ప్రాంతీయ దర్శనం -24: భోజ్‌పురి – నాడు

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా భోజ్‌పురి సినిమా ‘గంగమయ్యా తొహే పియరీ చడయీ బో’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘అభ్యుదయానికి ఆహ్వానం!’

‘గంగమయ్యా తొహే పియరీ చడయీ బో’

[dropcap]బీ[/dropcap]హార్ నుంచి భోజ్‌పురి సినిమా చరిత్రకి 56 ఏళ్ల సుదీర్ఘ నేపథ్యముంది. మొట్ట మొదటి భోజ్‌పురి సినిమా 1963లో నిర్మించారు. అదీ అప్పటి భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ కోరిక మేరకు. హిందీ క్యారెక్టర్ నటుడు నసీర్ హుస్సేన్ ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ని కలుసుకున్నప్పుడు, భోజ్‌పురిలో మీరెందుకు సినిమా తీయకూడదని ఆయన అడిగారు. రాష్ట్రపతి బీహార్‌కి చెందిన వారే. అప్పటికి నసీర్ హుస్సేస్ దగ్గర స్క్రిప్టు వుంది. బీహార్‌కి చెందిన తను భోజ్‌పురి లోనే రాసి పెట్టుకున్నాడు. వెంటనే నిర్మాత బిశ్వనాథ్ ప్రసాద్ షహబాదీని సంప్రదించి దాని నిర్మాణాన్ని చేపట్టారు. దర్శకుడుగా కుందన్ కుమార్‌ని నియమించుకున్నారు. అలా భోజ్‌పురిలో మొట్ట మొదటి చలన చిత్రంగా ‘గంగమయ్యా తొహే పియరీ చడయీ బో’ (గంగమ్మ తల్లీ నీకు పసుపు చీర సంతర్పణ చేస్తున్నా) ఉనికిలోకి వచ్చింది.

అదొక చిన్న పల్లె. అక్కడ లఖన్ భయ్యా (నసీర్ హుస్సేన్) అనే సామాన్య రైతు. అతడికో కూతురు ప్యారీ (కుమ్ కుమ్ అలియాస్ జేబున్నీసా). అదే పల్లెలో జగ్గీబాబా (జగన్నాథ్ శుక్లా) అనే వడ్డీవ్యాపారి. అతడి కొడుకు శ్యాంబాబు (అసీమ్ కుమార్). ఇతను చదువుకుని ఉద్యోగానికెళ్ళకుండా వూళ్ళో తిరుగుతూంటాడు. ఒకరోజు ప్యారీని చూసి ప్రేమలో పడిపోతాడు. పట్టణానికి వెళ్లి ఉద్యోగంలో చేరాల్సిందేనని తండ్రి పట్టుబడతాడు. ఇక్కడే వ్యవసాయం చేస్తానంటాడు శ్యాంబాబు. చదువుకుని అదేం ఖర్మరా అంటే, చదువుకుంటే వ్యవసాయం ఇంకా బాగా చేయవచ్చంటాడు. ఆ విజ్ఞానంతో కొత్త కొత్త మెషీన్లు తెచ్చి వ్యవసాయాన్ని పరుగులు పెట్టించవచ్చంటాడు. ప్యారీతో ప్రేమలో పడి వీడిలా మాట్లాడుతున్నాడని తండ్రికి తెలీదు. ప్యారీని ఆకట్టుకోవడం కోసం శ్యాంబాబు పశువులు కూడా కాస్తాడు.

