Site icon Sanchika

‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -6

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

కరణంగారు

[dropcap]నే[/dropcap]ను ఊరికి వెళ్ళినప్పుడు కరణంగారికి సంబంధించిన రెండు ఘటనలు నడిచాయి. పూర్వకాలంలో కరణం గ్రామానికి అత్యంత బలమైన అధికారి. వారే గ్రామానికి ‘దొర’. ‘తేన వినా తృణమపి న చలతి’ అన్నట్లు వారిని వదిలి పల్లెలో ఒక గడ్డిపోచను కూడా కదల్చలేము. వారు ఆడిందే ఆట.

వేసవి సెలవులలో నేను ఊరికి పోయివుంటిని. అప్పుడు శ్రీ హెచ్.ఎస్.గుండప్ప గౌడు గారు ఊరికి విచ్చేశారు. వారు స్థానిక సంస్థల మంత్రి. స్వాతంత్ర్యానికి పూర్వం ప్రజల నుండి ఎన్నుకోబడ్డ శాసకులకు ప్రభుత్వ పాలనలో ప్రాతినిథ్యం ఇవ్వాలని మహారాజుగారు, దివానుగారు సమాలోచన చేసి ఇద్దరు ముగ్గురిని మంత్రులను చేశారు. వారిలో శ్రీ గుండప్ప గౌడ గారూ ఒకరు. ఆ కాలంలో మంత్రులు పల్లెలకు రావడం చాలా అరుదు. మంత్రులు విచ్చేసినప్పుడు సహజంగానే పల్లె ప్రజలకు వారిని చూడాలని కుతూహలం ఉంటుంది. ధైర్యమున్నవారికి తమ కష్టనష్టాలను నివేదించుకోవడానికి ఒక అవకాశం. మంత్రులు వచ్చాక వారితో పాటు జిల్లా అధికారులు, వారి సిబ్బంది ఉండడం అనివార్యం. ఊరిలోని అన్ని చోట్లను మంత్రిగారు సందర్శించారు. కరణం వారికి అన్ని వివరాలను తెలియజేస్తున్నారు. ప్రజల విన్నపాలను సావధానంగా విని తగిన సూచనలను సంబంధించిన అధికారులుకు ఇస్తున్నారు.

మావూరిలోని ఒక శాస్త్రిగారికీ, కరణంగారికీ ఎక్కువ శత్రుత్వం ఉంది. ఇద్దరి మధ్య మాటలు లేవు. మంత్రిగారు తమ వీధిని సందర్శించినప్పుడు శాస్త్రిగారు తన ఇంటివద్దకు ఎంతో వినయంతో ఆహ్వానించారు. మంత్రిగారు అంగీకరించి వారి గృహానికి ఏతెంచారు. “మహాస్వామీ ఇక్కడ మురుగుకాలువ పారుతుంది. ఇది మా వంట ఇల్లు పక్కనే వెళుతుంది. దానిని వేరే వైపుకు మరలించమని గ్రామ కరణం వారికి అనేకసార్లు చెప్పడం జరిగింది. అంతా వ్యర్థమయ్యింది. మీరే చూడండి ఈ మురుగుకాలువ వాసన అదీ వంటింటి పక్కనే..” మంత్రిగారికి శాస్త్రిగారు చెప్పింది స్పష్టమయ్యింది. కోపంతో కరణంగారి వైపు చూసి “ఎందుకండీ ఈ మురుగుకాలువను దూరంగా పారేటట్టు చేయలేదు. దుర్గంధం పక్కనే వంటిల్లు..” అంటూ గద్దించారు. దానికి కరణంగారు “కొంచెం ఆలస్యమైంది మహాస్వామీ. క్షమించండి రేపే దీనిని సరిచేయిస్తాను” అంటూ అతివినయంతో అక్కడ చేరిన జనసమూహం సమక్షంలో హామీ ఇచ్చారు. మేమంతా దీనిని వింటున్నాము. గ్రామ పరిశీలన తరువాత అందరూ ఊరు ముందుభాగానికి ఊరేగింపుగా వెళ్ళారు. కరణంగారు మంత్రిగారు విచ్చేసినప్పటి నుండి చివరివరకు చేతులు కట్టుకునే ఉన్నారు. అంతా అయిన తరువాత మంత్రిగారికి గౌరవాదరాలతో వీడ్కోలు పలికారు. మంత్రిగారు తమ కారులో బయలుదేరారు. వచ్చిన సిబ్బంది తమతమ వాహనాలలో మంత్రిగారిని వెంబడించారు. కరణంగారు అంతవరకూ కట్టుకున్న చేతులు మామూలు స్థితికి వచ్చాయి. జనసమూహం ఇంకా కరగలేదు. అప్పుడు మొదలయ్యింది శాస్త్రిగారిపై కరణంగారి ఆక్రోశం. “ఏరా.. కొడకా, నామీదే ఆ గౌడకు చాడీలు చెబుతావా? ఏరా ఈ ఊరికి ఎవర్రా పెద్ద. నేనా ఆ గౌడనా? వాడు ఒక అరగంట ఉండి పోయాడు. ఇప్పుడు నీ వంటింటి పక్క కాదు వంటింటిలోనే ఆ కాలువ వెళ్ళేటట్టు చేస్తా. పో పోయి ఆ గౌడకే మళ్ళీ చాడీలు చెప్పుకోపో..” అంటూ వాచామగోచరంగా తిట్టారు. తక్షణం మొదలయ్యింది ఇద్దరి మధ్యా సంవాదం. ఉచ్చరించడానికి శక్యంకాని శబ్దాల జడివాన. ఇద్దరి శబ్దభండారాలలో ఎన్నెన్ని బూతు పదాలున్నాయో తెలిసిపోయింది. అక్కడున్న గ్రామస్థులు సిగ్గుతో తలవంచుకునే బూతుమాటలు. ఆ దృశ్యం ఇంకా నా కళ్ళముందే జరుగుతున్నట్టుంది. ఇద్దరూ చేతులతో కొట్టుకొనేందుకు కలియ బడటాన్ని గ్రామస్థులు తప్పించారు. ఇద్దరూ సాత్వికులు, సంస్కారవంతులు అని అనిపించుకున్నవారు ఇలాంటి అయోగ్యమైన పదాలను నోటికివచ్చినట్లు పలకడం నాకు ఆశ్చర్యం, బాధా కలిగించాయి.

