[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]
కామణ్ణ పండగ
[dropcap]ఏ[/dropcap]డాదికొకసారి కామణ్ణ పండగ లేదా హోళీ. మావూరి మధ్య ఒక పెద్ద కూడలి ఉంది. అక్కడ మేమంతా హోళీ కన్నా ముందే అంటే ఫాల్గుణమాసం పున్నమి కన్నా ముందే చాలినన్ని ఎండిన చెట్టు కొమ్మలను, మొద్దులను జమ చేసేవాళ్ళము. యథేచ్ఛగా గడ్డిని సేకరించేవాళ్ళం. ఆ పున్నమికి ఒకటి రెండు రోజుల ముందు ఊరు చుట్టుపక్కల ఉన్న గడ్డివాముల దగ్గర వాటి యజమానులు కాపలా ఉండేవారు. అయినా వారి కన్నుకప్పి దొరికినంత గడ్డిని దోచుకొనే వాళ్ళం. దోచుకుని ఊరివైపు శరవేగంగా పరిగెట్టేవాళ్ళం. కాపలాదారులు గమనించకపోతే మేము బతికిపోయినట్టే. ఒకవేళ వారికి ఎవడైనా చిక్కితే గడగడ వణికిపోయేవాడు. నెత్తి మీది గడ్డి ఎప్పుడో కిందకు పడేసేవాడు. పిల్లవాడు దొరికిపోయినప్పుడు మామూలుగా కాపలాదారు లేదా యజమాని వాడిని కొట్టరు. ఇది వాడి సొంతం కోసం చేసిన దొంగతనం కాదని అతనికి తెలుసు. అందరికీ తెలుసు. శాస్త్రానికి ఒకటిరెండు దెబ్బలు నొప్పి తెలియకుండా కొడితే కొట్టవచ్చు. అయితే వాడిని వాచామగోచరంగా తిడతాడు. అవన్నీ అవాచ్యమైన శబ్దాలు. వాటన్నింటినీ అవలీలగా ఉపయోగిస్తాడు. ఆ శబ్దాలను పదవిభాగం చేసి వాటి గూఢార్థాలను తెలుసుకునే ప్రయత్నం వాటిని ఉపయోగించిన వాడు చేయడు, తిట్లు తిన్నవాడూ చేయడు. ఆ పదాల అర్థాలను గంభీరంగా పరిగణిస్తే ఇక ఆ దేవుడే దిక్కు!
గడ్డి మాత్రమే కాకుండా కొన్ని ఇళ్ళ ముందు, పెరట్లలో ఉన్న కట్టె సామాన్లను దోచే ప్రయత్నం చేసేవాళ్ళం. ఏయే వస్తువులున్నాయో రెండు మూడు రోజుల ముందే కనిపెట్టి ఉండేవాళ్ళం. ఇలాంటి సామాన్లను సేకరించడం శ్రమతో కూడిన పని. మొత్తం మీద పున్నమి నాటికి సేకరించిన వస్తువులు పెద్ద కుప్పగా అయ్యేది. రాత్రి సుమారు 12 గంటలకు వందలాది ప్రేక్షకుల సమ్ముఖంలో వేడుకగా ఆ రాశికి అగ్నిస్పర్శ చేసేవాళ్ళం. కాముని పండుగ రోజులలో మేము ఎటువంటి ఖర్చూలేని, తర్ఫీదు, నైపుణ్యం అవసరం లేని ఒక వాద్యాన్ని ఉపయోగించేవాళ్ళం. అది చేత్తో నోరు లబలబా కొట్టుకోవడం. ఏడాదికి సరిపడా ఆ ఒకటి రెండు రోజుల్లో నోరు మొత్తుకొనేవాళ్ళం!
దీపపు శకునం
దిష్టి తగలటం
పల్లెల్లో పిల్లలు ఎక్కువగా ఆవులిస్తే, మంకుగా ఉంటే దిష్టి తగిలింది అనే నిర్ధారణకు వస్తారు. దృష్టి తాకడం అంటే కొందరి కంటి చూపు మంచిది కాదని అర్థం. అలాంటి వారి దృష్టి పడితే పిల్లలకు మంచిదికాదు. ముందు చెప్పిన లక్షణాలు పిల్లలలో కనిపిస్తాయి. భోజనం చేసేటప్పుడు ఇలాంటివారి దృష్టి పడితే భోజనం చేసేవారికి అజీర్ణమో, కడుపునొప్పో వస్తుందని ఒక నమ్మకం. ఇలాంటి దృష్టిదోషాలను పోగొట్టడానికి కొన్ని మార్గాలను అనుసరిస్తారు. పసుపు, కుంకుమ కలిపిన నీళ్ళను పిల్లలమీద నివాళించి నిప్పులలో చల్లుతారు. అలాగే కొన్నిసార్లు నిమ్మపండును దిగదుడుస్తారు. ఆ రంగునీళ్ళు, బొగ్గు, నిమ్మపండును దారికి అడ్డంగా వేస్తారు. ఒక్కోసారి చీపురు పుల్లలన్లు దిగదుడిచి వాటికి మంటపెట్టి ఒక మూల నిలుపుతారు. పుల్లలు కాలినప్పుడు చిటపట శబ్దం సహజంగానే వస్తుంది. ఆ శబ్దం చాలా జోరుగా వస్తే దిష్టి ఎక్కువగా తగిలింది అని అర్థం. చిటపట శబ్దం ఓ మోస్తరుగా వస్తే దిష్టి కూడా అంతే మోతాదులో తగిలిందని భావిస్తారు.
