[dropcap]’యు[/dropcap]వభారతి’ ప్రచురించిన నందిని (మాస పత్రిక, త్రైమాసిక పత్రిక)లో ప్రచురింపబడిన సుప్రసిద్ధ సాహితీ విద్వన్మణులను ప్రభావితం చేసిన సంఘటనల గూర్చి వారు రాసిన వ్యాస సంకలనాన్ని ‘ప్రభావం‘ పేరుతో ప్రత్యేక పుస్తకంగా 2013లో ప్రచురించింది. ఈ వ్యాసాలు ‘నందిని’లో 1975-76 మరియు 1980-81 నడుమ ప్రచురింపబడినాయి.
‘ప్రభావం’లో 27 మంది సాహితీమూర్తుల వ్యాసాలు వున్నాయి. నేను ఒక డజను మంది వ్యాసాల్లోని కొంత కొంత భాగాల్ని మాత్రమే యిక్కడ స్పృశిస్తున్నాను.
ఆజ్ఞేయతావాదం లోంచి నాస్తికవాదంలోకి – నార్ల వెంకటేశ్వర రావు:
చిన్నతనంలో నేను వీరేశలింగం గ్రంథాలను చదివాను. ఆయన ప్రభావం నాపైన బలంగా పడింది. నేను విగ్రహారాధనకు వ్యతిరేకిని. అప్పటికే నాకు పురాణాలపై, పౌరాణిక పురుషులపై విశ్వాసం పూర్తిగా నశించింది.
బ్రహ్మసమాజం ప్రభావంతో నేను, నా సహచర విద్యార్థులు బోగం మేళాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళం. కులాంతర భోజనాల్ని ఏర్పాటు చేశాం. రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లతో బ్రహ్మసమాజం మూలంగా పరిచయాలు కలిగాయి.
బ్రహ్మసమాజం నుండి నేను వేసిన ఒక ముందదుగు ‘ఆజ్ఞేయతావాదం’ (Agnosticism). దీనికి కారణం నేను Bertrand Russel గ్రంథాలను విశేషంగా చదవడమే.
ఆజ్ఞేయతావాదం లోంచి నేను నాస్తికవాదిగా మారడానికి ఏవో కొన్ని గ్రంథాలు గాక నాలో క్రమంగా జరిగిన భావవికాసమే కారణం. ముఖ్యంగా (60) ఏళ్ళు దాటిన తర్వాత నేను నాస్తికవాదిగా మారాను. మానవజాతి భవిష్యత్తు నాస్తికవాదంతో ముడిపడివున్నట్లు నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మతాల ప్రభావం తగ్గనిదే హేతువాద దృష్టి పెంపొందదు, శాస్త్రీయ దృక్పథం వర్ధిల్లదు.
వీరేశలింగం, స్వామి దయానంద, రాజా రామమోహన్‌రాయ్ – వీరు ముగ్గురు విగ్రహారాధనను, పౌరాణిక గాథలను, మూఢవిశ్వాసాలను ఖండించినవారే. ఈనాడు వీరు మన మధ్యకు వస్తే మనలను చూసి సిగ్గు పడతారు.
ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం పెరిగింది. ఆ విజ్ఞానం మన జీవిత సరళిని అణుమాత్రంగానైనా మార్చలేదు. మనం scientific techniques ని స్వీకరిస్తున్నామే గాని, scientific spirit ని తోసివేస్తున్నాము. ఇది మన జాతి ప్రగతికి ఎంతో ప్రమాదం.
కొంత కాలంగా నేను హేతువాద, శాస్త్రీయ, మానవతావాద సంబంధిత గ్రంథాలను విశేషంగా చదువుతున్నాను.
ప్రాచీన సాహిత్యాన్ని గూర్చి శ్రద్ధ వహిస్తున్న యువభారతి, నేను, నా బోటి వాళ్ళు కోరుకునే నూతన దృక్పథాన్ని, జీవిత విధానానికి ప్రోది చేయగల గ్రంథాలను ప్రచురిస్తే ఆనందిస్తాను.
ప్రభావం – చుండి జగన్నాథం:
నాకు నాస్తిక – ఆజ్ఞేయవాదాలతో, వాదులతో గాఢ పరిచయం కలిగినప్పటికీ, నాస్తికులపై నాస్తికతత్త్వంపై అమిత ఆదరణ భావం వున్నప్పటికీ, అన్ని మతాలు మనవే అనే స్థావరంలో నిలకడ కలిగింది.
