Site icon Sanchika

ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-7

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

జయదేవుడు:

[dropcap]జ[/dropcap]యదేవుడు (1101 – 1153) ఒరిస్సా దేశము లోని ‘తిందుబిల్వ’ మను గ్రామమున జన్మించెను. 12వ శతాబ్దమునకు చెందినవాడు. సంగీత సాహిత్యములో గొప్ప పండితుడు. కృష్ణభక్తుడు. ఈయన భార్య పేరు పద్మావతీ దేవి. పద్మావతీ దేవి కూడా కృష్ణ భక్తురాలే. వీరి దాంపత్యం మిగుల అన్యోన్యమైనది. ఆమె అనురాగ ప్రోత్సాహములే తన కవితకు ఉద్బోధత కారణములని జయదేవుడు తన గేయాలలో స్పష్టపరచాడు. రాధా, కృష్ణుల ప్రణయ లీలలను జయదేవుడు ప్రబంధంగా గానము చేస్తుండగా పద్మావతీ నృత్యము చేస్తూ, ఆ గేయాలలోని భావాన్ని అభినయిస్తు యుండెది అట. ఇట్లు, జయదేవ కవి గానము చేసిన గేయాలే ఒక కథారూపములో ‘గీత గోవిందం’గా రూపొందింది. గీత గోవిందం శృంగార రస ప్రధానమైన ఒక మహకావ్యము. ఇందలి గేయాలకి ‘అష్టపదులు’ అని పేరు. వీటి యందు ఒక్కొక్క దానితో 8 పాదములుండుటచే వాటికి ఆ పేరు వచ్చింది. 86 శ్లోకములు, 24 అష్టపదులు కలి 12 సర్గలుగా వ్రాయబడ్డాయి. ఈ గేయాలలోని మధురమైన సంస్కృత భాష అలంకారికులకు సైతము ప్రమాణికమైనది. ఏ పంక్తి, పరిశీలించినను రసముతో హృదయమును పరవశింప చేయు పదములు సముదాయం కన్పించును. జయదేవుడు క్రీ.శ. 1153లో వరమవదించెను.

గౌడ దేశాన్ని పాలిస్తున్న లక్ష్మణసేనుడనే రాజు ఆస్థానములో వెలిశాడు జయదేవుడు. మొట్టమొదట ‘గీత గోవిందం’లోని గ్రంధావతరణికలో –

‘వాచః పల్లవయత్యుమాపతిధరః సందర్భ శుద్ధిం గిరాం

జానీతే జయదేవ ఏవ శరణః శ్లాఘ్యో దురూహ ద్రుతేః।

శృంగారోత్తర సత్ప్రమేయ రచనైరాచార్య గోవర్ధన

స్పర్ధీ కోఽపి న విశ్రుతః శ్రుతిధరో ధోయీ కవి క్ష్మాపతిః॥’  అని;

ద్వాదస సర్గలో

‘శ్రీ భోజదేవ ప్రభవస్య రామాదేవీ సుత శ్రీ జయదేవకస్య।

పరాశరాది ప్రియ వర్గ కంఠే శ్రీ గీతగోవింద కవిత్వమస్తు॥’

అని రాశాడు.

వీటిని బట్టి అతని తల్లిదండ్రులు  రామాదేవి, భోజదేవులనీ, పరాశరాదులు ప్ర్రాణ స్నేహితులని తెలుస్తుంది.

జయదేవుని చరిత్ర అంతా చంద్రదత్త విరచితమయిన ‘భక్తమాల’ అనే గ్రంథంలో 3 సర్గల దాకా విపులంగా వున్నది అట.

గీత గోవింద రచనా పద్ధతిలో మరికొన్ని అష్టపదులు:

  1. శ్రీ చంద్ర శేఖర సరస్వతీ 18 వ శతాబ్దం. సామిశివాష్టపది
  2. శ్రీ రామకవి 19వ శతాబ్దం. రామాష్టపది
  3. శ్రీ వేంకటమఖి 17వ శతాబ్దం. త్యాగరాజేశ్వరాష్టపది
  4. శ్రీ సదాశివ దీక్షితులు – గీతా సుందరం అను ప్రబంధం, స్కందాష్టపది.
  5. శ్రీ కళువె వీరరాజు – సంగీత గంగాధరం: పార్వతీ పరమేశ్వరులు ముందు నాయికా నాయకులుగా అక్షరాలా గీత గోవిందమును అనుసరించి చేసినదే
  6. అనంత నారాయణ గారు – గీత శంకరం

