Site icon Sanchika

ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-8

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

అన్నమయ్య మొదటి భాగం:

అన్నమాచార్యుల జీవితం కుప్తంగా:

[dropcap]ఆం[/dropcap]ధ్రుడు. తాళ్ళపాక అను గ్రామమున జన్మించెను. బాల్యము నుండి వేంకటేశ్వరుని భక్తుడు. అన్నమయ్యకు చిన్నవయస్సు నుండే చక్కని కవిత్వము అలవడి వేంకటేశ్వర పరముగా మధురమైన సంకీర్తనములు చేయుట మొదలుపెట్టెను. వ్యవసాయం చేసుకుంటున్న అన్నమయ్యకు కొన్నాళ్ళకు ఆ పనిలో విసుగుపుట్టి వేంకటేశ్వరుని దర్శింప ఎంచెను. తిరుపతి కొండనెక్కుచు ఆశువుగా చక్కని సంకీర్తనలు చెప్పెనట. అపుడు అతనికి వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించాడు. ఆ విధముగా అద్భుతమైన కీర్తనలు చెప్పుచు పండితుల మెప్పు పొంది తిరుపతి క్షేత్రముయందే కొంతకాలము గడిపెను. అచ్చటనే శఠగోపయతీంద్రుల వలన గురూపదేశము పొందెను. తరువాత తల్లిదండ్రుల కోరికపై వివాహము చేసికొని తాళ్ళపాక చేరి, కొంతకాలం గృహస్థు జీవితము గడిపెను. ఈయన అనేక పుణ్యక్షేత్రములు దర్శించుచు వేంకటేశ్వరుని అంకితముగా అనేక శృంగారకీర్తనలు, భక్తిరస పూరితమ్ములైన కీర్తనలు రచించారు. తాళ్ళపాకలో కొంతకాలము గడిపిన తరువాత అన్నమయ్య తన వృద్ధాప్యంలో తిరిగి స్వామి సన్నిధికి చేరి, దిగువ తిరుపతిలో కొంతకాలమునుండి చరమదశలో తిరుమల చేరి అచ్చటనే కాపురమున్నాడు. ఆ సమయమందే ఆ సంగీత భాండారములను నెలకొల్పి రాగిరేకులపై ఆ సంకీర్తనలను వ్రాయించుట, భద్రపరచుట, నిత్యము దీపారాధన చేసి స్వామి సన్నిధిలో పాడించుట జరిగెను.

ఈయన రచించినవి 32,000 సంకీర్తనలు. ఈయన సుమారు 95 సంవత్సరములు జీవించి కీ.శ. 1503లో సంకీర్తనములు పాడుచునే వేంకటేశ్వరుని యందైక్యమయ్యెను.

అన్నమయ్య కాలం గురించిన చర్చ (1424 – 1503):

తాళ్ళపాక వంశ విఖ్యాతికి మూలపురుషుడైన అన్నమయ్య క్రీ.శ. 1424లో జన్మించెను. దాదాపు 1 1/2 శతాబ్దాల కాలం విజయనగర రాజుల పరిపాలనా కాలంలో వీరు విఖ్యాతితో వెలసి వైష్ణవ మతమునకు ఆంధ్రభాషకు నిరుపమానమగు సేవ గాంచినారు. ఆంధ్ర రాజకీయ, మద, సాంఘిక, భాషా సారస్వత రంగాలతో స్వర్ణయగం అని ప్రఖ్యాతి గాంచిన ఆ కాల ఖండంలోనే తాళ్ళపాక వారు వర్ధిల్లి ఆ గౌరవభారము ఎంతగానో తమ భుజస్కంధములపై మోసి యుందురనుట అతిశయోక్తి కాదు.

అన్నమయ్య అవతరించిన సం॥ క్రోధి (1424 ఎ.డి.) అని కొంతమంది అభిప్రాయం.  టి.టి.డి. ఎపిగ్రాఫికల్ రిపోర్టులో శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అన్నమయ్య జననం గూర్చి వ్రాస్తూ 1408 అని నిర్ణయించారు. క్రీ.శ. 1424లో జన్మించిన అన్నమయ్యకు 16వ ఏట అనగా క్రీ.శ. 1440లో స్వామి ప్రత్యక్షమయ్యెను.