ఇటీవల కల్చర్, సంస్కృతి అంటూ వుంటే నాకొక ప్రశ్న ఉదయించింది. వేషభాషల కల్చర్ గాక సంస్కారం కల్చర్ ఎక్కడున్నది? మున్ముందు అది వస్తుందని నా విశ్వాసం. పరిస్థితులు ప్రపంచాన మనల్ని అది లేకే తోసుకుపోతున్నాయి.
మన కల్చర్ అనబడేదానిలో ఇద్దరి చరిత్ర, వాస్తవంగా సంస్కార పూరితం అని నేననుకున్నాను – ఒకరు జనకుడు, మరొకడు శుకుడు. ఒకసారి కీ.శే. వేలూరి సహజానంద అన్నారు – ‘సన్యాసి హిందువు కాడు’ అని.
మన కల్చర్ అనబడే దానిలో వుత్తమోత్తమ సంస్కారాలు కొన్ని కనిపించినా, ‘అకల్చర్’ చాలా వున్నది. అకల్చర్ నిర్మూలన కాకుంటే మనం ఎదగలేము.
ఉదాహరణ: పాండురాజు భార్య మాద్రి సహగమన పద్ధతి దుష్టమైనది గదా!
రామాయణంలో శంబుక వధ జరిగి వుంతే, సీతమ్మ చెర విడిపించి అగ్నిలో దూకించడం కరుడు గట్టిన పురుష పక్షపాత లక్షణం. ఆమెను అడవికి పంపడం మహా ఘోరం. ఇందుకై మనం సిగ్గు పడక, రోత పడక, ఖండించక, అదంతా మన కల్చర్ క్రింద జమ కట్టడం మనకు సిగ్గు చేటు.
అన్ని మతాల వారి పవిత్ర గ్రంథాల్లో ఈ విధంగానే కల్చర్-అకల్చర్ మిశ్రమం వుంటుంది.
వామన చరిత్రలో: బలి రాజ్యంలో సర్వారంభములు పండినవి. ఇంద్రుని పదవికి భంగం రాకూడదని భగవంతుడు మాయ జేసి బలిని అణచి, తనలో కల్పుకుని ఆయన్ని రక్షించాను అనటం – ఏమిటీ నాటకం? ప్రజలకు బలిని వదిలేసి తనలోకి యింద్రున్ని దేవుడు తీసుకుపోగూడదా?
దేవతల – రాక్షసుల గుణగుణాలను చూస్తే దేవతలు ఎక్కువ అన్పించదు.
పరీక్షిత్తు చరిత్రలో పరీక్షిత్తు చేసింది తప్పే. ఋషి కుమారుడు శపించిందీ న్యాయమే. కానీ, అది తొందరపాటని గ్రహించిన తండ్రి ఆ శాపాన్ని ఉపసంహరింపవలె గదా!
మన సమాజంలో పాషండ లక్షణాలు వుండబట్టే కదా ఇది సాగిపోతున్నది.
మన సాహిత్యంలో వున్న ఉత్తమ రచనలన్నింటిని మనకందించే యువభారతికి వందన శత సహస్రములర్పించినా తక్కువే.
అగ్నయే నమః – దాశరథి:
మత విశ్వాసాలలో నాకు విశ్వాసం లేకపోయినా వేదాలలో అగ్నిని గూర్చి కేశవార్యశాస్త్రి చెప్పినప్పుడు సాహిత్యపరంగా అన్వయించుకోడానికి తప్పటడుగులు వేసేవాణ్ణి.
ఏ చేను కృషీవలునికి తిండి ఈయదో, ఆ చేనును కాల్చేయండి అన్న ఇక్బాల్ వచనల్ని జనాబ్ జక్కీ సాహెబ్ వచించేవాడు. ఇక్బాల్ రాజకీయ సిద్ధాంతం తోనూ నేను ఏకీభవించను.
