ప్రాంతీయ దర్శనం -28: మీరట్ – నాడు

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా మీరట్ సినిమా ‘ధడక్ ఛోరా’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ధడక్ ఛోరా’

[dropcap]మా[/dropcap]లీవుడ్ అంటే మీరట్ సినిమా పరిశ్రమ నిజానికి వీడియో సినిమా పరిశ్రమ. వంద కోట్ల టర్నోవర్‌తో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నపరిశ్రమ. మీరట్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలతో ఈ మార్కెట్ ఏర్పడింది. స్థానిక హర్యాన్వీ భాషలో తీసే ఈ కమర్షియల్ సినిమాలతో మీరట్‌తో పాటు, మరికొన్ని పశ్చిమ యూపీ జిల్లాలు, ఢిల్లీ పరిసరాల్లో నేషనల్ కేపిటల్ రీజియన్, రాజస్థాన్ సరిహద్దూ మొదలైన ప్రాంతాల వారికి వినోద కాలక్షేపాన్ని ఇంటింటా సరఫరా చేస్తున్నారు. థియేటర్లలో హిందీ సినిమాలతో పోటీ పడే అవస్థ లేకుండా, హిందీ సినిమాల కంటే ఎక్కువమంది గ్రామీణ ప్రేక్షకులని కలిగి వుండి, హర్యాన్వీలో స్థానిక కళాకారులతో వీడియో సినిమాలు తీసి జోరుగా సీడీల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ చరిత్ర 2004లో ‘ధడక్ ఛోరా’ అనే మూవీతో ప్రారంభమయింది.

మొదటి మీరట్ సినిమాగా ఇది అతి పెద్ద హిట్టయ్యింది. మాలీవుడ్‌కి ఇది మైలురాయిలా నిల్చింది. బాలీవుడ్‌కి ‘షోలే’ ఏంతో, మాలీవుడ్‌కి ‘ధకడ్ ఛోరా’ అంత అని చెప్పుకుంటారు. ఇదేమీ అద్భుత సినిమా ఏమీ కాదు. రొటీన్ హిందూ ముస్లిం హిందీ ప్రేమ ఫార్ములా సినిమా లాంటిదే. వీడియో సినిమా కాబట్టి సాంకేతికంగా బొటాబొటీ బడ్జెట్‌తో తీసినా, కథా కథనాలు, నటనలు పకడ్బందీగా నిర్వహించారు. రెండున్నర గంటల ఈ వీడియోని చూడడం మొదలెడితే, అలా చూస్తూనే వుండిపోతాం ఆపకుండా, పాటలు వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేస్తూ.

దినేష్ చౌదరి, సంసార్ సింగ్ పన్వర్‌లు దర్శకత్వం వహించిన ఈ తొలి మీరట్ చలన చిత్రం నిర్మాతలు రాం కిషన్ భారతి, కమల్ శర్మలు. హీరో హీరోయిన్లుగా ఉత్తర కుమార్, సుమన్ నేగీలు నటించారు. సంగీతం సోహాన్ లాల్ సమకూర్చాడు.

ప్రేమ్ నగర్ అనే ఒక చిన్న గ్రామంలో జరిగే కథ ఇది. ఇక్కడ వ్యవసాయం చేసుకునే చౌదరి చిన్న కొడుకు మనోజ్ (ఉత్తర కుమార్). ఇంటర్ చదువుతూంటాడు గానీ స్కూలుకి సరిగా వెళ్ళడు (ఇంటర్ అని చెప్పి స్కూలు అనే పిలిచారు సినిమాలో). కాలరెగరేసి తిరుగుతాడు, బీడీలు కాలుస్తాడు. క్లాసులో తోటి విద్యార్థుల్ని కొడతాడు. చివరి బెంచి మీద కూర్చుంటాడు, దెబ్బలు తిన్న విద్యార్ధుల బందువులు ఇంటి మీదికొచ్చి కొట్టి, కట్టేసి పోతూంటారు. ఇంటి దగ్గర ఒక బంధువుల అమ్మాయి ప్రేమిస్తూంటుంది. పట్టించుకోడు.

స్కూలు ఎగ్గొడుతున్నాడని పేరు తీసేయాలనుకుంటాడు ప్రిన్సిపాల్. ఒకడ్ని రేటు మాట్లాడుకుని తండ్రిగా నటింపజేస్తూ, ప్రిన్సిపాల్‌కి చెప్పించుకుని మళ్ళీ స్కూల్లో జాయినవుతాడు. రేటు మాట్లాడుకున్న వాడికి డబ్బులివ్వక కొట్టి పంపుతాడు. ఇలా మనోజ్ ఆగడాలు మితిమీరుతున్న వేళ, పక్క వూరు నుంచి షబ్నమ్ (సుమన్ నేగీ) అనే ముస్లిం అమ్మాయి క్లాసులో చేరుతుంది.

