ప్రాంతీయ దర్శనం -26: నాగపురీ – నాడు

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా నాగపురీ సినిమా ‘గుయా నంబర్ వన్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘గుయా నంబర్ వన్’

[dropcap]ఝా[/dropcap]లీవుడ్ అంటే, ఝార్ఖండ్ ప్రాంతీయ సినిమా పరిశ్రమ 2000లో ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటయిన వెంటనే 2001లో ప్రారంభమైంది. ప్రారంభం ప్రారంభమే కమర్షియల్ సినిమాతో ప్రారంభమైంది. 2001లో ఆభాస్ శర్మ అనే కొత్త దర్శకుడు ‘గుయా నంబర్ వన్’ (వీరుడు నంబర్ వన్) అనే మసాలా తీశాడు. ఇది అక్కడి నాగపురీ భాషలో. ఈ భాషలో 1988లోనే ‘ఆక్రంత్’ అనే ఆర్టు సినిమా వచ్చింది. అప్పుడు రాష్ట్రం బీహార్‌లో కలిసి వుంది. బీహార్‌లో కలిసున్నప్పుడు 1999 వరకూ ఇంకో మూడు మాత్రమే నాగపురీ సినిమా లొచ్చాయి. ఇవి కూడా ఆర్టు సినిమాలే. జనాలు చూడలేదు. ఇలా కాదని 2000లో ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక, అభాస్ శర్మ ఆర్ట్ సినిమా జోలికి పోకుండా, ప్రాంతీయంగా ఇతర చోట్ల మారిన ట్రెండ్ ననుసరిస్తూ మొదటి ఝార్ఖండ్ సినిమాగా ‘గుయా నంబర్ వన్’ తీశాడు. ఇలా నాగపురి సినిమాని కమర్షియల్ మసాలాగా తీసినా జనాలు చూడలేదు. ఇలా కూడా కాదని అశోక్ శరణ్ అనే మరో కొత్త దర్శకుడు, పూర్తి బాలీవుడ్ ఫార్ములాతో, టైటిల్స్‌తో ‘బ్లాక్ ఐరన్ మాన్ బిర్సా’, ‘ఊలుంగాన్ ఏక్ క్రాంతి’ అనే అనే రెండు కమర్షియల్స్ తీస్తే, అప్పుడు నాగపురీ సినిమాలకి జై కొట్టారు జనాలు.

ఇలా మొదటి ఝాలీవుడ్ (ఝార్ఖండ్) సినిమా ‘గుయా నంబర్ వన్’ ఫ్లాపవడానికి బాలీవుడ్ స్పెషల్ మసాలా లేకపోవడంతో బాటు, చాలా బలహీన కథగా వుండడం కారణాలయ్యాయి. బలహీన కథలుగా ఆర్ట్ సినిమాలుంటే చూడగలరేమోగానీ, కమర్షియల్ సినిమాలుంటే చూడలేరనడానికి ఇదొక నిదర్శనం – అదెంత తొలి ఝార్ఖండీ సినిమా అన్న ప్రాంతీయాభిమానాన్ని రెచ్చ గొట్టినా సరే.

అభాస్ శర్మ రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్‌లో శ్రీకాంత్, సనా, సరోజ్ ఝా, సుకుమార్ ముఖర్జీ, ఝర్నా చక్రవర్తి అనే నటీ నటులు నటించారు. హేమంత్ – అనూప్‌లు సంగీతమిస్తే, అశోక్ చక్రవర్తి ఛాయాగ్రహణం సమకూర్చాడు. ఇది పట్టణ – గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కథ. ఝార్ఖండ్ ఎంత అందమైనదో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో గ్రామీణ జీవితాన్నీ, పట్టణ అభివృద్ధినీ చూపిస్తూ కీర్తించే పాటతో సినిమా ప్రారంభమవుతుంది.

పట్నంలో మోహిత్ (శ్రీకాంత్) కాలేజీలో చదివే విద్యార్థి, పల్లెలో పింకీ (సనా) అందర్నీ పలకరిస్తూ తిరిగే పిల్ల. ఈమెకి పెంపుడు తల్లిదండ్రులు, అక్క వుంటారు. మోహిత్‌కి తల్లిదండ్రులుంటారు. ఇద్దరి తల్లిదండ్రులు పరిచయస్థులు. పింకీ అక్క పెళ్లి సందర్భంగా మోహిత్ తల్లిదండ్రులతో వచ్చినప్పుడు, మోహిత్ పింకీలు ప్రేమలో పడతారు. తల్లిదండ్రుల ఆమోదం పొందుతారు. వూళ్ళో రంగా అనే వాడు పింకీ మీద కన్నేసి పెళ్లి చేసుకోవాలని వుంటాడు. ఒకసారి పింకీని వేధిస్తే మోహిత్ కొడతాడు కూడా. దీంతో రంగా కక్ష గడతాడు. ఇలా వుండగా, కాలేజీలో తోటి స్టూడెంట్ కంచన్‌ని మోహిత్ ప్రేమిస్తున్నాడని పింకీ తెలుసుకుని షాకవుతుంది. పింకీ మోహిత్‌ల వ్యవహారం తెలుసుకున్న కంచన్ వచ్చేసి వీల్లేదంటుంది. ఇద్దరి మధ్య తేల్చుకోలేని మోహిత్ పరీక్ష పెడతాడు. తన కోసం ఎవరు విషం తాగడానికి ముందుకొస్తే వాళ్ళ ప్రేమని ఒప్పుకుంటానంటాడు. కంచన్ విషం తాగడానికి తటపటాయిస్తుంది. తాగనని వెళ్ళిపోతుంది. పింకీ తాగేస్తుంది. విషం తాగిన పింకీతో అది విషం కాదంటాడు మోహిత్.

