[dropcap]శ్రీ[/dropcap]మతి వి. నాగరాజ్యలక్ష్మి “ప్రకృతి విలాసం” పేరుతో రచించిన ఈ పుస్తకంలో – మన పుణ్యనదులు, పకృతి విలాసం, వనితా వైభవం, మాతృదేవోభవ, దేవీవిజయం అనే ఐదు రూపకాలు ఉన్నాయి. “ప్రకృతి విలాసం” ఆరు ఋతువులు పర్యావరణ పరిరక్షణ ప్రధానంగా తమ వైభవాలను ఆవిష్కరించిన రూపకం.
***
“జయదేవుడు తన గీతగోవిందంలో లలిత కళను గురించి ప్రస్తావిస్తూ “యది విలాస కళాసు కుతూహలం” అన్నాడు. లలితకళలో ఉండే మనోహరత్వాన్ని మొత్తాన్ని సారాంశంగా స్వీకరించే విలాస పదంతో ఈ కావ్యం పేరు ఉండటం చాల బాగుంది. ప్రకృతి పదం కూడా వేదాంతంలో స్త్రీ పర్యాయంగానే ప్రయోగించబడింది. స్త్రీ పాత్రలతో మాత్రమే కూడి ప్రకృతి సంబంధమైన ఇతివృత్తాలతో మనోజ్ఞ వర్ణనలతో పర్యావరణ పరిరక్షణ అనే సమాజ ప్రయోజనాన్ని ఉద్దేశించి రూపొందించబడిన ఈ పంచరూపక సమాహారం అందరు పాఠకులకు ముఖ్యంగా మహిళలకు సమాదరణీయమౌతుందని నా ప్రగాఢ విశ్వాసం” అన్నారు నందివెలుగు ముక్తేశ్వరరావు గారు తమ ముందుమాటలో,
* * *
“డా. వి. నాగరాజ్యలక్ష్మి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తన రూపకాల ద్వారా జనులకు అందిస్తూ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పంచిపెడుతున్నందుకు ఆనందపడుతూ అభినందిస్తున్నాను. ప్రజలను చైతన్యవంతులుగా చేయగల శక్తిమంతమైన రచన చేయటంతో పాటు సమర్థంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్న డా. వి. నాగరాజ్యలక్ష్మిని మనసారా అభినందిస్తూ మరిన్ని రూపకాలను రూపొందించి ప్రదర్శించగలరని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను” అన్నారు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు తమ ముందుమాట “రూపక రాజ్యం”లో.
* * *
“పురాణం, సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శాస్త్రం అనే పంచప్రాణాలతో ఓతప్రోతమైయున్న ఈ గ్రంథాన్ని చదివిన వారు పునరాలోచనలో పడతారు. సంప్రదాయ సాహితీ మార్గంలో రచనా శిల్పం పాటించాలని పరిశ్రమించే కొత్తవారు దీనిని కరదీపికగా స్వీకరిస్తారు” అని వ్యాఖ్యానించారు డా. ఆశావాది ప్రకాశరావు తన ముందుమాట “బహుళార్థ సాధక దీపశిఖ”లో.
* * *
ప్రకృతి విలాసం
రచన: డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి
పుటలు: 158 (20+138)
వెల: రూ.125/-
ప్రాప్తిస్థానం:
డా. వి. నాగరాజ్యలక్ష్మి, ఫ్లాట్ నెం. 301, రామన్న టవర్స్, 1వ లైను, రామన్నపేట, గుంటూరు – 522007. ఫోన్: 9394113848