‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -23

1
1

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

మహామస్తకాభిషేకం

1984వ సంవత్సరంలో శ్రావణబెళగొళలో ఉన్న గోమఠేశ్వరునికి మహామస్తకాభిషేకం జరిగింది. లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి. తనకు ఏ ఉడుపులూ వద్దని అన్నింటినీ త్యాగం చేసి పిల్లవాడిలా నిలబడిన గోమఠేశ్వరుని తలపై వేలాది లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి గుమ్మరించడం ఏ దృష్టిలోను సరికాదని వాదించాను. దేశంలో పాలు, నెయ్యి సంగతి అలా ఉంచి మజ్జిగ కూడా చూడని పిల్లలు లక్షలాది మంది ఉన్నప్పుడు ఆ అమూల్యమైన వస్తువులను వృథా చేయడం ఏ కారణం వల్లనైనా యోగ్యం కాదని ఆగ్రహపూర్వకంగా తెలిపాను. మంత్రులు శాంతచిత్తులై విన్నారు. తమ దుర్బలమైన వాదనతో ఈ చర్చకు తెరదింపారు.

సెలవు దినాలు

సంస్థలకు ఇచ్చే ప్రభుత్వ సెలవు దినాలను పునర్విమర్శించడానికి ఒక కమిటీని నియమించారు. దానిలో ప్రొఫెసర్ రూబెన్, నేను, మరియొక సభ్యుడు ఉన్నాము. మేము కూలంకషంగా పరిశీలించి ఆగష్టు 15 స్వాతంత్ర్య దినం, నవంబర్ 1 రాష్ట్రావతరణ దినం, జనవరి 26 గణతంత్ర దినం ఇలా మూడు రోజులను మాత్రం సార్వత్రిక సెలవులుగా ఘోషించాలని సిఫారసు చేశాము. గాంధీ జయంతికి కూడా సార్వత్రిక సెలవును ప్రకటించరాదని అభిప్రాయ పడ్డాము. వ్యక్తుల పేరుతో సెలవు ఇచ్చే పద్ధతి ఇలా మొదలైతే చాలా మంది వ్యక్తుల పేరుమీద సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తులు రావచ్చు. ఇప్పుడు జరుగుతున్నదే అదే. అయితే ఈ మూడు సెలవు రోజులతో పాటు 8-10 సెలవులను సంస్థల వివేచనకు వదిలి వేయవచ్చు. ఆయా సంస్థకు ఎప్పుడు సెలవు కాలవసి వస్తుందో ఆ రోజు సెలవు ప్రకటించవచ్చు. ఈ ఏకగ్రీవ సిఫారసు నివేదిక ఇంకా వెలుగు చూడలేదు.

ఒకసారి సెక్యూలరిజం విషయం సభలో ప్రస్తావనకు వచ్చింది. సెక్యూలరిజం అనే పదం ప్రభుత్వ నడవడికకు ఎక్కువగా అన్వయిస్తుంది. అయితే ఆ పదాన్ని అందరూ తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ధర్మం పట్ల తటస్థవైఖరి కలిగి ఉండాలి. ప్రభుత్వానికీ, ధర్మానికీ ఎలాంటి సంబంధమూ లేదు అనేదే సరియైన అర్థం. దీనిని నేను విడమరిచి సభలో చెప్పాను. ప్రభుత్వం అన్ని ధర్మాలకు సమాన గౌరవాన్ని చూపాలి అనే దృష్టితోనే అన్ని ధార్మిక సెలవులను ఇస్తూ ఉన్నది. ప్రభుత్వ ఉన్నతాధికారులు పక్షపాతం లేకుండా అన్ని ధార్మిక స్థలాలనూ సందర్శిస్తారు. ధర్మాన్ని, రాజకీయాలను ఎప్పటికీ మిళితం చేయకూడదు. అలా కలిపితే అదొక పెద్ద స్ఫోటక వస్తువై దాని నుండి ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇక్కడ ధర్మం అంటే సాంప్రదాయక ధర్మం అని అర్థం. నీతి, నడత, నిజాయితీ కాదు.

వానలకోసం వ్యర్థమైన ప్రార్థన

1985వ సంవత్సరంలో బెంగళూరుకు నీటి కరువు వచ్చింది. బెంగళూరు ప్రజల నీటి అవసరాలను తీర్చే తిప్పగొండనహళ్ళి చెరువు ఎండిపోయే స్థితికి వచ్చింది. నీటి కోసం హాహాకారాలు మొదలయ్యాయి. ప్రభుత్వానికీ, బెంగళూరు జలమండలికీ దిక్కుతోచలేదు. చివరకు నిస్సహాయులై శ్రీ శివబాలయోగిని శరణు జొచ్చారు. వెనుక ఎప్పుడో ఇలాంటి సందర్భంలో ఏదో గ్రామంలో తమ తపస్సు ప్రభావంతో, ప్రార్థనతో వానలు కురిపించారట. ఇలాంటి కట్టుకథలకు ప్రచారం త్వరగా లభిస్తుంది. పైగా ప్రజలలో ఒకరి నుండి ఒకరికి త్వరగా వ్యాపిస్తుంది. దాని ఆధారంపై శ్రీ శివబాలయోగిగారిని ప్రభుత్వం మరియు జలమండలి ఆహ్వానించింది. నేను తీవ్రంగా ప్రతిఘటించాను. ప్రభుత్వం ఇలాంటి అశాస్త్రీయ నమ్మకాలకు పుష్టిని ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని రాజ్యాంగ నియమాలను వారి దృష్టికి తెచ్చాను. “శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక విధి.” ఇది ప్రజల ప్రాథమిక కర్తవ్యాలలో ఒకటి. ముఖ్యమంత్రిగారికి వ్రాసిన లేఖ ప్రతులను మంత్రులందరికీ పంపాను. అన్ని పత్రికలకూ వ్రాశాను. ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యను సభలో తీవ్రంగా ప్రతిఘటించాను. అప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రిగారైన శ్రీ ఎ.లక్ష్మీ సాగర్ గారికీ నాకూ సభలో జోరుగా వాదప్రతివాదాలు జరిగాయి. ప్రభుత్వ చర్యను సమర్థించుకోవడానికి వారు బలహీనమైన వాదనను సభ ముందు పెట్టారు. ముఖ్యమంత్రిగారైన శ్రీ రామకృష్ణ హెగ్డే దీని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. పత్రికలలో బలమైన వాద ప్రతివాదాలు నడిచాయి. ప్రభుత్వం ఇంత జరిగినా తన ప్రయత్నాన్ని వదులుకోలేదు.

1985వ సంవత్సరం మే 30 వ తేదీ. దూరదర్శన్, పత్రికలు ఇతర మీడియా, కొందరు భక్తులు ప్రభుత్వ అధికారులతో కలిసి తిప్పగొండనహళ్ళి చెరువు దగ్గరకు వెళ్ళారు. దాని గురించి మే 31వతేదీ ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కొన్ని భాగాలను క్రింద వ్రాస్తున్నాను. – శిష్యుల సామూహిక భజన, అరుపులు, భావావేశంతో పూనకం వచ్చినట్లు గంతులు; అంతలో లిమోసిన్ కారులో యోగిగారి ఆగమనం. వాహనం నుండి దింపడానికి శిష్యులు సహాయం చేశారు. వారు దిగి పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెట్టారు. శిష్యులు మునుపటిలాగే అరుచుకుంటూ గెంతులు వేయసాగారు. మధ్యాహ్నం 2.40 గంటలకు యోగి గారు కళ్ళు తెరిచి, ఇంకొక నెలలో తిప్పగొండనహళ్ళి చెరువు నిండి తొణికిసలాడుతుందని జోస్యం చెప్పారు. ఈ ఒక నెల వారు తమ ఆశ్రమంలో వానకోసం ప్రార్థన చేస్తానని చెప్పారు. “డా.హెచ్.నరసింహయ్యగారి వ్యతిరేకత పట్ల మీరేమి చెబుతారు?” అని పాత్రికేయులు అడిగినప్పుడు యోగిగారు “వందలమంది శాసకులు ఉండవచ్చు, ఉపకులపతులు ఉండవచ్చు. అయితే యోగి మాత్రేం ఒక్కడే. నరసింహయ్య తలపొగరు ప్రశ్నలకు నేను జవాబివ్వను” అన్నారు.

మరుసటిరోజు ఉదయం వార్తా పత్రికలను చదివి నాకు ఆందోళన కలిగింది. ఒక నెల వ్యవధి. అదీ జూన్ నెల. అప్పుడు వర్షం పడే సూచనలూ ఉన్నాయి. అకస్మాత్తు వర్షం పడితే యోగిగారు దేవునితో సమానం లేక దేవుడే అయిపోతారు. అయితే ఆ ఒక్క నెల వర్షం పడకపొతే యోగిగారికేమో ఓటమి అవుతుంది. కానీ బెంగళూరు ప్రజలు నీటి కొరతవల్ల అవస్థలు పడతారు. మానవతాదృష్టితో వర్షం పడాలి. అయితే యోగిగారి డొల్లతనం బయటపడాల్సిన దృష్టితో వర్షం పడకూడదు. ఇలా ఒక నెల నా మనసు ధర్మసంకటంలో చిక్కి డోలాయమాన స్థితిలో ఉంది. రోజూ సాయంత్రం ఆకాశం వైపు చూడడటం, మేఘాలు కనిపిస్తే సంతోషం కంటే ఎక్కువ ఆందోళన చెందడం పరిపాటి అయిపోయింది. ఒక రోజు సాయంత్రం మేఘాలు కనిపించాయి. స్నేహితుని కలవడానికి గొడుగును తీసుకుని పోతున్నాను. బసవనగుడి నెట్టకల్లప్ప సర్కిల్ దగ్గర ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. పెద్దగా చదువుకున్న వారిలా కనిపించలేదు. “నమస్కారం సార్, గొడుగు తీసుకుని వెళుతున్నారే?” అని నవ్వుతూ ప్రశ్నించారు. “ఏమో అప్పా, ఏ యోగి ఎక్కడ తపస్సు చేస్తున్నారో, చెప్పడానికి కాదు. వారి తపస్సు ప్రభావంతో వర్షం పడవచ్చేమో అని గొడుగు తీసుకుని వెళుతున్నాను” అన్నాను. వారు యోగిని చాలా కటువుగా విమర్శిస్తూ ఇలాంటి వారి వలనే వచ్చే వర్షాలు నిలిచిపోతున్నాయి అని చెప్పి నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు.

నిర్ణీత గడువు జూన్ 30వ తేదీ వచ్చింది. అంతవరకూ అక్షరాలా ఒక్క చుక్క వానా కురియలేదు. “నీళ్ళు లేని చెరువులో యోగిగారు మట్టి కరిచారు” అనే శీర్షికతో వ్రాసిన లేఖ దినపత్రికలలో ప్రచురింపబడింది. శాస్త్రీయ దృక్పథానికి విజయం లభించింది. నిర్హేతుకమైన నమ్మకాల వేర్లు కదిలాయి.