ఈ పద్ధతుల వల్ల పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు. దిష్టి వీటికి దేనికీ లొంగకుండా ఉంటే చివరికి ఒక బ్రహ్మాస్త్రం ఉంది. స్త్రీలు వాడే నల్ల గాజులను పగలగొట్టి ఆ ముక్కల కొనలను దీపంతో బాగా కాల్చి దిష్టి అయిన పిల్లల మెడ వెనుక భాగంలో చిన్నగా వాత పెట్టేవారు. ఆ పిల్లల గోడు చెప్పనలవి కాదు. నాకు దిష్టి చాలా సాధారణంగా తగిలేది. నామీద దిష్టి తీసే అన్ని విధానాలను ప్రయోగించేవారు. మా తల్లి నాకు గాజుముక్కను కాల్చి చాలాసార్లు వాత పెట్టారు. బహుశా దానివల్లే అనుకొంటాను నా మెడవెనుక భాగం మిగిలిన భాగాలకన్నా కొంచెం ఎక్కువ నల్లగా ఉంది. మా తల్లి నల్లగాజును చేతిలో తీసుకున్న తక్షణం నేను ఏడుపు మొదలెట్టే వాడిని. అల్లరి చేసేవాడిని. నేను ఏమిచేసినా ఆమె మాత్రం వాత పెట్టడం మానేవారు కాదు.
లోయర్ సెకండరీ తరువాత
ముందే చెప్పినట్లు 1934వ సంవత్సరంలో లోయర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. ముందు చదవడానికి అనుకూలం లేదు. మా తాలూకా మొత్తం మీద ఒక్కటైనా హైస్కూలు లేదు. మా ఊరికి 18 మైళ్ళ దూరంలో మధుగిరిలో ఒక సర్కారీ హైస్కూలు ఉంది. అక్కడికి సుమారు 2 మైళ్ళ దూరంలో సిద్ధాపురం అనే పల్లె ఉంది. ఆ పల్లెలో ఏదో బాదరాయణ సంబంధం ఉన్న ఒక ఇల్లుంది. వారియింట్లో ఉంటూ మధుగిరిలో హైస్కూలు విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని తీర్మానించబడింది. సంతోషంతో, ఉత్సాహంతో అక్కడికి పోయి ఒక నెలరోజులు చదివాను. వారి ఇంట్లో చాలా అనానుకూలాలు కలిగాయి. జరుగుబాటు లేక చదువును ఆపివేసి మావూరికి వెనుదిరిగాను. రెండు నెలలలో మధుగిరికి రెండు మూడు సార్లు వెళ్ళివచ్చాను. నా ప్రయాణమంతా కాలినడకనే. అనేక మైళ్ళు నడవడం నాకు సరదాగా ఉండేది.
ఊరికి తిరిగి వచ్చిన తరువాత యథాప్రకారం తిరుగుళ్ళు మొదలయ్యాయి. హిందీ, సంస్కృత అధ్యయనాన్ని కొనసాగించాను. నాకిష్టమైన ఇద్దరు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో చిన్నచిన్న పనులు చేయడం, నా స్నేహితుడు శ్రీ హెచ్.ఎన్.రామారావు ఇంటిలో చదువుకోవడం, పడుకోవడం, సాయంత్రం ఉపాధ్యాయులతో, స్నేహితులతో మాధ్యమిక శాల ఆవరణలో ఆటలాడుకోవడం, తెల్లవారుఝామునే లేచి బావి దగ్గరకువెళ్ళి బట్టలు ఉతుక్కోవడం, ఈదడం. ఇదే నా దినచర్య అయ్యింది.
ఉపాధ్యాయులు, స్నేహితులూ ఉదార స్వభావం కలిగినవారు. జాతి పద్ధతి, మూఢనమ్మకాలు మొదలైన వాటి గురించి యువకులమైన మేము చర్చ చేస్తూ ఉండేవాళ్ళం. నా హేతువాద మనోభావాలకు బీజం హొసూరులోనే పడింది. పెళ్ళిళ్ళకు, కొన్ని ధార్మిక కార్యక్రమాలకు దుబారా ఖర్చు చేయడాన్ని అప్పటికే నేను తీవ్రంగా ఖండించేవాణ్ణి. “పెళ్ళి, వడుగు, తద్దినాలు చేసి మీరు పాపర్ అవుతున్నారు” అని నా బ్రాహ్మణ స్నేహితులతో ఆత్మీయంగా చెప్పేవాణ్ణి. వాళ్ళంతా ఒప్పుకునేవారు. మా మధ్య ఎప్పుడూ జాతిభేదాలు ఉండేవికావు. మాలోమాకు కొట్లాటలులేవు. కొన్ని విషయాలలో అభిప్రాయభేదాలుండేవి. వాటివల్ల మా స్నేహానికి ఢోకా రాలేదు. అరవై సంవత్సరాల క్రింద మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.
