Site icon Sanchika

‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -9

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

చెక్కు వాపస్ పంపండి

[dropcap]స్వా[/dropcap]మీ త్యాగీశానందగారు కరడు గట్టిన ఆదర్శవాది. మూలసూత్రాలకు బద్ధులైనవారు. మేమంతా ఉన్నప్పుడు రామకృష్ణాశ్రమం ఆర్థికంగా ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఉండేది. స్వామీజీ ఎవరినీ డబ్బులు అడిగేవారు కాదు. భక్తాదులనుండి స్వచ్ఛందంగా వచ్చిన డబ్బునుండి స్వాముల ఇంకా ఇతర ఆశ్రమవాసుల జీవనం గడవాలి. ఒక్కొక్కసారి అయితే దినదినగండంలా గడిచేది. ఇలాంటి ఒక సందర్భంలో ఆశ్రమానికి అప్పుడప్పుడూ వస్తూపోయే ప్రముఖ వ్యాపారవేత్త దేవరావ్ శివరాం ఆశ్రమానికి 1000 రూపాయల చెక్కు పంపారు. అక్కడ ఉన్న బ్రహ్మచారులందరికీ చాల సంతోషం వేసింది. ఆ కాలంలో వెయ్యి రూపాయలు పెద్ద మొత్తం. ఐతే స్వామీజీగారు – ఆ చెక్కును బ్యాంకుకు పంపకండి, ఒక నెల రోజులు అట్టి పెట్టండి – అని శాంతంగా సూచన చేశారు. బ్రహ్మచారులకు నిరాశ కలిగింది. భోజనానికి కష్టమైనప్పుడు స్వామిగారు ఆ చెక్కును క్యాష్ చేయవద్దని స్టే ఆర్డర్ ఇచ్చారు కదా అని గొణుక్కొన్నారు. సుమారు 15 రోజుల తరువాత దేవరావ్ శివరాం తమ ఒక అభ్యర్థిని విద్యార్థి మందిరంలో చేర్చుకొనమని ఒక సిఫారసు లేఖను పంపారు. స్వామీజీ ఆ చెక్కును వాపసు పంపమని బ్రహ్మచారులకు చెప్పారు.

ఇంకొక దృష్టాంతం. డా. బి. నారాయణరావుగారు తమ ఇంటిని విద్యార్థి మందిరానికి తాత్కాలికంగా ఇచ్చారు. వారు ఆశ్రమపు అభిమాన భక్తులు. వారు తమ ఇంటిని శాశ్వతంగా ఆశ్రమానికి వ్రాసి ఇస్తానని లేఖ వ్రాశారు. ఐతే దానిలో ఆ ఇంటిని విద్యార్థి మందిరానికే వినియోగించాలని షరతును విధించారు. “మీరు ఇచ్చే దానం ఎప్పుడూ బేషరతుగా ఉండాలి. ఆశ్రమానికి దానిని ఇచ్చాక అది మీది కాదు. దానిని తగిన విధంగా ఉపయోగించుకోవడం మా కర్తవ్యం” అని చెప్పి వారి దానాన్ని అంగీకరించలేదు. స్వామీజీ వంటివారు అపురూపమైన వ్యక్తులలో అపురూపమైనవారు. డా. బి. నారాయణరావు గారు ఆ షరత్తును ఒప్పుకోలేదు. ఇంటినీ ఆశ్రమానికి ఇవ్వలేదు.

“నీవు భవిష్యత్తులో ఏమి కావాలని అనుకుంటున్నావు?” అని స్వామీజీ అడిగారు. వెంటనే “హైస్కూలు టీచర్” అని సమాధానం చెప్పాను. అది విన్న వెంటనే నవ్వి “అంతేనా నీ ఆశ” అన్నారు. “అయితే హైస్కూలు ఉపాధ్యాయుని పని తక్కువా స్వామీజీ” అని అడిగాను. “అదేమీ కాదు. నేనూ గతంలో హైస్కూలు ఉపాధ్యాయునిగా పనిచేశాను” అని చెప్పారు. నాకేమో మొదటి నుండి ఉపాధ్యాయుడు కావాలని ఏకైక కోరిక ఉండేది.

ఒక రోజు ఒక బ్రహ్మచారి (శ్రీ శ్రీనివాస్ అని వారి పేరు) నాతో మాట్లాడుతూ “నీవు మునుముందు పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగారు. “ముక్కాలు భాగం లేదు” అన్నాను. “ఐతే ఆశ్రమంలో చేరవచ్చు కదా?” అని అడిగారు. “సాధ్యమే కాదు” అని బదులిచ్చాను. “ఎందుకు చేరవు?” అని అడిగారు. “ఆశ్రమంలో చేరితే నా స్వతంత్ర ఆలోచనలకు ఆటంకం కలుగుతుంది. నా అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి వీలు కాదు. పైగా నాకిష్టమైన సమాజ సేవను చేయడానికి కుదరదు” అని చెప్పాను. “అలా అయితే వయసు మీరిన తరువాత నిన్ను ఎవరు చూసుకుంటారు? నీకు సెక్యూరిటీ ఎవరు ఇస్తారు?” అని అడిగారు. “అలాగైతే మీరు అదే ఉద్దేశంతో ఆశ్రమంలో చేరారా?” అని ప్రశ్నించాను. “నీవు ఎప్పుడూ ఇలాంటి తలపొగరు మాటలు మాట్లాడుతావు” అని చెప్పి ఊరుకున్నారు.

