Site icon Sanchika

ప్రాణం విలువ

[శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన ‘ప్రాణం విలువ’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]వే[/dropcap]ణు గోపాల్ చాలా సంతోషంగా వున్నాడు ఈ రోజు. దానికి కారణం ఆ రోజు టౌన్ కెళ్ళి కార్ కొనుక్కు రావాలని సన్నద్ధం కావడమే.

వేణు గోపాల్ ఆ ఊరి బ్యాంకులో ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ అయిదు ఏళ్ళు గడిచింది.

అప్పటి నుండీ మొన్నీ మధ్య వరకూ మోటార్ సైకిల్ మీద జీవితాన్ని సంతోషంగా గడిపాడు. అయితే అన్ని రోజులు ఒకే విధంగా వుండవు కదా. ప్రస్తుతం స్వంత కారు ఉండటం చాలా ముఖ్యమైనదిగా అనిపించసాగింది. దానికి కారణం అతని జీవితం లోకి తుఫానులా దూసుకొచ్చిన కళ్యాణి.

ఆ తుఫాన్ ఏమిటో తెలియాలంటే ముందుగా కల్యాణి గురించి చెప్పాలి.

కళ్యాణి, రాజమండ్రిలో వున్న అతి పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్. ఆ ఒక్క కాలేజీనే కాకుండా ఇంకా ఎన్నో స్కూళ్లకు, ఇంటర్మీడియట్ కాలేజీలకు కూడా ఆవిడే అధిపతి. ఒంటి చేత్తో మొత్తం విద్యా సంస్థలన్నింటినీ విజయవంతంగా కొనసాగిస్తోంది. ఎనలేని ధైర్య సాహసాలు, నిశితమైన వ్యాపార దృష్టి ఆవిడ సొంతం. అందానికి సరిపడా తెలివితేటలు, సమయస్ఫూర్తి ఆవిడ విజయ రహస్యాలు.

తమ్ముడి కాలేజీ సీటు కొరకు ఆ కల్యాణికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో అడుగు పెట్టాడు వేణు. ముందు ఆ కాలేజీలో ముఖ్యమైన బ్రాంచ్ ఎన్నుకోవటానికి దారెలా అని కనుక్కున్నాడు. అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కొన్ని కాలేజీ యాజమాన్యం చేతిలో ఉంటాయని తెలిసి డైరెక్టర్ కళ్యాణి గది ముందు నిలబడి లోనికెళ్ళటానికి సంకోచిస్తూ, లోనికెళ్ళాలా, వద్దా అని ఆలోచిస్తూ కేబిన్ బయట నిలబడ్డాడు.

అది గమనించి, గది బయటకు వచ్చి నిలబడ్డ వేణుని చూసింది కళ్యాణి.

ఆవిడను గుర్తుపట్టిన వేణు “నమస్కారం” అన్నాడు.

“ఏం కావాలి? ఇక్కడ నిలబడ్డారు” అంది కళ్యాణి తీక్షణంగా చూస్తూ.

“మిమ్మల్ని కలుద్దామని.. అదేనండి.. లోనికి రావచ్చా అని’’ అన్నాడు.

“రండి” అని చెప్పి లోనికి దర్పంగా అడుగులు వేసింది. ఆమె నడకలో డబ్బుతో వచ్చే ఆత్మ విశ్వాసం కనపడుతోంది. గది లోపలి కెళ్ళి ఎదురు కుర్చీలో కూర్చున్నాడు వేణు.

“చెప్పండి” అంది కళ్యాణి.

ఖరీదైన చీరలో, పెద్ద బొట్టుతో, కాలు మీద కాలు వేసి కూర్చున్న కళ్యాణి ఒక పెద్ద మహా రాణి లాగ కనిపించింది వేణుకి.

“నా పేరు వేణు గోపాల్, స్టేట్ బ్యాంకు ఆఫీసర్‌ని..” అని మర్యాద పూర్వకంగా నవ్వాడు.

వేణు గోపాల్ వైపు నఖ శిఖ పర్యంతం చూసింది కళ్యాణి. చెరగని రింగుల జుట్టు, నలగని బట్టలు, టక్ చేసుకుని, నిగ నిగ లాడే షూతో, మొహంలో ఉట్టిపడే కుశలత. బాగున్నాడు అనుకుని “చెప్పండి” అంది దృఢమైన స్వరంతో..

“మా తమ్ముడికి ఎంసెట్ రాంక్‌లో బీటెక్ కంప్యూటర్ వచ్చింది, కానీ అది వేరే కాలేజీ, మాకీ కాలేజీనే కావాలి.. మీరు సహాయం చేయాలి” అన్నాడు చెరగని చిరునవ్వుతో.

“రాంక్ ఎంత” అంది కంప్యూటర్ మీద వివరాలు చూస్తూ. చెప్పాడు వేణుగోపాల్.

అది విని “సరే వచ్చే వారం ఒక సారి కలవండి.. డొనేషన్ కట్టాలి మరి?” అంది అచ్చు వ్యాపార స్వాభావికమైన గొంతుకతో.

“కాస్త కష్టమే, ఉద్యోగస్థులం, పైగా తమ్ముళ్లను చదివిస్తున్నాను’’ అన్నాడు వినమ్రంగా.

“సరే.. మీరు ఏం చదువుకున్నారు?” అంది కళ్యాణి ముందుకు వంగి.

“ఎమ్మెస్సి ఫిజిక్స్, యూనివర్సిటీ రాంక్ హోల్డర్‌ను” అన్నాడు.