శ్రీ ఎస్.వెంకటాచలయ్య గారు మంచి కన్నడ, హిందీ విద్వాంసులని ఇదివరకే చెప్పాను. వారు కొన్ని హిందీ పుస్తకాలను కన్నడలోనికి భాషాంతరీకరణ చేశారు. వాటిలో గంగా ప్రసాద్ ఉపాధ్యాయ వ్రాసిన ‘ఆస్తికవాద’మనే హిందీ గ్రంథముంది. ఆ పుస్తకానికి మంగళ్ ప్రసాద్ పురస్కార్ అనే ప్రతిష్ఠాత్మకమైన బహుమానం వచ్చింది. ఆ గ్రంథాన్ని కన్నడలోనికి అనువదించడానికి శ్రీ వెంకటాచలయ్యగారు మొదలుపెట్టారు. కన్నడీకరించిన చిత్తుప్రతిని తీసుకుని దానికి తగిన సవరణలు చేసి చెప్పేవారు. వారు చెప్పినదానిని నేను వ్రాయాలి. అదే ముద్రణకు పంపే మేలుప్రతి కాబట్టి నాది ఎంత జవాబుదారీ పనో చెప్పనవసరం లేదు. ఆస్తికవాదంలో ఎక్కువ క్లిష్టమైన పదాలుండడం సహజం. సంస్కృత జ్ఞానం ఎంతోకొంత ఉన్నందువల్ల నేను తప్పులు లేకుండా వ్రాయడం సాధ్యపడింది. నా చేతివ్రాత కూడా తగినంత స్పష్టంగానే ఉంది.
నేను పుట్టింది మాంసాహారుల ఇంటిలో. అంటే దాని అర్థం మా తల్లిదండ్రులకు మాంసాహారం భుజించడానికి అడ్డు లేదు అని మాత్రమే. ఐతే మాంసాహారానికి ఖర్చు ఎక్కువ. మేము చాలా బీదవారమని ఈ పాటికి పాఠకులకు స్పష్టం అయ్యే ఉంటుంది. నాలుగైదు నెలలకు ఒకసారి మా ఇంట్లో మాంసాహార వంటకం చేసేవారు. చాలా చిన్నవయసులో మాంసాహారాన్ని తినడం అస్పష్టంగా జ్ఞాపకముంది. ఆ తరువాత సహవాసబలం వల్ల పూర్తిగా సస్యాహారినయ్యాను. సుమారు 6-7 ఏండ్ల వయస్సు నుండి మాంసాహారం భుజించలేదు. ఇంటిలో అలాంటివి వండినప్పుడు శ్రీ హెచ్.ఎన్.రామారావు గారి ఇంటిలోనో, లేదా మా ఉపాధ్యాయుల ఇళ్ళల్లోనో భోజనం చేసేవాడిని. ఇప్పటి వరకూ ఒక కోడిగుడ్డు కూడా తినలేదు.
మాయింటి పని ఎక్కువగా నేనేమీ చేయలేదు. అంతా మా తల్లి, చెల్లెలు చేసేవారు. నేను అప్పుడప్పుడు సెలవురోజుల్లో మా తల్లిగారితో కలిసి పంట పొలాలలో కలుపు తీయడానికో, శెనక్కాయలు పీకడానికో కూలీపనికి వెళ్ళేవాడిని.
ఒకరోజు నా స్నేహితుడొక్కడు మా ఇంటికి వచ్చి “మాట్లాడే పెట్టె ఊరికి వచ్చింది. తొందరగా రా. పోయి చూద్దాము” అన్నాడు. నాకు ఒక ముక్కా అర్థం కాలేదు. “పెట్టె ఏమిటి? మాట్లాడటం ఏమిటి?” అని ప్రశ్నించాను. “వచ్చి చూడు. తెలుస్తుంది” అని నా స్నేహితుడు బదులిచ్చాడు. కుతూహలం కొద్దీ వాడి వెంట నడిచాను.
మా ఇంటి సమీపంలో ఒకరి ఇంట్లో పెళ్ళి. జనాలంతా గుమిగూడి ఉన్నారు. అందరూ కూర్చొని వున్నారు. మధ్యలో ఒక పెట్టె. ఒక చక్రం తిరుగుతూ ఉంది. లౌడ్ స్పీకర్లాంటి ఒక బూర. దాని నుండి పాట వస్తూ వుంది. నాకు మొదట భయం వేసింది. అందరూ కూర్చొని ఆసక్తితో వింటూ ఉన్నారు. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. మనుష్యులు పాడినట్టు ఆ పెట్టె పాడుతూ ఉంది. చాలాసేపు అక్కడే ఉన్నాను. అదే మొదటిసారి నేను గ్రామఫోన్ చూడటం.
