పాప్తం ఉన్నది దక్కుతుందా? దక్కిందే ప్రాప్తమా?

3
2

[ఆంగ్లంలో శ్రీ టి.ఎస్.ఎస్. సాకేత్ రచించిన కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్]

[dropcap]బా[/dropcap]బాజీ ఆధ్యాత్మిక ప్రవచానాలకై నగరానికి వచ్చిన రోజులవి. ఆయన ప్రియశిష్యులు దానిని సత్సంగ్ అని పిలుస్తారు. ఆ రోజు సాయంత్రం వాన బాగా కురుస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాలు చీకట్లో లేదా చీలమండ లోతు నీళ్లలో ఉన్నాయి. ఈ రెండూ ఉన్న ప్రాంతాలని దేవుడే కాపాడాలి. అయితే ప్రవచనాలు జరిగే సభా ప్రాంగణం చాలా పెద్దది, సుమారు 5 ఎకరాల స్థలంలో అన్ని సౌకర్యాలతో నిండి ఉంది. ప్రతీ రెండేళ్ళకి ఒకసారి జరిగే రెండు రోజుల కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. వచ్చే వారికి భోజనాలు, మంచి నీరు ఇంకా, బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారికి బస ఏర్పాట్లు జరిగాయి. అయితే వాలంటీర్ల ప్రణాళికల వల్ల వర్షం – మిగతా నగరాన్ని ప్రభావితం చేసి జీవితాన్ని స్తంభింపజేసినట్లుగా – ఈ ప్రాంగణానికి ఇబ్బంది కలిగించలేకపోయింది.

బాబాజీ ప్రసంగం కొనసాగుతోంది. కర్మ, దాని ప్రభావాలు, సంతోషకరమైన జీవితం కాకుండా సంతృప్తికర జీవితం గడపవడం ఎలా, మందిరాలలోనూ మసీదులలోనూ కాకుండా మనలోనే దేవుడిని చూడడం ఎలా.. ఇలా ప్రవచనం కొనసాగింది. రెండున్నర గంటల ఆధ్యాత్మిక జాగృతి అనంతరం, కొందరు అదృష్టవంతులకి ఆయన సమీపానికి వెళ్లి, ఆశీర్వాదం తీసుకుని, ఏదైనా ఒక ప్రశ్న అడిగే అవకాశం దొరుకుతుంది. ఆధ్యాత్మిక గురువులందరికి పరిపాటే ఇది. సెకండరీ స్కూల్ చదివే ఓ బాలిక బాబాజీ చెప్పినదంతా శ్రద్ధగా వింది, ప్రశ్న అడగటానికి తన వంతు కోసం ఓపికగా ఎదురుచూస్తోంది. ఈనాటి అదృష్టవంతులలో తను ఒకరు, ముందు వరుసలో గర్వంగా కూర్చుని ఉంది. తన కళ్ళలో మెరుపు, తీక్ష్ణమైన వదనం ఆమెకో ప్రత్యేకతని సంతరించిపెట్టాయి, ఎంతమందిలో ఉన్నా సులువుగా గుర్తించేలా. బహుశా, దైవం కూడా ఆమె వైపే ఉన్నాడేమో, మొదటి ప్రశ్న అడిగే అవకాశం రియాకే లభించింది.

