Site icon Sanchika

ప్రాంతీయ దర్శనం -2: బెంగాలీ సినిమా- నేడు

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా “గతించిన ఆర్ట్ సినిమాల కథనరీతుల్ని ఇప్పటి సినిమాకి జోడిస్తే ఎలా వుంటుందో అలా వుంది” అంటూ ఇటీవలి బెంగాలీ సినిమా ‘అశ్చే అబొర్ శబోర్’ని విశ్లేషిస్తున్నారు సికందర్. [/box]

‘అశ్చే అబొర్ శబోర్’

[dropcap]బెం[/dropcap]గాలీ సాహిత్యంలో డిటెక్టివ్స్‌కి విశిష్ట స్థానం వుంది. 90 ఏళ్ల సుదీర్ఘ చరిత్రగల ఈ శాఖలో సత్యజిత్ రే కూడా ప్రవేశించి మరింత పాపులర్ చేశారు. ఆయన డిటెక్టివ్స్‌ని వెండితెర కెక్కించి ఇంటింటా పాపులర్ చేసిన ఒక చారిత్రక ఘట్టమే, ఇప్పుడు కథల క్షామంతో కొట్టు మిట్టాడుతున్న టాలీవుడ్ (టాలీగంజ్) కి ఆశా కిరణమైంది. గత కొన్నేళ్లుగా డిటెక్టివ్ సినిమాలతో కాలం గడుపుతోంది టాలీవుడ్.

మొట్టమొదటి సారిగా శరదిందు బందోపాధ్యాయ, 1931 -70 ల మధ్య కాలంలో బ్యొంకేష్ బక్షీ అనే డిటెక్టివ్ పాత్రని సృష్టించి 33 నవలలు రాశారు. శరదిందు తర్వాత నిహార్ రంజన్ గుప్తా, సునీల్ గంగోపాధ్యాయ, సుచిత్రా భట్టాచార్య, శీర్షేందూ ముఖోపాధ్యాయ వంటి రచయితలు డిటెక్టివ్ పాత్రలు సృష్టించి నవలలు రాస్తూ వచ్చారు. సత్యజిత్ రే వేరే మార్గం ఎంచుకున్నారు. ఆయన బాలల కోసం డిటెక్టివ్ సాహిత్యం రాశారు. బాల్యం నుంచీ ఆయన సర్ ఆర్ధర్ కానన్ డాయల్ అభిమాని. అందుచేత తన డిటెక్టివ్ పాత్రని షెర్లాక్ హోమ్స్ అంతటి కుశాగ్ర బుద్ధిగల ఫెలూదాగా సృష్టించారు. ఫెలూదా అనే డిటెక్టివ్ పాత్రతో ఆయన రాసిన బాల సాహిత్యం క్లాసిక్‌గా నిల్చిపోయింది. అయితే సత్యజిత్ సినిమాలుగా తీసింది మూడే డిటెక్టివ్ కథలు. ఆయన తర్వాత కుమారుడు సందీప్ అదే డిటెక్టివ్ ఫెలూదాతో టీవీ సీరియల్స్ తీస్తూ ఇంటింటికీ చేరవేస్తూ పోయారు. ఇదొక దశ.

ఇక బెంగాలీ సినిమా కాల మహిమ వల్ల వాస్తవిక సినిమాల వైభవం కోల్పోయి మసాలా సినిమాల కొచ్చింది. సత్యజిత్ సహా ఒకప్పటి గొప్ప దర్శకుల కళాత్మక సినిమాలిక లేవు. డిజిటల్ టెక్నాలజీతో కొత్త తరం వచ్చేశాక మసాలా సినిమాలు కూడా తగ్గి హార్రర్, సస్పెన్స్, ఆధునిక రోమాన్స్, గుప్తనిధి వేట లాంటి కాలక్షేప సినిమాలు గత దశాబ్దం వరకూ రాజ్యమేలాయి. ఇవి కూడా ఆదరణ కోల్పోయాక కింకర్తవ్యం ఆలోచిస్తే ఒకటే తోచింది: సత్యజిత్ అంతటి మహాశయుడే డిటెక్టివులు తీశాక మనమెందుకు తీయకూడదని. దీని ఫలితమే కొన్నేళ్ళుగా వెల్లువెత్తుతున్న డిటెక్టివ్ సినిమాలు.

ఫెలూదాతో డిటెక్టివ్ సినిమాలు తీయాలంటే సత్యజిత్ కుమారుడు హక్కులిచ్చేట్టు లేరు. అందుకని ఇతర ప్రముఖ రచయితల్ని ఆశ్రయించి ఆ నవలలని తెరకెక్కిస్తున్నారు. వీటిలో శరదిందు నవలలు ముఖ్యమైనవి. ఆయన పాత్రతో ‘డిటెక్టివ్ బ్యొంకేష్ బక్షీ’ అని 2015 లో హిందీలో కూడా సినిమా తీశారు.