అది మొదలు సంకీర్తనల రచన గావించి ప్రఖ్యాతి గాంచిన అన్నమయ్య మహిమ విని టంగుటూరి పరిపాలకుడుగా దండనాధుడుగా యుండిన సాళువ నరసింహరాయుడు స్నేహాన్ని ఆపేక్షించాడు. 1503లో నిర్యాణమొందాడు.

తాళ్ళపాక వారి వంశ వృక్షము:

పలువురు అన్నమయ్యకు పెట్టిన వివిధ నామాంతరములు:

తాళ్ళపాక అన్నమాచార్యుడు, అన్నమయ్య, అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయ్యగురు, అన్నమార్య, కోనేటి అన్నమయ్యంగారు – ఇలా చాలా కలవు.

క్రీ.శ. 1440 నుండి సంకీర్తన రచనకు అన్నమయ్యే మూల, ఆది పురుషుడు. తాళ్లపాక వారు నాటి ప్రజల సంపూర్ణ విశ్వాసమునకు పాత్రులై శ్రీ వేంకటేశ చరణనేవా మన్న మానసులై తిరుమల వైకుంఠమునే స్థిర నివాసం గావించారు.

ఆయనకి పదకవితా మార్గదర్శి, సంకీర్తనాచార్య, ద్రావిడాగమ సార్వభౌమ అని బిరుదములు కలవు.

చిన్నన్నను గురించి చెప్పిన అంశములు అన్నీ అన్నమాచార్యులే సరిపెట్టుకోవలెను.

చిన్నన్న అష్ట మహిషీ కళ్యాణము, పరమ యోగి విలాసము, ఉషా పరిణయము, అన్నమాచార్య చరిత్రము గ్రంథాలను ద్విపద కావ్యములుగా రచించినవాడు కానీ సంకీర్తనకర్త అయినట్లు సూచించే ఆధారాలు లేవు.

“చిన్నన్న ద్విపద కెరగును

పన్నున వెదతిరుమలయ్య పదమున కెరగున్

మన్నంది మొరసె నరసిం

గన్న కవిత్వంబు పద్య గద్యశ్రేణిన్.”

ఈ పద్యం తెనాలి రామకృషణ కవి చెప్పెను.

దేశకాల పరిస్థితులు:

రెడ్ల సామ్రాజ్యం క్రమంగా క్షీణించి విద్యానగరం, విజయనగర సామ్రాజ్యంగా బలపడిపోతూ వుంది. కాని తాళ్లపాక వాగ్గేయకారులు ముగ్గురికీ కూడా వారి కవితా సంగీత కళోపాసనకు ఈ రాజులు, రాజ్యాలు గాక, తిరుపతి వేంకటేశ్వరులే ఉద్బోధక కారణమైనాడు.

“నీపాలి వారిగా నియమించి మమ్ము

హరి మిమ్మునే గొనియాడు మా జిహ్వ

నొరులను గొనియాడకుండంగ జేసి”

అని చిన్నన్న అన్నమాచార్య చరిత్రమున చెప్పిన మాటలిందుకు ఉదాహరణలు.

శ్రీ మహావిష్ణువు వక్షస్థలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా అవతరించెనని, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా జన్మించెననీ, మహావిష్ణుని హస్తమందలి నందక ఖండాంశమున అన్నమాచార్యులు అవతరించెనని ప్రాజ్ఞుల విశ్వాసము. ఆముక్తమాల్యదలో శ్రీ కృష్ణదేవరాయలు; మను చరిత్రలో అల్లసాని పెద్దనగారు తమ తమ విద్యా గురువుగా కొలిచిన శఠకోపయతి ఒకరున్నారు. కాని ఆదిమ శఠకోపయతి అనువారికి అన్నమాచార్యులు శిష్యుడు కాగా తరువాత

ఆ పీఠము అధివసించిన మరొక తరపు శఠకోపయతి రాయలకు, ఆయన ఆస్థాన కవికి గురువె ఉండవచ్చు.

