ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-3

0
3

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

సంగీత ప్రాశస్త్రములో అంశాలు – 2వ భాగము:

డి: నాద, స్వర, సాహిత్య సమ్మేళం – సంగీతం

నాదము:

మానవుడు పంచ భూతాత్మకుడు. వీనిలో వాయువు నాద జనకము. వాయు ప్రసారము జరగని చోట శబ్ద ప్రసారము కూడా జరుగదు. మానవ జీవిత వ్యాపారానికి, శబ్ద ప్రసారానికి కూడా వాయువు ప్రధానం. అంతే కాదు ఒకసారి వాతావరణంలోని వాయివులోకి ప్రవేశించిన శబ్దం నశించదు. మన పూర్వులు శబ్దాన్ని ‘శబ్ద బ్రహ్మం’ అన్నారు. అయితే ఈ బ్రహ్మం సాధారణ శబ్దం కాదు. ఇది మానవుని జీవనాదం.

శ్లో:

బ్రహ్మగ్రన్థిజమారుతాను గతినా చిత్తేన హృత్పంకజే

సూరీణామనురంజకః శృతిపదం యోయం స్వయం రాజతే।

యస్మాద్గ్రామవిభాగవర్దరచనాలంకారజాతిక్రమో

వందే నాదతనుం తముద్ధుర జగద్గీతం ముదే శంకరమ్‌॥

(సంగీత రత్నాకరము)

నాదమును శంకర స్వరూపముగా వర్ణించెను.

బ్రహ్మ గ్రంథిలో నుండు సూక్ష్మాగ్నిచే ప్రేరేపింపబడి ప్ర్రాణ వాయివు, నాభి, హృదయ, కంఠ, శిరస్సు, ముఖముల ద్వారా నాదం ఉత్పత్తి అగుచున్నది. అట్లు ఏర్పడిన నాదం నాభియందు ఉన్నప్పుడు- అతి సూక్ష్మ అని, హృదయము నందు సూక్ష్మ అని, కంఠమందు పుష్ట అని, శిరస్సు నందు అపుష్ట అని, ముఖము నందు కృత్రిమ అని చెప్పబడినది.

నకారం ప్రాణం నామనం దకారం అనలం విదుః।

జాతః ప్రాణాగ్ని సంయోగాత్ నాద నమాభిధీయతే॥

‘నాద’ శబ్దము నందు నకారం ప్రాణమని, దకారం అగ్ని అని, అట్టి ప్రాణాగ్నుల సంయోగము నాదమనేదని శ్లోక భావం.

నాదము సర్వ ప్రాణికోటిలోను అంతరనంగా నినదిస్తునే వుంటుంది. సృష్టి లోని శబ్ద ప్రపంచం అంతా నాదంలోనే లయిస్తోంది. ఇలాంటి నాదాన్ని పలికించటం వల్లనే సంగీతం సర్వోత్కృష్ట కళ అవుతోంది.

నాద విభాగం:

ఆహత నాదం:

సహజ సిద్ధంగా వుండే నాదాన్ని ప్రయత్న పూర్వకంగా విశిష్ట భావోద్దీపనకై మనోరంజకముగా పలికించినపుడు అది ఆహత నాదం అవుతుంది.

అనాహత నాదం:

శరీరంలో సహజ సిద్ధంగా ఉండే నాదాన్ని దీక్షతో ఉపాసించే విధానం అనాహత నాదం అవుతుంది. ఇది తపశ్చర్య.

నాద విశిష్టత:

ఈ నాదము వేదముల కాధార స్థానమగుటయే గాక, పద, వాక్య, కావ్య, నాట్యాకాలంకార శాస్త్రములును, శ్రుతి, స్వర, గ్రామ, మూర్ఛన, అలంకార, గీత, వర్ణ, పద, కీర్తనాదులును ఏర్పడుటకు కారణమయి జనరంజకమైన సంగీతంగా ఏర్పడుతోంది.