ముగిసిన చదువు

ఎం.ఎస్.సి. పరీక్షలలో ఎదురుచూసినట్లే ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. ఇద్దరు స్వాములు చాలా సంతోషించారు. ఆశ్రమంలో ఉండి చదవడానికి అవకాశమిచ్చినందుకు సార్థకమయ్యింది అని అనుకుని ఉండవచ్చు. స్వామీ త్యాగీశానందగారు నేను ఇంగ్లాండుకో, అమెరికాకో పి.హెచ్.డి. విద్యాభ్యాసానికి వెళ్ళాలని ఒత్తిడి చేశారు. నాకు అప్పుడు ఇష్టంలేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వేడి ఇంకా చల్లారలేదు. స్వాతంత్ర్యమూ రాలేదు. పరదేశానికి వెళ్ళి విద్యాభ్యాసం చేయడం స్వాభిమానానికి ముప్పు కలుగుతుందని భావించాను. అయితే స్వామీజీ ఒత్తిడి రోజురోజుకూ ఎక్కువ కాసాగింది. వారికి సంజాయిషీ ఇవ్వడం కష్టతరమయ్యింది. అందువల్ల నా వివరాలన్నీ తెలుపుతూ గాంధీజీకి ఉత్తరం వ్రాశాను. పరదేశానికి విద్యాభ్యాసానికి ఏ భారతీయుడూ వెళ్ళనక్కరలేదని గాంధీజీ వారి అభిప్రాయాన్ని తమ కార్యదర్శి ఐన డా. రాజకుమారి అమృతకౌర్ ద్వారా బదులు ఇచ్చారు. దాన్ని చదివిన తరువాత గాంధీగారు నా అభిప్రాయానికి పుష్టి ఇచ్చారు కదా అని సంతోషమయ్యింది. స్వామీజీకి ఆ ఉత్తరాన్ని చూపించాను. చదివి నవ్వి ఊరుకున్నారు. అప్పటి నుండి వారు ఆ విషయాన్ని ప్రస్తావించడం తగ్గిపోయింది.

స్వామి త్యాగీశానంద గారు ఐదారేళ్ళ తర్వాత వెన్నెముక క్షయ(Spinal Tuberculosis) తో చాలా నెలలు బాధపడి బంగారుపేట ఆసుపత్రిలో మరణించారు. స్వచ్ఛమైన జీవితాన్ని గడిపినవారికి ఇలాంటి చావు ఎందుకు వచ్చిందా అని చాలా కాలం మథన పడేవాడిని.

ఆశ్రమం వదిలిన తరువాత ఆశ్రమానికి అప్పుడప్పుడూ వెళ్ళేవాడిని. ఋతాత్మానంద గారితో ఆగకుండా చర్చలు జరిగేవి. చనువు ఎక్కువగా ఉన్నందువల్ల నేరుగా, ఘాటుగా మాట్లాడినప్పుడల్లా దండించేవారు. ఇప్పుడు గవిపురంలోఉన్న స్వంతభవనంలో శ్రీ రామకృష్ణా విద్యార్థి మందిరం ప్రారంభమైనపుడు ఒక రోజు వారితో మాట్లాడుతూ “స్వామీజీ ఇప్పుడు మందిరంలో ఉన్న ఎక్కువమంది విద్యార్థులు శ్రీమంతులు. వారికి సేవ చేయడం మీ ఖర్మ. వారితో పక్కనున్న గుట్టహళ్ళిలో సమాజసేవ అయినా చేయించండి” అని కొంచెం కటువుగా అన్నాను.

గవిపురంలో నిర్మించబడిన శ్రీ రామకృష్ణ విద్యార్థి మందిరం కొత్త భవనం

“అదంతా కష్టం. అయ్యేపని కాదు.” అన్నారు. “ఏమి స్వామీజీ. సమాజ సేవ కష్టం అంటున్నారు. మీరు ఆశ్రమంలో చేరిందే సమాజ సేవ చేయడానికి. వివేకానందుని ఉపదేశాల గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వక్కరలేదు. మేమే చదువుకుంటాము” అని అన్నాను. వారికి ఎక్కడలేని కోపం వచ్చింది. “నీవెప్పుడూ అహంకారంతో మాట్లాడతావు. వయసు పెరిగే కొద్దీ నీ తలపొగరూ పెరుగుతూ వుంది” అంటూ విరుచుకుపడ్డారు.

నేను క్రమక్రమంగా ఎదుగుతున్నప్పుడు ఋతాత్మానంద గారికి సంతోషం కలిగేది. నన్ను ఉపకులపతిగా నియమించిన వర్తమానం వచ్చిన ఒకటి రెండు గంటలలో వారి ఆశ్రమంలో కలిసి ఈ విషయాన్ని తెలిపాను. నాకు పద్మభూషణ్ పురస్కారం వచ్చిన వార్తను ఉదయపు వార్తాపత్రికలలో చదివి నేను వారిని కలిసేకన్నా ముందే వారే కాలేజీకి వచ్చి నన్ను అభినందించారు. చనువుతో వారితో ఏమైనా తలబిరుసుగా మాట్లాడినా వారు తప్పుగా అనుకునేవారు కాదు. ఆ క్షణంలో ఆక్షేపించినా వారికి నామీద ఎనలేని ప్రీతి వాత్సల్యాలు చివరిదాకా ఉండేది. ఇప్పటికి రెండు సంవత్సరాల క్రితం వారి తొంభై ఒకటవ యేట కాలం చేశారు.

స్వామీ ఋతాత్మానంద

ఆశ్రమంలో రెండు సంవత్సరాలు క్రమశిక్షణతో గడిపిన కాలం నా మొత్తం జీవితంలో చాలా ప్రభావాన్ని చూపించింది. నాకు స్వామీ వివేకానంద రచనలు, వారి ప్రసంగాలు ఎక్కువ స్ఫూర్తిని ఇచ్చాయి. ఆశ్రమంలో గొడ్డు సంప్రదాయాలకు, మతోన్మాదానికి ప్రోత్సాహం లేదు. తనదైన విశాలమైన ఉదాత్తమైన ధార్మిక ఆధ్యాత్మిక చట్రంలో సేవా కార్యక్రమాలను నడుపుకొని వస్తున్న ఒక ఉత్తమమైన సంస్థ శ్రీ రామకృష్ణాశ్రమం. మెచ్చుకోవలసిన ఒక విషయమేమంటే ఆశ్రమానికీ రాజకీయ వ్యక్తులకూ ఏ సంబంధమూ లేదు. నాకు తెలిసినట్లు ఇంతవరకూ ఏ కార్యక్రమానికీ రాజకీయ వ్యక్తులను ఆశ్రమం ఆహ్వానించనేలేదు. ఇదొక అపూర్వమైన విషయం. మనకంతా తెలిసినట్లు ఎన్నో ధార్మిక మఠాలకూ రాజకీయ నాయకులకూ దగ్గరి సంబంధం. ఈ విషయంలో సాయిబాబాగారి పుట్టపర్తి ఆశ్రమాన్ని మించి ఏ మఠమూ లేదు. పలువురు ఉన్నత రాజకీయ నాయకులకు, ధనవంతులకు, పలువురు పన్ను ఎగవేతదారులకు పుట్టపర్తి ప్రశాంతి నిలయం ప్రశాంతమైన నిలయమయింది.

నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా

నేను ఆనర్స్ ఇంకా ఎం.ఎస్.సి. చదువుతున్నప్పుడే శ్రీ టి.ఎస్.కస్తూరి, శ్రీ టి.ఎస్.నరసింహన్ ఇద్దరికీ ఇంటర్మీడియట్, ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలకు ట్యూషన్ చెప్పేవాడినని ముందే తెలిపాను. అప్పుడు నా వయసు 23-24 సంవత్సరాలు. వెనుకటి రోజు ఇచ్చిన లెక్కలను నరసింహన్ సరిగ్గా చేసుకుని రాకపోతే కోపగించుకుని చెవి పిండేవాణ్ణి. ఒకసారి నరసింహన్ ఏడ్చుకుంటూ వంట ఇంటిలోవున్న వారి అమ్మగారికి “మేష్టారు నొప్పిపుట్టేలా చెవి పిండుతారు. కాబట్టి వారిని మార్చివేయ”మని చాడీ చెప్పాడు. వారు నెత్తిమీద మొట్టి “వారి దగ్గరే చెప్పించుకోవాలి, మేష్టారిని మార్చేది లేదు” అని దండించి పంపివేశారు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులకు నన్ను పరిచయం చేసినప్పుడు “వీరు నాకు హైస్కూలులో మళ్ళీ కాలేజీలో ట్యూషన్ చెప్పేవారు. నా ఎడమ చెవి చాలాసార్లు పిండి అది సొట్టగా అయిపోయింది. కావాలంటే చూడండి” అని చెవిని చూపేవారు. చెవి సరిగ్గానే ఉందని వేరే చెప్పనవసరం లేదు.

నేషనల్ హైస్కూలు రజతోత్సవం 1944వ సంవత్సరంలో కోలాహలంగా జరుపుకున్నారు. దాని స్మరణార్థం 1945వ సంవత్సరంలో నేషనల్ కాలేజీని అదే ఆవరణలో ప్రారంభించారు. అప్పుడు బెంగళూరులో ప్రైవేటు కాలేజీలు (సెయింట్ జోసెఫ్ కాలేజీ మినహా) ఏవీ లేవు. ఇంటర్మీడియట్ (నేటి ప్రీయూనివర్సిటీ) తరగతి పి.సి.ఎం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమ్యాటిక్స్) విభాగానికి ఎక్కువ డిమాండ్ ఉంది. అదొక కారణం కాగా 1945లో పి.సి.ఎం. రెండు సెక్షన్లతో, 122మంది విద్యార్థులతో కూడిన జూనియర్ ఇంటర్మీడియట్ తరగతి మొదలయ్యింది. అదే ఏడాది విజయా కాలేజ్, బసప్ప కాలేజ్ (ప్రస్తుతం రేణుకాచారి కాలేజ్), మైసూరులో శారదా విలాస కాలేజ్ మొదలైనవి ప్రారంభమయ్యాయి.

నేషనల్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ ప్రొ.కె.సంపద్‌గిరిరావు గారు నేషనల్ హైస్కూలులో ఎక్కువ కాలం అధ్యాపకులుగా, ప్రధానోపాధ్యాయులుగా సేవచేశారు. ఆ ఏడాది అధ్యాపక వర్గం ఈ క్రింది విధంగా ఉంది.

కన్నడ, సంస్కృతాలకు పార్ట్ టైం ఉపాధ్యాయులున్నారు.

