Site icon Sanchika

ప్రాంతీయ దర్శనం -3: మరాఠీ – నాడు

[box type=’note’ fontsize=’16’]  ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా మరాఠీ సినిమా, దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ‘హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ’ని విశ్లేషిస్తున్నారు సికందర్. [/box]

హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ 

[dropcap]భా[/dropcap]రతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే లండన్ ఇచ్చిన ఆఫర్‌కి లండన్‌లోనే  స్థిరపడిపోయి ఆంగ్ల సినిమాలు తీస్తూపోతే భారతీయ సినిమా ఏమైపోయేదో! భారతదేశంలో సినిమా పరిశ్రమని అభివృద్ధిపర్చడమే తన ఆశయమని బ్రిటిష్ స్టూడియో అధిపతుల ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. తన పేరు చెప్పుకుని దేశంలో సినిమా పరిశ్రమ పుట్టి పెరగల్గింది. తన పేరు మీదే అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్థాపించి ఋణం తీర్చుకోగల్గింది.

స్వర్గీయ దుండిరాజ్ గోవింద్ ఫాల్కే మీద 2009లో నిర్మించిన బయోపిక్ ‘హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ’ ఆ దార్శనికుడికి నిజమైన నివాళి. నాటక రంగం నుంచి వచ్చిన ఒక కొత్త దర్శకుడు పరేష్ మోకాషీ ఈ అద్భుతాన్ని సాధించాడు. 1913లో సినిమాలతో ఏ అనుభవమూ లేని ఫాల్కే తన జీవితమంతా పణంగా పెట్టి, దేశంలోనే తొలి చలన చిత్రంగా ‘రాజాహరిశ్చంద్ర’ నిర్మించినట్టే, నాటక రంగం నుంచి వచ్చిన సినిమా మొహం తెలియని మోకాషీ తొలి సినిమా ప్రయత్నం ఫాల్కే బయోపిక్ తోనే చేయడం ఒక అద్భుతం. ప్రాంతీయ మరాఠీ సినిమా ఇంకా అప్పటికి ఉచ్ఛ దశలో వుంది. దర్శకులు విభిన్న వాస్తవిక కథా చిత్రాలు తీస్తున్న కాలమది. ‘హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ’ దీనికి పరాకాష్ఠ. అంతర్జాతీయ స్థాయి కళా ఖండాలకి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని నిర్మించి, ఆస్కార్ వరకూ తీసికెళ్ళ గలిగాడు మోకాషీ. భారత దేశంలో సినిమా ఎలా ప్రాణం పోసుకుందో ప్రపంచానికి సగర్వంగా కదిలే బొమ్మల్లో చూపించాడు.

సినిమా అంటే మౌలికంగా సామాన్య జన వినోద సాధనమే. సినిమాలు ఇలా సరదా కోసం ప్రారంభం కాకపోయినట్టయితే సీరియస్ మేధావి వర్గ ఆర్టు సినిమాలు ఉనికిలోకే వచ్చేవి కావు, సినిమా నిర్మాణం తెలీక!  సినిమా అనేదే  సామాన్యుడి వినోద సాధనమైనప్పుడు, ఆ సినిమా పుట్టుక గురించిన బయోపిక్ ఎలా వుండాలి? గంభీరంగా పాఠం చెప్తున్నట్టు వుండాలా? వినోద సాధనం పుట్టుకని వినోద భరితంగా తెరకెక్కించకుండా, దాన్నో డాక్యుమెంటరీలా తీస్తే ఏ సామాన్యుడికి సినిమా చరిత్ర జ్ఞానం అందుతుంది?

