Site icon Sanchika

ప్రాంతీయ దర్శనం -5 : తుళు సినిమా – నాడు

[box type=’note’ fontsize=’16’]  ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా తుళు సినిమా ‘శుద్ధ’ని విశ్లేషిస్తున్నారు సికందర్. [/box]

‘శుద్ధ’

[dropcap]క[/dropcap]ర్నాటకలో తుళువులుండే దక్షిణ కర్నాటక, ఉడిపి జిల్లాలు రెండిటి ప్రత్యేకత అక్కడ ఉప ప్రాంతీయంగా  తుళు భాషలో సినిమాలు నిర్మిస్తున్న తుళూవుడ్ వుండడమే. తుళూవుడ్ 2005లో ఒక అద్భుతం సాధించింది. అప్పట్లోనే డిజిటల్‌లో సినిమా నిర్మించేసింది. అది డజనుకి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది. దీని కథా కాలం 1970ల నాటిది. అప్పట్లో భూస్వామ్య వ్యవస్థ అంతరిస్తున్న సంధికాలంలో ఒక ఫ్యూడల్ కుటుంబం పడే అస్తిత్వ బాధని చిత్రించింది.  2005లో ‘శుద్ధ’ అనే టైటిల్‌తో నిర్మించిన ఈ 105 నిమిషాల అత్యంత లో- బడ్జెట్ సినిమా, గొప్ప సాంకేతిక ప్రతిభని కూడా చాటుకుంది.

పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ విద్యార్ధి అయిన పిఎన్ రామచంద్ర డజన్ల కొద్దీ డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్ములు తీసి, మూడే పూర్తి స్థాయి కథా చిత్రాలు తీశాడు. వాటిలో ఒకటి ‘శుద్ధ’. తుళు సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన ‘బొజ్జ’ అనే నాటకం ఆధారంగా దీన్ని నిర్మించాడు. ఈ నాటక రచయిత నారాయణ నందలికే. బొజ్జ అనేది తుళు ప్రాంతంలో అంతిమ సంస్కారాల ఆచారం. కుటుంబంలో మరణం సంభవించిన 13 వ లేదా 16 వ రోజున దీనిని నిర్వహిస్తారు. ఈ ఆచారం ప్రకారం తుళునాడు మూల వాసులైన కొరగా అనే వాళ్ళు డప్పులు వాయిస్తారు. బ్రాహ్మణుడు తిల హోమం అనే పూజ పూర్తి చేసిన తర్వాత కుటుంబ సభ్యులు గంజి సేవిస్తారు.

ఈ ప్రాంతంలో 1960 – 70 ల వరకూ భూస్వాముల కుటుంబాల్లో కొనసాగిన ఈ ఆచారం ఆ తర్వాత సమస్యల్లో పడింది. కారణం జాగీర్దారీ వ్యవస్థ రద్దు కావడమే. భూ గరిష్ట పరిమితి చట్టం అమల్లోకి రావడమే. దీంతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా బీటలు వారింది. కుటుంబ సభ్యులు ఎవరి భుక్తిని వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. తాతలు తండ్రులు మిగిలారు. అంతే కాదు భూస్వాములు బలహీన పడడంతో వారి మాట వినే కింది కులాలవారు జాగృతమయ్యారు. కుల వృత్తులు వదిలేసి పట్టణ ప్రాంతాల్లో ఇతర జీవనోపాధులు వెతుక్కున్నారు. దీంతో బలహీనపడి దీనావస్థలో వున్న  భూస్వాముల కుటుంబాల్లో శుభకార్యాలకి పనులు చేసి పెట్టే మనుషులే కరువయ్యారు.

అయితే ‘శుద్ధ’ కథలో దీనికింకో సమస్య తోడవుతుంది. ఈ బొజ్జ పేర దినం జరపడం కూడా తలకు మించిన భారం అయిపోవడం. విడిపోయిన కుటుంబ సభ్యులు వాటాలేసుకుని జరిపించడానికి ఇష్టపడకపోవడం…

ఆ గ్రామంలో భూస్వాముల కుటుంబంలో తల్లి చనిపోతుంది. మూడు తరాల తాతా తండ్రీ మనవళ్ళూ అంతిమ సంస్కారాలు పూర్తి చేశాక, భోజనాలు పెట్టాల్సి వస్తుంది. చనిపోయిన తల్లి చుట్టు పక్కల ప్రముఖురాలు కావడంతో ఈ విందుకు ఎంత లేదన్నా వెయ్యి మంది వస్తారు. అంత మందికి భోజనం పెట్టే తాహతు ఇప్పుడు లేదు, ఎలా?

