ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-21

0
1

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

భక్త రామదాసు – మూడవ భాగం:

అనుబంధం:

[dropcap]‘తి[/dropcap]రువాచగం’ కర్త ‘మానికవచగర్’ అనే దాక్షిణాత్య వాగ్గేయకారుడు తప్ప రామదాసు వలె కారాగారం పాలై కష్టాలనుభవించి జీవితానుభవాలకు రూపకల్పన చేసిన వాడు మరొకడు లేడు.

రామదాసు – శ్రీ నారాయణ తీర్థులు:

‘కృష్ణ లీలా తరంగిణి’ని సంస్కృతములో నారాయణ తీర్థులు రచించారు. అధ్యాయాలకు ‘తరంగాలు’ అని తీర్థుల వారు నామకరణం చేస్తే, ఆయన వ్రాసిన కీర్తనలకే ‘తరంగాలు’ అన్న వేరు వాడుకలో స్థిరమైపోయింది. తరంగాలు నృత్యానికి అనువైనవి. యక్ష గానకావ్యం. మధుర శబ్దాల కూర్పుతో యతి ప్రాసలతో, శబ్దాలంకారాలతో, అత్యంత సుందరమైనవి తరంగాలు. నృత్యానికి అనుకూలంగా ఉండే విరుపులు, సోల్కట్టు శబ్దాలు కూడా చేర్చబడ్డాయి.

ఉదాహరణ:

పల్లవి: దేవ దేవ ప్రసీదమే – దేవక్ వరబాల దీన పరిపాల

రామదాసు కీర్తనలు తీర్థుల తరంగాల వలె పాడితే స్ఫోరకాలు కావు. ఆయన కీర్తనలలో అలతి అలతి మాటలు, కవితా గాంభీర్యం అడుగడుగునా దర్శనమిస్తాయి. తీర్థుల వారి తరంగాలలో శబ్దవైచిత్రి, పాండిత్య ప్రకర్ష, సంస్కృత భాషా వైదుష్యం ప్రస్ఫుటం అవుతాయి. తీర్థుల వారి కీర్తనలు స్వరాలు అలంకార భూషిత అయిన రాజకన్యను తలపిస్తే, రామదాసు కీర్తనలు సహజ సౌంధర్యవతి అయిన వనకన్యను మన ముందు నిలుపుతాయి.

రామదాసు – క్షేత్రయ్య:

రామదాసు, క్షేత్రయ్య సమకాలికులే అయినా ఇద్దరికి పరిచయం ఉన్నట్లు ఆధారాలు లేవు. నుడికారంలోను భావ వ్యక్తీకరణలోను, సంఘటనలను కల్పించటంలోను క్షేత్రయ్య అన్నమాచార్యులను అనుసరించినట్లు అనేక నిదర్శనాలున్నాయి. క్షేత్రయ్య ధాతు కల్పనలో చాలా ముందుకు పోయినాడనీ, నేటి కర్ణాటక రాగాలెన్నిటికో స్పష్ట రూపాన్నిచ్చాడనీ రజనీకాంతరావు గారు అభిప్రాయం వెలిబుచ్చారు (1). కాని రాళ్లపల్లి అనుత కృష్ణశర్మ గారు ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు (2). ఏది ఏమైనా క్షేత్రయ్య దృష్టి ప్రధానంగా రెండు అంశాలమీద ఉన్నట్లు అతడు రచించిన పదాల పరిశీలన తెలుస్తుంది. అందులో మొదటిది శృంగార రసాన్ని నాయకనాయకీ భావం ఆధారంగా పోషించటం. ఇది కొన్ని పదాలలో మోతాదు మించి అసభ్యమైన పచ్చి శృంగారానికి త్రోవ తీసింది. అలంకార శాస్త్రంలో వర్ణించిన శృంగార నాయికా లక్ష్మణాలకు లక్ష్యం. భానుదత్తుని ‘రసమంజరి’ని చదివిన క్షేత్రయ్య అందులో ఉదహరించబడిన లక్ష్య శ్లోకాలకు ముగ్ధుడై వాటి కన్న అందమ్మైన లక్ష్యాలను పదరూపంలో తెలుగులో రచించాలనే కుతూహలం కలిగి రసమంజరి లోనే నాయికా, నాయక, దూతికా లక్ష్మణాలకు లక్ష్యాలుగా పదాలను రచించి ఉండవచ్చునని విస్సా అప్పారావు గారు ఊహించారు. [1. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము, పీఠిక పుట సం 14. 2. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము పుట నం 228]

క్షేత్రాటనం చేసి క్షేత్రయ్యగా పేరుపొందిన ‘మొవ్వ వరదయ్య’ శృంగార నాయక నాయికా భేదాలను ప్రదర్శించటానికే పదాలను వ్రాశాడని ఆ పదాలను చదివిన వారికి వెంటనే స్ఫురించే విషయం.

