[box type=’note’ fontsize=’16’] లక్ష సలహాలు, వెయ్యి వ్యాసాలు చేయలేని పని ఒక్క కథ చేస్తుందంటారు. అంత శక్తివంతమయిన ప్రభావం చూపుతుంది ప్రతిభావంతుడయిన రచయిత సృజించిన చిన్న కథ. అందుకు నిదర్శనం ఐతా చంద్రయ్య రచించిన కథ “పొట్లం”. [/box]
కలిసొచ్చే అదృష్టానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్న సామెత అంతరార్థాన్ని అప్పుడే అర్థం చేసుకున్న శివప్రసాద్ సంతోష సాగర కెరటాలతో దాగుడుమూత లాడుకుంటున్నాడు. పేరున్న ప్రైవేటు కంపెనీలో కోరుకున్న ఉద్యోగం దొరికిన నెలరోజుల్లోనే పెళ్లి ఖరారైంది. రాబోయే రోజుల్లో కాబోయే అర్ధాంగి అవనిజ మనసు తెర మీద ప్రత్యక్షమై ముసిముసిగా నవ్వుతోంది.
పెళ్ళి చూపుల శుభముహూర్తములో రాయంచలా నడిచి వచ్చి, వయ్యారంగా కూచుని, ఓరచూపులతో ఒళ్లంతా తడిమింది. కుందన బొమ్మతో తొలిచూపులు కలియగానే తాను సంతోషాన్ని తట్టుకోలేక “వారెవ్వా! క్యా ఫిగర్ హై” అంటూ ఎగిరి గంతేసినంత పంజేసిండు. అమ్మానాన్నలో పక్కన, జిగ్రీ దోస్త్ కృపాసాగర్ మరో పక్కన కూచున్నారన్న సంగతి గుర్తుకు రాలేదు. అందరూ గొల్లున నవ్విండ్రు. అవనిజ మందహసం అలరించింది.
తన ఉద్యోగం సంగతి అవనిజ వాళ్ల కంతకు ముందే తెలుసు. ఆరమరికలకు ఆస్కారం లేకుండా పెళ్లి సంబంధం వెంటనే ఖాయమైంది. కాని….. అవనిజ మెడలో మూడు ముళ్ళేసి, వెంట ఏడడుగులు నడిపించుకోవాలంటే పెళ్లి ముహూర్తం కోసం మూడు నెలల నిరీక్షణ తప్పదు. విరహం గూడా వింత అనుభూతినిస్తూ గిలిగింతలు పెడుతోంది.
మర్నాడు…. రోజులాగే సాయత్రం కృపాసాగర్ వాళ్ళఫీసు నుండి వస్తూ పార్కులో కలిశాడు. భుజాలు ఒరుసుకునేలా పక్క పక్కన కూచున్నారు. కృపాసాగర్ నోటి నుండి కొత్త వాసన వస్తోంది. కొద్దిసేపు అతని సంసారం, తనక్కాబోయే అర్ధాంగి ఇతివృత్తంగా పిచ్చాపాటి సాగింది. ఆ తర్వాత నోట్లో ఉన్న దాన్ని స్టైల్‌గా నముల్తూ కృపాసాగర్ “నాకు మా ఊరు మంచిర్యాలకు ట్రాన్సఫరైంది. వెళ్లిపోతున్నాను మిత్రమా” అంటూంటే పడమటి సూర్యకిరణాలు అతని పెదాల మీద పరావర్తనం చెందినై.
తనకు ఆశ్చర్య సాగరంలో మునిగినట్టైంది.
అత్యంత సన్నిహితుడైన కృపాసాగర్ చలాకీగా ఉంటాడు. హుషురుగా మాట్లాడ్తాడు. అతని హుషారుకు కారణమైన దాన్ని తనకు రుచి చూపించి ఆత్మీయుడయిండు.
యాంత్రికంగా పాంటు జేబులోంచి పొట్లం నాజాగ్గా తీసి విప్పి నోట్లో వేసుకుంటూ “నువ్వు మీ సొంతూరికి పోవడం ఖుషీయే కాని నాకు బాధగా ఉంది మిత్రమా” విచారం వెలిబుచ్చిండు తను.