అక్కడ్నించి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, పీస్ రెసిడెన్సీ, బ్లాక్ నెంబర్ 3లో 21 వ అంతస్తు నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నాడు రోహిత్. అతను అలా గత 20 నిముషాలుగా వర్షాన్ని తదేకంగా చూస్తున్నట్లు ఆ గదిలోని గడియారానికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఏవో ఆలోచనలలో లోతుగా లీనమైపోయి, ఆనంతమైన ఆకాశం వైపు చూస్తున్న అతడికి దృష్టిని ఏదీ భగ్నం చేయలేకపోతోంది. అతను దాదాపుగా నిశ్చలత్వం మూర్తీభవించిన నిరాశలా ఉన్నాడు. భుజాలు బరువై క్రిందకి జారాయి, మోకాళ్ళు బలహీనమయ్యాయి. పైన ఉన్న దట్టమైన మబ్బులు.. ఆ రాత్రి ఆకాశం నుంచి.. తన జీవితం నుంచి ఎప్పటికయినా వీడతాయా అని అనుకున్నాడు. అప్పుడప్పుడు ఉరుముతున్న ఉరుములు ఆందోళనగా ఉన్న అతడి గుండెచప్పుడులా ఉన్నాయి, పెద్దగా భయంకరంగా. గోడ మీద అతనికి ఎడమ వైపున అతికించి ఉన్న ఓ పోస్టర్‍లో ‘పరిస్థితులు నేడు కాకపోతే, ఎప్పటికైనా చక్కబడతాయి’ అని ఉంది. అయితే ఆ ‘ఎప్పటికైనా’ అన్నది సుదీర్ఘంగా ఉంది అతని విషయంలో. అతని స్టార్టప్ కంపెనీ ఆశించినట్లు నడవడం లేదు, అధికంగా బిజిసెన్ ఇచ్చే ఓ పెద్ద క్లయింట్‍ని ఈ రోజు ఉదయం కోల్పోయాడు. ‘నువ్వో మంచి ఉద్యోగివి, కానీ మంచి నాయకుడివి కాదు’ అని చాలా మంది రోహిత్‌తో అన్నారు. మంచి జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నప్పుడు “రోహిత్, నువ్వు వ్యాపారం చేయలేవు” అన్నాడు అతని మేనేజర్. “ముందు నువ్వు తిమ్మిని బమ్మి చేయడం నేర్చుకోవాలి, సులువైన మార్గంలో చేయడం నేర్చుకోవాలి, ఆ తర్వాతే వ్యాపారం.. నీకు బిజినెస్ నప్పదు” చెప్పాడాయన. రోహిత్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తనపై తాను విశ్వాసంతో ఉన్నాడు, తన ప్రణాళికల ప్రకారం ముందుకు సాగిపోయాడు. బాబాజీ ప్రసంగం యూ-ట్యూబ్‍లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. రోహిత్ ల్యాప్‌టాప్‌లో ఆ లింక్ తెరిచే ఉంది. అంతకు ముందు ఆ ప్రసారాన్నే చూశాడతను.. కానీ మధ్యలో దాని మీద నుంచి అతని దృష్టి మళ్ళింది. ఒక ప్రశ్న మళ్ళీ అతడిని చైతన్యంలోకి లాక్కువచ్చింది. అన్ని ఆలోచనలను మర్చిపోయి, కేవలం రెండు పదాల మీద దృష్టి సారించేలా చేసిందా ప్రశ్న. ఆ ప్రశ్న ఆ తెలివైన అమ్మాయి బాబాజీని అడిగిన ప్రశ్న.