1946లో నేను కాలేజీలో భౌతికశాస్త్ర అధ్యాపకుడు కావడానికి దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. కమిటీలో ఉన్నవారు ప్రముఖ నేత్రవైద్యులూ సుప్రసిద్ధమైన ప్రభా నేత్రాలయం స్థాపకులూ అయిన డా. బి. కె. నారాయణరావుగారు. డా. బి. కె. నారాయణరావుగారు బెంగళూరు మెడికల్ కాలేజీ వ్యవస్థాపకులు. వారు మా సంస్థ అధ్యక్షులు. వారితో పాటు సంస్థ కార్యదర్శి శ్రీ వి.గోపాలస్వామి అయ్యంగార్, ఇంకా ప్రిన్సిపాల్ ప్రొ. కె.సంపద్‌గిరిరావు ఈ ముగ్గురూ కమిటీ సభ్యులు. అర్జీ పెట్టుకున్నవారిని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. నాకు పని దొరికే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వచ్చిన దరఖాస్తులలో నాకే ఎక్కువ అర్హత ఉంది. లోపలికి వెళ్ళి అందరినీ నమస్కరించాను. అక్కడున్న ఒక కుర్చీలో కూర్చొనమని చెప్పారు. “మీరు ఏ ఆట ఆడతారు?” అని అధ్యక్షులైన డా. బి. కె. నారాయణరావు గారు అడిగారు. “బ్యాడ్‌మింటన్” అన్నాను. “ఛీ ఛీ మీరు ఫుట్‌బాల్ ఆడాలి” అని “సరే మీరు వెళ్ళవచ్చు” అన్నారు. ఈ ప్రశ్న తప్ప మరే ప్రశ్నా అడగలేదు. ఇదేం ఇంటర్వ్యూ అనుకుంటూ బయటకు వచ్చాను. మరుసటి రోజు కాలేజీకి ఫలితం తెలుసుకోవడానికి వెళ్ళాను. “ఎన్నికయ్యావు. ఒకటి రెండు రోజుల్లో వచ్చి చేరుకో” అన్నారు. నేను నేషనల్ హైస్కూలులో ఉన్నప్పుడు ప్రొ కె.సంపద్‌గిరిరావుగారు నా గురువులు. అనుకున్నట్టే నాకు అధ్యాపకునిగా ఉద్యోగం దొరికింది. స్వామీ త్యాగీశానంద గారికి, స్వామీ ఋతాత్మానందగారికీ ఈ విషయాన్ని తెలిపాను. వారికి చాలా సంతోషం వేసింది. నేషనల్ హైస్కూలుకూ, శ్రీ రామకృష్ణాశ్రమానికీ సన్నిహిత సంబంధం ఉండేది. స్వామీ త్యాగీశానందగారికీ, విద్యార్థి నిలయ పాలకులైన స్వామీ ఋతాత్మానంద గారికీ కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు సమర్పించి ఆశ్రమం నుండి నేషనల్ హైస్కూలుకు చెందిన బాయ్స్ హోమ్‌కు (నేను నేషనల్ హైస్కూలు విద్యార్థిగా ఉన్నపుడది పూర్ బాయ్స్ హోమ్) వచ్చాను. పేరు నుండి పూర్ అనే పదం తొలగినా విద్యార్థి నిలయపు బీదరికం కానీ, విద్యార్థుల మరియు సమాజపు బీదతనం కానీ ఏమీ తక్కువ కాలేదు. ‘పూర్’ అని ఉంటే మర్యాద తక్కువ అని దానిని వదిలివేశారంతే. నేను అంతవరకూ చెప్పులు వాడలేదు. ఉపయోగించడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. ఐతే డబ్బులు లేకపోయింది. 26 ఏండ్లు చెప్పులు లేకుండా నడిచీ నడిచీ నా కాళ్ళు ఎంత అరిగిపోయి ఉంటుందో మీరే ఊహించుకోండి. మొదటి నుండి చెప్పులు వాడివుంటే నా ఎత్తు ఇంకా పెరిగేదో ఏమో! ఒక రోజు సాయంత్రం కోటలో ఉన్న (ఇప్పుడూ ఉంది) ఖాదీ వస్త్రాలయానికి వెళ్ళి ఒక జత గదగ్ చెప్పులు కొనుక్కొన్నాను. దాన్ని వాడిన అభ్యాసం లేదు. చెప్పులు వేసుకుని నడిచే అలవాటు లేకపోతే క్లాసులో అటూఇటూ నడిచినప్పుడు అభ్యాసం కావచ్చును. ఐతే చెప్పుల మీదే ధ్యాస పోయి నా పాఠానికి కొంచెం ఇబ్బంది కావచ్చునని ఆలోచించి ముందు రోజు రాత్రి చెప్పులు వేసుకుని పక్కనే ఉన్న విశాలమైన మైదానంలో అర్ధగంట కన్నా ఎక్కువసేపు నడక ప్రాక్టీసు చేశాను. కొత్త చెప్పులు కరవవచ్చు అన్న సంగతి మిత్రుల నుండి తెలుసుకుని చెప్పులకు నూనె రాశాను.

ఆ ఏడు నన్ను కాకుండా ఈ క్రిందివారిని కొత్త ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు.

  1. శ్రీ ఎ.కె.రామచంద్ర ప్రభు, ఎం.ఎస్.సి. – భౌతికశాస్త్రం
  2. శ్రీ కె.శ్రీనివాసన్, ఎం.ఎస్.సి. – రసాయనిక శాస్త్రం
  3. శ్రీ ఎం.ఎస్.సూర్యనారాయణ శాస్త్రి, బి.ఎ. (ఆనర్స్) – గణితశాస్త్రం
  4. శ్రీ బి.పి.నంజుండయ్య, ఎం.ఎ. – ఇంగ్లీష్

అప్పుడు ఎం.ఎస్.సి. లేదా ఎం.ఎ. డిగ్రీ ఉన్న కాలేజి అధ్యాపకులకు నెలకు 100 రూపాయలు జీతం, మిగిలిన కాలేజి అధ్యాపకులకు 80 రూపాయల జీతం ఇచ్చేవారు.

