[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా మరాఠీ సినిమా ‘యంటమ్’ని విశ్లేషిస్తున్నారు సికందర్. [/box]
యంటమ్
[dropcap]నే[/dropcap]టి మరాఠీ సినిమా పక్కా వ్యాపారమయమే. స్థానికంగానే తిష్టవేసిన బాలీవుడ్ హిందీ సినిమాల హంగామాని ఇక తట్టుకుని మరాఠీ ప్రేక్షకుల్ని కాపాడుకోవాలంటే, కమర్షియల్ బాట పట్టక తప్పని పరిస్థితేర్పడింది. దేశంలో అన్ని ప్రాంతీయ సినిమాలూ వాటి అర్థం మారిపోయి మూస కమర్షియల్స్‌గా అవతారమెత్తిన సంగతి తెలిసిందే. కొత్త తరం ప్రేక్షకుల అభిరుచికి ఇక ఎంత మాత్రమూ ప్రాంతీయ అస్తిత్వాల సామాజిక సినిమాల గొడవ కుదరదని ఈ కమర్షియలవతారం. ఇదే కొత్త ముఖచిత్రం మరాఠీ సినిమాలదీ. గత పదేళ్లుగా విడులవుతున్న మరాఠీ సినిమాల జాబితాలో రోమాన్స్, కామెడీ, ఫ్యామిలీ, థ్రిల్లర్స్ తప్ప ఎక్కడో గానీ, ఒక వాస్తవిక సినిమా వాసన సోకదు. ఈ సంవత్సరమే సెప్టెంబర్ వరకూ 20 సినిమాలు విడుదలైతే, వాటిలో 3 రోమాన్సులు, 5 కామెడీలు, 6 ఫ్యామిలీలు, 1 థ్రిల్లర్, దయతల్చి ఒక చారిత్రకం, ఇంకాస్త దయతల్చి ఒక క్రీడా చిత్రమూ వున్నాయి. టైటిల్స్ కూడా కుప్పి గంతులేస్తున్నాయి. మస్కా, ఐటెం గర్ల్, ఎఫ్ యూ – ఫ్రెండ్‌షిప్ అన్‌లిమిటెడ్, సారీ, బాయ్స్, ఒన్స్ మోర్, బ్రేవ్ హార్ట్, బకెట్ లిస్ట్, ఫాస్టర్ ఫెన్స్… ఇలా తెలుగు కమర్షియల్ సినిమాలకి కూడా పెట్టేందుకు వెనుకాడే ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేస్తున్నారు.
చాలా వెనుకబడిన మహారాష్ట్ర గ్రామమది. శుభకార్యాలకి సన్నాయి వాయించే కుటుంబం రంగా అనే కాలేజీ విద్యార్థిది. అతడికి సన్నాయి కళాకారుడైన తండ్రి రావ్ సాహెబ్, తల్లీ చెల్లెలూ వుంటారు. రావ్ సాహెబ్ కాలంలో వచ్చిన మార్పులతో వృత్తి ప్రమాదంలో పడి ఆందోళనతో వుంటాడు. వివాహాల్లో సన్నాయి వాయించడానికి ఎవరూ పిలవడం లేదు. డీజే మ్యూజిక్‌ని ఆర్డర్ చేస్తున్నారు. కొడుకు రంగా కూడా డీజే మ్యూజిక్ అంటే పడి చస్తున్నాడు. ఈ వృత్తి తనతోనే ఆగిపోకూడదన్న పట్టుదలతో వుంటాడు రావ్ సాహెబ్. అయినా ఈ వృత్తి మీద ఆసక్తి వుండదు కొడుక్కి. డీజే మ్యూజిక్ మత్తులోనే వూగుతూ, సన్నాయి శబ్దమంటేనే అసహ్యంతో వుంటాడు.
ప్రేమల్లో అంతస్తుల తారతమ్యాల్లో రొటీన్‌గా పెద్దల్ని అడ్డుపెట్టకుండా, విధిని ప్రవేశ పెట్టాడు దర్శకుడు. అయితే ఎకాకీన విధి వక్రించి ఏదో జరిగిపోవడం అంత మంచి కథనం అన్పించుకోదు. దానికో మెకానిజం వుంటుంది. కె. బాలచందర్ కూడా ‘మరో చరిత్ర’లో విధిని ప్రయోగించి విషాదాంతం చేశారు. అయితే దానికో కథనం చేశారు. ఒప్పించేట్టు కార్యకారణ సంబంధం చూపించారు. కమల్ హాసన్, సరితలు పెద్దలు పెట్టిన ఏడాది ఎడబాటు షరతుని దిగ్విజయంగా పూర్తి చేసుకుని కలుసుకోబోతున్న చివరి ఘట్టంలో ఇద్దరు దుష్టులు వాళ్ళని చంపేస్తారు. ఈ దుష్టులు విధి రూపంలో ఎక్కడ్నుంచి వచ్చి పడ్డారు? కమల్, సరితల స్వయంకృతాలే దుష్టుల్ని ప్రత్యక్షం చేశాయి. కమల్ తనని ప్రేమించిన మాధవిని కాదని వెళ్లి పోయినందుకు ఆమె అన్న పెంచుకున్న పగ ఓ పక్క, ఓ రోమియోని కొట్టి అవమానపర్చిందుకు సరిత మీద ఆ రోమియో పెంచుకున్న కక్ష ఇంకో పక్క పక్వానికొచ్చి, ఇద్దరి మీదా దాడికి పురిగొల్పాయి. విధి కారణం లేకుండా దేవుడు మీద పడేసే పిడుగుపాటు కాదు. చేసుకున్న కర్మలే విధి. దేవుడికేం సంబంధం లేదు. బాలచందర్ విధి మెకానిజాన్ని ఇలా విడమర్చి చెప్పారు, మరాఠీ దర్శకుడు చెప్పలేదు. కథ వెంటాడాలంటే ప్రశ్నలు మిగల్చాలి. కమల్ మాధవి ప్రేమని తిరస్కరించి వుండకపోతే… ? సరిత రోమియోని కొట్టి వుండక పోతే…? ఇవీ కథకి ఓ అర్థాన్నివ్వడంతో బాటు, పాత్రల మీద జాలిని పెంచి జ్ఞాపకముండేలా చేస్తాయి.
మరాఠీలో వస్తున్న మసాలా సినిమాల వెల్లువలో చాలా కొన్ని కాస్త చూడదగ్గ సినిమాలు వస్తున్నాయి. అయితే ప్రేమలకి గ్రామీణ నేపధ్యం అనే ఫార్ములా అనేది కూడా ఒక మూసే. అందులోనూ ‘సియారట్’ ప్రభావమొకటి వుంది. ‘సియారట్’ నే వివిధ రూపాల్లో చూపిస్తున్నారు.