గాంధీగారి దర్శనం
సంవత్సరం మరిచిపోయాను. బహుశా 1933 లేదా 1934 కావచ్చును. గాంధీజీగారు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి నందిబెట్ట వచ్చారు. నందిబెట్ట మావూరికి సుమారు 22 మైళ్ళదూరంలో ఉంది. అందరికీ తెలిసినట్లే నందిబెట్ట ఒక ఆరోగ్యధామం.
గాంధీగారి పేరు అప్పటికే ప్రజల నాలుకపై ఆడుతూ ఉండేది. గాంధీగారి గురించి కట్టుకథలు, పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీ ఎం.ఎస్.నారాయణరావుగారు, శ్రీ ఎస్.వెంకటాచలయ్యగారు సహజంగానే గాంధీ గారిని చూడాలని నందిబెట్టకు బయలుదేరారు. జతలో నన్ను కూడా పిలుచుకొని పోయారు. మేమంతా బస్సులో నందిబెట్టకు వెళ్ళాము. బహుశా నేను బస్సులో ప్రయాణించడం అదే మొదటిసారి అనుకుంటాను. ఆరోజు సాయంత్రం సుమారు 5 గంటలకు కొండపైకి చేరుకున్నాము. సాయంత్రం పూట గాంధీగారు వాకింగుకు వస్తారని వారిని దర్శించుకోవడానికి అనేకమంది వారు వెళ్ళే మార్గంలో కాచుకుని నిల్చున్నారు. మోకాలి వరకూ ఖాదీ పంచ కట్టుకుని ఒక ఖాదీ అంగవస్త్రం కప్పుకొని అకస్మాత్తుగా నడుచుకుంటూ వచ్చారు. పైన షర్టు లేదు. అంతా శుభ్రమైన తెల్లని వస్త్రాలు. వారి చేతిలో కర్ర ఉందో లేదో జ్ఞాపకం లేదు. వారితో సమంగా నడవాలంటే వారి స్నేహితులు పరిగెత్తాలి. అంత వేగంగా నడిచేవారు. వారిని దర్శించుకున్నాక సాయంత్రం వారు బస చేసిన నివాసం ముందు జరిగిన ప్రార్థనాసభలో పాల్గొన్నాము. గాంధీజీగారిని మొదటిసారి చూసినప్పుడు నాపై ఎలాంటి ప్రభావమూ పడలేదు.
హైస్కూలు విద్యాభ్యాసం
జీవితంలో కొత్తమలుపు
1935వ సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీ ఎం.ఎస్.నారాయణరావుగారికి బెంగళూరు ఫోర్ట్ సెకండరీ స్కూలులో సహాయోపాధ్యాయుడిగా బదిలీ అయ్యింది. నాకు తదుపరి చదువుపట్ల ఎక్కువ ఆసక్తివున్న విషయం వారికి బాగా తెలుసు. “బెంగళూరుకు వచ్చి మా ఇంట్లో ఉండి హైస్కూలులో చదవవచ్చ”ని శ్రీ నారాయణరావుగారు చెప్పినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా యింతా కాదు. ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా నా సమ్మతిని తెలిపాను.
వారికి బెంగళూరుకు బదిలీ అయిన విషయం తెలిసి ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఊరి ప్రజలు చాలా కుంగిపోయారు. ఒక ప్రామాణికుడు, దక్షుడు, విద్యార్థులలో ఎక్కువ విశ్వాసాన్ని పొందిన ఉపాధ్యాయుణ్ణి పోగొట్టుకున్నట్టయ్యింది. వారు అందరికీ ప్రియమైనవారు. అయిష్టంగానే స్కూలు మరియు ఊరిప్రజలు వారికి వీడ్కోలు పలికారు.