వేదకాలమునుండియు భారతీయ సంగీతం అతి పవిత్రమైనదే కాక ముక్తిదాయకంగా చెప్పబడుతున్నది. ఇందుకు ముఖ్య కారణం త్రిమూర్తులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నాద స్వరూపులై, నాదోపాసితులుగా యుండడమే. కనుకనే పరమ భక్తాగ్రగణ్యులగు శ్రీ నారదాది మహర్షులే గాక, శ్రీ జయదేవ, అన్నమాచార్య, పురందర దాస, నారాయణ తీర్థ, త్యాగరాజాది భక్త శిఖామణులు సైతము నిరంతరము భక్తితో సంగీత కళోపాసన చేసి తమ రచనలచే భగవంతుని కీర్తించి తరించగలిగారు.

త్యాగరాజుని సంగీత జ్ఞాన, శాస్త్రజ్ఞాన, నాద వైశిష్ట్యములను విశదముగా స్పష్ట పరచినది. కొన్ని కృతులు ఉదాహరణలు :-

  1. నాద తనుమనిశం – చిత్తరంజని – ఆది
  2. నాదోపాసన చేసే శంకర – బేగడ – ఆది
  3. నాదలోలుడై బ్రహ్మ – కల్యాణ వసంత – రూపక
  4. నాద సుధారసం బిలను – ఆరభి – రూపక
  5. సామజవరగమన – హిందోళ – ఆది
  6. సంగీత జ్ఞానము భక్తి వినా – ధన్యాసి- ఆది
  7. మోక్షము గలదా – సారమతి – ఆది
  8. ఆనంద సాగర మీదని – గరుడధ్వని – ఆది
  9. కద్దను వారికి – తోడి – ఆది
  10. సీతావర సంగీత జ్ఞానం – దేవ గాంధారి – ఆది
  11. మనస్సు రంజిల్ల – ధన్యాసి – ఆది
  12. నారద గురుసామి – దర్బారు – ఆది
  13. శ్రీ రఘువరా ప్రమేయ మామవ – కాంభోజి – ఆది
  14. గీతార్థము సంగీతానందము – సురటి – ఆది
  15. రాగసుధారస పానముచేసి – ఆందోళిక – ఆది
  16. ఎందుకు పెద్దల వలె బుద్ధి ఇయ్యవు- శంకరాభరణం – ఆది
  17. ఏ పాపము జేసితిరా రామ – అఠాణ – త్రిపుట
  18. స్వరరాగ సుధ – శంకరాభరణం – ఆది
  19. శోభిల్లు సప్తస్వర సుందరుల – జగన్మోహిని – రూపక
  20. శ్రీనారద! నాద సరసీరుహ భృంగ – కానడ – రూపక

స్వర విధానం:

స్వర ప్రధానమైనది సంగీత కళ. సృష్టిలోని సర్వ స్వరములలో దివ్యత్యము దోబూచులాడుతున్నా అది బాహ్య శ్రవణేంద్రియములకు అందదు. కళాకారుని రస హృదయం మాత్రమే ఆ స్వర మాధురాన్ని ఆస్వాదించగలుగుతుంది. అలాంటి రస హృదయుడు సమస్త స్వరములను తన హృదయములో మథించుకొని మనోరంజకమైన సృష్టిలోని స్వరాలను పోలినవి నూత్న స్వరాలను సృష్టించగలిగాడు. ఈ కళాత్మక స్వరాలలో సాధారణ మానవుడు సైతము దివ్యత్వాన్ని అనుభూతి చెందగలిగాడు. ఈ స్వరాలు సృష్టిలోని ఏ స్వరాలను రేఖామాత్రంగా అనుకరిస్తున్నాయో, దాని ఆధారంగా ఆ స్వరాలకు ఆయా పేర్లు పెట్టడం జరిగింది. అవి

షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, ధైవతము మరియు నిషాధము. ఈ స్వరాల సంకేత నామాలు: స, రి, గ, మ, ప, ద, ని

పూర్వీకులు స్వరమును ఈ విధంగా నిర్వచించారు

“స్వయం యా రాజతే యస్మా దస్మా దేశ స్వర స్మృతః” – సంగీత రత్నాకరం

“స్వతో రంజయతి శ్రోత్రు చిత్తం సుస్వర ఉచ్యతే” – బృహద్దేశి

స్వరము అనగా స్వయముగా రంజింపచేయు ధ్వని విశేషం అని అర్థం. భారతీయ సంగీతానికి మూలాధారం ద్వావింశతి శ్రుతులు. ఈ శ్రుతుల పాతిపదికగా సప్త స్వరాలు ఏర్పడ్డాయి.

“శ్రుతిభ్యః స్యుః స్వరాః షడ్జర్షభాగంధరమధ్యమాః।

పంచమో ధైవతశ్చాథ నిషాద ఇతి సప్తతే॥”

వాటిలో షడ్జ, పంచమాలు అవికృత స్వరాలు. మిగిలిన ఐదు స్వరాలలో ప్రతి దానికి ప్రకృతి, వికృతి రూపాలున్నాయి. ప్రకృతి స్వరాలకు శుద్ధ స్వరాలనీ, కోమల స్వరాలనీ, వికృత స్వరాలకు తీవ్ర స్వరాలని సంగీత శాస్త్రంతో వ్యవహారం ఉన్నది.

ఈ క్రింది పట్టిక శుద్ధ, వికృత స్వరాలను తెలియజేస్తుంది.

స్వర నామం శుద్ధ స్వరం వికృత స్వరం
రిషభం శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం
గాంధారం సాధారణ గాంధారం అంతర గాంధారం
మధ్యమం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం
ధైవతం శుద్ద ధైవతం చతుశ్రుతి ధైవతం
నిషాదం కైశిక నిషాదం కాకలి నిషాదం

షడ్జ పంచమాలు కలిపితే వచ్చేవి 12 స్వర స్థానాలు. 22 శ్రుతులు, సప్తస్వరాలు, 12 స్వర స్థానాలు భారతీయ సంగీత సౌధానికి పునాదులు.

(సంగీత రత్నాకరం శార్ఞ్గ దేవుడు, స్వరగతాధ్యాయం శ్లో. 23.)

సప్త స్వరాలకు ఆయా పేర్లు రావటానికి కారణాలను సంగీత రత్నాకర వాఖ్యాత కల్లినాథుడు – ‘షడ్జాది నామ్నాం ఆన్వర్హతా మతంగాదిభిరుక్తా’ అంటూ మతంగుడు మొదలైనవారు చెప్పిన శ్లోకాలను ఉదాహరించి వివరించాడు.

షడ్జం:

షష్ణా స్వరాణాం జనకః షడ్భిర్వా జన్యతే స్వరైః।

షడ్భ్యోవా జాయతేన్గేభ్య: షడ్జ ఇత్యభిధీయతే॥

ఆరు స్వరాలు వీని నుంచి జనించటం వలన – ముక్కు, కంఠం, ఉదరం, లాలువులు, నాలుక, దంతం అనే ఆరు అంగాలలో పుట్టడం వలన షడ్జం అని పేరు.

రిషభం:

ప్రాప్నోతి హృదయం శీఘ్రమన్యస్మాదృషభ: స్మృతః

స్త్రీగవీషు యథా తిష్ఠన్విభాతి ఋషభో మహాన్

స్వరగ్రామే సముత్పన్న: స్వరోయమృషభస్తథా

ఆబోతు వలె స్వర సముదాయంలోకి చొచ్చుకుని పోతోంది కనుక ఋషభం.