ఒకరోజు శ్యాంబాబు ప్యారీల సరస సంభాషణని వూళ్ళో ఒక చాడీలు చెప్పేవాడు చూసి శ్యాంబాబు తండ్రి జగ్గీ బాబాకి చెప్పేస్తాడు. వెంటనే జగ్గీబాబా పదిహేను వేల కట్నంతో వేరే సంబంధం చూస్తాడు. ప్యారీనే చేసుకుంటానంటాడు శ్యాంబాబు. ప్యారీ తండ్రి తనకి అప్పుపడ్డాడనీ, పైసా కట్నం ఇవ్వడనీ అంటాడు జగ్గీబాబా. శ్యాంబాబు వేరే సంబంధం చేసుకోనంటే చేసుకోననేస్తాడు. ఇంతలో చాడీలు చెప్పేవాడు శ్యాంబాబుతో ప్యారీ వ్యవహారం అటు ఆమె తండ్రి లఖన్ భయ్యాకి చెప్పేస్తాడు. దీంతో పెళ్ళికి డబ్బుల్లేని లఖన్ భయ్యా రెండో పెళ్లి వాడికిచ్చి ప్యారీ పెళ్లి చేసేస్తాడు. దీంతో శ్యాంబాబు మానసికంగా కుంగిపోతాడు.

కానీ పెళ్ళయిన రాత్రే ప్యారీ భర్త దురదృష్ట వశాత్తూ చనిపోతాడు. ప్యారీ దిగ్భ్రాంతికి లోనవుతుంది. ఇక అత్తగారామెని పని మనిషి కన్నా హీనంగా చూస్తుంది. ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది ప్యారీ. కూతురి పరిస్థితికి బెంగపడి తల్లి చనిపోతుంది. ప్యారీకి దిక్కుతోచదు. తను ఎక్కడికెళ్ళినా చావులే జరుగుతున్నాయి. ఇక వారణాసి కెళ్ళి పోతుంది. ఆక్కడ గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంది. ఒక భార్యాభర్తలు చూసి కాపాడి ఇంటికి తెచ్చుకుంటారు.

ఆ ఆంటీ ప్యారీని ముద్దు చేసి, అంతా చక్కబడుతుందనీ, నాట్యం నేర్చుకొమ్మనీ ఒక గానా బజానా శాలలో చేర్పిస్తుంది. ప్యారీ అక్కడ నాట్యం నేర్చుకుని ఠుమ్రీలూ ముజ్రాలూ పాడుతూ రసికులని ఆనంద పరుస్తూంటుంది. ఆంటీకి మంచి ఆదాయం వస్తూంటుంది. ప్యారీని వెతుక్కుంటూ అక్కడికి శ్యాంబాబు వచ్చేస్తాడు. ఆమె చేస్తున్న పనికి లెంపకాయ కొడతాడు. వీళ్ళిద్దరి వ్యవహారం అర్థం జేసుకున్నఆంటీ, ప్యారీని తీసుకుని వెళ్ళిపొమ్మని శ్యాంబాబుకి చెప్పేస్తుంది. ఆమె భర్త అడ్డుపడతాడు. బంగారు బాతుని తీసికెళ్లడానికి వీల్లేదని శ్యాంబాబుని చితగ్గొడతాడు.

అప్పుడు హాస్పిటల్లో చేరిన శ్యాంబాబుకి సపర్యలు చేస్తుంది ప్యారీ. అక్కడికి జగ్గీబాబా వచ్చేస్తాడు. లఖన్ భయ్యా కూడా వచ్చేస్తాడు. పిచ్చి వాడిలా వున్న లఖన్ భయ్యాని తండ్రి అని గుర్తు పట్టక కొట్టబోతుంది ప్యారీ. కొట్టమంటాడు, ఈ పాపిని కొట్టి కొట్టి శిక్షించమంటాడు. అప్పుడా తండ్రిని గుర్తు పట్టి భోరుమంటుంది ప్యారీ. జగ్గీబాబా పశ్చాత్తాపపడి వీళ్ళిద్దరి పెళ్లి చేసేద్దామంటాడు. నమ్మలేకపోతాడు లఖన్ భయ్యా. ఇలా అందరూ ఒకటై సుఖాంతమవుతుంది.

