Site icon Sanchika

ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-22

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

భక్త రామదాసు – నాలుగవ భాగం:

రామదాసు – త్యాగరాజు:

“త్యాగరాజ స్వామికి పూర్వము పాట కచేరీలలో రామదాసు కీర్తనలు విరివిగా పాడబడేవి” అని శ్రీ చెంబై వెద్యనాథ భాగవతార్ వ్రాశారు.

త్యాగరాజస్వామి తల్లిదండ్రులు, బాల్యంలో రామదాసు కీర్తనలు పాడేడివారు. ప్రహ్లద భక్తి, విజయమును నాటకంలో రామదాసుకు ప్రణమిల్లుతూ వ్రాసిన కీర్తన:.

1.‘క్షీర సాగర శయన’ (దేవ గాంధారి – ఆది తాళం) అనే కీర్తనలో ‘ధీరుడౌ రామదాసుని బంధము తీర్చినది విన్నానురా రామా’ అని త్యాగయ్య గారు రామదాసును ధీరునిగా వర్ణించారు. శ్రీరామ సేవాతత్పరుడై చెఱసాల శిక్షను పన్నెండు సంవత్సరముల అనుభవించగల ధీరుడే గదా రామదాసు.

2.‘కలిగి యుంటే గదా’ (కీరవాణి రాగం – ఆది తాళం) అన్న దానిలో “భాగవతాగ్రేసరులగు నారద, ప్రహ్లాద, పరాశర, రామదాసులు బాగుగ శ్రీ రఘురాముని పదములు భక్తి చేసిన రీతి” అంటూ రామదాసును భక్తాగ్రేసరుడని వర్ణించాడు త్యాగరాజు.

3. ‘బృందావన లోల గోవిందా అరవింద నయన’ (తోడిరాగం – రూపక తాళం) అనే కృతితో ‘రామదాస దాస త్యాగరాజు నుత చరిత్ర’ అని తనను రామదాసుకు దాసుడని త్యాగరాజు చెప్పుకొన్నాడు. రామదాసు పట్ల త్యాగయ్య గారికి కల ఆరాధనా భావానికి ఇంత కంటే తార్కాణం ఏమి కావాలి?

4. ‘ఏమి దోవబల్కుమా’ (సారంగ రాగం ఆది తాళం) అనే కృతిలో అనుపల్లవిలోనే రామదాసు ప్రత్యక్షం అవుతాడు. ‘రామదాసు వలెనైతే సీతాభామ మందలించును నీతో’ అని రామదాసు శ్రీరాముని ప్రార్థించి, విసిగి, చివరకు సీతమ్మతో మొరపెటుకొంటే, సీతాదేవి రామునికి రామదాసు బాధలను చెప్పి ఆయనను రామదాసును చెఱ విడిపించేటట్లు చేసినదని జన శృతిలో ఉన్న గాథను దృషిలో ఉంచుకొని త్యాగరాజు రామునితో ‘రామదాసునైనా కాకపోతిని సీతాభామయైనా నీతో నా సంగతి చెప్పి ఉండేది’ అంటాడు.

5. ప్రహ్లాద భక్తి, విజయము అనే గేయరూపకాన్ని త్యాగరాజు రచించాడు. దాని ప్ర్రారంభంలో తనకు పూర్వులైన ప్రాచీన అర్వాచీన భక్తి, మహాశయులకు నమస్కారము లొనర్చిన సందర్భములో ఈ క్రింది పద్యాన్ని వ్రాశారు.

