Site icon Sanchika

ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-25

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి (1700 – 1772):

18వ శతాబ్దమునకు చెందినవారు. నివాసము కుంభకోణం వద్ద గల ‘తిరుతై నెరూర్’ గ్రామము. కామకోటి పీఠాధిపతి యగు శ్రీ పరమ శివేంద్ర సరస్వతి స్వామి వారి శిష్యుడు. పినతండ్రి రామభద్ర దీక్షితారు వద్ద విధ్య యొనర్చెను. భక్తి, రస ప్రధానమైన అనేక కర్తనలే గాక గ్రంథాలు కూడా వ్రాసిన సమర్థురు. రోజుల తరబడి సమాధి యందు యుండెడి వారు. అమరావతి, కావేరి తీరములో గల నేరూరు, కొడుముడి మొదలగు పల్లెలందు దిగంబరుడై మౌనవ్రతముతో నివసించెడివారు. తన మరణ కాలం ముందుగానే తెలిపిన తపస్సంపన్నుడు. ఈయన వార్షికోత్సవములు నెరూరులో నేటికిని జరుగుచున్నవి. కొత్తకోట సంస్థానాధీశ్వరులు పేరి శిష్యకోటికి చెందినవారు కాబట్టి వీరి సమాధికి నిత్యోత్సవాలు జరిపిస్తున్నారు. ఈయనచే సంస్కృతములో రచింపబడిన ఆధ్యాత్మ కీర్తనలు ‘పరమహంస ‘ముద్ర కల్గియుండును.

వాటిలో సామరాగంలోని ‘మానస సంచరరే బ్రహ్మణి’ అను కీర్తనయు, ‘బ్రూహి ముకుందేతి రసనే’ అను వేరొక రాగము లోని కీర్తనలు మిగుల ప్రసిద్ధి చెందినవి.

ఆ కాలపు దేశ పరిస్థితులు:

అశోకుని కాలంలో శాతవాహన సామ్రాజ్యం బలిష్టమగుట, మౌర్య రాజ్యం పతనం అవడంలో శాతవాహన రాజ్యము భరత ఖండమున ప్రధాన రాజ్యమయ్యెను.

మొదటి తెలుగు సామ్రాజ్యము – శాతవాహన రాజ్యం (క్రీ. శ. 220). కాకతీయ సామ్రాజ్యం – వరంగల్ ముఖ్య పట్టణంగా. అదే రెండవ తెలుగు సామ్రాజ్యము.

విజయనగర సామ్రాజ్యము (1336 – 1564) మూడవ తెలుగు సామ్రాజ్యం. 1564లో తళ్లికోట యుద్ధమున ఈ రాజ్యం అణచి వేయబడింది.

1360 మధురై:

మధుర ప్ర్రాంత ప్రదేశము తెలుగు విజయనగర రాజుల సామంతులచే పాలింపబడింది. కృష్ణదేవరాయలు (1509 – 1529) కన్యాకుమారి అగ్రము వరకు గల దేశము అంతయు జయించి పాలించెను. అరవ దేశమున తెలుగు రాజుల పాలన యున్న కారణమున ఉత్తర తెలుగు దేశమందలి ఆంధ్రులు తమిళ ప్రాంతములకు బోయి అచ్చట స్థిర నివాసం ఏర్పరుచుకుంటు వచ్చారు. ఈ విధముగనే 3వ శతాబ్దము కాలమున ఎపుడో సదాశివ బ్రహ్మేంద్రుని పితామహులు మధుర ప్ర్రాంతమున కేగి అచట స్థిరపడిరి. త్యాగయ్య పితామహులు గిరిరాజు సమకాలికులు. ఇంటి పేరు మోక్షము వారు. తండ్రి సోమనాథ యోగి. తల్లి శాంత, బాల్యదశ యందు సదాశివుల పేరు శివరామకృష్ణశాస్త్రి.

