[dropcap]కా[/dropcap]లుష్యమనే విషపుకోరల రక్కసి..
నేడు ప్రపంచాన్ని కబళిస్తున్నది!
గాలి కలుషితం, నీరు కలుషితం,
భూమి కలుషితం, ఆకాశం సైతం కలుషితమై పోగా..
మనిషి, మనిషితో పాటు ఈ భూగోళంపై నివసించే ప్రతి జీవి..
కష్టపడుతూ.. బ్రతుకు పోరాటాన్ని సాగిస్తుంటే..
ఈ కాలుష్యాన్ని అరికట్టడం, అదుపు చేయడం.. ఎవరి బాధ్యత?
తెలివున్న జీవిగా.. ఆలోచించగలిగే సామర్థ్యం కలిగిన మనిషిగా..
మాటలతో భావాలని, అభిప్రాయాలని వ్యక్తం
చేయగలిగే మనమేగా.. ప్రకృతి పరిరక్షకులం..!
నిజానికి.. ప్రకృతి వినాశనానికి మనిషే కారణం!
మనిషి తన స్వార్థం కోసం ఎలాంటి పనైనా
చేయడానికి సిద్ధపడుతుండగా..
నేడు..
అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం,
సారవంతమైన భూములు తరుగుదల.. వంటి
అనేక సమస్యలతో ప్రతి దేశం..
పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చలేక..
ఏమి చేయాలో తేల్చుకోలేని..
నిస్సహాయ స్థితిలో.. నిరీక్షిస్తున్నది!
కాని ప్రకృతి సంరక్షణ.. ప్రభుత్వాల బాధ్యతే కాదు..
ప్రతి ఒక్కరి బాధ్యత కూడా!
మనం సుఖంగా జీవించాలన్నా, మన భవిష్యత్ తరాల
జీవితాలు ఆనందంగా సాగాలన్నా..
ప్రకృతి సమతుల్యత కాపాడాల్సిన అవసరం.. మనందరిది!
ఇకనైనా మేల్కొందాం.. మెరుగైన ఆచరణని అవలంబిద్దాం!
మనతో పాటు భూమిపై వున్న
ప్రతి జీవి సౌఖ్యంగా జీవించేలా..
ప్రకృతి వనరులను కాపాడుకుందాం!