నన్ను కవ్వించే మా బంధువులమ్మాయి చూడామణి. శృంగారమంటే తెలియని రోజుల్లో (మనసులో) ఏదో గిలిగింతలను తనువులోనూ కలిగిస్తుండేది. ఆనాడే అంగారం, శృంగారం నన్ను ఆవహించాయి. చూడామణి నాకు దక్కకపోయినా ఆ అగ్ని (40) ఏళ్ళుగా నన్ను వెంటాడుతున్నది.
అపోహలు అందించిన విజయాలు – రావూరు వెంకట సత్యనారాయణ రావు:
నా జీవితంలో కొందరి అపోహలు నాకు మేలు చేశాయి. మా వూళ్లో ఒక హరిజన బాలుడికి నా మీద ఒక అపోహ వుండేది – నాకు ఇంగ్లీషు బాగా వచ్చునని. ఒక రోజున వాడు ఇంగ్లీషు పుస్తకం తెచ్చి పాఠం చెప్పుమని బ్రతిమిలాడాడు నన్ను. నేను ఆ రాత్రి మా అన్నయ్య దగ్గర పాఠం చెప్పించుకుని మరునాడు వాడికి చెప్పాను. ప్రతీ రోజూ అంతే. అతడి అపోహ కారణంగా నాకు ఇంగ్లీషు భాషాధ్యయనం ఏర్పడింది!
శ్రీ ముట్నూరి కృష్ణారావు గారికి నాకు హిందీ భాష వచ్చును అనే అపోహ కలిగి అనువాదకుడిగా నాకు ఉద్యోగం యిచ్చాడు. ఎలాగో తంటాలు పడ్డాను.
ఆ అపోహలే నా ఈనాటి సారస్వత జీవితానికి నాంది అయ్యాయి!
ప్రభావం – ప్రతిభ – కుందుర్తి:
నేను జాషువాకు, విశ్వనాథకూ శిష్యుణ్ణి. విశ్వనాథ భావాలూ, నా భావాలూ దూరమైపోయాయి. శ్రీశ్రీ మా యుగంలో సర్వ యువకవులను శాసించాడు. ఇది శ్రీశ్రీ శక్తి అనడం కంటే యుగ శక్తి అంటే బాగుంటుంది. ఆ యుగ శక్తిని ఆ యుగకర్త మేలుకొల్పాడు.
పరిశోధనకు పునాది – ఆరుద్ర:
ఒకనాడు ప్రసంగంలో కె.వి.రెడ్డి గారిని అడిగాను “మీరు భక్త పోతన, యోగి వేమన చిత్రాలు తీశారు కదా, కవి తిక్కన కూడా తీయకూడదా?” అని.
“అందులో లేడీ సెంటిమెంట్స్ ఏమున్నాయప్పా?” అని ప్రశ్నించాడు రెడ్డి గారు. వెంటనే నేను జవాబు చెప్పలేకపోయాను.
ఆ తర్వాత – తిక్కన గారి జీవిత చరిత్ర చదివి ఆ కథ సినిమాకి పనికి వచ్చేలా వుందని రెడ్డిగారిని ఒప్పిచాలన్న పట్టుదల కలిగింది. దాంతో గురజాడ శ్రీరామమూర్తి ‘కవి జీవితాలు’ పుక్కిటి పురాణాలు అయినా కూడా చదివాను. చాగంటి వారి కవుల జీవితాలు చదివాను. కేతన దశకుమార చరిత్ర చదివాను. మారన మార్కండేయ పురాణం చదివాను. ‘కాటమరాజు కథ’ను ఖడ్గ తిక్కన కొరకు చదివాను. సోమశేఖరశర్మ గారి ఉపోద్ఘాతం ఎన్నో సంగతులు చెప్పింది. మనుమసిద్ధి గురించి తెలుగు చోడుల చరిత్ర చదివాను. ఒక పుస్తకం అధోజ్ఞాపికలో మరో పుస్తక ప్రసక్తి వుంటుంది. వీటిని ఆమూలాగ్రం చదవాల్సి వుంటుంది.
చదవడం మొదలుపెట్టాను. తీగలాగితే డొంకంతా కదిలింది. దాన్నంతా నోటు చేస్తే అది సమగ్ర ఆంధ్ర సాహిత్యానికి పునాది అయ్యింది! ఇంతకు రెడ్డిగారికి తిక్కన కథ చెప్పనే లేదు!