వ్యాఖానించిన వారు:

  1. భక్త, మీరాభాయి భర్త అయిన మహరాణా గీత గోవిందాన్ని ‘రసికప్రియ’ అని వ్యాఖ్యానించారు.
  2. శంకర మిశ్రుడనే అతను ‘రసమంజరి’ అని
  3. ఆరవీటి తిరుమల రాయని ఆస్థానంలో వున్న చిరుకూరి లక్ష్మీధరుడు ‘శ్రుతి రంజని’ అని వ్యాఖ్యానం రచించారు.
  4. వానిలో అలంకార, కామ, శాస్త్రం, భరత నాట్య శాస్త్రం నుంచి అనేక ప్రమాణములు ఉదాహరణలుగా గీత గోవిందాష్టపదులను వ్యాఖ్యానించారు.

క్షేత్రయ్యకు జయదేవుకు పదములలో పోలిక:

జీవాత్మనే నాయకిగా, పరమాత్మనే నాయకునిగా చిత్రించిరి. ఇట్లే అండాళ్ తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొ, మాణిక్య లాచగర్ గారి తరుక్కొవై మొదలగు భక్తి రచనలకు చెందినది.

శ్రీ జయదేవ కవి శ్రీముఖ నామ సంవత్సరం మార్గశిర, కృష్ణ పక్ష, ఏకాదశి దినమున దివంగతుడయ్యాడని కోటిర కృష్ణ పండాజీ గారి యొద్ద యుండు తాళపత్ర గ్రంథము నుండి తెలియుచున్నది అని శ్రీ పి. సాంబమూర్తి గారు చెప్పియున్నారు. అనగా సోమవారం 28 డిసెంబరు, 1153 ఏ.డి. అన్నమాట.

పదములలో సంగీత చర్చ:

  1. ఇది శృంగారరస ప్రధానమైన రచన. సంస్కృతమున రచించబడింది. శైలి కఠినముగా యుండుటచే సంగీత సాహిత్యము లందు పరిపూర్ణమైన జ్ఞానము గల పండితులు మాత్రమే వీటిని అర్థము చేసుకుని ఆనందింపగలరు. ఈయన పదములు సంగీత రచనకు ప్రప్రథముగా ఏర్పడినవి అని తెలియుచున్నది ఈ అష్టపదులు – పల్లవి, అనుపల్లవి, చరణములుగా గాని (లేక) పల్లవి, చరణములుగా గాని వుండుటయే గాక చక్కగా అన్నియు ఒకే శైలిలో వుండి ‘జయదేవ’ ముద్రను కల్గియుండును. ఉదాహరణ: ‘రాసే హరిమిహ  విహిత విలాసం/స్మరతి మనో మమ కృత పరిహాసం’ – అను ఖమాస్ రాగం. ఆది తాళం లోని రచన.
  1. నాటకాల్ని సాహిత్యముగా చదవగలం కాని సంగీత నాటికను సభాస్థలమందు వేదికమైన దుస్తులతోను తగిన ఏర్పాటుతోను ప్రదర్శించినపుడు కన్నుల పండుగగా వీనుల విందుగా ఉండును. హిందూ దేశములో 12వ శతాబ్దంలో సంగీత నాటకములు మొట్టమొదటివి అని చెప్పవచ్చు. అదియే గీత గోవిందం. శృంగార మహాకావ్యం సంస్కృత భూయిష్టమైనది. దానిలో పాత్రలు, రాధ, కృష్ణుడు, సఖి. ఒక్కొక్క రచన ఆరంభములోను, తుదిలోను ఒక్కొక్క శ్లోకముండును. ఈ శ్లోకములు, మధ్య మధ్య ఉండు వచన భాగముల వల్ల కథను మనము అర్థము చేసికోగలము. ఇందలి రచనకు ‘అష్టపది’ అని పేర్లు: అష్టపదికి 8 చరణములు కాబట్టి పల్లవి అష్టపది వలె కొన్ని రచనలున్నవి కాని చరణము మొదట పాడి తరువాత పల్లవి వలె వుండు అంగమును పాడవలయును.
  2. జయదేవుని కాలమున కృతి వంటి రచనలు లేవు. కాబట్టి అష్టపదులకు పల్లవి, అనుపల్లవి వంటి అంగములు లేవు. పల్లవి వంటి అంగమునకు ‘ధృవం’ అని పేరు. కీర్తన అను రచనకు ముందు రచనే ‘అష్టపది’. అష్టపదులు కూడా భక్తి రచనలోనే చేర్చబడతాయి. పలు విధములైన భావములు, రసములు బాగుగా చూపబడ్డాయి.