మోకాషీ చిన్నపిల్లలకి సైతం వినోదంతో పాటు విజ్ఞానం అందేలా సమ్మోహనంగా రూపొందించాడు. ఫాల్కే జీవితంలోనే ఈ వినోదం వుంది. ఫాల్కే కుటుంబానికి కుటుంబం మొత్తం జీవితాన్నే వినోదంగా చూస్తారు. తమ దిగువ మధ్యతరగతి ఈతి బాధల మీద కూడా జోకు లేసుకుంటారు. ఫాల్కే ఎంత హాస్య ప్రియుడో భార్యాపిల్లలూ అంతే హాస్యంతో పోటీ పడే పరివారం. జీవితమే వినోదమైనప్పుడు ఇక ఏదీ లేదన్న బాధే లేదు. ఆ పూట భార్య అన్నం మాత్రం వండి, భర్త కూరలు తెస్తాడని ఎదురు చూస్తూంటే, పెద్ద కొడుకుతో పగలంతా బయట తిరిగి రాత్రెప్పుడో ఒట్టి చేతులతో వస్తాడు ఫాల్కే. కూరలేవీ అనడిగితే, పెద్దోడికి వొంట్లో బాగా లేక మందులు కొన్నానంటాడు. మందు సీసా ఏదంటే, కుక్కలు మీద పడితే మందుసీసా కిందపడి పగిలిందంటాడు. కుక్కల నుంచి రసీదు తీసుకోలేదా అంటుంది. వాటితో కరిపించుకుని మళ్ళీ వేరే మందులు కొనుక్కోవాలా అంటాడు కొడుకు.

 నిజానికి తండ్రీ కొడుకులు ఆ రోజంతా ఒక గుడారంలో ‘కదిలే ఫోటోలు’ చూడడానికి డబ్బు ఖర్చు పెట్టేశారు. అక్కడికెలా వెళ్ళారంటే అది యాక్సిడెంటల్‌గా జరిగింది… అసలుకి ఫాల్కే నడుపుతున్న ప్రింటింగ్ ప్రెస్ వదిలేసి, పెట్టుబడులు పెడతామని ఎందరు వచ్చినా ససేమిరా అని, మ్యాజిక్ ప్రదర్శనలు ఇస్తూంటాడు. దీనికంటే ముందు చిన్నపిల్లలకి ప్రముఖుల చిత్ర పటాలు చూపించి ఎడ్యుకేట్ చేస్తూంటాడు. వివిధ నాయకుల పటాలు చూపించి వాళ్ళ పేర్లు చెప్పించాక, ఇంకో రెండు పటాలు చూపిస్తే పిల్లలు గుర్తుపట్టరు. వీళ్ళు ఆర్యభట, జెంషెడ్ జీ టాటాలని చెప్తాడు. మనం అర్యభటలా సైన్సుని ప్రేమిస్తాం కాబట్టి మనల్ని పాలించడానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారంటాడు. ఒక బ్రిటిష్ పోలీసు అధికారి వచ్చి ఇదంతా మెచ్చుకోలుగా చూస్తూంటాడు. సభలో వున్న ఒక సాంప్రదాయవాది రెచ్చిపోతూ, పిల్లలకి పిచ్చి మాటలు నేర్పుతున్నావ్, నీ చెత్త వాగుడు కట్టిపెట్టి నీ అభ్యుదయ వాదంతో బ్రిటిషోళ్ళని వెళ్ళగొట్టమంటాడు. ఇక సైన్సుకీ, సనాతన వాదానికీ గొడవరేగి ఫాల్కే కొడుకుతో పారిపోవాల్సి వస్తుంది.

దాంతో మెజీషియన్ అవతారమెత్తి మ్యాజిక్ ప్రదర్శనలిస్తూంటాడు. ఇక్కడా సనాతనంతో పేచీ వచ్చి వాళ్ళు వెంట తరుముతూంటే, పారిపోయి రోడ్డు పక్క గోడ చాటున  నక్కి దాక్కుంటాడు. అప్పుడు ఎదురుగా గుడారం కంటబడుతుంది. బ్రిటిషోళ్ళు నడుపుతున్న ‘కదిలే ఫోటోల థియేటర్’ అది. బ్రిటిష్ దొరలూ, దొరసానులూ వస్తున్నారు. ఇదేమిటో చూద్దామని కూరల కోసం వుంచిన డబ్బుతో టికెట్లు కొనేశాడన్న మాట.