2012లో ప్రారంభమైన డిటెక్టివ్ సినిమాల వొరవడిలో ఇప్పటి వరకూ వందకి పైగా తీశారు. దేశంలోనే ఇది రికార్డు. రికార్డు అనేకన్నా వేలం వెర్రి అనాలి. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తీసి పడేస్తున్నారు. క్వాలిటీ అనేది లేదు. డిటెక్టివ్ జానర్ లక్షణాలు అసలే తెలీవు. 2018లోనే ఇప్పటికే ఎనిమిది వచ్చాయి, ఇంకో ఏడూ రాబోతున్నాయి. తాజా టాలీవుడ్ సీను ఇదీ. ఇలా గత జనవరిలో విడుదలయ్యిందే ‘అశ్చే అబొర్ శబోర్’ అనే మరో డిటెక్టివ్ సినిమా.

శీర్షేందూ ముఖోపాధ్యాయ డిటెక్టివ్ నవలలు కథాపరమైన పటుత్వంతో కంటే వివాదాస్పద అంశాలతో కూడి వుంటాయని ప్రతీతి. ఆయన సృష్టించిన డిటెక్టివ్ పాత్ర శబోర్ దాస్ గుప్తా. ఈ పాత్రతో దర్శకుడు అరిందం సిల్ మూడు సినిమాలు తీశారు. తాజాగా ఈ సంవత్సరం నాల్గోది ‘అశ్చే అబొర్ శబోర్’ (శబోర్ మళ్ళీ వచ్చాడు) ని ‘ప్రజాపతిర్ మృత్యో పునర్జన్మో’ నవల ఆధారంగా తీశారు. ఈ పాత్రని శాశ్వతా ఛటర్జీ నటిస్తూ వస్తున్నారు.

అయితే సినిమా కొచ్చేసి ఈ పాత్రని పోలీసు పాత్రగా మలిచారు. డిటెక్టివ్ పాత్రలు తెలుగులో ఇప్పటి ప్రేక్షకులకి/పాఠకులకి మల్లే కాకుండా బెంగాల్లో ప్రతీ ఒక్కరికీ తెలుసు. తెలుగు టాలీవుడ్‌లోకూడా ఇప్పటి దర్శకులకి డిటెక్టివ్ అనే పదమే తెలీదు. తెలిసిందల్లా ఎస్సై ఒక్కడే, ఎస్సై పాత్రలతోనే మూస సినిమాలు తీయడం. తెలుగులో డిటెక్టివ్ సాహిత్యమంటేనే శవ సాహిత్యంగా ప్రచారం చేశారు పొడగిట్టని సాహిత్యకారులు. ఆ శవ సాహిత్యం కాస్తా క్షుద్ర సాహిత్యం వచ్చేసి సఫా అయిపోయింది. ఇప్పుడు కస్తూరి మురళీకృష్ణ గత కొంతకాలంగా తిరిగి డిటెక్టివ్‌ని బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఈ బెంగాలీ డిటెక్టివ్ ఎలా వుందో ఒకసారి చూద్దాం…

ఇద్దరు ఆధునిక యువతుల్ని దారుణంగా రేప్ చేసి చంపేస్తాడో గుర్తు తెలీని హంతకుడు. అదెవరా అని ఎసిపి శబోర్ దాస్ గుప్తా (శాశ్వతా ఛటర్జీ) దర్యాప్తు చేపడతాడు. ఇతడికి నంద లాల్ రాయ్ (శుభ్రజిత్ దత్తా), సంజీబ్ దాస్ (గౌరవ్ చక్రవర్తి) అనే ఇద్దరు అసిస్టెంట్లు వుంటారు. ఈ దర్యాప్తు జరుపుతూండగానే రింకూ (దితీ సాహా) అనే ఇంకో అమ్మాయీ అదే పద్ధతిలో హత్యకి గురవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన ఈమె తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి దగ్గర సవతి తల్లితో వుంటోంది. పొరుగునే వుంటున్న డబ్బుగల డైవోర్సీ బిజోయ్ సేన్ (ఇంద్రనీల్ సేన్ గుప్తా) ని ప్రేమిస్తోంది. ఇది తండ్రికీ, సవతి తల్లి షెరాన్ (అంజనా బసు) కీ నచ్చడం లేదు.

