[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా “పేదరికం పగబట్టి వెంటాడినా అందులోనే చిన్న చిన్నఆనందాల్ని వెతుక్కోవాలని, ఈ జీవన బాటని సంతోషాల పాటలా మల్చుకోవాలనీ సందేశమిచ్చే” సుప్రసిద్ధ బెంగాలీ సినిమా పథేర్ పాంచాలీని విశ్లేషిస్తున్నారు సికందర్. [/box]
ఆనంద విషాదాల పాట ‘పథేర్ పాంచాలి’
[dropcap]స[/dropcap]త్యజిత్ రే ని పరిచయం చేయడమంటే సూరుణ్ణి పరిచయం చేయడం లాంటిదే. ఈ లోకానికి సూర్యుడెంతో, సమాంతర సినిమా జగత్తుకి సత్యజిత్ రే అంత. తమ ఆలోచనల కోసం, విధానాల కోసం, కళ కోసం సత్యజిత్ రే వైపు చూడని ప్రపంచ సినిమా కళాకారులు లేరు. అంతగా ఆయన జాతీయ, అంతర్జాతీయ చలన చిత్ర రంగాలని ప్రభావితం చేశారు. ఆయన ప్రారంభమయింది 1955 లోనే. అదీ ‘పథేర్ పాంచాలి’ అనే సమాంతర సినిమాతోనే. సమాంతర సినిమానే వాస్తవిక సినిమా అనో, ఆర్ట్ సినిమా అనో అంటున్నాం. ‘పథేర్ పాంచాలి’ అంటే ‘పాటల బాట’ అని అర్థం. నిజంగానే ఆయన ఈ కళా సృష్టితో తనకూ, సినిమా లోకానికీ ఒక పాటల బాటనే ఏర్పర్చారు. సినిమాని ప్రజల్లోకి శక్తివంతంగా తీసుకువెళ్ళా లంటే అనుసరించాల్సిన బాటలెన్నింటినో ఆయనిందులో పొందుపరచారు. అది భావోద్వేగాల ప్రకటన కావొచ్చు, సంగీతం కావొచ్చు, ఛాయాగ్రహణం కావొచ్చు, నటనలూ కావొచ్చు. అమెరికాలో ఎనిమిదేళ్ళ వయసులో ఓ కుర్రాడు ‘పథేర్ పాంచాలి’ని చూసి తీవ్రంగా కదిలిపోయాడు. అది అతణ్ణి సినిమా దర్శకుడు అయ్యేంతవరకూ వెంటాడింది. అలాటి సత్యజిత్ రే ప్రభావంతో ఆయన ‘టాక్సీ డ్రైవర్’ ‘రేజింగ్ బుల్’, ‘డిపార్టెడ్’ వంటి అద్భుత చలన చిత్రాల్ని రూపొందించాడు. ఆయనే హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కార్ససీ…
పేదరికపు కోరలు
పశ్చిమ బెంగాల్లోని ఓ కుగ్రామంలో నల్గురు సభ్యులున్న ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబపు కథ ఇది. హరిహర రాయ్ (కానూ బెనర్జీ ) ఆ కుటుంబ పెద్ద. పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూంటాడు. తనకి ఓ కల వుంటుంది, తనొక ప్రసిద్ధ రచయితనై పోవాలని. భార్య సర్బజయ (కరుణా బెనర్జీ) భర్త ఇంటికి తెచ్చే బొటాబొటీ సంపాదనతో అతి కష్టంగా కుటుంబాన్ని గడుపుకొస్తూంటుంది. వీళ్ళకి దుర్గ అనే కూతురు, అపూర్వ అనే కొడుకు వుంటారు. ఇంకో బాగా వయసు ముదిరినావిడ రాయ్ బంధువొకామె వుంటుంది. పిల్లలు ఈవిణ్ణి ఆంటీ అని పిలుచుకుంటారు.
దొంగిలిచిన పళ్ళు తెచ్చి ముసలి ఆంటీ కిస్తూంటుంది దుర్గ. ఓ రోజు ఆ తోట యజమాని భార్య వచ్చి తన మెడలో హారం దుర్గ కొట్టేసిందని తగాదా పెట్టుకుంటుంది. దుర్గ తనకేం తెలీదని అంటుంది. ఇక అప్పూ పుట్టాక అక్కగా వాణ్ణి అల్లారు ముద్దుగా చూసుకుంటుంది దుర్గ. వాడు పెద్దవుతూంటే ఇద్దరి మధ్యా ఆత్మీయతాను బంధాలు కూడా బలపడతాయి. చెట్ట పట్టాలేసుకుని గ్రామమంతా తిరిగొస్తారు. బయస్కోపులో బొమ్మలు చూసి ఆనందిస్తారు. ఓ చెట్టు కింద కూర్చుని ఆలోచనలో ఉండిపోతారు. జాతర కెళ్ళి అక్కడి ప్రదర్శనల్ని ఎంజాయ్ చేస్తారు. ప్రతీ సాయంత్రం ఎక్కడ్నించో రైలు కూత విన్పిస్తూంటుంది. అలా కూత వేసుకు వెళ్ళే రైలుని ఒక్కసారైనా చూడాలన్పిస్తుంది. పరిగెత్తుకుని గ్రామం విడిచి చాలా దూరం వెళ్లి ఆ రైలు వస్తున్నప్పుడు చూసి ఆనందిస్తారు. తిరిగి ఇంటి కొచ్చి చూస్తే ఆంటీ చనిపోయి వుంటుంది. ఒక్కసారి విషాదం.