కరణం గారికి సంబంధించినదే మరో ఉదంతం. ఇది మా ఊరిలోనే జరిగినట్లు నాకు జ్ఞాపకం. నేను మావూరిలో జమాబందీ జరగడం చూశాను. ఈ సంఘటన మా ఊరిలో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ జరిగింది మాత్రం నిజం.

గ్రామ వార్షిక జమాబందీ అంటే గ్రామానికి చెందిన ఆదాయవ్యయాల దస్తావేజులను అధికారికంగా తనిఖీ చేయడం. దీన్ని నడిపేవారు తాలూకా అమల్దారు. ఆకాలంలో అమల్దారు గారికి పెద్ద స్థానం, గౌరవం ఉండేది. దానికి తగినట్లుగా కొందరు అమల్దారులకు దర్పమూ, ఠీవి ఉండేవి.

గ్రామ జమాబంది ప్రజల సమక్షంలో నడుస్తుంది. నేను అప్పుడు హైస్కూలు విద్యార్థి. సెలవులలో ఊరికి వచ్చాను. చాలామంది ఊరి ప్రజలు, కొంత మంది విద్యార్థులు, యువకులు ఆసక్తితో, కుతూహలంతో జమాబంది నడవడాన్ని చూస్తూ ఉన్నాము. జమాబంది ముగిసింది. అమల్దారుగారు జమాబంది గురించి తమ తీర్పును చెప్పారు. ఎప్పుడూ జరిగినట్లే ధనం దుర్వినియోగం జరిగింది. డబ్బు దస్తావేజులను పెట్టుకునేవారు సాధారణంగా కరణంగారు. డబ్బు దుర్వినియోగం జరిగినందువల్ల కరణంగారికి కొంచెం ఎక్కువగానే జుల్మానాను విధించారు. రెడ్డిగారు, కరణంగారు గాభరా పడలేదు. ఇంతకు ముందు ఉన్నట్టే ఉన్నారు. అయితే అమల్దారుగారు జరిమానా విధించిన వెంటనే చుట్టూ ఉన్న గ్రామస్థులు అమల్దారు గారిని ఉద్దేశించి “స్వామీ, మేము అంత మొత్తం తట్టుకోలేము. మేము చాలా బీదవాళ్ళం. దయచేసి వీలైనంత జరిమానాను తగ్గించండి” అంటూ మొరపెట్టుకున్నారు. అర్థమయ్యింది కదా!

‘క్విట్ ఇండియా’ లేదా ‘డూ ఆర్ డై’ ఉద్యమం

పీఠిక

మన దేశం మొదటి నుండీ అఖండభారతంగా లేదు. అన్నీ తునాతునకలైన చిన్న చిన్న రాజ్యాలు. వాటిని పాలెగాళ్ళు, చిన్న, పెద్ద రాజులు, మహారాజులు పరిపాలించేవారు. మన దేశపు సంపద, సమృద్ధి గురించి ప్రపంచంలోని కొన్ని దేశాలు తెలుసుకున్నాయి. వ్యాపారం చేసే ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండు నుండి వచ్చి మన దేశంలో 1612లో అడుగుపెట్టింది. ఆపైన అది మనదేశపు అనైక్యత, దేశాభిమానపు కొరత, ప్రజల స్వార్థచింతన మొదలైన దౌర్భల్యాలను వాడుకుని బ్రిటీష్ సామ్రాజ్యాన్నే స్థాపించింది. దానికన్నా ముందే మొఘలులు వచ్చి మన దేశంలోని అనేక భాగాలను ఆక్రమించుకుని ఏలుకుంటున్నారు. పోర్చుగీసువారు, డచ్చివారు, ఫ్రెంచివారు కూడా మన దేశానికి వచ్చి వారివారి కాలనీలను ఏర్పరచుకున్నారు.

బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మన మొట్టమొదటి సంగ్రామం 1857లో జరిగింది. దానిని ఇంగ్లీషువారు ‘సిపాయిల తిరుగుబాటు’ అని పిలిచారు. ఈ సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంత్యాతోపే మొదలైన దేశభక్తుల శౌర్యసాహసాలు, బలిదానాలు చిరస్మరణీయము. క్రూరమైన అణిచివేత ద్వారా, బలప్రయోగంతో బ్రిటీషువారు ఆ స్వాతంత్ర్య సంగ్రామాన్ని తొక్కివేశారు. అయినా దాని సెగ రెండేళ్ళపాటు కొనసాగింది.

