[dropcap]క[/dropcap]విగా, రచయితగా, కార్టూనిస్టుగా ప్రసిద్ధులైన శ్రీ చెన్నూరి సుదర్శన్ బాలబాలికల కోసం రచించిన కథలలో రూపొందించిన పుస్తకం ‘ప్రకృతిమాత’. ఇందులో 15 కథలున్నాయి. స్వయంగా చిత్రకారులైన సుదర్శన్ ఆయా కథలకు చక్కని బొమ్మలు గీశారు. పుస్తకానికి అందమైన ముఖచిత్రాన్ని అందించారు.
“ప్రతి కథలో తాను చెప్పదలచుకున్న దానిని తనదైన శైలిలో చెప్పడం చెన్నూరి వారికి బాగా తెలిసిన విద్య. పిల్లల కోసం రాసిన ఈ కథలు విలక్షణమైనవని నా భావన. బాలల కోసం అందరూ రాయలేరు. బాలల మనస్సున్న వారే రాయగలుగుతారు. అది సుదర్శన్ గారికి ఉంది.” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు శ్రీ పత్తిపాక మోహన్.
~
బజారుకి వచ్చి జామపళ్లు బేరమాడి, చవగ్గా వస్తాయని ఓ జామతోటకి వెళ్తాడు నిఖిల్. తోట యజమాని తన మనవడిలా ఉన్న నిఖిల్‍ని చూసి ముచ్చటపడి, జామకాయలు ఉచితంగా ఇస్తానంటాడు. అత్యాశకు పోయిన నిఖిల్ చెట్టెక్కి పళ్ళు కోస్తూ కిందపడి దెబ్బలు తగిలించుకుని, ఆస్పత్రి పాలవుతాడు. మనిషికి ఆశ ఉండవచ్చు కానీ, అత్యాశ తగదని, దాని వల్ల ప్రమాదాలు ఎదురవుతాయని తెలుసుకుంటాడు నిఖిల్ ‘అత్యాశ’ కథలో.
తన నేస్తం స్కూలు ఫీజు కోసం తన వెండి మొలతాడు అమ్మేస్తాడు సంజీవ్. మనవడు చేసిన పనికి మొదట కోపగించుకున్నా, తరువాత సంతోషిస్తుంది నానమ్మ. అయితే ఆ వెండి మొలతాడును కొన్న సోమయ్యలో మార్పు వచ్చి తన తప్పును అంగీకరించి ఆ మొలతాడుని తిరిగి ఇచ్చేస్తాడు ‘అయాచితం’ కథలో.
తెలంగాణలో వ్యాప్తిలో ఉన్న ఒక జాతీయం ఆధారంగా అందించిన కథ ‘దండెకొట్టు’. సాధారణంగా మోసం చేయడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అయితే కథలో మాత్రం వీరేశం అనే కుర్రాడు తన తండ్రి సూచనని అనుసరించి – రాజభటుల నుంచి తెలివిగా తప్పించుకుని – ప్రమాదం నుంచి బయటపడతాడు.
ధవళదేశాన్ని ధర్మబద్ధంగా పాలించే ధర్మతేజకు ఓ చిక్కు సమస్య ఎదురవుతుంది. రాజకుమారుడు రామతేజపై విషప్రయోగం జరిగి అతని ఆరోగ్యం క్షీణిస్తుంది. రాజు ఎంత ప్రయత్నించినా విషప్రయోగం ఎవరో చేశారో కనిపెట్టలేకపోతాడు. చివరికి ఓ ముని ఇచ్చిన దర్పణంతో ఆ రహస్యాన్ని ఛేదిస్తాడు ‘ధర్మపాలన’ కథలో. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ మన బాధ్యతలు మరువకూడదని ఈ కథ సూచిస్తుంది.
తన విద్యార్థి చేసిన తొందరపడి, తెలిసీ తెలియక చేసిన తప్పుని – ఆ అబ్బాయి మీద నింద పడకుండా – నేర్పుగా సరిదిద్దిన ఉపాధ్యాయురాలి కథ ‘ఇంద్రజాలం’. విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయులు నిరంతరం ఒక కంట కనిపెడుతూండాలని ఈ కథ చెబుతుంది.
కొందరు పిల్లలకు పరీక్షలలో మార్కులు ఎందుకు తక్కువ వస్తాయో, అసలు పాఠాలు ఎలా చదవాలో తెలిపే కథ ‘జ్ఞానోదయం’. పిల్లలు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలనే తల్లిదండ్రుల కలను సాకారం చేయాలంటే పిల్లలను భయపెట్టకుండా, కొట్టకుండా – చదువువైపు దృష్టి సారించేలా ఎలా చేయాలో ఈ కథలోని తల్లిదండ్రులు చెప్తారు.
ఒక ముని నేర్పిన చిన్న మాయ ద్వారా రెండు రాజ్యాల మధ్య శత్రుత్వాన్ని దూరం చేసి, స్నేహవారధి ఏర్పరుస్తాడు కుశలుడు అనే బాలుడు. అయితే తాను ఉపయోగించిన చిట్కా తాత్కాలికమేనని ఇద్దరు రాజులు వివేకంతో, విచక్షణతో మసలుకుంటే ఆ రాజ్యాల మధ్య శత్రుత్వం శాశ్వతంగా దూరమవుతుందని చెబుతాడు. ‘కుశల దేశం’ కథ ఆసక్తిగా చదివిస్తుంది.