కృపాసాగర్ నవ్విండు. ఆ నవ్వు హుందాగా వుంది. భుజమ్మీద చెయ్యేసి “ఇంకెందుకు బాధ… పెళ్లి ఖాయమైందిగదా. కాబోయే అర్ధాంగితో సినిమాలు, షికార్లు… అదో థ్రిల్లింగ్ గదా…” ఉచిత సలహా ఊదేసిండు.
నోట్లోది నమల్తూంటే తన నరాల్లోంచి ఉత్సాహ స్వరాలు వినబడుతున్నై. “మిత్రమా ఈ పొట్లం రుచి చూపించి నన్ను హుషారు జేస్తివి. ఈ పొట్లాన్ని విప్పినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు”.
కృపాసాగర్‌కు చక్కిలిగింత పెట్టినట్టైంది. మరో పొట్లం విప్పి నోట్లో వేసుకున్నాడు. నేనీ పొట్లాన్ని మూడేండ్ల నుంచి నముల్తున్నాను…” ఇంకేదో చెప్పబోయిండు కాని దగ్గుతెర అడ్డుకుంది.
“అదేందో మిత్రమా ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు పొట్లం మహత్యం… రుచికి రుచి, ఉత్సాహానికి ఉత్సాహం.” తాను ఆనందతరంగాల్లో తేలిపోయిండు.
కృపాసాగార్ మంచిర్యాల కెళ్లే ముందు శివప్రసాద్ వాళ్లింటి కెళ్లి లగేజి సర్దడంలో సాయం చేస్తున్నాడు. కృపాసాగర్ భార్య “ఏందో అన్నయ్య! నీ పెళ్లి కాకముందే మేము వెళ్లిపోతున్నాం” అంటూ విచారం వెలిబుచ్చింది.
“ఐనా ఏముంది చెల్లెమ్మా మీరు నా పెళ్లికి వారం రోజులు ముందుగా రావాలి. లేకపోతే మర్యాదగుండదు” హెచ్చరిక ఎగరేసిండు.
రోజూ కలిసి మనసుల్లో మనసుగా మాట్లాడే కృపాసాగర్ లేక శివప్రసాద్ మనసు మనుషుల్లేని బంగలాలాగైంది. ఓ పొట్లం విప్పి నోట్లో వేసుకుని నముల్తూంటే….. అవనిజతో చూపులు కలిసిన శుభవేళ బుర్రలో మెదిలింది. అవనిజ వాళ్లదదే ఊరు.
ఆలస్యం అమృతం విషం…. నానుడి ఎదలో మెదలింది. వెంటనే బైకు స్టార్టు చేసి అవనిజ వాళ్లింటి కెళ్లిండు. కాబోయే ఇంటిల్లుడిగా మర్యాదలందుకున్నాడు. అవనిజను బైకు మీద సినిమాకు తీసుకెల్తూంటే అదో థ్రిల్లింగా వుంది. ఏ.సి హాల్లో పక్క పక్కన కుచున్నారు. “అవనిజా నిన్ను మీవాళ్లు నావెంట పంపిస్తారో లేదోనని అనుమాన మొచ్చింది” పొట్లం విప్పి నోట్లో వేసుకున్నాడు.
అవనిజ బుగ్గలను సిగ్గులు సింగారించుకున్నై. “మా వాళ్లు పంపించనంటే నేనూరుకంటానా”. కాటుక కళ్లను కమ్మగా తిప్పింది. సినిమా షురువైంది. భుజాల రాపిడి కొత్త అనుభూతినిస్తుంది. కొద్ది సేపు అలౌకికానందం. అవనిజ దూరం జరిగింది. తనలోని ఆరాటం పోరాటానికి దిగింది.
ఇంటర్వెల్‌లో కూల్ డ్రింకు చప్పరిస్తూ “ఎందుకట్లా దూరం జరిగినవు” చిన్నపాటి ఆందోళన వెలిబుచ్చిండు.
“మీ నోటి నుండి ఏదో వాసనొస్తుంది. అది నములుడు హాబీయా లేక హేబిటా?” అసహనం వ్యక్తమైంది. తనకది సువాసనైతే ఆమెకు చెడువాసనైందా. ఏమనాలో అర్థం కాలేదు. వెంటనే వెళ్లి నోరు కడుక్కుని వచ్చి కూచున్నాడు. సగం సినిమా సరదాగా…. ఎంజాయి చేశారు.
