Site icon Sanchika

ప్రకృతి సౌందర్యాల పుట్టిల్లు న్యూజీలాండ్-1

ప్రకృతి సౌందర్యాల పుట్టిల్లు న్యూజీలాండ్-1

[ఈ మధ్యనే ముగించిన న్యూజీలాండ్ విహార యాత్రలోంచి కొన్ని విశేషాలు అందిస్తున్నారు శ్రీమతి శారద (బ్రిస్బేన్).]

న్యూజీలాండ్‌ – ఆస్ట్రేలియా ఖండానికి ఆగ్నేయ దిక్కున వున్న చిన్న ద్వీపం. మొత్తం జనాభా ఐదు మిల్లియన్లు (యాభై లక్షలు). తెలుగు సినిమాలు క్రమం తప్పకుండా చూసేవారందరికీ చిరపరిచితమైన లాండ్‌స్కేప్! పోయినంత దూరం ఆకు పచ్చటి చీర కట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్న సౌందర్యవతి లాంటి కొండలూ, గుట్టలూ, తటాకాలూ, భూగర్భంలోంచి తన్నుకుంటూ పైకొచ్చే వేడి నీరూ, పొగలూ, మావొరీ తెగలూ, ఆసక్తి కరమైన చరిత్రా, విశేషాలు చాలానే వున్నాయి. అణువు స్వరూపాన్ని సరిగ్గా వివరించిన నొబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ న్యూజీలాండ్ దేశస్థుడే.

ఆస్ట్రేలియాకి తూర్పున వున్న వెయ్యికి పైగా చిన్న చిన్న ద్వీపాలని మొత్తంగా ‘పోలినేషియా’ అని పిలుస్తారు. వీటిలో న్యూజీలాండ్ ఒకటి. దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం పోలినేషియన్లు న్యూజీలాండ్‌లో స్థిరపడ్డారు. వీళ్ళే తరవాత మాయొరీ సంస్కృతి స్థాపించారు. వీళ్ళని కివీలని కూడా పిలుస్తారు.

పద్దెనిమిదో శతాబ్దం నుంచి న్యూజీలాండ్ ఆస్ట్రేలియాలాగే యూరోపియన్లూ, ఆంగ్లేయుల పాలనలోకెళ్ళింది. అయితే, ఆంగ్లేయులు స్థానిక మాయోరీ తెగల సంస్కృతిని గౌరవించి పరిరక్షించారు. పక్క ఖండంలో ఎబోరిజీన్లు ఊచకోతకి గురయి, వాళ్ళ భాషా సంస్కృతులన్నీ నేలమట్టమై పోతూ వుంటే, న్యూజీలాండ్‌లో కివీల సంస్కృతీ, మాయోరీ జీవిత విధానమూ పరిరక్షించబడ్డాయి.

న్యూజీలాండ్‌లోని ప్రదేశాలకూ, వీధులకూ వూళ్ళకీ అన్ని మాయొరీ భాషల్లోనే వుంటాయి. ‘ఆక్‌లాండ్’, ‘వెలింగ్‌టన్’, ‘క్రైస్ట్ చర్చ్’, ‘హామిల్టన్’ లాటి ఆంగ్ల పేరున్న పెద్ద నగరాలతోపాటు, ‘రోటోరువా’, ‘టాపౌ’, లాటి కివీ పేర్లున్న పల్లెలూ వుంటాయి.

మాయొరి ప్రజలూ, జీవన విధానమూ

చిన్నప్పుడు స్కూల్లో మాయొరీ తెగల గురించి చదువుకున్నాం. మాయోరీ వూళ్ళలో భూగర్భంలోంచి వేడి నీళ్ళు పైకొస్తాయనీ, ఆ నీళ్ళతో స్నానాలూ, వంట పనులూ చేసుకుంటారని చదివి నమ్మలేకపోవడం నాకింకా బాగా గుర్తుంది. న్యూజీలాండ్ విహారయాత్ర అనగానే అదే ముందు గుర్తొచ్చింది. నిజంగా పుస్తకాల్లో చదవడంకంటే చూస్తూవుంటే ఇంకా వింతగా అనిపించినమాట నిజమే.

న్యూజీలాండ్ ‘నార్త్ ఐలాండ్’, ‘సౌత్ ఐలాండ్’ అనే రెండు ద్వీపాల సముదాయం. ఆక్లాండ్ నార్త్ ఐలాండ్‌లోని ఒక పెద్ద మెట్రోపాలిటన్ నగరం. మేముండే బ్రిస్బేన్ నగరానికి ఆక్‌లాండ్ నగరం దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరం, మూడు గంటల విమాన ప్రయాణం. ఒకటిన్నర మిలియన్ల (15 లక్షలు) జనాభాతో ఆక్లాండ్ చాలా సుందరమైన నగరం. ఆక్లాండ్‌కి దక్షిణాన దాదాపు రెండొందల యాభై కిలోమీటర్ల దూరాన రోటోరువా అనే చిన్న పల్లెటూరుంది.