సదాశివునికి జ్ఞానోదయం కల్పిన సంఘటన:

సదాశివునికి భోజనమునకు కాలాతీతం అవటంతో సకాలమున దొరకక బాధకు గురికావలసి వచ్చింది. జీవితమంతయు ఇలాగే దుఃఖిస్తూ, భరించరానిదిగా వుండునని గృహస్థాశ్రమము వీడి సన్యాసాశ్రమము స్వీకరించారు.

అణిమాది శక్తులు, ఆకాశయానము, దూర గమనము, దూర శ్రవణము సదాశివులకు అలవడెను.

అతని జీవితం మహానుహిమానిత్యం అని చెప్పుటకు చాలా సంఘటనలు, ఉదాహరణలు వున్నాయి. కొన్నింటిని మనం గమనిద్దాం.

  1. పుదుకోట ప్రభువు శ్రీ విజయ రఘునాథ తొండమాన్ మహాభక్తుడు. ఆ కాలమున మహారాష్ట్ర సైనికులు – కలవారిని హింసించుచు వారి సంపదలను దోచుకొనేవారు. ప్రభువు సదాశివుని పాదములపై వాలి ఆశీర్వచనము కోరగా ‘నవనీత తొండమాన్’ అని పుత్రుడు గల్గెను. ప్రజలు చోర రోగ బాధలు లేక సుఖములలో ఓలాడేవారుట.
  2. పొలమున ధాన్యరాశిపై ఆశీనులై, యోగ నిష్ఠ యందు మునిగి యుండగా, చోరుడు అని తలచి కొట్టబోవ, అతని చేయి రాక బాధపడుచుండ యోగనిద్ర నుండి లేచి నిల్చిన తోడనే భూస్వామి చేయి దిగెను.
  3. సదాశివుడు అడవిలో నడుచుచుండగా, కొందరు సైనికులు కట్టెలు కొట్టి గుట్ట చేసి స్వామి నెత్తి మీద పెట్టారు. తుదకు మంటలుద్బవించి సైనికుల యిండ్లను కాల్చివేసెనట.
  4. దిగంబరులగు సదాశివులు సేనానాయకుని భార్యలు విశ్రమించి యున్న డేరా ప్రక్కగా వెడలు చుండగా, సేనానాయకుడు కోపగించి కత్తితోని స్వామి వారిని నఱకగా, స్వామి వారు దాని నెరుగక గమనింపక ఆనందమయులై నడుచుచున్నారట.
  5. ఒక రోజున బాలురు సదాశివుని సమీపించి మధురలో సుందరేశ్వరుని వృషభ వాహనముపై వైభవముతో ఊరేగింతురట, ఆ ఉత్సవము జూడవలె అని కోరగా, కళ్ళు మూయునంతలో అచట కేగి ఆ ఉత్సవమును తిలకించెరట బాలురు, కళ్ళు తెరవగానే తమ స్వగ్రామమున యున్నారట.
  6. ఖండన యోగమున అద్వితీయులు వీరు. రాత్రి వేళలో ఆ శరీరావయములు విడి విడిగా పడియుండి సూర్యరశ్మి సోకగనే కలిసిపోయేవి. ఒక రోజు భయంకర తుఫాను మూలంగా ఆయన మరణించారని జనులు అందరు అనుకోగా కొన్ని నెలలు తరువాత ఆయన సమాధిలో కన్పించి, చిరునగవుతో బయటకు వచ్చిరట.

అన్ని మహిమలు గల వ్యక్తి, మహర్షి గాక మరి ఏమవుతారు?

సదాశివులు వ్రాసిన గ్రంథములు:

  1. బ్రహ్మ సూత్ర వ్యాఖ్యానము
  2. యోగ సూత్ర వృత్తి
  3. శివమానసిక పూజ
  4. ఆత్మ విద్యా విలాసము
  5. సూత సంహిత సారము
  6. అయ్యప్ప దీక్షితుల గ్రంథములకు వ్యాఖ్యానము
  7. పరమ శివేంద్రుల గ్రంధములపై వ్యాఖ్య
  8. సంస్కృతమున ‘పరమ హంస’ అను ముద్రతో 23 కీర్తనలు

కీర్తనలలో పధానమైనవి :

  1. మానస సంచర
  2. బ్రూహి ముకుందేతి
  3. భజరే గోపాలం
  4. గాయతి వనమాలి
  5. పిబరే రామరసం
  6. బ్రహ్మైవాహం

ముఖ్యంగా తొమ్మిది మంది వాగ్గేయకారుల తరువాత తోడి సీతారామయ్య, శంకరాభరణం నరసయ్య, కాక ఇతర తెలుగు పదకర్తలు, తమిళ పదకర్తలు కూడా వున్నారు. వారిని గూర్తి క్లుప్తంగా చర్చించెదము.