సమాజ సేవ

ఒకసారి సమాజ సేవ గురించి చర్చ నడిచింది. సమాజసేవను అర్థవంతంగా ఆచరించాలంటే అందరు మంత్రులకూ, శాసనసభ్యులకూ అతి తక్కువ సౌకర్యాలున్న మారుమూల గ్రామాలలో నాలుగైదు రోజుల సమాజసేవా శిబిరాన్ని నడపాలని, ఆ శిబిరంలో సమాజ ప్రగతికి సంబంధించిన విషయాలను సావకాశంగా చర్చించాలని చెప్పాను. నా మాటలను అందరూ ధ్యాస పెట్టి విన్నారు. “అలాంటి గ్రామంలో నడిచే సమాజసేవా శిబిరానికి మీరొక్కరే వెళ్ళాల్సి ఉంటుంది” అని నవ్వుతూ మంత్రిగారు చెప్పారు. చాలామంది శాసనసభ్యుల ముఖాలు ఆ జవాబుకు సమ్మతిని తెలిపినట్లు కనిపించాయి.

చిన్న పల్లెలో సమాజసేవా శిబిరాన్ని నడపాలని నేను చెప్పినందుకు ఒక కారణముంది. నేను ఉపకులపతిగా ఉన్నప్పుడు ఒక ప్రఖ్యాత ధనిక సేవా సంస్థ తన సమాజ సేవా కార్యక్రమాల ప్రారంభం చేయడానికి నన్ను ఆహ్వానించింది. అది నడిచింది బెంగళూరు లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో. అయినా వారి ఆహ్వానాన్ని ఒప్పుకుని వెళ్ళాను. అలాంటి కార్యక్రమాన్ని ఫైవ్ స్టార్ హోటల్లో నడపడం సమంజసం కాదని వారికి మనసుకు తాకేలా చెప్పాను. ఏదైనా ఒక మురికివాడ సమీపంలో ఉన్న పాఠశాలలో నడపాలని సూచించాను. ఎందుకప్పా వీరిని పిలిచాము అని అనుకొని ఉండవచ్చు.

సూర్యగ్రహణం

1980లో దక్షిణ భారతదేశంలో, బెంగళూరులో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సూర్యుడు ‘మాయ’మై బెంగళూరు చీకటిలో మునిగిపోయింది. మా కాలేజీకి చాలా దగ్గరగా ఎప్పుడూ జనసంచారంతో నిండి ఉండే గాంధీ బజార్ ఉంది. ఆ సమయంలో గాంధీ బజార్ ఎలావుందో చూద్దామనే కుతూహలంతో అక్కడికి వెళ్ళాను. పోతూవున్నప్పుడే తెలిసింది అది ఎలా ఉంటుందో. అప్పుడు ఎక్కడ కావాలన్నా నిర్భయంగా నిలబడవచ్చు. జనాలు లేరు. వాహనాలు లేవు. ఏ దిక్కు చూచినా ఒక్క నరమానవుడు కనిపించలేదు. అలాగే కొన్ని నిమిషాలు ఆలోచిస్తూ ఉన్నాను. సూర్యుడు చిన్నగా మారి సంపూర్ణ సూర్యగ్రహణమైనప్పుడు పూర్తిగా మాయమై పోయాడు. మిట్ట మధ్యాహ్నం అమావాస్య చీకటి! ఏదో ప్రాణి సూర్యుని నిదానంగా మ్రింగడానికి ప్రయత్నించి జీర్ణించుకోలేక సూర్యుడు నిదానంగా ఆ ప్రాణి నోటి నుండి బయటకు వచ్చినట్లు ఆదిమానవుడు అర్థం చేసుకున్నాడు. అలా మొదలయ్యింది రాహు కేతువుల కల్పన. ఈ ఘటన నుండి ఆదిమానవుడు సహజంగానే భయభ్రాంతుడై గుహలో దాక్కొన్నాడు. సూర్యునికి ఆ ప్రాణి నుండి విడుదల లభించి యథాస్థితికి వచ్చిన తరువాత నెమ్మదిగా నిట్టూరుస్తూ తాను దాగిన స్థలం నుండి బయటకు వచ్చేవాడు. ఇప్పుడు మనం వైజ్ఞానిక యుగంలో ఉన్నాము. గ్రహణాలు సంభవించే విధానం హైస్కూలు విద్యార్థులందరికీ తెలుసు. అయినా గ్రహణం పట్టిన రోజు ఆ ఆదిమానవుడు ఏమి చేసేవాడో ఈ ఆధునిక మానవుడూ కొంచెం అటూ ఇటూ అదే చేస్తున్నాడు. ఆదిమానవుడు గుహలో దాక్కొనేవాడు. ఈ ఆధునిక మానవుడు వంటింట్లో, బచ్చలి ఇంట్లో దాక్కొంటున్నాడు. అంతే తేడా. అయితే ఒక చక్కని విషయం ఏమిటంటే ఆ రోజు గాంధీబజారులో పశువులు, కుక్కలు ఎప్పటిలానే హాయిగా సంచరిస్తున్నాయి. మనకన్నా అవే మేలు అనుకున్నాను. గ్రహణాల గురించి రెండు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్న సిద్ధాంతాలను మనం అలవరచుకున్నాము. ఒక సిద్ధాంతం తరగతులలో చెప్పుకోవడానికి. ఇది వైజ్ఞానిక సిద్ధాంతం. మరొకటి ఇళ్ళలో ఆచరించడానికి. ఇది పూర్తిగా అశాస్త్రీయం. మనకు విజ్ఞానం జీవనోపాధికి మార్గమయ్యిందే కానీ జీవితధర్మం కాలేదు.

అప్పుడు విధాన పరిషత్ సమావేశాలు జరుగుతున్నాయి. సంపూర్ణ సూర్యగ్రహణం అయిన మూడవరోజు పరిషత్‌లో దీని గురించి ప్రశ్నలను అడిగాను. సెలవు ఇవ్వడానికి, ప్రభుత్వ బస్సులను నడపకపోవడానికి కారణాలను అడిగాను. నా ప్రశ్నలను అందరూ నవ్వుతూ విన్నారు. మంత్రిగారు పైపైన సమాధానం చెప్పారు. విద్యావంతుడైన మూఢనమ్మకస్తుడు విద్యాహీనుడైన మూఢనమ్మకస్తుని కంటే ఎక్కువ అపాయకారి.

సరసం – విరసం

శాసనసభలలోని కార్యకలాపాలను, ఆరోపణ ప్రత్యారోపణలను, సభ నుండి వాక్ ఔట్ చేయడాన్ని పత్రికలలో చదివితే భయం వేస్తుంది. పాలక పక్షం మరియు విపక్షాలు ఆజన్మ శత్రువులేమో అనిపిస్తుంది. నిజమే ఒక్కొక్కసారి ఆవేశపూరితంగా మాట్లాడుతారు. అయితే అనేక సందర్భాలలో స్నేహితులలాగా ఆత్మీయంగా ఉంటారు. కావలసినప్పుడు ప్రతిపక్షాల సభ్యులు పాలకపక్ష సభ్యుల ప్రక్కన కూర్చుని మాట్లాడటం మామూలే. అయితే అదే ప్రతిపక్ష సభ్యులు భావావేశంతో అరవడం, వాక్ ఔట్ చేయడం ఎంత సామాన్యం అంటే సభ్యులు బయటకు వెళుతున్నప్పుడు కొందరు పాలకపక్షం సభ్యులు నవ్వుతూ “పోయి వెంటనే వచ్చేయండి” అని పెద్దవాళ్ళు చిన్నవారిని ఆశీర్వదించి పంపుతున్నట్లుగా వీడ్కోలు చెబుతారు. వెళ్ళేవారిలో కొందరు నవ్వుతూనే వెళతారు. వాక్ ఔట్ తంతు ముగించి కొన్ని నిముషాలలోనే చాలా సార్లు తిరిగి వస్తారు.

విషయాలపై చర్చ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి విపరీతమైన కాక రేగుతుంది. అప్పుడు అవాచ్య పదాలనూ, Unparliamentary పదాలనూ సంయమనం కోల్పోయి ఉపయోగించడం అరుదేమీ కాదు. అప్పుడు ఇలాంటి పదాలను ఉపయోగించడం సరైనదో, కాదో అనే దానిపై ఉపచర్చ మొదలౌతుంది. అనుమానం లేకుంటే సభాపతి అక్కడే తీర్మానం చెబుతారు. అనుమానం ఉంటే, తమ తీర్మానాన్ని వాయిదా వేస్తారు. ఇలాంటి పదప్రయోగాలలో ఒక విచిత్రాన్ని తెల్సుకున్నాను. ‘అబద్ధం’ అనే పదాన్ని వాడరాదు. అది శుద్ధ Unparliamentary. అయితే ‘అబద్ధం’ అనే పదానికి బదులుగా ‘సత్య దూరం’ అని మాట్లాడటం శుద్ధ Parliamentary. సత్యానికి ఎంత దూరమైతే అబద్ధమౌతుందో ఎవరికీ తెలియదు!

వరండా వాకింగ్

ఒకసారి అధికారపక్షం మరియు ప్రతిపక్షాల మధ్య పోరు దీర్ఘకాలం నడుస్తూ ఉంది. ముందే చెప్పినట్లు నేను ఒక రోజూ రాజకీయ విషయాలను సభలో ప్రస్తావించలేదు. కూర్చుని కూర్చుని చాలా విసుగు వచ్చి సభ నుండి బయటకు వచ్చి వరండాలో వాకింగ్ చేసేవాణ్ణి. ఒకసారి వరండాను చుట్టివేస్తే అర్ధ కిలోమీటర్ కన్నా ఎక్కువ అవుతుంది. ఇలా వీలున్నప్పుడంతా సభ నుండి బయటకు వచ్చి రెండు మూడు కి.మీ.లు చుట్టివేసేవాడిని. విధానసౌధను వాకింగుకు ఉపయోగించిన వాడిని ఇంతవరకూ నేను ఒక్కడినే కావచ్చు. దీన్ని జాగ్రత్తగా పరిశీలించిన, నాకు కొంచెం పరిచయం ఉన్న ఒక వ్యక్తి “ఏం సార్, ఇలా విధానసౌధను అశ్వత్థకట్టను చుట్టినట్లు చుట్టుతున్నారు. విధాన పరిషత్ సభ్యులై సభలో ఉండకుండా, మీ ఆరోగ్యానికై విధానసౌధను వాడుకుంటున్నారే” అని నవ్వుతూ అడిగారు. “సభలో కార్యకలాపాలు ఎందుకో బేజారు అవుతుందప్పా. ఊరికే అక్కడ కూర్చునే బదులు ఇలా వాకింగ్ చేస్తున్నాను. పైగా విధానసౌధ వరండా ఒక రకంగా వాకింగుకు మంచి స్థలం” అని వారికి సంజాయిషీ ఇచ్చుకున్నాను.