బ్రిటీష్ వారు ఈ సంగ్రామంలో గెలిచినా ప్రజల ముఖ్యంగా దేశాభిమానుల మనసులను గెలవలేక పోయారు. ఆ ఓటమి దేశపు స్వాతంత్ర్యం గురించిన లోతైన తలపోతలకు అవకాశమిచ్చింది. ప్రోత్సాహమిచ్చింది. మహాదేవ గోవింద రనాడే, దాదాభాయి నౌరోజి, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, భగత్ సింగ్, వీరసావర్కర్, అనిబిసెంట్ మొదలైనవారు దేశం నలుమూలలా బ్రిటీషువారి దోపిడీ, అణచివేత, బానిసత్వాలకు వ్యతిరేకంగా అమోఘమైన జాగృతిని ప్రజలలో రేకెత్తించారు.

గాంధీజీ – ఉద్యమాలు

1869లో గాంధీగారు జన్మించారు. ఇంగ్లాండులో విద్యాభ్యాసం గావించి దక్షిణ ఆఫ్రికాలో వకీలు వృత్తిని ప్రారంభించారు. అక్కడ వారు చూసిన, స్వయంగా అనుభవించిన వర్ణద్వేషానికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రతిఘటనను, సాత్విక క్రోధాన్ని సత్యాగ్రహం ద్వారా 1906 నుండి 1913 వరకు ప్రదర్శించారు.

1915లో భారతదేశానికి తిరిగివచ్చారు. అహ్మదాబాదుకు సమీపంలో ఉన్న సబర్మతి నది ఒడ్డున సబర్మతి ఆశ్రమాన్ని 1916లో స్థాపించి తమ కార్యక్రమాలను ప్రారంభించారు. అన్ని రకాల అన్యాయాలకు, దోపిడీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మొదట వారి కార్యవ్యాప్తి స్థానిక సమస్యలకు మాత్రమే పరిమితమై ఉండేది. వారు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం కన్నా ముందు వారు నడిపిన కొన్ని ముఖ్యమైన సత్యాగ్రహాలు, ఉద్యమాలను ప్రస్తావించడం సముచితం.

చంపారణ్య సత్యాగ్రహం – 1917

చంపారన్ బీహార్‌లో ఉంది. అక్కడ నీలిమందు తోటలలో పనిచేస్తున్న రైతుకూలీలను బ్రిటీష్ వారు దోపిడీ చేసేవారు. ఆ దోపిడీకి వ్యతిరేకంగా గాంధీ గారు మొట్టమొదటి సత్యాగ్రహం చేశారు.

ఖేడా సత్యాగ్రహం- 1918

గుజరాతు లోని ఖేడా జిల్లాలో పనిచేస్తున్న రైతులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నడిచిన ఉద్యమం.

రౌలట్ చట్ట సత్యాగ్రహం – 1919

ఎలాంటి వారెంటూ లేకుండా ప్రజలను అరెస్ట్ చేసి, సరైన విచారణ చేయకుండానే శిక్ష విధించడం వంటి మానవహక్కులను కాలరాచే పైశాచిక చట్టం రౌలట్ ఆక్ట్‌ను విరోధించడానికి మొట్టమొదటి దేశవ్యాప్త ఆందోళనను, సత్యాగ్రహాన్నీ నడిపారు.

అహింసాత్మక సహాయ నిరాకరణోత్యమం -1920

పంజాబులో ప్రభుత్వం నడిపిన అణచివేత, దౌర్జన్యాలు, ముస్లిముల హితానికి ధోకా తెచ్చే ప్రభుత్వ నీతి మొదలైనవాటికి వ్యతిరేకంగా దేశమంతటా ముఖ్యమైన అసహాయోద్యమాన్ని నడిపారు.

బార్డోలీ సత్యాగ్రహం – 1928

బొంబాయి ప్రెసిడెన్సీ బార్డోలి మరి కొన్నిగ్రామాల భూములపై మితిమీరి శిస్తు విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ ఆశీర్వాదంతో సర్దార్ వల్లభభాయి పటేల్ గారు అసాధారణ సామర్థ్యంతో పన్నుల నిరాకరణ సత్యాగ్రహాన్ని నడిపారు.

ఉప్పు సత్యాగ్రహం – 1930

ప్రభుత్వం ఉప్పు మీద విధించిన పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ ఈ విశిష్టమైన సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. వారు తమ అహ్మదాబాదు (సబర్మతి) ఆశ్రమం నుండి 1930వ సంవత్సరం మార్చి 12వ తేదీన 78 మంది సత్యాగ్రహులతో కలిసి 245 మైళ్ళ దూరంలో సముద్ర తీరంలోవున్న దండి అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళి 22 రోజుల తరువాత చేరుకున్నారు. ఏప్రిల్ 6వ తేదీన అక్కడ ఒకటిరెండు ఉప్పు పెల్లలను చేతిలో తీసుకుని వాటిని విరిచి వేసి ఉప్పుపై విధించిన పన్నును సాంకేతికంగా వ్యతిరేకిస్తూ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఇది ఒక అఖిలభారత స్థాయిలో ఉద్యమంగా మారింది.