తోడి సీతారామయ్య:

18వ శతబ్దానికి చెందినవాడు. సంగీత, సాహిన్యములందు సమర్థుడు. అనేక రచనలను రచించిన వాగ్గేయకారుడు. తోడి రాగాలాపన ఇతని సొమ్ము అని చెప్పవచ్చు. కనుకనే ‘తోడి సీతారామయ్య’ అయ్యారు. కుదువ పెట్టిన తోడి రాగమును వడ్డీతో సహా పైకము చెల్లించి ఈయనచే ఆ రాగాన్ని పాడించి రాజులు సన్మానించెడి వారట.

శంకరాభరణం నరసయ్య:

18వ శతాబ్దానికి చెందినవాడు. శరభోజి కాలము నాటి వాడు. బ్రాహ్మణుడు. ద్రావిడ భాషలో గేయ కల్పనలు విలసిల్లునట్లు పదములు రచించిన గొప్ప ప్రతిభ గలవాడు. శంకరాభరణం రాగాలాపన ఈతని సొమ్ము. ఆనాటి ప్రసిద్ధ గాయకులేమి, ప్రజలేమి తరచుగా చెప్పుకొనెడి వారని ప్రతీతి గలదు. కనుకనే ఈతడు శంకరాభరణం నరసయ్య అని సార్థక నామముతో పిలువబడుచుండెడివాడు.

పరిమళ రంగ పదకర్త:

ఇతడు క్రీ. శ. 1700 ప్రాంతము వాడు. త్రైలింగ్య బ్రాహ్మణుడు. మద్రాసుకు ఉత్తరముగా వుండుటచే ఆంధ్రుడని చెప్పవచ్చు. సంగీత, సాహిత్యములలో గొప్ప సమర్థుడు. ఇతడు ప్ర్రాస యముకములతో రచించిన పదములలో, కీర్తనలలో ‘పరిమళ రంగ’ ముద్ర వుండుటచే పరిమళ రంగడుగా చెప్పుదురు. ఈయన అసలు పేరు తెలీదు. ఏ క్షేత్రము, ఏ గ్రామమో కూడా సరిగ్గా తెలియదు. నరస్తుతికి విముఖుడు, దేవతాంకితముగా రచనలు సాగించాడు. తెలుగులో ఈతని పదములు 40 వరకు కలవు. కీర్తనలు 8 వరకు వున్నాయి. కొన్ని దైవపరంగాను, కొన్ని కొన్ని జతులతో కూడినవిగా యుండి నాయకా, నాయక లక్షణములు కల్గియుండును.

ఇతర తెలుగు పదకర్తలు:

17వ శతాబ్దానికి చెందిన వారుగా తెలియుచున్నది. పేర్లు మాత్రము తెలియుట లేదు. కాని వీరి ఇంటి పేర్లను, వీరి రచనలు ఉదాహరణలతో ఈ క్రింద చెప్పుడింది.

  1. యువరంగని పదములు – ఉదా: చెయిబట్టి నా సిగ్గు చెరవవలెనా (శహన)
  2. కస్తూరి రంగని పదములు – ఉదా: ఇందెందు వచ్చితివిరా . అలదాని యిల్లు
  3. ఘట్టుపల్లి వారి పదములు – ఉదా: తలచుకొంటే తాళజాలనే (కురంజి)
  4. బోల్ల వరము వారి పదములు – ఉదా: మోసమా యెగదనే నా బుద్ధికి (అహిరి)
  5. శోభన గిరి నారి పదములు – ఉదా: చెలియనితో (2) నెలతా (కాంభోజి)
  6. జటవల్లి వారి పదములు – ఉదా: మగవారికి ధర్మమేదదే మగువ వారలనమ్మ
  7. ఇనుకొండ వారి పదములు – ఉదాః నీవే మోడితే నెత నాదానవు (రేగు)
  8. శివరాంపురము వారి పదములు – ఉదా: ఏమి నేయుదు నిషమ మేడాయెనే (కాంభోజి); పోదామా పారిపోదామా (ధన్యాసి)

