ప్రాచీన, ఆధునిక ఆధ్మాతిక మేళవింపు యాదాద్రి

0
1

[dropcap]ఓ [/dropcap]యాత్రకు వెళ్తే ఆహ్లాదకర జ్ఞాపకంలా నిలిచిపోవాలి. మనసంతా ఆక్రమించుకోవాలి. అనందం కలిగించాలి. ప్రశాంతతను ఇవ్వాలి. ఆ ఆనందాన్ని పదిమందికి చెప్పుకోవాలి అనిపించాలి. చూసింది, అనుభూతి చెంది తోటివారికి చెబుతుంటే చెప్పేవారి కళ్లల్లో ఓ మెరుపు కనబడాలి. అటువంటిది ఎక్కడో హిమాలయాల సరసన కొలువైన ఆలయాల్లో దొరుకుతుందే తప్ప ఇక్కడెక్కడ సాధ్యం అనిపించవచ్చు.

కానీ మన పక్కనే, మనం సులభంగా వెళ్ళివచ్చేంత దూరంలోనే ఉందంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అదే నిజం. అదే ప్రాచీన, ఆధునిక ఆధ్మాతికతల మేళవింపు మన యాదాద్రి.

స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అతి పెద్ద దేవాలయం ఈ యాదాద్రి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునర్నించిన ఈ ఆలయం గురించి అందరూ మాట్లాడుకుంటుంటే చూద్దామని ఫ్రెండ్స్‌తో యాద్రాదికి వెళ్ళి వచ్చాం. గతంలో అనేక పర్యాయాలు యాదగిరి గుట్ట లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్నప్పటికీ ఈ సందర్భంగా కలిగిన అనుభూతి ప్రత్యేకమే అని చెప్పవచ్చు. ఫ్రెండ్ వినుత కార్ డ్రైవ్ చేస్తుంచే, నేనూ, నాతో పాటు కవిత కలిసి యాద్రాదికి బయలుదేరాం.

హైదరాబాద్ నుంచి 52 కి.మీ.ల దూరంలో 2 గంటలు ప్రయాణం చేస్తే చేరుకునేంత దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని చూసేందుకు ఉదయం 9 గంటలకు కార్లో బయలు దేరితే అక్కడికి చేరుకునే సరికి 10.30 అయ్యింది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి మీదుగా వెళుతుంటే సిటీ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నప్పటికీ నగర సరిహద్దులు దాటి ముందుకు వెళుతుంటే ఆలయ పరిసరాల్లో చేరుకున్నాం అన్నట్లుగా ఆధ్యాత్మిక పరిమళం మమ్మల్ని ఆవహిస్తుంది. యాదగరి గుట్ట ప్రాంతానికి చేరుకోగానే ఎడమవైపున ఉన్న ఎతైన ద్వారబంధం స్వాగతం పలుకుతూ కనిపించింది. దారి పక్క ఆకుపచ్చటి లాన్లు, పురాతన వృక్షాలకు సైతం అద్దిన ఆధునిక హంగులు, సరస్సులు, అభయాంజనేయ అరణ్యం వంటివి కనువిందు చేస్తు కనిపించాయి.

అలా ముందుకు వెళుతూ ఉంటే ఆలయం పరిసరాలలో ఉండే రకరకాల పూజా ద్రవ్యాల దుకాణాలు, వింతవింత బొమ్మల షాపులు సందర్శకులతో కిటకిటలాడుతూ కనిపించాయి. వాటిని దాటుకుంటూ అద్భుత ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాం.

‘యాదగిరి గుట్ట’గా తెలుగు ప్రజల్లో స్థానం సంపాదించుకున్న ఈ కోవెల నేడు ఆధునిక పరిజ్ఞానం మేళవింపులతో తన రూపురేఖలను పూర్తిగా మార్చుకొని యాదాద్రిగా అధ్మాతికతతో ఉట్టిపడుతోంది. ఆధునికత అంటే నిర్మాణంలో ఇటుకలు, సిమెంట్ వాడకం అని అసుకుంటాం కానీ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంటు వాడలేదు. పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన గానుగ సున్నాన్నే ఉపయోగించారు. సంప్రదాయ మిశ్రమాలతో ఆలయాన్ని నిర్మిస్తే దాని పటిష్టతపై అనేక అనుమానాలు తలెత్తుతాయి.

కానీ ఈ ప్రశ్నలకు సమాధానమే అన్నట్లు ఆలయ నిర్వాహకులు ఈ గానుగ సున్నం మిశ్రమం నాణ్యతను బెంగళూరులోని ‘బ్యూరో వెర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పరీక్షించి, ధ్రువీకరించింది. అలాగే బెంగళూరుకు చెందిన ‘ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్’ (ఐపీఐఆర్టీఐ) సంస్థ ఆధ్వర్యంలో కలప నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. కలప రకం, మందం, దారుఢ్యం, తేమను తట్టుకునే శక్తి వంటి లక్షణాలన్నింటినీ పరీక్షించి, ఉత్తమమైన కలపనే తలుపుల నిర్మాణం కోసం ఎంపిక చేశారు. బహుళ ఇలా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిర్మించడం చరిత్రలో ఇదే మొదటిదేమో.