పీస్ రెసిడెన్సీ నాల్గవ నెంబరు గేటు నుంచి ఓ క్యాబ్ లోపలికి ప్రవేశించింది. అందులో నలుగు కుర్రాళ్ళున్నారు. ఇక్కడ ఉంటున్న ఓ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ చేసుకునేందుకు షాంపేన్ బాటిల్స్, ఇతర సామాగ్రితో వస్తున్నారు వాళ్ళు. డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి కొద్దిగా కిటికీ అద్దాన్ని దించి, వర్షం చప్పుడికి ఇబ్బంది పడుతూ, “పురవ్, బ్లాక్ 4, 702” అని చెప్పాడు. సెక్యూరిటీ గార్డ్ క్యాబ్ నెంబర్ వ్రాసుకుని, అక్కడి నుంచి ఎడమ వైపు మూడవ సందులోకి తిరగమని డ్రైవర్‍కి చెప్పాడు. లివింగ్ రూమ్‍లో లాప్‍టాప్ ముందేసుకుని అత్యంత సంతోషంతో ఓ ఈమెయిల్‌ని – మధ్యాహ్నం నుంచి – 24వ సారి చదువుకుంటున్నాడు పురవ్. తను పనిచేసె కంపెనీ యొక్క ఇండియా ఆపరేషన్స్ – ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు – పురవ్ ఎంపికయ్యాడు. ఎంపిక అనే పదం అతని కృషిని తగ్గిస్తుంది, ఈ అవకాశం కోసం అతనెన్నో పోరాటాలు చేశాడు. ఈరోజుకి రెండున్నర ఏళ్ళ క్రితం మాత్రమే ఈ కంపెనీలో చేరాడు. సంస్థలోని అన్ని రంగాలలో రాణించాడు, సంస్థను సక్రమంగా నిర్వహించే అన్ని ప్రక్రియలను చక్కదిద్దాడు. సంస్థలోని అన్ని విభాగాలతోనూ, సంస్థ క్లయింట్‍లతోనూ సత్సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. ఈ అవకాశం వల్ల అతను కంపెనీలో ఎదగడమే కాకుండా, మరింత వృద్ధికి తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పుడు ప్రపంచస్థాయిలో తన సమానులతో కలిసి పని చేయవచ్చు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు, అతన్ని నాయకత్వ పాత్రలోకి ప్రవేశపెట్టాయి, ఆ పాత్ర కోసం అతనెంతగానో తపించాడు. తన పదవీకాలంలో కొన్ని సులువైన మార్గాలను ఎంచుకున్నాడు, అతని ప్రయత్నాలన్నీ ఫలించి – అతనికి ఓ మెయిల్ రూపంలో వచ్చి అతనికి అత్యంత సంతోషాన్ని చేకూర్చాయి. అందుకే ఆ మెయిల్‌ని అన్నిసార్లు చదువుకుంటున్నాడు. అతని విజయానికి కొందరు అసూయపడ్డారు, కొందరు అతని పట్ల శ్రద్ధగా నడుచుకున్నారు. బాల్కనీలోకి నడిచి – మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని ఆస్వాదించసాగాడు. ఆకాశం బద్దలై అనంతమైన ఆశీస్సులు కురిపిస్తున్నట్లనిపించింది అతనికి. అప్పుడప్పుడు ఉరుముతున్న ఉరుములు అతనిని అభినందిస్తూ కొడుతున్న చప్పట్లలా ఉన్నాయి. పురవ్ తన మిత్రుల కోసం ఎదురుచూస్తున్నాడు. అంతలో అతని ఫోన్ మ్రోగింది. కాల్ చేసున్నది వాళ్ళమ్మ. కొడుకు సాధించిన విజయాలకి పొంగిపోవడం తల్లి సహజ లక్షణం. అందుకే ఆమె కూడా చాలా సంతోషించింది. అయితే, సంభాషణ ముగించే ముందు, “బాబూ! విను. ఇదంతా బాబాజీ దయ. ఇప్పుడు ఓ సత్సంగ్ జరుగుతోంది. టివిలో లైవ్ వస్తోంది కూడా. అది చూసి, ఆయన దీవెనలు తీసుకో” అని చెప్పిందామె. ఆమె ఆధ్యాత్మిక ప్రయోజనం ఆశించి చెప్పినా, తల్లి మాట కాదనలేక సరేనన్నాడు పురవ్. ఫోన్ పెట్టేసి, టివి ఆన్ చేశాడు. అప్పుడే ఓ అమ్మాయి బాబాజీని ఓ ప్రశ్న అడగబోతోంది.

