Site icon Sanchika

‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -21

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

గ్రాంట్స్

[dropcap]నా[/dropcap] హయాములో అయినన్ని భవనాలు, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు ముందూ, ఆ తరువాత కాలేదని చెప్పడం స్వీయప్రశంస కాదని భావిస్తాను. వాటికోసం లక్షలాది రూపాయల ధనం కావలసి వచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నుండి ఎక్కువ మొత్తంలో గ్రాంట్ పొందడానికి సర్వప్రయత్నాలు చేశాము. అప్పుడు యూనివర్సిటీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయిన శ్రీ బి.నాగేశ్వరరావు గారి సేవను నేను జ్ఞాపకం చేసుకోవాలి. రాష్ట్రప్రభుత్వం నుండి కూడా వీలైనంత గ్రాంట్స్ పొందాము. ఫిబ్రవరి నెలలో విధానసౌధలోనే ఎక్కువగా సంచరించేవాణ్ణి. రాష్ట్రంలోని ఏ విభాగంలోనైనా ఎక్కువ డబ్బు మిగిలితే దాన్నంతా కబళించడానికి ఆ గది నుండి ఈ గదికి, ఈ బల్ల నుండి ఆ బల్లకి వెళ్ళేవాడిని. ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి సంపూర్ణ సహకారమిచ్చింది. విశ్వవిద్యాలయం కార్యాలయ సిబ్బంది సహకారం ఎప్పుడూ ఉండింది. కొన్ని విభాగాల ముఖ్యులైన సర్వశ్రీ ఎల్. సూర్యప్రసాద్, హెచ్. ఆర్. దాసేగౌడ, కె. సి. శివప్ప, ఎస్. కెండగణ్ణస్వామి, బి. జి. మహేశ్ మరియు మిగిలిన సిబ్బంది నిష్ఠతో పనిచేసినందు వలననే విశ్వవిద్యాలయం ఎక్కువ ప్రగతిని సాధించడానికి వీలయ్యింది.

విద్య కోసం ధనార్జన

విశ్వవిద్యాలయం కాలేజీలలో విద్యార్థులు వారు నేర్చుకుంటూనే ఎంతో కొంత ధనం సంపాదించే – Earn While you learn – ప్రణాళికను రూపొందించాము. ప్రభుత్వ సోప్ ఫ్యాక్టరీలో సుమారు 200 మంది విద్యార్థులకు వారానికి నాలుగైదు గంటల పని ఇచ్చారు. మా విశ్వవిద్యాలయం ఆవరణలో వెయ్యికన్నా ఎక్కువ కొబ్బరి చెట్లను నాటడం వంటి తోట పనుల ద్వారా కూడా విద్యార్థులకు ధనసహాయం లభించింది. అలాగే కెనరా బ్యాంకులో కొందరు విద్యార్థులకు పార్ట్ టైమ్ పని లభించింది. జాతీయ క్రికెట్ పోటీల సందర్భంలో మా విద్యార్థులకు పని లభించింది. మొత్తం మీద 1200 మంది విద్యార్థులకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరింది.

మళ్ళీ నియామకం

నా మూడు సంవత్సరాల వ్యవధి ముగిసిన తరువాత మళ్ళీ మూడేళ్ళకు నన్ను ఉపకులపతిగా పొడిగించారు. తాము ఉపకులపతులు కావాలని ఎదురుచూస్తున్న చాలామందికి ఎక్కువ నిరాశ కలిగింది. ఇంకో టర్మ్‌కు నన్ను పొడిగించిన రోజు రాత్రి సుమారు 9 గంటలకు ఒక టెలిఫోన్ వచ్చింది. “ఏయ్ నరసింహా, నిన్ను ప్రభుత్వం ఇంకొక సారి పొడిగించింది. అయితే నీకిచ్చే టైమ్ 24 గంటలే. రేపు సాయంత్రం లోపల నిన్ను చంపేస్తాం” అని ఒక ఆకాశరామన్న బెదిరించాడు. “24 గంటలు బ్రతకడానికి అవకాశమిచ్చినందుకు చాలా థ్యాంక్స్” అని చెప్పి ఫోన్ పెట్టేసాను.

విశ్వవిద్యాలయం చరిత్రలో రెండవ దఫా ఉపకులపతిగా ఇంతకు ముందు ఎవరినీ నియమించలేదు. విశ్వవిద్యాలయం సిండికేట్‌లో అనేకమంది పెద్దవారు, విశ్వవిద్యాలయం పెరుగుదలపై చింత కలిగిన వారున్నారు. సిండికేట్ నేను ఉపకులపతి అయిన వెంటనే 25000 రూపాయలను ఖర్చు చేసే స్వాతంత్ర్యాన్ని నాకు ఇచ్చారు. ఆ సొమ్ము ఖర్చు చేయడాన్ని నా వివేచనకే వదిలిపెట్టారు. నిజంగా ఇది నామీద సిండికేట్‌కు ఉన్న నమ్మకానికి సంకేతం. ఆ స్వాతంత్ర్యాన్ని ఎప్పుడూ నేను దురుపయోగం చేయలేదు. సిండికేట్‌లో ప్రొఫెసర్ ఎం. షడాక్షరస్వామి, శ్రీయుతులు వి. ఎ. మోహనరంగం, కె. బి. మునివెంకటరెడ్డి, డా. షడాక్షరప్ప, న్యాయమూర్తులు ఇక్బాల్ హుసేన్ మొదలైన పెద్దలున్నారు. వీరంతా సెనెట్ సభ్యులు కూడా. ఉపకులపతి కాక పూర్వం నేను కూడా సిండికేట్ సభ్యుడిని కావడం మూలాన అందరికీ ఆత్మీయంగా తెలుసు.

ఉపకులపతి ఆఫీస్

ఒకటి రెండు సంవతరాల తర్వాత న్యాయమూర్తి నిట్టూర్ శ్రీనివాసరావుగారు సిండికేట్ సభ్యులు అయ్యారు. శ్రీ కె. బి. మునివెంకటరెడ్డి గారికి ఉపకులపతి గారి ఆఫీస్ బాగా కనిపించాలని దానిని సుందరంగా అలంకరించాలని ఆశ. ఒకరోజు సిండికేట్ మీటింగులో “సార్ మీరెలాగూ ఉపకులపతిలాగా కనిపించరు. కనీసం మీ ఆఫీసయినా టిప్ టాప్‌గా ఉండనివ్వండి” అని ప్రస్తావించి దానికోసం 25000 రూపాయలు ఖర్చుచేయవచ్చన్న నిర్ణయాన్ని సిండికేట్ ముందు ఉంచారు. “అయ్యో! అదంతా వద్దప్పా. ఒక విశ్వవిద్యాలయం ఘనత, విలువ ఉపకులపతి ఆఫీసును చక్కగా అలంకరించినంత మాత్రాన ఎక్కువ కాదు” అంటూ వాదించాను. వారు వదల లేదు. పట్టు పట్టారు. మునివెంకటరెడ్డి గారి ప్రతిపాదనకు మిగిలినవారందరూ మద్దతు పలికారు. నేను ఏకాకినయ్యాను. నిర్ణయం అంగీకారమయ్యింది. అయితే దానిని కార్యరూపం చేయడాన్ని ఏదో కారణాలు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాను. నా తంత్రం మునివెంకటరెడ్డిగారికి తెలిసింది. వారు “మీరు దానిని కార్యరూపం చేయకపోతే సిండికేట్ మీటింగు తరువాత నేను భోజనం చేయను. ఉపవాసం ఉంటాను” అని అలిగి ఒక మూలలో కూర్చున్నారు. వారి వద్దకు వెళ్ళి “అలా అలగకండి. భోజనం చేయండి. ఆఫీసును పునరుద్ధరణ చేయడం, చేయకపోవడం చాలా చిన్న విషయం.” అని వారిని బుజ్జగించాను. చివరకు ఆ నిర్ణయాన్ని కార్యాచరణ చేయనేలేదు. ఒకసారి సిండికేట్ మీటింగులో “సార్, చివరకు మీరే గెలిచారు. ప్రజాస్వామ్యపద్ధతిలో సిండికేట్ అంగీకరించిన నిర్ణయాన్ని మీరు ఉల్లంఘించారు. వేరే కులపతి ఇలా ఉల్లంఘించి ఉంటే వారి పని పట్టేవాళ్ళం. అయితే విశ్వవిద్యాలయం అనవసరంగా ఖర్చు చేయకూడదన్న మీ సదుద్దేశాన్ని తెలుసుకుని ఊరికే ఉన్నాము” అని చెప్పారు. “చాలా థ్యాంక్స్” అని చెప్పి ఆ విషయానికి తెరదించాను.

సెనెట్ సమావేశాలు

సిండికేట్ సమావేశాలు సామాన్యంగా శాంతంగా నడిచేవి. ఒక్కొక్కసారి ఒకరిద్దరు గట్టిగా మాట్లాడేవారు. వారిని శాంతపరచడం నా వంతు అయ్యేది. అయితే సెనెట్ మీటింగులలో తీవ్రమైన వివాదాలు జరిగేవి. శ్రీయుతులు ఎం. షడాక్షరస్వామి, ఎం. పి. ఎల్. శాస్త్రి, జి. నారాయణ, ప్రస్తుతం నాయమూర్తి అయిన జి. పి. శివప్రకాశ్, కె. బి. షణ్ముఖప్ప, బి. వి. నారాయణరెడ్డి, సి. నారాయణరెడ్డి, జయరామరెడ్డి, శాసనసభ ప్రతినిధులు మొదలైనవారితో కూడివుంది. వీరంతా ఘటనాఘటన సమర్థులు. అలాంటి సభ్యులతో కూడిన సెనెట్, సిండికేట్ సభలు తరువాత ఏర్పడలేదు.

నేను ఉపకులపతిగా ఉన్నప్పుడు జరిగినన్ని సెనెట్ మీటింగులు మరెప్పుడూ జరగలేదు. చాలామంది ఎక్కువ జవాబుదారీతో మాట్లాడేవారు. కొంతమంది లోకాభిరామంగా మాట్లాడేవారు. వాస్తవ పరిస్థితిని గమనించేవారు కాదు. కొందరు గంటసేపు మాట్లాడినా వారు దేనిని ప్రస్తావిస్తున్నారు అనే అయోమయం ఉండేది. ఒకసారి ఒక శాసనసభ్యులు విశ్వవిద్యాలయం అక్రమఖర్చులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ “భవన నిర్మాణంలో 10 లక్షల రూపాయల అవినీతి జరిగింది..” అనే విధంగా నిందలను మోపారు. అక్కడే ఉన్న అధికారులతో దానికి సంబంధించిన సరైన సమాచారాన్ని వారి సంభాషణ ముగియక ముందే తెలుసుకున్నాను. వారి సంభాషణ ముగిసిన తరువాత “స్వామీ, దయచేసి మీరు ఆరోపించిన అక్రమ వ్యవహారపు మొత్తాన్ని ఐదులక్షల రూపాయలకన్నా తక్కువకు దించండి. నేను దీనికోసం కేటాయించిన మొత్తమే ఐదు లక్షలకన్నా తక్కువ. కాబట్టి పదిలక్షల గోల్‌మాల్ జరగడానికి సాధ్యపడదు. మూడో, నాలుగో లక్షల రూపాయల అక్రమమం జరిగిందని మార్చి చెప్పండి. దానిని తనిఖీ చేయించే భరోసాను ఇస్తాను” అన్నాను. వారు మారు పలకలేదు. మీటింగ్ అయిన తరువాత “సార్, నేను చెప్పినదాన్నంతా సీరియస్‌గా తీసుకోకండి. మేము మా శాసనసభలో ఇలాగే మాట్లాడటం అలవాటు. సామాన్యంగా మేము చెప్పినదాన్ని అంత గంభీరంగా ఎవరూ తీసుకోరు” అని నన్ను సమాధానపరిచారు.