ఇక పింకీ మోహిత్‌ల పెళ్లి చేద్దామని ఇరువైపులా అనుకుంటూండగా, పింకీ తండ్రి స్నేహితుడు గోపాల్ అనే అతను వచ్చి, ఇచ్చిన మాట గుర్తు చేస్తాడు. దీంతో గోపాల్ కొడుక్కి పింకీ నిచ్చి చేస్తామన్న ఇచ్చిన మాట ప్రకారం, మోహిత్‌తో సంబంధాన్ని కాదంటాడు పింకీ తండ్రి. దీంతో పింకీ మోహిత్‌లు తల్లడిల్లి పోతారు. పింకీ అన్నం తినదు, నిద్రపోదు. పింకీ పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు, ఇచ్చిన మాట కంటే ప్రేమించిన హృదయాలని గౌరవించడమే ముఖ్యమని, పింకీ మోహిత్‌ల పెళ్లి జరిపించేసి సుఖాంతం చేస్తారు.

తొలి ఝార్ఖండీ సినిమా అంటూ ఇలాంటిది తీయడం ఆశ్చర్యమే. దర్శకుడికి అనుభవం కూడా లేదని తెలిసిపోతూనే వుంటుంది. ఇరవై ఏళ్ల నాటి ప్రమాణాలతోనే చూసినా నాడు సినిమాలు ఇలా తీసినట్టు లేదు. కథలో బలం లేకపోవడం, కథనంలో పస లోపించడం కన్పిస్తాయి. టైటిల్ ‘గుయా నంబర్ వన్’ అంటే వీరుడు నంబర్ వన్ ప్రకారమైనా కథ లేదు, హీరో లేడు. మరి టైటిల్‌తో ఆకర్షించి టైటిల్‌తో సంబంధం లేని సినిమా చూపిస్తే ఎవరు చూస్తారు.

ప్రారంభమే గదిలో నిలబడే వున్న మేనమామతో ఒక్కో పాత్రా రావడం, కామెడీ చేసిపోవడం పది నిమిషాల సేపూ సాగుతుంది. ఇలా పది నిముషాలు కదలని సినిమాలా వున్నాక, ఇంటర్వెల్ ముందు 15 నిమిషాల పెళ్లి తంతుతో మొండికేసిన సినిమాలా వుంటుంది. నిశ్చితార్ధం నుంచీ అప్పగింతల దాకా పాటలతో సహా. ఈ హీరోయిన్ అక్క పెళ్లికి కేటాయించిన నిడివికి రెండు సార్లు ఇంటికెళ్ళి భోంచేసి రావచ్చు. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఎన్ని పాటలుంటాయో లెక్కలేదు. ఇవన్నీ తీసేస్తే కథకి మిగిలింది అరగంట. ఈ అరగంటలో సెకండాఫ్‌లో చివరి పావు గంటలోనే ప్రేమలో సమస్య పుడుతుంది. హీరోయిన్‌కి వేరే సంబంధం చూడ్డంతో. హీరోయిన్ బాధతో ఒక పాట వస్తుంది. విపరీతంగా ఏడ్చేస్తున్న హీరోయిన్, ‘నిజమైన ప్రేమకి విలువలేదా?’ అని హీరోని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నతోనైనా హీరో ప్రేమ కోసం హీరో అవడు. వీళ్ళ పరిస్థితి చూడలేక హీరోయిన్ తల్లిదండ్రులే దిగివచ్చి ఆశీర్వదిస్తారు.

హీరోయిన్ కోసం ప్రయత్నించే విలన్ని ఫైట్ల కోసం పెట్టారు. హీరోయిన్లు ఇద్దరికీ హీరో పెట్టే ‘విష పరీక్ష’తో కొంత సస్పన్స్ ని పోషించారు. ఈ నకిలీ పరీక్షతో హీరో బయట పడ్డాడు గానీ, లేకపోతే రెండో హీరోయిన్ ఆ విషం తాగనని వెళ్ళిపోకుండా అక్కడే కూర్చుంటే, ఆమె ముందు హీరో ఇచ్చిన ఉత్తుత్తి విషం తాగాల్సి వస్తే హీరోయిన్ దొరికిపోయేది. హీరో జుట్టు సెకండ్ హీరోయిన్ చేతిలో వుండేది.

కాలేజీ సీన్లలో హీరో బైక్ తో బాలీవుడ్ హీరోలా పోజులు కొడతాడు. ఆ షాట్లు తీయడం కూడా అలాగే వుంది. కానీ అసలు కథ కొచ్చేటప్పటికి ప్రేమించడం తప్ప ప్రేమ కోసం ఏమీ చెయ్యడు. అందర్నీపలకరిస్తూ తిరిగే హీరోయిన్‌కి సపోర్టుగా కూడా వూళ్ళో ఎవరూ రారు. హీరో లేక, వూళ్ళో సపోర్టూ లేక, ఏడ్పు ఒక్కటే ఆమె ప్రేమ విజయానికి ఆయుధంలా తోడ్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here