మా సభకు వెళ్ళాలంటే మెట్లు ఎక్కి వెళ్ళేవాడిని. లిఫ్ట్ ఉపయోగించేవాడిని కాదు. ఎప్పుడూ ఉపయోగించిన జ్ఞాపకం లేదు. అన్నిచోట్లా సామాన్యంగా లిఫ్ట్ పక్కనే మెట్లు ఉంటాయి. నేను మెట్లు ఎక్కి వెళ్ళేటప్పుడు ఆ లిఫ్ట్ కోసం వేచివున్న జనాలను చూస్తే చాలా బేజారవుతుంది. లిఫ్ట్ ఉన్నది వృద్ధుల కోసం, బి.పి. ఉన్నవారి కోసం, ఇంకా ఏ ఇతర కారణాల వల్ల మిద్దె ఎక్కడం సాధ్యం కానివారి కోసం. అయితే యువకులు, మధ్యవయస్కులు, బలాఢ్యులు లిఫ్ట్ కోసం ఎదురుచూడటం న్యాయం కాదు. నేను మెట్లు ఎక్కుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ ‘క్యూ’లో నిలబడిన నా పరిచయస్థులు “రండి రండి సార్, ఎందుకు మెట్లెక్కుతున్నారు. ఇదిగో లిఫ్ట్ వచ్చేస్తోంది” అని కనికరంతో ఆహ్వానించేవారు. “వద్దప్పా నాకింకా చేతులూ కాళ్ళూ గట్టిగా ఉన్నాయి” అని చెప్పి ఎక్కే పనిని కొనసాగించేవాణ్ణి. నడిచే అవకాశం ఉన్నప్పుడు నడవాలి. అలాగే మెట్లు ఎక్కాలి. ఈ వైఖరి పట్టణాల నుండి పల్లెలకూ వ్యాపించింది. ఎన్నోసార్లు పల్లెలలో ఒక కి.మీ. దూరానికీ బస్సుకోసం వేచి ఉండడం, ఆటో రిక్షా (సౌకర్యం ఉన్నచోట) కోసం వేచి ఉండడం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాట్లను విద్యార్థులకు నేర్పించడం విద్య యొక్క, ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం.

మలం పడే సంఘటన పరీక్ష

9-3-1981 ‘ప్రజావాణి’ పత్రికలో ‘అసహ్య అలౌకిక గోడు’ అనే శీర్షికతో ఒక వార్త ప్రచురింపబడింది. ఆ వార్త ప్రకారం మాగడికి సుమారు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న హుచ్చ హనుమేగౌడ పాళ్యలో ఒకరి ఇంటిలో 11 సంవత్సరాల ఆడపిల్ల తలమీద, ముఖంపైన, భోజనం చేసేటప్పుడు కంచం పక్కన మలం పడుతున్నదనీ, అంతే కాకుండా ఆ యింట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లల మీద ఇంకా ఇంటిలోని కొన్ని భాగాలలో ఇలాగే పదే పదే మలం పడుతూ ఆ ఇంట్లో ఉన్నవారికంతా చాలా అసహ్యకరమైన అవస్థలు కలుగుతున్నాయని తెలిసింది.

ఈ వార్తను 10-3-1981 నాడు కర్ణాటక విధాన పరిషత్తు దృష్టికి ప్రతిపక్ష నాయకుడైన శ్రీ చంద్రేగౌడుగారు తెచ్చి ఈ ఘటనను బాణామతి పరిశీలనా కమిటీ పరీక్షించాలని సలహా ఇచ్చారు. ఈ సలహాను పరిషత్తులోని అధికారపక్షం నాయకులూ అంగీకరించి బాణామతి కమిటీ త్వరగా పరీక్షించాలని సూచించారు. దానిని సభ అంగీకరించింది. బాణామతి కమిటీకి నేనే అధ్యక్షుణ్ణి.

ఈ సలహా మేరకు ‘బాణామతి కమిటీ’ అందరు సభ్యులు ఇంకా ముగ్గురు వైద్యులు 12-3-1981వ తేదీన ఆ పల్లెను సందర్శించాము. ఆరోజు ఉదయం బెంగళూరి నుండి బయలుదేరి సుమారు 10.30కు ఆ పల్లెకు చేరుకున్నాము. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ ఘటనకు కేంద్రబిందువైన ఆ పిల్ల మరియు మిగిలినవారితో నిలకడగా విచారించి కళ్ళలో కళ్ళు పెట్టుకుని అంతా చూస్తూ ఉన్నాము. ఆ ఆడపిల్ల తండ్రి, తల్లి ఇంకా మిగిలిన వారితో వీలైనంత సమాచారం సేకరించాము. మేము ఉన్న సుమారు రెండున్నర గంటల వ్యవధిలో ఆ ఆడపిల్ల తలపై గానీ, లేదా ఆ పిల్ల సమీపంలో ఉన్న పిల్లలపై కానీ, ఇంటిలో కానీ మలం పడలేదు. ఈ ఘటనలో ఎలాంటి అలౌకికశక్తుల మహిమలు లేవని ఆ అమ్మాయిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సస్ ఆసుపత్రిలో దీర్ఘకాల పరీక్షలకు పంపాలని సూచించాము. కాకతాళీయంగా మా సందర్శన తరువాత మలం పడే ఘటన మళ్ళీ జరగలేదు. అలాగే నిలిచిపోయింది.

ఇలా ఎన్నో ఘటనలు పరీక్షలకు గురి అయ్యాక వాటి రంగు బట్టబయలు అవుతుంది. ఇందులో ఒక అంశాన్ని మనం ముఖ్యంగా గమనించాలి. పడుతున్న వస్తువు ఆ అమ్మాయి శరీరంలోనే ఉంది. దానికి బయటున్న ఏ వస్తువూ ఉదాహరణకు పాయసమో లేదా గట్టి గంజో లేదా ఇంకా అటువంటి ఏ వస్తువయినా పడటంలేదు. అందువల్ల అది ఆ అమ్మాయి మిగిలినవారి కళ్ళుగప్పి చేస్తున్న ఒక అసహ్యకరమైన పని అంతే.

సాహెబు గడ్డం

ఒక రోజు సభలో ఒక సరసమైన విషయంపై చర్చ మొదలయ్యింది. రాష్ట్రంలోని ఒక జిల్లాలో ఉన్నత పోలీసు అధికారులు ముస్లిం పోలీసులను కవాతు, పెరేడ్ మొదలైన కార్యక్రమాలలో గడ్డంతో పాల్గొనడాన్ని నిషేధించారు. గడ్డం పెంచుకోవడం ఇస్లాం ధర్మం పద్ధతి అని, అందువల్ల ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని ఒక ముస్లిం సభ్యుడు వాదించారు. దీనిపై చర్చ నడుస్తూవుంది. నేను మధ్యలో ప్రవేశించి “పోలీసు ఉద్యోగంలో చేరినవారు ఎవరైనా కానీ పోలీసు చట్టాన్ని (Police Code) పాటించాలని, తమ తమ ధార్మిక చట్టాలను(Religious codes) అనుసరించకూడదని, ధార్మిక నమ్మకాలన్నీ ఇంటిలో ఉండాలి కానీ ఇలాంటి సార్వజనిక క్షేత్రంలో ఉండరాదు” అని బలంగా వాదించాను. చర్చను కొనసాగించి “ఎవరినీ పోలీస్ డిపార్ట్మెంటులో బలవంతంగా చేర్చుకోలేదు. స్వచ్ఛందంగా, ఇష్టం ఉన్నవారు వచ్చి చేరుతారు. ఎవరికైనా తమ ధార్మిక విధులే ఎక్కువ అనిపిస్తే అటువంటివారు పోలీసు విభాగంలో చేరాల్సిన అవసరం లేదు. ధార్మిక విధులను పోలీసు విభాగంపై రుద్దడం ఏ విధంగానూ మంచిది కాదు” అన్నాను.

వెంటనే శ్రీ ఎ.కె.సుబ్బయ్యగారు లేచి నిలబడి “తమ తమ ధార్మిక విధులను పోలీసు శాఖలో అనుసరించడానికి అవకాశం ఇస్తే రేపు ఒక దిగంబర జైన్ పోలీస్ శాఖలో చేరి తన ధార్మిక విధులను అనుసరించడానికి అవకాశం కల్పించాలని ఒత్తిడి తెస్తే ఏమి గతి?” అన్నారు. సభ మొత్తం నవ్వులతో నిండింది. నేను కూడా మనస్ఫూర్తిగా నవ్వి “సుబ్బయ్యగారూ, నేను సీరియస్ విషయం మాట్లాడుతోంటే మీరు తమాషా చేస్తున్నారు కదా” అన్నాను. దానికి వారు “లేదు నరసింహయ్యగారూ, మీ వాదనను నేను పూర్తిగా సమర్థిస్తాను. మీ వాదం అందరికీ అర్థం కావాలని ఉదాహరణ ఇచ్చాను” అని నవ్వుతూ చెప్పారు. చర్చ అక్కడికి ముగిసింది.

కృతజ్ఞత

ఆరు సంవత్సరాల వ్యవధిలో సభా కార్యకలాపాలలో నాకు సంబంధించిన ముఖ్యవిషయాలను మాత్రం పేర్కొన్నాను. ప్రతిపక్షాల బాయ్‌కాట్‌లో కానీ, సభాపతి ముందు ఉండే వెల్‌లో ప్రతిపక్షాలు చేసే ధర్నాలో కానీ నేను ఎప్పుడూ పాల్గొనలేదు. రాజకీయ విషయాలను నేను ఎప్పుడూ సభలో మాట్లాడలేదు. నేను, నా విద్య నా సైన్సు అంతే. మొత్తం మీద ఇదొక కొత్త అనుభవం.

ఆరు సంవత్సరాల వ్యవధి ముగిసిన రోజు నేను పరిషత్తుకు నన్ను నామినేట్ చేయబడటానికి కారణమైన శ్రీ ఆర్.గుండూరావుగారికి (అప్పుడు మాజీ ముఖ్యమంత్రి) కృతజ్ఞతా పూర్వకమైన ఒక లేఖను వ్రాశాను. “చూడండి నరసింహయ్యగారు నా సహాయాన్ని మరవకుండా ఎంత మంచి ఉత్తరం వ్రాశారు. వారు స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగడానికి నిర్ణయించుకున్నప్పుడు నాకు కోపం వచ్చింది. అయితే వారు నిజాయితీగా వారి విధులను విద్య, వైజ్ఞానిక విషయాలకే పరిమితం చేశారు. నేను ఎంతోమందికి సహాయం చేశాను. లాభం పొందిన తరువాత నా వైపు తిరిగి కూడా చూడరు. అయితే నరసింహయ్యగారి ఈ పద్ధతి నాకు సంతోషాన్ని కలిగిస్తోంది” అనే విధంగా నా గురించి వారి స్నేహితులు, మాజీ లోక్ సభ సభ్యులు అయిన శ్రీ ప్రసన్నకుమార్ గారితో పొగుడుతూ చెప్పారట.