 ఇలా యాక్సిడెంటల్ గా ‘అమేజింగ్ యానిమల్స్’ అనే లఘు మూకీ చలన చిత్రం  (స్థానిక భాషలో ‘కదిలే ఫోటోలు’) చూసి తీవ్ర సంభ్రమాశ్చర్యాలకి గురైన ఫాల్కేని ఇదే నిరంతరం వెంటాడుతూంటుంది. తను కూడా అలాటిది నిర్మించాలన్న కోరిక బలీయమైపోతుంది. ఫాల్కే కోరిక విని భార్యా పిల్లలూ ఆనంద పడిపోతారు. తలో చెయ్యీ వేస్తారు. ఇల్లు గడవడానికే కష్టంగా వున్నా అదేమీ భార్యాపిల్లలు పట్టించుకోరు. సామాన్లు అమ్మి పారేస్తారు. బీరువా అమ్మేసిన రోజున ఇరుగుపొరుగు మనిషి పోయినంత బాధతో పరామర్శించడానికొస్తారు. బీరువా పోయిందటగా… అయ్యో బీరువా వెళ్లిపోయిందా… అని అమ్మలక్కలు మంచమ్మీద ఫాల్కే భార్య చుట్టుముట్టి ఓదారుస్తూంటారు. ఇంట్లో ఎవరికేం జరిగిందోనని గాభరాగా వచ్చిన ఫాల్కే, ఇది చూసి తరిమి తరిమి కొడతాడు అందర్నీ.

ఇక గుడారంలో కదిలే ఫోటోలే చూస్తూ అక్కడే పడుకుని, అక్కడే లేచి మళ్ళీ చూడడం వ్యసనమై పోయి కళ్ళు పోతాయి. గుడ్డివాణ్ణయి పోయాను, కదిలే ఫోటోలెలా తియ్యాలీ… అని చాపమీద ముసుగుదన్ని గోలగోల చేస్తూంటాడు. డాక్టర్ పరీక్షించి చూపు మాత్రమే తగ్గిందని కళ్ళ జోడిస్తాడు. కళ్ళు నయమయ్యాయి, మరి బుర్ర? అంటుంది అక్కడే వున్న ముసలమ్మ. అసలు తెల్లోడు బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుందని అభిప్రాయం కూడా వెలిబుచ్చుతుంది. ఇలా ఫాల్కే కష్టాలు, పదివేలు అప్పుజేసి లండన్ కెళ్ళేలా చేస్తాయి. అక్కడ ఒక స్టూడియో అధిపతుల మీటింగ్ రూమ్ లోకి దూరిపోయి,  ‘ఐయాం ఏన్ ఇండియన్. ఐ వాంట్ టు మేక్ ఏ మోషన్ పిక్చర్!’ అనేస్తాడు. తెల్లదొరలు తేరుకుని సాదరంగా ఆహ్వానిస్తారు. అతడికి కెమెరా, ప్రొజెక్టరు నేర్పిస్తారు, నెగెటివ్ డెవలపింగ్‌లో శిక్షణ ఇస్తారు. మంచి ఆత్మవిశ్వాసంతో ఫాల్కే అవన్నీ కొనుక్కుని ఇండియా కొస్తాడు.

ఇక కథ రాయడం, నటీ నటుల్ని ఎంపిక చేయడం ఇంటిల్లిపాదీ సందడిగా చేస్తారు. ఒక్కోసారి ఫాల్కే వంట చేస్తూంటే, భార్య నెగెటివ్ డెవలప్ చేస్తూంటుంది. పిల్లలు ప్రొజెక్టర్‌తో ట్రైనింగ్ అవుతూంటారు. తీయాల్సింది ‘రాజా హరిశ్చంద్ర’ కథ. అందులో హీరోయిన్‌గా ఒక నటి కావాలి. ఎవరూ ముందుకు రారు. భార్యనే నటించమంటాడు. తను నటిస్తే మరి నెగెటివ్ ఎవరు డెవలప్ చేస్తారు, ఎడిటింగ్ ఎవరు చేస్తారు… అని తిరస్కరిస్తుంది. ఫాల్కే వేశ్యా వాటికని సందర్శిస్తాడు. మేం నటిస్తే మా పరువు ప్రతిష్ఠలేం కావాలని వాళ్ళూ తిరస్కరిస్తారు. ఇక లాభంలేక ఫాల్కే ఒక యువకుణ్ణి సెలెక్టు చేస్తాడు. వాడు మీసం తీయనంటాడు. నాన్న బతికుండగా మీసం తీయడం మా ఆచారం కాదంటాడు. మరి స్త్రీకి మీసం వుండదు కదా అంటాడు ఫాల్కే. ఈ మీసం గొడవ ఎంతకీ తెగదు.

