Site icon Sanchika

ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-18

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

క్షేత్రజ్ఞుడు – నాల్గవ భాగం:

విమర్మలు – వ్యాఖ్యానాలు:

  1. క్షేత్రయ్య మహాజ్ఞాని. మహాభక్తుడు. గొప్ప కవి. ఐనా వేశ్యాలంపటుడై రాజులను ఆశ్రయించి, వారిని కొనియాడి పదములు రచించి, ఇహలోక సుఖములకు అతీతుడు కాలేదని తెలుస్తుంది. క్షేత్రయ్య గోపాలుని దర్శన మొందిన మహాభక్తుడను వాదనకు బలమంతగా లేదు.
  2. క్షేత్రయ్య అఖండ శేముషీ దురంధరుడు. గొప్ప సంగీత విద్వాంసుడు, పండితుడు, అనుటకు రవ్వంతయు సంశయము లేదు. కొన్ని వేల పదములు వ్రాసినను, సంస్కృత భాషా వాసన రానీయక సంస్కృత శబ్దములు ప్రయోగింపక అచ్చ తెలుగు భాషనే వాడిన ఘనత ఈయనకు దక్కింది. కాని పోతన, త్యాగయ్యల జీవితములందు పవిత్రత, వైరాగ్య ప్రవృత్తి, క్షేత్రయ్య యందు కానరావు.
  3. ప్రొఫెసర్ పి. సాంబమూర్తి గారు ‘క్షేత్రయ్య ఒక యోగి’ అని, మంత్రోపదేశమును పొందిన మహాపురుషుడనియు, కృష్ణ భగవానుని దర్శన భాగ్యము పొందిన మహాత్ముడనియు వ్రాసినారు. క్షేత్రయ్య ‘దేవ గాంధారి’ రాగంలో – ‘వేడుకతో నడుచుకున్న నిటరాయడె’ అన్న ప్రారంభనుగు పదమొకటి వ్రాసారు. మధుర ప్రభువగు తిరుమల నాయకుని ఆస్థానమున 2,000 పదములు; విజయరాఘువుని ఆస్థానమున 1,000 పదములు వ్రాసినట్లు క్షేత్రయ్య చెప్పుకొనెను. విజయరాఘవ పంచరత్నములు కూడా వ్రాసెను. ఇటుల రాజుల మెప్పులకై మన వాగ్గేయకారులు పదములు వ్రాయుట చాలా అరుదు.
  4. వేమన బాల్యమున వేశ్యాంగనాలోలుడై, చరించినను, వార్ధక్యంలో చిన్ననాటి దురభ్యాసములు వదిలి, పశ్చాత్తపుడై, భక్తుడై పవిత్రుడై యుండుట మనకు తెలిసినదే. అట్టి మార్పు వార్ధక్యముననైనను క్షే త్రయ్యకు కల్గినదని వారి భక్తులు కూడా ఎచ్చటను వ్రాయలేదు.
  5. యౌవనమున వారకాంత చెలియ, వయసు వచ్చిన కొలది ఐశ్వర్య మదాంధులగు రాజుల ఆశ్రయములతో క్షేత్రయ్య కాలము గడిపిరి.
  6. సేనాధిపతియైన తుపాకుల వేంకట కృష్ణపై క్షేత్రయ్య తన కవితా లక్ష్మిని వ్యర్థము చేసి, ఆయనపై కొన్ని పదములు వ్రాసిరి. క్షేత్రయ్య సేవించి, మెష్పించిన ప్రభువులు పవిత్రులా? యోగ్యులా?
  7. విజయరాఘవుడు, తాను శ్రీకృష్ణుడనని భావించి మొత్తం 16,000 స్త్రీలను సమకూర్చుకున్నాడు అని శ్రీ విస్సా అప్పారావుగారు తన ‘క్షేత్రయ్య పదములు’ అను పుస్తకమున వ్రాసారు.
