ప్రాంతీయ దర్శనం -17: మణిపురి – నాడు

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా మణిపురి సినిమా ‘మాతంగి మణిపూర్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘మాతంగి మణిపూర్’

[dropcap]1[/dropcap]972లో మణిపూర్ రాష్ట్రం ఏర్పడడం, మొదటి మణిపురి సినిమా నిర్మించడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఆ మొదటి మణిపురి సినిమా అదృష్టవశాత్తూ సబ్ టైటిల్స్‌తో అందుబాటులో వుంది. 54 నిమిషాల ఈ తొలి మణిపురి జాతీయ చలనచిత్రోత్సవాల్లో రాష్ట్రపతి పతకం కూడా అందుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ అత్యధిక సినిమాలు నిర్మించే రాష్ట్రంగా వుంటూ వచ్చినప్పటికీ, పదిహేనేళ్ళ క్రితం 2003 వరకూ ఏడాదికి ఏడు సినిమాలకి ఉత్పత్తి పడిపోయి, 2003 నుంచి 2018 వరకూ ఈ పదిహేను సంవత్సరాలుగా ఏడు మాత్రమే సినిమాలు మాత్రమే నిర్మించగల్గే హీన దశకి పడిపోయింది ఇంఫాల్‌వుడ్. బాలీవుడ్ సినిమాల ప్రభావంతో స్థానిక సినిమాకీ గతి.

మణిపురి ప్రజలు సహజంగా కళాకారులు. మణిపురి కళల్ని సజీవంగా వుంచాలని ఆశించే అంకితభావం గల వాళ్ళు. ఇది సినిమాల్లో కూడా ప్రతిబింబిస్తూపోయారు. కానీ 2000 నుంచీ కొత్త తరం దర్శకులు యాక్షన్, లవ్, కామెడీలకి అరువు కళలు తెచ్చుకుని, సొంత కళల్ని అడవులు పట్టించారు. అయితే ఒక విషయంలో మాత్రం నిబద్ధతతో వున్నారు. అనాదిగా వస్తున్న తమ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి కట్టుబడే వున్నారు. తీస్తున్న అరువు కళల సినిమాల్లో తమ కుటుంబ విలువల్ని గొప్పగానే చూపించుకుంటున్నారు. అసలు తీసిన మొట్ట మొదటి మణిపురి సినిమా కూడా ఉమ్మడి కుటుంబం గురించే, కుటుంబ విలువల గురించే.

‘మాతం– గి మణిపూర్’ ఆ మొదటి మణిపూర్ చలన చిత్రం. ఈ టైటిల్‌కి అర్ధం ‘నేటి మణిపురి’ అని. అయితే రాష్ట్రావతరణం నాటికీ (1972) మణిపూర్ ఎలా వుండేదో చిత్రించడంగాక, చెదిరిన ఒక ఉమ్మడి కుటుంబ కథ చెప్పారు. గంటలోపు నిడివిగల ఈ కథ చాలా బలమైనదని అప్పట్లో ప్రశంసలందాయి. దీన్ని కె. మన్మోహన్ నిర్మిస్తే, దేవ్ కుమార్ బోస్ అనే బెంగాలీ దర్శకత్వం వహించాడు. అంటే తొలి మణిపురి సినిమాకి దర్శకుడు బెంగాలీ అన్నమాట. ఆరింబం సమరేంద్ర రాసిన ‘తీర్థ్ జాతర’ అనే నాటకం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఇందులో నటీనటులు మణిపురి నాటక రంగ కళాకారులే. అరింబం శ్యాంశర్మ సంగీత మిచ్చాడు.

తెలుగులో ఉమ్మడి కుటుంబ సినిమాలు చూశాం. ‘పండంటి కాపురం’ లాంటివి. తెలుగు ఉమ్మడి కుటుంబ సినిమాలంటేనే పొలోమని కుటుంబ సభ్యులు తలా ఓ గుంజ పట్టుకు లాగి, పీకి పందిరేసే కథలే. చివర్లో బుద్ధితెచ్చుకుని ఇల్లు చక్కబెట్టుకోవడం. పైగా మల్టీ స్టారర్‌కి తక్కువ వుంటే కుదరదు. ఇలా కాకుండా ఈ మణిపురి మాణిక్యం ఉమ్మడి కుటుంబంలో ఒక్కడి కథే చెప్తుంది. ఆ ఉమ్మడి కుటుంబంలో ఒక్కడి కథే అనేసరికి ఎంతో రిలీఫ్ ఫీలవుతాం. కథ మీద దృష్టి చెదిరి పోకుండా, ఆ ఒక్కడి మీదే ఫోకస్ చేసి ప్రొసీడింగ్స్ గమనించే శుభ్రతకి నోచుకుంటాం. ఆ ఒక్కడిని దారిలో పెట్టడానికి మిగతా కుటుంబ సభ్యుల సంఘర్షణ. మామూలుగా ఉమ్మడి కుటుంబ కథల్లో నల్గురూ నాల్గు రకాల సమస్యలు సృష్టిస్తారు. ఈ నల్గురినీ, వీళ్ళ రకరకాల సమస్యలనీ ఫాలో అవుతూ చూడాల్సిన కష్టంలో మనం పడిపోతాం.