పదే పదే ఆధునికత అనుకుంటున్నాం కాబట్టి ఇది ఈ కాలానికి చెందిన కట్టడంగా అగుపించవచ్చు. కానీ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కొలువైన ఈ ఆలయాన్ని ప్రాచీన సంప్రదాయాలకు అనుగుణంగా వందల ఏళ్ల క్రితం నిర్మించిన అనుభూతి కలిగేలా ఆలయాన్ని మొత్తం కృష్ణ శిలలతో నిర్మించారు. దేశం నలుమూలలా తిరిగి మేలైన, మన్నికైన శిలలను వెతికి మరీ దీని నిర్మాణం చేపట్టారు అంటే ఎంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఒకే తరహా వాస్తు నిర్మాణాలూ, శిల్ప కళా కనిపిస్తుంది. కానీ యాదాద్రిలో మాత్రం దీనికి భిన్నమని చెప్పవచ్చు. విభిన్న రీతుల్లో రూపుదిద్దుకున్న నిర్మాణాలు వీక్షకుల్ని ఆశ్చర్యానుభూతులకు గురిచేస్తాయి. రెండు అంతస్తులుగా నిర్మించిన మండపంలో పై అంతస్తుల్లో ఈ ప్రాంతాన్ని పాలించిన స్థానిక పాలకులైన కాకతీయుల శైలిలో స్తంభాలు కొలువై ఉంటే, కింది అంతస్తుల్లో మాత్రం 12 మంది ఆళ్వారుల విగ్రహాలు ఉంటాయి. తమ వైష్ణవ సంప్రదాయాన్ని దక్షిణాదికి వ్యాపింపజేసిన 12 మంది ఆళ్వారుల జ్ఞాపక చిహ్నాలుగా వీటిని ఇరువైపు ఆరు చొప్పున నిర్మించారు. వీటి నిర్మాణ శైలీ అద్భుతమనే చెప్పవచ్చు. ఇవే కాకుండా ఇక్కడి మరో ప్రత్యేకత స్వామివారి కోసం ఏర్పాటు చేసిన బంగారు ఊయల, స్వర్ణ తాపడం చేసిన ధ్వజస్తంభమూ గురించి చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన లైటింగ్ వ్యవస్థ వల్ల ఆలయమంతా స్వర్ణకాంతులీనడం ఇక్కడ చూడవచ్చు.

ప్రసాదానికి కూడా ఆధునిక యంత్రాలే..!

ప్రసాదం తయారీ కోసం యాదాద్రి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. పెద్దసంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా ప్రసాదం తయారీ కోసం ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు లక్ష లడ్డూలను, రెండువేల కిలోల పులిహోర తయారు చేసేందుకు వీలుగా యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘అక్షయపాత్ర’ సంస్థవారు ప్రసాదం తయారు చేస్తున్నారు.

రానున్న రోజుల్లో దేవస్థానం వారే ప్రసాదం తయారు చేసేలా ‘అక్షయపాత్ర’ సంస్థవారు శిక్షణ ఇస్తున్నారు.

ఘన చరిత్ర…

చరిత్రను తరచి చూసుకుంటే, కాకతీయ రాజుల నుంచి నిజాం నవాబుల వరకు ఎందరో యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకుని, ఆలయ అభివృద్ధికి బాటలు వేశారని తెలుస్తోంది. కాకతీయులు పదమూడో శతాబ్దిలో ఒక ఆయుర్వేద వైద్యునికి ఈ స్థలాన్ని దానంగా ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. యాదగిరిగుట్ట మండలం సైదాపురం వద్ద లభించిన శాసనాల్లో కాకతీయులు ఈ ఆలయ అభివృద్ధి కోసం చేసిన పనులు వెలుగులోకి వచ్చాయి. పదిహేనో శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయలు యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్నట్లు కొలనుపాకలో దొరికిన శాసనం చెబుతోంది. ఈ ప్రాంతంలో దొరికిన ఆరువందల సంవత్సరాల నాటి శాసనాలను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భద్రపరిచారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని నేటి కాలానికి అనుగుణంగా, ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఘనత మాత్రం నేటి తెలంగాణ ప్రభుత్వానిదే అని చెప్పక తప్పదు.

ఆలయం అంటే ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా దాని చుట్టూ ఆహ్లాదం కూడా తోడై ఉంటుంది. అది యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో అణువణువున కనిపిస్తుంది మనకు. గతంలో నిధుల కొరతతో, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ అనేక సమస్యలు కనిపించేవి కానీ నేడు మాత్రం పచ్చని పచ్చదనంతో, నీటి కొలనులతో నెలకొంది. ఒకవైపు సంప్రదాయ వాహనాలైన గుర్రపు బగ్గీలు, టాంగాలు యాత్రికులను చేరుస్తూ మరురానుభూతిని కలిగిస్తుంటే, మరోవైపు జెయింట్ వీల్, రంగులరాట్నం వంటివి పిల్లల్ని ఆకట్టుకుంటూ కుటుంబమంతటికి ఆనందాన్ని నింపే కంప్లీట్ ప్యాకేజ్‌గా నేటి యాదాద్రి మనకు కనిపిస్తుంది. ఆధ్మాతికతను ఆధునిక పరిజ్ఞానం తోడైన ఈ అద్భుత ఆలయాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ చూసి ఆనందపరవశులు అవ్వడం మాత్రం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here