Site icon Sanchika

ప్రకృతిలో పర్యటన

[పశ్చిమ కనుమలోని ప్రాంతాలలో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు శ్రీ షేక్ అమీర్ బాష.]

పశ్చిమ కనుమలు

మనిషి తన కష్టాలను, ఐహిక సుఖాలను, సమస్యలను మరచిపోయి సేద తీరగలిగేది ఒక్క తల్లి ఒడిలోనే. తల్లి తరువాత అంతటి ఆనందకరమైన అనుభవాన్ని పొందగలిగేది ప్రకృతి ఒడిలో.

ప్రకృతి అందాలను శోధించాలని ఆ అనుభవాలను పొందాలని నేను కుటుంబ సమేతంగా పడమటి కనుమలకు ప్రయాణమైనాను.

తెల్లవారుజామున మూడు గంటలకు బెంగుళూరు నుండి నుండి బయలుదేరి బేలూరు, హాసన్ మార్గం గుండా కారులో వెళ్ళాము. బాలే ఉన్నూరు గ్రామం నుండి దట్టమైన అడవితో కూడిన ఘాట్ రోడ్‌లో దాదాపు 6 గంటలసేపు మా ప్రయాణం సాగింది. ముందుగా ‘కుదురేముక్’ జాతీయ అడవులు చేరుకున్నాం. ఈ అడవిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో వారు గుర్తించారు.

సంసే పర్వతం అనేది దీని చారిత్రాత్మక నామం. ఈ పర్వతం సముద్ర మట్టానికి దాదాపు1894 మీటర్ల ఎత్తులో ఉంది. పడమటి కనుమల్లో ఎత్తైన పర్వతం కుదురేముక్. ఆకాశాన్ని అoటుకునే మహావృక్షాలు, వెలుగు కూడా జొరపడని పొదలు, రంగురంగుల అడవి పూలు, చల్లటి స్వచ్ఛమైన గాలి ఇక్కడి సంపదలు. పక్షుల కిలకిలారావాలు, అప్పుడప్పుడు వినిపించే వన్య మృగాల అరుపులు మాకు ఓ విధమైన థ్రిల్ కలుగజేసాయి.

దారి పొడవునా అక్కడక్కడ కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు పాటు చేసిన వ్యూ పాయింట్స్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించవచ్చు. ఆహ్లాదకరమైన ఈ ప్రదేశంలో తుంగా నది ఒడ్డున శృంగేరి వద్ద ఆదిశంకరాచార్యులు స్థాపించిన శారద పీఠాన్ని కూడా దర్శించాము.

విద్యాశంకర ఆలయం

ఇక్కడి ఆలయాల్లో శారదా దేవి మందిరం, విద్యాశంకర ఆలయం ముఖ్యమైనవి. విద్యాశంకర ఆలయాన్ని క్రీస్తుశకము 1338లో చోళ ద్రవిడ వాస్తు కళతో విజయనగర రాజులు నిర్మించినారని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడికి దగ్గరలో ‘కిగ్గా’ అనే ఊర్లో రుశ్యశృంగ మహర్షి ఆలయం ఉన్నది ఇది అత్యంత పురాతనమైనదే కాక చాలా విశేషమైనది.

‘సిరిమనే’ జలపాతం

అనంతరం కిగ్గా నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సిరిమనే’ జలపాతానికి వెళ్ళాము. ఎత్తయిన రాతి కొండల పైనుంచి జాలువారే జలపాతాన్ని వర్ణించడం అలవి కాదు. ఈ ప్రాంతంలోని కాఫీ తోటల సాగుకు ఈ నీళ్ళని ఉపయోగిస్తారు.

అక్కడ స్నానాదులు ముగించుకుని ఎన్నో మలుపులు ఉన్న ‘చార్మురి ఘాట్’ రోడ్డుపై ప్రయాణించి కుక్కి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించాము. ఈ ఆలయంలో సర్ప దోష నివారణ పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి.

ఇక్కడి నుంచి ‘సోమేశ్వర వైల్డ్ లైఫ్ శ్యాంచురీ’ ద్వారా ప్రయాణించి ‘హోరనాడు’ చేరుకున్నాం.

దారి పొడవునా కనిపించే జలపాతాలు, గలగల పారే సెలయేళ్లు, పచ్చటి లోయలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అక్కడక్కడ పచ్చటి గడ్డి మొలచిన చదునైన ప్రదేశాల్లో అడవి దున్నలు, జింకలు వంటి జంతువులు కనిపిస్తాయి. ఇక్కడి నేచర్ రిసార్ట్‌లో ఓ జలపాతానికి చేరువలో ఉన్న ఓ గదిలో రాత్రి మా బస. భోజనాల అనంతరం గది బయట చలిమంట వేసుకొని జలపాత హోరును, రాత్రిపూట తిరుగాడే పక్షుల, జంతువుల కూతలు వింటూ అర్ధరాత్రి వరకు గడిపాము.

