Site icon Sanchika

ప్రక్షాళన

[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘ప్రక్షాళన’ అనే కవిత అందిస్తున్నాము.]


[dropcap]మం[/dropcap]చి నీళ్ళు వస్తున్నాయని
ఇల్లంతా నింపుకోం
కావల్సినంత పట్టుకుంటాం.
డబ్బయినా అంతే
ఆశల గుర్రాలపై దౌడు మానేసి
తృప్తి కళ్ళెంతో జీవనం సాగిస్తే
సంతృప్తి ప్రయాణం ప్రాప్తి.
పరిసరాల పరిశుభ్రత పాటిస్తాం
మనసు శుభ్రత మరచిపోతాం
కల్మషం కట్టలు కట్టలుగా పేర్చుతూ
కాలువలు కట్టిస్తాం.
అక్కర్లేని చెత్త తీసేసినట్లే
మది కాలుష్యం పారద్రోలటం
దినచర్యగా ప్రారంభిస్తే
శాంతి మనశ్శాంతీ నీ తోడే.
కళ్ళు రెండు, కాళ్ళు రెండు, చేతులు రెండు
నరాలు.. రక్త నాళాలు
అన్నీ.. అన్నీ.. ఒకటికి మించే
ఎన్నో.. ఎన్నెన్నో.. అన్నీ కలిసే
మరి మనిషిగా నువ్వెందుకు
ఒంటరి బ్రతుకు ఆస్వాదిస్తావ్?
నీ శరీరమే ఓ భగవద్గీత
‘మనమంతా ఒకటే’కి ప్రతీక
అనుసరించు! ఆచరించు.
‘మన’ వదిలి ‘మనం’తో సంచరించు
దేశ సమైక్యతకు చేతులు కలుపు!

Exit mobile version