైన్సస్ మొదలైన అన్ని విభాగాలకు భవనాలను నిర్మించడం జరిగింది. సెంట్రల్ కాలేజీ ఆవరణలో ఉన్న ఏ విజ్ఞాన విభాగాన్ని బదిలీ చేయలేదు. భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితశాస్త్రం, వృక్షశాస్త్రం, జీవశాస్త్రం, భూవిజ్ఞానం, దైహిక విభాగం, విద్యార్థి, విద్యార్థినుల హాస్టళ్ళు మొదలైన 7-8 ముఖ్యమైన కట్టడాలకు ఒక సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో అప్పటి కులపతులైన శ్రీ ఉమాశంకర్ దీక్షిత్ గారు శంఖుస్థాపన చేశారు. ఆ భవనాలు ‘జ్ఞానభారతి’ నలుమూలలకూ వ్యాపించి ఉన్నాయి. ఒకచోటి నుండి మరో చోటికి అక్కడి నుండి ఇంకో చోటికి శంఖుస్థాపనకు వెళ్ళాల్సి ఉంది. మూడు నాలుగు శంఖుస్థాపన శిలలను వేసిన తరువాత “ఇంకా ఎన్ని బాకీ ఉన్నాయి” అని వాహనంలో వారి పక్కన కూర్చున్న నన్ను అడిగారు. ఇంకా మూడు నాలుగు ఉన్నాయి అని చెప్పాను. ఆ రోజు సాయంత్రం జరిగిన సాధారణమైన ప్రారంభోత్సవ సమావేశం నాకు జ్ఞాపకముంది. భౌతిక శాస్త్రపు భవనం కట్టేచోట బయలులో సమావేశం. ఈ సమావేశంలో కులపతితో పాటు విద్యామంత్రి శ్రీ ఎస్.ఎం.యాహ్యా గారు, ఒకరిద్దరు ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఆ భవన నిర్మాణానికి సుమారు మూడుకోట్ల రూపాయలు అంచనా వేశారు. ఆ కట్టడాలను కట్టడానికి టెండర్ల ప్రకటనలు జాగ్రత్తగా గమనించిన వారికి ఈ బృహత్ ప్రణాళికకు అయ్యే ఖర్చు తెలుసు. అంత ధనం విశ్వవిద్యాలయం వద్ద ఉందా అని అందరికీ సహజమైన సందేహం. ఈ సందేహం గురించి ఆ రోజు ఉద్ఘాటనా సమారంభం స్వాగతోపన్యాసంలో మాట్లాడుతూ “కట్టడాలను నిర్మించడానికి లక్షలాది రూపాయలు లేకపోయినా వాటి పత్రికా ప్రకటనలకు అయ్యే ఖర్చు పెట్టడానికి మావద్ద డబ్బు ఉంది” అని చెప్పినప్పుడు కులపతిగారితో సహా అందరూ మనస్ఫూర్తిగా నవ్వారు. ఆ అన్ని భవనాలు నిర్మించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నుండి అనుమతి తీసుకున్నాము. అంతే కాకుండా వారి వంతు ధనాన్ని పొందడానికి ముందస్తు సమ్మతిని పొందాము. ఈ భవనాలను నిర్మించే పనులు ప్రారంభించడం ఒక ఏడాది ఆలస్యమై ఉంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్‌కు ఇలాంటి బృహత్ ప్రణాళికకు ధనసహాయం చేయడం అయ్యే పని కాదని తరువాత తెలిసింది.

విస్తృతంగా నిర్మాణపు పనులు మొదలై హాస్టళ్ళు, అధ్యాపకుల, సిబ్బంది వర్గాల ఇళ్ళు, దైహిక విభాగానికి కావలసిన కట్టడాలు, లైబ్రరీ మొదలైన భవనాలను కట్టి ఒక రికార్డును సృష్టించాము. వీటన్నికీ లక్షలాది రూపాయలు ఖర్చయ్యాయి.

నేను ఎక్కడ పనిచేసినా అది నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ కావచ్చు, ఉపకులపతి కావచ్చు లేదా నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు కావచ్చు, భవన నిర్మాణం పనులు మాత్రం నా నీడలా నన్ను వెంటాడుతున్నాయి.

విశ్వవిద్యాలయపు అనేక విభాగాల భవనాలు సుమారు మూడు నాలుగేళ్ళలో పూర్తి అయినా సెంట్రల్ కాలేజీ ఆవరణ నుండి వాటి తరలింపు 10-15 సంవత్సరాలు కావడం శోచనీయం. ఇంకా కొన్ని విభాగాలను ‘జ్ఞానభారతి’ క్యాంపస్‌కు బదిలీ చేయనే లేదు!

ఇంకొక విపరీతం. విశ్వవిద్యాలయంలో ఒక భాగమైన నగరంలోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ మొదలైన ముఖ్య విభాగాలున్నాయి. వాటిని దఫదఫాలుగా జ్ఞానభారతికి తరలించాలని ఆలోచించి నేనున్నప్పుడు సివిల్, ఆర్కిటెక్ట్ విభాగాలను బదిలీ చేసి, మెకానికల్, ఎలెక్ట్రికల్ విభాగాల ప్లాన్, ఎస్టిమేట్లను తయారు చేయించాను. ఇయితే ఇంతవరకూ మిగిలిన విభాగాలను తరలించనే లేదు. అంటే ఇంజనీరింగ్ కాలేజీ రెండు ముక్కలుగా విడిపోయి ఒక ముక్క జ్ఞానభారతిలో మరో ముక్క నగరంలో 20 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాయి.

శిక్షణా విభాగాలు

సంగీతం, నృత్యం, నాటక విభాగాలను తెరవాలనే విషయాన్ని విశ్వవిద్యాలయానికి సంబంధించిన సమావేశాలలో ప్రస్తావించాను. దీనికి చాలా వ్యతిరేకత వచ్చింది. మైసూరు విశ్వవిద్యాలయంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. కావలసిన విద్యార్థులు అక్కడికి వెళతారు. మనం ప్రత్యేకంగా వీటికోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నది వారి వాదన. కళలు, సంస్కృతికి సంబంధించిన విషయాలను బోధించడానికి అవకాశం లేకపోతే ఆ విశ్వవిద్యాలయం అసంపూర్ణమవుతుంది. అంతే కాదు ఇలాంటి విషయాలను అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చి పెంపొందించడం విద్యాసంస్థల కర్తవ్యం అని సభ్యులకు చెప్పి ఒప్పించాను. ఆ విభాగాలు మొదలయ్యాయి. ఒకటి రెండుసార్లు విశ్వవిద్యాలయ కౌన్సిల్ మీటింగులో అన్ని విభాగాల కార్యనిర్వహణను చర్చించే సమయంలో ఎవరైనా నృత్య, నాటక, సంగీత విభాగాలపై విమర్శించడానికి ప్రయత్నిస్తే, మిగిలినవారు వాటిని విమర్శించకండి అవి ఉపకులపతుల విభాగం అని మాట్లాడి వాటి యోగక్షేమాలను నాకు అప్పగించారు.

