సహృదయ విమర్శకుడు సన్నిధానం

0
3

[box type=’note’ fontsize=’16’] “ఇందులో 19 విమర్శా వ్యాసాలున్నాయి, అయిదు ఇంటర్వ్యూలున్నాయి, నాలుగు పుస్తక సమీక్షలు ఉన్నాయి” అంటూ ‘ప్రమేయ ఝరి’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కె.పి. అశోక్‌కుమార్. [/box]

[dropcap]స[/dropcap]న్నిధానం నరసింహశర్మ అంటే శ్రీ గౌతమి గ్రంథాలయంలో సేవ, అంకితభావాలతో పనిచేసిన గ్రంథపాలకుడిగానే తెలుసు. కాని ఆయనలో ఒక కవి, అన్వేషికుడు, విమర్శకుడు ఉన్నాడని చాలామందికి తెలియదు. వీరు గతంలొ తమ కవితా సంపుటాలను వెలువరించి యున్నారు. ఇప్పుడు “ప్రమేయ ఝరి” పేరిట తమ వ్యాససంకలనాన్ని తీసుకుని మన ముందుకు వచ్చారు. వాడుక భాషలో తేట తెలుగు గ్రంథాన్ని వెలువరించిన స్వామినేని ముద్దు నరసింహంగారు వ్యాసాలను ‘ప్రమేయాలు’ అనే పేరుతో రాశారట. అది నచ్చిన శర్మగారు, దాన్నే తమ గ్రంథ శీర్షికగా ఉపయోగించుకున్నారు. ఇందులో 19 విమర్శా వ్యాసాలున్నాయి, అయిదు ఇంటర్వ్యూలున్నాయి, నాలుగు పుస్తక సమీక్షలు ఉన్నాయి.

ఇందులో సాహిత్యం, జానపదం, కవులు, కవిత్వం, పత్రికలు, గ్రంథాలపై రాసిన విమర్శా వ్యాసాలున్నాయి. సహజంగా గ్రంథపాలకుడైన శర్మగారికి వివిధ గ్రంథాలయాల పట్ల గల శ్రద్ధాసక్తుల వల్ల వాటి మీద విశ్లేషణాత్మకమైన వ్యాసాలను రాయగలిగారు. ఇందులోని “తెలుగులో తొలి అచ్చు ముచ్చట” విదేశంలో ప్రారంభమయింది. బెంజమిన్ షుల్జ్‌ని తొలి తెలుగు ప్రచురణకర్తగా గుర్తించి, వారి గురించిన విషయాలను పరిశోధకుడు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు. 1719లొ మద్రాసుకు వచ్చిన బెంజమిన్ షుల్జ్ తమిళ, తెలుగు భాషలను అధ్యయనం చేయడంతో పాటు, ఆయా భాషల్లో పుస్తకాలు వెలువరించడానికి కృషి చేశారు. వారు “గ్రమేటికా తెలుగికా” పేరిట తెలుగు వ్యాకరణాన్ని రాశారు. జర్మన్ లూథరన్ తత్త్వవేత్త జోహాన్ ఆర్న్‌డ్ (1555-1621) రాసిన నాలుగు మత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. శర్మగారు కలకతా నుండి సిరాంపుర్ గ్రంథాలయానికి వెళ్ళి “నూరు జ్ఞాన వచనాలు” గ్రంథం నకళ్ళను తెచ్చి 2006 మార్చిలో రాజమండ్రి సెంటర్ ఫర్ సోషల్ చేంజ్ ద్వారా పునర్ముద్రింపజేశారు. తక్కిన గ్రంథాన్ని ఎలాగైనా సంపాదించి పునర్ముద్రించి, మన అచ్చు పరిణామ ప్రథమాధ్యాయాల్ని భావితరానికి అందజేయాలని భావించడాన్ని మనం అభినందించాల్సిందే.