తాళ్లపాక వారి సంగీతం, అపూర్వ రాగాలు:

అచాలి, అమర సింధు, కొండమల హరి, తెలుగు కాంభోజి దేసాళం, నారణి, మేచ బౌళి, ముఖారి పంతు, రాయగౌజ, గీతనాట, బౌళి, రామక్రియ –

వారు వాడిన ఇతర ప్రసిద్ధ రాగాలలో కొన్ని:-

కన్నడ గౌళ – నాట – రీతిగౌళ

కన్నడ బంగాళ  – నాద నామక్రియ – లలిత

కేదార గౌళ – భూపాళం – వసంతం

గుండక్రియ – మంగళ కౌశిక – వసంతమౌళి

గౌళ – మలహరి – శుద్ధదేశి

దేవగాంధారి – మధ్యమావతి – శుద్ధరామక్రియ

దేశాక్షి – మాళవి – శుద్ధవసంతం

ధన్యాసి – మాళవ గౌళ – సావేరి

మాళవశ్రీ – దేశీబంగాళం – మొదలగునవి

రచనా వైశద్యం:

శృంగార, ఆధ్యాత్మిక, ఆత్మ ప్రభాదాత్మక, ఆత్మానుభవ వ్యంజకములు, లోక వృత్త, విమర్శక, లోకోద్బోధకములతో పాడుతూ వచ్చాడు. మహాభక్తాగ్రేసరుడుగా, మహాకవిగా, వాగ్గేయకారునిగా మాత్రమే గాక, మహావిష్ణుని ఖడ్గమైన నందక అంశమున జన్మించిన అవతారపురుషుడుగా, ఆళ్వారుగా ప్రసిద్ధి పొంది దేవుని సన్నిధిలో తన కీర్తనలకు తన ప్రతిమూర్తికి శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు.

రచనలు:

ఆధ్యాత్మ, శృంగార, రాగతాళ సయుతమైనవి. 32,000.

అవిగాక ద్విపద ప్రబందంగా నవ్యరీతిని రామాయణము, సంస్కృతంలో వేంకటాద్రి మహత్యము, తెలుగున శృంగార మంజరి, 12 శతకాలు, యింకా సకల భాషలలో అనేక ప్రబంధాలు, సంస్కృత సంకీర్తన లక్షణములు రచించాడు.

స్వానుభవ వైరాగ్యానికి ఉదాహరణలు

  1. బౌళి – “చీ చీ వోబదుకా సిగ్గులేని బదుకా”
  2. కొండమలహరి – “ఎన్నఁడు దేవుని గనే మెన్నఁడు బుద్ధెఱిఁగేము”
  3. బౌళి – “ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది సక్కము’
  4. బిలహరి – “అలుగక కూటమి”
  5. పాడి – “ఆడువారు కడుకోవులగుట”
  6. కన్నడగౌళ – “తలచిన హృదయము”
  7. మాళవశ్రీ – “దుప్పటెల్లా జవ్వాదినే తొప్పఁదోఁగె నీకడనే”
  8. దేసాళం – “కులుకక నడవరో.. (అలవేలుమంగ పల్లకి)
  9. దేశాక్షి – “అనరాదు వినరాదు..”
  10. కాంభోజి – “మొత్తకురే అమ్మలాలా..”
  11. లాలి – “జో అచ్యుతానంద జో జో ముకుందా”
  12. శంకరాభరణం – “గురుతెరిగిన దొంగ, కూగూగు, వీడె..”
  13. సౌరాష్ట్ర – “చందమామ రావే జాబ్ రావే”
  14. సామంతం – “ఇందిరాధిపుని సేవ”
  15. భూపాళం – “విన్నపాలు వినవలె వింత వింతలు..”
  16. బౌళి – “తందనాన..”

ఇలా ఎన్నో కలవు.

(ఇంకా ఉంది)

Exit mobile version