ప్రాంతీయ దర్శనం -33: సంస్కృతం – నేడు

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా సంస్కృత సినిమా ‘ఇష్టిః’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ఇష్టిః’

[dropcap]సం[/dropcap]స్కృతం సినిమాలు తొలి రెండు (ఆది శంకరాచార్య, భగవద్గీత) ఆధ్యాత్మికంగానూ, మూడోది (ప్రియమానసం – కవి ఉన్నై వరియార్) జీవిత చరిత్రగానూ నిర్మించాక, నాల్గోది ‘ఇష్టిః’ అనే తొలి సామాజికంగా నిర్మించారు. 2016 లో జి. ప్రభ అనే దర్శకుడు కేరళ నుంచి దీన్ని అందించాడు. ఈయన సంస్కృత ప్రొఫెసర్. గతంలో ‘అతిరథ్రం’ అనే డాక్యుమెంటరీ, ‘అక్కితం’ అని కవి అక్కితం అచ్యుతన్ నంబూద్రి జీవిత చరిత్రా నిర్మించాడు.

ప్రభ తీసిన ‘ఇష్టిః’ కేరళలో ఒక  సామాజిక వర్గపు దుస్సాంప్రదాయాన్ని చిత్రిస్తుంది. ఒకప్పుడు నంబూద్రి బ్రాహ్మణులు పాటించిన ఫ్యూడల్, పితృస్వామ్య అమానవీయ ఆచారాల్ని దృష్టికి తీస్తుంది. ఈ ఆచారాలకి వ్యతిరేకంగా 1930లలో వి.టి. భట్టాద్రిపాద్ చేపట్టిన సంస్కరణోద్యమం ప్రభ ‘ఇష్టిః’ తీయడానికి స్ఫూర్తి. ఇంటా బయటా స్త్రీల అణిచివేత, సొంత సోదరుల పట్ల నిరంకుశత్వం, వైదిక కర్మల పేరు చెప్పుకుని ఇంటాబయటా మానవ సంబంధాలని కూడా వదులుకునే దుర్నీతి… నంబూద్రిపాద్ సామాజిక వర్గాన్ని బదనాం చేసింది. విశేషమేమిటంటే, ఇదే నంబూద్రిపాద్ సామాజిక వర్గం నుంచి ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడిగా, 1957లో తొలి కేరళ ముఖ్యమంత్రి కావడం.1967 రెండో సారి ముఖ్యమంత్రి కావడం.

ఓ నంబూద్రి కుటుంబాన్ని తీసుకుని, 1940ల నాటి కాలాన్ని సూచిస్తూ కథ చేశాడు ప్రభ. ఇందులో 500 మలయాళ సినిమాల సుప్రసిద్ధ నటుడు నెడుముడి వేణు ప్రధాన పాత్ర పోషించాడు. రామవిక్రమన్ నంబూద్రిపాద్ ఆ పాత్ర పేరు. ఇతను కుటుంబ పెద్ద. ఓ తమ్ముడు, ఇద్దరు భార్యలు, కొడుకు, కూతురూ వుంటారు. ఆచారం ప్రకారం ఇంటి పెద్ద కొడుక్కే స్వకులంలో అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు, ఆస్తి హక్కు వుంటాయి. భార్యని బానిసగా చూసే హక్కు కూడా వుంటుంది. తమ్ముళ్ళకి స్వకులపు అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు, ఆస్తి హక్కూ వుండవు. బయట నాయర్ కులంలో, లేదా నిమ్న కులాల్లో  పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వుంటుంది. కుటుంబం గడవడానికి అన్నమీదే ఆధారపడాలి. అన్న దయతల్చి డబ్బులు విదిలిస్తే విదిలిస్తాడు, లేకపోతే లేదు. అంతేకాదు, తమ్ముళ్ళకి విద్యా హక్కు కూడా లేదు. నిరక్షరాస్యులుగానే వుండి పోవాలి. నంబూద్రి కుటుంబంలో తమ్ముళ్ళుగా పుట్టేకన్నా కుక్కై పుట్టడం మేలనుకుంటారు తమ్ముళ్ళు.