రాజకీయ శాస్త్రం (Political Science), వార్త మరియు సమూహ మాధ్యమ విభాగం(Department of Mass Communication & Journalism), భూగోళశాస్త్రం, తెలుగు, మానసిక శాస్త్రం మొదలైన విభాగాలను ప్రారంభించాము. అలాగే చాలా స్నాతకోత్తర విషయాలు మొదలయ్యాయి.

ప్రభుత్వ శారీరికవిద్యా కళాశాల (Government College of Physical Education) చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఆ కాలేజీని మైసూరుకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆలోచించి ఆ దిక్కుగా ముందుకు పోయింది. దాన్ని శ్రమపడి మైసూరుకు బదిలీ చేయడాన్ని తప్పించి మా విశ్వవిద్యాలయంలో చేర్చుకున్నాము. ఇప్పుడు అది విశ్వవిద్యాలయపు ఒక ముఖ్యమైన భాగమయ్యింది.

మా విశ్వవిద్యాలయంలో సమాజ సేవకు ఒక విభాగాన్ని (Department of Social Work) తెరవాలని ఆలోచించాము. ముందే చెప్పినట్లు నాకు వ్యక్తిగతంగా సమాజసేవ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంది. దీని ప్రస్తావనను నేను ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అయిన శ్రీ జి.వి.కె.రావు గారితో చేశానని జ్ఞాపకం. అప్పుడు Indian Institute of Social Sciences అనే ఒక సమాజ విజ్ఞాన సంస్థ ఉండేది. అది ప్రైవేటు సంస్థ. అయితే దానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం ఉంది. కారణాంతరాల వల్ల దానికి కొన్ని పరిపాలనా సమస్యలు తలెత్తాయి. మూసివేసే స్థితిలో ఉంది. అప్పుడు మా విశ్వవిద్యాలయం అక్కడి పుస్తక భండారాన్ని మా వశం చేసుకుని అక్కడి అధ్యాపకులను, ఉపాధ్యాయులను ఉపయోగించుకుని Department of Social Work అనే విభాగాన్ని ప్రారంభించాము. ఆ ప్రైవేటు సంస్థను దాని పాలకమండలి మూసివేసింది. అది విశ్వవిద్యాలయపు ఒక ముఖ్యమైన విభాగమయ్యింది.

బెంగళూరులో చాలా సంవత్సరాల నుండి మానసిక రోగాలకు సంబంధించి ఒక ఆసుపత్రి (Mental Hospital) ఉంది. అది ప్రభుత్వ ఆసుపత్రి. ఆ తరువాత అదే ఆవరణలో All India Institute of Mental Health అనే విద్యాసంస్థ భారత ప్రభుత్వ సహాయంతో మొదలై బెంగళూరు విశ్వవిద్యాలయం ప్రారంభం కన్నా ముందే మైసూరు విశ్వవిద్యాలయంలో భాగమై ఉండేది. బెంగళూరు విశ్వవిద్యాలయం ప్రారంభమయ్యాక అది సహజంగానే దాని భాగమయ్యింది. Mental Hospital ఇంకా ఈ సంస్థను కలిపి National Institute of Mental Health and Neuro Sciences అనే జాతీయ సంస్థగా చేయాలని దాని అధిపతి డా. ఆర్.ఎం.వర్మ గారినుండి ఒక సూచన వచ్చింది. మా విశ్వవిద్యాలయం దానికి అన్ని విధాలుగా సహకరించింది. చివరకు కేంద్ర ప్రభుత్వమూ అంగీకరించింది. ఈ సంస్థ ఇప్పుడు విశ్వవిద్యాలయపు ఒక ముఖ్యమైన భాగమయ్యింది. భారత ప్రభుత్వం నుండి సంపూర్ణంగా ధనసహాయం పొందుతూ ఉంది. ఈ సంస్థ జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించింది. భవిష్యత్తులో ఇది ఒక స్వతంత్ర విశ్వవిద్యాలయం (Deemed University) అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎం.బి.ఎ.విభాగం

ఒకసారి కర్ణాటక రాష్ట్ర ముఖ్యకార్యదర్శి శ్రీ జి.వి.కె.రావుగారు రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల వైస్ ఛాన్స్‌లర్లతో, రిజిస్ట్రార్లతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయాలలోని సమస్యలను తెలుసుకోవడం ఆ సమావేశపు ఉద్దేశం. శ్రీ బి.ఎన్.శ్రీకంఠయ్యగారు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు. వారు చాలా మంచివారు. వారిదీ భౌతికశాస్త్రమే. నేను సెంట్రల్ కాలేజీ వదిలిన తరువాత వారు భౌతికశాస్త్రంలో ఆనర్స్ కోర్సులో చేరారు. వారికి మా విశ్వవిద్యాలయం నడిపే విధానంలో కొంచెం అసంతృప్తి ఉంది. “బెంగళూరు విశ్వవిద్యాలయం ఈ ఖాతాలోని సొమ్మును ఆ ఖాతాలోకి వేస్తారు. జీతం ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు మరో ఖాతాలోని డబ్బును వాడుకుంటారు. ప్రభుత్వం నుండి ముందుగా అనుమతి తీసుకోకుండా కొత్త కొత్త కోర్సులను విశ్వవిద్యాలయంలో ప్రారంభిస్తారు.” ఇవీ మాపై వారు చేసే నిందలు లేదా ఆక్షేపణలు. దానికి శ్రీ జి.వి.కె.రావుగారు “శ్రీకంఠయ్య గారూ, నరసింహయ్య గారు చేసేవి Honest appropriation, అవి Misappropriation కాబోవు” అని చెప్పి “నరసింహయ్య గారూ ఇకపైన మీరు ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ కొత్త కోర్సులనూ ప్రారంభించకండి” అన్నారు. “అలాగే సార్” అన్నాను. కొన్ని నెలల తరువాత వారు నాకు ఫోన్ చేశారు. “ఏం నరసింహయ్య గారూ, ఈ రోజు నేను పేపర్లో ఎం.బి.ఎ. (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) ప్రారంభిస్తున్నట్లు చదివాను. మీ విశ్వవిద్యాలయంలో ఏ కొత్త కోర్సూ ప్రారంభించం అని చెప్పారు. ఇలా మాకు చెప్పకుండానే ప్రకటన ఇచ్చారు. అదీకాక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంటులో ఇప్పటికే మంచి ఎం.బి.ఎ. కోర్సు ఉంది” అని అడిగారు. “క్షమించండి సార్, ఆ రోజు నేను చెప్పినమాట నిజమే. అయితే ఎం.బి.ఎ. ముఖ్యమైన విషయమని మీకు తెలుసు. ఒక విశ్వవిద్యాలయంలో ఎం.బి.ఎ. కోర్సులేకుండా పోతే అది వెలితిగా ఉంటుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న ఎం.బి.ఎ. కోర్సు శ్రీమంతులకు, అతి తెలివైనవారికి. మన విద్యార్థులకు అక్కడ ఒకటి రెండు సీట్లు దొరికితే దొరకవచ్చు అంతే. మేము సదుద్దేశంతో మా విద్యార్థులకు ఉపయోగంగా ఉండాలని దీనిని తీసుకురావాలని అనుకుంటున్నాము. దయచేసి ఇదొక్కసారికి అనుమతి ఇవ్వండి” అని వేడుకున్నాను. “సరే లేప్పా. నీవు ఎప్పుడూ ఇలాగే చేస్తావు. అయితే మంచి పనిచేస్తున్నావు. అనుమతి ఇస్తాము” అని చెప్పారు.