కొన్ని ఉపాఖ్యానాలు

మీకు సావిత్రి లేదు

1994వ సంవత్సరం ఆగష్టు నెలలో మాదే అయిన ‘బెంగళూరు లలిత కళా పరిషత్’ ఆధ్వర్యంలో, జయనగర్ నేషనల్ కాలేజీలో ఉన్న కళాక్షేత్రంలో 10 రోజుల కు.వెం.పు. నాటకోత్సవాలను విజయవంతంగా నడిపాము. ఈ నాటకోత్సవంలో మొత్తం కు.వెం.పు. గారి 14 నాటకాలు ఉన్నాయి. వాటిలో ‘యమన సోలు (యముడి ఓటమి)’ ఒకటి. నా తాలూకా గౌరీబిదనూరు నాటక సమాజం ‘యమన సోలు’ను బాగా ప్రదర్శించింది. నాటకం ముగిసిన తరువాత అవే వేషాలతో ఆ నాటక సమాజం నాతో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని ఇష్టపడింది. సరే అన్నాను. మేమంతా నిలుచున్నాము. కిరీటం, గధ ధరించిన యముడు నా పక్కకు వచ్చి నిలబడ్డాడు. “అయ్యో పోప్పా, ఇంత తొందరగా నా సమీపానికి ఎందుకు వస్తున్నావు. నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. తరువాత రా” అన్నాను. “లేదు సార్, నేను మీ పక్కనే నిలుచోవాలి” అన్నాడు. “అయ్యో భగవంతుడా. పోనీ నిలుచో అప్పా. అయితే సత్యవంతుని కాపాడినట్లు నన్ను కాపాడాలి” అన్నాను. “లేదు సార్, అదంతా కుదరని పని. మీకు సావిత్రి లేదు” అన్నాడు. ఫోటోకు నిలుచున్న వారంతా మా సంభాషణ విని పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. తరువాత అందరూ గంభీరంగా నిలబడి ఫోటో దిగడానికి రెండు నిముషాలు పట్టింది. ఆ యముడి సమయస్ఫూర్తిని మేమంతా మెచ్చుకున్నాము.

మంగళహారతి

మంగళహారతి తీసుకొనవలసిన అవసరం ఎక్కడైనా వస్తే దక్షిణ తప్పకుండా వేస్తాను. ఐతే మంగళహారతి వైపు ఎక్కువ ధ్యాసపెట్టను. అది రామోత్సవపు సంగీతకార్యక్రమం కావచ్చు, మా పాఠశాల, కళాశాలల గణేశోత్సవం, గీతాజయంతి లేదా ఇంకే ఇటువంటి కార్యక్రమాలు కావచ్చు. దీనిని సూక్ష్మంగా పరిశీలించిన ఒకరిద్దరు “మీరు దక్షిణ వేస్తారు కానీ హారతి తీసుకోరు అనిపిస్తుంది. ఎందుకు?” అని అడిగారు. “దక్షిణ వేయడంలో అర్థం ఉంది. అయితే మంగళహారతి తీసుకోవడానికి అంత అర్థమేమీ లేదు” అన్నాను.

ఒక రోజు మా కాలేజీలో పెట్టిన గణేశుడి నిమజ్జన కార్యక్రమం. నన్ను ఆహ్వానించారు. వెళ్ళాను. గణేశుని ముందు ఉన్న అధ్యాపకులలో కొందరు నన్ను చూసి నవ్వారు. “నేను సంస్థ అధ్యక్షుడిగా వచ్చాను అంతే” అన్నాను. “మేము మిమ్మల్ని ఆహ్వానించింది సంస్థ అధ్యక్షులు అనే” అని తిరుగుబాణం వదిలారు. మంగళహారతి వచ్చింది. నా ‘యథాప్రకారపు’ మంగళహారతిని ఆచరించాను. గణేశుడి ముందు ఒక చిన్న పిల్ల నిలబడి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నిజమైన భక్తితో కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిలబడి ఉంది. కొందరు అధ్యాపకులు ఆ పిల్ల భక్తిని సంతృప్తిగా గమనిస్తూ ఉన్నారు. “ఏమీ ఆలోచించకండి. ఈ పాప పెద్దదయ్యాక నా మాదిరిగా అవుతుంది” అన్నాను. ఒక ఉపాధ్యాయిని వెంటనే “అది ఆడపిల్ల సార్. మీ మాదిరిగా కావడానికి సాధ్యం కాదు” అన్నారు. అందరూ నవ్వారు. ఆడవారి ధార్మిక నమ్మకాలను మార్చడం కష్టం అని ఆవిడ చెప్పిన మాటలకు అర్థం. ఇది నిజం. స్త్రీలకు పురుషులకన్నా ధార్మిక నమ్మకాలపై ఎక్కువ శ్రద్ధ.

ఎలుక కొరికింది

అప్పటికి నేనింకా నేషనల్ కాలేజీ ఉపాధ్యాయుడిని. హాస్టల్లో పడుకుని ఉన్నాను. లేచినప్పుడు కాలు మడమ దగ్గర నొప్పి అనిపించింది. చూశాను. మడమ కొన్ని భాగాలను కొంచెం లోతుగా గీచుకుని పోయినట్లు ఉంది. మనకంతా తెలిసినట్లు మడమలకు దళసరి, మొరటు చర్మం ఉంటుంది. ఆ భాగం కొంచెం ఎర్రగా ఉండి నొప్పి అవుతోంది. ఎందుకు అలా అయ్యింది అని ఆలోచించిన తరువాత కారణం తెలిసింది. ఎదురుగా ఉన్న సెంట్రల్ ఫార్మసీకి వెళ్ళి అక్కడి వైద్యులైన డా.ఎం.ఎ.నరసింహాచార్ గారికి నా కాలును చూపాను. నొప్పి అని చెప్పాను. వారు ఆశ్చర్యంతో “ఇది అలా అయ్యింది” అని అడిగారు. “ఎలుక కొరికింది సార్” అన్నాను. “అప్పుడు మీరేమి చేస్తున్నారు” అన్నారు. “నిద్రపోతున్నాను” అన్నాను. “అప్పుడు మీకు మెలకువ కాలేదా” అడిగారు. “లేదు సార్, నాకు ఇది తెలిసింది ఉదయం లేచాక” అన్నాను. “ఇంతవరకూ ఇలాంటి కేస్ నా దగ్గరకు రానేలేదు. మీది కుంభకర్ణుని నిద్ర. చెడ్డ ఎలుకలూ ఉంటాయి. మంచివీ ఉంటాయి. ఒకటి రెండు రోజులు చూద్దాం. ఏమైనా రియాక్షన్ ఉంటే రండి. మందులు ఇస్తాను” అన్నారు. ఏ ప్రతిక్రియా కనిపించలేదు. ఎలుక మంచి వారిని కొరికితే ఏమీ కాదు!

అశాస్త్రీయపు చావు

సుమారు 20 సంవత్సరాల క్రితం నేను ఉపకులపతి అయినప్పుడు శ్రీ ఎం.మల్లికార్జున స్వామి గారు విద్యామంత్రిగా ఉన్నారు. వారు ఒకరోజు రాష్ట్రంలోని అందరు వైస్ ఛాన్స్‌లర్లతో, విద్యావిభాగం ఉన్నతాధికారులతో ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభ ప్రారంభం కాకముందు మంత్రిగారు వచ్చేవరకూ పిచ్చాపాటీ మాట్లాడుతున్నాము. ఆ మాటలలో ఆయుర్వేదం, ఆధునిక వైద్యం (అల్లోపతి) గురించిన ప్రస్తావన వచ్చింది. నేను అల్లోపతి అత్యంత వైజ్ఞానికంగా ప్రపంచమంతటా ఆమోదించిన వైద్య విధానం అని బలంగా ప్రతిపాదించాను. ఇంకొక ఉపకులపతిగారు ఆయుర్వేద వైద్యానికి బలంగా మద్దతు పలికారు. ఆయుర్వేదం శాస్త్రీయం కావాలంటే ఆ ఔషధం ఏ ఏ వస్తువులనుండి సంయోజిత (Composition) మయ్యిందని వైజ్ఞానికంగా తెలిసి ఉండాలి. అలాగే ఆ మందు తీసుకున్నప్పుడు దాని ప్రతిక్రియ (Reaction) ఏమి కావచ్చు అనేది వైజ్ఞానికంగా తెలిసి వుండాలి. పూర్వకాలంలో ఆయుర్వేదం ముందుండేది. తరువాత పరిశోధనలు జరగలేదు. పురోగమించలేదు. చరకుడు, శుశ్రుతుడు వారి కాలంలో వారి శస్త్రచికిత్స (Surgery) అప్పటికి అత్యంత ఆధునికమైనది. అయితే ఇప్పుడు దానిని ఉపయోగిస్తే అది హత్య (Butchery) అవుతుంది” ఈ విధంగా నా వాదన సాగింది. “అయితే మీ అలోపతిలో జనాలు చచ్చిపోరా?” అని ఆ ఉపకులపతి ప్రశ్నించారు. “మా అల్లోపతిలోనూ చస్తారు, మీ ఆయుర్వేదంలోనూ చస్తారు. అయితే మా అల్లోపతి చావు వైజ్ఞానిక చావు. ఎందుకు చచ్చారో చెప్పవచ్చు. మీ ఆయుర్వేదం చావు అశాస్త్రీయమైనది. ఎందుకు చచ్చారో చెప్పలేము” అన్నాను. అక్కడున్నవారంతా మనస్ఫూర్తిగా నవ్వారు.

డబ్బులున్నాయా?

ప్రతి తరగతివారూ సంవత్సరం చివరలో ఒక స్నేహ మిలన్ (Class socials) చేసుకోవడం ఆనవాయితీ. ఒక్కోసారి తరగతి గ్రూప్ ఫోటోను తీసుకుంటారు. సుమారు 45 సంవత్సరాల క్రితం ఒక సెక్షన్ గ్రూపు ఫోటోను తీయడానికి ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ జి.కె.వేల్ గారిని పిలవాలని తీర్మానించారు. ఆ సెక్షన్లోని ఎం.ఎస్.శ్రీనివాస్ అనే పిల్లవాడి జతలో ఎం.జి.రోడ్డులోని (అప్పుడు పెరేడ్ గ్రౌండ్) జి.కె.వేల్ స్టూడియోకు సైకిల్ మీద వెళ్ళాము.