మతధర్మం పేరుతో ఫ్యూడల్, పితృస్వామ్య దురాచారాలు పాటించే కటువైన రామవిక్రమన్ నంబూద్రిపాద్, కేవలం తానొక్కడి మంచే కోరుకుంటూ ఆర్థికంగా అధోగతి పాలు కూడా అవుతూంటాడు. అతడికి తానొక్కడే సద్గతి పొందాలన్నఇచ్ఛ వుంటుంది. దీంతో అతిరథ్రం అనే యజ్ఞం నిర్వహిస్తూంటాడు. ఈ యజ్ఞం నిర్వహిస్తూ యజ్ఞ జ్యోతితో చితికి నిప్పంటిస్తే సద్గతి పొందుతానని నమ్ముతాడు. అయితే ఈ జ్యోతిని నిరంతరం మండిస్తూండాలి నెయ్యితో. దీనికి భారీగా వ్యయం అవుతూంటుంది. యజ్ఞంలో తమ్ముడ్ని, కొడుకునీ కూర్చోబెట్టుకుని వేదోచ్ఛారణ చేయిస్తూంటాడు. చదువురాని వాళ్ళకి మౌఖికంగా మంత్రాలు నేర్పాడు.

ఒక రోజు తమ్ముడు నారాయణన్ కొడుకు చనిపోతాడు. జబ్బుచేస్తే చికిత్సకి అన్న డబ్బులివ్వలేదు. వాడు కులం లేని నీ భార్యకి పుట్టాడని ఇవ్వడు. ఇది నీతిలేని ఆచారమని తమ్ముడు అన్నతో తెగతెంపులు చేసుకుంటాడు. అన్నకి ఇప్పుడు ఇంకో పెళ్లి అవసరం. తన మరణం వరకూ నిరంతర యజ్ఞానికయ్యే వ్యయం కోసం భారీ కట్నంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు డబ్బులు నిండుకున్నాయి. ఇంకా భారీ కట్నంతో ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి కూతురు శ్రీదేవి. తన రెండో భార్య కూతురు లక్ష్మి కన్నా చిన్నదే. పదిహేడేళ్లుంటాయి. మూడో భార్యగా శ్ర్రేదేవి రావడంతో రామవిక్రమన్‌కి ఇబ్బందులు మొదలవుతాయి.

ఈ ఆచారాలు చూసి ఖిన్నురాలవుతుంది విద్యావంతురాలైన శ్రీదేవి. ఇంట్లో వున్న ఇద్దరు బానిసలకి తోడు మూడో బానిసగా తనుండడానికి మనసొప్పదు. భర్తకున్న అంధ విశ్వాసాల్ని సున్నితంగా ఖండిస్తుంది. ఇంట్లో కొడుకు రామన్ సహా బయట పురుషులతో అతడి దుష్ప్రవర్తనని ప్రశ్నిస్తుంది. రామన్ తో స్నేహంగా వుంటుంది. రామన్ తనకంటే పదేళ్ళు పెద్దవాడు. విద్యలేని రామన్, లక్ష్మిల పరిస్థితికి జాలిపడి చదువు చెప్పడం ప్రారంభిస్తుంది. ఇది చూసి తోడి కోడళ్ళు కుళ్ళుకుంటారు. రామన్‌కీ, శ్రీదేవికీ మధ్య ఏదో వుందని అనుమానిస్తారు. ఇది భర్త విక్రమన్‌కి  తెలిసి మండిపోతాడు. తీవ్రారోపణ చేస్తూ శ్రీదేవికి రామన్‌తో సంబంధాన్ని అంటగడతాడు. రామన్‌ని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. పండితులతో పంచాయితీ పెట్టిస్తాడు. పండితులు శ్రీదేవి పాపం  చేసిందని నిర్థారిస్తారు. వాళ్లు తీర్పు చెప్పేలోగా – శ్రీదేవి ఇక సహించక, తిరగబడుతుంది, ‘జంధ్యం వేసుకుని వేదాలు చదివితే సరిపోదు. ముందు నువ్వు మనిషివి కా. అప్పుడే సత్యమంటే ఏంటో, ధర్మమంటే ఏంటో తెలుసుకోగలవు’ అని మంగళ సూత్రం తీసిచ్చేస్తుంది. కోడలి హోదాకి గుర్తుగా వున్న శాలువాని, గొడుగునీ ముళ్ళ పొదల్లోకి విసిరేస్తుంది. హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది… చిమ్మ చీకటిగా వున్న బయటి ప్రపంచంలోకి… ఆ చిన్న వయస్సులో…