మొట్టమొదటిసారి 1930 జనవరి 26వ తేదీన కాంగ్రెస్ భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని డిమాండ్ చేసింది.

అహింసాత్మక సహాయనిరాకరణోద్యమం (1931-34)

ప్రభుత్వంతో జరిగిన రౌండ్ టేబిల్ సమావేశం విఫలం కావడంతో అనేకమంది నాయకుల అరెస్టు, గాంధీ గారిని కలవడానికి వైస్రాయ్ నిరకారణ, ప్రభుత్వపు దమననీతి మొదలైనవాటికి వ్యతిరేకంగా అహింసాయుతంగా దేశవ్యాప్తంగా శాసనోల్లంఘనానికి గాంధీజీ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం సుమారు మూడు సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా జరిగింది.

వ్యక్తిగత సత్యాగ్రహం -1940

1937లో రెండవ ప్రపంచ యుద్ధం ముఖ్యంగా బ్రిటీష్ జర్మనీ దేశాల మధ్య ప్రారంభమయ్యింది. బ్రిటీషువారు మనలను సంప్రదించకుండానే మన దేశాన్ని యుద్ధంలో తమపక్షాన పాల్గొనేటట్లు చేశారు. బ్రిటీషువారి యుద్ధానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అయితే జర్మనీ దేశపు ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా బ్రిటీషువారు యుద్ధం చేస్తుండటం వల్ల కాంగ్రెస్ బ్రిటీషువారిని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. దానివల్ల గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని 1940లో మొదలెట్టారు. బ్రిటీషువారి ఈ యుద్ధానికి సహాయం చేయకూడదని గాంధీజీ ఘోషించారు. వినోబా భావే మొదటి సత్యాగ్రాహి. పౌనార్ ఆశ్రమం నుండి 1940 అక్టోబర్ 17వ తేదీన ఆ సత్యాగ్రహం మొదలయ్యింది. వారు అరెస్ట్ అయ్యాక రెండవ సత్యాగ్రాహి జవహర్‌లాల్ నెహ్రూ. ఇది గాంధీజీ ఎన్నుకున్న వ్యక్తుల సత్యాగ్రహంగా మొదలయ్యింది. ఆ తరువాత వేలాది మంది ప్రజలు జైలుకు వెళ్ళారు. ఈ సత్యాగ్రహం 1941లో ముగిసింది.

ఈ విధంగా భారతదేశం బ్రిటీషు వారినుండి స్వాతంత్ర్యం పొందడానికి అనేక ఉద్యమాలను చేసింది.

అంతిమ పోరాటం

చివరకు గాంధీజీ విసిగిపోయి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ‘డూ ఆర్ డై’ అనే అంతిమ ఉద్యమాన్ని నడపాలని నిర్ధారించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 ఆగస్ట్ 7,8 తేదీలలో బొంబాయిలో సమావేశమై క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఆమోదించింది. ఈ అంతిమ పోరాటాన్ని ప్రారంభించేముందు గాంధీజీ ఈ విషయమై వైస్రాయ్ గారికి ఉత్తరం వ్రాయాలని, అవసరమైతే వారిని కలవాలని కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. సంప్రదింపులకు వాకిలి తెరిచే ఉంది. ఈ విషయాన్ని గాంధీజీ బహిరంగంగా కూడా చెప్పారు. అయితే ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారు ఝామున బ్రిటీష్ అధికారులు హఠాత్తుగా గాంధీజీ, కస్తూరిబాయి, మహదేవదేశాయి (మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి)లను అరెస్టు చేసి పూనాలోని ఆగాఖాన్ జైలులో పెట్టారు. నెహ్రూ, పటేల్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, గోవింద వల్లభపంత్ మొదలైనవారిని అహ్మద్‌నగర్ లోని జైలులో నిర్బంధించారు. ఆ రోజు 148మందిని బొంబాయిలో అరెస్ట్ చేశారు. కాంగ్రెస్‌ను చట్టవ్యతిరేక సంస్థగా ప్రభుత్వం ప్రకటించింది.

నాయకుల అరెస్టు వార్త వ్యాప్తి చెందగానే దేశమంతా అట్టుడికింది. దేశమంతా అల్లకల్లోలమయ్యింది. లెక్కలేనంత కాల్పులు జరిగి 2000 కన్నా ఎక్కువ మంది తుపాకీగుళ్ళకు బలి అయ్యారు. అసంఖ్యాకులు గాయపడ్డారు. లాఠీచార్జీలు అయితే లెక్కేలేదు. ప్రతినిత్యం వందలాది చోట్ల లాఠీ చార్జీలు జరిగాయి. నాకు జ్ఞాపకమున్నట్లు అహ్మదాబాదులో ప్రతిరోజూ లాఠీచార్జీ జరిగింది. ఉద్యమాన్ని అణచడానికి ఆరు ప్రదేశాలలో విమానం నుండి బాంబులు వేశారు. దేనికీ ప్రజలు చలించలేదు. ఆ స్వాతంత్ర్య సంగ్రామంలో విద్యార్థుల, యువకుల పాత్ర అమోఘమైంది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, కళాశాలలు మూసివేయబడ్డాయి. అసంఖ్యాక విద్యార్థులు కాల్పులు, లాఠీచార్జ్ మొదలైన వాటిని ఎదుర్కొన్నారు.