ఉదా: ఆనంద భైరవి రాగంలో, త్రిపుట తాళంలోని పదం –

మంచి దినము నేడే మహారాజుగా రమ్మనలే

……..

కొదువ వద్దనలె ఆ కొమ్మ పేరెత్తనవలె (మంచి)

నాయిక దూతికతో అంటున్న మాటలివి. తన ప్రియుడు వేరొకతెతో ఉన్నట్లు తెలిసి నాయిక లోగడ అతనిని నిష్ఠూరాలాడింది. నాయకుడు వెళ్లిపోయిన తర్వాత నాయిక పశ్చాత్తాపురాలై, నాయకుని రమ్మని చెప్పమని దూతికను బ్రతిమాలుతున్నది. ఇది కలహా స్తరిత అనబడే శృంగార నాయికా లక్షణం.

క్షేత్రయ్య రెండవ దృక్పథం రాగ స్వరూప ప్రదర్శన. విభిన్న భావాలలోని సూక్ష్మ భేదాలను గుర్తించి ఆయా భేదాలకు సముచితమైన రాగాలను ఎన్నుకోవటమే గాక, ఆ రాగ స్వరూపాన్ని కళ్లకు కట్టించే స్వర ప్రయోగం చేశాడు. కాంభోజి రాగాన్ని ఎక్కువగా వాడాడు క్షేత్రయ్య. ముఖారి, భైరవి, కల్యాణి, రాగాలలో కూడా చాలా పదాలు వ్రాశాడు. ఈ పదాలు సంగీత రచన విలంభిత గతిలో ఉండి విస్తారమైన రాగభావ సాహిత్య భావ సంగతుల ప్రమాణానికి విభిన్న హస్త ముఖాద్యంగాభినయంతో ప్రదర్శించటానికి అనువుగా ఉంటుంది.

మాతు రచనలో సిద్మహస్తుడే అయినా, క్షేత్రయ్య ప్రత్యేకత ధాతుశిల్పంలోనే ఉంది. అతని సాహిత్య రచనా ప్రౌఢిమకు మోహన రాగం, ఝంప తాళంలోని పదం ఉదాహరణ!

‘మగువ తన కేళికా మందిరము వెడలిన్

వగకాడ మాకంచి వరద తెలవారెనని (మగువ)

….

తొడరె పదయుగమున తడబడి నడతోను’ (మగువ)

ఈ పదం – ‘తేట’ తెలుగు పలుకులతో భావ గాంబీర్యము వ్యక్తము చేయగల రచనా చాతుర్యము క్షేత్రయ్యకు అలవడినట్లు మరి ఏ వాగ్గేయకారునకు అలవడలేదని చెప్పవచ్చును అను మాట నిజమని రుజువు చేసింది.

రామదాసు శృంగారం వెపు తొంగి చూచినది గూడ లేదు. ఆయన రచనోద్దేశం లక్షణాలకు లక్ష్యాలను సమకూర్చటము కాదు, పాండిత్య ప్రకర్ష అంత కన్న కాదు. ఆయనకు సంగీతం భక్తి సాధనకు ఒక ఉపకరణం మాత్రమే. క్షేత్రయ్య రచనలోని సంఘటనలు నిజ జీవితంలో నుంచి తీసికొన్నవే అయినా తాను స్వయముగా పొందిన అనుభూతిని వెల్లడించే ప్రయత్నమే కన్పించదు. రామదాసు రచనలు ఆత్మాశ్రయములయిన కవితా ఖండికలు. క్షేత్రయ్య సంగీతంలో విప్రలంభ శృంగారానికి, అందులోనూ నాయిక బావురుమని ఏడ్పటానికే సరిపోయే కాంభోజీ రాగం ప్రధానం కాగా, రామదాసు కీర్తనలలో అత్యధికమైన వాటికి దైన్య భక్తి స్ఫోరకమైన ఆనంద భైరవి రాగం వాడటం జరిగింది.