అతని గొంతులో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని గమనించింది కళ్యాణి..

“ఎక్సలెంట్.. ఫిజిక్స్‌లో వుండే గొప్ప సూత్రం ఏంటి?” అడిగింది కను రెప్పలు వాల్చకుండా వేణు గోపాల్‌నే చూస్తూ.

వెంటనే వేణు మొహంలో నవ్వు మాయమై, కంటి చూపు పదునెక్కింది. “భౌతిక శాస్త్రం లో రెండు గొప్ప సూత్రాలున్నాయి. ఒకటి పరిరక్షణ అంటే కన్జర్వేషన్, రెండవది సమరూపత, ఐ మీన్ సిమ్మెట్రీ” అన్నాడు. జవాబు విని ఒక క్షణం నివ్వెర పోయింది కళ్యాణి.

అంతలోనే తేరుకుని నవ్వి “నైస్.. ఫిజిక్స్ యొక్క ప్రాథమిక సూత్రాలు ఏంటి?” అంది. ఇది చెప్పలేరు అన్నట్లుగా ఛాలెంజ్ చేస్తూ.

“భౌతిక శాస్త్రం ప్రకారం, పదార్థం, శక్తి మరియు ప్రకృతి యొక్క ప్రాథమిక శక్తులు, భౌతిక నియమాలు అనే ఇవన్నీ, ..కణాలు మరియు భౌతిక అంశాల మధ్య పరస్పర చర్యలను నియంత్రిస్తాయి. అంటే గ్రహాలు, అణువులు, అణువులు లేదా సబ్‌ఆటమిక్ పార్టికల్ వంటివి” అని ఆగి, నవ్వుతూ “మేడం.. నాకు పరీక్ష పెట్టారు” అన్నాడు

కానీ అతనికి జీవితంలో అది పెద్ద పరీక్ష అది అని తెలీదు.

అతనికున్న తెలివి, విషయం మీద ఉన్న పట్టు అర్థం అయిపోయి “మీరు ఎప్పుడు పూర్తి చేశారు ఎమ్మెస్సి” అని అడిగింది. ఆవిడ గొంతులో అప్పుడు అతని పట్ల గౌరవం పెరిగినట్లుగా కనపడింది. చెప్పాడు వేణుగోపాల్.

“అబ్బో చాలా సంవత్సరాలైంది. ఇప్పటికీ మీకు అన్నీ గుర్తున్నాయి. గ్రేట్.. సాయంత్రం.. మా కాలేజీ విద్యార్థులకు స్పెషల్ పాఠాలు చెప్పచ్చు కదా. మీకు సరిపడా డబ్బులు ఇస్తాను!” అంది.

“..సమయం ఉన్నప్పుడు తప్పకుండా చేస్తాను. మీరు తమ్ముడికి సీట్ సహాయం చేసి పెట్టండి” అన్నాడు మరో సారి అసలు సంగతి గుర్తు చేస్తూ.

“అది నేను చూసుకుంటాను.. వేణు గారు! మీరు కాఫీనా, టీనా ఏది తీసుకుంటారు?” అంది చిన్నగా చిరునవ్వుతో.

“ఏదైనా పరవాలేదండి “అన్నాడు వేణు గోపాల్. తాను వచ్చిన పని సగం అయినట్లుంది అనుకుని.

థాంక్స్ చెప్పి మళ్ళీ కలుస్తాను మరి అని వెళ్ళిపోతున్న వేణు గోపాల్‌ను చూసింది. ఆమె చూపులో అతని పట్ల గౌరవం కనపడింది.. తన కాలేజీలో ఇలాంటి తెలివైన, విషయం పరిజ్ఞానం వున్న ప్రొఫెసర్ ఒక్కడైనా లేడు అనుకుంది.

వారం తర్వాత కాలేజీ లోకి అడుగు పెట్టి కళ్యాణి గది ముందు నిలబడ్డ వేణు గోపాల్‍ను చూసి వెంటనే లోనికి పిలిపించింది కళ్యాణి.

“హలో గుడ్ మార్నింగ్” లోనికి అడుగు పెడుతూ అన్నాడు వేణు గోపాల్ చిరునవ్వుతో.

“హలో హలో.. రండి కూర్చోండి. మీ తమ్ముడికి సీట్ కేటాయించాము” అని నవ్వింది కళ్యాణి.

“తెలిసే వచ్చాను. థాంక్స్ మేడం.. మీకు నావల్ల ఏదైనా సహాయం ఉంటే చెప్పండి. చేస్తాను” అన్నాడు రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని.

“మా ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ వాళ్లకు కొన్ని స్పెషల్ క్లాసులు తీసుకోవాలి. మా ఇంటర్మీడియట్ కాలేజీలో ఎంసెట్ విద్యార్థులకు ఫిజిక్స్ ప్రత్యేకంగా చెప్పాలి. వారానికి మూడు రోజులు సాయంత్రం. దానికి తగినట్లుగా రెమ్యూనరేషన్ ఉంటుంది. అది మనం మాట్లాడదాం” అని చెప్పడం ఆపి వేణు కేసి చూసింది.

“వచ్చే నెల నుండీ చెప్పగలను.. ఈ నెల కుదరదు” అన్నాడు మర్యాద ఉట్టిపడే స్వరంతో.

“ఇట్స్ ఓకే.” అని చెప్పి అక్కడున్న ఇంటర్ కం నొక్కి, మేనేజర్‌ను పిలిచింది కళ్యాణి.