స్వాతంత్ర్యోద్యమానికి, ప్రత్యేక రాష్ట్రోద్యమానికి, వయోజన విద్యకు గ్రంథాలయోద్యమం ఎంతగానో తోడ్పడింది. గ్రంథాలయోద్యమ నాయకులైనవారిలో కవి, పండిత, సాహితీవేత్తలు వుండడం వలన సాహిత్యపరంగా భాషాపరంగా ఎంతో మేలు జరిగింది. ఉద్యమానికి ‘గ్రంథాలయ సర్వస్వం’ పత్రిక చేసిన కృషిని వివరిస్తూ సాహిత్యపరంగా కూడా అది వెలుగొందిన విధానాన్ని, అందులోని రచనల గురించి తెలియజేశారు. అచ్చ తెనుగువాది పారేపల్లి రామచంద్రశాస్త్రి ‘గ్రంథాలయం’కు బదులుగా ‘పొత్తపు గుడి’ అనే పదబంధాన్ని ప్రచారంలోకి తీసుకురావడం విశేషమే.

సర్వజన గ్రంథాలయం, వసురాయ గ్రంథాలయం రెండు కలిసి 1920లో గౌతమి గ్రంథాలయంగా ఆవిర్బవించాయి. పుస్తక నిల్వలు  పెరగడం, శిథిల భవనం వల్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల పురజనుల కోర్కె మేరకు 1979లో గ్రంథాలయ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. అప్పటి నుండి అది శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయమయింది. లక్షకు పైగా వున్న పుస్తకాలలో అరుదైన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఇతర భాషా గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు, తామ్రశాసనాలు కూడా వీరి సేకరణలో ఉన్నాయంటూ “గౌతమి గ్రంథాలయ చరిత్ర -విశిష్టత”ను తెలియజేశారు. అలాగే శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం చరిత్రను, దాని గొప్పదనాన్ని పుస్తక నిల్వల గురించి వివరిస్తారు. దానిని “తెలంగాణ జాతీయ గ్రంథాలయం”గా మరింతగా వృద్ధి చేసుకోవలసిన అవసరాన్ని తెలియజేస్తారు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి నిర్వాహకుడిగా, గ్రంథాలయాధికారిగా పనిచేసిన యం.యల్. నరసింహారావు గొప్పదనాన్ని, జీవిత చరిత్రల రచయితగా వారి కృషిని ఇంకో వ్యాసంలో తెలియజేశారు.

కవిత్వానికి సంబంధించి నన్నయకు పూర్వమే తెలుగు పద్యం నడకలు ప్రారంభించింది. జానపద వాఙ్మయ ప్రేరణలు పొందింది. సంస్కృత ఛందస్సుల్నీ, దేశీయ ఛందస్సుల్నీ తనలో కలుపుకుని కొన్ని వందల యేండ్లు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్నది. వచన కవిత్వం ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత పద్యాలు రాయలేనివారు, వచనకవులు పద్యానికి కాలం చెల్లిందని వాదిస్తున్నారు. నిజానికి సుదీర్ఘ సమాసాలతో నిండే పద్యాలు వర్తమాన కాలానిని అవసరం లేదని పద్యకవులు చాలామంది గుర్తించారు. పద్యం ఒక రచనా ప్రక్రియ మాత్రమే. ఏ భావజాలాన్నయినా దానిలో ఒదిగించుకోవచ్చు. వేమన, త్రిపురనేని, నార్ల వంటి కవులు పద్యాల ద్వారా హేతువాద దృక్పథాన్ని ప్రచారం చేసిన తీరు మరవరాదు. పద్య రచన చేయాలనుకునే ఆధునిక యువకవులకు కందం, సీసం, ఆటవెలది, తేటగీతి, ద్విపద వంటి వాటిలో శిక్షణ ఇచ్చి ఏ భావాన్నైనా పలికించవచ్చని తెలపాలి. పద్యరచనా ప్రక్రియలు తెలుగువారివేననీ, ఒక ప్రక్రియ మరో ప్రక్రియపై ఆధిక్య ధోరణి కలిగి వుండదని నవతరానికి తెలపాలి. రచనా ప్రక్రియల్లో శతృత్వాలుండవని వాటిని పెంచేవారుంటే, ఆ మేధావుల విషయంలో జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తారు. ఇక కవిత్వంలో ఏ వాదానికి లొంగనివాళ్ళను మానవతావాద కవులుగా ముద్రవేయడం మామూలైపోయింది. చాలామంది భావిస్తున్నట్టు మానవతావాదం, మానవవాదం ఒకటికాదు. మానవత్వం ప్రధాన గుణం కరుణ. “ఆధునిక కవిత్వంలో మానవత్వపు విలువల” గురించిన తపనలు, కన్నీళ్ళ రచనలు, హృదయ స్పందనలు ఎలా వున్నాయో వివిధ కవుల కవితలను ఉదాహరణలుగా తీసుకుని వివరించారు. తెలుగు కవులకు గోదావరిని చూస్తే కవిత్వం పొంగి ప్రవహిస్తుంది. ఇందులో రకరకాల లోతులు, విభిన్న భావనలు, ప్రసక్తులు కొందరివి. భావుకతలు కొందరివి. అభివర్ణనలు కొందరివి. వీటన్నింటిని వివరిస్తూ రాసిన రెండు వ్యాసాలు ఆకట్టుకొంటాయి. ఇంకో వ్యాసంలో భావకవిత్వ ఆంతరంగిక తత్త్వావిష్కరణ దేవులపల్లి కృష్ణశాస్త్రి “కృష్ణపక్షం”లో ఎలా ఉందో విశ్లేషించి చూపారు.

