[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా హైదరాబాదీ ఉర్దూ సినిమా ‘పైసా పొట్టీ ప్రాబ్లం’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘పైసా పొట్టీ ప్రాబ్లం’
నాటి తొలి డెక్కన్ సినిమా ‘ది అంగ్రేజ్’ ఏ తీరు తెన్నులతో వుందో, నేటి చివరి సినిమా, మధ్యలో వచ్చిన మిగతా 12 సినిమాలు సహా అదే తీరుతెన్నులతో వుంది – ఇంచుమించు అవే కథలతో గల్లీ పాత్రల కామెడీ. ‘పైసా పొట్టి ప్రాబ్లం’ (పైసలు పిల్ల ప్రాబ్లం)లో ‘ది అంగ్రేజ్’ కల్ట్ మూవీ హీరో మస్త్ అలీయే నటించాడు. ఇప్పుడు వయసు మీదబడి గ్లామర్ తగ్గింది. డాలీ తోమర్ హీరోయిన్‌గా నటించింది. ఇతర పాత్రల్లో ఫిరోజ్ ఖాన్, రాజా సాగూ, రేష్మా ఠాకూర్, మనోరమా సింగ్ నటించారు. ఇక విలన్ గా ‘ది అంగ్రేజ్’ ఫేమ్ ధీర్ చరణ్ శ్రీవాస్తవ్ నటించాడు. డాక్టర్ సయ్యద్ లియాఖత్ అలీ, బంటీలు నిర్మాతలు. సయ్యద్ హుస్సేన్ దర్శకుడు.
ఇది ఓల్డ్ సిటీలో ముగ్గురు ఆవారా మిత్రుల కథ. సలీం (మస్త్ అలీ), ఫిరోజ్ (ఫిరోజ్ ఖాన్), అమీర్ (రాజా సాగూ) చేతిలో పైసల్లేక ‘పొట్టీ పటాయే, ఆంటీ ఘుమాయే… బట్ సలీం ఈజ్ ఏ గుడ్ బాయ్’ అని పాడుకుంటూ తిరుగుతూంటే, రోడ్డు మీద వజ్రాల మూట దొరుకుతుంది. ఆ వజ్రాల మూట నగరంలో కరుడుగట్టిన డాన్ చున్నూ భాయ్ (ధీర్ చరణ్ శ్రీవాస్తవ్)కి వెళ్ళాల్సింది. దాన్ని నొక్కేద్దామనుకుంటే ఈ సంగతి చున్నూ భాయ్‌కి తెలిసిపోతుంది. ముగ్గురూ చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతారు.
ముందుగా ఫిరోజ్‌కి 3 లక్షలు అవసరమేర్పడి సలీం ఒక లేడీ డాన్ (మనోరమా సింగ్) దగ్గరికి తీసుకుపోతాడు. లేడీ డాన్ ఇంట్లో మర్డర్ చేసి రక్తంతో తడిసిన చేతుల్ని కాళీ మాతా విగ్రహం దగ్గర కడుక్కుంటూ వుంటుంది. ఐదు నిముషాలు కడుక్కుంటే గానీ గోరింటాకులా పట్టుకున్న రక్తం వదలదు. గొంతు తెగిన శవం తన ముందు నుంచే పోతూంటే చెమట్లు పట్టేస్తాయి ఫిరోజ్‌కి. ఆమె అప్పు ఇస్తానన్నా తీసుకోకుండా ఉడాయిస్తాడు.
మస్త్ అలీ ‘ది అంగ్రేజ్’లో సలీం ఫేకూగా చేసిన పనులే చేస్తాడు. గప్పాలు కొడతాడు, కోతలు కోస్తాడు, జీవిత సత్యాలు చెప్తాడు: ‘బకెట్ జిత్నీభీ బడీ హో, నల్ కే నీచేహీ రేహ్తీ’ (బకెట్టు ఎంత పెద్దదైనా నల్లా కిందే వుంటుంది), ‘ఇడ్లీ ఈజ్ సాఫ్ట్, దోసా ఈజ్ వెరీ గుడ్, బట్ మాకీ… వొడోఁ కా తో జవాబ్ హీ నహీ (ఇడ్లీ సాఫ్ట్ గా వుంటుంది, దోసా వెరీ గుడ్ గా వుంటుంది. కానీ దీన్తల్లి… వడని మించింది లేదు)… లాంటి డైలాగులు.
ఫిరోజ్ డాలీ (డాలీ తోమర్) ని ప్రేమిస్తూంటాడు. తను ఎంబీఏ చేశాడు గానీ తనదగ్గర బైక్ లేదు, లాప్ టాప్ లేదు, ఇంకా చాలా లేవు. డాలీ ముందు తలకొట్టేసినట్టు వుంది. హెల్ప్ చేస్తానని సలీం వెంట తిప్పుకుంటూ మాయ చేస్తున్నాడు. దరిద్రం వదిలేలా వజ్రాల మూట దొరికింది. దీంతోనే పెద్ద శని పట్టుకుంది కరుడుగట్టిన డాన్ చున్నూ భాయ్ వల్ల- ఫిరోజ్ కీ, అమీర్ కీ, వీళ్ళని ఏడ్పిస్తున్న సలీంకీ.