కం.
కలియుగమున వరభద్రా
చలమున నెలకొన్న రామచంద్రుని పద భ
క్తుల కెల్ల వరుఁడనందగి
వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్‌

ఇందులో రామదాసును రామభక్తి, శిఖామణిగా పేర్కొనటం జరిగింది. ఈ విధముగా త్యాగరాజు రామదాసును ధీరునిగా, భక్తాగ్రేసరునిగా, భావించి స్తుతించటం వలన రామదాసు యొక్క విశిష్టత నిరూపితం అవుతున్నది. రామదాసు కీర్తనలకు దాదాపు అనుసరణలుగా కొన్ని చోట్ల అనుకరణలుగా కూడా ఉన్న త్యాగయ్య కీర్తనలున్నాయి. రామదాసు ఛాయా మాత్రంగా సూచించిన భావాలను త్యాగరాజు విస్తరించిన సందర్భాలూ ఉన్నాయి. భక్తునిగా మాత్రమే గాక వాగ్గేయకారునిగా, రామదాసు పట్ల గౌరవాభిమానాలను వెల్లడించుకోవటానికైతేనేమి, రామదాసు రచనలు తనకు బాగా నచ్చటం వలన అయితేనేమి, త్యాగరాజు ఈ విధమైన రచనలను చేసి ఉండవచ్చు.

ఈ సత్యాన్ని నిరూపించగల కొన్ని ఉదాహరణలు!

1.రామదాసు చెఱసాల నుంచి విముక్తి, పొంది భద్రాచల రాముని దేవాలయంలో ప్రవేశించి, స్వామిని దర్శించి పాడిన పాట (మేచబౌళి రాగం ఝంప తాళం) [త్యాగరాజు కీర్తనలు విశేష వివరణం కలూరి వీరభద్ర శాస్త్రి, ప్రథమ సంపుటము పుట 2]

“కంటి మా రాములను కనుగొంటి నేను

కంటి నేడు భక్తి, గణములు బ్రోచు మా

యింటి వేలుపు భద్రగిరినున్న వాని” (కంటి)

2. పోయిన విగ్రహాలు కావేరి నదిలో తిరిగి లభించినపుడు త్యాగరాజు చెప్పినట్లుగా జన శృతిలో ఉన్న కీర్తన (బిలహరి ఆది)- ‘కనుగొంటిని శ్రీరాముని నేడు’.

3.‘శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్నచాలు జాలు ఘోరమైన తపములను గోర నేటికే మనసా’ (సావేరి) అన్న దానిలో రామనామ స్మరణ జపత పాదుల కన్న మించినదని చెప్పబడింది.

ఇటువంటి భావాన్నే త్యాగరాజు శంకరాభరణం రాగం, త్రిపుట తాళంలో –

(అ). ‘మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరి తంత్ర తంత్రము లేల

తనువు తాను గాదని ఎంచే వానికి తపసు చేయగ నేల దశరధబాల’

(ఆ). రామదాసు ‘నారాయణ యనరాదా – మీ నాలికపై ముల్లు నాటియున్నదా’

అనే నాదనాయ క్రియ కీర్తనలో ఈ విధముగా అంటాడు.

“ఆలుబిడ్డల పొందు బాసి వట్టి

అడవిలోపల పండుటాకులు మేసి

జాలిచెందుట వట్టిగాసి

లెస్స సంసారియైయుండి సమబుద్ధిజేసి”

[1. రామదాసు కీర్తనలు మంచాల జగన్నాధ రావు, పుట 46. 2. పల్లవి రామదాసు చరిత్రలో వేరుగా ఉన్నది. కంటి నేడు మా త్యాగరాజు కీర్తనలు – కల్లూరి వీరభద్ర శాస్త్రి: మొదటి భాగం పుట 358]

లెస్స సంసారియై నారాయణ స్మరణ చేస్తే, అడవికి పోవలిసిన పని లేదని, మోక్షం కరతలామలకం కాగలదని దీని భావం. సరిగ్గా ఇలాంటి భావాన్నే త్యాగరాజు మనోజ్ఞంగా వ్యక్తం చేశాడు. సావేరి ఆది తాళంలోని కీర్తనలో

‘సంసారులైతేనేమయ్యా శిఖి పించావతం సందెదుట నుండగ (సం)

హింసాదులెల్ల రోసి, హంసాదుల గూడి ప్రశంస జేయుచునే

ప్రొద్దు కంసారిని నమ్మువారు.’