బెంగళూరికి నడక
వారు మే నెలలో కుటుంబంతో సహా రైలులో బెంగళూరుకు వెళ్ళారు. వారితో పాటుగా నేనూ ఉన్నాను. గవిపుర గుట్టహళ్ళిలోని గవిగంగాధరేశ్వర దేవస్థానం నుండి చామరాజపేట వైపు వెళ్ళే ప్రధాన వీధిలో వారి ఇల్లుండేది. అది అద్దె ఇల్లు. నేను బెంగళూరుకు వెళ్ళింది ఇది రెండవతూరి. ఇంతకు ముందు సంవత్సరం శ్రీ ఎం.ఎస్.నారాయణరావు గారు కుటుంబసమేతంగా బెంగళూరుకు వెళ్ళివుండిరి. అక్కడి నుండి శ్రీ వెంకటాచలయ్యగారికి ఉత్తరం వ్రాస్తూ సెలవులు ముగియడానికి నాలుగైదు రోజుల ముందు నన్ను బెంగళూరికి పంపమని కోరారు. నాకు బెంగళూరు చూపించాలన్నదే వారి ఉద్దేశం. హొసూరు నుండి బెంగళూరుకు నడుచుకుంటూ బయలుదేరాను. మొత్తం దూరం 53 మైళ్ళు. బెంగళూరు ఎక్కడుందో మా ఇంటివారికి తెలియదు. ఇంటి నుండి రొట్టెలు కట్టించుకుని ఒకరోజు వేకువనే బయలుదేరి సాయంకాల సమయానికి దొడ్డబళ్ళాపురం చేరుకుని అక్కడ మార్గంలో ఉన్న టూరిస్ట్ బంగ్లాలో రాత్రి పడుకుని, పునః మరుసటిరోజు తెల్లవారుఝామున బయలుదేరి సాయంకాలానికి బెంగళూరు చేరుకున్నాను. బస్సు ఛార్జికి డబ్బులు లేని కారణంగా నడవవలసి వచ్చింది. నేను నడుచుకుంటూ వచ్చిన విషయం తెలుసుకుని శ్రీ నారాయణరావు గారు మందలించారు. వాపసు వచ్చినప్పుడు వారి జతలోనే రైలులో వచ్చాను. అప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ జ్ఞాపకముంది. వారి కూతురు రుక్మిణి 6-7 ఏళ్ళ పిల్ల. కంపార్టుమెంటులో వాకిలి వద్ద నిలుచుని వుంది. ఆ కాలంలో రైలుపెట్టెల తలుపులు బయటికి తెరుచుకునేవి. రైలు మాక్లీదుర్గం నుండి తొండేబావి వెళ్ళే మార్గంలో ఒక మలుపులో గడియ సరిగా వేయకపోవడంతో తలుపు బార్లా తెరుచుకుంది. ఆ పాప రైలు నుండి బయటకు పడిపోయింది. అందరికీ ఒకటే గాభరా. ఎవరో అలారం చైన్ లాగారు. కొంత దూరం వెళ్ళాక రైలు నిలిచిపోయింది. నేను, ఎం.ఎస్. నారాయణరావు గారూ రైలు దిగి వెనుకకు పరిగెట్టాము. పాప రైలుపట్టాల అవతల నేలపై పడివుంది. ఒళ్ళంతా ఒకటే రక్తం. రైలు కూడా నిదానంగా వెనుకకు వచ్చింది. నారాయణరావుగారు పాపను ఎత్తుకుని రైలు ఎక్కారు. ఎక్కువ అపాయం కాలేదు అనిపించింది. గౌరీబిదనూరు చేరిన వెంటనే అక్కడి ఆస్పత్రిలో అత్యవసర వైద్యచికిత్సలు చేశారు. అపాయం ఏమీ లేదని అక్కడి వైద్యులు కూడా భరోసా ఇచ్చారు. పాప దక్కింది. అందరికీ సంతోషం వేసింది.
1935 మే నెల చివరిరోజులు. నారాయణరావుగారు నన్ను తీసుకుని నేషనల్ హైస్కూలుకు వచ్చారు. ఫోర్త్ ఫారం (ఇప్పటి 8వ తరగతి)కి అప్లికేషన్ ఇప్పించారు. అక్కడే దానిని భర్తీ చేసియిచ్చాను. అదంతా ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం ఉంది. నన్ను తరగతిలో చేర్చుకున్నారు.
నేషనల్ హైస్కూలు
నేషనల్ హైస్కూల్ గురించి కొన్ని వివరాలు ఇక్కడ చెప్పాలి. నేషనల్ హైస్కూల్ 1917లో డా. అనిబిసెంట్ స్థాపించిన ‘థియోసాఫికల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్’ నుండి జన్మించింది. మొదట సిటీ మార్కెట్ సమీపంలో ఉన్న ‘జనోపకారి దొడ్డణ్ణ శెట్టి మాధ్యమిక పాఠశాల’ ఆవరణలో ఎస్. ఎల్. ఎన్. (శ్రీ లక్ష్మీనరసింహ) నేషనల్ హైస్కూలు పేరుతో ప్రారంభమయ్యింది. హైస్కూలు మొదలైన ఒక సంవత్సరంలోనే పాలకవర్గంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఈ కష్టసమయంలో నగరంలోని ప్రజ్ఞావంతులు, వాణిజ్య ప్రముఖులైన శ్రీ బి.కె.గరుడాచార్, శ్రీ ఎం.రామచంద్రరావు, శ్రీ సింధియా, శ్రీ ఎస్.కె. నరసింహయ్య మొదలైనవారు ముందుకు వచ్చి స్కూలును నడపడానికి తీర్మానించారు. తరగుపేటలో అద్దె భవనానికి తరలించబడింది. అప్పటి నుండి అది ఎస్.ఎల్.ఎన్ నేషనల్ హైస్కూలుకు బదులుగా నేషనల్ హైస్కూలు అయ్యింది. 1919లో నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆఫ్ మైసూర్ అనే పేరుతో ఒక పాలకవర్గం ఏర్పాటైంది. 1926లో తరగుపేట అద్దెభవనం నుండి ఇప్పుడున్న స్థలానికి తరలించారు.