సంగీత సాహిత్య సేవ:

భారతదేశాని కంతకూ ఆది ప్రబంధకర్తగా ఆరాధ్యుడయ్యాడు జయదేవుడు.

‘వాగ్దేవతా చరిత చిత్రిత చిత్త సద్మా/పద్మావతీ చరణ చారణ చక్రవర్తీ’ – అని; ‘జయతి పద్మావతీ సుఖసమాజే భణతి/ జయదేవ కవిరాజరాజే’- అని; జయతు పద్మావతీ రమణ జయదేవకవి/భారతీఫణీత మితిగీతం – అని వ్రాశాడు.

సాహిత్యరీత్యా ‘గీత గోవిందం’ అలంకారికులకు ప్రామాణికమయింది.

సాహిత్య దర్పణకారుడైన విశ్వనాధుడు (14వ శతాబ్దము) జయదేవుని వృత్యనుప్ర్రాసలను ఉదహరించాడు. 24వ అష్టపదులలో 80 కి మించిన శ్లోకాలతో కూడిన 12 సర్గల గేయ ప్రబందం గోవిందుని గూర్చి గేయ ప్రభందం కనుక ‘గీత గోవిందం’ ఏ పంక్తి చూచినా రసం చిప్పిల్లుతూ, హృదయాన్ని పరవశింపచేసే మధుర కోమల కాంతములైన పదాలే!

ఈయన అష్టపదులలో..

  1. ‘కీర్తి ధవళము.. ప్రళయ పయోధిజలే కేశవా..’
  2. ‘శ్రిత కమలాకుచమండల’.. మంగళాచారము
  3. ‘చందన చెర్చిత.. భ్రమర పదము
  4. ‘మలయ సమీర’.. గరుడ పదము

వంటి దేశీ ప్రబంధ రీతులు కూడా గలవు.

దశావతారం పథంలో దశరథరాముని తర్వాత బలరాముడు, తరువాత బుద్ధ, కల్కావతారములు వస్తాయి. కృష్ణుని గూర్చిన చరణం లేదు. దీనిని బట్టి కృష్ణుడే మూల విరాట్టయిన శ్రీ మహావిష్ణువు అని, మిగిలినవన్నీ అతని అవతారాలనే జయదేవుని అభిప్రాయము.

రాధా గోవిందుల ప్రణయ, విరహ, విశ్లేష, కలహ, ఖండన, సానునయ, సమాగమ, సంధానముల ద్వారా జీవబ్రహ్మైక్య సంధాన వేదాంతం వ్యంజితమవుతోందని గీత గోవింద పరమార్థం తెలిసిన పెద్దలు చెబుతారు.

జయదేవుడు తన కవితా మాధురిని గురించి తనకు తానే చెప్పుకున్నాడు:

జయదేవుని విదగ్ధ వాక్కులు శుభములనే కాక సమస్త శృంగార రసాన్నిఇస్తున్నాయి.

ఈ జయదేవుడు గీత గోవిందాన్నే కాక, చంద్రాలోకము, రతిమంజరి, కారక వాదము, తత్త్వ చింతామణి అనే గ్రంధాలు రచించాడట. ప్రసన్న రాఘవమను నాటకమును రచించిన కవి, శృంగార మాధవీయచంపూ అను గ్రంధాన్ని రచించిన కవి వేర్వేరు జయదేవ నామములు కాని గీత గోవింద కర్త కాదు.

గీత గోవింద సర్గ విభాగములు – ఇతివృత్త వివరణ:

ప్రథమ సర్గః (సామౌద దామోదరం)

ద్వితీయ సర్గః (అక్లేశ కేశవం)

తృతీయ సర్గః (ముగ్ధ మధుసూదనం)

చతుర్థ సర్గః (స్నిగ్ధ మధుసూదనం)

పంచమ సర్గః (సాకాంక్ష పుండరీకాక్షం)

షష్ఠ సర్గః (సోత్కంఠ వైకుంఠం)

సప్తమ సర్గః (నాగర నారాయణం)

అష్టమ సర్గః (విలక్ష లక్ష్మీపతి)

నవమ సర్గః (అమంద ముకుందం)

దశమ సర్గః (చతుర చతుర్భుజం)

ఏకాదశ సర్గః (సానంద దామోదరం)

ద్వాదశ సర్గః (సుప్రీత పీతాంబరం)

~

19వ అష్టపది యొక్క ప్రాముఖ్యత:

దీనిని ‘దర్శన’ అనీ, ‘సంజీవని’ అష్టపది అని అనుటకు 2 కారణములు, సంఘటన వల్ల పేర్కోన్నారు..