3. రామదాసు వరాళి రాగం – కీర్తనలో శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడో అని పరితపించాడు.

‘ఏడనున్నాడో నా పాలి రాముడేడనున్నాడో’ అంటూ

‘నాడు గజేంద్రుని కీడు బాపిన స్వామి

బాలునికి ప్రాణమిచ్చిన జగత్ప్రాణ రక్షకుడు.

పాంచాలికి వలువ లిచ్చెన తండ్రి’ అంటాడు.

త్యాగరాజు ‘ఎందు దాగినాడో’ అనే తోడి రాగ కీర్తనలో ప్రహ్లాదుని కొరకు స్తంభములో దాగినట్లు, వాలిని వధించే నిమిత్తం తాళ వృక్షం చాటున దాగినట్లు శ్రీరాముడు ఎందుకు దాగినాడో అని విత్కరించుకొంటాడు.

4.‘ఎన్నటికో’ అనే పదంతో ప్రతి చరణము అంతం అయ్యే కీర్తన ఒకటి రామదాసు కీర్తనలలో కాపి రాగంలో ఉన్నది. అది.

పల్లవి:

“పావన రామనామ సుధారసపానముజేసేదెన్నటికో

సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో”

త్యాగరాజు దివ్యనామ కీర్తనలను రామదాసు కీర్తనల లాగానే సరళ శైలిలో భక్తి, ప్రధానంగా రచించాడు. సౌరాష్ట్ర, చాపు

‘వినయమునను కౌశికుని వెంట చనినాంఘ్రులను జూచునదెన్నటికో’

5.ఆరభి రాగం చతురశ్ర ఏక తాళంలో రామదాసు ‘నా మొరాలకింపవేమయ్య ఓ రామ రామ నా మొరాలకింపవేమి’ అంటాడు. నిరాశ్రయం వలన జన్మ సాఫల్యం చేకూరదని భగవదాశ్రయమే ముక్తి, హేతువని ప్రకటించే రామదాసు కీర్తన ఒకటి ఉన్నది.

పల్లవి:

‘నరహరిని నమ్మక నరులను నమ్మితె నరజన్మమీడేరునా ఓ మనసా’.

ఇదే భావాన్ని త్యాగరాజు తన కీర్తనలో పొందు పరచాడు.

‘నళినలోచన నీవు గాక అన్యుల నమ్మ నరజన్మ మీడేరునా’.

6.యదుకుల కాంభోజి – రాగం ఆదితాళంలో రచించబడిన ‘రామునివారమైనారము ఇతరాదుల గణనసేయము మేము’ అనే కీర్తనలోని చరణంతో రామదాసు ఇలా అంటాడు.

‘గ్రహగతులకు వెరువబోము మాకు/గలదు దైవానుగ్రహబలము’

దైవానుగ్రహ బలం ఉండే గ్రహబలం పనికిరానిదవుతుందని, దానిని తాను పరిగణంచనని రామదాసు స్పష్టం చేస్తాడు. ఇదే అభిప్రాయాన్ని త్యాగరాజు పల్లవి ఎత్తుగడలోనే ప్రకటించిన కీర్తన ఇది. రేవగుప్తి రాగం దేశాది తాళం.