సైన్సు కవిత్వం రాసే ఏకైక కవి కొత్తపల్లి సత్యనారాయణ. ఆయన కవితా సంపుటాల విశిష్టతను – ఆయన వ్యక్తిత్వాన్ని వివరించిన వ్యాసం ఒకటి. జానపద వాఙ్మయానికి విశేషమైన కృషి చేసిన నేదునూరి గంగాధరం పాండిత్య ప్రతిభను అతని జీవన వ్యక్తిత్వాలను, కృషిని, గొప్పదనాన్ని తెలియజేసే వ్యాసం మరొకటి. సంఘ సంస్కరణ, వాడుక భాష వంటి విషయాలలో సేవలు చేసి, ప్రసిద్ధి పొందవలసినంత ప్రసిద్ధి పొందని హితసూచని కర్త స్వామినేని ముద్దు నరసింహ నాయుడు గారు – సుప్రసిద్ధ చరిత్రమూర్తి, సంఘసంస్కర్త, కవి, రచయిత, పత్రికా సంపాదకుడిగా విశేషఖ్యాతి గడించిన కందుకూరి వారూ – గుప్తదాత, బ్రహ్మసమాజ సేవా ధురంధరులు, నిష్కళంక సంఘ సంస్కరణశీలి, మహా వక్త, మానవతావాది రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు – ఈ ముగ్గురు “తెలుగు నాట సంస్కరణ రంగంలో ఒక స్ఫూర్తిమూర్తిత్రయం”గా భావించుకుందామంటారు.