దర్శన అష్టపది:

 శ్రీ జయదేవ కవి గారు ‘గీత గోవిందం’ను చాలా ఉత్సాహంతోను, దీక్ష తోను, భక్తి తోను, వ్రాయుచుండెడివారు. దశమ సర్గ వ్రాయుచున్నప్పుడు 19వ అష్టపది రచించుచున్న సమయమున, తన భావనా, కల్పన అతి విచిత్రముగా త్రోవలో బడెనట. కృష్ణుడు రాధతో ‘స్మరగళ ఖండనం మమ శిరసి మండనం దేహి పదపల్లవ ముదారం’ అన్నాడట.

“రాధా! ప్రేమ అను విషము నా తలకెక్కి యున్నది. అందువల్ల నీ కోమలమైన పాద పద్మములను నా శిరస్సుపై నిడుము. అపుడు ఆ విషమంతయు దిగును” అని అర్థం వచ్చునట్లు వ్రాసాడట జయదేవుడు. కానీ వెంటనే, ‘ఏమి! రాధ తన పాదములను కృష్ణ పరమాత్మ శిరస్సుపై నిడుటయా! ఇది మహా ఘోరమైన పని! ఇట్లు వ్రాయుట మహాపచారము’ –  అని తలంచి ఆ పంక్తులను కొట్టివేసి లేచి అభ్యంగన స్నానమునకై నూనె ఒంటికి, తలకు రాసుకొని నదికి వెళ్ళాడట. కొంత సేపటికి తిరిగి వచ్చి ఆ వ్రాతప్రతిని తెమ్మని పద్మావతిని అడిగి ఆ కొట్టివేసిన పంక్తులనే మరల వ్రాసి వెళ్లిపోయాడట. స్నానము చేసి వచ్చి జయదేవుడు తాను కొట్టివేసిన పంక్తులు మరల వ్రాసి ఉండుటను చూసి ఆశ్చర్యపడి ఎవరు వ్రాసిరని పద్మావతిని అడిగాడట. ఆమె “స్వామి! మీరే కదా మరల వచ్చి వ్రాసితిరి. నూనెబొట్లు కూడా ఆ ప్రతి మీద యున్నవే” అని చెప్పగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ములే వచ్చిరని తెలిసికొని పద్మావతి యొక్క పుణ్యమునకు వేనోళ్ల కొనియాడుతూ శ్రీకృషుడు తన భార్య పద్మావతికి దర్శన మిచ్చినందున ఈ అష్టపదికి ‘దర్శనాష్టపది’ అని పేరిడిరి. ఈ అష్టపది యొక్క 8వ చరణంలో “జయతి పద్మావతీ రమణ జయదేవ కవి భారతీ భణిత మితి గీతం” అని తన పేరు ముందు ఆమె పేరు పెట్టెను.

సంజీవిని అష్టపది:

శ్రీ జయదేవ కవి భార్యయగు పద్మావతీ దేవిని శ్రీ లక్ష్మణసేన మహారాజు గొప్పగా గౌరవించుచుండిరి. అది సహించలేని రాజుగారి భార్య, రాణి తగిన సదవకాశముకై వేచి యుండెను. ఒక నాడు రాజుగారు వారి పరివారముతో కూడా శ్రీ జయదేవ కవి వేటకు వెళ్లిరట. రాణిగారు పద్మావతీ వద్దకు వచ్చి జయదేవ కవికి వైపరీత్యము జరిగి మరణించినట్లు అబద్ధపు సమాచారము తెల్పెను. పద్మావతి దుఃఖ సముద్రమున మునిగి అసువులు విడిచెనట. ఇటువంటి విషాద సంఘటన జరుగునని రాణి ఈషణ్మాత్రము యోచించలేదు. రాణి భయముచే వణికి పోసాగెను. కొంతసేపైన వెనుక రాజుగారును, శ్రీ జయదేవులు వేట నుండి తిరిగి వచ్చి జరిగిన సంఘటను చూచి ఏమి చేయుటకును తోచక దిగులు పడిపోయిరి. అపుడు శ్రీ జయదేవులు విలన, అందులోను శ్రీ పరమాత్ములు ‘వదసి యది’ అను 19వ అష్టపదిని పాడిరి. ఏలన, అందులో శ్రీకృష్ణపరమాత్మ తమ స్వహస్తములతో వ్రాసిన పంకులున్నవి. కాబట్టి ఈ అష్టపది పాడిన తరువాత పద్మావతి నిద్రనుండి మేల్కొన్నట్లు లేచి కూర్చుండినదట. అందువల్లనే ఈ అష్టపదికి ‘సంజీవని’ అష్టపది అని పేరు కలదు.