  8. మనిషి ఎట్టి వాడైనను, ఆయన వ్రాతలు ఎంత నీతి సమ్మతములో, ధర్మ ప్రతిబింబితములో ఆయన పద సాహిత్యములు పరిశీలించిన తేటతెల్లమగును. ఉదాహరణ: ‘అందగాడ వౌదువు లేరా ఆదివరాహా’ మొదలగు గాగల పదసాహిత్యములు చక్కటి ఉదాహరణ. అది అంతా భక్తియా? మధుర భక్తియా? గోపాలున మాటున చేరి భక్తియును, బురఖా వేసి అది అంతయు భక్తి, అనుట సమంజసమా?
  9. భాగవత దశమ స్కంధమున పోతన మహర్షి, అట్టి వర్ణనలు చేసెనా? చదువరులచే అట్టి నీచ హేయ భాష చదివించెనా?
  10. త్యాగయ్య బహుపవిత్రుడని, అతి తుల్యుడని పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ కొనియాడ బడుచున్నారు. త్యాగయ్య తన రచనలో నామదేవ జ్ఞానదేవాదులైన జయదేవుని, రామదాసుని, నారాయణ తీర్థులను కొనియాడెను. కాని క్షేత్రయ్య వేరు కూడా ఎత్తలేదు.
  11. ఆయన రచించిన పదములు నృత్య ప్రదర్శనమునకు సరిపోవును. పద వర్ణములు చౌక వర్ణములు, జావళీలు, పదములు, కృష్ణ, కర్ణామృత మందలి శ్లోకములు నృత్య ప్రదర్శనకు అనుగుణములు.
  12. రాను రాను నృత్యానికి ప్రాధాన్యత తగ్గి సంగీతానికి ప్ర్రాబల్యము పెరుగుతూ వచ్చింది. అరుణాచల కవి (1711 – 1778) రామ నాటకమును వ్రాసిరి. గోపాలకృష్ణ భారతి (1811-1881) నందనాద్ చరిత్ర వ్రాసిరి. కవికుంజర భారతి (1811-1896) స్కాంద పురాణ కీర్తనలు వ్రాసిరి. అనంత భారతీయ కవి రామాయణ ఉత్తర కాండ కథను నాటకముగా వ్రాసిరి.
  13. షహాజీ మహారాజు శివ పల్లకి, విష్ణుసేవా పల్లకి, ప్రబంధములను తెలుగున రచించాడు. వెంకట్రామ శాస్త్రి గారు ప్రహ్లాద కథను నృత్య నాటికగా వ్రాసిరి. సభావతయ్య సీతారామ కళ్యాణము, నృత్య నాటికగా వ్రాసిరి. మన్నారు గుడిలో వెలసిన రాజ గోపాలునిపై చాలా పదములు వ్రాశారు. ఎక్కడ అశ్లీలములు లేవు. మేధావంతములగు పదములే వ్రాసిరి.
  14. అవి అన్ని కూడా నృత్యము లేని సంగీత ప్రధాన నాటకములు. త్యాగయ్య గారి – ప్రహ్లద భక్త విజయము, నౌకా చరిత్ర, సీతారామ విజయము, మొదలగు నాటికలలో సంగీత విశేషమే గాని, నృత్య ప్రాధాన్యత లేదు. నారాయణ తీర్థుల తరంగములందు గాని త్యాగయ్య నౌకా చరిత్రయందు గాని, పోతన భాగవతమునందు కృష్ణుని గాథలే వ్ర్రాసిరి. కాని క్షేత్రయ్య కుమ్మరించిన అశ్లీల పదజాలము ఆవంతయు వారి రచనలందు కానరాదు.