వాలంటీర్ ఆ అమ్మాయి పేరు పిలిచాడు. రియా లేచి నిల్చుంది. తల తిప్పి అక్కడున్న జనాలందరిని ఒకసారి చూసింది. నేరుగా చూస్తూ ధైర్యంగా నడుస్తూ వేదిక వైపు వెళ్ళింది. ప్రశ్నలడిగే వారి కోసం అక్కడ ఒక మైక్ సిద్ధంగా ఉంది. ఆమె వదనంలో నిశ్చయం, ఏకాగ్రత కనిపించాయి. అయితే ఆమె ముఖంలో ఓ వింతైన భావం కదలాడింది, దాన్ని ఎలాగైనా గ్రహించాలని ఆమె అనుకుంటున్నట్లు ఉంది. వేదిక వద్దకు చేరుకుంది, గట్టిగా శ్వాస తీసుకుని, నెమ్మదిగా వంగి, బాబాజీకి నమస్కరించింది. ఆ తరువాత ప్రేక్షకుల వైపు తిరిగి వారికి రెండు చేతులలో ప్రణామం చేసింది. ఆమె వయసుని, ఆమె అందాన్ని చూసిన ప్రేక్షకులు – “బాబాజీ, పరీక్షలలో మంచి మార్కులు పొందడం ఎలా?” లేదా “నేను డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి?” లాంటి ప్రశ్నలు అడుగుతుందని భావించారు. అందరినీ విస్మయానికి గురి చేస్తూ, ఆమె చాలా స్థిరంగా మాట్లాడింది – “బాబాజీ! జీవితం ఎలా నడుస్తుందనే అంశంలో నాకు తికమకగా ఉంది. ‘మనకి ప్రాప్తం ఉన్నది దక్కుతుందా’ లేక ‘దక్కినదే మనకు ప్రాప్తం’ అని అనుకోవాలా?” అని అంది.

రియా అలాంటి ప్రశ్న అడుగుతుందని ఆ ప్రాంగణంలో ఉన్న ఎవరూ ఊహించలేదు. ఆమె ప్రశ్న ఆ ప్రాంగణంలో కొన్ని క్షణాల పాటు ప్రతిధ్వనించింది. అంతటా ఒక్కసారిగా నిశ్శబ్దం. పైన ఇనుప రేకులపై పడుతున్న వాన చినుకుల చప్పుడు తప్ప ఇంకే శబ్దం లేదు. ఎవరైనా ‘పాజ్ బటన్’ నొక్కారా అని రియా కూడా విస్తుపోయింది. ఎందుకు అందరూ అలా నిశ్చలంగా ఉండిపోయారు? అంత చిన్న వయసు అమ్మాయి నుంచి అంత గంభీరమైన ప్రశ్నని ఎవరూ ఊహించలేదు. బాబాజీ ఏం జవాబు చెబుతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. అక్కడికి దూరంగా ఉన్న రోహిత్ – వాస్తవంలోకి వచ్చాడు, పురవ్ ఆలోచనలలో మునిగాడు. ఆ ప్రశ్న ప్రభావం అటువంటిది. తాను అంత కష్టపడితే, తనకి ప్రాప్తమున్నది తనకి దక్కిందా అని ఆలోచిస్తున్నాడు రోహిత్. తనకి తన కెరీర్‍లో చాలా తొందరగా ప్రాప్తించినదానికి తాను అర్హుడా అని ఆలోచిస్తున్నాడు పురవ్. వాళ్ళిద్దరూ, అక్కడి సత్సంగుల వలెనె, ఆ చిన్నారి బాలిక లానే.. బాబాజీ సమాధానం కోసం చూస్తున్నారు. వాన చినుకుల తీవ్రత క్రమంగా తగ్గుతూ, అక్కడున్న వారు ఏకాగ్రతతో, జవాబు వినే వీలు కల్పించిది.