బెంగళూరులో ఆందోళన

దేశవ్యాప్తంగా జరిగినట్లే మైసూరు రాజ్యంలో కూడా ఆందోళనలు నడిచాయి. బెంగళూరులోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ, సెంట్రల్ కాలేజీలు ఈ ఉద్యమానికి కేంద్రబిందువయ్యాయి. విద్యార్థుల ప్రదర్శనలను అణచివేయడానికి ఎప్పటిలాగే లాఠీచార్జీ, భాష్పవాయు ప్రయోగం, పోలీసు కాల్పులు యథేచ్ఛగా సాగాయి. ఎక్కడ చూసినా నిషేధాజ్ఞలే. వాటిని ఉల్లంఘిస్తూ బ్రహ్మాండమైన ఊరేగింపులు. ఊరేగింపు ముందుభాగం సిటీ మార్కెట్ దాటితే చివరి భాగం ఇంకా సెంట్రల్ కాలేజీ లోపలే ఉండేది. అంటే ఊరేగింపు పొడవు సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు. ఉద్యమం రూపురేఖలను నిర్ణయించాల్సిన కారణంగా నిషేధాజ్ఞలను ఉల్లంఘించకుండా నిషేధాజ్ఞలు లేని శివారు ప్రాంతమైన బనశంకరిలో విద్యార్థుల మహాసభ జరిగింది ఇప్పటికీ నాకు జ్ఞాపకముంది.

అప్పుడు నేను బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో ఫిజిక్స్‌లో బి.ఎస్.సి. ఆనర్స్ మూడో సంవత్సరం చదువుతున్నాను. మిడిల్ స్కూలు నుండే నాలో దేశభక్తి మొదలయ్యింది. ఆ జాతీయ దృక్పథం దినదినమూ నాలో పెరుగుతూ ఉంది. గాంధీజీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్ మొదలైన నాయకుల ప్రసంగాలను ప్రతి నిత్యం బెంగళూరు నుండి ప్రకటితమౌతున్న దిన పత్రికలు ‘తాయినాడు’, ‘విశ్వకర్ణాటక’, మద్రాసును వెలువడుతున్న ‘హిందూ’ ఇంకా గాంధీజీ సంపాదకత్వంలో వార్ధానుండి వెలువడుతున్న ‘హరిజన’ వారపత్రికలను చదివి దేశం గురించి, స్వాతంత్ర్య సాధన గురించి కావలసిన స్ఫూర్తిని పొందేవాణ్ణి. ఆ సమయంలో నేను 22 ఏళ్ళ ఉడుకు రక్తపు యువకుడిని.

గాంధీజీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమం మొదలుపెడితే నేనేం చేయాలని చాలా రోజుల ముందే సుదీర్ఘంగా ఆలోచించేవాడిని. ఉద్యమంలో పాల్గొంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేక పోయారు. నా విద్యాభ్యాసం అంతటితో ముగిసినా ముగియవచ్చు. బీదరికంలో మగ్గి స్వప్రయత్నంతో అనేక కష్టాలను అనుభవించి, ఇంకో 6, 7 నెలలలో డిగ్రీ పొందే చివరి ఘట్టంలో ఉద్యమంలో పాల్గొని అనిశ్చితమైన భవిష్యత్తుకు లోనుకావడం తగిన పని కాదని ఒక ఆలోచన. నా భవిష్యత్తు ఏమైనా కానీ దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడం యుక్తమని మరో ఆలోచన. ఇలా మనసు డోలాయమానంగా ఉండేది. కొన్ని రోజులు నిద్ర కూడా చెడగొట్టుకున్నాను. సుదీర్ఘమైన ఆలోచనల తర్వాత చివరకు ఏమైనా సరే ఉద్యమంలో పాల్గొనాలనే సంకల్పించాను.

ఆగస్టు 5,6 తారీఖులలో మా కళాశాల మిత్రులకు నా నిర్ణయాన్ని తెలిపి ఆగస్టు 9 నుండి కాలేజీకి రానని చెప్పాను. వాళ్ళెవరూ నా నిర్ణయాన్ని సమర్థించలేదు. ఆగస్టు 9 నుండి కాలేజీకి వెళ్ళలేదు.

నా అరెస్టు

అప్పుడు నేను విశ్వేశ్వరపురంలోని శ్రీ రామకృష్ణ స్టూడెంట్స్ హోమ్ ఉచిత విద్యార్థి నిలయంలో మాత్రమే ఉన్నాను. ఆగస్టు 17 లేదా 18 అనుకుంటాను. ఆరోజు పొద్దున సుమారు 8.30 గంటలకు విశ్వేశ్వరపురంలో ఉన్న సజ్జనరావు చౌక్‌లో అదే రోజు సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ఆర్యసమాజంలోని నా స్నేహితులతో మాట్లాడి మళ్ళీ స్టూడెంట్స్ హోమ్‌కు సైకిల్ మీద తిరిగి వెళుతున్నాను. సరిగ్గా ఒక పోలీస్ వ్యాన్ సజ్జనరావ్ చౌక్‌లో నన్ను అడ్డగించింది. నేను సైకిల్ నుండి దిగాను. వ్యాన్ నుండి పోలీస్ ఇన్‌స్పెక్టర్ దిగి నన్నుద్దేశించి “నీవు చట్టవ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటున్నావని తెలిసింది. అలా చెయ్యొద్దు. జాగ్రత్త” అంటూ హెచ్చరించారు. స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొనాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న నేను “మీ పని మీరు చేయండి. నా పని నేను చేసుకొంటాను” అని అన్నాను.