  15. త్యాగయ్య కాలము నాటికే కవి మహినుచే జావళీలకు నృత్యమునకు బహు ప్రచారమేర్పడింది. త్యాగయ్య నాయకి రాగములో ‘నీ భజన గాన రసికులనే నెందు గాన యిలలో’ అనే కీర్తన రచించి పరమార్థమగు నిజ భక్తి నశించినదని విలపించాడు. తుదకు ముత్తుస్వామి దీక్షితులు కూడా కమలం అను వేశ్యకు సంగీతం చెప్పెను. పట్నం సుబ్రమణ్యం అయ్యర్ కూడా వేశ్య యగు సేలం మీనాక్షికి సంగీతము భోదించెనట. జావళీలలో శృంగారము ప్రత్యక్షముగ కన్పించును. పదములలో బయటకు శృంగారము గాని అంతరార్థమున భక్తి ప్రవహించు చుండును.
  16. శాసన సభలు మొదలగు సంస్థలకు జరుగు ఎన్నికలకు దాపరించిన దౌర్భాగ్యము పవిత్రమగు సంగీతమునకు కూడా పట్టింది. ప్రతి పార్టీ ఎన్నికలలో గెలుపొందుటకు చేయని అకృత్యము లేదు. అటులనే గాక సభా లోకమున జావళీలు, పదములు, పాప్ సంగీతం, పైకాల సంగీతం మొదలగు అన్ని నీచ ప్రయోగములు మన సంగీతంలో చోటు చేసుకున్నాయి.
  17. ‘ఈయన పదములు ప్రమాదకర హేయ భావ సంభరితములు. వర్జ్యనీయములు గాని అనుసరణీయములు గావు. మధుర భక్తి శాస్త్ర సమ్మతమేనైనను ప్రమాదకరము. సర్వ విధముల దాస్య భక్తి క్షేమము, అనుసరణీయమ’ని రామకృష్ణ పరమహంస చెప్పారు.
  18. క్షేత్రయ్య వ్యభిచార జీవితాన్ని మొవ్వ గ్రామవాసులు సహింపజాలక, ఆయనని నిరసించిరి. ఆయన దక్షిణ దేశానికి వెళ్ళిరనియు, మోహనాంగి ఎడబాటును సహింపజాలక తన విరహ వేదన అంతయు పదములలో చొప్పించిరనియు ఆయన పదములు అంత రసవంతరముగా యుండుటకు అది ఒక కారణమని 11.8.1963 హిందూ పత్రికలో డి. ఆంజనేయులు గారు వ్రాసారు.
  19. ఆయన పదములతో పరిస్థితులు కళ్లకు కట్టినట్లుగా వున్నాయి అనుటకు నిదర్శనములు: కీ.శే. కె.వి. శ్రీనివాసయ్యంగార్‌చే రచింప బడిన ‘గాన భాస్కరం’ నుండి స్వీకరింపబడింది
    1. దుఃఖములో యున్న నాయిక, తన భావాలను తన సఖితో చెప్పట
    2. నిరాశ చెందిన నాయిక విశ్వాసం లేని నాయకుని నిందించుట
    3. భగ్ర హృదయురాలైన నాయిక, గత స్మృతులను తలచుకొంటూ తనను తానే ఓదార్చుకొనుట
    4. చాలాకాలం తర్వాత నాయిక తన నాయకుని కలసికొనుట

రాగ భావములను పరిశీలించుటకు, పైన పేర్కొనిన పరిస్థితులు చక్కని లక్ష్యములు. ఆయన పదములకు త్రిపుట తాళమునే వాడారు. 3 + 4 నృత్యానికి తగినది.

వీరి వంశీయులు యిప్పటికిని మొవ్వ గ్రామంలో ఉన్నారు. పదములు రచిస్తు అనేక క్షేత్రములు దర్శించి క్షేత్రయ్య లేక క్షేత్రజ్ఞుడని సార్థక నామము పొంది శ్రీ జయదేవుడు, నారాయణ తీర్థులై, తీర్థులు క్షేత్రయ్యగా అవతరించినట్లు ప్రతీతి కలదు.

(ఇంకా ఉంది)

Exit mobile version