ఎసిపి శబోర్‌కి షెరాన్, బిజోయ్ సేన్‌లతో పాటు ఇంకో రింకూ వెంటపడుతున్న ఒక సింగర్ మీద కూడా అనుమానం వుంటుంది. వీళ్ళని విచారిస్తూ హత్యల మిస్టరీని తవ్వుతూంటే సైబర్ సెక్స్ దందా, అక్రమ సంబంధాలు, చేతబడి, భగ్న ప్రేమలూ, సీరియల్ కిల్లర్ కోణమూ వగైరా బయటపడుతూంటాయి. ఉన్న ముగ్గురు అనుమానితులు కాక, ఇంకో అజ్ఞాత వ్యక్తి హస్తమున్నట్టు గ్రహిస్తాడు శబోర్. ఇంతలో ఇంకో హత్య జరుగుతున్నట్టు సమాచారమంది చేరుకునేలోగా, చంపేసి పారిపోతాడు అజ్ఞాత వ్యక్తి. ఎవరితను? ఎందుకు అమ్మాయిల్ని చంపుతున్నాడు? ఇంకో హత్య చేయకుండా ఎలా పట్టుకోవాలి?…ఇదీ మిగతా కథ.

శీర్షేందూ రాసిన ఒరిజినల్ డిటెక్టివ్ నవలని ఈ కాలానికి మార్చుకుని చిత్రానువాదం చేయడం బావుంది. ఫోరెన్సిక్ సైన్స్‌ని కూడా కలగలిపి ఆధునిక అపరాధ పరిశోధనాత్మక కథగా చేయాలనుకోవడం వరకూ బాగానే వుంది. ఐతే ఇలా చేయడంతో ఇది పోలీస్ ప్రోసీజురల్ జానర్ కథ కిందికొచ్చేసింది. అంటే ఫోరెన్సిక్ సైన్స్‌ని కథలో కీలకం చేసి కథనం చేయాలన్నమాట. ఇలా చేయకుండా ఆర్భాటం కోసమన్నట్టు, చీటికీ మాటికీ కేవలం ఫోరెన్సిక్స్ ప్రస్తావనలు చేస్తూ బిల్డప్ ఇస్తూ పోయారు. ఈ జానర్ లో వస్తున్న తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఇంతే చేస్తున్నారు. ఒక వెంట్రుక దొరికింది, ఇంకో రక్తం మరక దొరికింది… ఇలా ప్రస్తావనలే తప్ప, వాటి లాబ్ రిపోర్టులూ, ఆ రిపోర్టుల ఆధారంగా దర్యాప్తులూ అనే వాస్తవిక కథనాలు చేయకపోవడం వల్ల, నేరపరిశోధనలో ఫోరెన్సిక్స్ ప్రాధాన్యాన్ని కూడా ప్రేక్షకులకి తెలిపి, మరింత థ్రిల్ చేయగల అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు.

ఈ కథలో హత్య జరిగినప్పుడల్లా దొరికిన సాక్ష్యాధారాల్ని చెప్పి వదిలేయడమే ఫోరెన్సిక్ సైన్స్ అన్నట్టుగా చేశారు. ఇలా కాకుండా, ఏదైనా ఒక్క కీలక సాక్ష్యాధారాన్ని పట్టుకుని, దాన్ని విశ్లేషిస్తూ, హైలైట్ చేస్తూ దర్యాప్తు జరుపుతూంటే, ఆ కీలక సాక్ష్యాధారం కథని ముందుకి నడిపే ప్లాట్ డివైస్‌లా పనిచేసి, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే అవకాశముంటుంది. అప్పుడది నిజమైన పోలీస్ ప్రోసీజురల్ జానర్ కథవుతుంది.

ఇంకోటేమిటంటే, కథనం కేవలం డైలాగులతో వుండడం. డైలాగులే కథని నడుపుతూ వుంటాయి. కానీ సినిమా అంటే నాటకం కాదు, సినిమా కథనం నాటకంలో వీలుకాని సంఘటనలతో కథనాన్ని కోరుకుంటుంది. అప్పుడే అది సినిమా అనిపించుకుంటుంది. ఈ సినిమా ప్రారంభమయ్యింది మొదలు ఎసిపి దర్యాప్తులో సంఘటనలు ఎప్పుడు జరిగి థ్రిల్ చేస్తాయా అని ఓపికతో ఎదురు చూస్తే, ఎప్పుడో గంటకి గానీ ఒక సంఘటన జరగదు. ఆ సంఘటన ఎసిపికి తెలిసి ఇంకో హత్య జరుగుతూ వుండడం, అతను ఆపడానికి పరుగులు తీయడం, అపలేకపోవడం. ఇంతే, మళ్ళీ ముగింపులో హంతకుణ్ణి పట్టుకునే దాకా ఇంకో సంఘటనే జరగదు. ఎసిపి రకరకాల అనుమానితుల్ని కలవడం, వివరాలు అడిగి తెలుసుకోవడమనే డైలాగుల తతంగమే కథనమన్నట్టు వుంది. శీర్షేందూ నవల ఇలాగే రాసి వుండొచ్చు. అది నవలకి పనికొస్తుంది, దృశ్యమాధ్యమమైన సినిమాకి కాదు.

