ప్రకృతి సౌందర్యాల పుట్టిల్లు న్యూజీలాండ్-3

0
2

[ఈ మధ్యనే ముగించిన న్యూజీలాండ్ విహార యాత్రలోంచి కొన్ని విశేషాలు అందిస్తున్నారు శ్రీమతి శారద (బ్రిస్బేన్).]

లార్డ్ ఆఫ్ ది రింగ్స్ స్టూడియో

[dropcap]న్యూ[/dropcap]జీలాండ్ అనగానే అందరికీ స్ఫురించేది ప్రకృతి సౌందర్యంతోపాటు ఇంకోటుంది. అదే, హాబింటన్ సినిమా సెట్టు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సినిమా గురించి సినిమా ప్రియులకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముప్ఫై ఆస్కార్ నామినేషన్లతో, పదిహేడు గెలుచుకున్న ఆస్కార్ అవార్డులతో ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక నక్షత్రం – లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రావళి.

ఇంతవరకూ ఈ వరసలో మూడు సినిమాలొచ్చాయి – ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ (2001), ది టూ టవర్స్ (2002), ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ (2003).

మిడిల్ ఎర్త్ అనే ఊహా ప్రపంచంలో నివసించే హాబిట్స్ అనే జాతి ప్రజలకు చెందిన ఫ్రోడో బాగిన్స్ అనే యువకుని సాహస యాత్రలే ది లార్డ్ ఆఫ్ రింగ్స్ కథ. నూట యాభై మిల్లియన్లకి పైగా అమ్ముడుపోయిన ఈ బృహన్నవలని జె.ఆర్.డి.టొల్‌కీన్ అనే బ్రిటిష్ రచయిత 1937 నుంచి 1949 వరకూ వ్రాసాడు.

అత్యంత ప్రజాదరణ పొందిన ఈ పుస్తకాన్ని సినిమాగా పీటర్ జాక్సన్ దర్శకత్వంలో నిర్మించారు. ఆ చిత్రానికి కావాల్సిన లొకేషన్ కోసం వెతుకుతూ వుండగా హెలికాప్టర్ లోంచి ఈ ప్రదేశం చూసి, ఇంటి తలుపు తట్టి సంప్రదింపులు మొదలు పెట్టారట.

పన్నెండొందల ఎకరాల ఈ పొలాన్ని ఎలెక్సాండర్ అనే కుటుంబం కొనుక్కుని 1978లో స్థిరపడ్డారు. 1998లో పధ్నాలుగు ఎకరాలల్లో ది లార్డ్ ఆఫ్ రింగ్స్ చిత్రీకరణకోసం స్టూడియో సెట్లూ, హాబిటన్ ఇళ్ళూ నిర్మించబడ్డాయి. చిత్రీకరణలు ముగిసి ఇప్పుడీ స్టూడియో పర్యాటక కేంద్రంగా మారింది.

ఈ సెట్లలో చిత్ర నాయకుడు ఫ్రోడొ, అతని స్నేహితుడు గాండాల్ఫ్ నివాసాలు లాటివి కనిపిస్తాయి. అయితే విచిత్రమేమిటంటే, అవన్నీ కేవలం ఇంటి ముఖ ద్వారాలు. ఇంటి లోపల జరగాల్సిన సన్నివేశాలన్నీ వెల్లింగ్టన్‌లోని స్టూడియోల్లో షూట్ చేసారు.

ఈ పైన చిత్రంలో అన్నిటికంటే ఎత్తు మీదున్న చెట్టు కృత్రిమమైనదంటే నమ్మలేం. చిత్రీకరణలో కంటిన్యూటీ కోసం ఈ కృత్రిమైన వృక్షాన్ని నిర్మించారట.

సెట్ టూర్ ముగిసిన తరవాత హోబిట్ ప్రజలు వెళ్ళే ‘గ్రీన్ డ్రాగన్ ఇన్’ సెట్టు లో పర్యాటకులకు పానీయాలు కూడా ఇస్తారు.

దేవుడు సృష్టించినంత కాకపోయినా, మనిషీ తక్కువేమీ కాదని అనిపించింది హాబిటన్ స్టూడియో చూస్తే!

హాబిటన్ ఆక్‌లాండ్‌కి పెద్ద దూరం ఏమీ కాదు. అయితే, ఆక్‌లాండ్ విమానాశ్రయం దగ్గర కానీ, రోడ్‌ల పైన కానీ హాబిటన్ గురించిన ప్రచారం ఏమీ కనిపించదు. హాబిటన్‌కి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో కానీ మాకు హాబిటన్ గురించిన మొదటి ప్రకటన కనిపించలేదు. చాలా ఆశ్చర్యపోయాము. ఇదే అమెరికాలోనైనేతే ప్రచార ప్రకటనలతో హోరెత్తిపోయేది కదా, అనుకున్నాను.

ఇవన్నీ న్యూజీలాండ్‌లోని నార్త్ ఐలాండ్ లోని విశేషాలు. సౌత్ ఐలాండ్ కూడా ఇంతే అందంగా వుంటుందనీ, అక్కడా చూడాల్సిన విశేషాలు చాలానే వున్నాయనీ విన్నాను. వీలైతే అక్కడికీ వెళ్ళి చూడాలి.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here