ప్రాంతీయ దర్శనం -30: కాశ్మీరీ – నాడు

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా కాశ్మీరీ సినిమా ‘మాంజ్ రాత్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘మాంజ్ రాత్’

[dropcap]మొ[/dropcap]దటి కశ్మీరీ చలన చిత్రం 1964లో నిర్మించారు. కశ్మీర్‌లో మొదటి హిందీ సినిమా  ‘యాహూ…చాహే కోయీ ము ఝే జంగ్లీ కహే’ అని మంచు పర్వతాల మధ్య ఇండియన్ రాక్ స్టార్ షమ్మీ కపూర్ చేత అల్లరిగా పాడిస్తూ, 1961 లో ‘జంగ్లీ’ అనే సూపర్ హిట్‌ని రంగుల్లో షూట్ చేసి, దివ్య మనోహరంగా కశ్మీర్ అందాల్ని దృశ్యమానం చేస్తే, ఆ తర్వాత 1965లో మళ్ళీ ఇండియన్ ఎల్విస్ ప్రిస్లే షమ్మీ కపూర్ చేతే  ‘దీవానా హువా బాదల్,.. సావన్ కీ ఘటా ఛాయీ’ అంటూ సున్నితంగా పాడిస్తూ,  రంగుల్లోనే భూతల స్వర్గాన్ని ‘కశ్మీర్ కీ కలీ’ అనే మరో సూపర్ హిట్ ద్వారా వెండితెర మీదికి దింపితే, పాపం ఇదే కాలంలో మొదటి కశ్మీరీ సినిమాలో పేదవాడి ఆపిల్ లాగా, కశ్మీర్ అందాల్ని తెలుపు నలుపులో చూపించి సరిపుచ్చారు.

‘మాంజ్ రాత్’ (మెహందీ రాత్ లేదా గోరింటాకు పెట్టుకునే రాత్రి) హిందీ సినిమాల కథే. చివర్లో కొంచెం తిరగేసిన దేవదాసు కథ. తెలుగు ‘దేవదాసు’నే తీసుకుంటే, ఇందులో పార్వతి, దుర్గాపురం జమీందారు భుజంగరావుని చేసుకున్నట్టే సెకండ్ హీరోని చేసుకుంటుంది హీరోయిన్. అప్పుడు ఆ భర్త దుర్గాపురం జమీందారు భుజంగరావు లాంటి సెకండ్ హీరోయే, దేవదాసు అయిపోతాడు. హీరో ఫ్రెష్‌గా వుంటాడు. నవ్వొస్తే నవ్వుకోవచ్చు.

సాహిత్య రంగం నుంచి వచ్చిన అలీ మహ్మద్ లోన్ ఈ కథ రాశాడు. జగీ రాంపాల్ దర్శకత్వం వహించాడు. ఓంకార్ నాథ్ ఐమా, ముక్తా హీరోహీరోయిన్లుగా నటించారు. కశ్మీరీ భాష ఇండో ఆర్యన్ భాషల్లో దద్రీ ఉపవర్గానికి చెందిన భాష. అతితక్కువ ఉర్దూ పదాలుంటాయి. 70 లక్షలమంది ఇదే భాష మాట్లాడతారు. అటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భాష కూడా ఇదే.

ఈ కథ రజబ్ కాకా అనే అతను గుర్రం మీద ఆ గ్రామానికి రావడంతో ప్రారంభమవుతుంది. అక్కడ చెల్లెలి అంత్యక్రియలు పూర్తి చేసి అనాధగా మిగిలిన మేనల్లుడు సుల్తాన్ (మాస్టర్ ఖయ్యూం) ని తీసుకుని తన వూరికి పోతాడు. అక్కడ అతడి కూతురు సారా (బేబీ మున్నీ) వుంటుంది. సారా సుల్తాన్ లిద్దరూ వెంటనే స్నేహితులైపోతారు. సారాకి రజాక్ (మాస్టర్ కబీల్) అనే అన్న వుంటాడు. వూళ్ళో ఇంకో బీడీలు కాలుస్తూ పిల్లల్ని ఏడ్పించే ఆకతాయి కుర్రాడు బర్కత్ (మాస్టర్ నాదాన్) వుంటాడు. వీడు, రజాక్ బీడీలు కాలుస్తూ కూర్చుని, గడ్డి మోపు మోసుకుంటూ వస్తున్న పుష్కర్ (మాస్టర్ అశోక్ భాన్) అనే పండిట్స్ కుర్రాడి గడ్డికి నిప్పెట్టేస్తారు. అటుగా వస్తున్న సుల్తాన్, సారాలు ఇది చూసి వెంటనే పుష్కర్‌ని కాపాడతారు. సారాతో వున్నఈ కొత్త కుర్రాడు సుల్తాన్‌ని చూసి ఉడుక్కుంటాడు బర్కత్.