శ్రీ జయరామరెడ్డిగారు ఎప్పుడూ సుదీర్ఘ సంభాషణలు చేసేవారు. సామాన్యంగా విశ్వవిద్యాలయపు పనివిధానాన్ని విమర్శించేవారు. అయితే వారు ప్రతిసారీ “సన్మాన్య ఉపకులపతి గారికి” అని తమ ప్రసంగం ప్రారంభించేవారు. “జయరామరెడ్డి గారూ, ఇంత గౌరవాన్ని నేను తట్టుకోలేను. నాకేమో కష్టకాలం కాచుకుని ఉంది” అని తమాషా చేసేవాడిని. “మీరేమీ భయపడకండి. మీమీద ఎటువంటి ఆరోపణలు చేయబోవడం లేదు” అని చెప్పేవారు.

శ్రీ బి.వి.నారాయణరెడ్డి గారు చాలా గౌరవమైన వ్యక్తి. వారు మైసూరు బ్యాంకు మాజీ జనరల్ మేనేజర్. వారిని చూస్తే అందరికీ ఎక్కడలేని గౌరవం. వారి మాటతీరు మరియు ప్రవర్తన రాజమహారాజుల కాలం నాటివి. వారు మాట్లాడేటప్పుడు వెనుక వరుసలో కూర్చున్న యువకులైన సి. నారాయణరెడ్డి గారు పదే పదే అడ్డు తగులుతున్నారు. దానికి బి. వి. నారాయణరెడ్డిగారు “Mr. Vice Chancellor, Please tell that young man not to disturb me. – మాననీయ ఉపకులపతిగారూ, ఆ యువకుడు నా భాషణకు అడ్డుపడకుండా చూసుకోండి” అన్నారు. సి.నారాయణరెడ్డి నా పూర్వవిద్యార్థి. “అప్పా నారాయణరెడ్డీ, ఆ పెద్దవారికి ఎందుకప్పా అడ్డం పడుతున్నావు. వారి చెప్పేది చెప్పనీయండి. మీరు శాంతంగా ఉండండి” అన్నాను. అప్పుడు సి. నారాయణరెడ్డి దడదడా వచ్చి బి. వి. నారాయణరెడ్డి పక్కన ఉన్న ఆసనంలో కూర్చున్నారు. అప్పుడు బి. వి. నారాయణరెడ్డిగారు “ What young man, have you come to assault me – ఏమి యువకుడా, నా మీద దాడిచేయడానికి వచ్చారా?” అన్నారు. దానికి సి. నారాయణరెడ్డిగారు “No Sir, I have come to hear you from close quarters – లేదు సార్, మిమ్మల్ని దగ్గరనుండి వినడానికి వచ్చాను” అన్నారు. “It is all right – అయితే సరే” అని వారి సంభాషణనను కొనసాగించారు.

అర్ధరాత్రి జ్ఞానభారతిలో ఉపకులపతి

శ్రీ పి. నరసింహయ్యగారు కొంత కాలం యూనివర్సిటీ ట్రెజరీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. వారు కొన్ని విషయాలలో అమాయకులు. ఒక సోమవారం నా ఆఫీసుకు వచ్చారు. “సార్ నిన్నటి రోజు మేము బన్నేరుఘట్టకు వెళ్ళాము. అక్కడ పులి, సింహం, తోడేలు, నాగుపాము, ఎలుగుబంటి మొదలైనవన్నీ ఉన్నాయి సార్” అన్నారు. “అయ్యో, నరసింహయ్యగారూ వాటిని చూడటానికి అక్కడికి ఎందుకు వెళ్ళారు? అవన్నీ మనదగ్గరే ఉన్నాయి. అయితే ఏ ప్రాణి ఏది అని గుర్తించడం కష్టం. అక్కడైతే చూసిన వెంటనే తెలుస్తుంది” అని తమాషాగా అన్నాను. “ఏమి సార్. మీరు ఇలా అంటారు” అని నవ్వారు.

ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి మైసూరుకు వెళ్ళాను. శ్రీ జి.నారాయణ గారూ వచ్చారు. కార్యక్రమం ముగించుకుని సుమారు రాత్రి 10 గంటలకు అక్కడి నుండి బెంగళూరుకు బయలుదేరాము. ‘జ్ఞానభారతి’ ముందుభాగం బెంగళూరు – మైసూరు రోడ్డును ఆనుకుని ఉంది. పాలనా విభాగం అక్కడి నుండి ఒక కిలోమీటరు కన్నా తక్కువ దూరంలో ఉంది. విశ్వవిద్యాలయం ముందు భాగాన్ని చేరకముందే మా కారు ముందు ఇంకొక కారు బెంగళూరుకు వెళుతోంది. అయితే, ఆ వాహనం విశ్వవిద్యాలయం లోపలికి ప్రవేశించింది. విశ్వవిద్యాలయం ఆవరణ రాత్రిపూట దురుపయోగం అవుతుందన్న ఆరోపణలు ఇంతకు ముందు విని ఉన్నాము. ఆ నేపథ్యంలో మాకు అనుమానం వచ్చి ఆ వాహనాన్ని వెంబడించాము. అయితే ఆ వాహనం విశ్వవిద్యాలయం గుండా వెనకనున్న పల్లెలవైపు వెళ్ళిపోయింది. మేము పాలనా విభాగం దగ్గర ఉన్న నైట్ వాచ్‌మన్‌ను నిద్రలేపాము. ఉపకులపతిగారు అర్ధరాత్రి పూట జ్ఞానభారతిలో! అతని ఆశ్చర్యం వేసింది. కొంచెం భయమూ వేసింది. అతని దగ్గర బ్యాటరీ కూడా లేదు. పైగా డిసెంబర్ చలిలో వణుకుతున్నాడు. మరుసటి రోజు రిజిస్ట్రార్‌కు ఈ లోపాలను సరిచేయమని చెప్పాను.

మన విద్యావిధానంలో ఆర్ట్స్ విద్యార్థికి సైన్స్ తెలియదు. సైన్సు విద్యార్థికి కళలకు సంబంధించిన అంటే సామాజికశాస్త్రం, అర్థశాస్త్రం, సాహిత్యం మొదలైనవాటి గురించి ఎక్కువగా తెలియదు. అంటే విద్యార్థికి సమతుల్యమైన విద్య దొరకనట్లయ్యింది. విద్య సంపూర్ణం కావాలంటే రెండూ కావాలి. అయితే రెండింటిలోనూ విద్వాంసుడు కానవసరం లేదు. కావడమూ కష్టం. ఒక భాగంలో అంటే విజ్ఞాన విషయాలను ఎన్నుకున్న విద్యార్థికి కళావిభాగంలో కొంతవరకైనా జ్ఞానం కలిగి ఉండాలి. అలాగే కళా విషయాలను ప్రముఖంగా చదివే విద్యార్థికి విజ్ఞాన విషయాల పరిచయం ఉండాలి. ఈ సమతుల్యమైన విద్యా విధానం సామాన్యమైన పట్టభద్రులకే కాదు ఇంజనీరింగ్, వైద్య విద్యార్థులకూ ఉండాలన్నది నా వాదన. ఈ పద్ధతి అమెరికాలోని ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయమైన Massachusetts Institute of Technology మొదలైన సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థలలోనూ ఉంది. అందువల్ల విజ్ఞాన విద్యార్థులకు సామాన్య విద్య, కళా విద్యార్థులకు శాస్త్రీయ విద్య నేర్పే విధానాన్ని General Education పేరుతో బోధన చేయాలని తీర్మానించాము. ఈ తీర్మానం అంత సులభంగా కాలేదు. మెడికల్, ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ల నుండి ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడున్న సిలబస్‌నే పూర్తి చేయడానికి సాధ్యం కానప్పుడు ఈ అదనపు విషయాన్ని ఎలా బోధించాలని వారి వాదన. అయినా వారానికి రెండు గంటలు దీనికోసం కేటాయించాము. ఒత్తిడి సద్దుమణిగాక పరీక్షలలో ఈ సబ్జెక్టులో పాస్ కావలసిన అవసరం లేదని రాయితీని ప్రకటించాము. ఆటకు ఉంది లెక్కకు లేదు అన్నట్లయ్యింది పరిస్థితి. పలువురు అధ్యాపకుల, విద్యార్థుల నిర్లక్ష్య వైఖరి వల్ల, దీని గురించి కనిపించిన నిరుత్సాహం వల్ల విధిలేక దీనిని రెండు సంవత్సరాల తరువాత వదులుకోవలసి వచ్చింది. చదువుకూ, జీవితానికీ అర్థాన్నిచ్చే ఈ విషయం ఏ విద్యా విధానంలోనైనా ఒక భాగం కావాలని ఇప్పటికీ నేను ప్రతిపాదిస్తాను.

ఒకసారి ఎం.బి.బి.ఎస్.లో చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. “మామూలుగానే మనమంతా జీవితంలో కరుణ, మానవత మొదలైనవాటిని అలవరచుకుని రోగుల బాధలను తగ్గించాలి” అని చెప్పాను. దానికి ఒక విద్యార్థి లేచి “ఇవేవీ మా సిలబస్‌లో లేనేలేవు సార్” అన్నాడు. “నిజమప్పా! ఇవి ఏవీ సిలబస్‌లో ఉండవు. ఇవన్నీ జీవిత విద్య (Education for life)కు కావలసినవి. మీరు మీ పుస్తకాల ద్వారా చదివేది జీవనోపాయమైన చదువు. మీది Knowledge, అంకెలతో కూడిన అంశాలు. నేను చెప్పింది Wisdom, విలువలు” అని తెలిపాను.

హఠయోగి ఎల్. ఎస్. రావు

సుమారు 30 సంవత్సరాల క్రింద హఠయోగి ఎల్. ఎస్. రావు గారి పేరు ముఖ్యంగా చాలామంది విద్యావంతులకు, కొంతమంది సామాన్యులకూ తెలిసి ఉంది. వారు తమ హఠయోగ శక్తితో కొన్ని మానవాతీత కార్యాలను చేస్తాను అని చెప్పుకునేవారు. తాను నీటిపై నడుస్తానని పబ్లిక్‌గా చెప్పినప్పుడు బహుశా మొట్టమొదటి సారి వారి పేరు వినివుంటాను. నేను సైన్సు విద్యార్థిని. ప్రకృతికి అతీతమైన ఘటనలను ఆచరణాత్మకంగా నిరూపించే వరకూ నేను వాటిని నమ్మను. అయితే శ్రీ రావు గారు నీటిమీద నడుస్తాను అని ఘంటాపథంగా చెప్పినప్పుడు సహజంగానే నాకు దానిపై విశేషమైన ఆసక్తి కలిగింది. రావు గారు నీటి మీద నడిచే తారీఖు, సమయం ప్రకటించారు. ఇది జరగాల్సింది బొంబాయిలో. ఈ విశిష్టమైన సంఘటను చూడటానికి చాలా ఖరీదుపెట్టి టికెట్లను అమ్మారు. అప్పుడు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకూ శ్రీమతి ఇందిరాగాంధి కేంద్రంలో సమాచార మంత్రి. వారు కూడా ఆ సంఘటనను చూడటానికి బొంబాయి వచ్చారు. మనవద్ద అప్పుడు దూరదర్శన్ లేదు. పైగా వేలాదిమంది ప్రేక్షకులు. రావుగారు ముందు పూజా ప్రార్థనలు ముగించి కొంచెం సేపు ధ్యానం చేశారు. సరే వారి సత్యపరీక్షకు సమయం ఆసన్నమయ్యింది. కళ్ళు మూసుకుని నోటితో మంత్రాలు జపిస్తున్నట్లు గొణుగుతూ ఒక కాలు నీళ్ళలో పెట్టారు. వైజ్ఞానిక నియమం తన పనిని తాను చేసింది. రావుగారు నీటిలో మునిగిపోయారు.