కృష్ణ – వాణిశ్రీ నటించిన ‘ఇల్లు – ఇల్లాలు’ వుంది. ఇందులో ఇల్లు పట్టక – ‘హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా’ అంటూ క్లబ్బుల్లో కేబరే డాన్సర్‌లతో ఎంజాయ్ చేస్తూంటాడు కృష్ణ. ఇంట్లో వాణిశ్రీ ఏడుస్తూంటుంది. ఈ ఇద్దరి కథే ఈ సినిమా. ఇలా ఈ ‘ఇల్లు – ఇల్లాలు’ కథని ఉమ్మడి కుటుంబంలో పెట్టి తీస్తే ఎలా వుంటుందో, సరీగ్గా అలా వుంటుంది ‘మాతం – గి మణిపూర్’. ఇంకా తెలుగు రచయిత్రులు అప్పట్లో రాసిన నవలల్లాగా కూడా వుంటుంది.

దారితప్పిన మనిషి కూడా బయల్దేరిన చోటికే వచ్చి మనశ్శాంతి పొందుతాడు. ఎండమావులు దారి తప్పిస్తాయి, ఎండి పోయాక జ్ఞాని అవుతాడు. ఇబోహర్ బాబు ఇలాగే జ్ఞాని అవుతాడు.

ఉమ్మడి కుటుంబంలో భార్య, కూతురు, తండ్రి, తమ్ముడు, చెల్లెలూ వుంటారు. తను మాత్రం ప్రియురాలితో వేరే చోట ధూమ్ ధామ్‌గా వుంటాడు. తమ్ముడు ఒక తప్పుడు కేసులో బెయిలు దొరక్క జైల్లో వుంటాడు. మిగతా కుటుంబ సభ్యులు బాధ్యతలు పట్టకుండా వెళ్ళిపోయిన ఇబోహర్ బాబు మీదే బెంగతో వుంటారు. భార్య తంపాక్ ఏడాది కూతురు అమితని పెట్టుకుని దుఖంతో వుంటుంది. మామ ఆమెని ఓదారుస్తూంటాడు.

ప్రియురాలు సునీతతో వుంటున్న ఇబోహర్ ఆమె అడిగిందల్లా ఇచ్చుకునే కార్యక్రమంలో వుంటాడు. డబ్బూ నగలూ ధారాళంగా అప్పు చేసి ఇచ్చేస్తూంటాడు. ప్రభుత్వాఫీసులో ఉద్యోగం. ఆఫీసర్ ఎప్పుడు పిల్చినా ఆఫీసులో వుండడు. డీసీ ఆఫీసు కెళ్లాడనో, సెక్రెటరియేట్ కెళ్లాడనో చెప్పి కవర్ చేస్తూంటాడు క్యాషియర్. తనని కవర్ చేస్తున్న క్యాషియర్ నుంచే అప్పు లాగుతూంటాడు ఇబోహర్. ఆఫీసు డబ్బు ధారాదత్తం చేస్తూంటాడు క్యాషియర్. త్వరలోనే ఈ పాపం పండి రోడ్డున పడతాడు ఇబోహర్.

దీనికి ముందు చెల్లెలు ఇబోహా వచ్చి ఇంటికి రమ్మన్నా, తండ్రో వచ్చి బతిమాలినా వెళ్ళకుండా సునీత తోనే వుంటాడు. సునీత ఇంటికి, వొంటికి, బయట తిండికీ బాగా ఖర్చు పెట్టిస్తూంటుంది. జైల్లో వున్న తమ్ముడు తోంబా అన్న గురించి బాధతోనే వుంటాడు. భార్యా, చెల్లెలూ వచ్చి చెప్పుకుని బాధ పడతారు. బెయిల్ వచ్చేదాకా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వుంటాడు తోంబా.