కాలేజీకి స్వంత భవనం లేదు. నేషనల్ హైస్కూలులోనే ఉదయం 7.30 గంటల నుండి 10.30 గంటల వరకూ ఉపన్యాసపు తరగతులు (Lecture classes) ఉండేవి. హైస్కూలు 10.45గంటలకు మొదలయ్యేది. హైస్కూలు ప్రయోగశాలలోనే కాలేజీకి సంబంధించిన సైన్స్ ప్రాక్టికల్ క్లాసులు మధ్యాహ్నం నడిచేవి. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఉపాధ్యాయుడైన తరువాత కొన్ని నెలలు తెల్ల పైజామా వేసుకునేవాడిని. విద్యార్థిగా ఉన్నప్పుడు ఎం.ఎస్.సి. వరకూ నా ఉడుపులు తెల్ల షర్టు, దట్టి పంచ ఇంకా గాంధీ టోపీ. అన్నీ శుద్ధమైన ఖద్దరు దుస్తులే. పైజామా వేసుకుని (దీనికేమీ ప్రత్యేకమైన ట్రైనింగు అక్కరలేదు), కొత్త చెప్పులు వేసుకుని తరగతిలోనికి వెళ్ళాను. నాకు ఎటువంటి జంకుగానీ, బెదురుకానీ లేదు. ప్రైవేటు పాఠాలు చెప్పిన అనుభవముంది. అది జూనియర్ ఇంటర్ బి సెక్షన్. విద్యార్థులు చప్పుడు చేయకుండా నిలుచుకున్నారు. వారూ కొత్తవారు నేనూ కొత్తవాణ్ణి. ‘Please sit down’ అన్నాను. అందరూ కూర్చొన్నారు. హాజరు తీసుకున్నాను. అందరూ తమ ఆసనం నుండి సంపూర్ణంగా లేసి నేలకు లంబంగా, నేరుగా నిలబడి శ్రద్ధతో ‘Present Sir’ అని చెప్పి కూర్చుంటున్నారు. ఒక్కొక్క విద్యార్థి ముఖాన్ని చూస్తూ అటెండెన్స్ తీసుకున్నాను. పాఠం మొదలయ్యింది. ఒక గంట పిరియడ్ నాకు త్వరగా ముగిసినట్టయ్యింది. పాఠం వదిలి అటూఇటూ వెళ్ళలేదు. పాఠం విషయం నాకు బాగా తెలిసినదే. దానివల్ల ఎలాంటి అనుమానమూ లేకుండా బిగ్గరగా పాఠం చెప్పాను. ముగిసిన తరువాత నాకైతే సంతృప్తి కలిగింది. నా పాఠం ఎలావుంది అని విద్యార్థులను అడగటానికి సంకోచం. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వారికీ సంకోచం ఉండవచ్చు. తరువాత రెండు మూడు రోజులకు “నరసింహయ్యా పాఠమేమో బాగానే చెబుతున్నావంట. అయితే కొంచెం వేగం(speed)గా చెబుతున్నావంట. నీ స్పీడ్ తక్కువ చేసుకో” అని మా ప్రిన్సిపాలుగారైన ప్రొ. కె.సంపద్‌గిరిరావు గారు చెప్పారు. “అలాగే సార్” అన్నాను.

నేను మాట్లాడేదే స్పీడుగా. ఆ స్పీడులో అప్పుడప్పుడూ కొన్ని అక్షరాలను మింగివేస్తాను కూడా. వేగవేగంగా మాట్లాడటానికి అంత ఆత్రమూ, ఉత్సాహము కారణాలు. ఇప్పుడు కూడా అంతే అనుకుంటాను. ఐతే ఇప్పుడు స్పీడ్ కొంత తగ్గింది. జూనియర్ ఇంటర్ బి సెక్షన్‌కు నన్ను క్లాస్ టీచర్‌గా కూడా నియమించారు. జూనియర్ ఇంటర్ ఎ సెక్షన్‌కు కూడా పాఠాలు చెప్పేవాణ్ణి. ఆ ఏడు సీనియర్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ క్లాసులు మాత్రం తీసుకున్నాను.

1945లో చేరిన మొదటి బ్యాచ్ విద్యార్థులు ఎక్కువగా నేషనల్ హైస్కూలు విద్యార్థులు. సీనియర్ ఇంటర్‌కు మాత్రమే పబ్లిక్ పరీక్షలు. జూనియర్ ఇంటర్ వారికి ఆయా కాలేజీ వారే పరీక్షలు నిర్వహించేవారు. ఈ మొదటి బ్యాచు వారికి 1947 మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు ముగిసాయి. నేను వేసవి సెలవులు ముగించుకుని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెలువడిన తరువాతి రోజు కాలేజీకి వచ్చాను. ప్రిన్సిపాల్ సంపద్‌గిరిరావు గారిని చూసి మన కాలేజీకి రిజల్ట్స్ ఎలా వచ్చాయి సర్ అని అడిగాను. వారు విచారంగా 20 శాతం వచ్చిందని చెప్పారు. వారు నెత్తిపై చెయ్యిపెట్టుకోవడం ఒకటే బాకీ. చాలా నీరసించిపోయారు. పక్కనున్న విజయా కాలేజీలో 45 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిసింది. నేను ఆ రోజు మా ప్రిన్సిపాల్ గారితో ఆ సన్నివేశంలో చెప్పిన మాటలు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి.

“మీరు ఎందుకు విచారిస్తున్నారు సార్. సవాలును స్వీకరిద్దాము. ముందుముందు ఉత్తమ ఫలితాలను సాధించి అందరినీ మించిపోదాము” అన్నాను. నాకు అప్పుడు 26-27 యేళ్ళ వయసు యొక్క ఉత్సాహం, పౌరుషం, దానితో పాటు సవాళ్ళను ఎదిరించి యథాశక్తి గెలిచిన అనుభవం. సంపద్‌గిరిరావు గారికి 50 యేళ్ళ వయసు. వయసేమీ ఎక్కువ కాకపోయినా వారిది మృదు స్వభావం. సమస్యలను ఎదురించి గెలవాలన్న చురుకు తక్కువ.