నేషనల్ హైస్కూల్ ఒక త్రివేణీ సంగమంలో ఉంది. మనకు తెలిసిన ప్రసిద్ధమైన త్రివేణీ సంగమంలో గంగ, యమున, సరస్వతి నదులు కలుస్తాయి. అక్కడ సరస్వతి నది గుప్తగామిని. ఈ త్రివేణీ సంగమం బసవనగుడి, శంకరపుర, విశ్వేశ్వరపుర కలిసే చోటు ఉంది. ఇక్కడ ఏ గుప్తగామినీ లేదు. ఈ మూడు ప్రతిష్ఠాత్మక ప్రదేశాల పైకి బసవనగుడి, శంకరపుర ప్రాంతాలలో ఎక్కువ విద్యావంతులున్నారు. విశ్వేశ్వరపురలో ఎక్కువగా వ్యాపారస్థులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. స్కూలుకు ఉత్తరంవైపు విశాలమైన క్రీడామైదానం. ఇలాంటి ప్రదేశంలో రెండు ఎకరాల స్థలంలో నేషనల్ హైస్కూలును నిర్మించారు.
నేను చేరినప్పుడు స్కూలులో సుమారు 12 గదులుండేవి. అన్నీ ఒకటే అంతస్తు. పైకప్పు మంగళూరు పెంకులు కలిగి ఉన్నాయి. పాఠశాల వెనుక ఒకవైపు బీద విద్యార్థుల హాస్టలు.
దాని ఎదురు ఇంకొకప్రక్క పాఠశాలకు సంబంధించిన కృష్ణస్వామి వ్యాయామశాల. అప్పట్లో బెంగళూరులో నాలుగైదు హైస్కూళ్ళు మాత్రం ఉండేవి. సిటీ మార్కెట్టుకు దక్షిణం వైపు రెండే ఉన్నత పాఠశాలలు. ఒకటి ప్రభుత్వ ఫోర్ట్ హైస్కూలు రెండవది మా నేషనల్ హైస్కూల్.
నేషనల్ హైస్కూలులో చేరడం నా జీవితంలో అత్యంత ప్రముఖమైన సంఘటన. నా జీవన విధానాన్ని తీర్చిదిద్దడంలో హైస్కూలు పాత్ర మహత్తరమైనది.
పాఠశాలలో ఎక్కువమంది ఉపాధ్యాయులు ఖద్దరు ధరించేవారు. అందరూ గాంధీ టోపి పెట్టుకునేవారు. హిందీ భాషకు ఈ పాఠశాలలో విశేషమైన ప్రోత్సాహం ఉండేది. కొంతమంది ఉపాధ్యాయులు చరఖానుండి నూలు తీసేవారు. విద్యార్థులందరూ గాంధీటోపి పెట్టుకునే హాజరవ్వాలి. మొత్తం మీద పాఠశాల దేశాభిమానానికీ, స్వాతంత్ర్య ప్రేమకూ సంకేతంగా ఉండేది. దీనిని గాంధీ స్కూల్ అని కూడా పిలిచేవారు.
పాఠశాల జాతీయ వాతావరణం నాకేమీ కొత్తగా అనిపించలేదు. నేను మిడిల్ స్కూలులో ఉన్నప్పుడే నూలు వడికేవాణ్ణి. ఖద్దరు ధరించేవాణ్ణి. హిందీ, సంస్కృతం అంతా చదివాను. గాంధీజీ కొన్ని తత్త్వాలూ ముందే స్థూలంగా పరిచయమైవుంది.
విశిష్టమైన పాఠశాల
నేషనల్ హైస్కూలు పలురకాలుగా ఒక విశిష్టమైన పాఠశాల. అన్ని విశేషాలను ఇక్కడ వివరంగా వ్రాయడం లేదు. పాఠశాల పాఠ్యప్రణాళికలో కొత్త కొత్త అంశాలు వాటితో పాటుగా బహుప్రయోజనకరమైన పాఠ్యేతర కార్యకలాపాలు ఉండేవి. మొదటి రెండు సంవత్సరాలు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలి. అలాగే ‘నీతి బోధన’ టైమ్ టేబిల్లో ఒక భాగంగా ఉండేది. ఈ క్లాసులో నీతి, నడవడిక, అన్ని ధర్మాల సారం, మానవీయ విలువలు మొదలైన ఉపయుక్తమైన గుణగణాలను జీవితంలో అలవరచుకోనే అవసరం గురించి చెప్పేవారు. అవి విద్యార్థులకు సంకుచిత భావాలకు బదులుగా విశాలమైన మనోభావాలు ఏర్పడటానికి తోడ్పాటుగా ఉండేది.
