[మాయా ఏంజిలో రచించిన ‘No loser, No weeper’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(పోగొట్టుకోవడాన్ని ఇష్టపడను అని చెబుతూనే, ఒక హెచ్చరికని ధ్వనిస్తుందీ కవిత.)
~
[dropcap]“ఏ[/dropcap]దో ఒకటి పోగొట్టుకోవడం నాకిష్టముండదు”
అప్పుడామె తలాడించింది
“ఒక్క పైసా కూడా.. నేను చచ్చినంత బాధపడతా”
నేనస్సలు వివరించలేను..
చెప్పడానికేమీ లేదు..
“ఏదో పోగొట్టుకోవడాన్ని ద్వేషించడం తప్ప..”
“ఒకసారి నా బొమ్మని పోగొట్టుకున్నా
ఓ వారం రోజులపాటు ఏడ్చాను
ఆ బొమ్మ కళ్ళు తెరిచి చూసేది
మాట్లాడటం తప్ప ఎన్నో చేసేది
దాన్నెవరో చాటుగా ఎత్తుకుపోయారని నా నమ్మకం
చెప్తున్నా నీకు..
ఏదైనా పోగొట్టుకోవడం అంటే నాకు కోపం”
“నాదో గడియారం – ఓసారి
లేచి నడిచెళ్ళిపోయింది
దాన్లో పన్నెండు అంకెలుండేవి
రోజంతా సమయం చూపించేది
నేనస్సలు మర్చిపోలేను దాన్ని
ఏదైనా పోగొట్టుకోవడాన్ని
నిజంగా నేను ద్వేషిస్తానని
మాత్రం చెప్పగలను నేను.. “
“ఒక బొమ్మని, ఓ గడియారాన్ని పోగొట్టుకుంటేనే
అంతలా బాధపడిన నేను
నా ప్రేమికుడిని గురించి ఏం ఆలోచిస్తానని
నువ్వనుకుంటున్నావు..??
నేనేం నిన్ను బెదిరించడం లేదు మాడమ్
కానీ.. నా సాయంసంధ్యాకాలపు ఆనందం అతడు
నా ఉద్దేశం చెప్పనా..
నేన్నిజంగా దేన్నైనా పోగొట్టుకోవడాన్ని ద్వేషిస్తాను!!”
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
‘మాయా’ మాటలు మరిన్ని:
- మీరు చేస్తే తప్ప ఏదీ పని చెయ్యదు.
- సంగీతం నా ఆశ్రయం. స్వరాలు, గమకాల ద్వారా నేను అంతరిక్షంలోకి ఎగసి వెళ్ళగలను, నాలోని ఒంటరితనంలోనికీ ముడుచుకోగలను.
- పక్షపాత ధోరణి ఒక భారం. అది గతాన్ని గందరగోళంలో పడేస్తుంది, భవిష్యత్తుని భయపెడుతుంది. వర్తమానాన్ని అసాధ్యం చేస్తుంది.
- వేరొకరి పట్ల శ్రద్ధ చూపించాలని మీ హృదయంలో మీరు నిర్ణయించుకుంటే మీరు విజయం సాధించినట్టే.
- ప్రజలు మీరేం చెప్పారన్నది మరిచిపోతారు. మీరేం చేసారన్నది మరిచిపోతారు. మీవల్ల వారు పొందిన గాఢమైన అనుభూతిని మాత్రం వారు మరిచిపోలేరని నేను నా అనుభవంతో తెలుసుకున్నాను.
- జీవితాన్ని ప్రేమించండి. పూర్తిగా నిమగ్నమైపొండి. మీకు లభించినదంతా తిరిగి ఇవ్వండి. అభిరుచి ప్రేమ కలగలిపి జీవించండి. మీరేం ఇస్తే జీవితం మీకు అది తప్పక తిరిగిస్తుంది.