ప్రాంతీయ దర్శనం -7: అస్సాం సినిమా – నాడు

1
3

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా అస్సాం సినిమా ‘ఫిరింగొటి’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

ఫిరింగొటి

అస్సాం సినిమా అంటే ఒకప్పుడు వాస్తవిక సినిమా. 1990ల వరకు కూడా వాస్తవిక సినిమాలే అస్సాంలో రాజ్యమేలాయి. తర్వాత వ్యాపార సినిమాలు మొదలైనా వాస్తవిక సినిమాలు నిర్మిస్తూనే వున్నారు. వాస్తవిక సినిమా రధసారధులైన భబేంద్ర నాథ్ సైకియా, జాహ్నూ బారువాలు విభిన్న కోణాల్లో అస్సామీ జీవితాలని పట్టుకుని దృశ్యమానం చేశారు. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలందుకున్నారు. జాహ్నూ బారువా 1982 – 2018 మధ్య 16 వాస్తవిక సినిమాలు తీస్తే, 22 సార్లు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. 2005 లో ‘మైనే గాంధీకో నహీ మారా’ అనే హిందీ తీసి ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇంటర్నేషనల్ ఫిప్ రిస్కీ అవార్డునందుకున్నాడు. బారువాది సున్నిత శైలి. సున్నిత శైలిలో సీరియస్ సమస్యలు ప్రేక్షకుల ముందుంచుతాడు.

1992లో ఆయన తీసిన ఫిరంగొటి (రవ్వ) గ్రామాల్లో బాలల విద్యని ప్రభుత్వం పూర్తిగా అలక్ష్యం చేస్తే బాలల, వాళ్ల తల్లిదండ్రుల మానసిక చైతన్యమెలా వుంటుందో సున్నితంగా చిత్రించాడు.

ఈ పరిస్థితికి కథాకాలం చైనా యుద్ధ పరిస్థితులు నెలకొన్న1962. స్వాతంత్ర్యం లభించిన కొత్తల్లో, 1950లో ఆ కుగ్రామంలో ప్రభుత్వ స్కూలు కాలిపోతే 1962 వరకూ ప్రభుత్వాలకి పట్టని దైన్యం ఇందులో కన్పిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లోనే వున్న ఈ పరిస్థితి ఇప్పుడూ కొనసాగుతోంది. అంతేగానీ ఒకప్పుడు బావుండి ఇప్పుడు చెడిపోయిందేమీ లేదు. ఎలా వున్న పరిస్థితి అలా యధాతధంగా చూడముచ్చటగా వుంది.  ఇంకా అక్షరాశ్యత కోసం అపసోపాలే పడుతున్నాయి ప్రభుత్వాలు.

అస్సాంలో అదొక మారుమూల కరోంగా అనే గ్రామం. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా వుండదు. 12 కిలో మీటర్లు నడిచే వెళ్ళాలి. అక్కడికి కొంత దూరంలో రైలు ప్రయాణం చేసి వస్తుంది రీతూ. కరోంగాలో ఆమెకి టీచరుద్యోగం వచ్చింది. ఆ స్టేషన్ లో దిగి రిక్షా ఎక్కితే, కొంత దూరం తీసి కెళ్ళి పురానీ పామ్ అనే వూరి పోలిమేరలో దింపేసి ఇక దారి లేదంటాడు రిక్షా వాడు. అక్కడ్నించీ 12 కిలో మీటర్లు నడిచి వెళ్ళాలంటే చీకటి పడిపోతుంది. అందుకని రాత్రికి ఇక్కడే వూరి పెద్ద ఇంట్లో వుండి వెళ్ళమంటాడు.