శ్రీనివాస్ చాలా చిన్నపిల్లవాడు. నిక్కరు ధరిస్తాడు. ఆ దారిలో వెళుతున్నప్పుడు “టిఫిన్ ఇప్పించండి సార్” అని శ్రీనివాస్ అడిగాడు. “అయ్యో ఇక్కడంతా వద్దప్పా. నాకు ఇక్కడ పరిచయం లేదు. కాలేజీకి వెళదాము. అక్కడెక్కడైనా ఇప్పిస్తాను” అన్నాను. “రండి సార్. నాకు ఇక్కడ కొన్ని అంగళ్ళు తెలుసు. లేక్ వ్యూ లో ఐస్ క్రీమ్ ఇప్పించండి” అన్నాడు. సరేనప్పా అని ఆ అంగడికి వెళ్ళాము. ఒక సర్వర్ వచ్చి “ఏమి కావాలి” అడిగాడు. “నీవే చెప్పప్పా” అని శ్రీనివాస్‌కు చెప్పాను. శ్రీనివాస్ అదేదో ఒక రకమైన ఐస్ క్రీమ్ ఇవ్వండి అన్నాడు. ఆ సర్వర్ మమ్మల్నిద్దరినీ అదో రకంగా చూశాడు. శ్రీనివాస్ నిక్కరు తొడుక్కున్న చిన్న పిల్లవాడు. నేను పల్లెటూరి బైతులా కనిపిస్తూ ఆ అంగడికి దారి తప్పి వచ్చామని అతడు భావించి ఉండవచ్చు. అతడు మా ఇద్దరివైపూ చూసి “డబ్బులున్నాయా? నాలుగు రూపాయలు అవుతాయి” అని అన్నాడు. జి.కె.వేల్‌కు అడ్వాన్సుగా ఇవ్వాల్సిన డబ్బు జేబులో ఉంది. ఆ డబ్బును సర్వర్‌కు చూపించిన తరువాత ఐస్ క్రీమ్ ఇచ్చాడు.

“చూడప్పా శ్రీనివాస్. మనిద్దరి గురించి ఎలాంటి అనుమానం వచ్చింది. మన దగ్గర ఐదు రూపాయలు కూడా లేవు అనుకున్నాడు. ఇప్పుడు మంచి మంచి బట్టలు వేసుకున్న వాళ్ళదే కాలం అన్నట్లు ఉంది” అన్నాను. శ్రీనివాస్ ఇప్పుడు డా.ఎం.ఎస్.శ్రీనివాస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సీనియర్ ప్రొఫెసర్. ఎప్పుడైనా కనిపించినప్పుడు మా ఇద్దరి మధ్యా అదే అభిమానం. “లేక్ వ్యూ ఐస్ క్రీమ్ జ్ఞాపకముందేమప్పా” అని అడిగినప్పుడు “మీరు చెప్పిన పాఠాలు మరిచిపోయాను సార్. అయితే ఐస్ క్రీమ్ ఘటన మరిచిపోవడానికి సాధ్యమే కాదు” అంటారు. జీవితంలో ఇలాంటి అపురూపమైన సంఘటనలను మరచిపోవడం కష్టం.

అయోగ్యుడు – కల

వి.కె.రాము అనే విద్యార్థి ఉన్నాడు. మంచి పిల్లవాడు. అయితే కొంచెం కొంటె వ్యక్తి. ఎప్పుడూ తన అభిమానులైన నలుగురైదుగురు విద్యార్థుల మధ్యనే తిరిగేవాడు. ఏదో ఒక నాటకం రాత్రి 8-9 గంటలకు ముగిసింది. కుర్చీలను విద్యార్థులు, మా పనివారు మడిచి పెడుతున్నారు. రాము తన అనుచరులతో వచ్చాడు. “మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా సార్” అన్నాడు. “అడగప్పా” అన్నాను. “మీకు కోపం వచ్చినప్పుడు ‘అయోగ్యుడా’ అని తిడతారు కదా సార్. మీకు ఎప్పటినుండి ఈ పదం తెలుసు” అన్నాడు. “అయ్యో రాము మంచి ప్రశ్న అడిగావు. మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడే నాకు అయోగ్యుడు అనే పదం తట్టింది. అంతకు ముందు ఆ పదమే నాకు తెలియదప్పా” అన్నాను. చెయ్యిచూపి అవలక్షణ మనిపించుకున్నట్లు అయ్యింది పరిస్థితి. “నమస్కారం సార్! వస్తాను” అని నవ్వుకుంటూ వెళ్ళాడు.

ఇంకొక రోజు ఇలాగే వచ్చాడు. “సార్ నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది సార్” అన్నాడు. “దానికి నేనేం చేయాలి” అన్నాను. “మీకు చెబుదామని అనిపించింది సార్” అన్నాడు. “చెప్పప్పా” అన్నాను. “నాకు చాలా సంకోచంగా ఉంది. మీరేమైనా అనుకోవచ్చు” అని పదే పదే అంటూ ఇబ్బంది పడుతున్నట్లు నటిస్తున్నాడు. “చూడప్పా, నేనేమీ అనుకోను. అది నీ కల. అది ఎలాంటి కల అయినా నాకూ దానికీ సంబంధం లేదు. ఇష్టముంటే చెప్పు. లేకుంటే వదిలెయ్యి. ఎందుకిలా వెనక్కూ ముందుకూ లాగుతూ సతాయిస్తున్నావు?” అన్నాను. “అలాగైతే ధైర్యం చేసి చెప్తాను సార్. నిన్న రాత్రి నేను నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినట్లు కలవచ్చింది” అన్నాడు. “అయ్యో రామూ, అందుకే దానిని కల అనేది. నీవు నేషనల్ కాలేజీకి ప్రిన్సిపాల్ కావడం కలలో మాత్రమే సాధ్యం. అంతకు తృప్తి పడు. నిజజీవితంలో అది జరగడం అసాధ్యం” అన్నాను. ఈ సంభాషణ నుండి యథాప్రకారం సంతృప్తులై అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.

పేకాట

ఇంతకు ముందు “ఉండాన్ సామి” ప్రకరణంలో ప్రస్తావించిన మునిసిపాలిటి మేస్త్రీ హాజరు తీసుకునే కచేరీ మిద్దె మా కాలేజీ గోడకు చాలా సమీపంలో ఉంది. ఆ మిద్దెమీద వారి సిబ్బంది నలుగురైదుగురు కూర్చుని అప్పుడప్పుడు ఇస్పేట్ ఆకుల ఆట (పేకాట) ఆడేవారు. ఇది నాకు తెలియదు. ఐతే గోడను ఆనుకుని కూర్చున్న మా విద్యార్థులకు అది కిటికీగుండా కనిపిస్తూ ఉంది. కనబడటమే కాదు చాలా సమీపంగా కూడా ఉంది. ఒకరోజు గంభీరంగా పాఠం చెబుతూ ఉన్నాను. వెనుక బెంచీలో కిటికీకి దగ్గరగా కూర్చున్న ఒక విద్యార్థి ఓపిక నశించి ఆవేశంతో గట్టిగా అది వెయ్యొద్దు ఇది వెయ్యి అని చెబుతూ తరగతి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాడు. అతని చుట్టూ ఉన్న విద్యార్థులు నవ్వారు. నాకూ అతడు అది వెయ్యొద్దు ఇది వెయ్యి అన్నది వినిపించింది. అయితే దాని అర్థం తెలియలేదు. తరువాత తెలిసింది ఆ విద్యార్థి అక్కడ ఇస్పేటు ఆడుతున్నవారికి ‘గౌరవ సలహాదారు’ అని. “ఏమప్పా, నీవు క్లాసుకు పాఠాలు వినడానికి వచ్చావా లేక ఇస్పేట్ ఆడేవారికి మార్గదర్శనం చేయడానికి వచ్చావా” అన్నాను. అటువైపు నుండి చప్పుడు లేదు.

జోకుకు అర్థం

సాధారణంగా నేను పాఠాన్ని ముఖం గంటు పెట్టుకుని, ఇంకేం ఆకాశం నెత్తిమీద పడుతుందో ఏమో అనే రీతిలో చెప్పను. నా ఫిజిక్స్ పాఠాలతోపాటు ఉపయోగకరమైన విషయాలను సందర్భోచితంగా చెప్పేవాడిని. నాకు హాస్యం చాలా ఇష్టం. వీలైతే నేనే హాస్యపు మాటలు మాటాడటం లేదా ఇతరుల హాస్యపు మాటలు వినడం నాకు ఇప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ హాస్యప్రవృత్తి నా మానసిక ఆరోగ్యానికి, పరోక్షంగా నా శారీరిక ఆరోగ్యానికి సహాయం చేసింది. ఒకరోజు క్లాసులో ఒక విద్యార్థి “సార్ మీరు చెప్పేదానిలో పాఠం ఏదో, జోక్ ఏదో నాకు అర్థం కావడలేదు” అన్నాడు. “అయ్యో జీవితమే ఒక పెద్ద జోక్, కూర్చోప్పా” అన్నాను. అందరూ సంతోషంతో నవ్వారు. ఇంకొక రోజు పాఠం చెబుతున్నాను. గంభీరమైన వాతావరణం. మధ్యలో ఒకడు తనలో తానే నవ్వుతూ ఉన్నాడు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. “ఎందుకప్పా నీలో నీవే నవ్వుకుంటున్నావు” అని అడిగాను. “సార్ మీరు నిన్న క్లాసులో చెప్పిన జోక్ ఇప్పుడు అర్థమయ్యింది సార్” అన్నాడు. విద్యార్థులు అతడిని ట్యూబ్ లైట్, ట్యూబ్ లైట్ అని హాస్యం చేశారు. “నేను జోక్ చేసినప్పుడు విద్యార్థులు నవ్వకపోతే నాకైతే చాలా బేజారు అవుతుంది, నిరాశ కలుగుతుంది. నా పాఠం అర్థం కాలేదు. ఇంకొకసారి చెప్పండి సార్ అని అడిగితే నాకేమీ బేజారు కాదు. ఇంకొకసారి వివరిస్తాను. అయితే మీ జోక్కు అర్థం చెప్పండి, వివరించండి సార్ అంటే నాకు చాలా బేజారవుతుంది” అని చెప్పినప్పుడు అందరికీ అర్థమయ్యింది అనడానికి క్లాసు క్లాసే నవ్వుల్లో మునగడమే సాక్షి.