అక్కడున్నవారంతా హాహాకారాలు చేశారు. వస్తాదు జారిపడినా మీసాలకు మట్టి అంటలేదు అన్నట్లు రావుగారు ఏదో సాకు చెప్పి అప్పటికి తప్పించుకున్నారు. అయితే వచ్చినవారిలో చాలమంది మా డబ్బులు మాకు వాపసు చేయమని గొడవ చేశారు. వారు డబ్బును వాపసు చేస్తానన్న రోజు, అడ్రసు ఇచ్చారు. డబ్బును అందరికీ వాపసు చేయలేదు. ఇదీ రావు గారి నీటిమీద నడిచే కథ.

మా విశ్వవిద్యాలయంలో మహిమలపై పరీక్షలు మొదలై శ్రీ సత్యసాయిబాబా గారితో ఘర్షణ పడుతున్నప్పుడు (ముందు అధ్యాయంలో ఆ వివరాలు ఉన్నాయి) రావు గారు నేను నివసిస్తున్న గదికి నాతో మాట్లాడటానికి వచ్చారు. వారికీ సత్యసాయిబాబా గారంటే కోపం. నోటికి వచ్చినట్లు నిందించారు. నా వైఖరిని సమర్థించారు. అలా మాట్లాడుతున్నప్పుడు ప్రసంగ వశాన వెనుక వారు నీటిమీద నడవడానికి పోయి మునిగిన ఘటనను నేను ప్రస్తావిస్తూ “రావు గారూ, మీకు నిజంగా నీటి మీద నడిచే నమ్మకం ఉండిందా? మీరు ఎప్పుడైనా మీ హఠయోగ బలంచేత నీటిమీద నడిచారా?” అని కుతూహలంతో అడిగాను. “అయ్యో నరసింహయ్య గారూ నీటిమీద నడవడంలో మీకూ నమ్మకం లేదా అనుమానం ఉందా? దీనిని అభ్యాసం చేశారా అని అడుగుతున్నారే? నీటి మీద కాలుపెట్టి మునగడానికి అభ్యాసం ఎందుకు కావాలి? ఎక్కడైనా నీటి మీద నడవడం సాధ్యమా? హఠయోగం నుండీ సాధ్యం కాదు, గిఠయోగం నుండీ సాధ్యం కాదు. అయితే మనదేశంలో మూర్ఖుల సంఖ్య ఎక్కువగా ఉంది. శతమూర్ఖులూ కావలసినంత మంది ఉన్నారు. వారి దడ్డతనాన్ని దుడ్డుగా మార్చుకున్నానంతే.” అన్నారు. “మీకు ఆ సంఘటన నుండి ఎంత డబ్బు వచ్చింది?” అడిగాను. “సుమారు రెండు మూడు లక్షల రూపాయలు చేసుకున్నాను. నీతితో సంపాదించిన ధనమే నిలవడం లేదు. మోసం చేసి సంపాదించిన డబ్బు మిగులుతుందా? అది ఎలా వచ్చిందో అలాగే పోయింది” అని చెప్పారు. “చివరగా ఒక ప్రశ్న. దీనిని మొదటే అడగాల్సింది. ఇందిరాగాంధీ మొదలైన ప్రముఖులు చూడటానికి వచ్చారు. మీకేమీ భయం కాలేదా?” అన్నాను. “అయ్యో భయమెందుకు వేస్తుంది నాకు. నడవడం సాధ్యమని నమ్మి ఏమైనా పొరపాటుగా నడవడానికి కాదేమో అనే అనుమానం ఉంటే భయం కావచ్చు. నేను మునుగుతాననే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. ఫెయిల్ అవుతాను అని ఖచ్చితంగా తెలిసిన వాడికి పరీక్షా ఫలితాలపై భయం ఎందుకు కలుగుతుంది?” అన్నారు. “మీది అపురూపమైన చెడ్డ ధైర్యం” అన్నాను. ఆపైన వారు చివరగా “నేను ఎలా బూటకపు హఠయోగినో, అలాగే సాయిబాబాగారు బూటకపు భగవాన్ – వారు చేస్తాను అని చెప్పుకునేవి అంతా వాస్తవంగా అబద్ధాలు” అని చెప్పి మా సంవాదానికి స్వస్తి పలికారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (N.I.S)

1974వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్ర క్రీడామండలి నుండి తన ఆధీనంలోనే క్రీడా కార్యక్రమాలను బెంగళూరులో నడపడానికి సుమారు 80-90 ఎకరాల స్థలం మా జ్ఞానభారతి ఇవ్వాలని ఒక ఉత్తరం వచ్చింది. అది చదివి నాకు చాలా సంతోషమయ్యింది. మనమంతా చూసినట్లు, ఇంకా చూస్తున్నట్లు కేంద్ర పభుత్వపు విద్యా, క్రీడా, సాంస్కృతిక సంస్థలు ఎక్కువగా ఉత్తర భారత దేశానికే లభించాయి, లభిస్తున్నాయి. అక్కడి అవసరాలను పూర్తిచేయడానికి ప్రాముఖ్యతనిచ్చిన తరువాత వారి దృష్టి దక్షిణ భారతం వైపు తిరుగుతుంది. ఈ అవకాశం అయాచితంగా, మనవారి ప్రయత్నం లేకుండా వచ్చింది. దీనిని ఎలాగైనా కాపాడుకోవాలని నిర్ణయించి విశ్వవిద్యాలయపు అత్యంత ఉన్నత సభ అయిన సిండికేట్ సభ ముందు ఈ విషయాన్ని పెట్టాను. మన స్థలాన్ని కేటాయించము, కేటాయించరాదు అని విరోధం బలంగానే వచ్చింది. ఇది నేను ఊహించనిది. వారిని ఒప్పించడానికి శ్రమపడ్డాను. వారికి చెప్పాల్సిన విధంగా చెప్పాను. “చూడండి. మనం దీనికి అంగీకరించకపోతే అది ఉత్తర భారతదేశంలో ఇంకే ప్రదేశానికో వెళ్ళిపోతుంది. ఇలాంటి అవకాశానికి వారు కాచుకుని ఉంటారు. ఏమో అకస్మాత్తుగా కేంద్ర మండలి చూపు మన వైపు పడ్డాయి. ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. భారతక్రీడా పటంలో బెంగళూరికి, బెంగళూరు విశ్వవిద్యాలయానికీ ఒక ముఖ్యమైన స్థానం దొరుకుతుంది. జ్ఞానభారతికి సుమారు 1000 ఎకరాలు ఉన్నాయి. అందులో 80-90 ఎకరాలు వారికి ఇస్తే మనకు ఏమీ నష్టంలేదు. క్రీడలూ విద్యలో ముఖ్యమైన భాగం. మనం కొంచెం విశాలమైన దృక్పథాన్ని ప్రదర్శించాలి” అని వారితో వాదించాను. చాలామంది లొంగలేదు. ఇద్దరు ముగ్గురు నన్ను సమర్థించారు. ముందు ఏమైనా వారి అభిప్రాయంలో మార్పు వస్తుందేమో అని చర్చను వాయిదా వేశాను. అప్పుడే ఓటింగుకు వేస్తే నా నిర్ణయం వీగిపోయేది (ఆ అపాయాన్ని గమనించే వాయిదా వేశాను.). ఇది జరిగిన కొన్ని నెలలకు ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు. దాని పరిణామంగా విశ్వవిద్యాలయాల సెనెట్, సిండికేట్ మొదలైన అన్ని సమితులు రద్దయ్యయి. విశ్వవిద్యాలయానికి ఉపకులపతియే ఛత్రాధిపతి. విశ్వవిద్యాలయం నడపడానికి అన్ని అధికారాలను ఉపకులపతికే అప్పజెప్పారు. ఎమర్జెన్సీ సాధకబాధకాలను కానీ, దాని రాజకీయ విశ్లేషణను చేయడం గానీ నా పని కాదు. ఆ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుని నేను చేసిన మొదటి పని 70-80 ఎకరాల భూమిని ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’కు బదలాయించాను. భారత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడాగారాన్ని అస్తిత్వంలోనికి తెచ్చింది. అక్కడ అన్ని ముఖ్యమైన క్రీడలను ఆడడానికి సకల వసతులు ఉన్నాయి. అక్కడికి రెండు మూడు సార్లు వెళ్ళి ఆ సౌకర్యాలను చూసి సంతోషపడ్డాను. ఇప్పుడు చాలామంది ఆ నా నిర్ణయాన్ని స్వాగతించారు.

మహేశ్ యోగి

మా విశ్వవిద్యాలయపు జ్ఞానభారతి ఆవరణలో మహర్షి మహేశ్ యోగి గారి ఒక కార్యక్రమం జరిగింది. అది మా విశ్వవిద్యాలయానికి సంబంధించినది కాదు. ఆ సమయంలో నేను ఉపకులపతిగా ఉన్నాను. మహేశ్ యోగిగారు అనుభవానికి మీరిన లేదా అతీతమైన ధ్యానానికి (Transcendental Meditation) ప్రసిద్ధులు. ఇలాంటి ధ్యానం నుండి ప్రకృతి ధర్మాలను ఉల్లంఘించవచ్చు అని వారు చెప్పుకుంటారు. ఉదాహరణకు ఇలాంటి ధ్యానం వలన మనుష్యుడు గురుత్వాకర్షణ నియమాన్ని ఉల్లంఘించి తనంతకు తానే గాలిలో ఎగరవచ్చు. అంతే కాకుండా ఇలాంటి ధ్యానం వల్ల లౌకిక ఉపయోగాలూ ఉన్నాయి. పని చేయడంలో నైపుణ్యాన్ని సాధించవచ్చు. ప్రపంచ జనాభాలో ఒక శాతమో లేదా ఇంకెంత శాతమో (సరి ఐన సంఖ్య మరిచిపోయాను) ఇలాంటి ధ్యానం చేయడం మొదలు పెడితే ఏ విధమైన హింస లేకుండా అత్యంత సుఖమయమైన, శాంతిమయమైన జగత్తును సృష్టించడం సాధ్యమని వారు పదే పదే చెబుతూ వచ్చారు. మా విశ్వవిద్యాలయంలో వారి కార్యక్రమం ఉన్నప్పటికే సత్యసాయిబాబాగారికీ నాకూ వివాదం మొదలయ్యింది అనుకుంటాను. బాబాగారు తెలివైనవారు. ఉన్నతస్థానాలలో ఉన్నవారికి టోపీ వేసి వారిని తమ బుట్టలో వేసుకోవడం వారి స్వభావం. నన్ను వైట్‌ఫీల్డ్ కార్యక్రమానికి ఆహ్వానించిందీ అదే ఉద్దేశంతోనే. నాకు ముందే టోపి ఉన్నందువల్ల వారి టోపికి జాగా లేకపోయింది.