కెరటాలు – చర్ల గణపతిశాస్త్రి:
నవీన సంస్కృతి కలవారితో మెలుగుతూ, వారి కృత్రిమాడంబర పద్ధతులతో విసిగిపోయాను. ప్రాచీన సంస్కృతి మీదే మోజు పడింది.
“కవులూ, కళోపాసకులూ ఏదో ఆవేశంతో చెబుతారే గానీ, వారు చెప్పేది వారికే తెలియదు. వారు చెప్పేదానికీ, చేసేదానికీ చాలా తేడా వుంటుంది” అనే సోక్రటీసు వాక్యాలు ఎప్పుడూ నా చెవుల్లో గింగురుమంటూ వుంటాయి.
సర్వోదయ ప్రచారం చేస్తున్న ఆ కార్యకర్తల్లో గూడా నిజాయితీ లేనందున మానేసి పుస్తకాలు రాయడంలో పడ్డాను.
అమృత ఘడియలు – కళాప్రపూర్ణ నిడదవోలు వెంకటరావు:
ఆంధ్రభోజులు – పిఠాపురం మహారాజా వారు “మేము నన్నెచోడుని కుమార సంభవము చదువుచున్నాము. కానీ, అది కాళీదాసు కృతి కంటే భిన్నముగా వున్న కారణమేమి?” అని నన్ను అడిగారు.
“కాళిదాస కుమార సంభవం కావ్య కళాదృష్టిలొ పరాంకోటి కెక్కింది. కానీ, నన్నెచోడుని కృతి యందు – కావ్య దృష్టితో పాటు వీర శైవ సంప్రదాయమగు – ఆధ్యాత్మిక మత సంప్రదాయములు నిండి యున్నవి” అని నేను బదులిచ్చాను.
వారు “ఇది యేమి? కేవలం రస విషయమగు కావ్యమున మత సంప్రదాయ ప్రవేశమెట్లు?” అని ప్రశ్నించారు.
నేను “రాయలవారు రసైకమగు గోదాశ్రీరంగనాయకుల ఉదంతమున విశిష్టాద్వైత మత సంప్రదాయములు నిబంధించి యున్నారు కదా” అన్నాను. దాంతో నన్ను సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యస్థానమున పండితునిగా నియమించారు మహారాజావారు.
చెప్పండి జవాబు – మల్లవరపు విశ్వేశ్వరరావు:
Hunger & Love నవల Andre Britton అనే ఇంగ్లీషు రచయిత రాసింది చదివింతర్వాత అది నా చేత ఒక పద్యం రాయించింది, అంత వరకు నేను రాయనటువంటి పద్యం – ప్రేమ గీతం కానిది, ఛందస్సు లేనిది. నా గురుదేవ రవీంద్రుడు అన్నట్టు దాన్ని ముక్త ఛందమనొచ్చు. ముక్త ఛందానికీ, వచన పద్యానికీ చాలా తేడా వుంది. ముక్త ఛందస్సులో ఛందం నశించిపోదు, విముక్తి పొందుతుంది, అంతే. అంచేత ఛందానికి ప్రాణమైన లయ స్వతంత్రమూ, బలీయమూ అవుతుంది. వచనానికి దగ్గరై చావదు. పద్యం కంటే బలం పుంజుకుంటుంది. అందంగా చెప్పడం కంటే బలంగా చెప్పడం ప్రధానమవుతుంది. లాస్యానికీ, తాండవానికీ వున్న తేడా. లాస్యాన్ని నియమితం చేయగలము, తాండవాన్ని నియమితం చేయలేము.
అభ్యుదయ సంఘాలు నన్ను ప్రభావితం చేయలేకపోయాయి. కానీ, ఈ నవల నన్ను ప్రభావితం చేసింది. అభ్యుదయ సభలో ఓ వక్త ఘాటుగా మాట్లాడి Love Poetry ని ‘Synthetic Love Poetry’ (కృత్రిమ ప్రేమ కవిత్వం) అని హేళన చేశాడు. నేను వారి కవిత్వాలను ‘Synthetic Labour Poetry’ (కృత్రిమ కవిత్వం) అంటాను. ఎందుక్కాదు చెప్పండి జవాబు!