ఇంకొక విచిత్ర సంఘటన:

ఒరిస్సా రాజైన పురుషోత్తదేవునకు జయదేవునిపై ఎడతెగని ఈర్ష్య. అందువల్ల, శ్రీ జయదేవుని గీత గోవిందాన్ని పోలినదే ‘అభినవ గీత గోవిందం’ అను గ్రంథమును రచించెను. తన గ్రంథములోని రచనలనే పాడవలయునని ప్రజలను నిర్భందించెను. కాని ప్రజలు గీత గోవిందంలోని రచనలనే పాడుచుండిరి. అందులకు ఇష్టపడక తన గ్రంథము గొప్పదో లేక శ్రీ జయదేవుల గ్రంథము గొప్పదో పరిశీలించుట కొరకు ఇద్దరి గ్రంథములను శ్రీ జగన్నాథస్వామి యొద్ద పెట్టి తలుపులు మూసి వచ్చిరి. మరునాటి ప్ర్రాతఃకాలమున తలుపులు తెరచి చూచుసరికి జయదేవుల గీత గోవిందం శ్రీ స్వాములవారి చేతిలోను, రాజుగారి గ్రంథము ఆ గర్భగుడిలో ఒక మూల యుండుటను గమనించి రాజు ఖిన్నుడై, గీత గోవిందం యొక్క శ్రేష్ఠతను కొనియాడెనట. అప్పటి నుండి శ్రీ జయదేవులను, పద్మావతిని చాలా మర్యాదగాను భక్తితోను చూచుచుండెనట.

ఈ అష్టపదులు ఎల్లప్పుడు అన్ని చోట్లను పాడబడచునే యుండును. దీనికి నిర్యాణమనునది లేదు. జీవ నదులని ఎట్లు అనుచున్నామో అటులే దీనికి ‘జీవ ప్రబంధం’ అని పేరు పెట్టవచ్చు.

ఈ అష్టపదులను రచించిన చోటు అప్పటినుండి జయదేవ పురమని పిలువ బడుచున్నదని ప్రొఫెసర్ పి. సాంబమూర్తి గారు వ్రాశారు.

ప్రతి ఏటా తిందు బిల్వమ్ (ఇప్పుడు కిందులా)లో ఉత్సవములు జరుపబడి అన్నీ అష్టపదులు పాడబడుచున్నవి.

పూరీ జగన్నాథములో ప్రతి దినము పూజా సమయమున అష్టపదిని పాడుట కలదు. దీనికి జయదేవ సేవ అని పేరు. ఇప్పటికిని పుండరీపురమున జయదేవులు కూర్చొన్న చోటు, పద్మావతి నాట్యము చేసిన చోటు అచటి వారు చూపుదురు. ప్రతి అష్టపది చివర మంగళ శ్లోకము కాననగును.

~

మొట్టమొదటి వాగేయకారుడు వాల్మీకి తరువాత మనకు తెలిసిన వాగ్గేయకారులలో తరువాతి వాడు జయదేవుడు. ఈయన రచనలు అన్ని ప్రబంధములు. ధృవ పదము ధృపద్ అయింది. ధృవ అంటే పల్లని అని. పదము అనగా చరణం అని అర్థం. ఆయన రచించిన అష్టపదులలో అష్ట అనగా 8 చరణములు కల్గినది. కనుకనే వాటికి అష్టపదులు అని పేరు వచ్చినది.

ఆయన రచనలు అన్ని కూడా పరిణామాత్మకమైనవి. పరిణామం పొందినవి. పరిణతి చెందినవి. లక్షణకర్త అయిన భరతుని లక్షణ గ్రంథము ‘నాట్యశాస్త్రం’ ఆ కాలం నాటిదే. అందుకే జయదేవుని అష్టపదులు అన్ని కూడా నాట్య సంబంధితమైనవి. శృంగార రస ప్రధానమైనవి. రాధాకృష్ణుల వియోగ, విరహ ప్రక్రియలతో కూడినవి ఆయన రచనలు.