ఈమెని చూడగానే ప్రేమిస్తాడు. ఆమె ఇంటి చుట్టూ సైకిలు మీద చక్కర్లు కొడుతూ కిందపడి దెబ్బ తగిలించుకుంటాడు. ఆమె రక్తం తుడుచుకోవడానికి జేబు రుమాలిస్తే దాన్ని దాచుకుంటాడు. స్కూల్లో ఓ ముగ్గురు ఆకతాయిలు మనోజ్ చేతిలో తన్నులు తిన్నాక ఫ్రెండ్స్ అవుతారు. ఇంకో ముగ్గురు ఇప్పుడు షబ్నమ్‌కి చీటీ రాసి తన్నులు తింటారు. వీళ్ళు బద్ధ శత్రువులై పోతారు.

ఫ్రెండ్స్ అయిన ఆకతాయిలు ప్రేమ వ్యవహారంలో మనోజ్‌కి సాయపడుతూంటారు. షబ్నమ్ ప్రేమలో పడుతుంది గానీ అతను సరీగా చదవకపోతే ప్రేమించనంటుంది. చదువుకోవడం మొదలెడతాడు. వీళ్ళ వ్యవహారం ఇరువైపులా ఇళ్ళల్లో తెలిసి పోతుంది. షబ్నమ్ తండ్రి జమాలుద్దీన్ వచ్చి కొడుకుని అదుపులో ఉంచుకోమని చౌదరిని హెచ్చరిస్తాడు. చౌదరి కొడుకుని చావ చితకదంతాడు. అటు జమాలుద్దీన్ బంధువులతో కలిసి కూతురుకి తీవ్ర హెచ్చరిక చేస్తాడు.

మనోజ్ షబ్నమ్‌లు ఇవేవీ లక్ష్య పెట్టక ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూంటారు. ఇరువైపులా పెద్దలు ఘర్షించుకుంటారు. పోలీసులు జమాలుద్దీన్ బంధువు దగ్గర లంచం తీసుకుని మనోజ్‌ని పట్టుకుపోతూంటే విద్యార్థులు అడ్డుకుని పోలీసుల్ని కొట్టి విడిపించుకుంటారు. ఇక ఈ ‘ధర్మ విరుద్ధమైన’ ప్రేమని అడ్డుకోవడానికి పరస్పరం ప్రేమికుల్ని చంపుకోవడానికి నిశ్చయించుకుంటారు. షబ్నమ్ మనోజ్‌ని కలిస్తే ఆమెని జమాలుద్దీన్ చంపెయ్యాలి, మనోజ్ షబ్నమ్‌ని కలిస్తే అతణ్ణి చౌదరి చంపెయ్యాలి. దీంతో ప్రేమికులిద్దరూ ఏకమై చంపమని సవాలు విసురుతాడు.

అప్పుడు స్కూల్ టీచర్ శాస్త్రీజీ జోక్యం చేసుకుంటాడు. ముందుగా ప్రేమికుల మధ్య ప్రేమని పసిగట్టి మందలించింది ఇతనే. అప్పుడే వయసు కాదు, ముందు చదువుకోవాలని చెప్పి చూస్తాడు. ఇప్పుడు ఈ ప్రేమని ఆపలేమని తెలిసిపోయాక పెద్దల్నే మందలిస్తాడు. ప్రేమలో మతాల్ని చూడకూడదంటాడు. విన్పించుకోరు. మత కట్టుబాట్లు మత కట్టుబాట్లే, ఇందులో జోక్యం కుదరదంటారు. తుపాకులు ఎక్కుపెట్టి చంపాల్సిందేనంటారు. మనోజ్ తల్లి ముందుకొచ్చి, నేను కంటే చంపే హక్కు నీకెక్కడిదని నిలదీస్తుంది. ఇలా తల్లి సెంటిమెంటు, కూతురి సెంటిమెంటు, ఇంకా కొన్ని మందలింపులూ తోడై కరుగుతారు ఇరువైపులా పెద్దలు.

ఇందులో కొత్త హీరోహీరోయిన్లు ఉత్తర కుమార్, సుమన్ నేగీలు బాగా ఆకట్టుకునే నటనలు ప్రదర్శిస్తారు. ఆవారాగా, ప్రేమికుడిగా, ఎదురు తిరిగిన వాడిగా ఉత్తర కుమార్ సునాయాసంగా పాత్ర నిర్వహణ చేస్తాడు. అయితే ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌గా శాలువా కప్పుకుని విషాద గీతం పాడుకోవడమే నవ్వు తెప్పిస్తుంది.

సుమన్ నేగీ గ్లామరస్ నటి. ఇతర నటీనటులందరూ కొత్తవాళ్ళు అన్నట్టు అన్పించరు. అలాగే కృత్రిమంగా కూడా వుండరు. సహజసిద్ధ పల్లె మనుషులనే అన్పించుకుంటారు. పాటలు ఆరున్నాయి. ఒక పాట అమ్మలక్కల మీద ‘హమ్ ఆప్కే హై కౌన్’ లోని ‘దీదీ తేరా దేవర్ దీవానా’ నుంచి కాపీ కొట్టి పెట్టారు.

మొత్తానికి ఈ మీరట్ తొలి మూవీ ఒక ఫర్వాలేదన్పించే ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. యూట్యూబ్ వ్యూస్ కోటికి చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here