పై విధముగా ఎందరో పద కర్తలు, ఎన్నో పదములను రచించి కీర్తి చెందియుండిరి. ఇవే గాక వేణంగి వారు, వేణంగి ముద్రతోను, మల్లవారు మల్లికార్జున ముద్రతోను రచించిన పదములు కూడా ఎన్నో కలవు.

తమిళ పద కర్తలు:

వీరిలో వైదీశ్వరన్ కోవిల్ సుబ్బరామయ్యర్, ఘనం కృష్ణయ్యర్, ముత్తు తాండవరు, పాప వినాశ మొదలియార్ మొదలగువారు ముఖ్యులు.

1. వైదీశ్వరన్ కోవిల్ సుబ్బరామయ్యర్:

18-19 శతాబ్దానికి చెందినవాడు. తమిళ బ్రాహ్మణుడు. సంగీతములోను, తమిళ భాషలోను గొప్ప పండితుడు. ఇతడు తమిళములో శృంగార రస ప్రధానమైన అనేక పదములను ‘ముద్దు కుమార’ ముద్రతో రచించి విశేషమైన కీర్తి పొందినవాడు.

2. ఘనం కృష్ణయ్యర్:

18-19 శతాబ్దానికి చెందినవాడు. తమిళ బ్రాహ్మణుడు. తిరుచునాపల్లి జిల్లాలోని ‘తిరుక్కుణం’లో జన్మించాడు. ఉదయార్ పాళయములో నివసించాడు. తండ్రి పేరు రామస్వామి అయ్యర్. తంజావూరు ఆస్థాన విద్వాంసుడు. బొబ్బిలి కేశవయ్య వద్ద కొంత వరకు సంగీత విద్య అభ్యసించినవాడు. పల్లవి పాడుట యందు అతి సమర్థుడు. పదములు రచించుటలో మిక్కిలి ప్రతిభావంతుడు. ఈతని పదములు శృంగార రస ప్రధానమై యుంటాయి. తంజావూరు ఆస్థాన విద్యాంసులతో కలిగిన విభేదము వలన ఉదయార్ పాళయము వచ్చి ఆ రాజు యొక్క ఆస్థాన విద్వాంసుడయ్యాడు. అక్కడ రాజైన యువరంగభూపతి పైనను, మధ్యార్ణనము నేసిన ప్రతాపసింహునిపైన తమిళములో అనేక పదములను రచించి బహు సన్మానములు పొందాడు. త్యాగరాజు ఈతని గానానికి మెచ్చుకొనెడి వారట.

3. ముత్తు తాండవర్లు:

19వ శతాబ్దానికి చెందినవాడు. ద్రావిడ భాషయందును, సంగీతమందు గొప్ప పండితుడు. శివ భక్తాగ్రేసరుడు, చిదంబరనాథునిపై భక్తి, శృంగార రసములలో ఈతడు రచించిన పదములు కీర్తనలు మిగుల ప్రసిద్ధములు. ఇతను అరుణాచల కవి రాయర్ ముందు వాడని చెప్పుదురు.

4. పాప వినాశ ముదలియార్:

18వ శతాబ్దనముకు చెందినవాడు. తులజాబీ మహారాజు సమకాలికుడు. సంగీతమందును, ద్రావిడ భాషయందు విశేష పాండిత్యము గలవాడు. ఇతడు ‘పాప వినాశ’ అను స్వనామ ముద్రతో నిందాస్తుతిగా అనేక పదములను తమిళములో రచించి కీర్తి పొందాడు.

(సమాప్తం)

Exit mobile version