ఇలా చిన్ననాటి సాన్నిహిత్యం పెద్దవాళ్ళయ్యాక ప్రేమగా మారుతుంది సుల్తాన్ (ఓంకార్ నాథ్ ఐమా), సారా (ముక్తా) లకి. ఇది చూసి సహించలేకపోతాడు సారాని మూగగా ప్రేమిస్తున్న బర్కత్ (పుష్కర్ భాన్). కూతురు సారాని మేనల్లుడు సుల్తాన్ కిచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశం రజబ్ కాకాకి వుంటుంది. ఇది తెలుసుకుని బర్కత్, రజాక్ చెవుల్లో విషాన్ని నూరిపోస్తూంటాడు. రజాక్ చెల్లెలు సారా దగ్గరికెళ్ళి, మీ ఇద్దరి గురించి వూళ్ళో చెడ్డగా మాట్లాడేసుకుంటున్నారని అనేస్తాడు. ఆమె పట్టించుకోదు. రజాక్ వెళ్లి తండ్రి కాకాకి చెప్పేస్తాడు. సారాని పెళ్లి చేసుకుని ఆస్తిని లాగేద్దామనే సుల్తాన్ పథక మేస్తున్నాడని అనేస్తాడు. కాకా ఆందోళన చెందుతాడు. మనసులో అనుమాన బీజాలు నాటుకుంటాయి. ఇంకెవరో వచ్చి, సారా సుల్తాన్‌ల గురించి వూళ్ళో చెలరేగుతున్న పుకార్ల గురించి చెప్పేస్తే, ఇక తట్టుకోలేక పదిమంది ముందు సారాని కొట్టేస్తాడు కాకా.

ఇక బర్కత్ వూళ్ళో పంచాయితీ పెట్టించి, సుల్తాన్‌ని గ్రామ బహిష్కారం గావించే  తన తర్వాతి పథకాన్ని అమలు చేస్తాడు. తనతో వుంటున్న రౌడీల్ని ఉసిగొల్పి, తీర్పుని తన కనుకూలంగా మార్చుకోవాలనుకుంటాడు. దీన్ని తిప్పికొడుతూ, సుల్తాన్ చిన్ననాటి స్నేహితుడు పండిట్ పుష్కర్ నాథ్ (ప్రాణ్ కిషోర్ కౌల్) వచ్చేసి సుల్తాన్ వైపు వాదిస్తాడు. అంతే కాదు, మేనమామ ఆస్తి సుల్తాన్‌కే చెందుతుందని తీర్పు వచ్చేలా కూడా చేస్తాడు. ఈ తీర్పుకి తాళలేక రజాక్ పుష్కర్ మీద కక్ష పెంచుకుంటాడు.

పుష్కర్ నడుపుతున్న కిరాణా షాపుకి సరుకుల సరఫరాని అడ్డగించి దోచుకోవాలని పథకమేస్తాడు. చివరి క్షణాల్లో ఇది తెలుసుకుని వచ్చేసి సుల్తాన్ అడ్డుకుంటాడు. బర్కత్ ఇక నేరుగా సారా సుల్తాన్‌ల మీద గురి పెడతాడు. పరిస్థితులు క్షీణిస్తున్నాయని గ్రహించి సారా తన స్నేహితురాలైన పుష్కర్ భార్యకి చెప్పుకుంటుంది. పుష్కర్ నాథ్ కూడా వెళ్లి కాకాకి నచ్చ జెప్తాడు. దిగులుతో వున్న కాకా ఆరోగ్యం క్షీణించి చనిపోతాడు. ఇటు జూదగాడైన రజాక్ అప్పులపాలవుతాడు. సారా ఇక తనకేం రాసి పెట్టివుందో గ్రహించేస్తుంది. అన్నరజాక్ ఇక బర్కత్ కిచ్చి పెళ్లి చేసేయాలని నిశ్చయించేస్తాడు.

 

సారాకి మాంజ్ రాత్ వస్తుంది. రహస్యంగా  సుల్తాన్‌ని కలుసుకుంటుంది. అనాథ అయిన తనకింతకంటే ఏం జరుగుతుందని వాపోతాడు సుల్తాన్. పెళ్లి చేసుకుని సుఖంగా గడపమంటాడు. గోరింటాకు ఎందుకు పెట్టుకోలేదని అడుగుతాడు. ఆమెకి గాజులు తొడిగి ఆశీర్వదిస్తాడు. పెళ్ళయిపోయాక ఆ గాజుల్ని చూసిన బర్కత్, సుల్తాన్ మీద మండి పడతాడు. తీవ్రాలోచనలో పడతాడు. తను పక్షిని పంజరంలో బంధించానా అనుకుంటాడు.