మనుషులని హింసించి, వేడుక చూసే ఓ ఎలుగుబంటికి బుద్ధి చెప్పిన యువకుడి కథ ‘మరణభీతి’. చావు భయం మనుషులకైనా, జంతువులకైనా ఒకటేననీ, అనవసరంగా జీవ హింస చేయరాదని ఈ కథ సూచిస్తుంది.
తన క్లాసులోని విద్యార్థి ద్వారా అతని తల్లికి అక్షరజ్ఞానం కలిగించిన ఓ ఆదర్శ ఉపాధ్యాయిని కథ ‘వేలిముద్ర’. పట్టుదలతో ఆ విద్యార్థి తన తల్లికి అక్షరాలు నేర్పి వేలిముద్ర స్థానంలో సంతకం చేయించేలా ప్రేరణ ఇచ్చిన ఉపాధ్యాయిని ఎందరికో స్ఫూర్తిదాయకం.
తోటి పిల్లలతో స్నేహం చేసినట్టే ఓ కోతితోనూ స్నేహం చేస్తుంది గీత ‘స్వామి రా! రా!’ కథలో. గీత తన కన్నా కోతికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తోందని భ్రమపడిన మిత్రుడు రాజు అసూయ పెంచుకుంటాడు. ఒకసారి ఓ దొంగ గీత మెడలో గొలుసుని కాజేస్తే, రాజు చేయలేని సాయాన్ని ఆ కోతి చేస్తుంది. అప్పుడు తన తప్పుని తెలుసుకుంటాడు రాజు.
చిన్నప్పటి నిజం చెప్పమని పెంచిన తల్లి కోరిక మేరకు లింగన్న ఎప్పుడూ నిజాలే చెబుతాడు. సత్యం పలకడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కుంటాడు. అయినా అమ్మకిచ్చిన మాట మరువడు. కష్టాలను అనుభవిస్తూ కూడా సత్యానికే కట్టుబడి చివరికి మహారాజు ప్రశంసలకు పాత్రుడై రాజు వద్ద ఉద్యోగం పొందుతాడు ‘నిజలింగన్న’ కథలో.
తనకి జన్మనిచ్చిన కొద్ది రోజులకే మరణించిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకునే మార్గాన్ని ముని ద్వారా తెలుసుకున్న లోకేశ్వర్ – పర్యావరణాన్ని పరిరక్షించడానికి పూనుకుంటాడు ‘నేను సైతం’ కథలో.
ఓ బాలికకీ, ఓ తాతయ్యకి స్నేహం ఎలా కుదిరిందో ‘గడుసు అమ్మాయి’ కథ చెబుతుంది. కాస్త పొగరుగా ప్రవర్తించిన ఆ పాపలో తాతయ్య మార్పు వచ్చేలా ఏం చేసారో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.
గ్రంథాలయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పే కథ ‘ప్రతిభ’. చదువంటే కేవలం పాఠ్యపుస్తకాలే కాదు, ఆటపాటలు, సేవాగుణం, పరిసరాలు, ప్రకృతి పరిరక్షణ, పెద్దల పట్ల గౌరవం.. ఇవన్నీ అని తెలిపిన విద్యార్థి కథ ఇది.
గుడి లోని ప్రశాంతతని చూసి, తన ఊరిలో ఆ ప్రశాంతత లేకపోవడానికి కారణం గ్రహించిన ఓ విద్యార్థిని – తన ఉపాధ్యాయులతో, తోటి పిల్లలతో కలిసి – ఊరిలో మార్పు తీసుకువస్తుంది ‘ప్రకృతిమాత’ కథలో. ఉద్దేశం మంచిదైతే, ప్రజలలో చైతన్యం ఎలా వస్తుందో ఈ కథ చెబుతుంది. ప్రకృతిని మనం ప్రేమిస్తే, ప్రకృతి మనల్ని ప్రేమిస్తుందని ఈ కథ తెలుపుతుంది.
~
ప్రతీ కథ చివరనా మహనీయులు చెప్పిన నీతివాక్యాలను అందించడం బావుంది. కొన్ని కథల చివరన ఆయా కథలకు అనువైన కొటేషన్స్ ఉండడం ఆకర్షణీయగా ఉంది. కథాసారాన్ని ఆ సూక్తి సులువుగా వెల్లడిస్తుంది.
బాలల మనసులపై ప్రభావం చూపే కథలివి.
***
రచన: చెన్నూరి సుదర్శన్
ప్రచురణ: శోభ సాహితీ ప్రచురణలు
పేజీలు: 120 (110 + x)
వెల: ₹ 80/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు
~
చెన్నూరి సుదర్శన్
1-1-21/19, ప్లాట్ నెం. 5,
రోడ్ నెం.1, శ్రీ సాయి లక్ష్మి శోభా నిలయం,
రామ్ నరేష్ నగర్, హైదర్ నగర్,
హైదరాబాద్ 500085
చరవాణి: 94405 58748
~
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేయడానికి:
https://books.acchamgatelugu.com/product/prakruti-maata