ఐనప్పటికీ సత్శీలవతిగా. ఆమె అలా సాగిపోతూంటే ఇంట్లో వెలుగుతున్నయజ్ఞ జ్యోతి ఆరిపోతుంది.

        

శ్రీదేవిగా ఆథిరా పటేల్ నటించింది. సహజ సున్నిత నటనతో సన్నివేశాలకి వన్నె చేకూర్చింది. చివరి తిరుగుబాటు దృశ్యం సంక్లిష్టమైనది. అయినా చాలా చాకచక్యంగా తనకి సులభ సాధ్యం చేసేసుకుంది. ఇక 71 ఏళ్ల విక్రమన్ పాత్రలో నెడుముడి వేణు బలమైన ప్రతినాయక పాత్రలా వుంటాడు. 71 ఏళ్ల వయస్సులో 17 అమ్మాయిని పెళ్ళాడే మూర్ఖ శిఖామణిగా నటన చెప్పాల్సిన పనిలేదు.

ఐతే ఈ కథలో 71 -17 ల మధ్య ప్రశ్నలు తలెత్తుతాయి : అంత అభ్యుదయంగా వుండే 17 ఏళ్ల  శ్రీదేవి, 71 ఏళ్ల వృద్ధుడ్ని పెళ్లాడ్డ మేమిటి? 71 వృద్ధుడైన విక్రమన్, 17 ఏళ్ల భార్యని సుఖపెట్టలేక పంచాయితీ పెట్టి వదిలించుకుంటున్నాడేమో పండితులు ఎందుకాలోచించరు?  ఒకవేళ పండితులదీ మగ దురహంకారమే అయితే, సుఖపెట్టలేని మొగుడే ఈ ఆరోపణలతో వదిలించుకుంటున్నాడని, ఎందుకు శ్రీదేవి ఎదురు ఆరోపణతో పురుష స్వామ్యాన్నే కడిగేసి వెళ్లి పోకూడదు? తన శీలాన్ని దెప్పినప్పుడు, భర్త పుంసత్వాన్నీ దెబ్బ తీయవచ్చు. అయితే 1940లలో ఇంత ముందడుగు వేయలేదని దర్శకుడు భావించాడేమో…

దర్శకత్వం చాలా పకడ్బందీగా, కళాత్మకంగా వుంది. దీనికి కె. దామోదరన్ సంగీతం, ఎల్డో ఇసాక్ ఛాయాగ్రహణం బాగా తోడ్పడ్డాయి. కళాదర్శకత్వం మరొకెత్తు. బి. లెనిన్ ఎడిటింగ్ ఈ కళాత్మక కథా చిత్రానికి కొక శిల్పి పనితనం.

సంస్కృత భాష పునరుద్ధరణకి సినిమా ఒక మంచి మార్గమని చెప్పే ప్రభ, తన సృష్టి ‘ఇష్టిః’ (ఆత్మాన్వేషణ) ని జనసామాన్యంలోకి తీసికెళ్ళడం సాధ్యం కాలేదు. చలన చిత్రోత్సవాలకి పరిమితమైంది. నాల్గు జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నాల్గు అవార్డులు దక్కాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here