  

ఇక నటులు కాని వాళ్ళతో ‘షూటింగు’ ఎన్నో తిప్పలు ఫాల్కేకి. కెమెరా స్టార్ట్ అనడం వుండదు, షురూ అంటాడు. ఎలాగో సినిమా తీసి ప్రదర్శిస్తే ఎవ్వరూ రారు. ఒక కుక్క వస్తుంది. ఫర్వాలేదు,  కుక్కలు కూడా రాలేదని ఎవరూ అనరని సంతృప్తి చెందుతాడు. ఇంగ్లీషు వాళ్లతో పాటల కార్యక్రమం పెడితే అప్పుడు జనం వస్తారు. పాటలు పాడించి రాజా హరిశ్చంద్ర’ సినిమా వేస్తాడు. దాంతో జనం ఆనంద పరవశులైపోయి ఇక ప్రతీ రోజూ హౌస్‌ఫుల్ చేస్తారు. మనం చేయాల్సింది చేస్తే డబ్బు అదే వస్తుందని ఒకసారి భార్యతో అంటాడు.  అది నిజమవుతోంది. ఈ విజయంతో ‘భస్మాసుర్’  అని ఇంకోటి తీసి విజయం సాధిస్తాడు. లండన్ నుంచి పిలుపు వస్తుంది. ఇక్కడే వుండి తమ కోసం తీయమంటారు తెల్ల దొరలు. ఫాల్కే ఒప్పుకోడు. ఇక్కడే వుండిపోతే నా దేశంలో సినిమా అభివృద్ధి ఎలా? అంటాడు.

ఒక అద్భుత దృశ్యకావ్యమిది. అద్భుతమైన నటుడు ఫాల్కే పాత్రధారి నందూ మాధవ్. చార్లీ చాప్లిన్‌ని గుర్తుచేస్తున్నట్టే వుంటాడు. ఫాల్కే జిజ్ఞాస, పరిశీలనాశక్తీ, పట్టుదలా ఎంత గొప్పవో తడుముకోకుండా నటించి చూపాడు. అలాగే ఫాల్కే భార్య సరస్వతి పాత్రలో విభావరీ దేశ్ పాండేని కూడా మర్చిపోలేం. అసలు సరస్వతిలాంటి ఇల్లాళ్ళు ఆ రోజుల్లో కూడా వున్నారని నటనలో ఈజ్‌తో నమ్మబలికేసింది.

అంతర్జాతీయ స్థాయిలో వున్న అమలేందు చౌదరి ఛాయాగ్రహణం, నితిన్ చంద్రకాంత్ దేశాయ్ కళాదర్శకతం, ఆనంద్ మోడక్ సంగీతం, అమిత్ పవార్ కూర్పు, వెన్నెముకలా నిల్చాయి ఈ బయోపిక్‌కి. నాటి బొంబాయి. లండన్ లొకేషన్స్ ఒక జనరల్ నాలెడ్జి. ఈ మహా యజ్ఞానికి రచన, దర్శకత్వం చేసిన పరేష్ మోకాషీ, ప్రముఖ బాలీవుడ్ యూటీవీ మోషన్ పిక్చర్స్‌కి చెందిన నిర్మాత రోనీ స్క్రూవాలా దాదాసాహెబ్ ఫాల్కేకి తమ వినమ్ర నివాళులర్పించారు ఈ బయోపిక్‌తో. ఇంత కళాఖండాన్ని కేవలం రెండు కోట్లతో నిర్మించడం విశేషం. మరాఠీ చలనచిత్ర చరిత్రలో ఇది మరువలేని జ్ఞాపిక.

Exit mobile version