రచయిత అంతరంగాన్ని ఆవిష్కరించేలా పీఠికలు వుండాలి. రచయిత చెప్పలేని విషయాలను పీఠికాకర్త వెల్లడించగలగాలి. ఒకప్పుడు పండితులు, విషయ నిపుణులు పీఠికలు రాస్తే వాటికి విలువ వుండేది. ఈరోజు ఉన్నత పదవులలో వుండేవారితో, సాహిత్యం గురించి తెలియని ప్రముఖులతో లేదా మిత్రులతో పీఠికలు రాయించడం వల్ల అవన్నీ మొక్కుబడి పీఠికలుగా మారిపోతున్నాయి. “పీఠికలూ… పాఠకులూ” అనే వ్యాసంలో పీఠికల ప్రాశస్త్యాన్ని, పీఠికల పేరిట కొనసగే అవాంఛనీయ ధోరణులను తెలియజేశారు. శ్రీశ్రీని అభిమానించే అద్దేపల్లి రామమోహనరావు శ్రీశ్రీ కవిత్వాన్ని సంప్రదాయ విమర్శ పద్ధతిలో విశ్లేషించడాన్ని తర్వాత కాలంలో చాలామంది తప్పుబట్టారు. ఆయన రాసిన కాలానికి మార్క్సిస్టు విమర్శ ప్రాచుర్యంలోకి రాలేదు. వచన కవులు సాంప్రదాయ విమర్శ పరిధిలో ఒదగరు. కానీ శ్రీశ్రీ దానికి మినహాయింపు అని నిరూపిస్తూ అద్దేపల్లి “శ్రీశ్రీ కవితా ప్రస్థానం” రాశారు. ఈ పుస్తకానికి ముందుమాట విశ్వనాథతో వ్రాయించమని శ్రీశ్రీ కోరుకున్నది చాలామందికి తెలియదు. కాని అద్దేపల్లిని విశ్వనాథ భక్తుడిగా ఆడిపోసుకున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. “‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ రాసిన అనంతర కాలంలో నా లోపాలు కూడా నాకు స్పష్టంగా తెలిసాయి” అన్న అద్దేపల్లి నిజాయితీని ప్రశంసించాలి. చలం రాసిన ముందుమాటలోని అసంబద్ధతను అద్దేపల్లి ఖండించిన తీరును శర్మగారు ఈ వ్యాసంలో ఎత్తి చూపడం బాగుంది. ఈ పుస్తకం మీద వచ్చిన విమర్శా వ్యాసలన్నింటికంటే భిన్నంగా శర్మగారు రాసిన వ్రాసం డిఫరెంట్‌గా వుండి ఆకట్టుకుంటుంది. వ్యవహార భాషను అమలుపరచాలన్న ఉద్యమం వచ్చిన తర్వాత సాహిత్యమంతా వాడుక భాషలోకి మారిపోయింది. ఇప్పుడు పాఠ్యపుస్తకాలలో తప్ప గ్రాంథిక భాష ఎక్కడా కనిపించదు. కాని విశ్వవిద్యాలయాలోని తెలుగు శాఖలలో సిద్ధాంత గ్రంథాలను గ్రాంథికంలోనే రాయాలనే నిబంధన ఉండేది. అది తొలగిపోయిన తరువాత కూడా, కొద్దిమంది తమ పరిశోధనా గ్రంథాలను గ్రాంథికభాషలోనే సమర్పించడం, అచ్చువేయడం కూడా జరిగిపోయింది. వాటి వివరాలతో పాటు, గ్రాంథికంలో రాసిన సిద్ధాంత గ్రంథాలకు పీఠికాకర్తలు వాడుక భాషలో పీఠికలు రాసిన ఉదంతాలను కూడా సేకరించి శర్మగారు వ్యాసం రాశారు.

“నిరక్షరాస్యులంటూ  జానపదుల్ని, గిరిజనుల్ని కొట్టిపారేయకూడదు. వాళ్ళ దగ్గరున్న పాండిత్యాన్ని, వైద్యం తదితర శాఖల జ్ఞానాన్ని గుర్తించాలి. ఉపకులాల సంస్కృతి, పరికరాల్ని రక్షించుకోకపోతే జాతికే నష్టం” అంటూ ఆచార్య జయధీర్ తిరుమల గారు తెలంగాణ లోతట్టు జానపదాల్లో, గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కాలగతిలో నిర్లక్ష్యానికి గురయిన ఉపకులాల బతుకులు, కళల ప్రతిబింబాలను సేకరించారు. తమ నాలుగు దశాబ్దాల అన్వేషణ – సేకరణను మూడు రోజుల పాటు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని దళిత ఆదివాసీ అధ్యయన అనువాద కేంద్రంలో ప్రదర్శించారు. దీనివల్ల సమకాలీన సామాజిక సాంస్కృతిక అధ్యయనాలకు ఉపకులాల కళాఖండ వస్తు ప్రదర్శన దోహదం చేస్తుందని విజ్ఞుల అభిప్రాయం.

పాత పత్రికల్లో భాషా విషయంలో కనబరిచిన సృజనాత్మకత వివిధ ఉదాహరణలతో వివరించిన వ్యాసంలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నింటినో తెలియజేశారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి “ప్రబుద్ధాంధ్ర” పత్రిక ద్వారా ఒకవైపు భాషోద్యమం, మరో వైపు కథా రచనలు, ఇంకో వైపు ఆంధ్రత్వ ఉద్దీపనం – ముఖ్యంగా వాడుక భాష ద్వారా జ్ఞానవినిమయం, ప్రత్యేక రాష్ట్ర అవసర ప్రబోధం, చక్కని వచన రచన ఒక ఒరవడిగా ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ వ్యాసలన్నీ సమాచారాత్మకములు, విశ్లేషణాత్మకములు, విజ్ఞానదాయకములుగా ఉన్నాయి. ఏ విషయం తీసుకున్నా ఏదో ఒకటి కొత్తగా చెప్పాలన్న తపన కనబడుతుంది. వ్యక్తుల పట్ల ముఖ్యంగా కవుల పట్ల రాసిన వ్యాసాలలో ఆత్మీయత, ఆర్ద్రత కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. విస్పష్ట అధ్యయనం, నిశితమైన అవగాహన, విషయ పరిజ్ఞానం, సదసద్వివేచనలతో పాటు పరిశోధనా దృష్టి కలిగిన ఒక సహృదయ విమర్శకుడు ఈ వ్యాసాలలో కనిపిస్తాడు.