వెంటనే లోనికి వచ్చిన మేనేజర్ ను చూసి “ఈ సార్‌ని తీసుకెళ్లి, అడ్మిషన్‌కు కావాల్సిన పని చూడండి” అని చెప్పి, తిరిగి వేణుగోపాల్ వైపు తిరిగి “మీరు ఇతనితో వెళ్ళండి. తర్వాత నెల మొదట్లో కలవండి. అన్నట్లు మీ సెల్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి.” అని చెప్పి నవ్వింది.

“థ్యాంక్ యు అగైన్” అని నమస్కారం చేసి బయటకు నడిచాడు వేణు గోపాల్.

ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకుని,అప్పుడే వర్షం మొదలయ్యింది.

అడ్మిషన్ లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని బయటకు వరండాలోకి నడిచాడు వేణు గోపాల్. వర్షం జోరు ఎక్కువైంది. రెయిన్ కోట్ తెచ్చుకోవటం మరచాడు. ఏం చేయాలబ్బా?.. తప్పదు, వర్షం ఆగే వరకు ఆగాల్సిందే అనుకుని, కాలేజీ వరండాలో నిలబడి వర్షపు జల్లుని ఆనందించ సాగాడు.

ఆఫీస్ గదిలోనుంచి బయటకు వచ్చిన కళ్యాణి, దూరంగా వరండా స్తంభం పక్కన నిలబడ్డ వేణు గోపాల్‌ను చూసి, చరచరా అతని దగ్గరకు నడుస్తూ వెళ్లి “ఎలా వచ్చారు, కార్ తీసుకు రాలేదా? నా కార్‌లో పంపిస్తానుండండి” అని చెప్పి, వేణు తేరుకుని సమాధానం చెప్పేలోగా “డ్రైవర్.. సార్‌ను దింపి రా” అని అక్కడ నిలబడి వున్న వెంకయ్యకు చెప్పింది.

“నేను మోటారు సైకిల్ పైన వచ్చానండి. వర్షం ఆగాక వెళ్తానండి” అన్నాడు. కార్ ఉంటే బావుండేది అనే విషయం అతనికి అప్పుడు మొదటిసారిగా స్ఫురించింది.

“పర్వాలేదు, మీ టూ వీలర్‌ను, బ్యాంకుకు పంపిస్తాను. ఎవరూ ఎత్తుకెళ్లరు, భయపడకండి’’ అంది నవ్వుతూ.

సమాధానంగా తానూ నవ్వి, వెళ్లి కళ్యాణి కారెక్కి కూర్చున్నాడు వేణు.

మరుసటి నెల ఎంసెట్ ప్రత్యేక క్లాసులకు వెళ్లి ఫిజిక్స్ చెప్పడం మొదలు పెట్టాడు వేణు. తరగతి గది బయట పక్కగా నిలబడి అతను చెప్పే విధానాన్ని గమనించింది కళ్యాణి. అతనికున్న ఫిజిక్స్ జ్ఞానాన్ని, పాఠం చెప్పే విధానాన్ని చూసిన కళ్యాణి ఆశ్చర్య పోయింది. విద్యార్థులను పలకరించే విధానం, సరళంగా అర్థమయ్యేటట్టు చెప్పే నేర్పు చూసి తృప్తిగా అక్కడ్నుండి వెళ్లి పోయింది.

మరో రెండు నెలల్లో విద్యార్థులు ఫిజిక్స్‌లో ముందంజ వేయడం గమనించింది కళ్యాణి.

రెండవ నెల కాలేజీ నుండీ తనకు అందిన డబ్బు చూసి కొయ్యబారిపోయాడు వేణు. కవర్‌లో లక్ష రూపాలున్నాయి. అప్పుడు ధైర్యంగా అనుకున్నాడు ‘కార్ కొనాలి’ అని.

ఆ రోజు సాయంకాలం క్లాస్ జరుగుతుండగా కళ్యాణి నుండి మొబైల్‌లో ‘వెళ్లేప్పుడు కలవండి’ అన్న మెసేజ్ చూసాడు వేణుగోపాల్.

క్లాస్ అయిపోయిన తర్వాత కళ్యాణి ఆఫీస్ గది లోకి అడుగు పెట్టాడు వేణు.

“రండి వేణు, అయిదు నిముషాలు కూర్చోండి” అని చెప్పి ముందున్న కంప్యూటర్ మూసేసింది కళ్యాణి.

“చెప్పండి మేడం” అన్నాడు వేణు.

“ఎలా వున్నారు ఫైనల్ ఇయర్ ఇంటర్ ఎంసెట్ బ్యాచ్ పిల్లలు? పోయిన సారి ఎంసెట్ సీట్లు యాభై శాతం వరకూ వచ్చింది. ఈ మారు కనీసం డెబ్బయ్ అయిదు శాతానికి ఎంసెట్ రావాలి. ఏం చేస్తే వస్తాయి. ఎలా చేద్దాం?” అంది కళ్యాణి.

“దానికి మనం ముందుగా విద్యార్థులను వారి నెల పరీక్షల మార్కులను బట్టి వేరు చేయాలి.. బాగా తెలివైన వారిని మరింత పదును పెట్టాలి, మిగతా వారిని ముందుకు తేవటానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారెందులో వెనకబడి వున్నారో గమనించి, దానిని సరి చేయాలి’’ అన్నాడు.

“ఇంకా ఏం చేస్తారు?” అడిగింది.

