ప్రారబ్ధం

1
4

[dropcap]నా[/dropcap] కొడుకు నన్ను ఆ మాట అన్నాక నాకు చాలా ఇబ్బందిగా తోచింది. మన ఆది కన్నా చిన్న చొక్కా వేసుకున్నట్టు చాలా ఇరుగ్గా అనిపించింది. అలాగని నా కొడుకు నన్ను అనకూడని మాటేం అనలేదు.

సోఫాలో విశ్రాంతిగా వెనగ్గా జారబడ్డ నా దగ్గరకి వచ్చిన మా అబ్బాయి మధు, ‘‘సారీ నాన్నా. నువ్వు హోటలు నడిపినపుడు ఎంతో లాభంలో నడిచింది. నీకు గుండె ఆపరేషను అయ్యాక, కొండంత ఆర్థిక ఇబ్బందులు పడ్డాం. తరువాత మన పాత హోటలుతో సహా మన ఆస్తులన్నీ, హాం పట్ అని మ్యాజిక్ చేసినట్టు ఒక్కసారే మాయం అయిపోయాయి. కానీ నిరాశ పడకుండా నీలానే స్వశక్తిని నమ్మి ఇపుడు హోటలు నడుపుతున్నాను. అయితే హోటలు అచ్చంగా నీలాగే నడిపినా, నీ హయాంలో వచ్చిన లాభాలు మాత్రం రావడం లేదు. మీ కోడలు ఈ వ్యాపారమే వద్దంటోంది. కానీ నేను ఒప్పుకోలేదు. లాభాలు రావడం లేదని నేను ఊరికే కూడా ఉండటం లేదు నాన్నా. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. వచ్చే కష్టమర్లని చక్కగా పలకరిస్తున్నాను. నాణ్యమైన సరుకులతోనే పదార్థాలు వండిస్తున్నాను. శుచి,శుభ్రతలో కూడా ఎక్కడా రాజీ పడ్డం లేదు. అయినా మొక్కుబడి లాభాలే వచ్చి చస్తున్నాయ్. ఏదేమయినా నీ సమర్థత నాలో లేదనిపిస్తోంది. నువ్వు గ్రేట్‌ నాన్నా. రియల్లీ గ్రేట్‌’’ అని నా చేతులు పట్టుకుని చెప్పి అక్కడ్నుండి వెళ్లిపోయాడు.

అయితే వాడన్న ఆ మాటకి నేను ఏ మాత్రం అర్హుడిని కాదు. ఎందుకంటే నాకు మొదట్నుండీ ధనార్జనే తప్ప వేరే యావ ఉండేది కాదు. కానీ నా కొడుకు అలా కాదు. నీతి, నిజాయితీ అంటాడు. పరులకి సాయం చేయాలంటాడు. పైగా రచయిత కూడానూ. వాడి లానే వాడి కథలు కూడా ఎవరినీ నొప్పించవు. కారణం, వాడు హాస్యమే రాస్తాడు. బాధలూ, వెతలూ, కష్టాలతో కూడిన బరువైన కథలు కూడా రాయండీ అని ఇంటికొచ్చిన వాడి అభిమానులు అడిగితే, చిన్నగా నవ్వేసి, “ఎందుకూ, అందరికీ కావాల్సినన్ని కష్టనష్టాలు, బాధలూ, సమస్యలూ ఉన్నాయిగా. ఇంకా నా కథల్లో కూడా ఎందుకూ?” అంటాడు. నేను వాడి వయసులో ఉన్నప్పుడు పొద్దస్తమానూ కబడ్డీ, క్రికెట్టూ లాంటి ఆటలు ఆడటం, కాలేజీ ఎగ్గొట్టి అమ్మాయిలకి ప్రేమలేఖలు రాయడం, చెరువు గట్టు దగ్గర కూర్చుని సినిమా పత్రికలు చదవడం చేసేవాడ్ని. కానీ మా వాడు అలా కాదు. చిన్నప్పటి నుండీ పుస్తకాలు చదివేవాడు. టీనేజిలోనే రిటైరైపోయిన వాడిలాగ, ముందు కొన్ని తెల్లకాగితాలు వేసుకుని, చక్కగా కథలు రాస్తూండేవాడు. ఆ వయసుకే వాడికి పాఠకుల నుండి ఉత్తరాలు వచ్చేవి. ప్రస్తుతం వాడిని పెద్ద రచయితనే అంటున్నారు. అయితే నేను ఎప్పుడూ వాడిలోని రచయితని ఆవగింజంత కూడా ప్రోత్సహించలేదు. పైగా, “ఆ రాతలు నీ తలరాతలు మార్చలేవురా, వదిలేయి” అని చెబితే ఒప్పుకునేవాడు కాదు. “సరస్వతీదేవి కటాక్షం అందరికీ దొరకదు నాన్నా. ఇది డబ్బు కోసం కాదు” అనేవాడు.