పల్లవి:

గ్రహబలమేమి శ్రీరామాను, గ్రహబలమే బలము

అనుపల్లవి:

గ్రహబలమేమి తేజోమయ వి

గ్రహమును ధ్యానించు వారికి నవ

రామదాసు ‘గ్రహ’ శబ్దాన్ని అర్థ భేదంతో గ్రహగతులకు ‘దైవాను గ్రహబలము’ అను చోట్ల ప్రయోగించినట్లే త్యాగరాజు కూడ ‘గ్రహ’ శబ్దాన్ని భిన్నార్థాలతో ‘గ్రహబలము’, ‘రామానుగ్రహబలము’, ‘తేజోమయ విగ్రహము’ అను చోట్ల యమకం అనే ఆ శబ్దాలంకారం తోచేటట్లు ప్రయోగించాడు్ [త్యాగరాజ కీర్తనలు, విశేష వివరణము. ప్రథమ సంపుటం పుట 395]

రామదాసు పట్ల త్యాగరాజస్వామికి ఉన్న భక్తి, గౌరవాలు తేటతెల్లనువుతాయి. సంవాదిన్యో మేధా వినాం బుద్ధయః అనే ప్రమాణాన్ని బట్టి, మేధావులు బుద్ధులు అప్రయత్నంగానే ఒక దానితో ఒకటి పోలుననటం నిజమే కాని త్యాగరాజు తాను స్వయంగా రామభక్తుడై, వాగ్గేయకారుడై, తన మాత్రుదేవి ప్రతి దినము పాడి వినిపించిన రామదాసు కీర్తనల చేత ప్రభావితుడై ఉండటానికి ఈ ఉదాహరణలు ప్రబల తార్కాణంగా ఉన్నవి.

రామదాసు రాగభావ ప్రదర్శన కోసం కీర్తనలు వ్రాయలేదు. తన జీవితంలో ఎదురైన అనుభవాలను కీర్తనలుగా మలచి, సరళమైన ధాతు శైలిలో వాటిని కూర్చాడు. పాండిత్య ప్రకటన గాని, లక్ష్య లక్షణ వేత్తత్వము కాని ఆయన అభిలాష కాదు. ఆయనకు రాముడే భగవంతుడు. త్యాగయ్యకు సంగీతమే రాముడైతే, రామదాసుకు రాముడే సంగీతం. అందుకే ‘ఓ రామ నీ నామ మెంత రుచిరా’ అని తన్మయుడై కీర్తించాడు. రామదాసు, త్యాగరాజు కృతులు సంగీత సభలలో రసికులను అలరిస్తాయి. రామదాసు కీర్తనలు భజన గోష్ఠులలో రామ మందిరాలలో భక్తులను పులకింపచేస్తాయి. ప్రొఫెసర్. పి. సాంబ మూర్తి, గారు రామదాసును గురించి వాస్తు ఇలా అన్నారు.

“The soul stirring nature of his songs.
the depth of feeling underlying them,
their sweet and melodious music and their
human touch have all an irresistible appeal.”

రామదాసు కీర్తనలలోని మానవతా భావం (హ్యుమన్ టచ్) అనే దానిని ప్రత్యేకంగా గమనించవలసి ఉంది. తన జీవితానుభవ సారాన్నంతా వడబోసి, తన హృదయ వేదనంతా మూసబోసి సృష్టించిన కీర్తనలలో మానవతా భావం ద్యోతకం కాకుండా ఉంటుందా? ఈ మానవతా భావమే రామదాసును వాగ్గేయకారులలో విలక్షణ వ్యక్తిగా నిలబెట్టినది.

“ఎక్కడో దక్షిణాది వారి బాణినీ, ఉత్తరాది వారి బాణిని అనుసరించటం తప్ప ఆంధ్రులకు సొంత సంగీతం లేదనుకొనే వారందరికీ అన్నమాచార్యులతో ప్ర్రారంభించి, సుబ్రహ్మణ్యకవి వరకు గల వాగ్గేయకారులందరి జీవితాలు సరి అయిన ప్రత్యుత్తర మీయగలవు.” [గ్రేట్ కంపోసర్స్: ప్రొఫెసర్ పి. సాంబమూర్తి, ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము: బాలాంత్రపు రజనీకాంతరావు పుట 252].

(ఇంకా ఉంది)

Exit mobile version