కరుణ రసోచితమైన నాదనామ క్రియ, శంకారాభరణాలలో కూడా రామదాసు చాలా కీర్తనలు వ్రాశాడు. క్షేత్రయ్య సంగీతాన్ని శృంగార రస పోషణకు అనువుగా మలుచుకొన్నాడు. రామదాసు భక్తి, రసాభివ్యక్తికి సాధనంగా చేసుకున్నాడు. క్షేత్రయ్యది పరాశ్రయ కవితా రచన; రామదాసుది ఆత్మాశ్రయ కవితా రచన. క్షేత్రయ్య గుణము ప్రౌడి. రామదాసుది చిత్తశుద్ధి – త్యాగరాజ స్వామి, క్షేత్రయ్య ధాతు శిల్పాన్ని సమాదరించినా రామదాసు మాతు రచననే తన ఒరవడిగా చేసుకున్నాడు. వాగ్గేయకారులలో రామదాసుది ఒక అద్వితీయమైన స్థానం.

రామదాసు – మునిపల్లె సుబ్రహ్మణ్య కవి:

ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు రచించిన మునిపల్లె కూడా ప్రసిద్ధ వాగ్గేయ కారుడు. శృంగార సంపూర్ణమైన దామెర్ల వారి పదాలు కూడా ఆయన రచించినవే. క్షేత్రయ్య పదాల ఒరవడిలోనే సాగుతాయి; దామెర్ల వారి పదాలు కూడా ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు రామాయణ కథ ఇతివృత్తంగా కలిగి ప్రౌఢ సాహిత్య శిల్పంతో మనోహరంగా ఉంటాయి. ఆంధ్ర దేశంలో ఆబాలగోపాలాన్నీ ఆకటుకొన్న ఈయన కీర్తనలు ఈ మధ్యన మరుగున బడిపోయాయి. వేదాంత బోధన, కథా కథనము అనే బాధ్యతలను భరించవలసి రావటం చేత ఈ కీర్తనలు చాలా పెద్దవై, సంగీత రచన స్వల్పమై సంగీత విద్వాంసుల ఉపేక్షకు పాత్రమైనాయి. ప్రతి చరణము అనుప్రాసాంత్య ప్రాసలతో ఖండాలుగా తెగి ప్రతి ఖండానికి ఒకే ధాతువు ప్రయోగించబడింది. ఒకటి రెండు ఖండాలు పై కాలంలో పై స్థాయికి చుట్టి వచ్చి ముక్తాయింపుతో చరణం ముగిసి పల్లవి అందుకోవటం జరుగుతుంది. ఈ రాగ పద్ధతి వలన రాగభావం చెడకుండా, పాడే రీతిలో విభిన్నతను పొషించి జనరంజకత్వం సాధించబడింది. ఉదాహరణ – సురటి రాగం, ఆది తాళ కీర్తన

పల్లవి:

చేరి, వినవె శౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారీ

అనుపల్లవి:

వారిజాక్షు డంతటను శ్రీ మీరి వేడ్కతో నయోధ్యకు

గోరి పోవుదారిలో నృప వైరియైన పరశురాముడు

కారు మొగులు కరణి చాపధరుడై కాలమృత్యువో

యనగ బంక్తి రధు జేరి హరి ఎదుట నిలిచె పలికె వీరాధివీరుడని ఎరుంగక (చేరి)

~

అనుపల్లవిలో వారి, మీరి, చేరి, వైరి అనే ఖండాలు ఒకే ధాతువుతో తిరిగి రావటం, కారు మొగులు కరణి అనే దగ్గర నుంచి పై కాలం నడవడం. వీరాధివీరుడని ఎరుగక అనేది ముక్తాయింపుగా అంతం కావటం ఇందులో విశేషాలు. చరణాలు ఇదే ఫక్కీలో ఉంటాయి. ప్రతి కీర్తనలోను పల్లవి, అనుపల్లవి, చరణం అనే భాగాలు స్పష్టంగా ఉన్నాయి. అన్నమయ్య రచనలు సంకీర్తనాత్మకములు, క్షేత్రయ్య పదాలు రక్త్యాత్మ కములు. సుబ్రహ్మణ్య కవి కీర్తనలు ఆఖ్యానాత్మకములు. త్యాగరాజు కీర్తనలు నాదరసాత్మకములు. రామదాసు కీర్తనలు భక్తి రసాత్మకములు. ఎవరి పోకడ వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here