గాంధారం:

వాచం గాణాత్మికామ్ దత్త ఇతి గాంధార సంఙ్ఞకః

గాంధర్వ సుఖ హేతువు కను గాంధారం

మధ్యమం:

స్వరాణానాం మధ్యమత్వాచ్చ మధ్యమః స్వర ఉచ్యతే

స్వరాలతో 4వది కాబట్టి స్వర సప్తకానికి మధ్యలో ఉన్నది. అందుచేత దీవికి మధ్యమం అని పేరు.

[సంగీత రత్నాకరము – శార్ఞ్గ దేవుడు స్వరగతాద్యాయం 23వ శ్లోకానికి కల్లినాధ వాఖ్యానం సప్త స్వరాలకు ఆ పేర్లు రావటానికి కారణాలను వివరిస్తూ, ఉదహరింపబడిన 7 శ్లోకాలు కల్లినాదుడు మతంగాది భీరుక్తాలుగా పేర్కొన్నవే.]

పంచమం:

స్వరాంతరాణాం విస్తారం యో మిమీతే స పంచమః

పాఠ క్రమేణ గణనే సంఖ్యయా పంచమోతథా

స్వరాంతరాన్ని విస్తరించి మానం చేయటం వలన, పాఠ క్రమంలో అయిదవది కావటం వలన పంచమం.

ధైవతం:

ధీర్యస్యాస్తి స ధీవాంతత్సంబంధీ ధైవతః స్మృతః

షష్ఠ స్థానే ధృతో యస్మాత్తత్తోసౌ ధైవతో మతః

లలాటంలో ధరించబడింది, లేక దీమంతుడే నిరూపించదగింది కాబట్టి ధైవతం.

నిషాదం:

నిషీదన్తి స్వరాః సర్వే నిషాదస్తేన కథ్యతే

స్వరములన్నీ ఇందులో కలిసిపోతాయి కనుక దీనికి నిషాదం అని పేరు.

సప్త స్వరాలు నవ రసాలను అభివ్యక్తం చేయటంలో ఏ విధంగా తోడ్పడతాయా శార్ఞ్గ దేవుడు ఈ శ్లోకముతో తెలియజేస్తాడు.

సరీ  వీరేధ్బుతే రౌద్రే ధీ బీభత్సే భయానకే

కార్యౌ గనీ తు కరుణే హస్య శృంగార యోర్మపౌ

వీర అద్భుత రౌద్ర రసాలకు, షడ్జ, రిషభాలు; బీభత్స, భయానక రసాలకు ధైవతం కరుణ రసానికి గాంధార, నిషాదములు; హస్య, శృంగార రసాలకు మధ్య పంచమాలు ప్రయుక్తం కావాలని శార్ఞ్గ దేవుని మతం. (సంగీత రత్నాకరం – శార్ఞ్గ దేవుడు స్వరగతాధ్యాయం 3వ ప్రకరణం శ్లో. 59]

హైందవ సాంప్రదాయానుసారం శంకరుడే సృష్టి స్వరూపుడని ఆ కారణాన స్వరాలన్ని శంకరుని ముఖము నుండి ఉద్భవించినవి అని చెప్పుటకు ఒక శ్లోకము ఉంది.

శ్లో:

శంకరం పార్వతీ నత్వా దృష్ట్వా చేదం వచో బ్రవీత్।

సంగీత శాస్త్రం  హే నాథ! మహ్యం వద సుఖప్రదం॥

శ్లో:

శ్రుణు పార్వతి పూర్వం మే సర్వలోక సుఖాయచ।

భరతాద్వైస్తుముని బీస్తదేవం ప్రతిపాదితం॥

~

‘సద్యోజాత’ ముఖము నుంచి ‘గాంధార’ స్వరము – భూమి పుట్టిందని. భూమి వలన చర్మ వాద్యములు జనించాయని;

‘వామదేవ’ ముఖము నుండి ‘ధైవత’ స్వరమును – జలమును ఉద్భవించాయని.  జలము చేత శంఖాది వాద్యము లావిర్బవించెను;

‘అఘోర’ ముఖము నుండి షడ్జ, రిషభ, స్వరములును, అగ్నియును ప్రాదుర్భవించెను. ఆ వహ్ని (అగ్ని) చేత కాంస్య వాద్యములు ప్రభవించాయి.