జయదేవుని కాలం నందుండిన రాగాలు ప్రాక్ ప్రసిద్ధ రాగాలు. అనగా పురాతనమైనవి. ప్రాక్ అనగా అప్పటి వంగ, ఓఢ్ర, ఆంధ్రకు సంబంధించినవి.

రాగాల పేర్లు: గుణకరి, వరాళి, దేశవరాళి, ఘార్జరి, మాళవ, కర్ణాటక దేశ, రామక్రియ, మాళవగౌళ, వసంత, విభాస మొదలగునవి.

గుణకరి, విభాస ఉత్తర హిందూస్తానీ సంబంధిత రాగాలు. మిగిలిన రాగాలు దక్షిణ కర్ణాటక సంగీత సంబంధితములు. అప్పటి రాగాలు కొన్నింటిని ఆధునిక కాలంలో వేరొక రాగనామాలతో పిలుస్తున్నారు..

ఉదా:

అప్పటి వాళ్లు పైన పేర్కొన్న రాగాలలో జయదేవుని అష్టపదులు పాడేవారుట. రాముడు భాగవతార్ అనే తమిళుడు ఆధునిక రాగాలు అష్టపదులకు స్వరపరిచాడు. అవి తమిళ దేశంలో ప్రచారంలో ఇప్పటికి వున్నాయి. కాని అవి ప్రాక్ ప్రసిద్ధ రాగాలు కావు. అలానే నిస్సార, యతి, రూపక, ఏక తాళాలలో రూపక, ఏక ఇపుడు మన కర్ణాటక సంగీతంలో వాడుకున్నాం. నిస్సార, యతి అతిపురాతనమైన తాళాలు ఇప్పుడు వాడుకలో లేవు.

జయదేవుని అష్టపదియైన ‘లలిత లవంగ లతా పరిశీలన’ అనే రచనను రాముడు భాగవతార్ – వసంత రాగాన్ని ఎన్నుకొని స్వరపరిచాడు.

వసంత రాగ లక్షణం: ప్రాచీన సంగీత లక్షణ రీత్య 15వ మాయామాళవగౌడలో జన్యం. అయితే ఈ రాగములో నియత శ్రుతి యగు శుద్ధ ధైవతమునే నేడు అందరు గాయకులు చతుశ్రుతి ధైవతముగా వాడుచుండుట గమనార్హము.

ఆరోహణ: స గ మ ద ని స

అవరోహణ: స ని ద మ గ రి స

ఉపాంగ, జాడవ, సంపూర్ణ, షడ్జగ్రహము.

ఆరోహణలో రి, ప; అవరోహణలో ప వర్జము. ఆరోహణలో వక్రచ్యుత పంచమ కలదని ప్రాచీన వాగ్గేయకారుల అభిప్రాయం.

వసంత రాగం, వసంత కాలాన్ని, వసంత ఋతువుని వర్ణించే రాగం. వసంత కాలంలో కోయిలలు – ‘కుహు కుహు’ అని కూస్తాయి; పుష్పాలు పుష్పించే కాలం, లేత చిగుళ్లు చిగిర్చే కాలం. వసంత రాగంలో చతుశ్రుతి ధైవతం; అంతర గాంధారం, శుద్ధ మధ్యమము శృంగార రసాన్ని వొలికిస్తుంది.

‘లలిత లవంగ’ సాహిత్య భావాన్ని బట్టి ఆ వసంత రాగం పేరు పెట్టారు.

చరణం1:

లలితా లవంగ లతా పరిశీలన

కోమల మలయా సమీరే

మధుకర నికర కరంబిత కోకిల

కూజిత కుంజ కుతీరే

చరణం2:

విహారతి హరిరిహ సరస వసంతే

నృత్యతి యువతి జానేన సమం సఖీ

విరాహి జనస్య దురంతే

చరణం8:

శ్రీజయదేవ భణిత మిద ముదయతి

హరి చరణ స్మృతి సరం

సరస వసంత సమయ వన వర్ణన

మనుగత మదన వికారం

~

సంచారం:

గామాదా – నిని దనీస – సనిదనీదమగా – గమదనిస – సగమగ రిసనిదని – దమగ – గమద – దమగ – మదమ గరిస.

(ఇంకా ఉంది)

Exit mobile version