ఏది నిజమైన పురోగతి అని ప్రశ్నిస్తున్నారు చల్లా సరోజినీదేవి “ప్రగతి” అనే కవితలో.
మనుషులెటు పోతున్నారు?
పురోగమనమా? అది తిరోగమనమా?
చంద్రుని పై విహరాలు – జలధి అడుగున వాహ్యాళులు.
రెక్కలు లేకున్నా ఆకాశవీధిలో
విహాంగాలై ఎగరడాలు – ఎక్కడికైనా చేరడాలు.
నిజమే – మనం చాలా పురోగమించాము.
కానీ ఎదుటి వాడి అభివృద్ధిని గాంచి
మనసారా హర్షించలేకపోతున్నాం.
ఏదీ తీసుకెళ్ళలేమని తెలిసినా
అన్నీ కావాలన్న అత్యాశను వీడలేకున్నాం.
నా మతం గొప్పదనే అంతర్యుద్ధాలు.
మతం పేరిట మారణహోమాలు.
దేవుడొక్కడేనని తలలూపుతూనే
మానవత్వం మరచిన ఊచకోతలు.
బలం చూపుతూ బలహీనుల అణచివేతలు.
అభం – శుభం తెలియని అతివలను
అతి కిరాతకంగా చెరిచి, ప్రాణాలు తీసే
విషసంస్కృతి పెరిగిపోతున్నది.
విజ్ఞానం పెరిగినా వివేకం తరిగిపోతున్నది.
ప్రగతి పథాన సాగుతున్నామనుకొని,
మనలోని మంచిని చంపుకుని అధోగతిపాలవుతున్నాం.
ఇంకనైనా మానవతను మేల్కొలిపి,
మంచికి వారసులమవుదాం.
