తల్లి – తండ్రి – విద్వాన్ గూడ లక్ష్మీనారాయణశర్మ:
బుద్ధుడు జ్ఞాన సాధనకు పూనుకుని అన్నపానీయాలు మాని శరీరాన్ని కృశింపజేసుకున్నాడు. అందువల్ల ఆయనకు సమాధి కుదరడం లేదు. ఒకనాడు ఆ దారిన పోతున్న వేశ్య వీణా తంత్రులను బిగదీసే ప్రస్తావనలో పలికిన మాటలు ఆయన చెవుల పడినవి. తంత్రుల్ని బాగా బిగిస్తే తెగిపోతాయి. వదులుగా వుంచితే మోగవు. కాబట్టి శ్రుతి గాన సమంగా తగు రీతిని బిగించాలి. ఈ మాటల్లో ఆయనకు శరీరాన్ని కృశింపజేస్తే తనువే రాలిపోతుంది, శరీరాన్ని యోగసాధనలో పటువుగా వుంచుకుంటే సిద్ధి లభిస్తుందని స్ఫురించింది!
గురవే నమః – డా. పాటిబండ మాధవశర్మ:
విశ్వనాథ నాకు మొదటి గురువు, పింగళి వారు రెండవ గురువు పాఠాల్ని విశ్వనాథ వారు చెపుతుంటే రత్నాలు తవ్వి పోసినట్టు, పింగళి వారు చెపితే పువ్వులు వెదజల్లుతున్నట్లుంటాయి. విశ్వనాథ ప్రతిభ సముద్రం. దరి, లోతు తెలియవు. పింగళి ప్రతిభ కొత్త వ్యక్తిని చేస్తుంది. విశ్వనాథ సూర్యుడు – చైతన్యాభిషేకం చేస్తాడు. పింగళి చంద్రుడు – అమృతాభిషేకం చేస్తాడు. నేను కవిని, పండితుడ్ని కాలేదు. అధ్యాపకుడి నైనాను. ఆ గురువులిద్దరి ప్రతిభాపాటవాలు, ప్రభావం ఏకమై నా అధ్యాపకత్వానికి ఒక విశిష్టతను చేకూర్చినవి.
విశ్వనాథ వక్తృత్వం – దివాకర్ల వేంకటావధాని:
మా నాయనగారి తమ్ములలో మొదటివారు శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులలో ఒకరైన తిరుపతి శాస్త్రి గారు.
తిరుపతి శాస్త్రి గారి నిర్యాణమప్పటికి నాకు అయిదారేండ్లు. తరువాతి కాలంలో బందరులోని హిందూ కళాశాలలో ఇంటరులో చేరితిని. అప్పుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్రోపన్యాసకులు. తరచుగా నేను వారి యింటనే వుండెడి వాడను. వారి ఉపన్యాసము లెక్కడ వున్నను వెళ్ళి వినుచుండెడి వాడను. వారు కొందరిని మెచ్చెడివారు, కొందరిని నిర్భయంగా తెగడెడివారు. నా సహపాఠి ఇందుకూరి సత్యనారాయణ రాజు (పాపమాతడు యౌవనముననే దివంగతుడయ్యెను) ఆ ఉపన్యాసములకు నాతో వచ్చి “మీరును ఇట్లె కవి పండితులై సభ్యుల నలరించు కాలము వచ్చును” అనెడివాడు. ప్రేమతో అతడనెడి ఆ వాక్యములు నేనుపన్యాస వేదిక ఎక్కినప్పుడల్లా జ్ఞప్తికి వచ్చుచుండును.
మాటలు విస్మృతులై గాలిలో కలిసిపోవచ్చు. కానీ, వాని ప్రభావం మాత్రం శాశ్వతముగా నుండి పోవును.
***
ప్రభావం (వ్యాస సంకలనం)
ప్రచురణ: ‘యువభారతి’ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ
మొదటి ముద్రణ 29 ఆగస్టు 2013
పేజీలు: 60
వెల: రూ.50/-
ప్రతులకు:
‘యువభారతి’, తెలంగాణ సారస్వత పరిషత్ భవనాలు,
తిలక్ రోడ్, హైదరాబాదు 500001
~
విశాలాంధ్ర బుక్ హౌస్ (అన్ని బ్రాంచీలు)
~
నవోదయ బుక్ హౌజ్, హైదరాబాద్ 500027.
040-24652387