[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]
అన్నమయ్య నాలుగవ భాగం:
దేశకాల పరిస్థితులు – రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులు:
వాఙ్మయాధారములను బట్టి మనం ఆ కాలంనాటి రాజకీయముల రాచరికము, ప్రభుత్వ పరిపాలన విధానము, యుద్ధము, నేరము, శిక్ష ఆర్థిక వ్యవస్థ, రొక్క నాణెములు మొదలగు వాటి గురించియు తెలుసుకొనవచ్చు.
రాజకీయ పరిస్థితులు:
విజయనగరం పాలించిన సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశముల నాల్గింటి రాజకీయ వృత్తాంతములు తాళ్లపాక వారు ప్రత్యక్షముగ ఎరిగిన వారే అనుటకు ఆయన వ్రాసిన కవితలు ఉదాహరణములు –
(అ) శ్రీరాగం
వెరతు వెరతు నిందు వేడుక పడనిట్టి
కురుచ బుద్ధులు నెట్లు కూడదునయ్యా
(ఆ) రామక్రియ
తతిగాని యీపాటు దైవమా విచారించవే
కతలాయ చెప్పవేడు కలికాల మహిమ
(ఇ) ఆహిరి
కటకటా మీరితివి కలికాల మహిమా పుణ్య
ఘటన కరవై పోయె గలికాల మహిమ
(ఈ) ఒడ్డె భాష నేర్చుకొని ఇలా చెప్పుకున్నాడు –
వొగినొడ్డె భాషలాడి నొడ్డెవాడనైతివి
తెగి తెలుగాడ నేర్చి తెలుగు వాడనైతి
ఆగడై శ్రీ వేంకటేశ అన్నియు విడిచినేను
తగు నీ దాసుండనై దాసరినైతి (9-90)
(ఉ). విజయనగరాధీశుని దండయాత్రులనే కాబోలు తాళ్ళపాక వారు
నాట:
విఱిగి పారెడి యట్టి వీరడి మోరిపులాల
తఱి శరణు చారరో దండాలు పెట్టరో
అన్నారు.
2. మత పరిస్థితులు:
సంఘర్షణలు, సామరస్యములు, మతపోషక సంస్థలు, ఆలయోత్సవములు, సేవలు, పండుగ, పబ్బములు మొదలగు అంశముల గూర్చి
ఉదా: హరి భక్తి ముఖ్యం గాని ఆచారాలు వృథా అని
“హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యముగాక
విరహాచారము లెల్ల వృథా వృథా”
అన్నారు.
3. సాంఘిక పరిస్థితులు:
పెండ్లి పేరంటములు, సాంఘికాచారములు, విశ్వాసములు, కులగోత్రములు, వృత్తి వ్యాపారములు, పరిశ్రమలు, కళలు, ఆటలు పాటలు మొదలగు విశేషములు గూర్చి క్లుప్తముగా డా॥ వేటూరి ఆనందమూర్తి గారి ‘తాళ్లపాక కవుల పదకవితలు భాషా ప్రయోగ విశేషాలు’ అను గ్రంథంలో వివరించబడ్డాయి.
ఉదా:
మేదర వారి వేషము – మలయంగ నెడ దుప్పియైనో రగాగ – అని
వెద్యుని వేష – చరిక మందుల సంచి జగజంపువలువ అని.
వ్రాశారు.