ఇంకా కొన్ని పరిణామాలు ఇంట్లో చోటు చేసుకుంటాయి. రాయ్ కుటుంబ ఆదాయం పెంచుకోవాలని పౌరోహిత్యం మానేసి నగరానికి వెళ్ళిపోతాడు. అతనలా వెళ్లిపోవడంతో కుటుంబం మరిన్ని కష్టాల పాలవుతుంది. భార్య సర్బజయకి దిక్కు తోచదు. తినడానికి తిండి వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంతలో వర్షాకాలం వచ్చి కూతురు దుర్గ జబ్బున పడుతుంది. వైద్యానికి కూడా డబ్బులుండవు. ఆ జ్వరం పెరిగిపోతూ ఓ రోజు హఠాన్మరణం చెందుతుంది.
అక్క చనిపోవడంతో అప్పూ తల్లడిల్లిపోతాడు. ఒంటరి వాడైపోయినట్టు బాధ పడతాడు. హరిహర రాయ్ నగరం నుంచి సంతోషంగా తిరిగి వస్తాడు. నగరంలో తను సంపాదించిన డబ్బుతో ఏమేం కొన్నాడో చూపిస్తాడు గర్వంగా. ఏమనాలో తోచక దిక్కు చూస్తున్న సర్బజయ, అతడి కాళ్ళ మీద పై గట్టిగా ఏడ్పు లంకించుకుంటుంది. అప్పుడు గానీ అర్ధం గాదు అతడికి కూతురు చనిపోయిందని…
ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతాడు. ఇక వూళ్ళో ఉండ బుద్ధి కాదు. ప్రయాణం కట్టిస్తాడు. అప్పూ సామాన్లు సర్దు తూంటే ఒక హారం దొరుకుతుంది. అది తోట యజమానురాలి దగ్గర అక్క కొట్టేసిందే. వెంటనే దాన్ని చెరువులోకి విసిరి పారేస్తాడు. రాయ్, సర్బజయ, అప్పూ ముగ్గురూ ఎడ్ల బండెక్కి భారంగా ప్రయాణం కడతారు. తమ జీవితాలకి ఇంకెక్కడో కొత్త తావులు వెతుక్కుంటూ వెళతారు…
కాలదోషం పట్టని వాస్తవం
పేదరికం పగబట్టి వెంటాడినా అందులోనే చిన్న చిన్నఆనందాల్ని వెతుక్కోవాలని, ఈ జీవన బాటని సంతోషాల పాటలా మల్చుకోవాలనీ సందేశమిచ్చే ఈ చలన చిత్రం, ఒక కొత్త దర్శకుడిగా సత్యజిత్ రే కళాభినివేశానికి నిదర్శనం. పేదరికాన్ని హృదయ విదారకంగా చూపిస్తూనే,సాంకేతికంగానూ ప్రపంచ దర్శకులకి మార్గదర్శి అయ్యాడు. షాట్లు తీసే విధానంలో గానీ, భావోద్వేగాల్ని ప్రకటించే పద్ధతుల్లో గానీ కెమెరామాన్ సుబ్రతా మిత్రా, సంగీత దర్శకుడు పండిట్ రవిశంకర్, ఎడిటర్ దులాల్ గుహల సహకారంతో సత్యజిత్ ఒక రీసెర్చి వనరులా దీన్ని అందించాడు.
దారిద్ర్యంతో ఎక్కువ సంఘర్షణకి లోనయ్యేది స్త్రీలేనని ఈ కళాఖండం చూస్తే మనకి అర్థమవుతుంది. భర్త ఏదో ఇంత సంపాదన తెచ్చి పడేసి తన బాధ్యత తీరినట్టు చేతులు దులుపుకుంటాడు. పిల్లలు వాళ్ళ ఆటా పాటల్లో వాళ్ళుంటారు. ఇంట్లో ముసలివాళ్ళు నిస్సహాయంగా వుంటారు. ఆ గృహిణి చేతిలో వున్నఆ అరకొర డబ్బుతో కడుపులు ఎలా నింపాలా అని దుఖాన్ని దిగమింగుకుంటూ తీవ్ర మానసిక సంఘర్షణకి లోనవుతుంది. ఇంట్లో అందరికీ పెట్టి అర్ధాకలితో తనే వుంటుంది. ఈ నరకం అనుభవిస్తున్న నిరుపేద గృహిణులకి చెరిగిపోని ఇమేజిలా సర్బజయ పాత్ర – ఆ పాత్రలో కరుణా బెనర్జీ మనల్ని వెంటాడుతారు. ప్రభుత్వాల్నీ వెంటాడుతారు,వెంటాడుతూనే వుంటారు… కసితో కాదు, కారుణ్యంతో. ఎంత పేదదైనా గృహిణి అన్నం పెట్టే కరుణామయే కదా.
తారాగణం : సుబీర్ బెనర్జీ, కానూ బెనర్జీ, ఉమా దాస్ గుప్తా, కరుణా బెనర్జీ, చునిబాలా దేవీ, తులసీ చక్రవర్తి తదితరులు
కథ : బిభూతీ భూషణ్ బందోపాధ్యాయ్ నవల ‘పథేర్ పాంచాలీ’ ఆధారం.
సంగీతం : పండిట్ రవిశంకర్, ఛాయాగ్రహణం : సుబ్రతా మిత్రా, కూర్పు : దులాల్ గుహ
నిర్మాణం : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
విడుదల : 26 ఆగస్టు 1955