చేయవలసిన పద్ధతి, ట్రైనింగ్ గురించి విపులంగా చెప్పుకుంటూ పోయాడు వేణు. అన్నీ విని నిశ్చేష్టురాలయ్యింది కళ్యాణి.

“ఇవన్నీ మీకెలా తెలుసు?” అంది ఆసక్తితో కళ్ళు పెద్దవి చేసి.

‘‘అవన్నీ నేను వ్యక్తిగతంగా పాటించాను కనుకే యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చింది” అన్నాడు వెనక్కు కుర్చీలో వాలి.

కాసేపు మాట్లాడకుండా అతడినే చూసింది కళ్యాణి. ఆమె చూపుల్లో అతని పట్ల గౌరవం ఇంకాస్త ఇనుమడించింది. అలా గంట సేపు చర్చిస్తూ ఉండిపోయారు.

లేచి వెళ్లే ముందు “రేపు ఆదివారం, మా ఇంట్లో భోజనం మీకు. తప్పకుండా రావాలి” అంది.

“సరేనండి. ఏమైనా ప్రత్యేక విషయమా” అన్నాడు.

“చెప్తాను.. రండి.. ఓకే” అంది చిరునవ్వుతో.

“సరేనండి.” అంటూ లేచాడు వేణు.

సరేనంటూ తల ఊపింది కళ్యాణి. వేణు వెంటనే వెళ్ళిపోవటం ఆమెకు నచ్చలేదు. మనసులో కాస్త చిరాకు వేసి, అక్కడున్న గ్లాస్ తీసుకుని అందులోని నీళ్లన్నీ గటగటా తాగేసింది.

ఇంటిలో అడుగుపెట్టగానే ఎదురు వచ్చిన శాంతమ్మ, కొడుకుని చూసి “ఏరా వేణు ఇంత లేటయ్యిందే?” అంది.

“కాలేజీలో పని ఎక్కవయ్యిందమ్మా” అని చెప్పి, టవల్ తీసుకుని బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.

భోజనానికి టేబుల్ వద్ద కూర్చున్న కొడుక్కి వడ్డిస్తూ “మధ్యవర్తి రమణయ్య గారు కొన్ని సంబంధాలు తీసుకొచ్చాడు. అదుగో ఫోటోలు పెట్టి వెళ్ళాడు” అంది టీపాయ్ మీద కవర్‌ను చూపించి.

“సరెలేవే అమ్మా.. నన్ను సతాయించకు.. ఇదుగో తమ్ముళ్ళిద్దరు ఒక గట్టున పడితే అదే పదివేలు. ముందు అది కానీ తర్వాత చూద్దాం.”

“ఇప్పటికే అందరూ అడుగుతున్నారు కొడుకు పెళ్లి ఎప్పుడు చేస్తావ్ అని” అంది.

అది విని నవ్వి అన్నాడు “ఈసారి మన పొలం కౌలుకి ఇవ్వకుండా, నేనేం చేద్ధాం అనుకుంటున్నానే అమ్మా”.

“మాట మార్చకురా” అని నవ్వింది శాంతమ్మ.

***

కళ్యాణి ఇంట్లోకి అడుగు పెట్టాడు వేణు. తలుపు దగ్గర ఎదురొచ్చిన పనిమనిషి రాజమ్మ, వేణుని చూసి నమస్కారం చేసి హాల్‍లో కూర్చోపెట్టి లోనికెళ్ళిన కాసేపటికి కళ్యాణి చురుకుగా నడుచుకుంటూ వచ్చి “హలో వేణు.” అంది చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ.

బదులుగా ప్రతి నమస్కారం చేసి “ఏంటి ప్రత్యేకత ఈ రోజు లంచ్‌కు పిలిచారు. ఏరి మరి ఇంకా ఎవరూ రాలేదు” అన్నాడు వేణు కళ్యాణి వేసుకున్న ఖరీదైన చీర వంక చూసి.

“ప్రత్యేకత ఏమీ లేదు. మిమ్మల్ని మాత్రమే పిలిచాను. సెలవు రోజు. ఏమీ తోచదు. పైగా అమ్మ, నాన్న ఇంకో వారం వరకూ రారు.” అంది.

“సెలవు రోజు, వ్యాపారానికి సెలవన్న మాట” అని నవ్వాడు వేణు.

“అవును వేణు, సెలవంటే సెలవే. అన్నట్లు, నిన్న కొందరు విద్యార్థులు నీకేదో తమ బాధలు చెప్పుకుంటున్నారట, ఏంటది” యథాలాపంగా అడిగింది.

అప్పుడప్పుడూ తనను ఏక వచనంతో మాటలాడటం గమనించాడు వేణు.

“బుక్స్ కొనలేని వారికి కాలేజీ ఏదైనా సహాయం చేస్తుందేమో అని అడిగారు”

“మనం ఫీజు కూడా మాఫీ చేస్తున్నాం కదా.. ఇంకేం కావాలంట” కాస్త అసహనంతో అంది కళ్యాణి.

“అదెలాగూ ప్రభుత్వం ఇస్తోంది.. మనమివ్వటం లేదుగా” అన్నాడు నిర్వికారంగా.

“మనమెందుకు ఇస్తాం. ఇన్ని కోట్లు పెట్టి కట్టించిన కాలేజీ దానాలు చేయటానికి కాదు.”