అయితే నా ధోరణి వేరు. నేను వాడి వయసులో ఉన్నపుడు ఓ చిన్న బండిపై వ్యాపారం మొదలుపెట్టాల్సివచ్చింది. కేవలం మూడండే మూడు సంవత్సరాలోనే అల్పాహారం, భోజన సదుపాయం అందించే ఓ మాదిరి హోటలు అద్దెకి తీసుకున్నాను. అయితే మొదట్లో రూపాయికి పది పైసలు, పావలా లాభాలే వచ్చేవి. కానీ ఎందుకో ఆ లాభాలు నాకు అస్సలు సంతృప్తినివ్వలేదు. ఇక అలా కాదనుకున్నాను. అడ్డంగా డబ్బు మిగిలే అన్నిట్లోనూ అడ్డదార్లు తొక్కాను. ఉదాహరణకి, నా హోటల్లో, ఇడ్లీల్లోకి కొబ్బరి చట్నీ కోసం స్వర్గపురిలో శవాల దగ్గర కొట్టే కొబ్బరికాయల్ని చాలా తక్కువ ధరకి కొనేవాడ్ని. వాటిని ఒకడు రాత్రి నాకు రహస్యంగా తెచ్చి ఇచ్చేవాడు. వాడు ఓసారి తెచ్చినవి కొద్ది రోజుల పాటు వాడేవాడిని. మిగిలిపోతే వాటిని ఎండబెట్టి నూనె ఆడించి మా వీధి వారికి అమ్మేవాడ్ని. అలాగే చపాతీ పూరీలో గోదుమ పిండితో పాటు మైదా కలిపేసేవాడిని. పూరీలు వేయించడానికి, దోసెలు వేయడానికి గాను కల్తీ నూనెని కొనేవాడిని. అది జంతుకళేబరాల నూనె అని కూడా కొందరనేవారు. కానీ నా కక్కుర్తితో, అవేం పట్టేవి కావు. లాభాలు ఎక్కువ రావాలి అంతే. అలానే గడించాను, డబ్బులు గుణించాను. తర్వాత ఓ మాదిరి పెద్ద బిల్డింగుని అద్దెకి తీసుకున్నాను. అప్పుడు కూడా అదే విధానం అనుసరించాను. హోటల్ బాగా నడిచేది. తర్వాత, ఎండాకాలంలో చాలా మంది కష్టమర్లు బోజనానంతరం పళ్ళరసాలు కావాలని అడిగేవారు. ‘లేవండీ’ అంటే కొందరు పళ్ళు నూరేవారు కూడా. సరే అని హోటల్లో జ్యూస్‌ కౌంటర్‌ కూడా ప్రారంభించాను. అందులోనూ అదే వరస అనుసరించాను. చక్కెరకు బదులు చాక్లిన్ వాడేవాడిని. అలాగే, ఐసు కూడా తక్కువకే కొనాలనే ఉద్దేశంతో, మార్చురీలో వాడే ఐసుని తెప్పించి శుభ్రంగా కడిగించి దాన్నే వాడేవాడిని. ఇలా చాలా చాలా కక్కుర్తి పనులు చేసాను. లక్షలు గడించాను. అయినా తృప్తి కలగలేదు.