విశ్వవిద్యాలయపు పరీక్షలు

కాలేజీల సందర్శన

అన్ని పబ్లిక్ పరీక్షలను విశ్వవిద్యాలయం సమర్థతతో నడపడం అతి ముఖ్యమైన పని. పరీక్షలకూ, విద్యార్థులకూ నేరుగా సంబంధముంది. సమయానికి సరిగ్గా పరీక్షలను చక్కగా నిర్వహించి లోపాలు లేకుండా, ఆలస్యం కాకుండా ఫలితాలను ప్రకటించి మార్క్ షీట్లను విద్యార్థులకు అందజేస్తే వారు ఎక్కువ తృప్తి చెందుతారు. మన విద్యావిధానంలో పరీక్షలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించివుంది. విశ్వవిద్యాలయం కీర్తి లేదా అపకీర్తికి సింహభాగం ఈ పరీక్షా విభాగం కారణమవుతుంది. నాకు అధ్యాపకునిగా, ప్రిన్సిపాలుగా పరీక్షలను చక్కగా నిర్వహించే ఆవశ్యకత గురించి తెలుసు. పరీక్షల, మౌల్యాంకనాల లోపాలు, దోషాలు బాగా తెలుసు. ఉపకులపతి అయ్యాక వెంటనే పరీక్షా విభాగం కార్యకలాపాలపై ఎక్కువ దృష్టిని సహజంగానే పెట్టాను. సమయానికి సరిగ్గా పరీక్షలు మొదలయ్యేవి. పరీక్షలను బాగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెలుపడానికి, పరీక్షలను నడిపే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను తెలుసుకోవడానికి పరీక్షా విభాగపు అధికారితో కలిసి ప్రతి కాలేజీకి పరీక్షలు జరిగే సమయంలో రెండుసార్లు సందర్శించేవాడిని. పరీక్షలు జరుగుతున్న ప్రతి గదికీ వెళ్ళి పరిశీలించేవాడిని.

అంత వరకూ ఏ ఉపకులపతి ఇలాంటి కష్టసాధ్యమైన పని చేయలేదు. నా తరువాత కూడా ఎవరూ చేయలేదు. వెనుక, ముందు జరుగని ఈ ‘న భూతో న భవిష్యతి’ కార్యం అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్ళకు, అధ్యాపకులకు బలాన్ని, ఎక్కువ విశ్వాసాన్ని చేకూర్చింది. పరీక్షల పవిత్రతకు మెరుగు దిద్దింది.

పవిత్రత

కనకపుర కాలేజీలో అనుకోకుండా ఒక పరీక్షలో మరుసటిరోజు ప్రశ్నాపత్రాన్ని ఒక విద్యార్థికి ఇన్విజిలేషన్ చేస్తున్న అధ్యాపకుడు ఇచ్చారు. అది అధ్యాపకుని తప్పు కాదు. ఆ ఒక్క ప్రశ్నాపత్రం ఆ ప్యాకెట్టులో అకస్మాత్తుగా వచ్చింది. ఆ పిల్లవాడు దానిని తీసుకుని చూసి, ఇది ఈ రోజు ప్రశ్నాపత్రం కాదు అని ఉపాధ్యాయునికి వాపస్ ఇచ్చాడు. తరువాత సరైన ప్రశ్నాపత్రాన్ని ఆ విద్యార్థికి ఇచ్చారు. ఈ గందరగోళంలో మరుసటిరోజు ప్రశ్నాపత్రం ముందే బయటకు వచ్చినట్టయింది. ఆ ఒక్క విద్యార్థి ఆ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను కొంచెం సేపు మాత్రమే చూశాడని అక్కడున్న అధ్యాపకునికి తెలుసు. అయినా ఆ అధ్యాపకుడు నిజాయితీగా ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ గారికి తెలియజేశారు. వారు నాకు, విశ్వవిద్యాలయం పరీక్షాధికారులైన శ్రీ హెచ్.ఆర్.దాసేగౌడ గారికి ఫోన్ చేసి తెలిపారు. మేమిద్దరమూ కూర్చుని ఈ సంఘటన గురించి కొంచెంసేపు ఏమి చేయాలని ఆలోచన చేసి, దీనిని ఉదాసీనంగా తీసుకోకుండా నైతిక దృష్టితో చూడాలని నిర్ధారణకు వచ్చి మరుసటిరోజు ప్రశ్నాపత్రాలను మార్చాలని నిర్ణయించాము. ఆ సబ్జెక్టుకు సంబంధించి తరువాతి సెప్టెంబర్ పరీక్ష ప్రశ్నాపత్రం మావద్ద ఉంది. “మీరేమీ ఆలోచించకండి. సెప్టెంబర్ పరీక్షాపత్రాన్ని ముద్రించి తెల్లవారేసరికి అన్ని కాలేజీలకు పంపే ఏర్పాటు చేస్తాను” అనే హామీ ఇచ్చారు. ప్రశ్నాపత్రాలను సుమారు సాయంత్రం ఐదు గంటలకు విశ్వవిద్యాలయం కార్లలో వివిధ పరీక్షాధికారులు తీసుకుని తమకు ఒప్పజెప్పిన కాలేజీలకు ఇవ్వడానికి వెళ్ళారు. తమ పని అయిన వెంటనే నాకు ఫోన్ చేసేవారు. ఆ రోజు రాత్రి నాకు నిద్రలేదు. ప్రతి గంటకు, రెండు గంటలకు ఫోన్ వస్తూ ఉంది. తెల్లవారుజాము తిపటూరు నుండి చివరి ఫోన్ కాల్ వచ్చింది. ఆ పరీక్షాధికారులు వివిధ గ్రామాలకు వెళ్ళి ప్రిన్సిపాల్ ఇంటిని వాకబు చేసి, అక్కడి నుండి ఇద్దరూ కాలేజీజి వెళ్ళి ముందు ఇచ్చిన ప్రశ్నాపత్రాల ప్యాకెట్టును వాపసు తీసుకుని కొత్త ప్యాకెట్టును ఇచ్చి రావడం ఒక శ్రమ. ఆ ఊర్లలో కుక్కల బెడదను తప్పించుకుని ప్రిన్సిపాళ్ళ ఇళ్ళను వెదకడానికి అనుభవించిన కష్టాలు ఏమీ తక్కువ కాదు. అయితే పరీక్షల పవిత్రతను విశ్వవిద్యాలయం కాపాడడం మాకంతా ఎక్కువ తృప్తి సంతోషాలను ఇచ్చాయి. విశ్వవిద్యాలయం నిజాయితీగా పరీక్షలను నడిపిన ప్రయత్నాలకు ఈ ఒక్క ఉదాహరణ చాలు.