సన్నిధానం  నరసింహశర్మ చేసిన అయిదు ఇంటర్వ్యూలు ఇందులో ఉన్నాయి. జానపద సాహిత్యాన్ని మథించిన ఆచార్య జయధీర్ తిరుమలరావు – అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఎబికె ప్రసాద్ ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రభుత్వం చిత్తశుద్ధి గురించి – “నాది కొత్త త్రోవ నాది ఉపనిషన్మార్గం” అనే అనుమాండ్ల భూమయ్య వివరణలను వారి వారి ఇంటర్వ్యూలలో తెలియజేశారు. “దిగంబర కవిత్వోద్యమానికి కర్త, కర్మ, క్రియ నేనే” అని నగ్నముని తన ఇంటర్వ్యూలో చెప్పుకుంటే, నిఖిలేశ్వర్ తన ఇంటర్వ్యూలో “ఆ దిగంబరులారుగురూ కర్త, కర్మ, క్రియలే” అని ఖండించడం చూడవచ్చు. ఇంటర్వ్యూలలో ఆయా వ్యక్తుల నుండి విషయపరంగా కొత్త సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. పాఠకులకు వారి కృషి గురించి తెలియజేయడంతో పాటు వారి ప్రత్యేకతను వెల్లడించడం కూడా వీటిల్లో వుంది.

శర్మగారు విస్తృతంగా పుస్తకాలను సమీక్షించినప్పటికీ, అందులోంచి వ్యాసరూపంలో ఉన్న వాటిలో నుండి ఎంపిక చేసిన నాలుగు సమీక్షలను చివర చేర్చడం జరిగింది. గతంలో చాలా మంది విమర్శకులు దిగంబర కవిత్వాన్ని ఒకటో రెండో కోణాల్నుండి చూస్తే, జూపల్లి ప్రేమ్‌చంద్ ముఖ్యమైన కోణాలన్నింటిని పరిశీలించి, కొత్త అంశాలను వెలికి తీశారని ప్రశంసించారు. జయధీర్ తిరుమలరావు “తొవ్వ ముచ్చట్లు” జన సాంస్కృతిక కళా మూలాల ఉద్ధరణలుగా, ప్రజాప్రయోజనదాయకంగా ఉన్నాయంటారు. వినోదం, విజ్ఞానం, సాంఘిక ప్రయోజనం ముప్పేటలుగా సాగిన కాశీమజిలీ కథలపై గంధం సుబ్బారావు చేసిన పరిశోధనలో అనేక కొత్త విషయాలను వెతికి తీశారని కొనియాడారు. ప్రజల భాషపై కాళోజీ ఆలోచనల్ని సరైన నూతన దృక్పథం నుంచి ఆవిష్కరించిన చిన్న పొత్తమే “యుద్ధ కవచం” అని వెల్లడించారు. రచయిత ఉద్దేశాలను, రచన ప్రయోజనాన్ని చర్చించడం ఈ సమీక్షలలో కనిపిస్తుంది. ఈ వ్యాసాలు, ఇంటర్వ్యూలు, సమీక్షలలో మనకు తెలిసిన విషయాలను కొత్త కోణంలొ సందర్శించవచ్చు.

***

ప్రమేయ ఝరి (వ్యాస సంపుటి)

రచన: సన్నిధానం నరసింహశర్మ

ప్రచురణ: సాహితీ సర్కిల్, హైదరాబాద్

పుటలు: 166   వెల: రూ. 140/-

ప్రతులకు: నవోదయ బుక్ హౌజ్, కాచీగుడా, హైదరాబాద్ మరియు 9292055531

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here