మరొకటేమిటంటే, ఇది ఎండ్ సస్పెన్స్ కథగా వుంది. దృశ్య మాధ్యమమైన సినిమాకి ఎండ్ సస్పెన్స్ కథలు పనికి రావని హాలీవుడ్ తేల్చేసుకుని జాగ్రత్తపడుతోంది. ఎండ్ సస్పెన్స్ అంటే సినిమా ఫ్లాపయ్యే పరిస్థితి వుంది. ఎండ్ సస్పెన్స్‌తో వస్తున్న ప్రతీ సినిమా తెలుగులోనూ ఫ్లాపవుతోంది. కథలో రకరకాల అనుమానితుల్ని చూపిస్తూ, హంతకుడెవరో చిట్ట చివరికి మాత్రమే సస్పెన్స్ విప్పే ఫార్ములాకి కాలం చెల్లింది. నవలగా ఇది చదువుకోవడానికి ఉత్కంఠ రేకెత్తిస్తుంది ఫర్వాలేదు. కానీ వెండి తెరమీద కళ్ళు ఆ హంతకుణ్ణి చూసెయ్యాలని తొందరపెడతాయి. చివరిదాకా వేచి వుండవు. సినిమాలో ప్రత్యర్థి ఎవరో తెలుస్తూంటేనే ఆట కూడా రక్తి కడుతుంది. సస్పెన్స్ అనే ఎలిమెంటుకి ఎవరు/ఎందుకు అనే రెండు పార్శ్వాలుంటే, మొదటి దాన్ని చెప్పేసి, రెండో దాన్ని దాచాలి. రెండూ మూసిపెడితే కథలో సస్పెన్స్ ఎలిమెంట్ అదృశ్యమైపోతుంది. తెర మీద చూసేందుకు ఏమీ వుండదు. అందుకని హంతకుడెవరో చూపించేసి, ఎందుకు చంపుతున్నాడు, ఎలా పట్టుబడతాడూ అనే సీన్ టు సీన్ సస్పన్స్ సృష్టిస్తూ కథనం చేసే పధ్ధతి అమల్లో కొచ్చింది.

కాబట్టి ఇంత రసవిహీనంగా ఈ డిటెక్టివ్ సినిమా తయారయ్యింది. మిగతా నటనలూ, సాంకేతిక విలువలూ బ్రహ్మాండంగా వున్నాయి. ఎసిపిగా శాశ్వతా ఛటర్జీ ఎంతబాగా నటించినా, నీరస కథనం పాలబడి ఆయన ప్రతిభ వృధా అయింది. అసిస్టెంట్స్‌లో ఒకడు హాస్యం కోసం వుంటాడు. రింకూ పాత్రలో దితీ సాహా నీటుగా వుంటుంది. మిగిలిన్ వాళ్ళు కూడా నీటు నటనలే కనబరుస్తారు. సంగీతానికి ఒక బర్త్ డే పాట వుంది. బర్త్ డే కాబట్టి పెట్టాలని పాట పెట్టలేదు. దితిని ప్రేమిస్తున్న ఇంకో బాయ్ ఫ్రెండ్ సింగర్ కాబట్టి అతడి మీద పాట పెట్టారు.

నటుడైన అరిందం సిల్ కుర్ర దర్శకుడేమీ కాదు, యాభై ఏళ్ళు పైబడ్డ దర్శకుడే. అయినప్పటికీ కుర్ర దర్శకుడన్పించేలా – ట్రెండ్‌లో వున్న ఆధునిక బెంగాలీ సినిమాలా – దీనికి దర్శకత్వం వహించాడు.

కాకపోతే విషయపరంగా బలహీనంగా వుంది. గతించిన ఆర్ట్ సినిమాల కథనరీతుల్ని ఇప్పటి సినిమాకి జోడిస్తే ఎలా వుంటుందో అలా వుంది. బెంగాలీ డిటెక్టివ్ సినిమాల ట్రెండ్ లో ఇప్పుడొస్తున్నవి ఇలాగే ఉంటున్నాయి.

Exit mobile version