ఇక ఆఫీసులో బండారం బయట పడుతుంది. వాడుకున్న డబ్బు పదిహేను రోజుల్లో కట్టకపొతే చర్య తీసుకుంటానని హెచ్చరిస్తాడు ఆఫీసర్. క్యాషియర్ ఇబోహర్‌ని పట్టుకుంటాడు. ఇబోహర్ ఇంటికొస్తాడు. భార్యని డబ్బు అడుగుతాడు. లేదంటుంది. నెక్లెస్ ఇమ్మంటాడు. ఇవ్వనంటుంది. ఐతే పుట్టింటికెళ్ళి పొమ్మని అరుస్తాడు. కోడలి మీద అరిచావంటే మర్యాద దక్కదంటాడు తండ్రి. అతన్నే వెళ్లి పోమంటాడు.

ఇబోహర్ వెళ్ళిపోయి సునీతని అడుగుతాడు. రూపాయి కూడా ఇవ్వనంటుంది. వెళ్లి స్కూటర్ క్యాషియర్ కిచ్చేసి అమ్ముకోమంటాడు. స్కూటరమ్మినా డబ్బు సరిపోదు. ఇదంతా తెలుసుకున్న ఇబోహా, ఆఫీసర్‌ని కలిసి అన్న తీసుకున్న డబ్బు తను కట్టేస్తానంటుంది. ఎప్పటికి కడతావ్, అర్జెంటుగా ఈ వ్యవహారం క్లోజ్ చేయాలంటాడు ఆఫీసర్. నీవల్ల కాదు పొమ్మంటాడు.

ఇబోహర్ పిచ్చిపట్టిన వాడిలా బార్ల వెంట తిరుగుతూ, ఎవరు మద్యం పోస్తే అది తాగి తూలుతూంటాడు. భార్య తల్లి దగ్గరి కెళ్ళి డబ్బు అడుగుతుంది. భాయ్ దూజ్ పండగ వుంది కదా, మనం బంధువులమంతా ఒకటిగా కలుసుకునే పండగ – దానికి ఖర్చుందని తల్లి అంటుంది. ఇక తప్పదని తండ్రి ఇల్లు తాకట్టు పెట్టేస్తాడు. కోడలితో, కూతురితో కలిసి వెళ్లి ఆఫీసులో డబ్బు కట్టేస్తాడు.

తోంబా బెయిలు మీద విడుదలై వచ్చి ఇంట్లో పరిస్థితికి చలించిపోతాడు. అన్నని వెతకడంలో పడతాడు. కొన్ని రోజులు తిరిగి, తాగి పడిపోయి వున్న అన్నని పట్టుకుంటాడు. తను పాపిననీ, ఇంటికి వెళ్ళే అర్హత లేదనీ ఏడుస్తాడు అన్న. తప్పులెవరైనా చేస్తారు, నువ్వు దిద్దుకుంటున్నావ్ పదమని తీసి కెళ్తాడు తమ్ముడు.

ఇంటికొచ్చి, తిండి తిప్పల్లేక పడున్న భార్య చేతులు పట్టుకుని క్షమించమంటాడు. ఇంట్లో ఫోటోలు – ఆ ఫోటోల్లో తామందరి ఆత్మీయతలూ మరొక్కసారి చూసి – నా దేవాలయం ఇక్కడే వుంటే ఎక్కడికో వెళ్ళిపోయానని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కుటుంబ సభ్యులు అతన్ని కలుపుకుంటారు.

     

చాలా మామూలు కథలానే అన్పిస్తుంది. ఈ కథని చక్కదిద్దడానికి ప్రయత్నించే పాత్రల ప్రవర్తనే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. ఎక్కడా గొడవ పడరు. దారితప్పిన తమవాడిని బతిమాలుకుంటారే తప్ప, అతన్నొక్క మాటా అనరు. ఆ ప్రేయసి దగ్గరికి అసలే వెళ్లరు. తల్చుకుంటే ఆమెని నాల్గు తన్ని సొత్తు లాక్కుని వెళ్ళగొట్టొచ్చు. ఆ పనిచేయరు. కష్టనష్టాలు తమ మీదే వేసుకుని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూంటారు. ఇప్పటి తెలుగు సినిమాల్లో లాగా చూపించాల్సిన ఘర్షణలూ, చంపుకోవడాలూ అన్నీ చూపించి – చివర్లో కుటుంబ విలువల గురించి నీతులు చెప్పినట్టుగాక, మొదటినుంచే మానవ నీతితో వుంటాయి బాధిత పాత్రలు.

ఇబోహర్‌గా రవీందర్ శర్మ నటించాడు. భార్యగా రాశి, తండ్రిగా దర్శకుడు అరింబం శ్యాం శర్మ, చెల్లెలుగా ఇంద్ర, ప్రేయసిగా యెంకొంమ్ రోమా, తమ్ముడుగా కంగబం తోంబా నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here