ఈ యోగి గారిదీ ఇంచుమించు అదే స్వభావం. సమాజంలోని ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులకు, శాస్త్రవేత్తలకు ఆశలను చూపి ఎరవేసి బుట్టలో వేసుకుని తమ ప్రచారానికి ఉపయోగించుకుంటారు. ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాతో కొంచెం సుదీర్ఘంగానే మాట్లాడారు. తన మార్గంలోకి రావలసిందిగా సూచించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విట్జర్లాండ్ మొదలైన దేశాలలో పర్యటించడానికి, నివసించడానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. నేను అంతా సావధానంగా విని వారి బాట పట్టడానికి సాధ్యం కాదని వినయంగా చెప్పాను. రెండు రోజులు సమయంతీసుకుని ఆలోచించి చెప్పండి అన్నారు. “ఎంత సమయం ఇచ్చినా ఈ నా నిర్ణయాన్ని మార్చుకోవడానికి సాధ్యం కాదు” అన్నాను. “నా వైఖరి సంపూర్ణ వైజ్ఞానిక తత్త్వాలకు బద్ధమైనది. ధ్యానం వల్ల మనస్సుకు శాంతి లభించవచ్చు. అది ఏకాగ్రతకు సహాయకారి కావచ్చు. అంతే” అని వారికి నా ఖచ్చితమైన అభిప్రాయాన్ని తెలిపాను.

“ఆ అతీంద్రియ ధ్యానం వల్ల మనిషి పైకి ఎగరవచ్చు అనేది బహిరంగ ప్రదర్శన ద్వారా నిరూపిస్తే నేను ఒప్పుకుంటాను, మీ శిష్యుణ్ణి అవుతాను” అని చెప్పాను. వారు నిరూపించలేదు. నేను శిష్యుడినీ కాలేదు.

ఆయుధ పూజ

ఒక రోజు విశ్వవిద్యాలయం వాహన డ్రైవర్లు, ఇంకా ఒకరిద్దరు అధికారులు నా ఆఫీసుకు వచ్చాను. “ఏమప్పా సంగతి?” అడిగాను. “ఎల్లుండి ఆయుధపూజ సార్” అన్నారు. “సరే నేనేమి చేయాలి” అన్నాను. “పూజ చేయాలి సార్” అన్నారు. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులకే వైజ్ఞానిక దృష్టి లేనప్పుడు వీరికి అలాంటి హేతుబద్ధమైన ఉపదేశాన్ని చేసి ఉపయోగంలేదని భావించి “మీరు పూజ చేయండి. అయితే నాదొక సూచన. విశ్వవిద్యాలయంలోని అన్ని వాహనాలను ఒకేచోట చేర్చి ఒకే ఒక గుమ్మడికాయను కొట్టండి” అన్నాను. “ఏం సార్, ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క గుమ్మడికాయ కొడితేనే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంక వీటన్నిటికీ కలిపి ఒకటే గుమ్మడికాయ కొడితే ఏం గతి కావాలి? మీరే ఆలోచించండి సార్” అన్నారు. నేను డీలా పడిపోయాను. “సరేనప్పా, ఒక్కొక్క వాహనానికీ ఒక్కొక్క గుమ్మడికాయను కొట్టి ప్రమాదాలను తగ్గించండప్పా” అని చెప్పి పంపించాను.

ఒక సెలవుదినం ఆటోరిక్షా కోసం ఎదురుచూస్తూ ఫుట్‌పాత్‌పై నిలుచున్నాను. “ఏం సార్, ఇక్కడ నిలుచున్నారు?” అని ఒకరు ప్రశించారు. “ఆటోరిక్షా కోసం” అన్నాను. వారు ఆశ్చర్యంతో “మీ వాహనం ఏమయ్యింది?” అని అడిగారు. “క్షేమంగా దాని స్థానంలో ఉంది” అన్నాను. “డ్రైవర్ రాలేదా?” అని అడిగారు. “రావద్దని నేనే చెప్పాను” అని తెలిపాను. “ఎందుకు సార్?” అన్నారు. “మనకు సెలవు ఉన్నప్పుడు డ్రైవర్లకూ సెలవు ఉండాలి. వాళ్ళేం మనుషులు కారా? సెలవు రోజు వారిని సతాయించడం మానవత్వమా?” అన్నాను. “ఏం సార్, ఉపకులపతులు అధికారంలో ఉన్నప్పుడు ఆటోరిక్షాలో వెళ్ళింది నేను చూడనేలేదు. రిటైరైన తరువాత కూడా ఎంతో మందికి వారి దర్పం తగ్గదు. మిమ్మల్ని అనుసరించి అందరు ఉన్నతాధికారులు తమ స్వంత వాహనం ఉన్నా ఆటోరిక్షాలలో ప్రయాణిస్తే ఎంత అర్థవంతంగా ఉంటుంది” అని వారు చెప్పేలోగా ఆటోరిక్షా దొరికింది.

ఉపకులపతులకు, విశ్వవిద్యాలయపు కొందరు ఉన్నతాధికారులకు తమ ఇళ్ళలో టెలిఫోన్ సౌకర్యం ఇచ్చారు. ఈ సౌకర్యం న్యాయంగా విశ్వవిద్యాలయం పనులకు మాత్రమే పరిమితమైనది. అయితే వాస్తవంగా అలా జరగదు. వారి స్వంతపనులకూ దానిని ఉపయోగిస్తారు. అయితే స్వంతంగా ఉపయోగించిన టెలిఫోన్ కాల్స్‌ను ప్రత్యేకంగా లెక్కించడం కష్టం. అందువల్ల మొత్తం టెలిఫోన్ బిల్లులో 15 లేదా 20 శాతం (సరైన శాతం మరిచిపోయాను) మొత్తాన్ని వ్యక్తిగతంగా విశ్వవిద్యాలయానికి చెల్లించాలని తీర్మానించాము. దానితోపాటు పాత న్యూస్ పేపర్లు అమ్మగా వచ్చిన ధనాన్ని విశ్వవిద్యాలయానికి ఇచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవడానికి దీనిలో ఏమీలేదు. ఈ పత్రికలకు విశ్వవిద్యాలయమే ఖరీదు చేసింది. అందువల్ల పాత పేపర్ల సొమ్ము విశ్వవిద్యాలయానికే చెందుతుంది అన్నాను. “సరే సార్. మీరు చెప్పింది తార్కికంగా కరెక్టే. కానీ కార్యాచరణలో పెట్టడం కష్టం” అన్నారు.

అధికారులలో కర్తవ్య దీక్ష

విద్యార్థులకు, అధ్యాపకులకు, సామాన్య ప్రజలకు నేను దగ్గర అయినందువల్ల వారు నా వద్ద తమ సమస్యలను చెప్పుకోవడం మామూలే. “సిటీ నుండి వచ్చాము సార్. ఇప్పటికే దీనికోసం మూడు నాలుగు సార్లు వచ్చాము. అయితే సంబంధించిన అధికారులు రేపు రండి, ఎల్లుండి రండి అని ఉత్తినే తిప్పుతున్నారు. వచ్చీ వచ్చీ బేజారయ్యింది. కాబట్టి మీరైనా సమస్యను పరిష్కరించండి” అనేది విశ్వవిద్యాలయంపై ముఖ్యంగా చేసే ఆరోపణ. నాకైతే ఇలాంటివి విని మనసుకు చాలా బాధ కలిగేది. ఇలాంటి ఫిర్యాదులు ఒకటా. రెండా. పాపం 15-20 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన విద్యార్థులను, ప్రజలను రేపు రండి, ఎల్లుండి రండి అని వాయిదా వేస్తే ఎంత నిరాశ కలుగుతుంది. అధికారుల మీటింగులను అప్పుడప్పుడు ఏర్పాటు చేసి వచ్చినవారిని సతాయించకుండా వారి పని చేసిపెట్టమని చెప్పేవాణ్ణి. “వచ్చిన వారి పేరును వారి సమస్యను ఒక పుస్తకంలో వ్రాయండి. ఆ సమస్య క్లిష్టతను చూసుకుని వారికి ఇలాంటి రోజు రమ్మని చెప్పండి. నాలుగు రోజులలో సమస్యను పరిష్కరించే నమ్మకం మీకు ఉన్నట్లయితే, ఇంకా రెండు రోజులు ఎక్కువగా చెప్పండి. ఆరు దినాల తరువాత ఆ సమయానికి వచ్చినప్పుడు అతని సమస్యను పరిష్కరించండి. మీరంతా ధర్మంమీద, దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్నవారు. ఇక్కడ మనిషి ఉసురు పోసుకుని ఆ తర్వాత పూజ చేస్తే, పుణ్యక్షేత్రాలకు వెళితే ఏమి పురుషార్థం వస్తుంది. సతాయించకుండా, కర్తవ్యదృష్టితో మానవత్వంతో పనిచేయడమే పూజ కన్నా ఎక్కువ” అని నా మామూలు ధోరణిలో చెప్పేవాణ్ణి. అందరూ ఒప్పుకునేవారు. కార్యాచరణలో లోటుపాట్లు మామూలుగానే ఉండేవి.

పరీక్షాపత్రాలను దిద్దే అధ్యాపకులకైతే ప్రత్యేకంగా మనవి చేసుకునేవాణ్ణి. ఈ మన విద్యావిధానంలో విద్యార్థుల భవిష్యత్తు ఎన్నోసార్లు ఒకటి రెండు మార్కులతో తారుమారయ్యే అవకాశం ఉంది. “మీ పిల్లల సమాధాన పత్రాలను ఎలా మౌల్యాంకనం చేయాలని మీరు భావిస్తారో మిగిలినవారి పిల్లల సమాధానపత్రాలను మీరు అలాగే మౌల్యాంకనం చేయాలి” అని విన్నవించుకునేవాణ్ణి. పరీక్షా పత్రాలను దిద్దే కేంద్రాలకూ అప్పుడప్పుడు వెళ్ళేవాణ్ణి. స్వతహాగా నేనే ఉపాధ్యాయుడిని, ప్రిన్సిపాల్ని అయినందువల్ల ఈ సమస్యలపై అవగాహన నాకు బాగానే ఉంది. ఇంత చెప్పినా పనిని అటకెక్కించే అంతఃకరణ, ప్రామాణికత లేని అధ్యాపకులు ఉండేవారు.

సమస్యలు

విశ్వవిద్యాలయంలో సమస్యలకేమీ కొరత లేదు. విద్యార్థి సమస్యలు, అధ్యాపకుల సమస్యలు మొదలైనవి విశ్వవిద్యాలయాన్ని పీడిస్తూనే వచ్చాయి. గోకాక్ గారు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నప్పుడు ఒక సెనెట్ సమావేశంలో అల్లకల్లోల వాతావరణం ఏర్పడి ఒక సభ్యుడు గోకాక్ గారి వైపు పేపర్ వెయిట్‌ను జోరుగా విసిరాడు. అది గురితప్పింది. వీరి కాలంలోనే సమ్మె చేసిన విద్యార్థులు జియాలజీ విభాగాన్ని నాశనం చేశారు.