అవినిజను బైకు మీద తీసుకెళ్లి వాళ్లింటి ముందు దింపాడు. ఆమె ఇంట్లో కెల్తూ “మీరది నమలడం మానేయ్యక పోతే మన పెళ్లి….. అనుమానమే” గంభీరంగా అంది. అదో పిచ్చి మా లోకం. దీని మజా ఆమెకేం దెల్సూ.
శివప్రసాద్ పంజేస్తున్న ఆఫీసు మానేజరు డ్యూటీనే బ్యూటీగా భావించే అధికారి. ఖచ్చితమైన మనిషి. క్రమశిక్షణ పాటించని మనిషి కళ్లెం లేని గుర్రంలాంటి వాడంటాడు. అది నిజమే గదా. ఆఫీసుకు ఆలస్యంగా రావద్దు, పొగ తాగరాదు. మర్యాదగా మాట్లాడాలి… లాంటి నిబంధనలు బాగానే వున్నాయి గాని జర్దాపాన్, పాన్ పరాగ్ లాంటివి తినరాదంటాడు. అదే తనలాంటి వారికి ఇబ్బంది.
ఆరోజు…. ఆఫీసుకు రాంగానే పొట్లం విప్పి నోట్లో వేసుకున్నాడు. అటండెన్సు రిజిష్టర్‌లో సంతకిస్తూంటే అటెండర్ అగయ్య రామబాణం లాగా తన వద్దకొచ్చి “సార్ తమరిని మానేజరు సారు ఎస్టిమేట్సు ఫైలు తీసుకు రమ్మన్నారు” చెప్పిండు.
ఫైలుతో చాంబర్లకెళ్లి మానేజర్ ముందు మారాజులా కూచున్నాడు. మానేజర్ ఫైలు పరిశీలిస్తూ ఏవో ప్రశ్నలడిగి జవాబులు రాబట్టుకున్నాడు. అంతకుముందే నోట్లో వేసుకున్నది నముల్తుంటే నరాల్లో ఉత్సాహం ఉరికులాడుతోంది. వర్షానికి ముందు ఆకాశం నల్లబారిన్నట్టు మానేజర్ మొహంలో రంగులు మారినై. “మిస్టర్ శినప్రసాద్ మీ నోట్లో నుండి ఏమిటా దుర్వాసన?” గుర్రుమని నిలదీసిండు.
నిజం చెబితే నిష్ఠురం. అబద్దం చెబితే మరెన్నో అనుబంద ప్రశ్నాబాణాలు సందిస్తాడు. మౌనమే సమాధానమైంది.
“ఈసారి అలాంటి వాసనోస్తే క్రమశిక్షణ చర్య తప్పదు.” వార్నింగ్ వడ్డించిండు మానేజర్. మనసు మన్నుదిన్న పాములాగైంది. లంచ్ టైంలో కృపాసాగర్‌తో ఫోన్‌లో మాట్లాడిండు. మనసు తేలికైంది. కృపాసాగర్ ఇంచుమించు రోజూ మాట్లాడ్తున్నాడు.
కొద్ది రోజులు గడిచినై.
ఆఫీసు పని వేళల్లో మానేజర్ పిల్లిలా అడుగులేస్తూ చాంబర్లోంచి బయటి కొస్తాడు. తాబేలులా నడుస్తూ ఆఫీసంతా కలియదిరుగుతుండు. అందరినీ మూడో కంటితో కనిపెడ్తండు. ఎవరన్నా ముచ్చట్లలో మునిగినా, టాయ్‌లెట్లో పొగతాగుతున్నా మసాలా పాన్ నమిలినా వెంటనే పసికట్టి మెమో చేతికిస్తాడు.
ఆ రోజు…. శివప్రసాద్ హాయిగా పంజేసుకుంటున్నాడు. మనసు అటు లాగింది. అటుఇటూ చూసి, పొట్లం విప్పి నోట్లో వేసుకున్నాడు. అది నముల్తూ పంజేస్తుంటే స్వర్గం ద్వారం వద్ద తచ్చాడుతున్నట్టుంది. ఫైలులో మునకలేస్తున్ను.