సరే. ఆ రోజు నుండి మొదలయ్యింది మా ప్రయత్నం. ఏమైనా కానీ మంచి ఫలితాలను ఆ యేడు పొందేతీరాలన్న పంతం. ఆ సంవత్సరం మాకు ఇంకొక ప్రతికూలమైన సమస్య ఎదురయ్యింది. మా కాలేజీకి వచ్చిన తక్కువ ఫలితాలను చూసి మా హైస్కూలు విద్యార్థులు భయపడ్డారు. మా కాలేజీలో చేరితే తమ భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందని ఎస్.ఎస్.ఎల్.సి.లో ప్రథమ శ్రేణి పొందిన మా స్కూలు విద్యార్థులు అనేకులు చెప్పా పెట్టకుండా విజయా కాలేజీలో చేరారు. దానితో మా కాలేజీలో ఆ యేడు జూనియర్ ఇంటర్ విద్యార్థుల సంఖ్య బాగా పడిపోయింది. సీనియర్ ఇంటర్మీడియట్‌లో వీలైనంత మంచి ఫలితాలను పొందాలన్న ప్రయత్నం మొదలయ్యింది. నెలకొక టెస్టు, విరివిగా స్పెషల్ క్లాసులు మొదలయ్యాయి. ఆదివారాలు, మిగిలిన శెలవురోజుల్లోనూ విద్యార్థులను సతాయించేవాళ్ళం. అప్పుడు మా కాలేజీ ఆఫీసులో ఒక గుమాస్తా, ఒక నాలుగవ తరగతి నౌకరు మాత్రమే ఉన్నారు. పరీక్షలకు సంబంధించిన పనులన్నీ మేమే చేసేవాళ్ళం. ప్రతి బెంచిమీద ప్రశ్నా పత్రాలు, సమాధానం వ్రాయడానికి అవసరమైన పేపర్లు పెట్టడం, ఆ పేపర్లు ఎగిరిపోకుండా ఉండటానికి ప్రతి విద్యార్థి ముందూ పేపర్ వెయిట్‌లాగా ఉపయోగపడటానికి ఒక రాయి పెట్టడం వంటివి చేసేవాళ్ళం. బెంచీల మీద విద్యార్థుల రిజిస్టర్ నెంబరు వ్రాయడం, దానికన్నా ముందు అన్ని బెంచీలు పరీక్ష వ్రాయడానికి అనుకూలంగా సర్దడం ఈ పనులన్నీ మేమే చేసేవాళ్ళం. పరీక్ష అయిన తర్వాత విద్యార్థుల మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయడం, ప్రతి సబ్జెక్టులో సరాసరి మార్కులు తీయడం, ఏఏ సబ్జెక్టులలో విద్యార్థి ఫెయిల్ అయ్యాడో వాటిని ఎత్తి కనిపించేటట్టు చేయడం – ఈ పనులన్నీ మావే. చెత్త ఊడ్చడం మినహా (చెత్త ఊడ్చడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఆ పనిని విద్యార్థి దశలో చాలాసార్లు చేశాను.) మిగిలిన అన్ని పనులు సంతోషంగా చేసేవాళ్ళం. ఒక రోజు ఆదివారం స్పెషల్ క్లాసు తీసున్నాను. ఒక పిల్లవాడు లేచి నిలబడి “సార్, ఉన్న ఒక సెలవురోజు ఆదివారం మీరు స్పెషల్ క్లాస్ తీసుకుంటే మేము సెలూన్‌కు ఎప్పుడు వెళ్ళాలి” అని తన కష్టాన్ని చెప్పుకున్నాడు. మిగిలిన విద్యార్థులు నవ్వుతూ ఆ విద్యార్థికి తమ మద్దతును పరోక్షంగా ప్రకటించారు. ఇంకా అవసరం ఉన్న విద్యార్థులకు రాత్రిపూట నేను పాఠం చెప్పేవాడిని. ప్రైవేట్ ట్యూషన్ అని డబ్బులు తీసుకునేవాణ్ణి కాదు. సుమారు 10 మంది విద్యార్థులు వచ్చేవారు. కొన్ని రోజులు నా గదిలోనే పాఠం చెప్పి మరికొన్ని నెలలు విశ్వేశ్వరపురంలో ఉండే ప్రముఖ కళాకారులైన ప్రభాకర్ గారింట్లో పాఠం చెప్పేవాడిని. నెట్టకల్లప్ప సర్కిల్‌లో ఉన్న మా విద్యార్థి శ్రీ ఎం.ఆర్.శ్రీనివాసరావు (ఎం.ఇ.ఎస్. టీచర్స్ కాలేజీ ప్రిన్సిపాలుగా పనిచేసారు. ఇప్పుడు జీవించిలేరు.) ఇంటిలో రాత్రి తొమ్మిది నుండి 11 గంటలవరకు పాఠాలు చెప్పేవాడిని. ఆ సంవత్సరం నేను కాలేజీలో భౌతికశాస్త్రంతో పాటు గణితశాస్త్రం బోధించాను. నాకు గణితం అప్పుడూ ఇష్టం. ఇప్పుడూ ఇష్టం. 1947 ఆగష్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఐతే మైసూరు రాజ్యంలో ఇంకా దివాన్‌గారి పరిపాలనే కొనసాగుతుంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని సాధించడానికి సెప్టెంబరు నెలలో ‘మైసూర్ ఛలో’ అనే ఉద్యమం మొదలయ్యింది.

‘మైసూరు చలో’ ఉద్యమం

పీఠిక

‘క్విట్ ఇండియా’ ఉద్యమం విజయవంతంగా ముగిసింది. మనదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం 1947వ సంవత్సరం ఆగష్టు 14వ తారీఖు మధ్యరాత్రి వచ్చింది. ఢిల్లీలో రాత్రి 12 గంటలకు నడచిన సమారంభం చిరస్మరణీయం. జవహర్‌లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి. దేశమంతటా అదే సమయానికి సంబరాలను జరుపుకున్నారు. మా సంస్థలు కోలాహలంగా భారత స్వాతంత్ర్యోత్సవాన్ని ఆచరించాము. మాకైతే ఉత్సాహమే ఉత్సాహం. అందులో నా సంతోషానికి అంతే లేదు. ఆ చివరి స్వాతంత్ర్య సంగ్రామంలో నా ఉడుత సాయం కూడా ఉందన్న గొప్ప సంతృప్తి. ముందే చెప్పినట్లు నేను నేషనల్ కాలేజీ అధ్యాపకుడినై సుమారు 13-14 నెలలయ్యింది. అదే విద్యార్థి నిలయంలో ఉన్నాను.

విద్యార్థి నిలయం ముందే ఈ సందడి, సంబరాలు. అధ్యాపకులు, విద్యార్థులు ఇంకా కొంతమంది దేశాభిమానులు, జాతీయభావం కలిగినవారు పాల్గొన్నారు. సరిగ్గా 12 గంటలకు బ్యూగల్ (Bugle) బాకాతో జాతీయపతాకం గంభీరంగా పైకి లేచింది. మాకంతా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. చివరికి వందేళ్ళ దాస్యం నుండి విముక్తి పొంది గర్వంగా స్వతంత్ర పౌరులయ్యాము.