‘తత్పురుష’ ముఖము వలన పంచమ స్వరమును, వాయువు బుట్టెను. ఆ వాయువు చేత తంత్రీ వాద్యములుద్బవించెను.

‘ఈశాన’ ముఖము వలన మధ్యమ, నిషాద స్వరములును, ఆకాశము జనించెను. ఆ ఆకాశము వలన శబ్దం పుట్టినదని సదాశివుడు సంగీతోత్పత్తిని గురించి పార్వతీ దేవికి విశదపరచెను.

ఆ తరువాత భరతాది మునిశ్రేష్ఠులు కూడా ఇదే విధముగా పేర్కొన్నారు. ఈ విషయాన్నే త్యాగరాజు తన రచనలోని: చిత్తరంజని రాగంలో ఆది తాళంలో ‘నాద తనుమనిశం శంకరం’ అను కృతితోను; శంకరాభరం, ఆది తాళంలో ‘స్వరరాగ సుధారస యుత భక్తి స్వర్గాపవర్గమురా’ అను కృతి వీటికి ఉదాహరణలు.

సాహిత్యం:

స్వరాలకు అక్షరములు తోడైనపుడు సాహిత్యం అవుతోంది. ఛందోబద్ధమైన కావ్యాలకు జ్ఞానయోగ్యమైన సంగీతానికి సాహిత్యం అవసరం అయినా మొదటి దానిలో సాహిత్యం ప్రధానం గాన యోగ్యత గౌణం.

సంగీత కృతులలో శ్రుతి, లయలు ప్రధానం. సాహిత్య, విజ్ఞానం గౌణం. కేవల స్వర ప్రస్తార మాత్రాన సాధ్యం కాని భావోద్దీపనకు సాహిత్యం తోడుగా వస్తుంది. సంగీతంలో లాక్షణితులు ధాతువు అనగా స్వరకల్పన విన్యాసంగా మాతువు అనగా సాహిత్య రచనా విధానంగా విభజించారు.

భిన్న భిన్న స్వర సమ్మేళనాలతో వివిధ రాగాలు ఏర్పడుతున్నాయి. సృష్టిలో బాహ్య ప్రపంచం ఎంతో భావ ప్రపంచం అంత. భౌతిక జగత్ ఆధారంగానే దాని కల్పితమైన భావ జగత్తులో భౌతిక జగత్తుకు పరమార్థాన్ని అన్వేషిస్తాడు రసహృదయుడైన భావకుడు. ఈ వివిధ భావోద్వేగాల సంగీతాభివ్యక్తి, విభిన్న రాగాలలో ప్రతిధ్వనిస్తుంది. ఈ కారణం వల్లనే కాబోలు ఒక సినీగీతంలో ‘రాగాలనంతాలు నీ వేయి రూపాలు – భవరోగ తిమిరాలు ఓకార్చు దీపాలు’ అన్నాడో కవి.

కళా సాధన తపస్సాదనకు సజాతీయమైనదిగా భావించబట్టి ‘రసానందము పరబ్రహ్మానంద సహదరమ్’ అన్నారు.  గాయకుని ప్రతిభను బట్టి సకల స్థాయి బేధములలో ఈ స్వరాలను కల్పించటం సాధ్యమవుతుంది. హృదయ దఘ్నంగా భావానుభూతి పొందగలిగిన గాయకుడే రాగంలో ఆయా భావాలను పలికించగలడు. అపుడే సంగీతం స్వర సాహిత్య సమ్మేళనం తోడి అపూర్వ కళగా శోభిస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here