బాబాజీ కొన్ని క్షణాల పాటు ఆ బాలిక కేసి చూశారు. చిన్నగా నవ్వారు. ఆయన మీసాల వల్ల ఆ నవ్వు ఇంకా అందంగా తోచింది, ఆ నవ్వు ఆయన వదనానికి వన్నె తెచ్చింది. ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు ఆయన కొన్ని క్షణాల విరామం ఇస్తారు. కొద్ది క్షణాలే. దానివల్ల అక్కడున్న వారందరి దృష్టి ఆ ప్రశ్న మీద నిలుస్తుంది, ఆయన చెప్పే జవాబుకై ఆసక్తిగా ఎదురుచూస్తారు. శ్రోతలని ఒక గమ్యం తెలియని ప్రయాణానికి సిద్ధం చేస్తున్నట్లుంది. ఆయన మెల్లగా జవాబు చెప్పసాగారు. “అమ్మాయీ, నువ్వు నా చిన్నప్పటి క్లాస్‍మేట్‌ని గుర్తు చేశావు.. తను అచ్చం నీలానే ఉండేది, నాకు హోం వర్కులో సాయం చేసేది.” అన్నారు. అందరూ నవ్వారు. బాబాజీ, “వినండి” అన్నారు. ఈసారి ఆయన స్వరంలో నిశ్చయం! అందరి దృష్టి బాబాజీ మీదే కేంద్రీకృతమై ఉంది. ఆయన చెప్పసాగారు – “సోదర సోదరీమణులారా! ప్రియమైన పిల్లల్లరా.. ఈ అమ్మాయి అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. జవాబు జటిలమైనది. అయితే నేను సులువుగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక నది హిమాలయాలలో పుట్టింది, దిగువకి మైదానాలలోకి ప్రవహించి, ఎందరినో కలిసి, వారికి మేలు చేసి, చివరికి సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు నది ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇంక అది ప్రవహించనక్కరలేదు. కదలక్కరలేదు, ఎవరికీ సాయం చేయనక్కరలేదు. అది తనకి ఏదైనా ప్రాప్తం ఉందా అని పరంధాముడిని అడగదు, తన ప్రయాణంలో దేనినీ పొందదు. ప్రవహిస్తూ ఉంటుంది, జనాలకి సాయం చేస్తూ ఉంటుంది. అలాగే మన జీవితం కూడా. జీవితం దేన్నీ కోరుకోదు, దేన్నీ పొందదు. ఇక్కడికి మనమందరం ఒక లక్ష్యంతో వస్తాము. ఆ లక్ష్యం ఏమిటో మనలో ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. అందుకు ఆధ్యాత్మికతే మార్గం. ఆ నది లానే, మీరు కూడా నేడు చేయాల్సింది చేయాలి. పని పట్ల, మనుషుల పట్ల, ప్రకృతి పట్ల, దైవం పట్ల మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మీకు దక్కాల్సినవి, దక్కేవి ఆయన చూసుకుంటాడు. మీకు దక్కేవి, మీకు ప్రాప్తం ఉన్నవి అందమైన కానుకలు. కర్మ యొక్క బహుమతులు. మీరు ఆచరించినవాటి ఫలితాలు, ఎలా చేశారు, ఎందుకు చేశారు? విత్తును బట్టే పంట ఉంటుందని మన అందరికీ తెలుసు. ఒక్కోసారి పంట ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా మీరు విత్తిన విత్తనాలకి పంట లభిస్తుంది. ద్రాక్ష అయితే ద్రాక్ష, మామిడి అయితే మామిడి.. కాకరకాయ అయితే కాకరకాయ.. రియా, ఈ రోజు నీ కర్తవ్యం.. చదువుకోవడం, స్నేహం చేయడం, ఆడుకోవడం, నేర్చుకోవడం, మీ తల్లిదండ్రులకి సహాయం చేయడం, నీ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం. దేవుడు ఇచ్చిన అద్భుతమైన కానుకలకు రోజూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతిఒక్కరూ తమ తమ ‘నేటి పనుల జాబితా’ని సక్రమంగా ఉంచుకోవాలి. ఒక నియమిత క్రమాన్ని పాటించండి. తుదకు మీ పంటని మీరు పొందుతారు..”

రోహిత్, పురవ్ ఇద్దరూ బాబాజీ చెప్పినది విన్నారు. ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా తన నియమిత క్రమాన్ని కొనసాగించారు. రియా కూడా తన కప్-బోర్డ్ మీద తన ‘నేటి పనుల జాబితా’ని అతికించుకుంది. ఉజ్జ్వలమైన సూర్యోదయంతో నగరం మేల్కొంది. ప్రతి ఒక్కరూ తమ తమ దినచర్యని ప్రారంభించారు. బాబాజీ మరో నగరానికి వెళ్ళారు.. మరి కొందరిని జ్ఞానమార్గంలో నడిపేందుకు మార్గదర్శనం చేస్తున్నారు.

ఇంతకీ మీరేమంటారు? ‘మనకి ప్రాప్తం ఉన్నది దక్కుతుందా’ లేక ‘దక్కినదే మనకు ప్రాప్తం’ అని అనుకోవాలా?

ఆంగ్ల మూలం: టి.ఎస్.ఎస్. సాకేత్

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here