భారతదేశాన్ని పరిపాలనా దృష్టితో రెండు భాగాలుగా చేయవచ్చు. ఒకటి ఇంగ్లీషువారి నుండి నేరుగా పరిపాలనకు లోబడిన బ్రిటీష్ ఇండియా. మరొకటి ఇంగ్లీషువారి ఆధీనానికి లోబడిన రాజ మహారాజుల పరిపాలనలో ఉన్న దేశీయ సంస్థానాలు. ఇలాంటివి 500కన్నా ఎక్కువ వున్నాయి. వీటిని చిన్న పెద్ద రాజులు మహారాజులు పరిపాలిస్తున్నారు. వారి పరిపాలనపై పర్యవేక్షకులుగా బ్రిటీష్ సర్కారు నియమించిన రెసిడెంట్లు (Residents) ఉండేవారు.

మైసూరు సంస్థానానికి మా మహారాజుగారే ముఖ్యులు. పరిపాలనలో సహాయం చేయడానికి ఒక దివాను, మంత్రి మండలి, ప్రతినిధి సభ (Representative Assembly), ఇంకా న్యాయవిధాయక సభలు (Legislative Council) ఉన్నాయి. 1881లో రంగాచార్లు దివానుగా నియమితులయ్యారు. ఆ సంవత్సరం దసరా సమయంలో ప్రముఖ వ్యాపారస్థులు, భూస్వాములు దసరా దర్బారులో చేరినప్పుడు వారితో ఒక ప్రతినిధి సభను స్థాపించారు. ఆ సభలో 144 మంది సభ్యులున్నారు. 1902లో న్యాయ విధాయక సభకు 10-15 మంది మాత్రం ఉన్నారు. ఇవన్నీ ఎక్కువగా విజ్ఞప్తులు, విన్నపాలు, సాధక బాధకాలను ప్రభుత్వానికి నివేదించే సభలు. వీటికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. కాలక్రమేణా సంఖ్య దృష్టితో కానీ, ఎన్నుకోబడే సభ్యులున్న ఈ సభల స్వరూపంలో మార్పులు వచ్చినా వీటికి ఎటువంటి ప్రాథమిక అభివృద్ధి, చట్టాలు చేయడానికి అవకాశం లేదు. సహజంగానే ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా లేదు.

ప్రపంచంలోని ఇతర దేశాల పరిపాలనా విధానాలతో ప్రభావితులైన ఉదారవాద మేధావులు జవాబ్దారీ ప్రభుత్వపు (Responsible Government) ఆలోచనను కొన్ని దశాబ్దాల ముందే ప్రజల ముందు ఉంచారు. కాలక్రమేణా ఇది అన్ని పార్టీల డిమాండ్ అయ్యింది. ఈ డిమాండుకు అఖిల భారత జాతీయ కాంగ్రెస్, గాంధీగారి నాయకత్వంలో నడచిన అనేక ఉద్యమాలు తాత్వికంగా పుష్టినిచ్చాయి. దీనికి 1937లో ప్రారంభమైన మైసూరు కాంగ్రెస్ ఆశీర్వాదం, మద్దతు ఉండేవుంది.

 

1938లో మైసూరు కాంగ్రెస్ మొదటి సభలు మద్దూరు సమీపంలోని శివపురంలో శ్రీ టి.సిద్ధలింగయ్యగారి అధ్యక్షతలో నడిచి ‘జవాబ్దారీ ప్రభుత్వం తన అత్యంత ముఖ్యమైన డిమాండు’ అని నిర్ణయం చేసింది. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో మైసూరు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, విద్యార్థులు, యువకులు హృదయపూర్వకంగా పాల్గొన్నారు. సహజంగానే ఈ వ్యవధిలో జవాబ్దారీ ప్రభుత్వం కోరిక రెట్టింపయ్యింది.

1947 ఆగష్టు 15న ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. ఐతే ఆ స్వాతంత్ర్యం బ్రిటీష్ ఇండియాకే వచ్చింది. దేశీయ సంస్థానాల పరిపాలనా విధానంలో ఈ స్వాతంత్ర్యం నుండి ఏ మార్పూ జరగలేదు. ఆగష్టు 15 తరువాత రాజ మహారాజులకు తమ తమ సంస్థానాలలో జవాబ్దారీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఏ అడ్డూ లేకపోయింది. అయితే సాధారణంగా అధికారంలో ఉంటూ, మితిలేని సౌకర్యాలను అనుభవిస్తూ, దాదాపు నిరంకుశపాలనను చేసినవారు తమకు తామే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ అధికారాన్ని గానీ, సౌకర్యాలను కానీ వదులుకోలేరు. అంటే జవాబ్దారీ ప్రభుత్వం పొందడానికి ప్రజలవద్ద ఉన్నది ఒకటే మార్గం – ప్రభుత్వాలతో సంఘర్షణ, ఉద్యమం, సత్యాగ్రహం, సహాయనిరాకరణ మొదలైనవి. జవాబ్దారీ ప్రభుత్వం కోసం ఇలాంటి ఒక స్వాతంత్ర్య ఉద్యమం ఆగష్టు 15 తరువాత తీవ్రమయ్యింది. అప్పుడు శ్రీ జయచామరాజేంద్ర ఒడయార్ మహారాజుగా ఉన్నారు. ఆర్కాట్ రామస్వామి మొదలియార్ దివానుగా పనిచేస్తున్నారు. దాదాపు దివానుగారితో సమానంగా అధికారం, శక్తి కలిగినవారు మహారాజుగారి ప్రియమైన కార్యదర్శి శ్రీ తంబుచెట్టి. జవాబ్దారీ ప్రభుత్వానికై వీరందరితో నడిపిన చర్చలు విఫలమయ్యాయి.