వూరి పెద్ద ఇంటికెళ్తే కరోంగాలో స్కూలు లేదే అని ప్రశ్నార్ధకంగా మొహం పెడతాడు. ఆ రాత్రి అక్కడుండి తెల్లారి నడుచుకుంటూ బయల్దేరుతుంది. కరోంగా చేరుకుని అక్కడి వూరి పెద్దని కలుస్తుంది. అతను కూడా ఇక్కడ స్కూలు లేదే అని తికమక పడతాడు. ఇక్కడి స్కూల్లోనే జాయినవమని ఆర్డర్ వచ్చిందని అంటుంది. అతను తీసికెళ్ళి ఓ ఖాళీ ప్రదేశం చూపిస్తాడు. ఇక్కడే పన్నెండేళ్ళ క్రితం ఓ స్కూలుండేదనీ, అది కాలిపోయిందనీ, మళ్ళీ ప్రభుత్వం కట్టలేదనీ వివరిస్తాడు. అప్పట్నించీ ఇక్కడ పిల్లలెవరూ చదువుకోలేదనీ అంటాడు.

రీతూ ఇంటింటికీ వెళ్లి అడుగుతుంది పిల్లల్ని బడికి పంపమని. ఎవ్వరూ ముందుకు రారు. ఒక తండ్రి కొడుకుని బడికి పంపితే వాడు తనకంటే తెలివైన వాడై పోతాడని అడ్డుకుంటాడు. ఇంకో ఇంట్లో తండ్రికి ఇష్టమున్నా తల్లికి వుండదు. బయటికి పంపిస్తే ఏమైపోతాడోనని భయం. ఇలా రకరకాలుగా అభ్యంతరాలు చెప్తూంటారు. ఎలాగో చదువు విలువ గురించి అందర్నీ ఒప్పించి, చెట్టు కింద చదువు చెప్పడం మొదలెడుతుంది.

ఊరందరి సాయంతో వెదురు బొంగులతో స్కూలు కడుతుంది. దాలిమి అనే ఇరవై ఏళ్ల అమ్మాయికి చదువుకోవాలని వుంటుంది. ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటారు. రీతూ ఆమెని  స్కూల్లో ఉద్యోగం పేరుతో పెట్టుకుని చదువు నేర్పిస్తూ తన దగ్గరే వుంచుకుంటుంది. అప్పుడు దాలిమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న చంద్ర అనే రౌడీ వచ్చేస్తాడు. దీంతో రీతూకి సమస్యలు మొదలవుతాయి. దాలిమితో  తన పెళ్ళికి రీతూ అడ్డు పడుతోందన్న కక్షతో అతను స్కూలు తగుల బెట్టేస్తాడు.

ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వమే చేయాలి. పౌరులు చేస్తే ఆ పౌరులకే గిట్టదనే భావం ఇక్కడ కలిగిస్తాడు దర్శకుడు. క్లయిమాక్స్ దృశ్యాల్లో సరిహద్దులో చైనాతో యుద్ద వార్తలు వస్తాయి. చైనీయులు చొచ్చుకొచ్చి తమని తరిమేస్తారన్న భయంతో వుంటుంది రీతూ. కానీ చంద్రతో వస్తున్న ప్రమాదం వూహించదు. మరో వైపు ప్రభుత్వాధికారిని చంపి తీవ్రవాదుల్లో చేరిపోయిన దాలిమి అన్న ఈ క్లైమాక్స్‌తో తిరిగి వచ్చేస్తాడు. రీతూతో వాదన పెట్టుకుంటాడు. మేమెందుకు అజ్ఞాతంలో వుండాలి, ఐడెంటిటీ పోగొట్టుకోకుండా ప్రజల మధ్య జీవించే  హక్కులేదా అని ప్రశ్నిస్తాడు. తీవ్రవాద ఐడెంటిటీతో సమాజంలో వుంటే ఏంటి ప్రభుత్వానికి అభ్యంతరమంటాడు.