నేను వచ్చిన తరువాత ఒకటి రెండు సార్లు తప్పితే విద్యార్థులు శాంతంగానే ఉన్నారు. అలా ఉండకపోతే మేము నాలుగు స్నాతకోత్సవాలను కంఠీరవ స్టేడియంలో అంత విజయవంతంగా నిర్వహించలేక పోయేవాళ్ళం.

మూఢనమ్మకాలను మరియు మహిమలను వైజ్ఞానికంగా తనిఖీ చేసిన సమితి కార్యకలాపాలను మరొక అధ్యాయంలో వ్రాశాను. ఈ తనిఖీ వల్ల సత్యసాయిబాబా గారికి, వారి శిష్యులకు, అభిమానులకు తీవ్రమైన కోపం కలిగింది. దీనిని విద్యార్థులలోనూ ఎక్కించడానికి ప్రయత్నాలు చేశారు. దానికి తగినట్లు అప్పుడే డిగ్రీ క్లాసులకు సెమిస్టర్ పద్ధతిని ప్రారంభించడానికి విశ్వవిద్యాలయం ప్రయత్నించింది. దీనివల్ల విద్యార్థులకన్నా అధ్యాపకులలో తీవ్ర అసంతృప్తి కలిగింది. సంవత్సరం చివరలో ఒక పబ్లిక్ పరీక్షకు బదులుగా సెమిస్టర్ పద్ధతి వల్ల అర్ధవార్షిక పబ్లిక్ పరీక్షలను నిర్వహించాల్సి వచ్చింది. అంటే అధ్యాపకులు మొదటి నుండే శ్రద్ధగా ఏ వారం పాఠాలను ఆ వారమే పూర్తి చేయాలి. కొందరు అధ్యాపకులకు ఇలాంటి అలవాటు లేదు. పాఠాలు చెప్పడంలో మొదట నిర్లక్ష్యం చూపి సంవత్సరం చివరలో గబగబా పాఠాలను ముగించేవారు. అందువల్ల ఈ సెమిస్టర్ పద్ధతి కొందరు అధ్యాపకులకు తలనొప్పిగా తయారయ్యింది. ఈ పద్ధతి ద్వారా జరిగే నష్టాల గురించి ఇలాంటి అధ్యాపకులు విద్యార్థులను ఎగదోసి అశాంతిని పెంపొందించడంలో విజయం పొందారు. దానితో పాటు పరిక్షా పత్రాల పునర్మూల్యాంకనానికి అవకాశం కల్పించాలని కొందరు విద్యార్థులు, ఒకటి రెండు విద్యార్థి సంఘాలు, ఒకరిద్దరు శాసనసభ్యులు ఒత్తిడి తెచ్చారు. నేను తగ్గలేదు. “మూల్యాంకనం వందశాతం సరిగా జరుగుతుందని నేను చెప్పడం లేదు. అయితే దీనికి పునర్మూల్యాంకనం పరిష్కారం కాదు. దీనిని అంగీకరిస్తే దానికి కొనా లేదు, మొదలూ లేదు. అందుకు బదులుగా ఫలితాలను ప్రకటించే ముందే మూల్యాంకనాన్ని ఎక్కువ సమర్థవంతమైన దిశలో నడపడానికి వీలైన చర్యలను తీసుకుందాము” అని చెప్పాను. అయితే వారెవరూ దీని నుండి తృప్తి పొందలేదు. అందువల్ల విద్యార్థి బృందంలో అశాంతి ఉంది. అశాంతిని రేకెత్తించాలంటే ధృఢ నిర్ణయం తీసుకునే కొందరుంటే చాలు. సామాన్యంగా ఇలాంటి విషయాలలో చాలామందికి నిరాసక్తత, అనాసక్తి ఉంటుంది. అందువల్ల ఉద్యమం చేసే అల్పసంఖ్యాక విద్యార్థులదే పైచేయి అవుతుంది.

రాజీనామా

కాలేజీలో బంద్‌లు నడిచాయి. ఒకటి రెండు ధర్నాలు చేశారు. ఇవన్నీ కాలేజీ మొదలైన తరువాత జూలై నెలలో జరిగాయి. వీటిని చూసి నా మనసు నొప్పించింది. బేజారయ్యింది. 15-20 రోజుల తరువాత పరిస్థితి సద్దుమణిగింది. ఈ సమయంలోనే రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయం కులపతి అయిన శ్రీ ఉమాశంకర్ దీక్షిత్ గారు బదిలీ అయ్యి వారి స్థానంలో శ్రీ గోవింద నారాయణ్ గారు 1977 ఆగష్టు 1వ తేదీన అధికారాన్ని స్వీకరించారు. అప్పుడు ఐ.ఎ.ఎస్. అధికారి, మా పూర్వవిద్యార్థి అయిన శ్రీ బి. ఆర్. ప్రభాకర్ గవర్నర్ గారి కార్యదర్శిగా ఉన్నారు. శ్రీ గోవింద నారాయణ్ గారు శ్రీ సత్యసాయిబాబా గారి గాఢమైన భక్తులు అని తెలిసింది. ఇక్కడికి వచ్చి అధికారం చేపట్టక ముందు వారు పుట్టపర్తి వెళ్ళి వారి ఆరాధ్య దైవం అయిన శ్రీ సత్యసాయిబాబా గారి ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. ఈ ముఖ్యమైన బదిలీయొక్క సాధక బాధకాలను తీవ్రంగా ఆలోచించాను. కులపతిగారు బాబాగారి భక్తులు. ఉపకులపతి గారు బాబాగారి మహిమలను పరీక్షించే సమితికి అధ్యక్షులు. అప్పటికే సుమారు ఒక సంవత్సరం పాటు బాబాగారికీ మరియు నాకూ మధ్య నడిచిన ఘర్షణ దేశమంతా తెలిసిపోయింది. ఇదే మొట్టమొదటిసారి మహిమలమీద ముఖ్యంగా సాయిబాబాగారి మహిమల మీద తనిఖీ సార్వజనికంగా చేసే ప్రయత్నం జరిగింది. సహజంగానే బాబాగారికి నామీద ఎనలేని కోపం. సమయం చిక్కినప్పుడలా నన్ను పరోక్షంగా తీవ్రంగా విమర్శించేవారు, ఖండించేవారు, కత్తులు నూరేవారు. విద్యార్థి ఉద్యమాలకు కావలసినంత పుష్టిని ఇచ్చి కొంచెం తృప్తి పడ్డారు.

ఇప్పుడు వారికి సువర్ణావకాశం దొరికింది. కులపతులే తమ భక్తులు. నేను బాబాగారి వైఖరిని జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నించాను. వారికి గిట్టని వారిని నాశనం చేయడానికి ఏ స్థాయికైనా వెళతారు. అప్పుడు నేను వారికి ఒకటవ నెంబర్ శత్రువుని. సహజంగానే వారి భక్తులైన శ్రీ గోవిందనారాయణ్ ద్వారా నన్ను అన్నివిధాలుగా ముప్పతిప్పలు పెట్టే ప్రయత్నాలు చేస్తారనడంలో నాకు అనుమానమే లేదు. కులపతికి, ఉపకులపతికి మధ్య తీవ్రమైన భిన్నాభిప్రాయాలు తలెత్తితే కులపతి గారిదే పైచేయి కావడం సహజం. అన్నట్లు శ్రీ ఉమాశంకర్ దీక్షిత్ గారు మూఢ నమ్మకాల మరియు మహిమల వ్యతిరేకపు సమరాన్ని పరోక్షంగా సమర్థించారు. ఒకసారి వారితో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి కపట బాబాలను జైలుకు పంపాలి అని నాతో లోకాభిరామంగా అన్నారు. శ్రీ గోవింద నారాయణ గారు వచ్చిన తరువాత పరిస్థితిలో తీవ్రమైన మార్పులు కనిపించాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సావధానంగా ఆలోచించిన తరువాత, అన్ని కోణాలలోనూ నా పదవికి రాజీనామా చేయడమే ఉత్తమం అనే నిర్ధారణకు వచ్చాను. నేను ఈ విషయం ఎవరితోనూ పరోక్షంగా కూడా ప్రస్తావించలేదు. విశ్వవిద్యాలయానికి శని ఆదివారాలు సెలవు. 1977 ఆగస్ట్ నెల మొదటి శనివారం “జ్ఞానభారతి” ఆఫీసుకు వెళ్ళడానికి నిర్ణయించుకుని నా ఆప్త కార్యదర్శి అయిన శ్రీ ప్రహ్లాదరావు గారినీ రమ్మని చెప్పి పంపించాను. సుమారు 10 గంటలకు వెళ్ళాము. అప్పటికే నేను రాజీనామా పత్రాన్ని తయారు చేశాను. శ్రీ ప్రహ్లాదరావు గారికి ఆ కాగితాన్ని టైప్ చేయమని ఇచ్చాను. వారు టైప్ చేస్తూ మధ్యలో నా ఆఫీసులోనికి వచ్చారు. అప్పుడు తెలిసింది వారికి నా రాజీనామా విషయం. “దయచేసి అలా చేయకండి సార్” అన్నారు. “అయ్యో వదిలేయప్పా, ఫరవాలేదు. ఇది నా ధృఢమైన నిర్ణయం, టైపింగ్ ముగించండి” అన్నాను. రాజీనామా పత్రం ఎనిమిది ప్రతులు సిద్ధమయ్యాయి. ఆఫీసు నుండి రాజభవనానికి ఫోన్ చేసి శ్రీ బి. ఆర్. ప్రభాకర్ గారితో మాట్లాడి “వెంటనే గవర్నర్ గారి అపాయింట్మెంట్ కావాలి. అవకాశమిప్పించండి” అన్నాను. “అంత అర్జెంట్ ఏమిటి సార్” అని అడిగారు. “తరువాత తెలుస్తుందప్పా. ఇప్పుడే రానా” అన్నాను. గవర్నర్ గారితో మాట్లాడి నన్ను రమ్మన్నారు. శ్రీ ప్రహ్లాదరావ్ గారితో “ఈ సీలు చేసిన కవర్ను గవర్నర్ గారికి మొదట ఇవ్వండి. తరువాత నేను వారితో మాట్లాడుతాను” అన్నాను. ఆ ఉత్తరం ఇచ్చి వచ్చారు. “నాకు రాజీనామా విషయం తెలుపకుండా ఎందుకు ఇలా చేశారు. అలా చేసి ఉండకూడదు” అని శ్రీ ప్రభాకర్ నాతో అన్నారు. అంతలో గవర్నర్ గారి నుండి పిలుపు వచ్చింది. రాజీనామా విషయం ప్రస్తావిస్తూ “మీరు ఈ విషయం ముఖ్యమంత్రిగారికి చెప్పారా?” అన్నారు. “లేదు, చెప్పలేదు. వారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు” అన్నాను. “వారు రానివ్వండి. వారితో సమాలోచన చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది” అన్నారు. “క్షమించండి సార్. నేను ఈ నిర్ణయాన్ని అన్ని కోణాలలోనూ సావధానంగా ఆలోచించే తీసుకున్నాను. ముఖ్యమంత్రి గారైన శ్రీ దేవారజ అరసు గారితో ముందు మాట్లాడవలసింది నిజమే అయినా వారికి నేను అన్ని కారణాలనూ చెప్పడానికి కుదరదు. అప్పుడు వారి ఒత్తిడికి తలొగ్గాల్సి వస్తుంది. నాకైతే ఈ పదవిలో కొనసాగడం కొంచెం కూడా ఇష్టం లేదు. దయచేసి వెంటనే ఒప్పుకోండి. ముఖ్యమంత్రిగారి ఢిల్లీ అడ్రసుకు టెలిగ్రాం ద్వారా ఈ విషయాన్ని తెలుపుతాను. అన్ని పత్రికలకూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తాను” అని ఖచ్చితంగా చెప్పాను. “ముఖ్యమంత్రి గారు వచ్చాక వారితో మాట్లాడుతాను. రాజీనామా అంగీకరించే తేదీ తెలుపుతాను. అంతవరకు కొనసాగండి” అని గవర్నరు అన్నారు. “సరే” అని చెప్పి అక్కడి నుండి వెనుదిరిగాను. ముఖ్యమంత్రిగారికి టెలిగ్రాం పంపి, అన్ని పత్రికలకు నా రాజీనామా ప్రతిని పంపండి అని శ్రీ ప్రహ్లాదరావు గారిని అభ్యర్థించి నా ఉద్యోగానికి అంతిమసంస్కారం జరిపి తేలికైన మనసుతో నేషనల్ కాలేజీ హాస్టల్‌కు వెళ్ళాను. ఖాళీగా ఉన్నప్పుడు విద్యార్థులతో సాయంత్రంపూట బ్యాడ్మింటన్ ఆడేవాడిని. ఆ రోజు నుండి నాకు ఎక్కువ ఖాళీ ఉంది. సాయంత్రం వారితో ఆడుకున్నాను. రాత్రి భోజనం చేశాను. నా గదిలో ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాను. మా విశ్వవిద్యాలయం ఫిలాసఫీ అధ్యాపకులైన శ్రీ ఎస్.శ్రీనివాసరావు గారు వచ్చి వారి డిపార్టుమెంటులోని కొన్ని సమస్యలను తెలిపారు. అన్నీ సావధానంగా విని “సోమవారం ఉదయం 11 గంటలకు ‘జ్ఞానభారతి’ లోని నా ఆఫీసుకు రండి. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేద్దాం” అన్నాను. సరే అని వెళ్ళిపోయారు.