“ఓహో నన్నే నీవు నా పని చేసుకో అని చెప్తావా. వ్యాన్ ఎక్కు” అన్నారు. “అలాగే కానివ్వండి” అంటూ సైకిల్‌ను పక్కనే నిలుచున్న ఒక స్నేహితునికి ఇచ్చి స్టూడెంట్స్ హోమ్‌లోని సైకిల్ యజమానికి దానిని అప్పజెప్పమని చెప్పి వ్యాన్‌లో కూర్చున్నాను. “నీవు ఏ క్లాస్ చదువుతున్నావు? ఎక్కడ ఉంటావు?” అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ అడిగారు. “మూడవ సంవత్సరం బి.ఎస్.సి. (ఆనర్స్), విశ్వేశ్వరపురంలోని రామకృష్ణ స్టూడెంట్స్ హోమ్‌లో వసతి” అని జవాబిచ్చాను. “చదువుకొనేది వదిలి హాస్టల్‌లో ఉచితంగా తింటూ ఇదేనా నీవు చేసేది. నీకెంత పొగరు. నన్నే పనిచేసుకో అని ఆజ్ఞాపిస్తావా? జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమనుకొంటున్నావు?” అని దబాయించారు. “నేను ఇంకేం చెప్పాలి. నేను చెప్పినదాంట్లో తప్పేమీలేదని నాకు తెలుసు” అని ఉత్తరమిచ్చాను. ఒకటి రెండు నిముషాల తర్వాత “నీవు పేదవాడిలా కనిపిస్తున్నావు. పోనీ ఇకపై ఇలాంటి ఉద్యమాలలో పాల్గొనని క్షమాపణపత్రం వ్రాసి ఇవ్వు. ఇక్కడే వదిలేస్తాను” అంటూ కొంచెం శాంతంగా చెప్పారు. “అదంతా కుదరదు” అన్నాను. “సరే కానీయ్” అన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఆఫీసు సమీపంలో ఉన్న అలసూర్ గేట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్ళారు. క్షమాపణ పత్రం ఇస్తే వదిలివేస్తామని అక్కడున్న పోలీస్ అధికారులూ చెప్పారు. నిరాకరించాను. ఆపైన నా పేరు, చదువుతున్న తరగతి, అడ్రసు మొదలైన వివరాలు తీసుకున్న తర్వాత అదే వ్యానులో సెంట్రల్ జైలుకు నన్ను తీసుకునిపోయారు. నన్ను అరెస్టు చేసినప్పుడు లేదా సెంట్రల్ జైలుకు ఒక్కడినే వెళ్ళినప్పుడు కానీ నాకు ఏ భయమూ కలుగలేదు. దృఢచిత్తంతో అన్నింటికీ సిద్ధమై ఉన్నాను. అప్పుడు సుమారు 9.30 గంటల సమయం అయి ఉండవచ్చు. రాజకీయ ఖైదీలున్న చోటికి నన్ను తీసుకుని వెళ్ళారు. అక్కడ మా తాలూకా (గౌరీబిదనూరు) ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడైన శ్రీ ఎన్.సి.నాగయ్యరెడ్డి గారు “ఏమయ్యా ఒగడే వస్తివి? ఉప్పిండి తిందాము రా” అంటూ స్వాగతించారు. నేను వెళ్ళినప్పుడు జైలులో శ్రీ కె.టి.భాష్యం, శ్రీ చెంగళ్రాయరెడ్డి, శ్రీ టి.సిద్ధలింగయ్య మొదలైన నాయకులున్నారు. మరుసటిరోజు ప్రొద్దున దినపత్రికల సంపాదకులందరినీ అంటే ‘తాయినాడు’ సంపాదకులైన శ్రీ పి.ఆర్.రామయ్య, ‘విశ్వకర్ణాటక’ సంపాదకులైన శ్రీ తిరుమల తాతాచార్య శర్మ (టి.టి.శర్మ), శ్రీ సిద్ధవనహళ్ళి కృష్ణశర్మ, ‘జనవాణి’ సంపాదకులైన శ్రీ బి.ఎన్.గుప్త మొదలైన వారిని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తీసుకుని వచ్చారు. విద్యార్థులను కాంగ్రెస్ వారితో పాటు ఉంచడం సమంజసం కాదని భావించి మమ్మల్నందరినీ (సుమారు 25 విద్యార్థులను) ఆనేకల్ సమీపంలో ఉన్న అత్తిబెలె అనే గ్రామంలోని సత్రానికి తరలించారు. అక్కడ భోజనవసతులకు అనుకూలంగా లేదు. మమ్మల్ని అక్కడినుంచి తరలించి పక్కా జైలులో పెట్టాలని కోరాము. అధికారులు అంగీకరించలేదు. రెండు రోజులు ఉపవాసం చేసిన తరువాత మమ్మల్నందరినీ మళ్ళీ సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ సమయానికి 70-80 మంది విద్యార్థులు కొత్తగా అరెస్టయి జైలుకు వచ్చారు. విద్యార్థులను రాజకీయ నాయకుల ప్రభావం నుండి తప్పించడానికి మరుసటిరోజే మమ్ములనంతా రెండు వ్యానులలో ఎక్కించుకుని మైసూరు జైలుకు పిలుచుకువెళ్ళారు. ఆ సమయానికే ఆ జైలులో బహుసంఖ్యలో విద్యార్థులున్నారు. వారిలో ఎక్కువమంది డిటెన్యూలు, అంటే వారిపై ఇంకా కోర్టులో కేసు వేయలేదు. మరికొంతమంది పై చట్టప్రకారం కేసు పెట్టారు. ఇలాంటి వారు అండర్ ట్రయల్స్.

