ప్రముఖుల బాల్యం – పుస్తక విశ్లేషణ

2
2

పెద్దల చిన్నప్పుడు…

[dropcap]జూ[/dropcap]న్ ప్రత్యేకత ఒకటుంది. వివిధ రంగాల ప్రముఖులు-పి.వి.నరసింహారావు, పైడిమర్రి వెంకట సుబ్బారావు, ముళ్ళపూడి వెంకటరమణ, డాక్టర్ వై. నాయుడమ్మ, హెలెన్ ఆడమ్స్ కెల్లర్ పుట్టిన రోజులు ఈ నెల్లోనే.

వర్ధంతులకు సంబంధించి.. వరాహగిరి వేంకటగిరి, నీలం సంజీవరెడ్డిలను స్మరించుకుంటాం.

ఇటువంటి సుప్రసిద్ధుల చిన్ననాటి జ్ఞాపకాల సంకలనమే ఈ “ప్రముఖుల బాల్యం”.

రచయిత అశ్వత్థామ (బి.ఎ. శర్మ) ముందుమాటలో అన్నట్లు – వీరందరూ మృత్యుంజయులే. ఐదువేలకు పైగా మహనీయుల జీవిత చరిత్రలు రాసిన ఘనాపాఠీ తుర్లపాటి కుటుంబరావు ప్రశంసించినట్లు -ఇలా విఖ్యాతుల బాల అనుభవాల క్రోడీకరణ ఖచ్చితంగా ఓ విలక్షణమే!

పీవీ:

12 భారతీయ, 6 ప్రపంచ భాషల్ని కంఠతా పట్టిన పరిజ్ఞాన నిధి. ఈ బహుభాషా కోవిదుడు చిన్నప్పటి నుంచే కార్యశూరుడు. ఆ తర్వాత విద్యార్థి దళానికి ప్రియతమ నాయకుడు. ఈయన కలం పేరు “జయ” అని, “కాకతీయ” పత్రికా రచయితగా ఆనాడే పేరు గడించారని ఈ పుస్తకంతోనే అవగతమైంది.

పైడిమర్రి:

“గోల్కొండ కవులు”వంటి రచనలు చేసిన ఈయనే “ప్రతిజ్ఞ”కు కర్త. దేశభక్తి ప్రబోధక మేటి కవి. పలు కష్ట నష్టాలు భరించి మరీ చదువు పూర్తిచేశారు. జీవితమంతా పఠన, లిఖిత వ్యాసంగాలతో పండించుకున్నారు. దైవాన్ని ప్రార్థించాల్సింది- సమస్యను తొలగించాలని కాదు.. దాన్ని ఎదుర్కొనే శక్తి కోసమే అర్ధించాలి.. అన్నదే ఈ ధన్య చరితుడి మాట-బాట.

ముళ్ళపూడి:

బొమ్మలు వేయడమే అలవాటు, పరిపాటిగా మారిన బాల్యమిత్రుడు బాపు(సత్తిరాజు వేంకట లక్ష్మీనారాయణ)తో పాటు ఎదిగిన సృజనశీలి. ఈయన పుస్తకాల్లోని చిన్నప్పటి చిలిపితనం ఇంతా అంతా కాదు. పాత్రోచిత అ”మాయ”కత్వమంతా ఈ ఇద్దరి రచనలూ చిత్రాలతోనే వెలుగులీనింది. ముళ్ళపూడి వారి “బుడుగు” అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తెలుగింటి పిడుగు.

నాయుడమ్మ:

పట్టుదల అంటే ఈ “యలవర్తి”వారిదే. అతి సాధారణ రైతు కుటుంబంలో పుట్టినా అసాధారణ ప్రజ్ఞతో రాణింపును సొంతం చేసుకున్న విశిష్ట శాస్త్రవేత్త. ఎవరికి శారీరక (చర్మ) వ్యాధి కలిగినా పూర్తిగా నయం చేయాలన్న సంకల్ప శక్తి బాల్య అనుభవంతోనే కలిగింది. బాధితులను ఇంకా అన్నివిధాలా ఆదుకోవాలన్న కార్యాచరణ పటిమకూ అదే నాందిగా మారింది.

హెలెన్ కెల్లర్:

దివ్యాంగుల ఆశాజ్యోతి. చూపు, పలుకు,వినికిడి చిన్ననాడే కరవైనా- సడలని ధీరత్వానికి ఈమే శాశ్వత చిరునామా. అవగాహన, సానుకూలత పెంపుదలలోనూ తనకు తానే సాటి. బెదరకుండా, చెక్కుచెదరకుండా అన్నీ నేర్చుకుని, పరీక్షల కృతార్థత సాధించుకుని, బహుముఖ పాటవంతో వెలుగొందిన నారీమణి. తన బాల్యానుభవాలు చదువుతుంటే హృదయం ద్రవిస్తుంది, సవాళ్ళను సర్వసమర్థంగా ఢీకొన్న ఆ రీతికి పాదాభివందనం చేయాలనిపిస్తుంది.

ఇక…

వీవీ గిరి:

“ఏ పనిలో నెగ్గాలన్నా ముందు చేయాల్సింది-మొదటే దానిపై అభిమానం పెంచుకోవడం”అనేవారీయన. సంక్లిష్ట పరిస్థితుల్లోనూ సత్వర పరిష్కారాలనే అన్వేషించాలన్న ధీరత్వం.. తను చిన్నవాడిగా ఉండగా తండ్రి చెప్పిన కథల వల్లనే బలపడింది. అత్యున్నతమైన భారత రాష్ట్రపతి స్థాయికి చేరేలా చేసింది.

నీలం:

బాల్యంలో తోటి బడి పిల్లలతో రోజూ దైవ ప్రార్ధన చేయించేవారు. ఏ ఉత్సవం వచ్చినా , తానే ముందుండి అందరినీ నడిపించిందీ ఈయనే. ఎదుటి మదిని దరి చేర్చుకోవడం మనిషి ధర్మం. అంతేకానీ ఏదో ఒక స్వభావం నచ్చలేదని.. కనిపించిన ప్రతివారినీ దూరం చేసుకుంటూపోతుండటం తగదన్నది చిన్ననాటి నుంచీ సంజీవరెడ్డి దృఢాభిప్రాయం.

ఇన్ని విశేషాలను ఇంత విస్తారంగా గుదిగుచ్చినందుకే, ఎంతో నచ్చిందీ పుస్తకం.

***

ప్రముఖుల బాల్యం
రచన: అశ్వత్థామ
పేజీలు:149
వెల: రూ.90
ప్రతులకు:
క్వాలిటీ పబ్లిషర్స్,
రామమందిరం వీధి,
విజయవాడ-2
ఫోన్:98484 15560

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here