జూదంలో అయిన అప్పులకి రజాక్‌కి ఆస్తి పోయే పరిస్థతి వస్తుంది. బర్కత్‌తో పెళ్లితో అసహనంగా వున్న సారా, అతడి మీద విరుచుకుపడ్డం మొదలెడుతుంది. అన్నకి ఆర్థిక సయం చేయొచ్చుగా అని సాధిస్తూంటుంది. ఆమెని చూస్తూంటే పంజరంలో పక్షిలా కన్పించి పిచ్చెక్కుతూంటుంది. చెప్పా పెట్టకుండా శ్రీనగర్ వెళ్లి పోతాడు. సిగరెట్లు, మందు, పేకాటలతో దేవదాసు అయిపోతాడు.

భర్త కన్పించకపోవడంతో సారా సుల్తాన్‌ని ఆశ్రయిస్తుంది. అతను శ్రీనగర్ వెళ్లి వెతికి పట్టుకొస్తాడు. మరణం అంచున వున్న బర్కత్, ఇక ‘పంజరంలో పక్షి’ని విడుదల చేసి చనిపోతాడు. ఇక సుల్తాన్ సారాలు పొలంలో పంట కోస్తూండగా సూర్యోదయంతో ముగింపు.

గంటా 38 నిమిషాల ఈ మొదటి కశ్మీరీ సినిమా అటుఇటు మార్చిన హిందీ సినిమా కథనే కాశ్మీరీ సంస్కృతిని భాగం చేసి వైవిధ్యం తీసుకొచ్చారు. హిందీ సినిమాలు జాతీయ సంస్కృతితో వుంటాయి. ప్రాంతీయ సినిమాలు తమ అక్కడి స్థానిక సంస్కృతిని చాటాలని చూస్తాయి. అయితే నాటి ఈ కాశ్మీరీ మూవీలో – మన తెలంగాణా సినిమాల్లో చేస్తున్నట్టు – దొరికింది కదా అవకాశమని ఎడాపెడా సాంస్కృతిక ప్రదర్శన చేసి ‘తుత్తి’ తీర్చుకోలేదు. దర్శకుడు చాలా సంయమనం పాటించాడు. పాటలు అక్కడి జానపద గేయాలే. వేరే అక్కడి ఆచార వ్యవహరాలూ, పండుగ పబ్బాల జోలికి పోలేదు. సంస్కృతిని రెండు కీలక సన్నివేశాలకి జోడించి, ప్రకృతి పరంగా మాత్రమే  చెప్పాడు. సారా పెళ్లి ఎప్పుడు చేద్దామంటే హురూద్ వెళ్ళిపోయాక చేద్దామంటాడు తండ్రి కాకా. హురూద్ అంటే శరదృతువు – ఆకురాలు కాలం. రుతువుల్ని అనుసరించే అక్కడ శుభకార్యాలుంటాయి. పెళ్లి సమయంలో పక్షుల కూతలు, చిగురులు వేస్తున్న చెట్లు చేమలూ…

అలాగే సారా భర్త కనపడకుండా పోయిన విషాద సందర్భానికొచ్చేసరికి మళ్ళీ ఆకురాలు కాలం వచ్చేస్తుంది. విలపిస్తున్న ఆమెని ఎండుటాకులు కమ్మేస్తాయి. విషాదగీతం రుతువుల్ని వర్ణిస్తూ వుంటుంది. తను ఎప్పుడూ దర్శించే పీర్ దర్గా కెళ్ళి నల్ల దారం లాగి, పీర్ల పెద్ద ముస్తాఫాని వేడుకుంటుంది. ఇంతవరకే సాంస్కృతిక ప్రదర్శన.

ఈ నాల్గు ముఖ్య పాత్రల్లో నల్గురూ చక్కగా, సహజంగా నటించారు. ఒక రొటీన్ కథనే భర్తని దేవదాసుగా మార్చి నూతన కల్పన చేయడంతో ఇప్పటికీ ఇది పాపులర్ కశ్మీరీ సినిమాగా అలరారుతోంది. అప్పట్లో రాష్ట్రపతి రజతపతకం పొందిన ఈ తొలి కాశ్మీరీ మూవీకి జి.టి సంతోష్ గీత రచయిత, మోహన్ లాల్ ఐమా సంగీతకర్త, ఎస్.ఎస్. చడ్డా ఛాయాగ్రాహకుడు; మోహన్ లాల్ ఐమా, నిర్మల, రాజ్ బేగం నేపథ్య గాయనీ గాయకులు, ఎం.ఆర్ సేథ్ నిర్మాత. దర్శకుడు జగీ రాంపాల్ అత్యంత నిగ్రహంతో తొలి కశ్మీరీ సినిమాకి నీటైన శాశ్వతతత్వాన్ని కల్పించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here