Dr. H Narasimhaiah

పిచ్చివాళ్ళ తెలివైన మాటలు

నేను నేషనల్ హైస్కూలులో చదువుకున్నప్పుడు మా ఉపాధ్యాయులైన కె.ఎల్.సుబ్బరావు గారి విషయాన్ని ప్రస్తావించాను. ఒకటి రెండు సంవత్సరాల క్రితం వారికి మతి భ్రమించింది. సహజంగానే వారు ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీలుకాలేదు. అయినా పాఠశాల మీద, కళాశాల మీద వారికి ఎక్కువ ప్రీతి, విశ్వాసం. పూర్వం నేను వారి విద్యార్థిని. అదీకాక అదే ఆవరణలో ఉన్న బీద పిల్లల విద్యార్థి నిలయంలో ఉన్నప్పుడు సహజంగానే అందరు ఉపాధ్యాయులకు నేను తెలుసు. కె.ఎల్.సుబ్బరావు గారు ప్రతి నిత్యం పాఠశాల, కాలేజీలకు వచ్చి వెళ్ళేవారు. వారి పూర్వ సహోద్యోగులతో వారు అదే ధాటిలో తర్కంతో మాట్లాడి వెళ్ళేవారు. మా ఆవరణలో వారి విషయం చాలా మంది విద్యార్థులకు తెలుసు.

ఒక రోజు క్లాసుకు వెళుతున్నాను. మా మేష్టారు ఒక పెద్ద రాయిని తలపై పెట్టుకుని నాకు ఎదురయ్యారు. నాకు భయం వేసింది. నేను ఏమీ మాట్లాడలేదు. నా మనసులోని విషయం వారికి అర్థమయ్యిందని అనిపించింది. “నరసింహా, భయపడవద్దు. ఈ రాయిని నీ మీద వేయను” అన్నారు. నాకైతే ఇంకా భయం వేసింది. రాయిని నా మీద వేయను అన్న తరువాత వేసే సంభావ్యత వారి మనసులో ఉన్నట్లయ్యింది. అయితే నా ముందే ఆ పెద్ద రాయిని పక్కకు ఎత్తివేసి వారి పాటికి వారు వెళ్ళిపోయారు.

సాయంత్రం పూట నేను ఆఫీసులో పనిచేస్తూ ఉంటానని వారికి తెలుసు. చాలా సార్లు వచ్చేవారు. ఒకరోజు సాయంత్రం వచ్చి “ఏయ్ నరసింహా, ఇంత పొద్దువరకూ ఎందుకు పని చేస్తావు, ఆరోగ్యం పాడు చేసుకుంటావు. ఇప్పుడేమో నీతో పని చేయించుకుంటారు. ముసలివాడివయ్యాక నిన్ను అడిగే వారే ఉండరు. పాలిచ్చే వరకు పశువును బాగా చూసుకుని గొడ్డు పోయాక కటిక వాడికి ఇచ్చేస్తారు” అన్నారు. దీనితో పాటు కొన్ని అసంబద్ధమైన మాటలు మధ్య మధ్య అన్నా, పైన పేర్కొన్న మాటలు ఆలోచన చేయడానికి పనికివచ్చేవి.

ఇంకొక రోజు సాయంత్రం ఆఫీసుకు వచ్చారు. కొంచెం సీరియస్‌గా పని చేసుకుంటున్నాను. పక్కన కుర్చీలో కూర్చుని లొడలొడా వాగుతున్నారు. అర్థం లేని ప్రశ్నలను అడుగుతున్నారు. నేను వాటిని పట్టించుకోకుండా మౌనంగా నా పని నేను చేసుకుంటున్నాను. వారికి కోపం వచ్చింది. “ఏయ్ నరసింహా, ఎందుకు ఊరికే ఉన్నావు. నేను అడిగినదానికి జవాబు ఇవ్వు” అన్నారు. “సార్, Silence is consent – మౌనమే అంగీకారం” అన్నాను. “నీ తలకాయ్ Silence could be contempt also – మౌనం తిరస్కారమూ కావచ్చు” అన్నారు. ఎంత తెలివైన మాట. నిజం చెప్పాలంటే అప్పుడు నా మౌనం తిరస్కారం, నిరాసక్తతను సూచించేదే. మరొక సాయంత్రము ఆఫీసుకు వచ్చి సతాయిస్తున్నారు. నేను ఊరికే ఉన్నాను. “నరసింహా, నీకెంత పొగరు. నీవు అమెరికాకు పోయి పి.హెచ్.డి డిగ్రీ తీసుకుని వచ్చావని నీకు అంత గర్వం. నీ పి.హెచ్.డి. డిగ్రీ నా పి.యు.సి.కి సమానం” అని చెబుతూ వెళ్ళిపోయారు. నాకైతే తట్టుకోలేని నవ్వు వస్తోంది. వారికి మతిభ్రమించినా ఒక్కొక్కసారి వారు చెబుతున్న మాటలు చాలా అర్థవంతంగా ఉండేవి. ఇలాగే మరొక పిచ్చివారు మా కాలేజీకి వారి స్నేహితుని కలిసేందుకు వచ్చేవారు. వారి స్నేహితులు గణితశాస్త్ర ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులు వారి స్నేహితుని గురించి నాకు, మరికొందరు సహోద్యోగులకు చెప్పివున్నారు. వారు ఆ ఉపాధ్యాయునితో విసుగు కలిగించే అర్థంలేని మాటలు మాట్లాడేవారు. ఒకసారి నేను క్లాసు ముగించుకుని ఆఫీసు వైపు వస్తున్నాను. “సార్, ఈ సారి పబ్లిక్ పరీక్షలలో ఏ ప్రశ్నలు వస్తాయి” అడిగారు. “నాకు తెలియదు పోప్పా” అన్నాను. ఊరికే సతాయిస్తున్నారు. “నేను ఫిజిక్స్ అంతా మరిచిపోయాను పోప్పా” అన్నాను. దానికి వారు వెంటనే “తథాస్తు (అలాగే కాని)” అని ‘శాపం’ ఇచ్చారు. అయితే కలియుగంలో శాపం తన శక్తిని పోగొట్టుకున్న కారణంగా నా జ్ఞాపకశక్తికి ఎలాంటి ఇబ్బంది కలగక పోయినా వారు సమయస్ఫూర్తితో చెప్పిన ఆ మాట ఇంకా జ్ఞాపకముంది.

దారం

మా ఊరిలో ఒక జోడిదార్ ఉన్నారు. జోడిదార్ అంటే శిస్తులు చెల్లించే అవసరం లేని ఈనాం భూమిని పొందిన వ్యక్తి అర్థం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వీరికి వందల ఎకరాల భూమి ఉంది. వీరి కుమారుడు నా స్నేహితుడు. ఇప్పటికి నాలుగు ఐదు సంవత్సరాల క్రిందట మా ఊరికి వెళ్ళినపుడు వీరు ఎదురుగా కనిపించారు. “ఏను జోడిదార్రే హేగిదీరి (ఏమండీ జోడిదార్ గారూ ఎలావున్నారు?) అని అడిగాను. “అయ్యో ఉన్నానప్పా. అయితే జోడి అంతా పోయింది. దారం మటుకు మిగిలింది” అని నవ్వుతూ చెప్పారు.

ఈ సందర్భంలో ఇలాంటిదే ఇంకొక మాట జ్ఞాపకం వస్తుంది. దివంగతుడైన నాడిగేర్ కృష్ణరావు గారు మంచి హాస్య రచయిత. వారు నా స్నేహితులు కూడా. వారిని మా కాలేజీకి అనేకసార్లు ఆహ్వానించాము. ఒక సారి మాట్లాడుతూ “ మొదట నా అడ్రస్ ఇలా ఉండేది

శ్రీ నాడిగేర్ కృష్ణరావ్

ల్యాండ్ లార్డ్

తిమ్మేనహళ్ళి

అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా జమీనంతా లాగుకొన్నాక

శ్రీ నాడిగేర్ కృష్ణరావ్

లార్డ్

తిమ్మేనహళ్ళి

అని మార్చుకున్నాను” అని చెబుతూ సభికులను నవ్వులలో ముంచెత్తారు.

వ్యామోహం

ఒకరోజు హాస్టల్ మొదటి అంతస్తు వరండాలో నిలబడి ఉన్నాను. క్రింద నల్లా దగ్గర ఒక విద్యార్థి సబ్బుతో తన ముఖం కడుగుకొంటున్నాడు. అతనివైపు కొన్ని నిముషాలు అలాగే చూస్తూ ఉన్నాను. అతనిది దాదాపు నా రంగే. అతడు అమాయకుడు, అనుభవం లేనివాడు. ఏదో సబ్బుతో ముఖాన్ని బాగా రుద్ది కడుగుకొంటే కొంచెం తెల్లగా కావచ్చునని వ్యామోహం. నేను క్రిందకు దిగి వచ్చి అతనితో “చూడప్పా, నీవు ఇప్పుడు చేస్తున్న పనిని చాలా యేళ్ళు ఎక్కువ శ్రద్ధాసక్తులతో నేనూ చేశాను. సబ్బు ఖర్చయ్యింది. నా రంగు కించిత్తూ మారలేదు. సబ్బుకు నా రంగు వచ్చిందేమో అంతే” అన్నాను. అతడు నవ్వుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు. అయితే నాకు తెలిసినట్లు అతడి వ్యామోహం ఏమీ తగ్గలేదు.

దం లేదు

ఒక రోజు హాస్టల్లోని ఇద్దరు విద్యార్థులు పోట్లాడుకుని నా దగ్గరకు వచ్చారు. వారిలో ఒకడు ఏడుపు ముఖం పెట్టుకుని “చూడండి సార్, వీడు నాకు దమ్ములేదు అని పదే పదే ఏడిపిస్తున్నాడు” అన్నాడు. ఇంకొకడిని చిన్నగా మందలించి “అతనికి దమ్ములేదని నీవు అన్నావా” అని అడిగాను. “ఔను సార్. నేను అన్నాను. ఇప్పుడూ అంటాను. అలా చూస్తే మీకూ దమ్ములేదు సార్” అన్నాడు. నాకూ కోపం వచ్చింది. వాడిని తిట్టాను. దానికి అతడు “నన్ను తిట్టవద్దండి సార్. దయచేసి నేను అడిగినదానికి అర్థం చెప్పండి సార్” అని వినయంగా అడిగాడు. “నీ తలకాయి. దేనికి అర్థం చెప్పాలి” అని గడుసుగా అన్నాను. దానికి వాడు “దంపతి అంటే ఏమి సార్” అన్నాడు. “మొగుడు పెళ్ళాం” అన్నాను. “పతి అంటే ఏమి సార్” అన్నాడు. “పతి అంటే మొగుడు” అన్నాను. “అప్పుడు దం అంటే పెళ్ళాం కావాలి కదా సార్. అందువల్ల అతనికీ దం లేదు మీకూ దం లేదు” అని చెప్పాడు. అతని కుశాగ్ర బుద్ధికి మెచ్చాను.