విద్యా మాధ్యమం – స్వయంసేవక దళం
చరిత్ర, భూగోళం, పౌరనీతి, గణితం వీటన్నింటినీ కన్నడ మీడియంలోనే బోధించేవారు. దైహిక శిక్షణకు పాఠశాలలో విశేషమైన ప్రాధాన్యత ఉండేది. ప్రతి తరగతికి వారానికి ఒకసారి మా పాఠశాల ప్రక్కనే ఉన్న విశాలమైన మైదానంలో కవాతు ఉండేది. మామూలు వ్యాయామంతో పాటు లాఠీ, లెజిం, డంబెల్స్తో విద్యార్థులకు ఎక్కువ శిక్షణనిచ్చేవారు. పాఠశాలకే చెందిన కృష్ణస్వామి వ్యాయామ శాలలో ఇష్టం ఉన్న విద్యార్థులు ఉదయము, సాయంత్రము వ్యాయామం చేయవచ్చు. కుస్తీ చేయడానికి మట్టి గరిడి కూడా ఉంది. బహుశా ఇటువంటి వ్యాయామశాల ఉన్న పాఠశాల ఇదొక్కటే కాబోలు.
మామూలుగా జరుపుకునే పాఠశాల వార్షికోత్సవంతో బాటుగా కొన్ని ఉత్సవాలను పాఠశాలలో జరుపుకునేవారు. ప్రతియేటా గణేశ ఉత్సవం, గీతాజయంతి, గాంధీజయంతులను ఘనంగా పాఠశాలలో నిర్వహించేవారు. ఇంకా బుద్ధజయంతి, మహమ్మద్ పైగంబర్ జయంతి, క్రీస్తు జయంతి, శివాజీ జయంతి, తిలక్ వర్ధంతి, రాజారాం మోహన్రాయ్ వర్ధంతి సందర్భాలలో ఉపన్యాస కార్యక్రమాలు ఉండేవి.
పాఠశాలకు స్వయంసేవక దళం, వాద్య బృందం అదనపు ఆకర్షణలు. ఆ కాలంలో వాద్యబృందమంటూ చాలా అపురూపం. స్వయంసేవక దళం క్రమశిక్షణకు, సేవాకార్యక్రమాలకు పేరెన్నికగన్న అనుబంధ సంస్థ. దానిలో సుమారు 60-70 మంది విద్యార్థులుండేవారు. ఈ దళం సేవకు మారుపేరు. పాఠశాలలో జరిగే అన్నికార్యక్రమాలకు ఈ దళం భాగస్వామ్యం అనివార్యంగా ఉండేది. అంతే కాకుండా నగరంలో జరిగే అన్ని సార్వజనిక కార్యక్రమాలలో సేవలనందించి ప్రజల మెప్పును పొందేది. నేను మూడు సంవత్సరాలూ స్వయం సేవక దళంలో ఉన్నాను.
స్వయంసేవక దళ కళాకారుల వాద్యబృందం – బాజాభజంత్రి (Band Set) పాఠశాల అన్ని కార్యక్రమాలకూ ఒక అలంకారంగా ఉండేది. ఆ కార్యక్రమాలకు శోభనిస్తుండేది. పాఠశాల కార్యక్రమాలలో అతిథులను వాద్యబృందం స్వాగతం పలుకుతూ ఉండేది. దానితోపాటు స్వయం సేవక దళం నుండి గార్డ్ ఆఫ్ ఆనర్ వాద్యమైతే ఎంతో మనోజ్ఞంగా ఉండేది. నగరంలో జరిగిన కొన్ని కార్యక్రమాలలో, ఒకటి రెండు సార్లు దసరా ఉత్సవాలలో మా వాద్యబృందం ప్రేక్షకుల మెప్పును పొందగలిగింది.
మధ్యాహ్న భోజనం
పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనపథకం అత్యంత విశిష్టమైన కార్యక్రమాలలో ఒకటి. మధ్యాహ్న విరామ సమయంలో సుమారు 100 మంది పేద విద్యార్థులకు పాఠశాల పేద విద్యార్థి నిలయంలో తయారైన పులుసన్నం, చిత్రాన్నం లేదా అటుకులను ఇచ్చేవారు. వృత్తి శిక్షణ ప్రాముఖ్యతను తెలుసుకుని ఆ కాలంలోనే పాఠశాలలో కుట్టుపని, బుక్ బైండింగ్, వడ్రంగము మొదలైన పనులను కావలసిన విద్యార్థులు నేర్చుకునే సౌలభ్యం ఉండేది.
పాఠశాల కూడా పేదరికంలో పుట్టి పేదరికంలో పెరుగుతూ వచ్చింది. పాఠశాల ఆర్థిక స్థితిని సరిచేయడానికి ప్రతియేటా దీపావళి సమయంలో ఇంటింటికీ వెళ్ళి ఒక రూపాయి చొప్పున సేకరించే ‘దీపావళి నిధి’ కార్యక్రమం ఉండేది.
ఒక్కో తరగతిలో ఐదుమంది విద్యార్థులు ఆ తరగతి పంచాయత్ సభ్యులుగా ఏటేటా ఎన్నుకోబడేవారు. ఆ తరగతి క్రమశిక్షణను కాపాడడానికి ఎక్కువగా సహకరించేవారు. దానితోపాటుగా పాఠ్యేతర కార్యక్రమాలైన ఆటలు, పిక్నిక్లు, చర్చాగోష్టులు మొదలైన వాటిని రూపొందించడంలో క్లాస్ టీచర్కు సహకరించేవారు.
