ప్రకృతి చెప్పిన సత్యం

0
59

[హిందీలో శ్రీమతి అనూరాధ మంగళ్ రచించిన ‘సత్య్’ అనే పిల్లల కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అదొక అందమైన తోట. మొక్కలకి అందమైన పూలు పూశాయి. కొన్ని మొక్కలకి పూలతో పాటు ముళ్ళూ ఉన్నాయి. పూలకి లభించే గౌరవం తమకి లభించటం లేదని ముళ్ళు బాధపడ్డాయి. ఎప్పటిలానే పూలను పలకరిస్తున్నా, వాటిలో తీవ్రమైన నిరాశ!

‘కొన్ని పూలకి తమ సుగంధం, సౌందర్యం, కోమలత్వమంటే గర్వంగా ఉంటుంది. ఎవరైనా తమని ఇష్టపడతారని వాటికి టెక్కు! భగవంతుడి పాదాల నుంచి లోకంలో ఏ పనికైనా తాము ఉపయోగపడతామని వాటి భావన. కొన్ని పూలలో ఎంతో వినమ్రత. వాటి రూపం, రంగు, రసం, సుగంధాల సంపద వల్ల కొన్ని పూలను కళాప్రక్రియల్లో వాడతారు. కొన్ని పూలను మందులలోనూ, అత్తరు తయారీలోనూ ఉపయోగిస్తారు. కొన్ని పూలను దుస్తుల రూపకల్పనలోనూ వాడతారు. ఇలా పూలు ప్రతి రోజూ మనుషులకు ఏదో ఓ రకంగా ఉపయోగపడతాయి. పెళ్ళికూతురి అలంకరణ కావచ్చు లేదా ప్రేయసి జడ కోసం కావచ్చు! పూలు అనేక భావాలకు ప్రతీకలు. కొన్ని పూలకి తమ కోమలత్వాన్ని ప్రత్యేకంగా చాటుతాయి. మన్మథుడు బాణాలు వేసినప్పుడు ప్రకృతి పులకించి యవ్వనవతి అవుతుందట. ఆకాశంలో నాలుగు దిక్కులా నల్లని మేఘాలు కమ్ముకొస్తాయట. ఆ సమయంలో పూలు తమ గుణాల వల్ల అందరినీ విశేషంగా ఆకర్షిస్తాయి. మేఘాలు కూడా సన్నటి జల్లును వెదజల్లి పూల అతిశయాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ లోకానికి వచ్చిన మనిషి ప్రయాణం పూలతోనే సాగుతుంది. జీవితంలోని ప్రతి అంశంలో పువ్వుల వైభవం ప్రముఖంగా ఉంటుంది. మరి మేమో..’ ఇలా సాగాయి ముళ్ళ ఆలోచనలు.

సరిగ్గా అప్పుడే ముళ్ళకి ప్రకృతి మాత సందేశం ఇలా వినబడింది:

“పూలతో పాటు కొమ్మలపై ఉండే మిమ్మల్ని ఎవరూ ఇష్టపడరు. మీకు తరచూ నిస్పృహే ఎదురవుతుంది. అయితే పువ్వులకెంత ఉపయోగం ఉందో మీకూ అంతే ప్రయోజనం ఉంది.

మీ గుచ్చుకునే గుణం లేకపోతే పువ్వుల మెత్తదనం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏదైనా ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే, దాన్ని బయటకు తీయడానికి మీరు ఉపయోగపడతారు. మీ గురించి ఓ కవి ఏమన్నాడో తెలుసా – ‘ముల్లు ఒక్కోసారి కత్తి అవుతుంది, మరోసారి సూది అవుతుంది’ అన్నాడు.

ఏ విత్తు నాటితే ఆ చెట్టే మొలుస్తుందన్న సామెత మీకు తెలుసు కదా! మీకు తెలుసా, నల్ల తుమ్మ చెట్టు – తన ఒళ్ళంతా ముళ్ళున్నాయని బాధపడి దేవుడితో మొరపెట్టుకుంది. ఇప్పుడు మీరు బాధపడుతున్నట్టే – ‘నన్నెవరూ ఇష్టపడరు ప్రభూ! కనీసం పక్షులు కూడా నాపై గూడు కూడా కట్టుకోవు. నావల్ల ఎవరికి ప్రయోజనం?’ అని దిగులుపడితే, అప్పుడు భగవంతుడు దానికెన్నో వరాలిచ్చాడు. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలను కల్పించాడు. దాని పొట్టు, చెక్కతో ఔషదాలు తయారవుతాయి. వాటి పండ్లను టూత్ పేస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆ చెక్కతో చేసిన ఫర్నిచర్ చాలా దృఢంగా ఉంటుంది. గుణాల కంటే, పీడని భరించేవారే ఎంతో మెరుగని మరో కవి అన్నాడు. దేవుడు చేసిన ఈ సృష్టి ఎంతో సమతుల్యంగా ఉంటుంది. ఒకరికొకరు సామరస్యంగా ఉండాలి.

Art by Mrs. Anuradha Mangal

పూలు, ముళ్ళూ రెండూ ముఖ్యమైనవే. ప్రపంచాన్ని నడపడానికి రెండూ అవసరం. చేదు తినకపోతే తీపి రుచి ఎలా తెలుస్తుంది? మండే వేడి లేకపోతే వాన చినుకుల్ని ఎలా ఆస్వాదిస్తాం? దుఃఖం లేకపోతే సుఖం విలువ ఎలా తెలుస్తుంది, రాత్రి లేకపోతే బంగారు వేకువ ఎలా వస్తుంది? ఇది ఓ జీవిత చక్రం! మనం దానిలో తిరుగుతున్నాం. జీవితంలోని తీపి, పులుపు, ఇంకా చేదు క్షణాలను ఆస్వాదించండి. ఈ సత్యం ద్వారా జీవించడం నేర్పిన; సుఖవంతమైన జీవితాన్ని గడపడం సుసాధ్యం చేసిన దేవదేవునికి మనం కృతజ్ఞులమై ఉందాం” అంటూ ముగించింది.

సంశయాలు, సందేహాలు తొలగిన ముళ్ళ మనసుల్లో ఎంతో తృప్తి!

హిందీ మూలం: అనూరాధ మంగళ్

స్వేచ్ఛానువాదం: కొల్లూరి సోమ శంకర్


నా పేరు అనురాధ మంగళ్. నా వయసు 80 సంవత్సరాలు. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్ టీచర్‌గా పిల్లలకి బొమ్మలు గీయడం నేర్పించాను. ఈమధ్య కాలంలో పిల్లల కోసం, పెద్దల కోసం కొన్ని కథలు వ్రాశాను. నా రచనలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here