Site icon Sanchika

ప్రాంతీయ దర్శనం -13: పంజాబీ – నాడు

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా పంజాబీ సినిమా ‘దో లచ్చియాఁ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘దో లచ్చియాఁ’

[dropcap]ప్రాం[/dropcap]తీయ పంజాబీ సినిమా ఎప్పుడూ ప్రధాన స్రవంతి సినిమాలాగే ఉంటూ వస్తోంది. హిందీ సినిమాలతో దగ్గరి చుట్టరికమున్న పంజాబీ సినిమాలకి కళాకారులు అటూ ఇటూ రాకపోకలు సాగించడం దేశ విభజన పూర్వం నుంచీ వుంది. డాటర్స్ ఆఫ్ టుడే అని 1928లో ప్రారంభమైన పంజాబీ సినిమాల నిర్మాణం అప్పట్లో హిందీ సినిమాల సరళిలోనే ఉండేవి. 1990లోనే ఎన్నారై సంస్కృతి వ్యాపించడంతో, పంజాబీలు విదేశాలకి ఎగిరిపోవడం ప్రారంభించడంతో ఆ విదేశీ కల్చర్‌తో ఓవర్సీస్ సినిమాలు తీయడం ప్రారంభించారు. ’90 పూర్వం తీసినవి రొటీన్ ఫార్ములా సినిమాలే.

1960లో ఇలాటి ఫార్ములా ఒకటి ‘దో లచ్చియాఁ’ విడుదలైంది. ఇది ఇప్పటికీ పాపులర్ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తోంది. ఈ తెలుపు- నలుపు రోమాంటిక్ కామెడీని ముల్క్ రాజ్ భాక్రీ నిర్మిస్తే, జుగల్ కిషోర్ దర్శకత్వం వహించాడు. గోపాల్ సెహగల్, ఇందిరా బిల్లీ, దల్జీత్, కృష్ణ కుమారిలు ప్రేమ జంటలుగా నటించారు. విచిత్రంగా దీని నిడివి రెండు గంటలకి కొంచెం తక్కువే. ఇందువల్ల చకచకా చూసెయ్యవచ్చు. అప్పటి సినిమాలు సాధారణంగా రెండున్నర మూడుగంటలుంటాయి.

ఈ రోమాంటిక్ కామెడీ డ్రామాలో  లచ్చీ, ఛోటీ లచ్చీ అనే ఇద్దరమ్మాయిలు ధర్మూ, కర్మూల కుమార్తెలు. వీళ్ళిద్దరూ లబ్బూ, సోనా అనే ఇద్దరబ్బాయిలతో  ప్రేమలో పడతారు. వీళ్ళలో లబ్బూ, అతడి స్నేహితుడు నట్టూ తాగుబోతులు, దొంగలు. పోలీస్ రికార్డు వుంటుంది. ఇంకో భైంగే షా అనే వడ్డీ వ్యాపారి వుంటాడు. ఇతను ఛోటీ లచ్చీ మీద కన్నేసి పెళ్లి కుట్ర పన్నుతాడు. దీనికి ఆమె తల్లిదండ్రుల మధ్య గొడవలు పెట్టేస్తాడు. ఇటు లచ్చీ, ఛోటీ లచ్చీల మధ్య కూడా తగాదాలు పెట్టేస్తాడు. ఇందుకు లబ్బూ, నట్టూలు తోడ్పడతారు. ఇవన్నీ జరిపిస్తూ ఆఖరికి  బైంగే షా తన పెళ్ళికి లైను క్లియర్ చేసుకుంటాడు. ఇదంతా చూస్తున్న షా దగ్గర పనివాడు జగ్గా తన ప్లాను తనేసుకుంటాడు. తను లచ్చీని ప్రేమిస్తున్నాడు. కనుక షా చేస్తున్న కుట్ర ఆమెని చెప్పేస్తే ఆమె తనకి దగ్గరవచ్చు. ఈ ప్లానుతో ఆమెకి కుట్ర చెప్పేస్తాడు. అప్పుడు లబ్బీకి కళ్ళు తెర్చుకుంటాయి. ఉన్నట్టుండి ఇంట్లో ఇన్ని గొడవలకి కారకుడు షానా అని ఆశ్చర్యపోయి షా పని బడుతుంది. అప్పటికే ఛోటీ లచ్చీ తో షా పెళ్లి ఏర్పాట్లు జరుగిపోతూంటాయి. లచ్చీ వెళ్లి ఆ పెళ్లి చెడగొట్టి బుద్ధి చెప్తుంది. లబ్బూ కూడా తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరతాడు. ఇక లబ్బీ లబ్బూని, ఛోటీ లచ్చీ సోనానీ పెళ్లి చేసుకోవడంతో సుఖాంతమవుతుంది.

ఈ సినిమా చూస్తూంటే అప్పటి హిందీ, తెలుగు, లేదా తమిళ సినిమా చూస్తున్నట్టే వుంటుంది. పంజాబీ ప్రాంతీయమే అయినా ప్రధాన స్రవంతి హిందీ, తెలుగు, తమిళ సినిమాల ప్రొడక్షన్ విలువలతో, అంతే వినోదాత్మకంగా తీశారు. ఎక్కువగా స్టూడియోలోనే సెట్స్ వేసి తీశారు. హన్స్ రాజ్ బెహల్ సంగీతం సమకూర్చిన ఆరు పాటలున్నాయి. వీటిని మహ్మద్ రఫీ, శంషాద్ బేగం, లతా మంగేష్కర్ లు పాడారు. వీటిలో శంషాద్ బేగం పాడిన ‘హాయ్ ని మేరా బాలమ్’, ‘హాయ్ బర్హా జాలిమ్’, ‘తేరీ కనక్ దీ రఖీ’ మూడు పాటలూ  హిట్టయ్యాయని చెప్పుకుంటారు.

నాడు హిందీ సినిమాల్లాగే వుంటున్న పంజాబీ సినిమాలకి హిందీ సినిమాలతో పోటీ చాలా వుంది. అయినా పోటీని తట్టుకుంటూ 1928 నుంచీ అప్రతిహతంగా తీస్తూనే  పోయారు. ఇంకా తీస్తూనే వున్నారు. దేశంలో ఏ భాషలో నైనా కమర్షియల్ సినిమాలు 1920ల నుంచే తీస్తూ పోయారు. వాస్తవిక సినిమాలు 1960ల నుంచీ ప్రారంభమయ్యాయి. మధ్యలో వచ్చిన వాస్తవిక సినిమాలు మధ్యలోనే పోయాయి గానీ, దేశంలో సినిమా నిర్మాణానికి బీజాలు వేసిన కమర్షియల్ సినిమాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి.

Exit mobile version