రీతూని ప్రేమిస్తున్న నవలా రచయిత వుంటాడు. రీతూ కూడా ఇందుకు సుముఖంగానే వుంటుంది. సినిమా ప్రారంభంలో టైటిల్స్ వస్తున్నప్పుడు సాగిపోతున్న రైలు దృశ్యాలు వస్తూంటాయి. ఆ రైల్లో ఉద్యోగంలో చేరడానికి వస్తున్న రీతూ ప్రయాణిస్తూ వుంటుంది. అప్పుడామె జ్ఞాపకాలు కొన్ని కట్ షాట్స్‌గా పడతాయి. చిన్నప్పుడు స్కూలు కెళ్ళే షాట్,  తల్లి చనిపోయే షాట్, పెద్దయి పెళ్లి చేసుకునే షాట్, ఆ భర్త చనిపోయే షాట్ – ఇలా నాల్గే నాల్గు షాట్స్‌తో ఆమె గతం చెప్పేస్తాడు దర్శకుడు. మామూలుగానైతే కథ మధ్యలో పావుగంట ఫ్లాష్ బ్యాక్ వేసి నస పెడతారు. ఇందుకు భిన్నంగా దర్శకుడి ఆలోచన బావుంది. కాబట్టి విడో అయిన ఆమె నవలా రచయితకి ఆకర్షితురాలవుతుంది.

ఐతే కథని సున్నిత శైలిలో చెప్పే దర్శకుడి తరహా వల్ల, కథ లోతుపాతుల్లోకి వెళ్ళక పైపైన – అదీ ఫార్ములా అంశాలు కలిపి చెప్పేసినట్టుంటుంది. రీతూ ఆశయానికి దాలిమి పాత్ర, ఆమె పెళ్లి విషయంగా దాని తాలూకు విలనీ కమర్షియల్ ఫార్ములా చిత్రణల్లాగే వుంటాయి. స్కూలు కట్టకపోవడం రాజకీయమే, అప్పుడు రీతూకి ఆ రాజకీయమే సమస్యయితే – వ్యవస్థ మీద రీతూ తిరుగుబాటుగా, కామెంట్‌గా ఈ వాస్తవిక సినిమా వుండేది. అలాగే క్లయిమాక్స్‌లో కథాంశానికి దూరంగా తీవ్రవాదంపై చర్చ అడ్డుపడేదే.

కామెడీ కోసం విడిగా ఒక ట్రాకు కూడా పెట్టారు కమర్షియల్ పద్ధతిలోనే. అతను సైన్యంలో పనిచేసి వచ్చిన కోతల రాయుడు. ఈ పాత్రని చూస్తూంటే, చింగిజ్ ఐత్మతోవ్ రాసిన ‘జమిల్యా’ అనే రష్యన్ నవల్లో కోతల రాయుడు సతీం కూల్ గుర్తుకొస్తాడు.

కథని సున్నితంగా పైపైన స్పృశించే ధోరణి వల్ల ఇంకో అంశం కూడా మిస్సయింది. కథలో ఇప్పుడున్న ఐదారేళ్ళ  చదువులేని చిన్నపిల్లల్ని చూపించారు గానీ, ఆ పన్నెండేళ్ళుగా చదువు సంధ్యల్లేని పిల్లలెలా వున్నారు, ఎక్కడున్నారు చూపించలేదు.

రీతూగా మలోయా గోస్వామి నటించింది. ఆమె నటనకి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. సినిమాకి ద్వితీయ ఉత్తమ ప్రాంతీయ చలన చిత్రం అవార్డు వచ్చింది. సంగీతం సత్యా బారువా నిర్వహించాడు. ఛాయాగ్రహణం అనూప్ జోత్వానీ. ఎక్కువగా ఔట్ డోర్ లో అటవీ ప్రాంతంలోనే షూటింగ్ చేశారు.

1962లో స్థాపించిన ఈ కథని 1992లో సినిమాగా తీయడం ద్వారా రచయిత – దర్శకుడు జాహ్నూ బారువా ఒక డాక్యుమెంట్‌ని మాత్రం రికార్డు చేశాడు. గ్రామాల్లో విద్యతో ఇప్పటి పరిస్థితిని చూస్తే, 1962లో వున్న పరిస్థితే ఇప్పుడూ కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here