“ఏం వాసనదీ?” వెనక నుండి ఎవరిదో గొంతు. వెనక్కు తిరిగి చూసిండు. ఆయన సాక్షాత్తూ మానేజర్. దిగ్గున లేచి నుంచున్నాడు. ఇక్కడి కెప్పుడొచ్చిండో మానేజర్….. ఆలోచన పూర్తికాక ముందే “మహారాజశ్రీ శివప్రసాదుగారూ, మిమ్మల్నే అడుగుతుంది”. గొంతులో వెటకారం. తన గొంతులో పచ్చి వెలక్కాయ.
“అది క్రమశిక్షణా రహిత్యమని తెలీదా?” రెట్టించాడు.
తోటి ఉద్యోగులు తనను వింత జంతువులా చూస్తూ నవ్వుకుంటున్నారు. అయోమయంలో కొట్టుకు పోతూ, నోటికి అరచెయ్య అడ్డం పెట్టుకుని, “సారీ సర్” అనగలిగాడు.
అరగంటలో తాకీదు చేతికందింది. వెంటనే జవాబివ్వాలనుంది అందులో. తప్పు క్షమించాలని, మరోసారి అలా చెయ్యనని జవాబు రాసిచ్చిండు. ఇది చివరి అవకాశం… వార్నింగొచ్చింది. మనసు మట్టిలో బొర్లిన దున్నపోతులాగైంది.
సాయంత్రం యాత్రికంగా పార్కునాశ్రయించిండు. ఓ పొట్లం విప్పి పళ్ల కిందికి చేర్చుకున్నాడు. మనోయవనిక మీద రంగుల హంగులతో అవనిజ అప్సరసలా ప్రత్యక్షమైంది. నరాల్లో ఆనందరాగం…. అవనిజ రా రమ్మన్నట్టునిపించింది. బైకు మీదెక్కి జెట్ స్పీడులో వెళ్లి వాళ్లింటి ముందు ఆగిండు. లోపల అవనిజ సోఫాలో… చేతులో రెక్కలు విచ్చుకున్న దినపత్రిక… అందులోనే లీనమైనట్టుంది.
‘అవనిజా’ స్టైల్‌గా పిలుస్తూ వెళ్లి పక్కన కూచున్నాడు. ఆమె పత్రిక పక్కన పడేసి శ్యూన్యంలోకి చూస్తోంది.
“సినిమా కెల్దామా” చెయ్యందుకోబోయాడు. నోటి వాసన ముక్కపుటాల నదర గొట్టిందేమో అవనిజ ‘హుం’ అంటూ మూతి వంకర్లు తిప్పింది. గుర్రుగా చూస్తూ లోపలికెళ్లిపోయింది. కాలినడకన యాదాద్రి ఎక్కుతూంటే స్పీడు బైకు వెనకనుండి వచ్చి గుద్దేసినట్టైంది. నిరాశను చప్పరిస్తూ బయటికొచ్చి అటూ ఇటూ చూసిండు.
***
ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులంతా కలిసి టిఫిన్ ముగించి, హాల్లోని సోఫాల్లో కూచున్నారు. తనను నాన్న కొత్తగా చూస్తూ, “శివప్రసాదూ టిఫిన్ చేసే ముందు నీ నోట్లోంచి ఏదో గలీజు వాసనొచ్చింది, అదేంటిదిరా” అసహనంగా అడిగిండు. తాను పొట్లాలు తింటున్నట్లు ఇంట్లో ఎవరికీ తెలియదు. ఏం జవాబివ్వాలో తోచలేదు.
“జర్దాపాన్ తింటున్నావా” నాన్నగొంతులో మరింత అసహనం. తనలో ఆందోళన. “తింటే తప్పా నాన్నా”.
“కాదా” గొంతులో గర్జన ఛాయలు. “పొగాకుతో తయారైన వస్తువేది తిన్నా అది క్యాన్సర్‌కు దారి దీస్తుంది. ఈ మాత్రం తెలీదా.”
ఆ సంగతి తనకు కృపాసాగర్ చెప్పలేదు గదా. నాన్న ఊరికే బెదిరిస్తున్నాడేమో. “జర్దాపాన్ తినడం లేదు నాన్నా” తన గొంతు వణికింది.