రోటోరువా చాలా పెద్ద పర్యాటక ప్రదేశం. ఈ టౌనుని ‘సల్ఫర్ సిటీ’ అని కూడా పిలుస్తారు. భూగర్భ జలాశయాలు హైడ్రొజన్ సల్ఫైడ్‌తో నిండి వుండడంతో, గాలంతా సల్ఫర్ వాసనతో నిండి వుంటుంది. అంత చిన్న పల్లెటూళ్ళో మంచి మంచి భారతీయ రెస్టారెంట్లు వున్నాయి. రోటోరువాని ఆనుకొని ‘వాఖా-రెవా-రెవా’ అనే మాయొరీ పల్లెటూరుంది. ఈ పల్లెటూరులో నివసించే ప్రజల జీవితాన్ని సందర్శకులు దగ్గరనుంచి చూడొచ్చు.

ప్రపంచంలోని అన్ని ప్రాచీన సంస్కృతుల్లాటిదే మాయొరీ ప్రజల సంస్కృతి. ప్రకృతితో మమేకమై బ్రతకడం, పెద్దల పట్ల గౌరవం, కథలూ, సాహిత్యం ద్వారా తమ మతాన్నీ, నమ్మకాలనీ నిలబెట్టుకోవడం, లలిత కళలూ, ఇలా చాలా విషయాల్లో ఆస్ట్రేలియన్ ఎబోరిజీన్ల సంస్కృతినీ, మన భారతీయ సంస్కృతినీ పోలి వుంటుంది.

ఊళ్ళల్లో జీవనమూ, కట్టుబాట్లూ చాలా విషయాల్లో మన పల్లెటూళ్ళని జ్ఞాపకం చేస్తాయి. ఊరికి నడిబొడ్డున ఒక పెద్ద దేవాలయం లాంటి కట్టడం వుంటుంది. తెగల మధ్య యుద్ధాలైనా, చిన్న చిన్న దెబ్బలాటలైనా ఈ గుడి ముందే పరిష్కరించుకుంటారు. ఈ కట్టడంలోకి వెళ్ళేటప్పుడు తెగల నాయకుడు మినహా అందరూ తమ తమ చెప్పులు వదిలేయాలి. ఇది కేవలం కట్టడం మాత్రమే కాదు, తమ పూర్వీకుల ఆత్మలు నింపుకున్న శరీరం అని వీరి భావన. అందుకే ఈ కట్టడాన్ని ఎంతో గౌరవిస్తారు.

ఇద్దరు వ్యక్తులు కలుసుకోగానే పలకరింపుగా ఒకరినొకరు ముక్కులతో రాసుకుంటారు. దీన్ని ‘హోంగీ’ అంటారు. కొరొనా సమయంలో చాలా ఇబ్బంది పడ్డారట మాయొరీ ప్రజలు. ఈ పలకరింపుతో వారు ఎదుటి వ్యక్తిని మొత్తంగా అంగీకరించినట్టు. ఈ పలకరింపు చర్య చాలా పవిత్రమైనదని భావిస్తారు వీళ్ళు. మాయొరీ ప్రజలు చేసే బృంద నృత్యాన్ని ‘హకా’ నృత్యమంటారు. సాధారణంగా కొన్ని న్యూజీలాండ్ క్రీడాజట్లు ఆట ముందు ఈ నృత్యం చేస్తారు. మాయోరీ ప్రజలందరూ మొహాల మీద అందమైన పచ్చబొట్లు పొడిపించుకుంటారు. ఈ కళని ‘టామోకో’ అంటారు.

ప్రతీ ఇంటి ముందూ, నడిచే వీధుల్లో, కూడలిలో చెక్కతో చేసిన బొమ్మలలాంటి విగ్రహాలుంటాయి. ఈ బొమ్మలు చాలా మార్మికంగా, నిగూఢంగా, చెప్పలేనంత అందంగా వుంటాయి. బొమ్మల్లో మానవుడికీ, ఆ పైన అతన్ని రక్షించే శక్తులకీ ప్రతీకలు వుంటాయి.

మాయొరీ ప్రజల భాషను (దీన్నే కివీ భాష అని కూడా అంటారు).

బళ్ళల్లోనే కాదు, యూనివర్సిటీల్లోనూ బోధిస్తారు. ప్రాథమిక విద్యా బోధన కూడా కివీలో నేర్చుకునే వీలుంది. మాయొరీ ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ జీవితాల గురించీ, చరిత్ర గురించీ చెప్పుకోవడానికి ఇంకా చాలా విషయాలున్నాయి. అది పూర్తిగా ఇంకో వ్యాసమవుతుంది.

ఎబోరిజీన్లలా అంతరించిపోకుండా మాయొరీ ప్రజలూ, వలస వచ్చిన యూరోపియన్లూ కలిసిపోయి ఒక కొత్త సంస్కృతిని స్థాపించడం ఎంతైనా ముదావహం.

(ఇంకా ఉంది)

Exit mobile version