కొన్ని వ్యాసాలు

1 మా పాఠశాలలు – కాలేజీలు

గౌరీబిదనూరు నేషనల్ కాలేజీ

1963 జూన్ నెలలో హోసూరు నేషనల్ హైస్కూలు ప్రారభోత్సవానికి గౌరీబిదనూరుకు చెందిన శ్రీ ఇస్తూరి అశ్వత్థయ్యగారు వచ్చారు. వారి పేరును విని ఉన్నాను. అయితే వారిని నేను చూడలేదు. ఎవరో స్నేహితులు వారిని పరిచయం చేసినప్పుడు పరస్పరం నమస్కారం చేసుకున్నాము. అంతే. మా మధ్య ఇంకే సంభాషణా జరగలేదు. ఇది జరిగిన సుమారు ఒక నెలకు గౌరీబిదనూరుకు చెందిన ఇద్దరు ముగ్గురు పెద్దలతో సహా అశ్వత్థయ్యగారు నన్ను కలిసి గౌరీబిదనూరులో ఒక కాలేజీ ప్రారంభించాలని, దానికోసం రెండు ఎకరాల స్థలం, బియ్యపు మిల్లు కొరకు ఉపయోగిస్తున్న జింకు షీటుతో కూడిన రెండు భవనాలు, వాటితో పాటు కొంత సొమ్ము ఇస్తానని చెప్పారు. నా తక్షణ ప్రతిక్రియ “సంతోషం”. వారు ఇస్తున్న స్థలం మరియు ధనం కాలేజీ స్థాపించడానికి సరిపోతుందో లేదో అనే వైపు నా దృష్టి అంతగా పోలేదు. అక్కడ ఒక కాలేజీ స్థాపించడానికి ఒక ఆధారం దొరికింది కదా అనేదే నాకు సంతోషం కలిగించింది. గౌరీబిదనూరుకు వెళ్ళి స్థలాన్ని పరిశీలించి వచ్చాను. కాలేజీ స్థాపించే అంత సౌకర్యాలు లేవు. అయితే హోసూరులో నేషనల్ హైస్కూలు ఉంది. దానికి 10 కి.మీ.దూరంలో ఒక నేషనల్ కాలేజీ ఉంటే చాలా బాగుంటుంది. హోసూరులో ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలో పాస్ అయిన విద్యార్థులు తమ తాలూకా పరిధిలో ఉండే గౌరీబిదనూరులోనే చదివి డిగ్రీని సంపాదించుకోవచ్చు. అందువల్ల ఏమైనా చేసి అక్కడ కాలేజీ స్థాపించడానికి స్నేహహస్తాన్ని చాచిన అశ్వత్థయ్యగారి ఆశను నెరవేర్చాలి. దీనివల్ల గ్రామీణ పిల్లలకు మంచి చదువును ఇవ్వాలని మొదటి నుండీ ఇష్టపడుతున్న నా కోరికా సిద్ధిస్తుందని నేను దానిని కార్యరూపం దాల్చడానికి పూర్తి ఉత్సాహంతో ముందుకు వచ్చాను. అయితే గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు కొందరు అందువల్ల మునుముందు జరగడానికి అవకాశమున్న కొన్ని ప్రతికూలతలను నా ముందు పెట్టారు. వాటిలో ఒకటి వారికి తెలిసినట్లు శ్రీ అశ్వత్థయ్యగారి స్వభావం. ఆ అన్ని ప్రతికూలాల వివరాలను ఇక్కడ పేర్కొనవలసిన అవసరం లేదు. మొత్తం మీద వారి అనుమానాలను ప్రయాసతో నివారించాను. సంస్థ సర్వసభ్య సమావేశంలో కూలంకషంగా చర్చ జరిగింది. కొందరు అనుమానాలను వ్యక్తం చేశారు. వాటినన్నిటికీ నేను వీలైనంత సమాధానం ఇచ్చాను. ఆ తరువాత ఆ నిర్ణయానికి సభ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపింది.

‘అశ్వత్థయ్య ఇస్తూరి సంజీవమ్మ నేషనల్ కాలేజీ’ అనే పేరుతో 1968 నుండే కాలేజీ ప్రారంభమయ్యింది. కాలేజీలో కళలు, విజ్ఞానము, వాణిజ్య విభాగాలున్నాయి. ఈ ముప్పై ఏళ్ళలో కాలేజీ బాగా అభివృద్ధి చెందింది. లక్షలాది రూపాయలు విలువచేసే భవంతులున్నాయి. కాలేజీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ కాలేజీలో ఉండే గ్రంథాలయం మిగిలిన ఇంకే గ్రామీణ కళాశాలలో లేకపోయినా ఆశ్చర్యం లేదు. గర్వించదగిన పుస్తక భండారం ఉంది. విద్యార్థుల ఉపయోగం కోసం సుసజ్జితమైన వ్యాయామశాల ఉంది. ఈ కాలేజీలో సుమారు 1500 మంది విద్యార్థులు చదువుతున్నారు.

బాగేపల్లి నేషనల్ కాలేజీ

1974వ సంవత్సరం తొలినాళ్ళలో అనుకుంటాను; బాగేపల్లి తాలూకా పెద్దలైన శ్రీ జి.బి.శంకరరెడ్డి మరికొందరు నన్ను విశ్వవిద్యాలయంలో ఉన్న నా ఆఫీసుకు వచ్చి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ బాగేపల్లిలో ఒక నేషనల్ కాలేజీని ప్రారంభించాలి అని అడిగారు. దానికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కూడా చెప్పారు. నేను అప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ సంస్థలలో లేను. అందువల్ల “మీరు దయచేసి సంస్థ కార్యవర్గ సభ్యులను కలిసి మీ కోరికను తెలపండి” అన్నాను. అయితే వారు కార్యవర్గ సభ్యులను కలిసినప్పుడు వారి కోరిక నెరవేరలేదు. తరువాత వారు సత్యసాయిబాబా గారిని కలిసి కాలేజీ కోసం విజ్ఞప్తి చేశారు. అప్పుడూ ఏమీ కాలేదు.

1977 సెప్టెంబర్ నెలలో మళ్ళీ వారు వారి స్నేహితులు తమ కోరికను తిరిగి వ్యక్తం చేశారు. అప్పుడు నేను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాను. బాగేపల్లి చాలా వెనుకబడిన ప్రదేశం కాబట్టి నాకు వ్యక్తిగతంగా అక్కడ కాలేజీ స్థాపించడానికి ఉత్సాహం ఉంది. ఊరి బయట ఉన్న ఏడు ఎకరాల స్థలం కాలేజీ స్థాపించడానికి అనుకూలంగా ఉంది. మొదట నేనొక్కడినే అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని చూసుకుని వచ్చాను. అదే నేను బాగేపల్లికి మొదటిసారి వెళ్ళింది. తరువాత 4-5 మంది గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను పిలుచుకుని బాగేపల్లికి వెళ్ళాను. వారంతా అక్కడి స్థలాన్ని చూశారు. తరువాత అక్కడికి సమీపంలో ఉన్న చిన్నతిరుపతి అనే పేరుగాంచిన దేవస్థానానికి వెళ్ళి పూజ చేయాలని చెప్పారు. సరే వెళదాము అన్నాను. నన్ను చూసిన దేవుడు ఇలా అనుకుని ఉండవచ్చు.”ఏయ్ నరసింహా, నీవు నా దేవస్థానానికి వచ్చావు అని నేనేమీ మోసపోను. నీవు ఏదో దాక్షిణ్యంతో ఇక్కడకు వచ్చావు అని నాకు తెలుసు. స్వచ్ఛందంగా నీవు ఖచ్చితంగా రాలేదు. నీకు కాలేజీ కావాలి. అందువల్ల దాతల మనసులను ఎందుకు నొప్పించాలి అని వచ్చావు. నీకు బుద్ధి తక్కువ ఉండి ఇంకా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నీవు నా భక్తుడివైన సంగతి నాకు తెలుసు. అయితే నీకు బుద్ధి వచ్చిన తరువాత నన్ను స్పష్టంగా వదిలేశావు. అయితే నీవు చేస్తూ ఉన్నది నా పనే. స్వార్థం కోసం నా గుడికి వచ్చే భక్తుల చెడ్డ బుద్ధి నాకు తెలుసు..” ఇలా ఆ వెంకటరమణ స్వామి ఆలోచన సాగి ఉండాలి. ఇదంతా మీకు ఎలా తెలుసు అని ఎవరైనా అడిగితే “నాకు దేవుని బుద్ధి తెలుసు, నా బుద్ధి దేవునికి తెలుసు” అన్నదే నా సమాధానం. కాలేజీ స్థాపించడానికి గవర్నింగ్ కౌన్సిల్ సభలో ఒప్పుకున్నారు. తరువాత సంస్థ సర్వసభ్య సమావేశంతో అందరి అనుమతితో అంగీకారం లభించింది.

1978లో కాలేజీ మొదటి సంవత్సరం బి.ఎ. క్లాసుతో ఒక విద్యార్థి నిలయంలో మొదలై, కొన్ని సంవత్సరాల తరువాత దఫదఫాలుగా కాలేజీ భవనాన్ని కట్టించాము. సుమారు 35 లక్షల రూపాయలు విలువ చేసే భవనాలు ఉన్నాయి. చాలా గ్రామీణ కాలేజీలలో లేని విద్యా సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యాయామశాల ఉంది. ఇక్కడ సుమారు 900 మంది విద్యార్థులు ఉన్నారు.

యెల్దూరు మరియు ముడియనూరు నేషనల్ హైస్కూళ్ళు

శ్రీ జి.నారాయణగౌడ్ నేతృత్వంలో కోలార్ జిల్లా శ్రీనివాసపురం తాలూకా యెల్దూరులో 1961లో ఒక హైస్కూలును స్థాపించారు. దాని పేరు నేషనల్ హైస్కూలు. పాలక మండలి పేరు నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ. అన్నీ మా సంస్థ, పాఠశాలల పేర్లే. తెలియని వారు యెల్దూరు హైస్కూలు మాదే అని అనుకోవచ్చు.

శ్రీ నారాయణగౌడు గారు ఉద్దేశపూర్వకంగానే ఆ పేర్లను పెట్టారు. మా సంస్థలను నడిపినట్లే నడపాలని వారి ఆశ. వారు మంత్రిగా కూడా ఉన్నారు. వారిని ఒకసారి కలిసినప్పుడు వారి హైస్కూలు మరియు సంస్థ గురించి వివరంగా తెలిపి, మా సంస్థల మాదిరే వాటిని నడపడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పారు. “నాకూ వయస్సు అవుతూ ఉంది. ఆ ఊరి వాళ్ళకు వదిలివేస్తే తక్కువ స్థాయి రాజకీయాలు చేసే సంభవం ఉంది. హైస్కూలు చెడిపోయే ప్రమాదం ఉంది. అన్నీ మీ పేర్లనే పెట్టాను. మీ సంస్థ ఆధీనంలోనికే ఈ హైస్కూలును నేను బ్రతికుండగానే చేర్చుకోండి” అన్నారు. నేను ఒప్పుకున్నాను. అయితే వారు బ్రతికి ఉన్నప్పుడు వారి ఆశ నెరవేరలేదు.