పరీక్ష ముగిసిన చివరి రోజుకు సరిగ్గా ఒక నెలకు ఆయా పరీక్షల ఫలితాంశాలను ప్రకటించేవాళ్ళం. అంతే కాదు అప్పుడే మార్క్స్ కార్డులను కాలేజీలకు పంపేవాళ్ళం. విశ్వవిద్యాలయం చరిత్రలో ఇదొక గర్వించదగిన విజయం. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు దీనిని చాలా మెచ్చుకున్నారు.

స్నాతకోత్తర పరీక్షలు నడపడంలో ఒకసారి విశ్వవిద్యాలయం కొంచెం ఇబ్బందిని ఎదుర్కుంది. కొందరు అధ్యాపకులు పర్యవేక్షణ పనులను నిర్వహించడానికి కొంత వెనుకంజ వేశారు. అధ్యాపకుల మీటింగును ఏర్పాటు చేసి వారిని ఒప్పించి, వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తామని హామీ ఇచ్చి పోలీసుల సహాయం అడిగాను. రెండు పోలీస్ వ్యాన్లు సెంట్రల్ కాలేజీ ఆవరణలోనికి వచ్చి నిలిచాయి. నేనే స్వయంగా పరీక్షలు నడుస్తున్న గదులలోకి వెళ్ళి నేనూ మీతోపాటు ఉన్నానని పర్యవేక్షిస్తున్న అధ్యాపకులకు భరోసా ఇచ్చాను. దానితో వారికి ధైర్యం వచ్చింది. ఒక గది నుండి వేరొక గదికి వెళ్ళేసమయంలో ఏ విద్యార్థుల నుండి మేము ఒడిదుడుకులను ఊహించామో ఆ విద్యార్థుల నాయకులు నలుగురైదుగురు నన్ను కలిసి “సెంట్రల్ కాలేజీ ఆవరణలో పోలీసులు ప్రవేశించి, విద్యాలయం పవిత్రతను చెడగొట్టారు. ఆ పోలీసులను కాలేజీలోనికి ఎవరు అనుమతి ఇచ్చారు?” అని గడుసుగా అడిగారు. “పోలీసులను చూస్తే మీకెందుకప్పా భయం? మీరు మర్యాదస్థులు. పోలీసులు వస్తే దొంగలు భయపడాలి. పరీక్షల పవిత్రతను కాపాడడానికి ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడానికీ వెనుకాడం” అని చెప్పాను. వారు నిస్సహాయులై వెనుకకు వెళ్ళిపోయారు. శ్రీ హెచ్.ఆర్.దాసేగౌడ గారు పరీక్షా విభాగాన్ని, పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు.

మొట్టమొదటి సారి అన్ని డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల ప్రశ్నాపత్రాలను కన్నడ మరియు ఇంగ్లీషు భాషలలో ఒకదాని క్రింద ఒకటి అచ్చువేయించే విధానాన్ని విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టింది. దానికన్నా ఎక్కువగా ఇంగ్లీషు మీడియం విద్యార్థులు తమ సమాధానాలను కన్నడభాషలో వ్రాయడానికి అనుమతించింది. ఇదొక మహత్తరమైన పని.

వృత్తిపరమైన శిక్షణ

విద్య ఉద్యోగానికి సహకారి కావాలన్న విషయాన్ని అందరు నిపుణులు చెబుతూ వస్తున్నారు. అయితే దీనిని కార్యరూపం చేయడం అంత సులభమైన పని కాదు. విశ్వవిద్యాలయం ఈ వైపు ఒక అడుగు ముందే ఉంది. డిగ్రీ విద్యార్థుల ఉపయోగానికై రెండు సంవత్సరాలు వ్యవధి కలిగిన సుమారు 20 డిప్లొమా కోర్సులను, ఒక సంవత్సరం వ్యవధి ఉన్న 10 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను ప్రారంభించింది. ఈ డిప్లొమా కోర్సులను ప్రైవేటు కాలేజీలలో కూడా అనుమతినిచ్చింది. వృత్తివిద్య గురించి ఇప్పుడూ ఉపన్యాసాలు, వ్యాసాలు, సెమినార్లు నడుస్తూ ఉన్నాయి కానీ ఇంకా ఆవైపు గణనీయమైన ప్రగతి సాధించలేదు.

వీటితో పాటు ఉద్యోగం చేస్తూ డిగ్రీ ఉన్న విద్యార్థుల ఉపయోగానికై కన్నడ, ఇంగ్లీష్, చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం, గణితం, వాణిజ్యం మొదలైన 10 సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను సాయంత్రం పూట విశ్వవిద్యాలయం ఇచ్చే ఏర్పాటును చేసింది. ఈ తరగతులను నడపడానికి ప్రైవేటు కాలేజీలకూ అనుమతిని ఇచ్చింది. డిప్లొమా కోర్సులు, పార్ట్ టైమ్ కోర్సులలో చేరడానికి విద్యార్థుల నుండి చాలా ఒత్తిడి ఉండేది. నేను విశ్వవిద్యాలయాన్ని విడిచిన వెంటనే ఈ ఉపయోగకరమైన కోర్సులను వివిధ కారణాలతో విశ్వవిద్యాలయం వదులుకుంది.

