Site icon Sanchika

ప్రభాత సూర్యులు

[dropcap]తూ[/dropcap]ర్పు తలుపు తోసుకుని భానుడు రాగానే
వ్యాయామానికి ఉరకలెత్తింది కాయం!
వెచ్చని నీరు గళం జారి కలిగించింది ఉత్తేజం!!
తొలికిరణం, చిరుపవనం స్వాగతించిన
ప్రభాత వేళ మధుర భావాలు మరిన్ని
మూట కట్టుకోవాలని ముందు కడిగేశాను
కొన్ని పలకరింపులు, మరిన్ని మెచ్చుకోలు చూపులను ఆస్వాదిస్తూ..
మార్పులేని దేహంలో, రాని మార్పును వెతుక్కుంటూ సాగిన నా రహదారిలో…
ప్రకృతి ఆరాధనకే పరిమితమైన నా చూపులకు
జాలి దారాన్ని కట్టి లాగింది వీధి బాల్యం!
పారేసుకున్న తమ బాల్యాన్ని పట్టి తెచ్చుకోలేక
చివరికి చిత్తు కాగితాలు ఏరుకుంటూ..
బంధాల చిరునామా ఊహకందక
రాబందుల కబంధ హస్తాలలో
మానవత్వపు రేఖలను జాలిగా వెతుక్కుంటూ..
ఎవరి ఏమరుపాటుతోనో కోల్పోయిన బాల్యం!
ఎవరిని నిందించాలో తెలియని పసితనం!!
అందరి పాపాలను ప్రక్షాళన చేసే వీలులేక
ఎంగిలి కప్పులను ఆశ్రయించిన అమాయకత్వం!
చూసిన ఆ క్షణం, గుండె భారమై..
కంట నీరు పొంగింది సంద్రమై..,
శరీరానికి కాదు మనసుకు కావాలంది వ్యాయామం!
వీలైతే వారి కోసం ఏమైనా చేయమంది తక్షణం!
ఆ పనిలోనే పడ్డాను మరు క్షణం!!

Exit mobile version