Site icon Sanchika

ప్రకృతి చర్య ప్రశ్నార్థకమే!

[dropcap]ఈ[/dropcap] భూమిలో ఏ రహస్యం దాగుందో!
ఈ పొరల మధ్య ఏ బడబానలం రగులుకుందో!
హతశేషుల, క్షతగాత్రుల
ఆర్తనాదాలు వినిపించేందుకా?
కులమతాలను కూల్చేందుకా?
సామూహిక శవ దహనాలతో
సామరస్యం సాధించేందుకా?
ఈ అంతరాలను అంతమొందించేందుకా?
ఎందుకు – ఎందుకు – ఎందుకీ
ప్రళయ నర్తనం? విలయతాండవం?
ఏ శిథిలావశేషాల కింద
ఏ తనువు చావించిందో!
ఏ చిన్నారి చిరునవ్వు
ఏ క్షణాన చిదిమేసిందో!
ఏ కప్పు కింద ఏ ముప్పు జరిగిందో!
ఏ రోగగ్రస్థ శరీరం
ఎప్పుడు ఉపశమనం పొందిందో!
ఏమిటి? ఏమిటి? ఏమిటీ?
ప్రళన నర్తనం? విలయతాండవం?
కష్టార్జితంతో కట్టుకున్న యిల్లే
సమాధి అవుతుందని
ఇంటి వాసాలే శవ దహనానికి
కట్టెలుగా మారతాయని ఎవరూహిస్తారు?
ఏ మమతల జంట ఇది కాళరాత్రని
కలలు గంటూ నిద్రపోతుంది!
అపురూపంగా అల్లుకున్న ఏ ఊహల తీవలు
ఎప్పుడు తెగిపోతాయో ఎవరికి తెలుసు!
ప్రకృతి బీభత్సం –
మనిషికెప్పుడూ ప్రశ్నార్థకమే!
(భూకంపంపై స్పందన)

Exit mobile version