పొద్దున వార్తాపత్రికలలో నా రాజీనామా విషయం ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురింపబడింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ విషయం నేను అక్షరాలా ఎవరితోనూ పరోక్షంగా కూడా ప్రస్తావించలేదు. నా రాజీనామాకు మిశ్రమ ప్రతిక్రియ కనిపించింది. సత్యసాయిబాబా గారి శిష్యులకు, జ్యోతిష్యులకు, సాంప్రదాయవాదులకు సంతోషాన్ని కలిగించి ఉండవచ్చు. బాబాగారు సంతోషంతో కుప్పిగంతులు వేసి ఉండచ్చు. బాబా గారి మహిమకు ఇదొక నిదర్శనమని వారి భక్తులు దండోరా వేయడం మొదలుపెట్టారు. బాబాగారి అందరు శిష్యులకు, అభిమానులకు నా రాజీనామానుండి సంతోషం కలిగింది అంటే అది తప్పవుతుంది. వారి అభిమానులలో కొందరైనా నాకు స్నేహితులుగా ఉన్నారు. ఇలాంటి వారికీ నాకూ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారూ నా శ్రేయోభిలాషులే. బాబాగారికి నాకు వివాదం మొదలైన కొత్తలో బాబా గారు లాల్‌బాగ్ లోని గోల్డన్ జూబిలీ హాలులో ఒక సమావేశం పెట్టుకున్నారు. అక్కడ వారు నా పేరు ప్రస్తావించకుండా నోటికి వచ్చినట్లు తిట్టారట. వారి ఉపన్యాసం విన్న వారి అభిమాని ఒకరు అదే రోజు రాత్రి నన్ను కలిసి ఆ ఉపన్యాసం వారి స్థాయికి తగినది కాదు అని చెప్పారు. వారు నాకు అపరిచితులు. నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా రాజీనామా చాలా నొప్పించింది. మా విశ్వవిద్యాలయం అధికారి అయిన శ్రీ బి. జి. మహేశ్ గారు దావణగెరె నుండి తమ్మూరుకు వెళుతున్నప్పుడు దావణగెరెలో ఆదివారం ఉదయం వార్తాపత్రికలో ఈ వార్త చదివి తమ్మూరుకు వెళ్ళకుండా బెంగళూరుకు వాపసు వచ్చారు. సోమవారం ఆఫీసుకు వెళ్ళాను. గంభీరమైన వాతావరణం. అంతా మౌనం. చాలమంది బరువైన మనసులో కలిస్శారు. మాట్లాడారు. నిర్ణయాన్ని మార్చుకునే మాటే లేదు. రెండు రోజుల తరువాత ముఖ్యమంత్రి శ్రీ దేవరాజ్ అరసు గారు ఢిల్లీ నుండి వచ్చారు. వెంటనే వారిని కలిశాను. “ఎందుకు ఇలా చేశారు” అని బాగా తిట్టారు. తిట్టించుకున్నాను. రాజీనామాను వాపసు తీసుకునే ప్రస్తావన తెచ్చారు. “క్షమించండి” అన్నాను. నేను చేసిన పనుల గురించి పొగుడుతూ “ఆల్ ది బెస్ట్” అన్నారు. నన్ను ఉపకులపతి చేయడానికి కారణమైన వారికి కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు తెలిపాను.

వారి గురించి ఇక్కడ రెండు మాటలు చెబితే అప్రస్తుతం కాదు. వారు ఎప్పుడూ విశ్వవిద్యాలయ నిర్వహణలో తలదూర్చలేదు. అయితే ఒకసారి ఒక అభ్యర్థికి అధ్యాపకుని ఉద్యోగం కోసం ఫోన్ చేసి సిఫారసు చేశారు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతాను అని వినయంగా చెప్పాను. ఆ అభ్యర్థి ఆ పనికి అనర్హుడు. ఐదారు రోజుల తరువాత ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి “సార్ మీరు చెప్పిన అభ్యర్థి ఉపయోగం లేదు. అతడిని పనిలో తీసుకోవడం కష్టమవుతుంది” అని చాలా సంకోచంతో చెప్పాను. దానికి వారు “నరసింహయ్య గారూ, దాన్ని ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారా? ఎవడో ఒక తలమాసినవాడు నా ఆఫీసుకు వచ్చి అతనికి పని ఇప్పించాలని నా ప్రాణం తీశాడు. వాడి సమాధానం కోసం మీకు ఫోన్ చేశాను. దాన్ని మరచిపోండి” అన్నారు. వారి మీద నాకున్న గౌరవం ఇంకా పెరిగింది.

ముందు ఒకసారి మా విశ్వవిద్యాలయం హాస్టల్ ప్రారంభోత్సవానికి జ్ఞానభారతికి వచ్చారు. అన్ని కొత్త కట్టడాలను – “దీనికి 25 లక్షల రూపాయలు ఖర్చయ్యింది, దానికి 30 లక్షలు ఖర్చయ్యింది” – ఇలా చెబుతూ వారికి చూపిస్తూ వచ్చాను. వారు నావైపు ఎగాదిగా చూచి “నరసింహయ్య గారూ, మీరు బీదరికం నుండి వచ్చారు. పల్లె నుండి వచ్చారు. నేనూ పల్లె నుండే వచ్చాను. పల్లెలలోని పాఠశాలలకు భవనాలు లేవు, అధ్యాపకులు లేరు. అలాంటిది ఇక్కడ ఒక్కొక్క భవనానికి ఇంత డబ్బు ఖర్చుపెట్టడం చూడండి నాకైతే సంతోషంగా లేదు” అన్నారు. గర్వంతో చెబుతున్న నాకు సరైన గుణపాఠం చెప్పారు. అరసు గారికి బీదవారి సంక్షేమం వారి జీవితంలో విడదీయలేని ఒక అంగం అయింది.

ప్రభుత్వం శ్రీ టి. ఆర్. జయరామన్ గారిని తాత్కాలిక ఉపకులపతిగా నియమించింది. వారిని అభినందించాను. వారు ఆగష్టు 9వ తేదీన ‘జ్ఞానభారతి’ ఆఫీసుకు వచ్చారు. అన్ని విభాగాల పై అధికారులను ఆహ్వానించాను. అందరికీ కాఫీ ఇచ్చి శ్రీ జయరామన్ గారికి అధికారాన్ని అప్పజెప్పి క్రిందకు దిగి వచ్చాను. శ్రీ జయరామన్ గారూ, అధికారులు, కొంతమంది సిబ్బంది నాతోబాటు పరిపాలనా విభాగం ఆఫీసు ముందుభాగం వరకు వచ్చారు. శ్రీ జయరామన్ గారు నేను వెళ్ళడానికి వారి వాహనాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నేను వద్దని వినయంగా వారించి అందరికీ వందనాలు తెలిపాను. కొందరి కళ్ళు తడి అయినట్టు కనిపించింది. అందరూ వీడ్కోలు చెప్పారు. నేషనల్ కాలేజీ నౌకరు నాకోసం తెచ్చిన టాక్సీ ఎక్కి నగరంవైపు బయలుదేరాను. జ్ఞానభారతి ఆవరణ దాటే వరకూ చుట్టు పక్కల ఉన్న చెట్లను, భవనాలు చూస్తూ వాటికంతా మనసులోనే వందనాలు అర్పిస్తూ విశ్వవిద్యాలయం గేటు దాటినప్పుడు మరొక్కసారి వెనుకకు తిరిగి చూసి నేషనల్ కాలేజీకి వచ్చాను. 1975వ సంవత్సరంలోనే నేను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ కర్ణాటకకు అధ్యక్షుడిని అయ్యాను. ఉపకులపతి పని వదిలిన తరువాత నా పూర్తి కాలమంతా మా సంస్థలకే అంకితం చేశాను.

నేను పని వదిలేసిన మూడవరోజు ప్రముఖ పాత్రికేయులైన శ్రీ ఎస్. వి. జయశీలన్ నన్ను కలిశారు. అప్పుడు వారు నాకు గుర్తున్నంత వరకు సంయుక్త కర్ణాటక పత్రికకు ఛీఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. నాతో భేటీ వారికి ఆశ్చర్యం కలిగించింది. “ఏమి నరసింహయ్య గారూ, నిన్ననే కదా మీరు పనికి రాజీనామా చేశారు. అయితే దాని ప్రభావం మీ మనసుపై కలిగినట్లు కనిపించడంలేదు. చింత లేదు, చీకాకు లేదు, కళవళం లేదు ఇంత నిమ్మళంగా మాట్లాడుతున్నారు” అని అడిగారు. దానికి నేను “జయశీలన్ గారూ కలవరానికి, చేదుకూ ఆస్కారమే లేదు. నేను ఉపకులపతి అవుతానని కలలో కూడా ఊహించలేదు. నాలుగూ ముక్కాలు సంవత్సరాలు ఉపకులపతిగా కొనసాగి అంతో ఇంతో పనిచేశానన్న తృప్తి నాకు ఉంది. నేను ఉపకులపతి అయినప్పుడు కొందరు నాకు ఇచ్చిన వ్యవధి కేవలం మూడు నెలలు. ఇది నేషనల్ కాలేజీ కాదు నిభాయించడానికి బెంగళూరు విశ్వవిద్యాలయం అని అవహేళన చేశారు. అలాంటి పరిస్థితులలో ఇంతవరకూ ఉన్నదే ఒక గొప్ప. మా నేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ ఉంది, దాని సోదర సంస్థలు ఉన్నాయి. చేయాల్సినంత పని ఉంది” అని చెప్పి ముగించాను.