జాతీయ సేవా పథకం (National Service Scheme)

నాకు సేవాకార్యాలలో మొదటి నుండి నమ్మకం ఉందని ముందే చెప్పి ఉన్నాను. విద్యార్థులలో సేవామనోభావాన్ని కలిగించడం విద్య యొక్క ఒక కర్తవ్యం. నేషనల్ కాలేజీలో సేవా సంఘం ఆశ్రయంలో నాలుగైదు సంవత్సరాలు ఉత్తమ సేవా కార్యక్రమాలను నిర్వహించిన నేపథ్యంలో, ఎన్.ఎస్.ఎస్.కు విశ్వవిద్యాలయం ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమం అన్ని కాలేజీలలో గట్టిగా అమలు చేసే విధానాన్ని చేపట్టాము. వేసవి సెలవులలో 21 రోజుల సేవా శిబిరాలను 20-25 కాలేజీలు నడిపాయి. నేను అన్ని శిబిరాలను రెండు సార్లు సందర్శించేవాణ్ణి. ఎన్.ఎస్.ఎస్.ను విద్యలో ఒక భాగం చేశాము. అందుకోసం పాఠాలను రూపొందించాము. ఇలాంటి అతి ముఖ్యమైన విధానాన్ని మొదటిసారి చేపట్టింది బెంగళూరు విశ్వవిద్యాలయం. కేంద్ర ప్రభుత్వపు ఎన్.ఎస్.ఎస్. సలహాదారులు “దేశం మొత్తంలో ఎన్.ఎస్.ఎస్.ను మొట్టమొదటిసారి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిన ఘనత బెంగళూరు విశ్వవిద్యాలయానిదే” అని ముక్తకంఠంతో పొగిడారు. రెండు సంవత్సరాల ఎన్.ఎస్.ఎస్. డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టాము. వందలాదిమంది విద్యార్థులు ఎన్.ఎస్.ఎస్. డిప్లొమాను పొందారు. ఎనిమిది రోజుల అఖిలభారత విశ్వవిద్యాలయాల ఎన్.ఎస్.ఎస్. శిబిరాన్ని దొడ్డబళ్ళాపురం సమీపంలోని బిసెంట్ పార్కులో చాలా విజయవంతంగా నిర్వహించాము. దేశంలోని 38 విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఆ సమయంలో జాతీయ సేవా పథకం ఉత్తుంగ శిఖరాన్ని తాకింది.

ముద్రణాలయం

బెంగళూరు విశ్వవిద్యాలయానికి ఒక ముద్రణాలయం లేదు. విశ్వవిద్యాలయపు ముద్రణా పనులన్నీ ప్రైవేటు ముద్రణాలయాలలో జరిగేవి. దానివల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఒక ఆహ్వాన పత్రిక కావాలన్నా ప్రైవేటు ముద్రణాలయానికే వెళ్ళాలి. విశ్వవిద్యాలయానికి ఒక స్వంత ముద్రణాలయం లేకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు నేషనల్ కాలేజీలో భాగంగా ఒక ముద్రణాలయాన్ని ప్రారంభించాము. విశ్వవిద్యాలయంలో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలని నేను ప్రయత్నించినప్పుడు సహజంగానే స్థలాభావం మొదలైన కారణాలు చెప్పి కొంచెం వ్యతిరేకత కనిపించింది. ఆ లోపాలకు నేను పరిష్కారం చూపినప్పుడు విశ్వవిద్యాలయం ఒప్పుకుంది. ఒక మంచి అనుకూలమైన ముద్రణాలయం ప్రారంభించబడింది. మా ముద్రణాపనులు సమయానికి సరిగా నెరవేరేవి. ప్రారంభించిన రెండు సంవత్సరాలలో మంచి ముద్రణకు జాతీయ స్థాయి పురస్కారమూ లభించింది.

ప్రచురణలు

విశ్వవిద్యాలయపు ప్రచురణల విభాగం చాలా చురుకుగా పనిచేసింది. పుస్తకాలను విరివిగా ప్రచురించింది. అప్పుడు కన్నడ అధ్యయన కేంద్రం అధికారి డా.జి.ఎస్.శివరుద్రప్ప గారు. ప్రముఖ సాహిత్యవేత్త, కవి, అన్నిటికన్నా ఎక్కువగా హేతువాదానికి, సామాన్య ప్రజల బాధలకు స్పందించేవారు. శ్రీ కె.సి.శివప్పగారు ప్రచురణల శాఖ డైరెక్టర్. శ్రద్ధాసక్తులతో, ఎక్కువ దక్షతతో పని చేసేవారు. వారికి ఒక పని అప్పజెప్పి నిశ్చింతగా ఉండవచ్చు. కన్నడ అధ్యయన కేంద్రం సామాన్య ప్రజానీకానికి సాహిత్యచరిత్ర, ‘సమగ్ర సాహిత్య చరిత్ర’ మొదలైనవాటిని ఒక క్రమపద్ధతిలో ప్రకటించింది. అవే కాకుండా ‘సాధన’, ‘సాహిత్య వార్షిక’, ‘జ్ఞానభారతి’, ‘విజ్ఞానభారతి’ మొదలైన నియమితకాల పత్రికలను ప్రకటించింది. విజ్ఞానాన్ని జనప్రియం చేయడానికి ‘జనప్రియ విజ్ఞాన’ అనే ఒక మాసపత్రికను విశ్వవిద్యాలయం వెలువరించింది. ఈ ప్రచురణలలో డా.జి.ఎస్.శివరుద్రప్ప గారు చాలా శ్రద్ధాసక్తులతో అమూల్యమైన కృషిని సలిపారు.

హార్టికల్చర్ విభాగం

విశ్వవిద్యాలయం సుమారు 1000 ఎకరాలలో విస్తరించి ఉంది. ఎక్కువ చెట్లను పెంచాలన్న ఆశ. దానికోసం ఒక సమర్థుడైన నిపుణుని నియమించాలని ఆలోచించాము. ఈ పనికి మాకు మొదట తట్టిన పేరు ప్రముఖులైన డా.ఎం.హెచ్.మరిగౌడు గారు. వీరు వ్యవసాయ మరియు ఉద్యానవన రంగంలో అవిశ్రాంతంగా పనిచేసి అమూల్యమైన సేవను చేశారు. మాకు సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. వారికి వందనాలు చెప్పి “మీకు ఆఫీస్ ఎక్కడుండాలి. ఏయే సౌకర్యాలు కావాలి” అని వారిని అడిగాను. దానికి వారు “చెట్లు, వృక్షాలు ఆఫీసులలో, ఫైళ్ళలో పెంచము సార్. మైదానంలో పెంచుతాము. ఈ ఆవరణే నా ఆఫీసు. అవసరమైనప్పుడు మీ ఆఫీసుకు వచ్చి నాకేమీ కావాలో దానిని అడుగుతాను” అన్నారు. చాలా పెద్ద మనసు కలవారని అర్థమయ్యింది. వారితోపాటు జ్ఞానభారతి మొత్తాన్ని అనేకసార్లు కలియ తిరిగాను. అక్కడ పాములు కనిపించడం అపురూపమేమీ కాదు. అయితే ఒక రోజు సుమారు 15-16 అడుగులు పొడవున్న కొండచిలువ గంభీరంగా మాముందు వెళుతూ ఉంది. దాన్ని చూసి నా గుండె గుభేలుమంది. మేము అలాగే నిలుచున్నాము. దానిపాటికి అది మా ముందునుండి వెళ్ళిపోయింది. దానిని చంపే దుస్సాహసానికి మేము ఒడిగట్ట లేదు.