మైసూరు చలో

1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దివాన్ ఆర్కాట్ రామస్వామి మొదలియార్ జాతీయ జెండాని ఎగురవేయలేదు. రాజభవనం మీద, ప్రభుత్వ భవనాల మీద జాతీయ జెండాకు స్థానం లేదు. అయితే బెంగళూరు అఠారా* (పద్దెనిమిది ప్రభుత్వ కార్యాలయాల సముదాయం) కచేరీపై ఇద్దరు ధైర్యవంతులైన కార్మికులు జాతీయజెండాను ఎగురవేశారు. ఆగష్టు 21 నుండి 30 వరకు మైసూరు కాంగ్రెస్ కార్యాచరణ సమితి సభ్యులు పూర్తి జవాబుదారీ ప్రభుత్వం గురించి ప్రజలను జాగృతం చేయడానికి మైసూరు సంస్థానం అంతటా పర్యటించారు. కార్యాచరణ సమితివారే ఈ ఉద్దేశం సాధించడానికి తమ నిర్మాణాత్మకమైన వ్యవస్థను రద్దు చేసి సెప్టెంబరు 1 నుండి సర్వాధికారిని నియమించారు. శ్రీ కె.చెంగల్రాయరెడ్డి మొదటి సర్వాధికారి.

బెంగళూరులోని సుభాష్ నగర్‌లో (ఇప్పటి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాండ్) సెప్టెంబరు 1వ తేదీన భారీ సభ ఏర్పాటు చేశారు. ఆ కాలంలోనే ఒకటిన్నర లక్షల మంది హాజరయ్యారు. దానికన్నా ముందు సుమారు 3 మైళ్ళ పొడవున్న అపూర్వమైన ఊరేగింపు. మొదటి సర్వాధికారి అయిన శ్రీ కె.సి.రెడ్డిగారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి మైసూరు రాజ్యంలో తక్షణం సంపూర్ణ జవాబుదారీ ప్రభుత్వం స్థాపన జరగాలని ఘోషించారు. దానితో పాటు ఒకటి రెండు కోరికలూ ఉన్నాయి. వాటి సాధన కోసం అందరూ మైసూరుకు పోయి నిషేధాజ్ఞలను ఉల్లంఘించాలని పిలుపునిచ్చారు. ‘మైసూరు చలో’ సత్యాగ్రహం ఇలా మొదలయ్యింది. శ్రీ కె.సి.రెడ్డి గారిని, ఇతర నాయకులను సెప్టెంబర్ 4న అరెస్టు చేశారు.

మైసూరు కాంగ్రెస్ యొక్క జవాబ్దారీ ప్రభుత్వం డిమాండు మొదలైనప్పటి నుండీ దీని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం భారతదేశపు స్వాంతంత్ర్యానికి నడిచిన యుద్ధం. అలాగే ‘మైసూరు చలో’ ఉద్యమం మైసూరు రాజ్యపు స్వాతంత్ర్యం (జవాబ్దారీ ప్రభుత్వం) కోసం నడుస్తున్న సత్యాగ్రహం. నన్ను క్విట్ ఇండియా ఉద్యమంలో భాగం వహించడానికి ప్రేరేపించిన కర్తవ్య ప్రజ్ఞయే ‘మైసూరు చలో’ ఉద్యమంలో పాల్గొనడం సముచితమని సహజమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇది తార్కికంగా సమంజసంగానే ఉంది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి ముందు నా ముందున్న విద్యాభ్యాసం, డిగ్రీ, భవిష్యత్తు మొదలైన వాటి గురించి ఆలోచించాను. ఇప్పుడు విద్యాభ్యాసం ముగిసింది. మంచి కాలేజీలో ఉద్యోగం దొరికింది. చాలా పేదరికం నుండి వచ్చిన నాకు, నా తల్లికి, చెల్లెలికి పేదరికపు సెగల నుండి ఉపశాంతిని పొందే సమయం. కూలినాలి చేసి దుర్భర జీవితం గడుపుతున్న మా తల్లిగారికి, చెల్లెలికి రెండుపూటల తిండికి ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడు నేను ఉద్యమంలో పాల్గొంటే నైతిక దృష్టితో నా ఉద్యోగానికి రాజీనామా చేయాలి. కాలేజీ అధ్యాపకుడిగా ఉద్యమంలో భాగంవహిస్తే కాలేజీని రాజకీయాలలోకి లాగినట్లవుతుంది. దానివల్ల నేను కాలేజీకి ద్రోహం చేసినట్లవుతుంది. రాజీనామా ఇచ్చి ఉద్యమంలో దుమికితే భవిష్యత్తు అనిశ్చితమై పోతుంది. క్విట్ ఇండియా ఉద్యమంలో దుమికినప్పుడు ఒక ధర్మ సంకటం. ఇప్పుడు మరో ధర్మ సంకటం. రాజీనామా చేస్తే కాలేజీకీ, నాకూ సంబంధం తెగిపోతుంది అని తెలుసు. నేను నేషనల్ హైస్కూల్ విద్యార్థిని. దాని పేద పిల్లల విద్యార్థి నిలయం నాకు అన్నం పెట్టి చోటును కల్పించింది. పైగా స్కూలు వదిలిన తరువాత నా కష్టకాలంలో ఆదుకున్న సంస్థలు అవి. కాలేజీ మరియు హైస్కూలు అధ్యాపకులతో, కాలేజీ విద్యార్థులతో భావోద్వేగాలతో కూడిన సంబంధం ఉంది. రాజీనామా ఇచ్చిన తరువాత ఇవన్నీ పోగొట్టుకునే అవకాశముంది. ఇవన్నీ నా జీవితంలో భర్తీ చేయలేని నష్టాలు కావచ్చు. ఇలా తీవ్రంగా ఆలోచించీ ఆలోచించీ నాకు ఎలాంటి నష్టం కలిగినా, నా తల్లికీ, చెల్లికీ ఎలాంటి కష్టం కలిగినా సరే కర్తవ్యానికి ప్రాధాన్యత నివ్వాలని, ఉద్యోగానికి రాజీనామా చేసి ‘మైసూరు చలో’ ఉద్యమంలో పాల్గొనాలని తీర్మానించాను.

(సశేషం)

Exit mobile version