విశ్వవిద్యాలయం వదిలిన తరువాత కూడా అది నాదే అనే భావన ఇప్పుడూ ఉంది. మైసూరుకు రైలులోనో, బస్సులోనో వెళుతున్నప్పుడు మనసు, కళ్ళూ నా ప్రమేయం లేకుండానే జ్ఞానభారతి వైపు తిరుగుతాయి. ఆ భవనాలు, పెరుగుతున్న చెట్లూ చూసి సంతోషం కలుగుతుంది. అక్కడి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటాను. అన్ని విశ్వవిద్యాలయాలకు ఉన్నట్లే బెంగళూరు విశ్వవిద్యాలయానికి కూడా సమస్యలు ఉంటాయి. చాలా సార్లు పత్రికా విలేఖరులు నన్ను కలిసి సమస్యల పట్ల నా ప్రతిక్రియను అడుగుతారు. “విశ్వవిద్యాలయం గురించి ఒక్క చెడు మాటగానీ, విమర్శగానీ నేను చేయను. నా ప్రతిక్రియయే లేదు. ఇది మనందరి విశ్వవిద్యాలయం. దాని పరువు ప్రతిష్ఠలకు నష్టం రాకుండా ఉండేలా మనమందరం చూసుకోవాలి” అని చెప్పి వారిని పంపించి వేస్తాను.

మా విశ్వవిద్యాలయం తన అన్ని రంగాలలో బాగా అభివృద్ధి కావాలన్నదే నా ఆశ. విశ్వవిద్యాలయం రజతోత్సవాలను 1989లో జరుపుకున్నాము. ఆ ఉత్సవ కమిటీలో నేనూ ఒక సభ్యుడిని. ఒక కోటి రూపాలయకన్నా ఎక్కువ ధనాన్ని సేకరించాము. ఆ ధన సేకరణలో యథాశక్తిగా నా ప్రయత్నము ఉంది.

సత్యసాయిబాబా గారితో సమావేశం

నాది చిన్నతనం నుండే మూఢనమ్మకాలను ఎదుర్కొనే స్వభావం. దీనిని అప్పటి నా అధ్యాపకుల ప్రభావం వల్ల అలవరచుకున్నాను. వయసు పెరిగే కొద్దీ ఆలోచనాశక్తిని పెంచుకునే ప్రయత్నం చేశాను. సైన్సు విద్యార్థిని కావడంతో అధ్యాపకుడు అయిన తరువాత అలాంటి మూఢనమ్మకాలను శాస్త్రీయ విధానంతో ఎక్కువ సమంజసంగా, అర్థవంతంగా విభేధించేవాడిని. జ్యోతిషము, మహిమలు అశాస్త్రీయమైనవనే విషయంలో నాకు అణువంత కూడా అనుమానం లేదు. వీటి గురించి అనేక ప్రసంగాలు చేశాను. వ్యాసాలు, పత్రికా సంపాదకులకు ఉత్తరాలు వ్రాస్తూనే వస్తున్నాను.

నన్ను 1972వ సంవత్సరం డిసెంబరు నెలలో బెంగళూరు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించారు. 1973వ సంవత్సరం ఏప్రిల్ – మే నెలలలో బెంగళూరు విశ్వవిద్యాలయం మాజీ కులపతి, సత్యసాయిబాబా గారి భక్తులు అయిన డా. వి. కె. గోకాక్ గారి నుండి బెంగళూరు సమీపంలోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న బాబా గారి ఆశ్రమంలో అఖిలభారత నైతిక సమ్మేళనాన్ని ప్రారంభించాలని నాకు ఆహ్వానం వచ్చింది. బాబాగారు మహిమలు చేయడంలో ప్రసిద్ధులు అని అందరికీ తెలిసిన విషయమే. నేను వాటిని వ్యతిరేకిస్తూనే వచ్చాను. ఈ నేపథ్యంలో ఆహ్వానాన్ని అంగీకరించాలా వద్దా అని రెండు రోజులు సుదీర్ఘంగా ఆలోచించాను. బాబాగారి సుముఖంలోనే నా అభిప్రాయాలను ప్రకటిద్దామని ఆ ఆహ్వానాన్ని ఒప్పుకున్నాను. అక్కడికి వెళ్ళేటప్పుడు నేషనల్ కాలేజీలో నా సహోద్యోగి అయిన డా. జి. రామకృష్ణ గారిని, నా విద్యార్థులైన రాజశేఖర్, మురళీధర్లను పిలుచుకుని వెళ్ళాను. “వైట్‌ఫీల్డ్‌లో బాబాగారి సమక్షంలో ఒక జాతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. నా ప్రసంగమైన తరువాత బహుశా అక్కడున్నవారు చప్పట్లు కొట్టకపోవచ్చు. మీరైనా కొట్టనీ అని మిమ్మల్ని పిలుచుకుని పోతున్నాను” అని నవ్వుతూ చెప్పాను.

కార్యక్రమం ఉదయం పూట ఏర్పాటు చేశారు. ఆశ్రమానికి వెళ్ళాము. నా ముగ్గురు స్నేహితులూ నేరుగా కార్యక్రమం నడిచే చోటుకు వెళ్ళారు. అక్కడ డా. భగవంతం, డా. గోకాక్, గురుదత్ మొదలైన బాబాగారి శిష్యోత్తములంతా కూర్చున్నారు. నేనూ వెళ్ళి కూర్చున్నాను. నాలుగైదు నిమిషాల తరువాత బాబాగారు వచ్చారు. మేమేందరమూ లేచి నిలుచున్నాము. అందరూ నమస్కారం చేశారు. నేను చేతులు జోడించి నమస్కారం చేశాను. గోకాక్ గారు వారి రెండు కాళ్ళను గట్టిగా పట్టుకున్నారు. బాబాగారికి ఆ బంధనం నుండి విడిపించుకొనడానికి కష్టమే అయ్యింది. అంతవరకూ బాబా గారిని నేను ప్రత్యక్షంగా చూడనే లేదు. నా పక్కనే నిలుచున్న వారిని చూశాను. ఆ మొదటి చూపులోనే నాకు తీవ్రమైన నిరాశ కలిగింది. కొంచెం జుగుప్సా కలిగింది. ముఖానికి తెల్లని పొడి (పౌడర్) వేసుకున్నది స్పష్టంగా కనిపిస్తోంది. పెదవులు అసహజంగా ఎర్రగా ఉన్నాయి. అది ఆకు – వక్క (తాంబూలం) నుండి కావచ్చు. లేదా లిప్‌స్టిక్ నుండి కావచ్చు. ఆధ్యాత్మిక వ్యక్తులకు ఇవన్నీ నిషిద్ధం.

నా ఉపన్యాసం

అక్కడి నుండి కార్యక్రమం నడిచే చోటుకు మేమంతా బయలుదేరాము. ఈ ఊరేగింపులో అనేకమంది ముందున్నారు. వారి వెనుక బాబాగారు, వారి వెనుక మేము అందరమూ స్థలానికి చేరుకున్నాము. విశాలమైన పందిరి. సుమారు 2000 మంది యువకులు. అందరికీ తెల్లని దుస్తులు. షర్టు, దట్టి పంచ. ముందుభాగంలో బాబాగారి ప్రియశిష్యులు. అందరూ జమఖానా మీద కూర్చుకున్నారు. అక్కడొక విశాలమైన వేదిక. దాని మీద సింహాసనాల వంటి రెండు భవ్యమైన ఆసనాలు. ఒకటి బాబా గారికి. మరొకటి నాకు. ఆ వేదిక మీద మేమిద్దరమే. ఎంతటి అపురూపమైన దృశ్యం. పక్కలో ఒక దీపస్తంభం. అందరూ నిశ్శబ్దంగా క్రమశిక్షణతో కూర్చున్నారు. గోకాక్ గారి నుండి స్వాగతోపన్యాసం. నేను జ్యోతిని వెలిగించి సమ్మేళనాన్ని సాంకేతికంగా ప్రారంభించాను. నా ప్రసంగం ఇంగ్లీషులో ఉంది. చాలా ఆలోచన చేసి ఎక్కువ బాధ్యతతో వ్రాసుకున్నాను. నేనొక్కడినే ఆ బృహత్ సభలో బాబా గారి మహిమలను వ్యతిరేకించేవాడిని. అయినా ఎటువంటి జంకు లేకుండా ధైర్యంగా, నేరుగా చదివాను. దాని ముఖ్యమైన అంశాలను క్రింద ఇస్తున్నాను.

వ్యక్తి యొక్క మోక్షం జగత్తు యొక్క హితవులో కనిపించాలి. నిజమైన సంస్కారవంతుడు, ఆధ్యాత్మిక గుణాలను కలిగినవాడు సామాన్య జనుల దుఃఖంపై సానుభూతి చూపించడమే కాక వాటికి కారణమైన సమస్యలను పరిష్కరించడానికి సదా ప్రయత్నిస్తాడు. ఒకడు ఎంత చదువుకున్నా, బయటకు ఎంత బాగా కనిపించినా వాడు పేదలపైన, అణగారిన వారి పైన దృష్టిని సారించకపోతే వాడు సంస్కారవంతుడు లేదా ఆధ్యాత్మికుడు కావడం అసాధ్యం. చెత్తకుండీలోని ఆహారానికై మనిషి మరియు కుక్క ఎగబడడం చూసి ఆ స్థితికి కారణమైన వ్యవస్థపై కోపం రాకపోతే అతను ఎవరైనా కాని అతని విద్యకు లేదా ఆధ్యాత్మికతకు విలువలేదు.

ఆర్థిక అసమానతల గురించి, దోపిడీ గురించి, సామాజిక అన్యాయాల గురించి, ‘రహస్యధర్మాల గురించి, మూఢనమ్మకాల గురించి ప్రతిఘటించడం సంస్కారవంతుని యొక్క మరియు ఆధ్యాత్మవాది యొక్క కర్తవ్యం కావాలి.

మనిషి చరిత్ర అడుగడుగునా కనిపిస్తున్న ప్రవృత్తి దోపిడీ. కొంచెం తెలివి ఉన్నవాడు తెలివి తక్కువవాడిని అన్నివిధాలుగా దోపిడీ చేయడాన్ని చూడవచ్చు. దేవుడు, ధర్మం, జాతి, వర్ణం, స్వార్థం, ఆర్థిక సిద్ధాంతాలు ఇవన్నీ ఎప్పుడూ దోపిడీకి సాధనాలయ్యాయి. మన దేశంలో కనిపిస్తున్న దారిద్ర్యానికి సామాజిక, ఆర్థిక స్థితికి ఈ దోపిడీలే ముఖ్య కారణాలు.

