ప్రాంతీయ దర్శనం -14: పంజాబీ – నేడు

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా పంజాబీ సినిమా ‘సజ్జన్ సింగ్ రంగ్రూత్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘సజ్జన్ సింగ్ రంగ్రూత్’

[dropcap]నే[/dropcap]టి పంజాబీ ప్రాంతీయ సినిమా కామెడీలు, రోమాంటిక్ కామెడీలు, ఫ్యామిలీ డ్రామాలమయంగానే కాలక్షేప బఠానీలుగా కొనసాగుతోంది. 2018లో విడుదలైన సినిమాలన్నీ ఈ కోవకి చెందినవే ఒకటి తప్ప. ‘సజ్జన్ సింగ్ రంగ్రూత్’ మొదటి ప్రపంచ యుద్ధ నేపధ్యంలో నిర్మించారు. తెలుగులో 2015లో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ‘కంచె’ విడుదలైంది. ఇది కాల్పనికమే అయినా రెండో ప్రపంచ యుద్ధంలో తెలుగు సిపాయిలు కూడా పాల్గొన్నారన్న యథార్థాన్ని వెలుగులోకి తెచ్చింది. పంజాబీ సినిమా పూర్తి చారిత్రక పాత్రతో నిర్మించారు. సజ్జన్ సింగ్ అనే సిపాయి మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరపున జర్మన్లతో పోరాడి వీరమరణం పొందాడు. యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు అతడి చింత ఒక్కటే. ఈ యుద్ధం గెలిస్తే ప్రతిఫలంగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌కి స్వాతంత్ర్యమిస్తుందా అన్నదే. జర్మన్లు పెట్టిన ప్రలోభాలకు లొంగకుండా బ్రిటిషర్ల కోసం పోరాడి స్వాతంత్ర్య కాంక్ష తీరకుండానే అమరుడయ్యాడు. ఒక ప్రశ్న మిగిల్చాడు: మనల్నికబళించి పాలిస్తున్న ఇంగ్లీషు దొరల కోసం ప్రాణత్యాగం చేయడం అవసరమా అన్నది.

పంకజ్ బాత్రా దర్శకత్వంలో సజ్జన్ సింగ్‌కే కాదు, మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన సిక్కు సిపాయిలందరికీ నివాళిగా ఇది రూపొందిందింది. శక్తివంతమైన లాహోర్ రెజిమెంట్ ఎల్లలు దాటి గావించిన యుద్ధ ప్రయాణ గాథగా ఇది సూపర్ హిట్టయ్యింది. ఈ యుద్ధ కథ మనుషులంతా ఒక్కటే, భక్తి మార్గాలు వేరైనా దేవుడొక్కడే అన్న పాటతో ప్రారంభమవడం కాస్త విచిత్రంగా వుంటుంది. ముందుకు వెళ్లి చూస్తే, కథలో ఓ యుద్ధేతర సన్నివేశానికి మాత్రమే ఈ టైటిల్ సాంగ్‌ని పరిమితం చేయడం కనిపిస్తుంది. మొత్తం యుద్ధ మూవీ కాన్సెప్ట్‌కి మకుటంగా వుండాల్సిన థీమాటికల్ టైటిల్ సాంగ్, ఓ యుద్ధేతర సన్నివేశానికి పరిమితం చేయడం రసభంగం కల్గిస్తున్నట్టుగా అన్పిస్తుంది. ఈ యుద్ధేతర సన్నివేశం సిరియా శరణార్ధుల సమస్యకి సంబంధించి.

మొదటి ప్రపంచ యుద్ధ కథని నేటి సిరియాతో ముడి పెట్టి చెప్పడంలో భిన్న అర్థాలు వ్యక్తమవుతాయి. ఆనాడు జర్మనీలో యూదుల మీద హిట్లర్ దమనకాండ సాగించినట్టు, నేడు యజిదీల మీద సిరియాలో ఐసిస్ మారణకాండ పోలిక. లేదా సిరియాలో సొంతగడ్డ వదిలి పౌరులు పారిపోతున్న పరిస్థితికి కాంట్రాస్ట్‌గా, బ్రిటిష్ వలస పాలనలో భారతీయ సమూహాలకి ఇలాంటి పరిస్థితి లేకపోవడం. హిట్లర్, ఐసిస్ ఒకటే. ఐసిస్, బ్రిటిష్ ఒకటి కాదు. మనం లక్కీ.

ఇరాక్ – సిరియా సరిహద్దులో వలస పోతున్న సిరియా శరణార్థుల్ని ఆదుకోవడంతో కథ ప్రారంభమవుతుంది. వన్ ఖాల్సా ఎయిడ్ అనే సిక్కు ఎన్జీవో సభ్యులు, శరణార్థుల్ని ఆపి శిబిరానికి తీసుకుపోతారు. అందులో ఓ బాలిక తమకి భవిష్యత్తు ఏముందని వాపోతుంది. ఎన్జీవో సభ్యుడు ధైర్యం చెప్తాడు. ధైర్యం కోల్పోకుండా పోరాడితే స్వేచ్ఛ మనదే అవుతుందనీ, ఏకంగా జర్మనీ మీదే పోరాడి గెలిచిన సజ్జన్ సింగ్ వీరగాథ చెప్పుకొస్తాడు.