డా.మరిగౌడ గారు అతి విలువైన పని చేశారు. వేలాది చెట్లను నాటారు. కొన్ని పెద్ద పెద్ద వృక్షాలనే అనామత్తుగా తెచ్చి నాటారు. గులాబి తోటను పెంచారు. ఒకటి రెండు సంవత్సరాలలో నాటిన అన్ని మొక్కలు పెద్దగా పెరిగి “జ్ఞానభారతి” సుందరమైన ఆకర్షణీయమైన పచ్చని తోటగా మారింది. ఇప్పుడైతే ఇవన్నీ ఇంకా పెద్దగా పెరిగి ఒక్కొక్కటీ డా.మరిగౌడ స్మారకాల్లా ఉన్నాయి.

స్నాతకోత్సవాలు

నా హయాములో ఐదు స్నాతకోత్సవాలు జరిగాయి. స్నాతకోత్సవంలో అందరు పట్టభద్రులు, వారి తల్లిదండ్రులు, అన్ని కాలేజీల అధ్యాపకులు, మరియు ఆహ్వానితులు పాల్గొనడానికి అనుకూలంగా ఉండే ఉద్దేశంతో నగరంలోని విశాలమైన కంఠీరవ స్టేడియంలో స్నాతకోత్సవం నిర్వహించడానికి నిర్ణయించాము. ఇదొక మామూలు నిర్ణయం కాదు. కొంచెం ఎక్కువతక్కువ ఇదొక బహిరంగ సమావేశమే అయ్యింది. వేలాది మంది ప్రజలున్న ఇలాంటి సమావేశంలో స్నాతకోత్సవపు పవిత్రతను కాపాడటం కష్టం కావచ్చని కొందరు సందేహాన్ని వ్యక్తీకరించారు. విద్యార్థులపై, అధ్యాపకులపై నాకు విశ్వాసముంది. ధైర్యం చేసి కంఠీరవ స్టేడియంలో నడిపాము. ఒక గంట సొగసైన, గంభీరమైన కార్యక్రమం. ఒక్క అరుపు లేదు. ఒక్క ఈలా లేదు. మునుపటి సంవత్సరాలలో స్నాతకోత్సవాలు ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు ప్రారంభమయ్యేది. నాలుగు గంటలూ కాదు, నాలుగున్నర గంటలూ కాదు. నాల్గుంపావు గంట ఒక విధంగా త్రిశంకు అని అనుకుని నాగులున్నర గంటలకు ప్రారంభిద్దామని సూచించాను. “అయ్యయ్యో, అదంతా వద్దు సార్, నాలుగున్నరకు రాహుకాలం మొదలవుతుంది” అని అందరూ ముక్తకంఠంతో చెప్పారు. వారిని నేను ఒప్పించే ప్రయత్నం నిరర్థకమయ్యింది. చివరకు నేనూ రాహుకాలానికి లొంగిపోవాల్సి వచ్చింది. నాలుగుంపావు గంటకు స్నాతకోత్సవాన్ని ప్రారంభించేవాళ్ళం. రామకృష్ణాశ్రమపు స్వామీ రంగనాథానంద గారిని 1973వ సంవత్సరం స్నాతకోపన్యాసం చేయడానికి ఆహ్వానించినప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. వారు బాగా మాట్లాడారు. తరువాతి సంవత్సరం కు.వెం.పు.గారిని ఆహ్వానించడానికి మైసూరు వెళ్ళాను. బాగా, ఆత్మీయంగా మాట్లాడారు. అయితే రావడానికి ఒప్పుకోలేదు. నేను వదలలేదు. ఈ సంవాదం 10-15 నిమిషాలు నడిచింది. “నన్ను బలవంతం చేయకండి. నేను రాను” అని గడుసుగా పదే పదే చెప్పారు. నా పంతాన్ని నేను వదల లేదు. వారికి చివరికి విసుగుపుట్టి (వారు నాకన్నా 15 సంవత్సరాలు పెద్దవారు) “నేనే మొండివాడిని అనుకున్నాను. మీరు నాకన్నా జగమొండి. వస్తాను” అని ఒప్పుకున్నారు. కు.వెం.పు.గారి ప్రసంగం మొదటి కొన్ని వాక్యాలను పేర్కొనడానికి ఇష్టపడుతున్నాను.

“సన్మాన్యులైన సర్వశ్రీ కులాధిపతులకు, కులపతులకు, సెనెట్ సభ్యులకు మరియు స్నాతక మిత్ర మహాశయులకు నా విజ్ఞాపన. ఈ సంవత్సరం స్నాతకోపన్యాసం చేయడానికి నన్ను ఇక్కడకు లాక్కొని వచ్చారు డా. నరసింహయ్యగారు. సుమారు ఒకటిన్నర నెలల క్రింద ఒక పగలు ఎటువంటి ముందు సూచన లేకుండా అత్యంత అనూహ్యంగా, ఒంటరిగా, ఎకాఎకి మా ఇంటికి వచ్చి నిరాయుధుడినైన నాపైన ఆక్రమణ చేశారు. నేను చేతులు జోడించి పరిపరివిధాలుగా వేడుకున్నా వదలలేదు. ఈ పనికి నా అనర్హతను విశదీకరించినా ప్రయోజనం లేక పోయింది. వారి నిరాడంబరత, నిరహంకారమైన వ్యక్తిత్వపు శోభకు నేను శరణు జొచ్చాల్సివచ్చింది. ఒప్పుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ ముందు ఉపదేశం ఇవ్వడానికి నిలుచున్నాను.” నాకైతే దిగ్విజయం సాధించినట్టయ్యింది. ఈ విజయాన్ని విని అందరూ సంతోషపడ్డారు. ఆ రోజు 1974వ సంవత్సరం డిసెంబరు 8వ తేదీ. వారు చేసిన స్నాతకోత్సవపు “విచార క్రాంతికి ఆహ్వానం” అనే అమోఘమైన ఉపన్యాసాన్ని ఎవరూ మరచిపోలేరు. అప్పటినుండి ఇంతవరకూ ఆ ప్రసంగపు వేలాది ప్రతులు ప్రచురితమై ప్రజలలో హేతుబద్ధమైన స్పృహను రేకెత్తించింది.