మతం ఆధారంగా ఏర్పడిన సామాజిక అసమానతలు మన దేశం ఎదుర్కొంటున్న మరొక సమస్య. పుట్టుక ఆధారంగా వ్యక్తిని నీచంగా లేదా ఉన్నతంగా చూడటం అన్యాయానికి పరాకాష్ఠ. ఈ విధంగా అతార్కికమైన విషయాలతో కూడిన సమాజాన్ని విద్యావంతులు ఎప్పుడూ సహించరాదు. అవమానకరమైన ఈ వ్యవస్థకు సంస్కారవంతుడైన వ్యక్తి మద్దతునివ్వడం సరికాదు.

నా అభిప్రాయంలో ఆధ్యాత్మికత ధర్మం యొక్క ప్రధాన భాగం. అది ప్రాథమికంగా నీతితో కూడినది. హేతువాద దృక్పథాన్ని కలిగి ఉండడం అధ్యాత్మికవాది కావడానికి సహకరిస్తుంది. ఈ శాస్త్ర సాంకేతిక యుగంలో కూడా మూఢనమ్మకాలకు ప్రాముఖ్యత లభిస్తోంది. అర్థంలేని సాంప్రదాయాలను మనం ఇప్పటికీ యాంత్రికంగా అనుసరిస్తున్నాము. జీవిత సమస్యలను ఎదుర్కొనే విషయంలో విద్యావంతులు, శాస్త్రజ్ఞులు ఇంకా ఇతరులు చాలా సందర్భాలలో హేతువాద దృక్కోణాన్ని వ్యక్తం చేయరు. ఫిలాసఫీ ప్రొఫెసర్ జీవితంలో ఫిలాసఫర్ కావడం అరుదు. ఇదే విధంగా శాస్త్రజ్ఞుడు లేదా శాస్త్ర అధ్యాపకుడు కూడా జీవిత సమస్యలను ఎదుర్కొన్నపుడు శాస్త్రీయ దృక్పథాన్ని వ్యక్తపరచడు. ప్రయోగశాలలో హేతువాది అయిన వైజ్ఞానికుడు నిజజీవితంలో హేతువును పూర్తిగా మరిచిపోతాడు. మనకు తెలిసినట్లే చాలా మంది శాస్త్రజ్ఞులు జ్యోతిష్యం మరియు హస్తసాముద్రికంపై అపారమైన నమ్మకాన్ని కలిగిఉంటారు. కొందరు వైజ్ఞానికులు అతీంద్రశక్తులు ఉన్నాయని చెప్పుకునేవారిని గ్రుడ్డిగా అనుసరిస్తున్నారు.

మూఢనమ్మకాలు – మాయమంత్రాలు     

మన దేశంలో మూఢనమ్మకాలు కావలసినన్ని ఉన్నాయి. భయం మరియు అజ్ఞానాలే మూఢనమ్మకాలకు మూలకారణాలు. ఇవి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేయడమేకాక, స్వతంత్ర ఆలోచనలకు నష్టం కలిగిస్తుంది. ఆధ్యాత్మికతకు కావలసిన మొదటి సాధన నిర్భయం. పిరికివాడు ఎప్పుడూ గౌరవాన్ని పొందలేడని గాంధీజీగారి అభిప్రాయం. మనకు తెలిసినట్లు అభీఃఅనేది ఉపనిషత్తుల ముఖ్య సూత్రం. స్వామీ వివేకానంద గారు చెప్పినట్లు మూఢనమ్మకం మనిషికి పెద్దశత్రువు. మతాభిమానం దానికన్నా ప్రమాదం. పరిశుద్ధునిగా ఉండు. మూఢనమ్మకాలను పారద్రోలి ప్రకృతి మాధుర్యాన్ని గుర్తించు. అయితే ధర్మం యొక్క ఆంతరంగిక, వాస్తవిక, ఆధ్యాత్మిక సారాన్ని మరిచి దాని బాహ్యరూపాన్ని పట్టుకుని వేలాడటం మానవుడికి లేదా దేశానికి నష్టమని వివేకానందుల అభిప్రాయం. స్వామీ రంగనాథానంద గారు తమ “మారుతున్న సమాజానికి కావలసిన శాశ్వతమైన విలువలు” అనే గ్రంథంలో “తీవ్ర ప్రయోజనాల కోసం, కారణాల కోసం పదేపదే ప్రశ్నించడం, దొరికిన సమాధానాలను పరీక్షించి నిర్ధారించుకునే స్వభావం చింతనాజగత్తుకు, కార్యాచరణకు చోదకశక్తిని ఇస్తుంది” అని చెప్పారు.

మనం నిజంగా ధర్మాన్ని ఆచరించడానికి ఇష్టపడం. అయితే మనకు వాటి ఫలాలు మాత్రం కావాలి. ఈ విషయాన్ని వందలాది సంవత్సరాల క్రితమే విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు.

ధర్మస్య ఫలమిచ్ఛంతి

ధర్మం నేచ్ఛంతి మానవాః

ఇది ఇప్పుడు కూడా నిజమే. ఇదే విధంగా విజ్ఞాన ఫలాలను ఆశించే మనం వాటి మూలగుణాలను ఇష్టపడం. జె.డబ్యూ.ఎన్.సలివాన్ అనే శాస్త్రవేత్త తన “లిమిటేషన్స్ ఆఫ్ సైన్స్” అనే గ్రంథంలో “ఆధునిక ప్రపంచంలో విజ్ఞానఫలాలపై శ్రద్ధ, గౌరవాలు పెరిగాయి కానీ వాటి స్వరూప స్వభావాలు ప్రజాదరణ పొందలేదని తీర్మానించవచ్చు. అయినా విజ్ఞానపు ప్రధాన విలువ దాని వాస్తవికతలోనే ఉంది అని ధైర్యంగా చెప్పవచ్చు” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నాకు దేవుడన్నా, పునర్జన్మ అన్నా నమ్మకముంది. ఇవి నా వ్యతిగత నమ్మకాలు. వాటిని నేను ఎటువంటి ప్రయోజనాలకూ ఉపయోగించరాదు. నిమ్నవర్గాలలో, అణగారినవర్గాలలో, దీనులలో నేను దేవుడిని చూడటానికి ప్రయత్నిస్తాను. దేశంలోని అనేక ప్రదేశాల నుండి ఇంతమంది ఈ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక శిబిర ప్రయోజనాన్ని పొందడానికి రావడం సంతోషకరమైన విషయం. ఈ నెలరోజుల శిక్షణ తరువాత పాల్గొన్నవారి స్వభావం ఎలా ఉంటుది అన్నది ముఖ్యం. చాలా మంది దేవాలయాలకు వెళ్ళడం, పుణ్యక్షేత్రాలను సందర్శించడం, తాత్విక చర్చలలో పాల్గొనడం, ప్రవచనాలను వినడం, బుద్ధజయంతి, బసవజయంతి, గాంధీజయంతులలో పాల్గొనడం వల్ల వారి జీవితంపై ఎటువంటి ప్రభావం పడకపోవడం బాధను కలిగించే విషయం. ఇది మరో అద్భుతం, యక్షప్రశ్న.

ఇలా మూఢనమ్మకాలు, మాయమంత్రాలు మొదలైన అశాస్త్రీయ విషయాలపై నా వ్యతిరేక ప్రసంగం బాబాగారి, వారి శిష్యులలో అతిరథమహారథులైన భగవంతం, గోకాక్ మొదలైనవారి ముందే నడిచింది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. నేను పిలుచుకుని పోయిన నా స్నేహితులూ నాకు మొండిచెయ్యి చూపించారు!

ముందు వరుసలో ఎక్కువగా విదేశీయులు, ఎక్కువగా స్త్రీలు ఉన్నారు. వారి ముఖాలు, కళ్ళు భయాందోళనలను సూచించాయి. నా ప్రసంగం తరువాత బాబాగారు మధురంగా భక్తిగీతాలను ఆలపించారు. వారిది చక్కని గొంతు పైగా సంగీతానికి అనువైన తెలుగు భాష. నాకైతే చాలా నచ్చింది. ఉప్పూకారం లేని చప్పని వందన సమర్పణను భగవంతం చేశారు. వారి అసహనం వారి వందన సమర్పణలో ఎత్తి కనిపించింది.

అటుపిమ్మట అక్కడున్నవారికి జాయ్ ఐస్ క్రీమ్ పంచారు. ఇది ‘సృష్టిం’చినది కాదు. ప్రక్కనే ఉన్న జాయ్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ యజమాని ఇచ్చిన కానుక. వారు బాబాగారి శిష్యులు. ఒక ఐస్ క్రీమ్‌ను బాబా గారే స్వయంగా నాకు ఇవ్వడానికి ప్రయత్నించారు. “వద్దు స్వామీజీ, నేను తినేలేదు” అని తెలుగులో చెప్పాను. “మీకి తెలుగు వస్తుందా” అన్నారు. “ఔను స్వామీజీ. నా మాతృభాష తెలుగే” అన్నాను. “ఔనా” అన్నారు. ఈ భగవంతునికి, సర్వజ్ఞునికి నా మాతృభాష తెలుగు అని తెలియలేదు అంటే నాకు మొదటినుండీ ఉన్న అనుమానాలకు పుష్టి లభించింది.

ఈ సందర్భంలో వారు నాకు ఏమైనా ‘సృష్టి’ చేసి ఇస్తారేమోనని నిరీక్షించాను. నా ప్రసంగం విన్న తరువాత నాలాంటి అనర్హుడికి వస్తువును సృష్టించి ఇవ్వడం వ్యర్థం అని అనుకొని ఉండవచ్చు. ఏమైనా ఒక వస్తువును సృష్టించి నాకు ఇచ్చివుంటే దానిని నా అరచేతిలో పెట్టుకుని ఈ మీ వస్తువును ఇప్పుడు మాయం చేయండి అని బాబాగారిని అడగాలని అనుకున్నాను. సృష్టించే శక్తి ఉన్నవారికి మాయం చేస్తే శక్తి కూడా ఉండాలి. బాబాగారు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. నన్ను పిలిపించిన ఉద్దేశం, లెక్కాచారం అంతా తలక్రిందలయ్యింది. బాబాగారి కొన్ని కార్యకలాపాలను జాగ్రత్తగా గమనిస్తే కొన్ని అంశాలు ఎత్తి కనిపిస్తాయి. ముఖ్యంగా వారు ఉన్నతస్థానంలో ఉన్న వారిని తమ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నన్నూ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమయ్యింది. నేను గట్టి పిండాన్ని అని తరువాత తెలిసింది.

కార్యక్రమం ముగిసిన తరువాత నన్ను ఆహ్వానించమని సలహా ఇచ్చిన గోకాక్ గారిని మందలించారట. గోకాక్ గారు ఎలా సమర్థించుకున్నారో తెలియదు. సత్యసాయిబాబా గారితో జరిగిన నా ఈ సమావేశం గురించి సామాన్య ప్రజలకు తెలియదు.

రెండు సంవత్సరాల తరువాత మహిమలు, మూఢనమ్మకాల వ్యతిరేకంగా దాడి చేయడానికి నా అధ్యక్షతన ఒక సంఘం ఏర్పాటయింది. అది నిర్వహించిన కార్యక్రమాలను తరువాతి అధ్యాయంలో వ్రాశాను.

(సశేషం)

Exit mobile version