ఈ వీర గాథ ఫస్టాఫ్ అంతా ఇండియన్ బ్రిటిష్ ఆర్మీ లాహోర్ డివిజన్‌లో చేరిన సజ్జన్ సింగ్ (దిల్జీత్ దోసాంజ్) వ్యక్తిగత జీవితం గురించే వుంటుంది. గ్రామంలో అతడి కుటుంబం, ప్రేమించే యువతి (సునందా శర్మ), ఫ్యామిలీ డ్రామా వగైరా. సెకండాఫ్ లోనే యుద్ధ కథ మొదలవుతుంది. ఆదేశాలందుకుని మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) లో పాల్గోవడానికి వెళ్ళిన సజ్జన్ సింగ్ అతడి మిత్రుల అనుభవాలు బ్రిటీషర్ల నుంచే అవమానకరంగా వుంటాయి. రంగు తక్కువ మనుషులుగా, బానిసలుగా చూస్తూంటారు. ఇది భరిస్తూ కూడా యుద్ధం గెలవక తప్పని పరిస్థితి. జర్మన్లతో భీకర యుద్ధం చేస్తారు. సిక్కు పౌరుషం, ధైర్య పరాక్రమాలు నినదిస్తూ హోరాహోరీ పోరాటం చేస్తారు. ఈ బృందానికి సుబేదార్‌గా జొరావర్ సింగ్ (యోగ రాజ్ సింగ్) ఉంటాడు. తోటి బ్రిటిష్ సైనికుల వివక్షని పట్టించుకోకుండా విజయమే లక్ష్యంగా పోరాడాలని మోటివేట్ చేస్తూంటాడు. ఒక దశ కొచ్చేసరికి మిత్రులు చనిపోవడంతో ఆత్మ విమర్శలో పాతాడు సజ్జన్ సింగ్. మనమింత రక్తాన్ని ధారబోస్తున్నాం, దీనికేమైనా ప్రతిఫలముంటుందా అని. యుద్ధం గెలిస్తే బ్రిటిషర్లు కృతజ్ఞతగా మనకి స్వాతంత్ర్యమిస్తారా అని. దీనికి సుబేదార్ దగ్గర సమాధానముండదు. కానీ సిక్కు దళం ఎంత శక్తి వంతమైనదో గ్రహించిన జర్మన్ సైనికాధికారులు రాయబారం పంపుతారు. తమ సైన్యంలో చేరి బ్రిటన్‌ని ఓడిస్తే, జర్మన్ పౌరసత్వం, ఉద్యోగాలు, మూడు రెట్లు జీతం, పిల్లల చదువులూ వగైరా అన్నీ చూసుకుంటామని.

సజ్జన్ వెంటనే తిరస్కరిస్తాడు. దేశద్రోహం సిక్కుల రక్తంలో లేదంటాడు. ఈ రియాక్షన్ రావడంతో రాయబారం వచ్చిన జర్మన్ సైనికులు తమని చంపేస్తారేమోనని భయపడతారు. సుబేదార్ జొరావర్ సింగ్ ఆలింగనం చేసుకుని, అభయమిచ్చి సాగనంపుతాడు.

దీని తర్వాత జర్మనీతో యుద్ధం తీవ్రతరమవుతుంది. ఈ చివరి ఘట్టంలో యుద్దాన్ని గెలుస్తూ నేలకొరుగుతాడు సజ్జన్ సింగ్. యుద్ధం మౌనం వహిస్తుంది.

సాంకేతికంగా యుద్ధ దృశ్యాలు ఉన్నతంగా వున్నాయి. నేపధ్య సంగీతం భావోద్వేగాల్ని ఎలివేట్ చేసేలా వుంది. పాత్రచిత్రణలు కూడా అర్ధవంతంగా వున్నాయి. రెండు ప్రధాన పాత్రల్లో దిల్జీత్ దోసాంజ్, యోగరాజ్ సింగ్‌లు నటిస్తున్నట్టుకాక జీవిస్తున్నట్టు వుంటారు. వూళ్ళో వుండే సునందా శర్మ హీరోయిన్ పాత్ర సున్నిత మనస్తత్వంగల పాత్ర. యుద్ధానికి కెళ్ళిన ప్రియుడి క్షేమం కోసం తపించే పాత్ర. చివరికి వినకూడని దుర్వార్త విని కుంగిపోయే నిస్సహాయ పాత్ర.

అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యమధ్యలో హీరో హీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్స్, తోటి సైనికుల ఫ్లాష్ బ్యాక్స్, కామెడీలూ, ఇక యుద్ధం ముగుస్తుందనగా హీరోయిన్‌తో డ్రీం సాంగ్ అకస్మాత్తుగా రావడం వంటివి పంటి కింద రాయిలా తగులుతూంటాయి.

మొత్తం మీద 2018లోనైనా ఇలా ఓ మెచ్చదగ్గ ప్రయత్నం చేసింది చరిత్రతో పంజాబీ ప్రాంతీయం. ఇది 2018లో అత్యధిక వసూళ్లు సాధిందించిన ఏకైక చలనచిత్రంగా రికార్డులు బద్దలు కొట్టడమేగాక, మొత్తం పంజాబీ సినిమా చరిత్రలో వసూళ్ళలో రికార్డులు నెలకొల్పిన ఎనిమిదవ చలనచిత్రంగా నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here