సుమారు 75 సంవత్సరాలక్రింద మా పాఠశాల ప్రారంభించిన కొన్ని విద్యా, విద్యేతర కార్యక్రమాలను ప్రభుత్వం తన విద్యావిధానంలో చేర్చింది. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా వీటిని అనుసరిస్తున్నాయి.
పాఠశాలలో విజ్ఞాన ప్రయోగశాల ప్రాముఖ్యతను ఏడు దశాబ్దాల కన్నా ముందే గుర్తించింది. వ్యవస్థీకృతమైన ప్రయోగశాల పాఠ్యప్రణాళికలో ఒక భాగమై ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం మనం శాస్త్రసాంకేతిక రంగాలలో ఉరకలు వేస్తూ విశేషమైన ప్రగతిని సాధించినా విద్యావిధానంలో ప్రయోగానికి తగిన స్థానం కల్పించకపోవడం అత్యంత శోచనీయం.
ఇంకో విశేషం ఏమిటంటే పాఠశాల ఉపాధ్యాయులే తమ ప్రధానోపాధ్యాయుడిని మూడు సంవత్సరాలకొకసారి ప్రజాస్వామబద్ధంగా ఎన్నుకునే పద్ధతి మా హైస్కూలులో ఉండేది.
హైస్కూలు ప్రవేశం
శ్రీ ఎం.ఎస్. నారాయణరావుగారు నన్ను నేషనల్ హైస్కూలులో చేర్పించడం నా జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన. ఇంతకుముందే చెప్పినట్లు శ్రీ ఎం.ఎస్. నారాయణరావుగారిని ఫోర్ట్ మిడిల్ స్కూలుకు సహాయోపాధ్యాయుడిగా బదిలీ చేశారు. ఫోర్ట్ మిడిల్ స్కూలు, ఫోర్ట్ హైస్కూలు రెండూ ఒకే ఆవరణలో పక్కపక్కనే ఉన్నాయి. నన్ను వారు తమ పాఠశాల పక్కనున్న ఫోర్ట్ హైస్కూలులో చేర్చివుంటే బహుశా ఇలాంటి ‘నా జీవిత చరిత్ర’ను వ్రాయడానికి కావలసిన అర్హతను సమాజంలో పొందేవాడినని ఖచ్చితంగా చెప్పడానికి సాధ్యమయ్యేదికాదు.
నేను పాఠశాలలో చేరిన కొన్ని రోజుల్లోనే కొందరు ఉపాధ్యాయుల దృష్టిలో పడ్డాను. చేరిన రోజు నుండి నా గాంధీటోపి, ఖద్దరు దుస్తులను చూసినప్పుడే ఒకరిద్దరు ఉపాధ్యాయులు నన్ను ప్రత్యేకంగా చూశారు. దానికితోడు ఆ పాఠశాల కొందరు ఉపాధ్యాయులకు మావూరి శ్రీ వెంకటాచలయ్య, శ్రీ ఎం.ఎస్. నారాయణరావు గార్ల పరిచయముండేది.
సహజంగానే నేను సంస్కృతాన్ని ద్వితీయభాషగా ఎంచుకున్నాను. మునుపే చెప్పినట్లు నేను సంస్కృతపాఠశాలలో ‘కావ్య’ పరీక్ష వరకూ చదివాను. అలాగే హిందీలోనూ రాష్ట్రభాష పరీక్షవరకు చదివాను. అందువల్ల ఈ పాఠశాల హిందీ, సంస్కృతాలు నాకు నల్లేరు మీది బండినడకలా ఉండేది. నేనే నా తరగతికి, బహుశా మొత్తం పాఠశాలకు సంస్కృత, హిందీ భాషలలో ‘పండితుణ్ణి’! సంస్కృత, హిందీ ఉపాధ్యాయుల అభిమాన శిష్యుడినయ్యాను. ఈ సబ్జెక్టులలో అవలీలగా అత్యధిక మార్కులను పొందేవాణ్ణి. నాకు మిగిలిన ఏ పాఠ్యాంశాలు కష్టం కాలేదు. గణితం, విజ్ఞానశాస్త్ర విషయాలలో నాకు ఎక్కువ ఆసక్తి ఉండేది. జ్ఞాపకశక్తికి ఎక్కువ పనికల్పించే చరిత్ర, భూగోళాలు నాకు కొద్దిగా బేజారును కలిగించేవి.
మొత్తం మీద అందరు ఉపాధ్యాయులూ ఉన్నతస్థాయి అధ్యాపకులు. వారంతా జీతం కోసం వచ్చినవారు కాదు. అనుకోకుండా ఉపాధ్యాయులైన వారు కాదు. అధ్యాపకవృత్తిని ఇష్టంతో స్వీకరించి సేవాభావంతో పాఠశాలలో చేరినవారు. ఎవరూ తూతూమంత్రంగా పాఠాలు చెప్పేవారు కాదు. పాఠ్యబోధనంతా శ్రద్ధాసక్తులతో కూడి ఎంతో ఉల్లాసంగా ఉండేది.
(సశేషం)