“బీద విద్యార్థులకు సహాయం మన వంతుగా, కాస్తో కూస్తో సహాయం చేస్తే తప్పేముంది. మీకు వీలైతే చేయండి. ఆ పై మీ ఇష్టం” అన్నాడు.

తనలో కలిగిన చిరాకును అణచుకుని నవ్వింది కళ్యాణి.

“సరే బాబు.. ఏదో చేద్దాంలే. మనమిప్పుడు కాలేజీ విషయాలు మాట్లాడకుండా ఉంటే బావుంటుంది.” అంది నవ్వుతూ.

“మీరే కదా మొదలు పెట్టింది.” అని నవ్వేసాడు వేణు.

అలాగే ఒక్క క్షణం వేణు కళ్ళలోకి చూసింది కళ్యాణి. అసలితడిని అర్థం చేసుకోవటం కష్టమే అనుకుని నిట్టూర్చింది. బహుశా కమ్మూనిస్టు రష్యాలో పుట్టవలసిన వాడు ఇక్కడ పుట్టేసాడు అని నవ్వుకుంది.

వేణు కూడా కాసేపు అలాగే కళ్యాణి కళ్ళలోకి చూసి ఈ డబ్బులున్న వాళ్లకు ఇతరుల కష్టం పట్టదు అనుకున్నాడు.

“రండి.. భోజనం చేసాక కూర్చుందాం” అని లేచి చీర కొంగు నడుము చుట్టూ తిప్పి ముందు భాగాన చెక్కుకుని డైనింగ్ టేబుల్ వేపు అడుగులు వేసింది.

మంచి కళాకారుడి చేతిలో దిద్దుకున్న శిల్పం అనుకున్నాడు వేణు.

“ఇంతకూ కార్ ఎప్పుడు కొంటున్నారు?” అంది ప్లేటులో కూరలు వడ్డిస్తూ.

“వచ్చే నెలలో.. బుక్ చేసాను, బహుశా ఆలస్యం కావొచ్చు, వెయిటింగ్ నడుస్తోందని చెప్పారు” అన్నాడు వేణు.

“మీరెప్పుడు తీసుకుంటారో చెప్పండి, డీలర్‌కు చెప్పి వెంటనే ఇప్పిస్తాను.” అంది కళ్యాణి.

***

మరుసటి నెల ఒక రోజు సాయంత్రం ఆఫీసు గది లోకి అడుగు పెట్టి, “హలో కళ్యాణి గారు, రేపు సాయంకాలం కారు తెచ్చుకుందామనుకుంటున్నాను” అన్నాడు వేణు.

“గుడ్. నేనిప్పుడే డీలర్‌కు ఫోన్ చేసి చెప్తాను.. కూర్చోండి” అని మొబైల్ తీసుకుని నెంబర్ కలిపి మాట్లాడసాగింది.

మాట్లాడటం ఆపి ఫోన్ టేబుల్ మీద పెట్టి “రేపు సాయంకాలం నేను కూడా వస్తాను. వెంటనే డెలివరీ ఇప్పిస్తాను. నో ప్రాబ్లెమ్” అంది.

మరుసటి రోజు సాయంకాలం కళ్యాణి తన కారులో వేణుని కూర్చోపెట్టుకుని టౌన్‌కు బయకు దేరింది. డ్రైవర్ సీట్ పక్కన వేణు కూర్చొని, వెనకాల కూర్చున్న కళ్యాణి కేసి తిరిగి చూస్తూ బ్యాంకు విశేషాలు చెప్పసాగాడు.

రెండు గంటల తర్వాత కార్ ఆగింది.

“డ్రైవర్ నువ్ కార్ తీసుకుని వెళ్ళి ఇంటి వద్ద పెట్టు.” అని చెప్పి కార్ దిగింది.

వేణు, కళ్యాణి షో రూమ్ లోకి అడుగు పెట్టారు.

కళ్యాణిని చూసిన డీలర్ కేబిన్ నుండీ బయటకు వచ్చి “రండి మేడం, నమస్కారం” అంటూ చేతులెత్తి నమస్కారం చేసి లోనికి దారి చూపించాడు. అక్కడే కూర్చుని అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, దాదాపుగా గంట తర్వాత బయటకు వచ్చి కార్ తీసుకుని ఊరి బాట పట్టారు.

చీకటి పడింది. దారి పొడవునా వాహనాల రద్దీ ఎక్కువైంది. వేణు కార్ నడుపుతూ వున్నాడు. పక్కన కూర్చున్న కళ్యాణి అన్నీ మర్చిపోయి వేణుతో తన కాలేజీ కబుర్లు చెప్ప సాగింది.

మధ్య మధ్య లో బీద విద్యార్థుల సమస్యల గురించి వేణు చెప్తున్న, మాటలు విని ఇసుమంత విసుక్కుంది కళ్యాణి.

“మళ్ళీ మాట్లాడదాం వారి సమస్యల విషయం, ఇప్పుడొద్దు వేణు ప్లీజ్” అంది కళ్యాణి.

“సరే.. ఇంతకూ మీ వివాహం ఎప్పుడు?” వున్నట్లుండి అడిగాడు వేణు.

అసలే మాత్రం వూహించని ఆ ప్రశ్న విని తత్తరపాటుతో సమాధానం చెప్పింది కళ్యాణి “మా నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు, అందరికీ నా కంటే నా ఆస్తి డబ్బులే ఆకర్షణీయంగా కనపడుతున్నాయి.” అని నవ్వింది కళ్యాణి.