హోరనాడులో విశిష్టమైన శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే దేవిని దర్శించుకున్నాము. అక్కడ నుంచి దాదాపు 3 గంటలు ప్రయాణించి ‘ధర్మస్థల’ చేరుకున్నాము. 90 కిలోమీటర్ల ఉన్న దారి పొడవునా కాఫీ తోటలు, రబ్బరు తోటలు, తేయాకు తోటలు పర్యాటకులను అలరిస్తాయి. కాశీ క్షేత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల మంజునాథ స్వామి క్షేత్రానికి అంత ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు వేల కొలది భక్తులు వచ్చి మంజునాధేశ్వరుని దర్శించుకుంటుంటారు.

దైవదర్శనానంతరము ఇక్కడి నుండి నాలుగు గంటలు ప్రయాణం చేసి ఆగుంబే ఘాట్ చేరుకున్నాము. ఇది మా ముఖ్యమైన పర్యాటక స్థలము. ఇక్కడ ప్రభుత్వ అరణ్యశాఖ వారు దట్టమైన అరణ్యము లోపల సీతా నది ఒడ్డున కాటేజులు నిర్వహిస్తున్నారు. అక్కడే రెండు రోజులపాటు బస ఏర్పాటు చేసుకున్నాము. ఆగుంబెను దక్షిణాది చిరపుంజి అంటారు. ఎందుకంటే ఇక్కడ అధిక వర్షపాతం ఉంటుంది. విషపూరితమైన నల్ల త్రాచు, నాగుపాము తదితర సర్పాలకు ప్రసిద్ధి ఈ ప్రాంతము.

ఇక్కడి కొండల్లో సూర్యాస్తమయం చూడడం ఓ వింతైన అనుభవం. అస్తమించే సూర్యుడి అందాలు చూడటానికి ప్రతిరోజు వందల కొలది పర్యాటకులు వస్తుంటారు. ఉదయాన్నే అటవీ శాఖ గార్డు మమ్మల్ని రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన తీసుకెళ్తారు. తరువాత తెప్పలలో నదీ పర్యటన ఉంటుంది.

అరుదైన వన్య ప్రాణుల్ని పక్షులను చూస్తూ సాయంత్రం వరకు గడపవచ్చు. అరుదైన మలబారు ఉడుతలు చెట్లపై ఆడుతూ ఉంటాయి చెట్ల కింద భాగంలో కోతులు, కొండముచ్చులు తిరుగాడుతుంటాయి. లయన్ ట యిల్ మజాక్ అనబడే కోతులను ఇక్కడే చూడవచ్చు.

   

సూర్యోదయ వేళ మరో వింత అనుభూతి ఏమిటంటే మేము బస చేసిన కాటేజీ ముందే ఆవరణలో నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తూ ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. వీటికి తోడు అందంగా తిరుగుతూ ఎగురుతూ ఉండే అడవి కోళ్ళను, అడవి పావురాలను చూశాము.

రెండవ రోజు అటవీ శాఖ వారు మమ్మల్ని చుట్టుపక్కల ఉన్న జలపాతాలకు తీసుకెళ్లారు. కొన్ని వన్యమృగాలని దూరం నుంచి చూసే వీలు కల్పిస్తారు. పర్యాటకుల కోసం అటవీ శాఖ వారు రాత్రి పూట ఫైర్ క్యాంపులు, జంతువులకు సంబంధించిన సినిమాలు చూపించడం నిర్వహిస్తారు. ఈ సినిమాల ద్వారా అడవుల, వన్య ప్రాణుల పరిరక్షణ పై మంచి అవగాహన కలుగుతుంది.

పర్యాటకులకు వీళ్లు సమకూర్చే భోజనాలు, ఫలహారాలు చాలా రుచిగా చేస్తారు. పట్టణాలకు దూరంగా అడవుల్లో ప్రకృతిలో లీనమై కొన్ని రోజులు గడపడం చాలా అదృష్టం. అంతే గాక మరిచిపోలేని మధురమైన అనుభవం కూడా.

అలా నాలుగు రోజులపాటు ప్రకృతి ఒడిలో లీనమై, సేద తీరి, తిరుగు ప్రయాణం అయ్యాము.

Exit mobile version