అప్పుడే నా హోటలుకి కొంత దూరంలో ఓ పెద్ద హోటలు ఒకటి కట్టారు. మనిషి ఆశకి అంతెక్కడ. నేనూ అలాంటిదే కట్టాలని నిర్ణయించుకున్నాను. అయితే దానికి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు కావాలి, కనుక ఈ సారి మరింత పెద్ద అడ్డదారులు తొక్కాను. అంటే, రూపాయికి అర్ధ మిగిలేలా కల్తీ వ్యాపారానికి కొమ్ముకాసాను. పాలలా అనిపించే యూరియా, మైదా, రిఫండాయిులుతో చేసే కల్తీ పాలని అన్ని చిన్న చితకా హోటళ్లకి సరఫరా చేయడంలో ముఖ్యపాత్ర పోషించాను. అలాగే అరటిదువ్వ గుజ్జుతో కొంచెం కెమికల్స్ కలిపి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు మార్కెటింగు చేసేవాడిని. ఇంకా నెయ్యిలో డాల్డా, పసుపులో బియ్యపు పిండి ఇలా కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టుగా కల్తీ వస్తువుని తక్కువకే నాకు తెలిసిన హోటళ్లకీ, కొట్లకీ చేరవేసి మరెన్నో లక్షలు గడించాను. సొంతంగా పెద్ద హోటలు కట్టించాను. తర్వాత కొన్ని ఆస్తులు కూడబెట్టాను. అయితే కొద్ది నెలలకి నాకు పోటీగా, నా హోటలుకి ఎదురుగా నా అంత హోటలే మూర్తిగారనే ఆయన కట్టించాడు. అయితే ఆ హోటలుకి పెద్దగా ఎవరూ వెళ్లేవారు కాదు. కారణం, నా హోటలు కంటే కొంచెం ధరలు ఎక్కువ. కారణం నికార్సయిన వ్యాపారం చేసేవాడు. దాంతో అతనికి బాగా నష్టమొచ్చింది. కానీ చాలా మంచి మనిషి. అతనికి ఒకతే కూతురు. చాలా అందమైన అమ్మాయి. అణుకువ, గుణంలో బంగారం. పైగా కొంత ఆస్తిపరుడే. మా వాడికి ఆ అమ్మాయిని ఇమ్మని అడిగాను కూడా. అప్పుడు అతను నవ్వి, “చూడు సుబ్బారావూ, నువ్వు ఏమీ అనుకోకపోతే నేడు పాపపు డబ్బుతో ఎదిగి ఇలా ఉన్నావు. రేపు దీనికి ఫలితం కూడా ఉంటుంది. నేను నీతో బంధుత్వం కలుపుకుంటే నీ పాపంలో నేనూ బాగం పంచుకున్నట్టే. ఆ ఖర్మ నాకు గానీ నా బిడ్డకి కానీ వద్దు. క్షమించు” అని వెళ్లిపోయాడాయన.