మాట్లాడకుండా డ్రైవ్ చేయసాగాడు సాగాడు వేణు. అడవి దారి మొదలైంది.

“ఇక్కడ నుండీ ఘాట్ రోడ్” నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు వేణు.

“దగ్గరలో ఏదైనా దాబా హోటల్ ఉంటే ఆపండి, కాస్త స్నాక్స్ టీ తీసుకుని వెళదాం” అంది కళ్యాణి.

అడవి మధ్యలో చిన్న పాటి డాబా హోటల్ ముందు ఆపాడు వేణు. ఆ హోటల్ ముందు చాలా లారీలు ఆగి వున్నాయి. ముందున్న విశాల మైన మైదానంలో ఒక పక్కగా నులక మంచాలు, మరో పక్క టేబుల్, కుర్చీలు వేసి వున్నాయ్. ఏదో మాస్ హిందీ పాట పెద్దగా వినపడుతూ వున్నాయివుంది. చుట్టూ చీకటిగా వుండి,. హోటల్ ముందు నిలువు కర్రలకు వున్న ట్యూబ్ లైట్ల వల్ల ఆ కొద్ధి ప్రాంతం మాత్రం వెలుగుతో నిండి పోయింది.

అటూ ఇటూ చూసి, కాస్త శుభ్రంగా వున్నటేబుల్ వద్ద కెళ్ళి కూర్చున్నారిద్దరు.

“ఏం తీసుకుంటారు సర్” అంటూ అడుగుతున్న పద్నాలుగు సంవత్సరాల అబ్బాయిని చూసాడు.

ఆ అబ్బాయి తలకెన్నాళ్ళుగానో నూనె లేక, వెంట్రుకలన్నీ పాడయి కనపడుతున్నాయి. మొహం అంతటా కష్టాలు తాండవిస్తున్నాయి. జాలిగా చూసాడు వేణు ఆ అబ్బాయిని.

“ఏం పేరు తమ్ముడూ” అన్నాడు వాడి చేయి పట్టుకుని.

“గణేష్!” అని చెప్పి నిటారుగా నిలబడ్డాడు గణేష్.

“ఎంత వరకూ చదువుకున్నావు?” ఆప్యాయంగా పలకరించాడు వేణు.

“ఎనిమిది” అన్నాడు గణేష్.

“మరేందుకు మానేశావ్ స్కూల్” అన్నాడు వేణు.

ఇబ్బందిగా చూసి “మా నాన్న లేడు సార్.. మీకేం కావాలో చెప్పండి సార్, మా యజమాని చూస్తున్నాడు సార్” మెల్లిగా అన్నాడు గణేష్.

చెప్పాడు వేణు.

హోటల్ లోని రేడియో నుండీ రఫీ పాట వస్తూ వుంది “గోవిందా ఆలా రే.. భలే పాట కదా?” అంది కళ్యాణి.

“అబ్బో మీకు ఈ టేస్ట్ ఉందా, హిందీ పాటలు తెలుసా” ఆశ్చర్యంగా అడిగాడు వేణు.

గణేష్ తెచ్చిన రోటి, కూరలు తింటూ మాట్లాడుకున్నారు ఇద్దరూ. చేతులు కడుక్కుని కూర్చున్న తర్వాత వచ్చి నిల్చున్న గణేష్‍ను చూసి “ఎంత బిల్ గణేష్” అన్నాడు వేణు.

తిన్న వస్తువులకేసి చూసి నోటికి ధరలు చెప్పి వాటి బిల్ మొత్తం క్షణాల్లో చెప్పాడు గణేష్. అది విని వాడి వేపు విస్తుపోయి చూసాడు వేణు.

“గణేష్! లెక్కలు బాగా వచ్చా నీకు?”

“లెక్కల్లో నాకు నూటికి నూరు సార్” అన్నాడు గణేష్ ఉషారుగా

“అలాగా.. అయితే ఒకటికి స్క్వేర్ రూట్ ఎంత?”

వేణు ప్రశ్న పూర్తి కాకముందే సమాధానం చెప్పాడు గణేష్.

“రెండుకి” చెప్పాడు గణేష్. అలా ప్రశ్నలు వేస్తూ పోయాడు వేణు, గణేష్ చెప్తూ పోయాడు.

గణేష్‌ను దగ్గరికి తీసుకుని “మీ పెద్ద వాళ్ళను తీసుకుని, ఇదుగో నా అడ్రస్‌కు రా, నీ చదువు నే చూసుకుంటా” అని తన జేబులోనుండి విజిటింగ్ కార్డు గణేష్ చేతికిచ్చి, డబ్బులు ప్లేట్ దగ్గర పెట్టి లేచాడు వేణు.

“అమ్మయ్య.. ఇవాళ్టికి సరిపోయిన సంఘ సేవ అయ్యిందా, బాబు.. పద” అని వేళాకోళమాడుతూ లేచింది కళ్యాణి.

వారిద్దరూ కారులో కూర్చునే సమయానికి పాత ఖాకీ రంగు బట్టలు వేసుకున్న మధ్య వయస్కుడు గబగబా వేణు వద్దకు వచ్చి “సార్ నేను రంగాపురం వెళ్ళాలి, చాలాసేపటి నుండీ బస్సులు రాలేదు, నేను రావచ్చా?” అన్నాడు. అతడిని తేరిపారా చూసాడు వేణు. మాసిపోయిన గడ్డం, మొహం నిండా చెమటలు కక్కుతూ వున్నాడా వ్యక్తి. చేతిలో చిన్న గుడ్డ సంచీ పట్టుకుని కంగారుగా కనిపించాడు.