దీంతో కుటుంబ సభ్యుల్లో లుకలుకలు బయటపడతాయి. తలావొక చేయి వేయడానికి మీనా మేషాలు లేక్కిస్తూంటాడు. చిన్నకొడుకు ముంబయినుంచి భార్యతో అయిష్టంగానే వచ్చాడు. భార్య చనిపోయిన పెద్ద కొడుకు బాధ్యతంతా తన మీద పడేసరికి కోపంతో వుంటాడు. వూళ్ళో ఒక నిమ్న కులస్థురాలితో అతను  పెట్టుకున్న సంబంధం కుటుంబానికి అవమానకరంగా వుంటుంది. దీన్ని జీర్ణించుకోలేని అతడి కొడుకు ఆమె ఇంటికి నిప్పంటించేస్తాడు. కుటంబ పెద్దగా వున్న తాత, కార్యం కోసం దాచుకున్ననగలూ  డబ్బూ ఇక తీయక తప్పదు. దీనికి తోడూ విధవరాలైన కూతురితో, కాలేజీకి వెళ్తున్న మనవరాలితో ఇంకా వేరే సమస్యలుంటాయి. ఇలావుండగా, ఈ కథ ముగింపులో ఈ తాత మరణం ఇంకో శరాఘాతంలా తుగులుతుంది కుటుంబానికి.

పెత్తనం చెలాయించిన సామాజిక, రాజకీయ వ్యవస్థలే వ్యతిరేకమయ్యే కాలం వస్తే ఫ్యూడల్ కుటుంబాల పరిస్థితి ఎలా వుంటుందో చిత్రించిన ఈ వాస్తవిక కథా చిత్రంలో నటీనటులందరూ నటన తెలియని కొత్తవారే. దర్శకుడు వాళ్ళ పరిమితుల్లో ప్రభావశీలంగా నటింపజేసుకున్నాడు. ప్రధాన పాత్ర తండ్రిగా సుభాష్ పడివాల్ నటించాడు. మిగిలిన పాత్రల్లో శారదా దేవి, భారతీ జైన్, బొజ్జా శెట్టి, మోహన్ దాస్ తదితరులు నటించారు.

సాంకేతికంగా ఈ ప్రథమ తుళు డిజిటల్ సినిమా ప్రత్యేకత ఏమిటంటే దీనికి సంగీతం లేదు. నేపధ్య సంగీతంగానీ, పాటలు గానీ లేవు. సన్నివేశ పరంగా శబ్దాలు మాత్రం వుంటాయి. కొన్ని సన్నివేశాలని బట్టి శబ్దాలు కూడా లేని నిశ్శబ్దం తాండవిస్తుంది. నిజంగా మన కెదురుగా సంఘటనలు జరుగుతున్న వాస్తవిక ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడూ ఛాయాగ్రాహకుడు సమీర్ మహాజన్ వాడిన వెలుగు నీడలు దృశ్యాల్ని అద్భుత స్థాయికి తీసికెళ్తాయి. ప్రధానస్రవంతి సినిమాల్లోని సాంకేతిక హంగులు ప్రేక్షకులకి విషయం మీద ఏకాగ్రతని దెబ్బతీస్తాయనీ, విషయం వదిలేసి అ సాంకేతిక హంగులని అనుభవించేలా చేస్తాయనీ,  అందుకని వాటిన్నిటినీ త్యజించి, నిజ జీవితంలో ఈ హంగులు లేని వాతావరణ మెలా వుంటుందో దాన్ని తెర మీద అవిష్కరించామనీ అంటాడు దర్శకుడు రామచంద్ర.

తుళునాడులో రెండు థియేటర్లలో దీన్ని విడుదల చేశారు. అత్యంత స్వల్ప బడ్జెట్ లక్షన్నర రూపాయలతో నిర్మించిన దీనికి పెట్టుబడిని రాబట్టుకోవడం కష్టం కాలేదు. పెట్టుబడి మీద లాభాలతో బాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పన్నెండు అవార్డులు కూడా వచ్చాయి.

Exit mobile version