విశ్వాసము మీద ఆయన వ్రాసిన వర్ణన –
‘నారాయణుడ నీ నామము మంత్రించి వేసి పారేటి యీ జంతువుల
భ్రమ విడిపించవే’ (9.20)
ప్రజల దీనతకు అన్నమయ్య చింతించిన వర్ణన –
‘మగడు విడిచినా మామ విడువనియట్లు
నగినా మనసు రోసినా లోకులు మానరు
తగిలేరు పాగి తీరు దైవమే చూసేరు
మొగ మోటలను నేను మోసపోవనోపను’
~
విమర్శ:
వీరు రచించిన కీర్తనల సంఖ్య బహుళమే అయినా అందలి భాషా పటిమ కొంత మాత్రమే అని చెప్పవచ్చు. ‘బ్రహ్మ కడిగిన పాదము’, ‘అదిగో అల్లదిగో’ మొదలగు కొద్ది కీర్తనలు మాత్రము సర్వజన రంజకాలై మంచి ప్రచారము గావించారు. వీరి కీర్తనలు ప్రధానముగా తెలుగు దేశమందే పాడబడుతున్నాయి. ఇతర రాష్ట్రములలో ఇవి పాడబడుట లేదు. ఇతర రాష్ట్రములకు ప్ర్రాకగల బలము ఈ కీర్తనల యందు లేదు. ఈయన కూడా త్రిమూర్తుల కోవకు చెందిన సంగీత యతి అని చెప్పవచ్చు. త్యాగయ్య తన ప్రహ్లాద భక్త విజయ నాటకమున అన్నమయ్యను స్మరింపలేదు. వీరికి తెలుగుదేశం లోనే గౌరవస్థానము వుంది.
అన్నమాచార్యులు:
ఆయన కాలంలో పున్న రాగాలు చాలా వరకు ఇప్పుడు మరుగున పడ్డాయి. కొన్ని రాగాలు ఇప్పటి వరకు వున్నాయి. ఆయన రచనలు అనేకములు, రాగాలు కొన్ని మాత్రమే. అంటే ఒకే మెట్టుతో చేసిన స్వర రచనలు ఎక్కువ అని అర్థం. కాని ఇప్పటి ప్రతిభ కలిగిన విద్వాంసులు వారి శక్తిని, ఊహని బట్టి కర్నాటక సంగీత బాణి పద్ధతిలో ఆయన కీర్తనలు స్వరపరిచారు. అన్నమయ్య కీర్తనలు పలు విధములు, పలురకాలుగా
సాహిత్య, అర్థభావం చెడకుండా ఈనాటి ఆధునిక విద్వాంసులు వారి సొంత బాణిని ఏర్పరిచారు. ఈ ప్రసిద్ధ బాణిలను ఈ విధంగా విభజించవచ్చు.
- కర్నాటక సాంప్రదాయంగా
- సాహిర్యాన్ని ఎత్తి చూపే విధంగా
- లలిత సంగీతజ్ఞులు, లలిత సంగీత రీతిలో
- చలన చిత్ర విజ్ఞులు – సినిమా సంగీత బాణిలో
- జానపద బాణీలలో కూడా ఉన్నాయి.
అతి ప్రాచీన కృతులు నిత్య జీవితంలో చిన్న పిల్లల అల్లరి మైమరిపించుటకు ‘చందమామ రావో’ – వంటి రచనలు కూడా ఉన్నాయి.
అన్నమయ్య కీర్తనలకు స్వర రచన చేసిన ప్రముఖ ఆధునిక విద్వాంసులు:
పేరు | రాగం | రాగం కూర్చినవారు | |
1 | దేవదేవం | హిందోళ | శ్రీ.పినాకి పాణి గారు |
దేవదేవం | జనసమ్మోదిని (కళావతి, వలిజ దగ్గర రాగల కలయిక) | శ్రీ నూకల చినసత్యనారాయణ | |
దేవదేవం | హంసానంది | శ్రీ పెమ్మరాజు సుర్యారావు గారు | |
2 | నారాయణ తే నమో నమో | బేహగ్ | శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారు |
నారాయణ తే నమో నమో | సింధుభైరవి | శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు | |
3 | నానాటి బ్రతుకు నాటకము | రేవతి | శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారు |
నానాటి బ్రతుకు నాటకము | వేరొక రాగంలో | శ్రీ బాలమురళికృష్ణ గారు | |
4 | అదిగో అల్లదిగో శ్రీహరివాసము | మధ్యమావతి | శ్రీ మల్లిక్ గారు |
అదిగో అల్లదిగో శ్రీహరివాసము | హిందోళ | శ్రీ పెమ్మరాజు సుర్యారావు గారు |
ఇలా చాలా కీర్తనలు ఎందరో విద్వాంసులు, సాంప్రదాయం చెడకుండా, వారి గాన ప్రతిభతో స్వరపరిచారు.
(ఇంకా ఉంది)