మైసూరు జైలులో

సుమారు 15-20 మంది ఒక్కొక్క విశాలమైన హాలులో నివసించేవాళ్ళం. పడుకోవడానికి ఒక అడుగు ఎత్తు ఏడడుగులు పొడవు, మూడడుగుల వెడల్పున్న అరుగు దానిపైన పరుపు. భోజనాలు అయ్యాక రాత్రి 9 గంటలకు తాళం వేసేవారు. ప్రతిరోజు రాత్రి ఖైదీలను లెక్కించి అందరూ ఉన్నారని నిర్ధారించుకునేవారు. జైలులోనే క్షౌరశాల. ఖైదీలకు దాని సేవలు ఉచితం. ప్రొద్దునే ఐదు ఐదున్నర గంటలకు లేవడం, ప్రార్థన, ఉపాహారం, అధ్యయనం, మధ్యాహ్న భోజనం, ఆపైన విశ్రాంతి, మళ్ళీ అధ్యయనం, టీ, వ్యాసంగ గోష్టి, సాయంత్రపు ఆటలు, దేశభక్తి గీతాల సామూహిక ఆలాపన, ప్రార్థన, భోజనం, చదువు, నిద్ర ఇదీ మా దినచర్య. పుస్తకాలను చదవడానికి, చర్చించడానికి జైలు మంచి అనుకూలమైన స్థలం. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూగారు మొత్తం 16-17 సంవత్సరాలు జైలులో ఉన్నారు. అదే సమయాన్ని వారు అధ్యయనానికి, వ్రాయడానికి ఉపయోగించుకున్నందువల్లనే ది గ్లింప్సస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, వారి ఆత్మకథ మొదలైన అమూల్యమైన గ్రంథాలను వ్రాయడానికి కుదిరింది.

ఒకరోజు మైసూరు కోర్టులో కొందరు విద్యార్థుల విచారణ జరిగింది. అది ముగిసిన తరువాత వారు సాయంత్రం వ్యానులో జైలు ముందుభాగంలో వచ్చి దిగారు. వారికీ, జైలు అధికారులకూ ఏదో ఒక విషయంలో గొడవ జరిగి జైలు లోపలికి రాకుండా జైలు బయటనే సత్యాగ్రహం చేస్తున్నారనే సమాచారం తెలియగానే మేమందరం సుమారు 300 మంది విద్యార్థులం జైలు తలుపుల వెనుక కూర్చుని వారు వచ్చేవరకూ మేమూ భోజనం చేయమని సానుభూతి సత్యాగ్రహం చేయడం మొదలెట్టాము. మాతో చర్చలు, సంప్రదింపులు జరిగాయి. ఉపయోగం లేకపోయింది. రాత్రి సుమారు 12 గంటల వరకూ రెండు సత్యాగ్రహాలు కొనసాగాయి. ఆ సమయానికి 150 మంది పోలీసులు జైలు లోపలికి వచ్చి మా ముందు వరుసగా నిలబడ్డారు. నాకు అప్పుడు కురుక్షేత్రంలో పాండవ, కౌరవ సేనలు జ్ఞాపకం వచ్చింది. పోలీసులు వచ్చిన ఉద్దేశం మాకు అర్థం కాలేదు. మేము నినాదాలను చేస్తూనే ఉన్నాము.

జైలులో లాఠీచార్జి

అటువైపు ఉన్న మా విద్యార్థి మిత్రుల వీపుపై రెండు దెబ్బలు వేస్తూ, జైలు చిన్నద్వారం గుండా ఒక్కొక్కరినే లోపలికి తోస్తున్నారు. మమ్మలందరినీ చెదరగొట్టడానికి ఆ 150 మంది పోలీసుల నుండి హఠాత్తుగా లాఠీప్రయోగం మొదలయ్యింది. ఆ ఘోర దృశ్యం నా కళ్ళముందు ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. శాంతంగా ప్రతిఘటిస్తున్నవారిపై హింసాకాండ. మేమేమీ రాళ్ళు రువ్వలేదు, బాంబులు విసరలేదు. అలసిపోయేవరకు భజన చేస్తూ వున్నాము. భోజనం మానేశాము అంతే. మమ్మల్నందరినీ పోలీసులు ఇష్టానుసారం కొట్టారు. నాకు కూడా వీపు మీద సుమారుగా దెబ్బలు పడ్డాయి. బూతులు తిడుతున్నారు. గాంధీ ఇంకా ఇతర నాయకులను నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. మేమంతా తలో దిక్కుకు పారిపోయి జైలు గదులలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాము. అయితే లాఠీ దెబ్బలకు చిక్కిన దురదృష్టవంతులైన విద్యార్థుల అవస్థ వర్ణనాతీతం. చాలా మందికి ఎముకలు విరిగాయి. తలకు దెబ్బలు తగిలిన వారి సంఖ్యా తక్కువేమీ కాదు. శంకరప్ప అనే విద్యార్థి లాఠీ దెబ్బలకు చనిపోయాడు. అయితే అతడు బ్రాంకో న్యుమోనియా ట్యూబర్‌క్యులోసిస్ వల్ల మరణించాడని ప్రకటించారు. ప్రభుత్వ నిజాయితీకి దీనికంటే వేరే ఉదాహరణ అక్కరలేదు. మధ్యరాత్రి పైశాచికమైన, అమానుషమైన లాఠీ ప్రయోగం గురించి తెలుసుకుని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల తరఫున క్షమాపణ పత్రాలను ఇచ్చి వారిని జైలు నుండి విడిపించుకుని పోయారు. ఈ దురంతం తరువాత జైలు అధికారులు మాపై నిర్బంధాన్ని ఎక్కువ చేశారు. మమ్మల్ని గుంపుగా చేరడానికి వదలలేదు.