ఒక సంవత్సరం సుమారు అక్టోబర్ నవంబర్ నెలలలో అప్పటి ప్రభుత్వంలో మంత్రులైన శ్రీ బసవలింగప్పగారు ఏదో సందర్భంలో కన్నడ సాహిత్యాన్ని ‘వ్యర్థ సాహిత్యం’ అని అన్నారు. వారంటే గిట్టనివారు విద్యార్థులను, ఇతరులను ఉపయోగించుకుని ఒక ఉద్యమాన్నే మొదలుపెట్టారు. మా స్నాతకోత్సవం ప్రతి యేటా డిసెంబర్ నెల మొదటి వారంలో నడిచేది. ఈ వ్యర్థ సాహిత్యం వల్ల జరిగిన ఆందోళన కారణంగా విద్యార్థి బృందాలలో నెలంతా అల్లకల్లోలమైన వాతావరణం. అయితే ఈ ఉద్యమానికీ విశ్వవిద్యాలయానికీ ఎటువంటి సంబంధమూ లేదు. అందువల్ల మేము ఎప్పటిలాగే డిసెంబరు మొదటివారంలో స్నాతకోత్సవాన్ని నడపడానికి నిర్ణయించాము. అప్పటి కులపతి మరియు గవర్నరు అయిన శ్రీ మోహన్ లాల్ సుఖాడియా గారు నన్ను పిలిపించి స్నాతకోత్సవాన్ని వాయిదా వేయమని సూచించారు. అగత్యం లేదని నేను వినయంతో తెలిపాను. “నిఘా వర్గాల నుండి నాకు వచ్చిన సమాచారం ప్రకారం స్నాతకోత్సవ సమయంలో అప్రియమైన ఘటనలు జరిగే సంభవముంది. వాయిదా వేయడం ఉత్తమం” అని మళ్ళీ చెప్పారు. “క్షమించండి సార్. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికీ, విశ్వవిద్యాలయానికీ ఎటువంటి సంబంధమూ లేదు. అదీకాక విద్యార్థుల, వారి నాయకుల మనసు స్థూలంగా నాకు తెలుసు. స్నాతకోత్సవం చక్కగా నడుస్తుందని నేను నమ్ముతున్నాను. దయచేసి వాయిదా వేయకండి” అని విన్నవించుకున్నాను. “మీకు అంత ధైర్యం ఉంటే అలాగే కానివ్వండి” అన్నారు. స్నాతకోత్సవం మునుపటి సంవత్సరాలలాగే విజయవంతంగా నడిచింది. స్నాతకోత్సవం అయిన తరువాత కులపతిగారు నవ్వు ముఖంతో నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ, “మీరే గెలిచారు. హృదయపూర్వక అభినందనలు” అని అక్కడి నుండి నిష్క్రమించారు. 1976వ సంవత్సరం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథి శ్రీ పి.ఎన్.హక్సర్ గారు. వారు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి ముఖ్య వార్తాసచివులు. ఒక్కొక్క స్నాతకోత్సవంలో మొత్తం సుమారు 10000 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉండేవారు. వీరితోపాటు వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు ఇంకా ఇతర ఆహ్వానితులూ కలుపుకుని 25000 మంది కన్నా ఎక్కువ మంది ఈ బృహత్ కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఈ కాలం పిల్లలు దీనిని నమ్మకపోయినా ఆశ్చర్యంలేదు. అన్ని సర్టిఫికెట్ల మీదా నేనే స్వయంగా స్ఫుటమైన అక్షరాలతో సంతకం చేసేవాణ్ణి. ఏ రబ్బర్ స్టాంపూ ఒత్తలేదు.

ఇలా నాలుగు స్నాతకోత్సవాలు కంఠీరవ క్రీడాప్రాంగణంలో అత్యంత విజయవంతంగా నడిచాయి. నేను విశ్వవిద్యాలయం వదిలాక ఆ స్టేడియంలో ఏ స్నాతకోత్సవాలూ జరగలేదు.

ఈ స్నాతకోత్సవాలు విజయవంతం కావడానికి విశ్వవిద్యాలయపు అన్ని సంస్థల సభ్యుల, సిబ్బంది మద్దతు ఉండింది. అన్నిటికన్నా ఎక్కువ విశ్వవిద్యాలయ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, వారి ప్రిన్సిపాల్ ప్రొ.ఎస్.సి.పారప్ప గారి నేతృత్వంలో ఎక్కువ శ్రమించారు.

ఈ స్నాతకోత్సవాలు కొన్ని విశిష్టతలతో కూడి ఉంది. అందరు పట్టభద్రులకు, సెనెట్, సిండికేట్, అకాడమిక్ కౌన్సిల్ సభ్యులకు తెల్లని దుస్తులు. బ్రిటీషర్ల కాలం నుండి వచ్చిన నల్లటి గౌను, హుడ్‌ను తొలగించాము. పట్టభద్రులకు, ప్రిన్సిపాళ్ళకు, విశ్వవిద్యాలయపు అధ్యాపక వర్గానికీ ప్రతి సంవత్సరం ఒక అమూల్యమైన పుస్తకాన్ని ముద్రించి ఉచితంగా పంచాము.

మొదటి సంవత్సరం

Great Thought – శ్రేష్ట చింతనెగళు

రెండవ సంవత్సరం

Thoughts on Education – శిక్షణద బగ్గె చింతనెగళు

మూడవ సంవత్సరం

Science and Society – విజ్ఞాన మత్తు సమాజ

నాలుగవ సంవత్సరం

Science, Society and Scientific Temper – విజ్ఞాన, సమాజ మత్తు వైజ్ఞానిక మనోభావ

అన్ని పుస్తకాలు పేరుపొందిన చింతనాపరుల రచనల సంకలనాలు. అయితే చివరి పుస్తకం వివిధ రంగాలలో పేరు గడించిన నిపుణులను విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి వారు చేసిన ప్రసంగాల సంకలనం. ఈ నాలుగు పుస్తకాలూ మంచి విలువైన పుస్తకాలు. వీటితోపాటు స్వామీ వివేకానంద స్ఫూర్తిని ఇచ్చే ఎంపిక చేయబడిన భాగాల ఒక చిన్ని పుస్తకం కూడా ఇచ్చాము. ఈ పద్ధతి అందరి మెప్పుకూ పాత్రమయ్యింది. స్నాతకోత్సవాలను సాంప్రదాయికంగా చేయడంతోపాటు ఇలాంటి ఒక జ్ఞాపిక లాంటి కానుకను ఇవ్వడం అవసరం. ఇలాంటిది ఇంతకు ముందూ నడవలేదు. ఇక ముందూ నడవదు. మనోదృక్పథాన్ని, వ్యక్తిత్వాన్ని రూపొందించే విషయంలో విశ్వవిద్యాలయాలకే పట్టింపు లేకపోతే ఇంకెక్కడా దీనిని ఆశించడం సాధ్యం కాదు.

గాంధీ భవనం

మహాత్మా గాంధీగారి శతజయంత్యుత్సవం సందర్భంలో జ్ఞానభారతిలో గాంధీజీ గారి తత్వాలను విద్యార్థులు, అధ్యాపకులు ఆచరించేలా చేయడానికి ఒక గాంధీ భవనాన్ని జాతీయ శతజయంత్యుత్సవ కమిటీ కట్టింది. రెండు సంవత్సరాల లోనే ఎటువంటి కార్యకలాపాలు లేక గాంధీభవనం ప్రజ్ఞా హీనమై కోమా అవస్థలో ఉంది. దానికి పునర్వైభవం తేవాలని ప్రయత్నాలు చేశాము. గాంధీ అధ్యయన కేంద్రం నేతృత్వంలో కొన్ని కార్యక్రమాలను నిర్వహించాము. వివిధ కాలేజీల జాతీయ సేవా పథకం ఒకటి రెండు రోజుల శిబిరాన్ని గాంధీ భవనంలోనే నడిపాము.