అవును అతనన్నదీ నిజమే. ఎప్పుడూ డబ్బు కూడబెట్టాలనే ఆత్రం తప్ప ఒకడికి ఇంత కూడు పెట్టాలనే ఆలోచన లేదు. ఇటుకల మీద విశాలమైన బవంతి కట్టాలనే యాతనే కానీ, ఇల్లాలికి ఇసుమంత ప్రేమ పంచాలనే ఇంగితం లేకపోయింది. బ్యాంకు బ్యాలెన్సు తప్ప బిడ్డ ఆలన పాలనా చూడాలనే జ్ఞానం లేకపోయింది నాకు. నా భార్యకి నా కల్తీ వ్యాపారాల గురించి  తెలియదు. ఆమె, నేను కష్టపడి పైకి వచ్చిన వాడిననే నా బిడ్డకి చెప్పేది. తర్వాత కొన్నాళ్లకి పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా, నా ప్రారబ్ధం ప్రారంభం అయింది. గుర్రంలా ఎంతో చలాకీగా, బలంగా కనిపించే మా ఆవిడ, తాబేలులా నెమ్మెదయిపోయింది. అనుమానంతో ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకెళితే, కేజువల్ బ్లడ్‌ టెస్టులు చేసి కేన్సరని తేల్చారు. చాలా బాధ పడిపోయాను. కారణం, ఆమెకి కేన్సరని తెలిసి మాత్రమే కాదు, ఆమెతో ఇన్నాళ్లూ కనీసం సరిగా కాస్తంటే కాస్త సమయం కూడా మనసారా గడపలేకపోయానే అని నా మనసు పింగాణీ పాత్రలా పగిలిపోయింది. భర్తగా ఆమెకి ఏ ముచ్చటా తీర్చలేదు. ఎప్పుడూ డబ్బు వెంటే రేసు గుర్రంలా పరిగెత్తాను. తరువాత కొద్ది నెలకి ఆమె పోయాక, నాకు గుండెజబ్బు వచ్చింది. ఆపరేషను చేయించాను. అది సక్సెస్సు కాలేదని తెలిసి విస్తుపోయాను. కారణం అడగ్గా, చేసినవాడు నకిలీ డాక్డరని తేలిందట. అతన్ని జైల్లో పెట్టారట. నకిలీ వస్తువులే కాదు నకిలీ మనుషులు కూడా ఉన్నారు. చేసింది ఎక్కడికి పోతుంది అనుకుని కొంచెం పశ్చాత్తాప పడ్డాను. ఆ ఆసుపత్రి వారు కొంత నష్టపరిహారం ఇచ్చారు. తర్వాత మళ్లీ గుండె ఆపరేషను చేయించాను. దాంతో కొంత డబ్బు పోయింది. ఉన్న హోటలు కూడా సరిగా నడవక నష్టం వచ్చి దానిని అమ్మేసాం. అడ్డంగా సంపాదించిన అందరూ బాగనే ఉన్నారు. కానీ నాకు మాత్రమే ఇలా జరిగిందేవిటీ అని ఓసారి నేను ఆలోచిస్తుండగానే, నాకు ఓ ఫోను వచ్చింది. నా దగ్గర సర్వరుగా పనిచేసి, ఇప్పుడు పెద్ద హోటలు కట్టిన ప్రసాదరావుకి గుండెపోటు వచ్చిందట. డబ్బు కక్కుర్తితో ఓ ప్రవేటు హాస్పిటల్‌వారు వేసిన నాసిరకం స్టంటు విఫలమై మళ్ళీ గుండెపోటు వచ్చిందని దాని సారాంశం.

అలాగా! నేనూహించిందే. నన్నే ఫాలో అయ్యాడు. నాలా అయిపోయాడు. ప్రారబ్ధం అనుభవించక ఎవరికీ తప్పదు మరి అని మనసులో అనుకోవాలనుకుంటూనే పైకి అనేసాను. అప్పుడే మా అబ్బాయి ఓ కథలో రాసిన సంభాషణ గుర్తుకు వచ్చింది. ‘మనం ఒకరిని ఓ వంద రూపాయిలకి మోసం చేస్తే, అప్పటికి మన చేతిలో ఆ వంద మిగిలిందని మనం సంబరపడవచ్చు గాక, కానీ ఆ వందకి మరో వంద సహా మన జేబు నుండి జారిపోక తప్పదు. ఎప్పుడు ఎలా అన్నది కాలం నిర్ణయిస్తుంది. అదే విధి’ అని రాసిన సంభాషణ అది. కనుక ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదని బలంగా బోధపడింది. కానీ ఆలస్యంగా. ఆ తర్వాత మా అబ్బాయి వాడి డబ్బుతో చిన్న బిల్డింగు అద్దెకు తీసుకుని హోటలు నడపడం ప్రారంభించాడు. కానీ నాలా కాదు. నిజాయితీగా. కనుక ఎవరి ఉసురూ వాడికి ఉసిరికాయంత కూడా అంటదు. వాడికి మంచి లాభాలు ఇవాళ కాకపోతే రేపు రావచ్చు. కానీ నాలా ఇబ్బంది పడడు. చేసిన తప్పుకి న్యూనతతో ఎప్పుడూ పశ్చాత్తాపపడడు అనే ఆలోచనే ఎంతో హాయినిచ్చింది నాకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here