1979లో ఆ ఊరికి చెందిన కొందరు నాయకులు వచ్చి నన్ను కలిసారు. పాఠశాలను మా ఆధీనంలోనికి తీసుకోమని విజ్ఞప్తి చేశారు. నేను, ఇద్దరు ముగ్గురు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఆ ఊరికి వెళ్ళాము. మాకైతే ఆ స్కూలు బాగా నచ్చింది. అదే సమయానికి అక్కడికి 7-8 కి.మీ.ల దూరంలో ఉన్న ముళుబాగిలు తాలూకా ముడియనూరు గ్రామంలో ఉన్న మహాత్మా గాంధీ నేషనల్ హైస్కూలు స్థాపించడానికి శ్రమించిన వయోవృద్ధులైన శ్రీ సుబ్బయ్యగారు, శ్రీ వెంకటసుబ్బాశాస్త్రి గారు ఇంకా కొంత మంది నాయకులు నన్ను కలిసి పక్కనే ఉన్న తమ హైస్కూలును కూడా మా ఆధీనంలోనికి తీసుకోమని విజ్ఞప్తి చేశారు. వారితో పాటు వెళ్ళి ఆ స్కూలునూ చూశాము. చిన్న ఊరు. చిన్న స్కూలు. పైగా శ్రీ సుబ్బయ్య గారు బెంగళూరులోని మా హైస్కూలులో నాకన్నా పూర్వమే చదువుకున్నారు. అదీకాక యెల్దూరు, ముడియనూరు రెండూ పక్కపక్కనే ఉన్నాయి. వీటిని అన్నింటినీ పరిగణించి ఈ పాఠశాలలను మా స్వాధీనంలోనికి తీసుకుని గ్రామీణ విద్యార్థులకు వీలైనంత సేవను చేసే అవకాశాన్ని పోగొట్టుకోరాదని మా పాలకవర్గానికి విజ్ఞప్తి చేశాము. పాలక మండలి అంగీకరించింది. 1980లో ఆ రెండు పాఠశాలలూ మా సంస్థలో విలీనమయ్యాయి. ఈ రెండు పాఠశాలల మొత్తము విద్యార్థుల సంఖ్య సుమారు 900.

సుబ్రహ్మణ్యపురం స్కూళ్ళు

బెంగళూరుకు దక్షిణంలో సుమారు 15కి.మీ. దూరంలో సుబ్రహ్మణ్యపుర ఉంది. అక్కడ పేరుమోసిన వాణిజ్యవేత్త అయిన యాదాళం సుబ్బయ్యశెట్టి గారు మిల్లు కర్మాగారం కొన్ని దశాబ్దాల క్రితం స్థాపించారు. వారి మనుమలలో చాలా మంది మా బసవనగుడి పాఠశాల, కళాశాలలో చదువుకొన్నారు. వారిలో ప్రముఖులు శ్రీ వై.జి.మధుసూదన్. నేను ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు వారు మా కాలేజీలో విద్యార్థిగా ఉన్నారు. సుమారు అప్పటి నుండీ సుబ్రహ్మణ్యపురలో ఒక నేషనల్ హైస్కూలును మేము తెరవాలని నన్ను కోరుతున్నారు. కారణాంతరాల వల్ల అది త్వరగా కార్యరూపం దాల్చలేదు. అయితే 1981లో ఈ విషయాన్ని పాలకమండలిలో ప్రస్తావించాను. సభ అంగీకరించింది. 1982లో ‘యాదాళం ఆదిలక్ష్మమ్మ సుబ్బయ్య శెట్టి’ గారి పేరుమీద హైస్కూలును మొదలుపెట్టాము. తరువాత అక్కడే యాదాళం వంశీయులు 1941 నుండి నడుపుతున్న అప్పర్ ప్రైమరీ స్కూలును మా నిర్వహణలోనికి 1985లో తీసుకున్నాము. ఈ రెండూ బెంగళూరు సమీపంలో ఉన్నా పేదరికంలోనూ, విద్యా సామాజిక స్థాయిలలోనూ పల్లెటూరి పాఠశాలలకన్నా ఏవిధంగానూ ఉత్తమంగా లేవు. ఈ పాఠశాలల మొత్తం విద్యార్థుల సంఖ్య సుమారు 900.

ఇలా మా సంస్థ గ్రామీణ ప్రాంతాలలో రెండు నేషనల్ కాలేజీలను, మూడు నేషనల్ హైస్కూళ్ళను, ఒక నేషనల్ అప్పర్ ప్రైమరీ స్కూలును నడుపుతూ వస్తూవుంది. ఈ మా గ్రామీణ పాఠశాలలు, కళాశాలలలో సుమారు 5000 కన్నా ఎక్కువమంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈ గ్రామీణ పాఠశాలలు, కళాశాలల స్థాపనలో నేను ప్రముఖపాత్రను వహించాను అన్నదే నాకు ఎక్కువ తృప్తిని ఇచ్చింది. నేను పల్లె నుండి ఒక పేద కుటుంబంలో పుట్టి గ్రామీణ పేద విద్యార్థులకు విద్యాపరంగా వీలైనంత సహాయం చేయడానికి నాకు అమూల్యమైన అవకాశం లభించింది.

నేషనల్ కాలేజీ, జయనగర్

1961లో నేను బసవనగుడి నేషనల్ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాను. కాలేజీ ప్రగతి ఎక్కువయ్యే కొద్దీ ప్రవేశానికి విద్యార్థుల ఒత్తిడి ఎక్కువై వచ్చింది. చాలా మంది విద్యార్థులకు ప్రవేశం దొరికేది కాదు. అదీకాక జయనగర్ కాలనీ కొత్తగా ప్రారంభమై అక్కడి మరియు చుట్టుపక్కల కాలనీల నుండి విద్యార్థులు బసవనగుడి నేషనల్ కాలేజీకి వచ్చేవారు. దీనిని తప్పించడానికి జయనగర్ లోనే ఒక కాలేజీని ప్రారంభించ వచ్చని గవర్నింగ్ కౌన్సిల్లో సూచించాను. గవర్నింగ్ కౌన్సిల్ సూత్రప్రాయంగా దానికి అంగీకారాన్ని తెలిపింది. ధనసేకరణ విషయమై ఎక్కువ బాధ్యతను తీసుకున్నాను. మా కాలేజీ విద్యార్థుల నుండే ఆ కాలంలో సుమారు రూ.20,000 కన్నా ఎక్కువ మొత్తాన్ని సేకరించ గలిగాను. కాలేజీని ప్రారంభించాలి అంటే విశ్వవిద్యాలయం అనుమతి కావాలి. అయితే బెంగళూరు విశ్వవిద్యాలయం అదే సంవత్సరం ప్రారంభమయ్యింది. అప్పటికి ఇంకా విశ్వవిద్యాలయపు సెనెట్ మొదలైనవి ఏర్పాటు కాలేదు. అప్పటి ఉపకులపతిగారైన డా. బి. డి. లరోయాగారు కాలేజీని ప్రారంభించడానికి నోటిమాటగా నాకు అనుమతి ఇచ్చారు. 1965లో బి.ఎ. తరగతితో జయనగర్ నేషనల్ కాలేజీ ప్రారంభమయ్యింది. అయితే అదే సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలలో ఉపకులపతిగారు అకాలమృత్యువు పాలయ్యారు. మేము కాలేజీ మొదలు పెట్టిన తరువాత విశ్వవిద్యాలయపు వివిధ సభలైన సెనెట్, అకడమిక్ కౌన్సిల్, సిండికేట్ మొదలైనవి రూపొందించ బడ్డాయి. అంటే విశ్వవిద్యాలయం వివిధ సంస్థల అనుమతి లేకుండానే మా కాలేజీ ప్రారంభమయ్యింది. మేము ధర్మ సంకటంలో పడ్డాము. నేను ఆ వివిధ సంస్థల ముఖ్య సభ్యులను కలిసి గతించిన ఉపకులపతిగారు నాకు మాట ఇచ్చిన సంగతి వివరించి మా కాలేజీ అనుమతికి చాలా ప్రయాసపడి వారినందరినీ ఒప్పించగలిగాను. ఇంకా కొన్ని చిక్కులను ఎదుర్కోవలసి వచ్చింది. కాలేజీ మొదలైనప్పుడు నేను ఒకటి రెండు సంవత్సరాలు అక్కడ పాఠం చెప్పాను. కాలేజీని దఫదఫాలుగా పాలక కమిటీ రెండు సంవత్సరాల ముందే నగర ట్రస్ట్ బోర్డ్ నుండి పొందిన జాగాలో నిర్మించింది. దీనికోసం లక్షలాది రూపాయలు సేకరించాము. ఈ 30 యేళ్ళలో కాలేజీ బాగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోని అత్యుత్తమ కాలేజీలలో ఒకటయ్యింది.

కళాక్షేత్రం

కాలేజీలోని విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగకరమైన ఒక దివ్యమైన కళాక్షేత్రాన్ని సుమారు 25 లక్షల రూపాయల ఖర్చుతో జయనగర్ నేషనల్ కాలేజీ ఆవరణలో నిర్మించబడింది. దీనిని కడుతున్నప్పుడు నేను జయనగర్ కాలేజీ వైపు నడుచుకుని వెళ్ళేవాణ్ణి. దారిలో ఒకరు కనిపించి “సార్, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు జయనగర్ నేషనల్ కాలేజీ కోసం చాలా శ్రమపడ్డారు. అక్కడ ఒక కళాక్షేత్రాన్ని మీ ‘మెమోరియల్’గా కడుతున్నారని తెలిసింది. ఇది చాలా మంచి పని” అన్నారు. మెమోరియల్ కట్టడం వ్యక్తి చనిపోయిన తరువాత. ఆ కళాక్షేత్రం నా మెమోరియల్ కాకూడదు అని, కనీస పక్షం అది పూర్తి అయ్యేవరకూ నేను జీవించి ఉండాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అందులో విజయంతమయ్యానని చెప్పనక్కరలేదు.

బెంగళూరు లలిత కళాపరిషత్

సాంస్కృతిక కార్యక్రమాల కోసం మా సంస్థ మొదటి నుండి పాఠాశాల, కళాశాలలలో ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉంది. ఇప్పుడు మాదే ఒక కళాక్షేత్రం ఉన్నందువల్ల మేమే ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించడం అన్ని విధాలా ఉత్తమమని గవర్నింగ్ కౌన్సిల్ సభలో సూచించాను. సభ అంగీకరించింది. ‘బెంగళూరు లలిత కళాపరిషత్’ అనే సంస్థ 1988లో స్థాపించాము. నెలకు రెండు కార్యక్రమాల చొప్పున ఇంతవరకూ సుమారు 250 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాము. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో నాటకం, సంగీతం మరియు నృత్యాలున్నాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here