త్రాగుడు ఖర్చు

ఇంగ్లాండు నుండో లేదా అమెరికా నుండో నలుగురైదుగురి విద్యానిపుణుల బృందం మా విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. రోజంతా సమాలోచనలు చేసిన తరువాత రాత్రి వారికి భోజనానికి ‘వెస్ట్ ఎండ్’ హోటల్లో ఏర్పాటు చేశాము. హోటల్లోని వెస్ట్రన్ ఫుడ్డుకు నాకూ చాలా దూరం. అందువల్ల వారితోపాటు ఉండి నాకు ఇది వద్దు, అది వద్దు అని చెబితే అతిథులకు ఇబ్బంది కలగవచ్చు అని ఆలోచించి నేను వారితోపాటు భోజనానికి వెళ్ళడం సాధ్యం కాదని మా అధికారులకు చెప్పాను. ఆ రాత్రి భోజనానికి మా విద్యా విభాగం ముఖ్యులను పిలిపించాను. వారు సెంట్రల్ కాలేజీలో నా సహపాఠి. నాది భౌతిక శాస్త్రం. వారిది వృక్షశాస్త్రం. వారు వచ్చారు. “చూడప్పా, దయచేసి వారితో భోజనం చేసి రండి. అయితే నాది ఒక్కటే విన్నపం. త్రాగకండి. విశ్వవిద్యాలయం ఖర్చుతో త్రాగడం అంత బాగా ఉండదు. ఏమైనా తినండి. ఎంత కావాలన్నా తినండి” అని చెప్పాను. “సార్, మీకు తెలియదు. తాగకపోతే వారికి తినడానికి కుదరదు. అవి రెండూ జతలోనే చేస్తారు” అన్నారు. “వద్దప్పా, దయచేసి అలా చేయకండి” అన్నాను. “ప్రయత్నిస్తాము” అన్నారు. మరుసటిరోజు హోటల్ బిల్లు వచ్చింది. “500 రూపాయలు ఖర్చుపెట్టి తాగినారు! ఏమప్పా ఇలా అయ్యింది” అని రిజిస్ట్రార్ సూర్యప్రసాద్ గారిని అడిగాను. “పాశ్చాత్య దేశాల నుండి వచ్చినవారు త్రాగకుండా భోజనం చేయరు. అది వారి పద్ధతి” అన్నారు. “అలాగైతే పోనీ త్రాగిన బిల్‌ను విడిగా తెప్పించండి” అన్నాను. మరుసటి రోజు 500 రూపాయలకు త్రాగుడు బిల్ తెచ్చి ఇచ్చారు. వారిముందే ఆ బిల్‌ను చింపివేశి 500 రూపాయలు ఇచ్చాను. “అయ్యో. అది మీరెందుకు ఇస్తున్నారు సార్. విశ్వవిద్యాలయం ఆ ఖర్చును భరిస్తే తప్పేమీ కాదు” అన్నారు. “మీరు చెప్పేది ఆడిటర్ దృష్టిలో కరెక్టు కావచ్చు. విశ్వవిద్యాలయం త్రాగుడు ఖర్చును భరించడం తప్పు అని నాకు అనిపిస్తోంది. ఫరవాలేదు. నానుండీ 500 రూపాయలు పోతే నష్టమేమీ లేదు. అయితే విశ్వవిద్యాలయం పవిత్రంగా ఉండనీ” అని చెప్పి వారిని సమాధానపరిచాను.

ఉపకులపతి అయ్యాక నేను నేషనల్ కాలేజీ హాస్టల్లో ఉండడం భావ్యం కాదని అనిపించి వెంటనే దగ్గరలోనే ఉన్న శ్రీరామకృష్ణాశ్రపు నా వెనుకటి ‘గోశాల (Cow Shed)’కు తాత్కాలికంగా వెళ్ళాను. 10 రోజుల తరువాత నేషనల్ కాలేజీకి 1 కి.మీ. కంటే తక్కువ దూరంలో ఉన్న ఒక అద్దె ఇంటికి వెళ్ళాను. ఒకటి రెండు సంవత్సరాలు అయిన తరువాత నా ఒక్కని కోసం వంట చేయడం దుబారా అనిపించింది. అందువల్ల వంట వ్యవస్థను రద్దు చేసి భోజనానికి నేషనల్ కాలేజీ హాస్టల్‌కు వెళ్ళేవాడిని. ఇలా కొన్ని నెలలు గడిచాయి. తరువాత వసతికీ నేషనల్ కాలేజీ హాస్టల్‌కు వచ్చాను. నేను ఇంతకు ముందున్న గదిలోనే నివసించడం మొదలుపెట్టాను. అది 15 X 10 అడుగులు ఉండవచ్చు. ఒకసారి ఢిల్లీ నుండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్‌కు చెందిన ఇద్దరు అధికారులు నా గదిలోకి ప్రవేశించారు. “వీరే వైస్ ఛాన్స్‌లర్” అని మా అధికారి ఒకరు నన్ను పరిచయం చేశారు. వారు నన్ను చూడడానికి బదులు నా గదిలోని చాప, దాని మీద ఉన్న పరుపును చూశారు. వ్రాసుకోవడానికి ఒక మేజా, కూర్చోవడానికి ఒక కుర్చీ. ఆగంతకుల కోసం రెండు మూడు మడత కుర్చీలు. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారు. “Is this the place of your residence, Mr. Vice Chancellor, Unbelievable, Unbelievable – ఇదేనా మీ వసతి. నమ్మడానికి కావడం లేదు, నమ్మడానికి కావడం లేదు” అని చెప్పారు.

ఇంకొక రోజు ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో విద్యార్థి నిలయంలో నన్ను చూడటానికి వేరే రాష్ట్రం నుండి ఒక అధికారి వచ్చి అక్కడున్న ఒక విద్యార్థిని వైస్ ఛాన్స్‌లర్ ఎక్కడున్నారని అడిగారు. దానికి ఆ పిల్లవాడు “అదుగో చూడండి. భోజనం చేసి కంచం కడుగుతున్నారు” అన్నాడు. నేను భోజనం చేసిన కంచాన్ని కడగడం చూసి తమకు ఆశ్చర్యం కలిగిందనీ, బహుశా ఇంకే వైస్ ఛాన్స్‌లరూ, అంతెందుకు మిగిలిన అధికారులూ తమ కంచాన్ని తామే కడుగుకోరని చెప్పారు. నేను నవ్వి ఊరుకున్నాను.

(ఇప్పటికీ నా కంచాన్ని నేనే కడుగుకొంటాను. ఇప్పుడూ అపరిచితులు దీన్ని చూసి యథాశక్తి ఆశ్చర్యపడుతూ ఉంటారు.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here