“నిన్న అవనిజ వాళ్ల నాన్న కలిశాడురా. నీ నోట్లో నుండి చెడువాసన వస్తుందని అవనిజ చెప్పిందట. ఆ విషయమేందో కనుక్కని చెడ్డ అలవాటేదన్నా ఉంటే మాన్పిస్తానన్నాను” అంటూ నాన్న గదిలో కెళ్లి పోయిండు.
చెల్లి తన ముందుకు కొచ్చి “అసలేం తింటున్నావురా అన్నయ్యా” అని నిలదీస్తుంటే మొహం గంభీరంగా మారింది. అరే… ఇదేమిటీ ఆవగింజంత విషయాన్ని గుమ్మిడికాయంత చేస్తున్నారెందుకో….. ఆలోచనల్తో తన గదిలో కెళ్లిండు.
కృపాసాగర్ గుర్తుకొచ్చిండు. అతడు వెళ్లి సుమారు రెండు నెలలైంది. మొదట్లో తరచుగా ఫోన్లో మాట్లాడేవాడు. ఆ తర్వాత తను ఫోన్ చేస్తేనే మాట్లాడిండు. ఆరోగ్యం బాగా లేదన్నాడోసారి. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్ జవాబు.
తన సెల్ ఫోన్ రింగైంది. ఫోన్ తెరమీద కృపాసాగర్ పేరు…. ప్రాణం లేచోచ్చింది. గబుక్కున ఫోనందుకుని “హల్లో కృపాసాగర్ నీ కేమైందీ ఆరోగ్యం మెట్లుందీ? ఫోన్ స్విచాఫ్ ఎందుకొస్తుందీ?” ప్రశ్నల వర్షం కురిపించిండు.
“హల్లో…. మీరు శివప్రసాదా?” కొత్తగొంతు.
“అవును. కృపాసాగర్‌తో మాట్లాడాలి. ఫోన్ అతనికివ్విండి”.
“సారీ సర్. నేను కృపాసాగర్ తమ్మున్ని. అన్నయ్య నిన్న హైద్రాబాదు హస్పిటల్ల చనిపోయిండు. ఇప్పుడే ఇంటికి తెచ్చినం”. ఫోన్ కట్. తన గుండెనరాలు ఫటా ఫట్.
జీగ్రీ దోస్త్ చనిపోయిండా. ఎదలో గాలి దుమారం. గబగబ తయరై మంచిర్యాల కెళ్లిండు.
కృపాసాగర్ ఇల్లు శోకసముద్రం లాగుంది. నిప్పులాంటి నిజం అక్కడ తెలిసింది. గుట్కా చప్పరించడం ప్రమాదమట. అది అలవాటైన కృపాసాగర్ గొంతు దవడలకు క్యాన్సరొచ్చిందట. హైదరాబాదు కాన్సర్ హాస్పిటల్లో చేర్చారటా.. అరవైరోజులు నరకాయాతన ననుభవించి ప్రాణాలొదిలాడట.
“హమ్మో…… అది అంత ప్రమాదమా” నెత్తి మీద బాంబు పేలినటైంది.
కృపాసాగర్ భార్య గుండెలు బాదుకుంటూ “నేనెన్ని సార్లు చెప్పినా ఆయన గుట్కా మాన లేదన్నయ్యా” అని గోడుగోడుమని ఏడుస్తూంటే తన గుండె కరిగి కళ్లల్లో నీరుగా మారింది. తనలోని అంతర్మధనం…. బయటకు చెప్పకోలేని పరిస్థితి.
శవయాత్రలో స్మశాన వాటిక దాకా వెళ్లాడు. జిగ్రీ దోస్త్ పార్థివ శరీరం అగ్నికీలల కాహుతి అవుతుంటే తనలో దుఃఖ సముద్రం పొంగింది. కళ్లు ధారాపాతాలైనాయి.
అందరూ తలా ఓ కట్టె ముక్క చితి మీద వేస్తున్నారు. తాను మాత్రం పశ్చాత్తాప పడుతూ పాంటు జేబులున్న రెండు గుట్కా పొట్లాలను బయటకు తీసి కట్టెముక్కతో పాటు చితి మంటల్లో వేశాడు.
~ ఐతా చంద్రయ్య