[dropcap]ప్రే[/dropcap]మగా తలుపు తట్టే హస్తం
ఆశగా ఎదురు చూసే నేస్తం
నిన్ను ఎరుగని మనిషి లేడు
నిన్ను తలచని మనసు లేదు
రోజూ తలుపు తట్టవనీ తెలుసు
రోజూ కబురు పుట్టదనీ తెలుసు
అయినా!
నీ పిలుపు కోసం ఆలోచన
నీ దర్శనం కోసం ఆవేదన
నీ ఖాకీ సంచీ లోంచి మెడలు పైకెత్తి
కనిపించే రంగురంగుల ఉత్తరాల దొంతరలు
సంతోషమే కలిగిస్తాయో!
సంతాపమే మిగులుస్తాయో!
మదిలో కలగా పులగపు ఆలోచనా పరంపరలు
***
ఇవన్నీ
మా హృదయాల్లో నిలిచిపోయిన
గతకాలపు తీపి జ్ఞాపకాలు
గురుతుకొచ్చినప్పుడల్లా
నీ నుంచి అందుకున్న ఉత్తరాలు
ఆప్యాయంగా మళ్ళీ తిరగేస్తాం
గతించిన కాలం మదిలో నెమరేస్తాం
పదే పదే నిన్ను తలుచుకుంటాం
మాలో మేము మురుసుకుంటాం
ఇప్పుడు యిక కాలం మారిపోయింది
అంతర్జాలం రక్కసి నిన్ను మింగేసింది
ఏ మాంత్రికుడైనా
నిన్ను ఆ సీసా లోంచి వెలికి తీస్తే బాగుణ్ణు
మళ్ళీ మళ్ళీ మాకు నువ్వు కనిపిస్తే బాగుణ్ణు
ఓ పోస్టుమాన్!