       

ఇది వితంతు వివాహాల మీద కథ. అయితే ఎక్కడా ఈ విషయం చెప్పరు. దాని సంబంధమైన చర్చ గానీ, వాదాలుగానీ వుండవు. కూతురు భర్తని పోగొట్టుకుంది, ఆమెకి ప్రేమించిన వాడితో పెళ్లి చేశారంతే. ఇదే కథ. వైధవ్యాన్ని, ఆ సంబంధమైన కట్టుబాట్లని గుర్తించనట్టే వుంటుంది కథ. ఇది గొప్ప చిత్రణ. కొన్ని మూఢ నమ్మకాల్ని గుర్తించ నిరాకరించడమే గొప్ప అభ్యుదయమన్నట్టుగా వుంటుంది. ఈ సినిమా ఇస్తున్న సందేశమిదే.

ఈ సినిమాని హిందీ సినిమాల కమర్షియల్ ప్రభావాలకి దూరంగా వాస్తవిక చిత్రాల ధోరణిలో తీసినా (అప్పటికి వాస్తవిక చిత్రాలు లేవు) ఆరు పాటలనేవి హిందీ సినిమాల ఫార్ములా సరళిలోనే చోటు చేసుకున్నాయి. రెండు గంటల సినిమాలో అరగంటకి పైగా పాటలే వున్నాయి. ఈ పాటలకి ప్రసిద్ధ హిందీ సంగీత దర్శకుడు చిత్ర గుప్త స్వరకల్పన చేస్తే, ప్రసిద్ధ హిందీ గీత రచయిత శైలేంద్ర రచన చేశారు. హిందీ సినిమా గాయనీ గాయకులు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, సుమన్ కళ్యాణ్ పూర్, మహ్మద్ రఫీలు పాడారు. గంగా నది మీద పడవలతో చిత్రీకరించిన టైటిల్ పాట – లతా ఉషాలు పాడింది- హైలైట్ గా వుంటుంది.

నసీర్ హుస్సేన్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ తొలి భోజ్‌పురికి, కుందన్ కుమార్ దర్శకత్వంలో తెలుపు నలుపు కెమెరా షాట్లు చెప్పుకోదగ్గవి. ఆ రోజుల్లో లక్షన్నర బడ్జెట్‌తో నిర్మాణంలో ఇంత నాణ్యత చేకూర్చడం గొప్ప విషయమే. నటనలు కూడా ఓవరాక్షన్‌తో, మెలో డ్రామాతో వుండవు. సమస్య మీద అభ్యుదయకర సినిమా తీస్తూ చాదస్తపు నటనలు, కథనాలూ చేస్తే నవ్విపోతారు. పైగా రాష్ట్రపతి కోరిక మేరకు తీశారు. ఆ విద్యా సంపన్నుడు చూస్తే తీసికట్టుగా వుండకూడదు. విడుదలకి ముందు పాట్నాలో రాష్ట్రపతికి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆయన కురిపించిన ప్రశంసల్లో తడిసి ముద్దయ్యారు.

రాష్రపతే కాదు, అప్పటి భోజ్‌పురి ఫిలిం సమారోహ్ సమితి అవార్డుల వర్షం కురిపించింది. ఉత్తమ చిత్రం అవార్డుతో బాటు, ఉత్తమ నటి (కుమ్‌కుమ్), ఉత్తమ సహాయ నటుడు (నసీర్ హుస్సేన్), ఉత్తమ గీత రచయిత (శైలేంద్ర), ఉత్తమ కథ (నసీర్ హుస్సేన్), ఉత్తమ గాయకుడు (మహ్మద్ రఫీ) …అవార్డులన్నీఆ సంవత్సరం ఈ సినిమాకే ప్రకటించింది.

లక్షన్నరతో తీస్తే అయిదు లక్షలు వసూలు చేసిందీ తొలి భోజ్‌పురి. ఇప్పటికీ ఈ సినిమా గురించి పాత్రికేయులు రాస్తూనే వుంటారు. వీక్షించడానికి యూట్యూబ్‌లో ఎందరో అప్‌లోడ్ చేశారు. లక్షల్లో వ్యూస్ ఉంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here