పక్కన నిలబడ్డ అతని నుండీ వస్తున్న చెమట వాసన భరించలేక, కళ్యాణి ముక్కున కొంగు పెట్టుకుంది.

“మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదని ఫోన్ వచ్చింది సార్, మీకు పుణ్యం ఉంటుంది. ఈ అడవి దాటగానే మా వూరు” అని దండం పెట్టాడా వ్యక్తి.

వెంటనే కళ్యాణి వేపు చూసి “మీరు వెనకాల కూర్చోండి” అని చెప్పి ముందు సీట్లో ఆ వ్యక్తిని కూర్చోబెట్టాడు వేణు.

“వేణు.. దిస్ ఇస్ టూ మచ్” అని కాస్త మొహం మాడ్చుకుని వెనకాల కూర్చుంది కళ్యాణి.

“అసలా లేబర్ మనిషి, మనకెందుకు, లేని పోనీ ప్రజా సేవ “అంది ఇంగ్లీషులో.

వెనక్కి చూసి “ప్లీజ్ కళ్యాణి గారు” అన్నాడు వేణు.

“ఈ బీదవాళ్లకు ఎప్పుడూ కష్టాలే, అన్నీ అబద్దాలు చెప్తుంటారు. మనం పట్టించుకుంటే మనకే నష్టం” మళ్ళీ ఇంగ్లీష్‌లో గొణిగింది.

“కష్టాల్లో వున్న వాళ్లకు సహాయం చేస్తే దేవుడు మనకు చేస్తాడు” నచ్చచెప్తున్నట్లుగా అన్నాడు వేణు.

చిరాకుగా కూర్చుంది కళ్యాణి. ఇద్దరూ మాట్లాడుకోలేదు కాసేపు. కార్ వేగంగా, శక్తివంతమైన లైట్లతో చీకట్లను చీల్చుకుంటూ ఘాట్ రోడ్‌లో వెళ్ళసాగింది.

కార్ ముందుకు వెళ్తున్న కొలదీ, రోడ్‌కు ఇరువైపులా ఇటూ అటూ పెద్ద పెద్ద వృక్షాలు నల్లగా జడలు విరబోసుకున్న దయ్యాల్లా వెనక్కి వెళ్ళిపోతూ వున్నాయి. అంతలో వున్నట్లుండి కార్ హెడ్ లైట్లు ఆరిపోయాయి. కార్ ఎటు పోతోందో కనపడలేదు. కెవ్వున భయంతో కేక వేసింది కళ్యాణి. కళ్ళ ముందు రోడ్ కనపడటం లేదు. ముందు దట్టమైన చిమ్మని చీకటి అలుముకుంది.. సడన్ బ్రేక్ వేస్తే కార్ అదుపు తప్పుతుందని భయంతో ఏం చేయాలో అర్థం కాక బ్రేక్‌లు వేసి స్లో చేసాడు. కానీ ఆ కొండ అడవి రోడ్ కనపడక గుండెలు అరచేత్తో పెట్టుకుని కళ్ళు చిట్లించి బయటకు చూడసాగాడు. ఒక వేపు నిలువెత్తు చెట్లు, మరొక వేపు లోతైన అగాధం.

ఇంతలో పెద్ద టార్చి లైట్ వెలుగు కార్ ముందు సీట్‍లో నుండీ బయటకు పడింది. ఆ టార్చ్ లైట్ వెలుగు సహాయంతో కార్‌ను రోడ్ పక్కకు తీసుకెళ్ళటానికి స్టీరింగ్ పక్కకు తిప్పాడు. అక్కడ ఒక ముదుసలి వ్యక్తి కూర్చుని కనిపించాడు. వెనకనుండి ఇది చూసిన కళ్యాణి పెద్దగా అరిచింది. కార్ ఆ వ్యక్తిని గుద్దబోయే సమయానికి ఆ ముదుసలిని గమనించిన వేణు కారును సర్రున పక్కకు తప్పించి తిరిగి రోడ్ మీదకు ఎక్కించి తిరిగి రోడ్ కిందకు దింపబోయేంతలో ఆ టార్చిలైట్ వెలుగులో అక్కడ కార్‌కు అడ్డంగా ముందట పెద్ద వృక్షం కనిపించింది. వెంటనే తిరిగి కార్ దానికి కొట్టకుండా పక్కకు తప్పించి బ్రేక్ వేసి రోడ్ పక్కన ఆపాడు వేణు. అతని గుండెలు గట్టిగా వేగంగా కొట్టుకుంటున్నాయి. ఒళ్ళంతా ఉద్వేగంతో చెమటలు పట్టాయి. కొద్దిలో రెండు ప్రాణాపాయాలు తప్పాయి అనుకుని కార్ దిగాడు.

“అబ్బా వేణు అయిపొయింది మన పని అనుకున్నాను, పైకి పోయాం అనుకున్నా. అసలా చీకట్లో ఆ ముసలాడు ఎందుకు కూర్చున్నాడు. కొద్దిలో బ్రతికి పోయాడు, ఆమ్మో.. కొద్దిలో చెట్టుకు గుద్దుకుని మన ప్రాణాలు పోయేవి, దేవుడే కాపాడాడు” అని నుదురు తుడుచుకుంది కళ్యాణి.