మామూలుగా భోజనం చేస్తున్న విశాలమైన భోజనశాలకు మమ్మల్ని అనుమతించలేదు. మా గదులలోనికే తిండి, భోజనం తెచ్చి ఇచ్చేవారు. మేము దీనిని వ్యతిరేకించాము. తిండి తినలేదు. భోజనం చేయలేదు. ఒకరోజు తరువాత వెనుకటిమాదిరి భోజనశాలకు వదిలారు.

జైలు లోపల మధ్యరాత్రి నడిచిన అమానుష లాఠీచార్జి, శంకరప్పగారి మరణం వల్ల రాష్ట్రంలోని ప్రజలు రెచ్చిపోయారు. పోలీసుల ఈ దౌర్జన్యాన్ని ఖండించడానికి అసంఖ్యాకమైన సభలు, ఊరేగింపులు జరిగాయి. రాష్ట్ర ప్రజలు విద్యార్థుల యోగక్షేమాలపై ఎక్కువగా ఆందోళనను వ్యక్తం చేశారు.

ఆ జైలు నుండి సుమారు 80-90 మంది విద్యార్థులను (నాతో సహా) తరలించి వేరే భవనాలకు తరలించారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మైసూరు జైలుకు తీసుకువచ్చారు. తరువాత కొన్నివారాలకు విద్యార్థుల విడుదలకు సంప్రదింపులు జరిగాయి. దీనిలో మైసూరు సంస్థానపు హిందూ మహాసభ అధ్యక్షులైన శ్రీ భూపాళం చంద్రశేఖరయ్యగారు ముఖ్యులు. డిసెంబరు మూడవ వారంలో మమ్మల్నందరినీ ఏ షరతులూ లేకుండా విడుదల చేశారు.

విడుదల

జైలు నుండి విడుదలై మావూరు అయిన గౌరీబిదనూరు తాలూకా హోసూరికి వెళ్ళాను. ఊరి మధ్యదారిలో వెళుతూ ఉన్నాను. అక్కడున్న ఒక ఇంటివారు నాకు పరిచయస్థులు. నన్ను చూసి “ఏమప్పా నరసింహయ్య, ఇలారా అప్పా, నిన్ను చూసి చాలా రోజులయ్యింది. బాగున్నావేమప్పా” అంటూ అడిగారు. బాగున్నాను అంటూ అక్కడ కూర్చొన్నాను. వారు “ఏమో ఎక్కడో పోయింటివంటనే?” అని నర్మగర్భంగా అడిగారు. నేను ఔను జైలుకు వెళ్ళి ఉంటిని అని చెప్పాను. “అదే అదే అక్కడికే పోయావని ఎవరో చెప్పారు” అంటూ గొణిగారు. వారికి నేను జైలుకు వెళ్ళానని అడగడానికి సంకోచమో, భయమో తెలియదు. వారి నోటి నుండి జైలు అనే పదం రాలేదు.

నేను జైలులో ఉన్నప్పుడు మా తల్లిగారికి ఉత్తరం వ్రాస్తుండేవాడిని. వారు నిరక్షరాస్యులు. ఇంకొకరి ద్వారా చదివించి విషయం తెలుసుకునేవారు. రాజకీయ విషయాలు సహజంగానే మా తల్లిగారికి తెలియవు. “ఏమో గాంధీ గలాట అంట. దానికోసం ఎక్కువ మంది జైలుకువెళ్ళారంట. ఆ గుంపులో మా పిల్లవాడూ ఉన్నాడు” అంతమాత్రమే మా తల్లిగారికి తెలుసు. నాకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడేవారు కాదు. నేను ఏమి చేసినా అడ్డు చెప్పేవారు కాదు. జైలు నుండి ఇంటికి పోయినప్పుడు నన్ను పొగడనూ లేదు. తిట్టనూ లేదు. నా యోగక్షేమాలను మాత్రం విచారించుకున్నారు. నేను ఇంటికి రావడం మా తల్లిగారికీ, చెల్లెలికీ ఎంతో సంతోషమయ్యింది. నా తండ్రి మరణించి అప్పటికి ఆరేడు సంవత్సరాలు గడిచాయి.

(సశేషం)

Exit mobile version