“దేవుడు కాదు, ఇదుగో నా పక్కన కూర్చున్న ఈ వ్యక్తి కాపాడాడు” అని, ఆ వ్యక్తి వేపు తిరిగి ‘‘బాబు అసలీ టార్చ్ ఎక్కడిదీ? సమయానికి భలే వేశావు! కాస్త ఆలస్యమయితే మన ప్రాణాలు హరీమనేవి!” అన్నాడు విస్మయంగా అతడిని చూసి.

“నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది సార్.. నేను చేసేది వాచ్‌మన్ పని కదా, ఇదెప్పుడు నా బ్యాగులో ఉంటుంది. అందుకే వెంటనే తీసి లైట్ వేసాను, ముందు వేపు” అన్నాడు అమాయాకంగా నవ్వుతూ చేతిలోని టార్చీని ముద్దుగా చూసుకుంటూ.

టెన్షన్‌తో పెరిగిన ఊపిరిని అదుపులో పెట్టుకుని ఆ వ్యక్తిని రెండు చేతులతో పట్టుకుని దగ్గరగా తీసుకుని “భలే చేశావయ్యా.. నిన్నెప్పటికీ మర్చిపోలేను. దేవుడిలా వచ్చావు” అన్నాడు వేణు సంతోషంగా నవ్వుతూ.

“నిజమే, ఇతను మన కార్ ఎక్కకపోతే మన పని అయిపోయుండేది ఈపాటికి” అంది కళ్యాణి గుండెల మీద చేయి వేసుకుని.

కార్ బోనెట్ తీసి కాసేపట్లో లైట్స్‌ను బాగు చేసి కార్ స్టార్ట్ చేసి ముందుకురికించాడు వేణు. కొద్ధి దూరం పోగానే కార్ ఆపమని చెప్పి కిందకు దిగాడు ఆ ఖాకీ దుస్తుల వ్యక్తి.

వెళ్తున్న ఆ వాచ్‌మన్‍ని పిలిచి

“ఇలా రా బాబు” అని, అతనికి అయిదు వేల రూపాయలు చేతికి ఇవ్వబోయింది కళ్యాణి.

వాటిని చూసి దూరం జరిగి “భలేవారే అమ్మాయిగారు..” అని నవ్వుతూ, “వస్తాను బాబయ్యా” అని వేణుకు చేయి ఊపుతూ వేగంగా పక్కనున్న చిన్న మట్టి రోడ్ వెంట నడుస్తూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.

డబ్బుని పట్టించుకోకుండా వెళ్లిపోతున్న అతడిని విస్తుపోయి చూస్తున్న కళ్యాణిని గమనించి నవ్వుకున్నాడు వేణు.

“వీడెంటి పిచ్చి వాడిలాగా వున్నాడు, డబ్బులిస్తుంటే అలా వెళ్ళిపోయాడు” అంది విస్తుపోయి..

“అదంతే. ప్రపంచంలో కొన్నింటిని డబ్బుతో కొలవలేం. ముఖ్యంగా మానవత్వాన్ని, విలువలను. మనం ఏమీ ఆశించకుండా అతనికి సహాయం చేసాం. అతనూ అంతే.. మనం చేసిన సహాయం దేవుడి రూపంలో మన ప్రాణాలను కాపాడింది. అతనే మనకు దేవుడి రూపంలో వచ్చిన మనిషి! చూడండి.. అతను తన పేరు చెప్పలేదు, మన నుండీ ఏమీ ఆశించకుండా మరో ఆలోచన లేకుండా వెళ్ళిపోయాడు, ఆ ఊరి పేరు కూడా మనం చూడలేదు. మనం చూసే లోపల కొద్ది క్షణాల్లో అతను ఆ చీకటిలో మాయమయ్యాడు” అన్నాడు.

అతని మాటలు ఆవిడను ఆలోచనల్లో పడవేశాయి. ఆ వ్యక్తిని కార్లో కూర్చోపెట్టుకోవటం వేణులో వున్న గొప్ప మానవత్వం తప్ప ఇంకేమీ లేదు అనుకుంది. తనకు తెలిసిన వారందరిలోకి వేణు ఎంతో ఉన్నతంగా, బలహీనుల పట్ల అతను చూపించే దయ, జాలి చాలా గొప్పగా అనిపించి, ఆనందంగా తృప్తిగా నిట్టూర్చింది కళ్యాణి.

***

“అదీ నాన్నా జరిగింది. దాదాపుగా ఆరు నెలల నుండీ చూస్తున్నాను, అద్భుతమైన వ్యక్తిత్వం వేణు గోపాల్‌ది” అని చెప్పటం ఆపింది.

కాసేపు కూతురి కళ్ళల్లోకి చూసి “మొత్తానికి ఇన్నాళ్లకు నీకు నచ్చిన అబ్బాయి కనిపించాడు అంతేనా?” అన్నాడు రాఘవయ్య.

అది విని విస్తుబోయి తండ్రిని చూసి చిరునవ్వుతో తల దించుకుంది కళ్యాణి.

“అడ్రస్ వివరాలు ఇవ్వు. వాళ్ళింటికెళ్లి వేణు తల్లి తండ్రితో మాట్లాడతాను, సరేనా?” అన్నాడు రాఘవయ్య.

“మీ ఇష్టం నాన్నా” అంది కళ్యాణి.

“ఆలస్యం చేయకండి.. ఇటువంటి వాటికి వెంటనే వెళ్ళాలి” అంది అక్కడే నిలబడి అన్నీ వింటున్న కళ్యాణి తల్లి భారతి.

(అయిపోయింది)

Exit mobile version